అడుక్కుంటే వేసేది బిచ్చం!
కొట్లాడితే వచ్చేది వాటా!
సాగర మధనంచేసి అమృతం పంచుకుందామని రాక్షసులను దేవతలు పిలిచారు. ఆ మాటలు నమ్మిన రాక్షసులు సాగర మధనం చేసి అమృతం తెచ్చారు. కష్టమంతా వారిదే! తీరా అమృతం పంచుకునేసరికి దేవతలు మోసంచేసి వారికి అమృతం లేకుండా చేశారు. ఆస్తి పంపకాల దగ్గర మొదలైన యుద్ధం ఈనాటికీ సాగుతూనే ఉన్నది. ఆస్తి పంపకాల దగ్గరే మొదటినుంచీ మోసం జరుగుతున్నది.
మాయా జూదంలో ఓడిపోలేదుగాని ఎక్కడో ఏదో మోసం మాత్రం జరిగింది. దళితులు, ఆదివాసీలు అది కానలేకపోయారు. దాని ఫలితంగా వారు ఊరవతల, అడవుల్లో ఉండిపోయారు.
వాళ్ళను అలా పంపి, వారి ఆస్తిని స్వాధీనం చేసుకొని అనుభవిస్తూ ఉన్నారు అవతలి వాళ్ళు, బతకొచ్చిన వాళ్ళు మోసగాళ్ళు. పెట్టిన గడువు ఎపుడో పూర్తయిపోయింది. దొంగ లెక్కలు చెప్పి ఇంకా వారిని అక్కడే ఉంచుతున్నారు. 'తిరిగి వస్తాము, మా ఆస్తి మాకు ఇచ్చేయండి' అని కబురు పంపుతుంటే అసలు ఏమాత్రమూ లక్ష్యపెట్టటం లేదు. వాళ్ళు దానికోసం పోరాటం చేస్తే, అతి కష్టంమీద కొంత దగ్గరగా రానిచ్చారు. అయితే ఒక గీతగీసి దాని అవతలే ఉండాలన్నారు. 'మీరు బ్రతకటానికి మేం కొంత తిండి ఇస్తాములే, మాదగ్గరే పని చేసుకు బ్రతకండి' అని ఓ మెలికపెట్టారు.
పాండవులు కౌరవులకు సరిగ్గా ఇలానే జరిగింది. వనవాసం అయిపోయిన తర్వాత రాజ్యానికి తిరిగివచ్చి మా రాజ్యం మాకివ్వమంటే 'ఎక్కడిది మీ రాజ్యం?' అని ఎదురు ప్రశ్న వేశారు. ఎంతచెప్పినా మొండికేస్తుంటే కృష్ణున్ని రాయబారానికి పంపారు. 'మా రాజ్యం మాకు ఇస్తారా? లేక యుద్ధం జరుగుతుంది, దానికి సిద్ధపడతారా? అంటూ.
సరే, కృష్ణరాయబారం ఏమయిందో మీకందరకూ తెలుసు ! రాజ్యం ఇవ్వటానికి కౌరవులు ఒప్పుకోకపోతే కృష్ణుడు ఒక ప్రతిపాదన చేశాడు.
వాళ్ళరాజ్యం వారికి ఇవ్వకపోతే
''వాళ్ళు అయిదుగురున్నారు కదా, కనీసం అయిదు ఊళ్ళయినా ఇవ్వండి పోనీ'' అన్నాడు కృష్ణుడు. దానికీ ఒప్పుకోలేదు. ఆ తర్వాత కథా మీకు తెలుసు !
దేశానికి స్వతంత్రం వచ్చి ముప్ఫై ఏళ్ళయిపోయిన తర్వాత ఊరిబయట ఉన్నవారి ఒత్తిడి తట్టుకోలేక ''అరె, వాళ్ళు అక్కడే ఉన్నారు గదా, వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి! ఆ ప్రకారం ప్రస్తుతానికి ప్రతి ఏడూ వాళ్ళకు ఎంతోకొంత పంచుతూ ఉండండి, వాళ్ళ ఆస్తి సంగతి తర్వాత చూద్దాం'' అన్నారు పాలకులు. దాని పర్యవసానమే ఈ స్పెషల్ కాంపొనెంట్ ప్లాన్, ట్రైబల్ సబ్ ప్లాన్ !
అయిదుగురున్నారు కాబట్టి కనీసం అయిదు ఊళ్ళయినా ఇవ్వండి అని అడిగినట్టు, 'ఎస్.సి.లు 16.2 శాతం, ఎస్.టి.లు 6.6 శాతం ఉన్నారని, బడ్జెటులో ఆ శాతం మేరకు వాళ్ళకు ఆస్తిలో వాటా ఇస్తున్నట్టు చూపండి' అన్నారు పాలకులు. అలా వచ్చినవే ఈ ఎస్.సి.పి., టి.ఎస్.పి.లు!
దీనినిబట్టి ప్రతి వార్షిక బడ్జెటులో ఎస్.సి.లకు 16.2 శాతం, ఎస్.టి.లకు 6.6 శాతం కేటాయించాలి. వారి అభివృద్ధి కోసం పథకాలు వేసి వాటిపైన ఖర్చు పెట్టాలి. మొత్తం ఖర్చు మరుసటి సంవత్సరం బడ్జెటు వచ్చేనాటికి అయిపోవాలి. మిగలకూడదు, మిగల్చకూడదు, ఒక్కపైసా కూడా ఏ ఇతర అవసరాలకుగాని మళ్ళించ కూడదు. ఇదీ ఈ పథకాల స్వభావం.
అయితే దీనికి భిన్నంగా జరుగుతున్నదే రాజ్యపాలన. నిన్నటివరకూ బడ్జెటు కేటాయింపు జనాభా ప్రాతిపదికన జరగలేదు, జరిగిన తక్కువ శాతం కూడా పూర్తిగా ఖర్చుచేయలేదు. మిగిలిన మొత్తం వేరే వాటి మీద ఖర్చుపెట్టారు!
ఆస్తి, సంపద, డబ్బు లేకపోయినా వనరులు అందకపోయినా ఎవరూ బాగు పడలేరు. ఏ సమాజమూ అభివృద్ధికాలేదు. అవి వీరికి దొరకనివ్వటంలేదు కాబట్టే వీరు ఇంత అధ్వాన్నస్థితిలో ఉన్నారు. ఆనాడు పాండవులు అడిగినా అయిదు ఊళ్ళు ఇవ్వటానికి పాలకులు సిద్ధంగాలేరు. 'తప్పదు బంధు నాశనము' అంటూ పాండవులు యుద్ధానికి దిగారు. అంతే...రాజ్యం తెచ్చుకున్నారు. స్వతంత్రదేశ పాలకులు అది గ్రహించారు. ఇది కూడా ఇవ్వకపోతే యుద్ధానికి దిగుతారని తెలుసుకొని 'అయిదు ఊళ్ళు ఇస్తాములే తీసుకోండి' అన్నారు. ఇలా వచ్చినవే ఎస్.సి.పి; టి.ఎస్.సి.లు!
అడిగితే వేసేది బిచ్చంలాంటిది! వేసేవాళ్ళ ఇష్టం. పాచి అన్నం పెట్టినా బిచ్చగాడు ఏమీ చెయ్యలేడు. ముందుకుసాచిన మూకుడు లోకి నాలుగు మెతుకులు విదిలిస్తారు... ఏరుకోవలసిందే! బిచ్చగానికి వేరే మార్గం లేదు. తాను బిచ్చగాడు కాదని తెలుసుకొని కొట్లాటకు దిగాడనుకోండి, పరిస్థితి వేరే ఉంటుంది. తనకు రావలసిన వాటా వేరే వాళ్ళు అనుభవిస్తూంటే కొట్లాడవలసిందే గదా! కొట్లాడితే వచ్చేది వాటాయే, బిచ్చం కాదు, నాలుగు మెతుకులూ కాదు.
ఈ రోజు ఎస్.సి., ఎస్.టి.లు తేల్చుకోవలసింది ఇదే! మీరు బిచ్చమడుగుతారా? ఆస్తికోసం కొట్లాడతారా? బిచ్చమే అడుగుతూ ఉంటే మీ మూకుడులో నాలుగు మెతుకులు మాత్రమే రాలుతూ ఉంటాయి. యుద్ధానికి దిగారనుకోండి, మీ వాటా మీకు వస్తుంది అంతే...ఇక ఏ గొడవా ఉండదు! ఇదీ ఇపుడు ఎస్.సి.పి, టి.ఎస్.పి.ల విషయంలో జరగవలసినది! ఏంచేస్తారు? నిర్ణయించుకోండి!
ఎస్.సి.పి., టి.ఎస్.పి.ల వాటా కోసం ఇపుడు కొంత ఆందోళన జరుగుతున్నది. ప్రజా సంఘాల నుంచి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులవరకూ ఇది వెళ్ళింది. హైద్రాబాద్ నుంచి ఢిల్లీవరకూ వెళ్ళింది. విజ్ఞాపనలు, వినతి పత్రాలు, ఊరేగింపులు, చర్చలు, సదస్సులు, సభలు, ధర్నాలు, అరెస్టులు అన్నీ అయ్యాయి. ఈ విషయంలో చట్టం ఒకటి తేవాలంటూ కొన్ని సంఘాలు, వ్యక్తులు ప్రభుత్వంపై అటు ఢిల్లీలో ఇటు హైద్రాబాద్‌లో ఒత్తిడి తెస్తున్నారు. ఇంతచేస్తేనేగాని ప్రభుత్వాలు కదలలేదు. ఉప ముఖ్య మంత్రి అధ్యక్షతన కొందరు మంత్రులతో ఈ నిధుల అమలుకు ఒక ఉప సంఘాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది.
వీటి ఫలితంగా వార్షిక బడ్జెటులో కేటాయింపు కొంత పెరిగింది. ఇపుడు ఈ కేటాయింపును పూర్తిగా ఖర్చుపెట్టించాలి. ఆ ఖర్చుకూడా ఎస్.సి, ఎస్.టి. వారి అభివృద్ధి కోసమే జరగాలి. ఎట్టి పరిస్థితిలోనూ మళ్లింపు జరగకుండా చూసుకోవాలి. దీనికి ఏ స్థాయిలో ఆందోళన జరపాలో రాజకీయ పార్టీలు, సంఘాలు సంస్థలు ఆలోచించుకోవాలి.
ఈ పధకాల విషయం ప్రభుత్వానికి తెలియవనా ప్రజలు ఆందోళన చేయటం? కానేకాదు. తెలిసీ, ఈ తప్పుడు విధానాలకు వెళ్తున్నది. ప్రతి బడ్జెటును ఆమోదించే ప్లానింగ్ కమీషన్‌కు ఈ పథకాలలో జరుగుతున్న తప్పులు, నేరాలు, ఘోరాలు తెలియవనా సంఘాలు ఆవేదన చెందటం? కానేకాదు. తెలిసే ఇదంతా... 'మీరలా చేస్తూ ఉండండి, మేము ఇలా చెపుతూ ఉంటాము'' అని వారిద్దరూ ఒక అవగాహనకు వచ్చి ఉన్నారు. అందుకని వీరి గూడుపుఠాణీ, వీరి నాటకాలు బద్దలుగొట్టాలంటే ఎంత గట్టిగా ఆందోళన చెయ్యాలో ప్రజలు నిర్ణయించుకోవాలి. దానికి ఏదైనా సహాయ పడుతుందేమో అని ఈ పుస్తకం తీసుకురావటం!
ముందు విషయం తెలియాలి, ఆపైన లక్ష్యం గుర్తించాలి. దానిమీద కేంద్రీకరించాలి. దానిపైననే గురిపెట్టాలి, బాణం ఎక్కుపెట్టాలి, కొట్టాలి. ఫలితం చేతికందాలి. అలాచేస్తే అందుతుంది.
మొదట చేయవలసిన పని ఏదోముందు గుర్తించాలి. ఆ మార్గంలో వెళ్ళాలి. ఆ తర్వాత రెండోది, మూడోది, ఆ తర్వాత చివరిది! అందుకనే ముందుగా ఎస్.సి., ఎస్.టి.లకు రావలసిన వాటా తీసుకోండి. ఆ తర్వాత వాటాలు పంచే స్థానం తీసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో అవకాశాలు అందరికీ సమానంగా అందాలి. అది సమానత్వంలో భాగమే!
ఎస్సీ ఎస్టీ నిధులు ... విదిలింపు - మళ్ళింపు
- బొజ్జా తారకం
ధర : రూ. 40/-
మొదటి ముద్రణ : జూన్ 2012, రిపబ్లికన్ పబ్లికేషన్స్, హైదరాబాద్
:హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ముద్రణ : అక్టోబర్ 2013
హక్కులు : రచయితవి
ప్రతులకు, వివరాలకు:
:హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం. 85, బాలాజీనగర్,గుడిమల్కాపూర్, హైదరాబాద్ - 500 006.
ఫోన్ : 23521849
No comments:
Post a Comment