Tuesday, July 27, 2010

సావిత్రీబాయి ఫూలే జీవితం - ఉద్యమం - కె.పి.అశోక్‌ కుమార్‌


సావిత్రీబాయి ఫూలే జీవితం - ఉద్యమం

ఆధునిక భారతదేశంలో మొట్టమొదటగా బ్రాహ్మణీయ కులతత్వ సంస్కృతి, మత వ్యవస్థలపై యుద్ధం ప్రకటించిన వ్యక్తులు జ్యోతిరావు ఫూలే, ఆయన భార్య సావిత్రీబాయి. మహారాష్ట్రీయులైన ఈ దంపతులు మొదటిసారిగా సమగ్రమైన కుల వ్యతిరేక సిద్ధాంతానికి రూపకల్పన చేసి, ఆధిపత్య విలువలకు వ్యతిరేకంగా గొప్ప ప్రజా ఉద్యమాలను నిర్మించారు. వారి సామాజిక సాంస్కృతిక దృక్పథంలోని మౌలికాంశం పీడితులందరినీ ఐక్యం చేయడమే.

స్త్రీలు-శూద్రులు-అతిశూద్రులందరినీ ఒక తాటిమీదికి తీసుకురావడమే ఈ ఉద్యమ లక్ష్యం. విప్లవకారుడైన తన భర్తతో కలిసి సావిత్రీబాయి ఫూలే (1831-97) చేసిన పోరాటాలూ, ఎదుర్కొన్న సమస్యలూ తగిన గుర్తింపు పొందకపోవడానికి కారణం సమాజంలోని కులతత్వ, పురుషాహంకార ధోరణులే. పండిత వర్గాల్లోని చాలామందికి కూడా ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్రమే తెలుసు. ఆధునిక భారతదేశంలో మొట్టబదటి ఉపాధ్యాయురాలిగా, పేద ప్రజల ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికై కృషి చేసిన ఉద్యమకారిణిగా, స్త్రీ విముక్తి పోరాట నాయకురాలిగా కవియిత్రిగా, కులమూ - పితృస్వామ్యమూ అనే శక్తులపై యుద్ధానికి పూనుకున్న సాహసిగా సావిత్రీబాయి ఒక  స్వతంత్ర
వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్న ఆదర్శ మహిళ. పందొమ్మిదవ శతాబ్దంలో జరిగిన సామాజికోద్యమాలన్నిటిలోనూ నాయకత్వస్థానంలో కనబడే మహిళ ఆమె ఒక్కతే.

భారతదేశంలో మొట్టమొదటి మహిళా పాఠశాలను స్థాపించిన సావిత్రీబాయి 1852లో ''మహిళా సేవా మండల్‌'' అనే మహిళా సంఘాన్ని కూడామానవ హక్కుల గురించి, ఇతర సామాజిక సమస్యల గురించి, స్త్రీలను చైతన్యపరచడానికి ఈ సంస్థ ఎంతగానో కృషి చేసింది. స్త్రీలకు జెండర్‌ పరనంగా ఎదురయ్సేమస్యలకు తోడుగా కుల, పితృస్వామ్య
వ్యవస్థల అణిచివేత కూడా సాగుతున్నదన్న వాస్తవాన్ని ఒక మహిళగా ఆమె పూర్తిగా అర్థం చేసుకోగలిగింది. స్త్రీల ప్రత్యేక సమస్యపై జరిగిన ఎన్నో ఉద్యమాల్లో ఆమె పాలు పంచుకుంది. వితంతువులపై వివక్షకూ, అక్రమ సంతానమైన శిశువుల హత్యలకు వ్యతిరేకంగా ప్రచారాన్ని చేపట్టింది.

వితంతు పునర్వివాహాల అవసరాన్ని గురించి చాటిచెప్పడమే గాక, ఎంతో ప్రోత్సాహాన్ని అందించింది.
అనాథలుగా మారుతున్న శిశువుల కోసం శరణాలయాన్ని స్థాపించింది. దిక్కులేని స్త్రీలకూ, పిల్లలకూ సావిత్రీబాయి ఇల్లే ఒక పునరావాస కేంద్రంగా మారింది. వితంతువులకు శరోముండనం చేసే ఆచారానికి సహకరించబోమంటూ క్షురకులు తిరుగుబాటు చేసేట్టుగా ప్రోత్సహించింది.

ఈ పనులన్నిటకీ ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టి నిర్వహించింది. సత్యశోధక్‌ సమాజాన్ని నిర్వహించిన ముఖ్య నాయకుల్లో సావిత్రీబాయి ఫూలే కూడా వున్నారు. సంస్థ మహిళా వొరీభాగానికి ఆమె నాయకురాలు. సత్య శోధక్‌ సమాజ కార్యకర్తలను ఎన్నో సామాజికోద్యమాల్లోకి నడపటంలో ఆమె శ్రద్ధ వహించింది. 1896-97 కాలంలో కరువు, ప్లేగు వ్యాధి వ్యాపించిన సందర్బాలలో సావిత్రీబాయి నాయకత్వంలో సత్య శోధక్‌ సమాజం చేసిన సేవ ఎంతో గొప్పది. సావిత్రీబాయి జీవితం ఉద్యమం గురించి విశ్లేషిస్తూ ప్రముఖులు రాసిన ఈ వ్యాసాల సంకలనాన్ని కాత్యాయిని తెలుగులోకి అనువదించారు.

- కె.పి.అశోక్‌ కుమార్‌
(వార్త దిన పత్రిక, జూలై 18, 2010 సౌజన్యంతో)

1 comment:

  1. సావిత్రి బాయి గురించి కొన్ని న్యూస్ పేపర్లలో చదివాను. అప్పట్లో సావిత్రీ బాయి పేరు చెపితే క్షురకులు భయపడిపోయేవారు. భర్త చనిపోయిన స్త్రీల జుత్తు కత్తిరించడానికి వెళ్లే క్షురకులపై సావిత్రీ బాయి అనుచరగణం దాడి చేసేవారు.

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌