Thursday, December 24, 2015

బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ - బి.విజయభారతి రచన - పన్నెండో ముద్రణ అదనపు సమాచారంతో...

బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 
- బి. విజయభారతి రచన 

డాక్టర్‌ విజయభారతి ఈ పుస్తకంలో డాక్టర్‌ అంబేడ్కర్‌ దళిత జనోద్ధరణ కోసం చేసిన కృషిని, పోరాటాలను చక్కని శైలిలో వివరించారు. అంబేడ్కర్‌ జీవితమే కాకుండా అప్పటి సాంఘిక, రాజకీయ స్థితిగతుల్ని బాగా అధ్యయనం చేసి రచన సాగించారు. ఈ పుస్తకం ప్రస్తుత మూఢ విశ్వాసాలతో నిండివున్న సమాజంపై కులతత్వం, మతతత్వం, అనైక్యతలపై 'డైనమైట్‌' వంటిది. సాంఘిక విప్లవానికి ఈ పుస్తకం దోహదపడుతుంది.
-- డాక్టర్‌ ఎం. ఏబెల్‌
(మాజీ వైస్‌ ఛాన్స్‌లర్‌, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం)

డాక్టర్‌ విజయభారతిగారి ఈ పుస్తకం 'టైంబాంబ్‌ ' లాంటిది. కులతత్వంతో కూడిన సమాజ వ్యవస్థను ఇది బ్రద్దలు చేస్తుంది. ఈ పుస్తకం వల్ల కొందరి హృదయాలు బాధపడ్డా, మరికొందరి హృదయాలు సంస్కరింపబడతాయి.
-- జస్టిస్‌ కె. పున్నయ్య
............................

ఈ పుస్తకం నుంచి ఒక అధ్యాయం సంక్షిప్తంగా...

1954 డిసెంబర్‌లో ప్రపంచ బౌద్ధ మహాసభలు రంగూన్‌లో జరిగాయి. అంబేడ్కర్‌ ఆరోగ్యం అంత బాగుండలేదు. అయినా రంగూన్‌ వెళ్లాడు. భార్య, ఒక సేవకుడు వెంట వెళ్లారు. బౌద్ధ ధర్మ సంబంధమైన ఆధ్యాత్మిక- మానసిక భావ సంచలనం ఆయనను విచలితున్ని చేసింది. ఉపన్యసించేటప్పుడు చెక్కిళ్లమీద కన్నీరు జాలువారింది. అయినా నిగ్రహించుకుని భావశబలతతో ఉపన్యసించాడు.

... అంబేడ్కర్‌ బౌద్ధ మతాన్ని స్వీకరించబోతున్నాడన్న వార్త బౌద్ధులను ఆనందపరచింది. నిమ్న జాతులంతా బౌద్ధం స్వీకరిస్తే భారతదేశపు రూపురేఖలే మారిపోగలవని వారు భావించారు.

... 1956 పూర్వార్థానికి బౌద్ధ ధర్మాన్ని గురించి అంబేడ్కర్‌ మొదలుపెట్టిన పుస్తకం సుమారుగా పూర్తి కావచ్చింది. ... చివరికి ఆ గ్రంధం ''ద బుద్ధా అండ్‌ హిజ్‌ గాస్పెల్‌'' అనే పేరుతో ముద్రితమైంది. ...చివరలో పేరు మార్చాడు. 1956 ఫిబ్రవరిలో 'దేరీజ్‌ నో గాడ్‌', 'దేరీజ్‌ నో సోల్‌ ' అనే మరో రెండు అధ్యాయాలు చేర్చాడు.

బౌద్ధమతాన్ని గురించిన ఆయన అభిప్రాయాలను లండన్‌ రేడియో 1956 మే  నెలలో ప్రసారం చేసింది. మానవ జీవితానికి ముఖ్యంగా కావలసిన ప్రజ్ఞ, కరుణ, సమత అనే మూడు ప్రధానాంశాలను బోధిస్తున్న మతం ఇది ఒక్కటే అని అంబేడ్కర్‌ చెప్పాడు.

మార్క్స్‌ సిద్ధాంతాలకు, కమ్యూనిజానికి బౌద్ధమతమే చక్కని సమాధానమిస్తుందన్నాడు. 'కమ్యూనిజాన్ని దిగుమతి చేసుకున్న బౌద్ధ దేశాలకు కమ్యూనిజం అంటే నిజమైన అవగాహన లేదు.  బౌద్ధ ధర్మంతో కూడిన కమ్యూనిజం శాంతియుత విప్లవాన్ని తెస్తుంది. నేటి కమ్యూనిస్టు దేశాలలో రక్తపాతం లేకుండా మార్పు రావడంలేదు' అన్నాడు అంబేడ్కర్‌.

ఆసియా దేశాలు త్వరపడి రష్యా మార్గాన్ని అనుసరించరాదనీ, బుద్ధుని సిద్దాంతాలకు రాజకీయ రూపం ఇస్తే అదే మానవాళి మనుగడకు చక్కని మార్గమనీ చెప్పాడు. వాయిస్‌ ఆఫ్‌ అమెరికాకు ఇచ్చిన ప్రసంగంలో ప్రజాస్వామ్య ప్రగతిని గూర్చి మాట్లాడాడు. పార్లమెంటరీ ప్రభుత్వంలో గానీ, మరేరకమైన ప్రభుత్వంలో గానీ ప్రజాస్వామ్య పరిరక్షణకు సహజీవన దృక్పథం అవసరమనీ, హిందూదేశ సమాజంలో కులం అనేక విచ్ఛేదాలను తెచ్చిపెడుతున్నదనీ వివరించాడు.

... (1956 అక్టోబర్‌ 14న) ఉదయం 9 గంటల 15 నిమిషాలకు అంబేడ్కర్‌ (నాగపూర్‌లో వాక్సీన్‌ ఇన్‌స్టిట్యూట్‌ వద్ద 14 ఎకరాల విస్తీర్ణం గల మైదానంలో లక్షలాది అభిమానుల మధ్య) వేదిక నలంకరించాడు. తెల్లని సిల్కు పంచె, తెల్లని కోటు ధరించాడు. డి వలీసిన్హా, సంఘరత్న తీర్థ, తిస్సా తీర్థ, పన్నానంద తీర్థలు వేదిక మీద వున్నారు. అంబేడ్కర్‌ను స్తుతించే ఒక మరాఠీ గీతంతో కార్యక్రమం ఆరంభమైంది. అంబేడ్కర్‌ తండ్రికి శ్రద్ధాంజలి సూచకంగా ఒక నిమిషం మౌనం పాటించాక కుశీ నగరానికి చెందిన వృద్ధ భిక్షు మహాస్థవిర చంద్రమణి తన నలుగురు శిష్యులతో అంబేడ్కర్‌ దంపతులకు దీక్షా విధిని నిర్వహించాడు. ...

... ''అసమానతకు, దాస్యానికి నిలయమైన నా తాత తండ్రుల (హైందవ) ధర్మాన్ని త్యజించి నేనీనాడు తిరిగి జన్మించాను'' అన్నాడు అంబేడ్కర్‌. ఆయనకు అవతారాల మీద నమ్మకం లేదు. బుద్ధుడు విష్ణువు అవతారమని చెప్పే వాదాన్ని ఆయన ఖండించాడు.

''నేనిక ఏ హిందూ దేవుణ్నీ, దేవతనూ పూజించను. శ్రాద్ధ కర్మలు  చేయను. బుద్ధుని అష్టాంగమార్గాన్ని అనుసరిస్తాను. బౌద్ధమే నిజమైన ధర్మం.  త్రిశరణాల ఆధారంతో జీవితాన్ని కొనసాగిస్తాను'' అని దీక్ష వహించాడు.

... తాను దీక్ష గ్రహించడం పూర్తయినాక, బౌద్ధమతంలో చేరదల్చుకున్న వారిని లేచి నిలబడమని అంబేడ్కర్‌ కోరాడు. సభామండపంలో ఉన్న యావన్మందీ లేచి నిల్చున్నారు....
..........

బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 
- బి.విజయభారతి 

292 పేజీలు; వెల: రూ.120/-

మొదటి ముద్రణ : 1982
పునర్ముద్రణ : 1986, 1990, 1992, 1999, 2005, 2008, 2009, 2010, 2012, 2013, 2015

ప్రతులకు వివరాలకు:
: హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500006
ఫోన్‌ : 040 2352 1849
ఇమెయిల్‌ : hyderabadbooktrust@gmail.com


No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌