Saturday, October 25, 2014

పిల్లల సంరక్షణ - మనకు డాక్టర్‌ అందుబాటులో లేనప్పుడు...


పిల్లల సంరక్షణ - మనకు డాక్టర్‌ అందుబాటులో లేనప్పుడు...

ప్రజల్లో ఆరోగ్యపరమైన అవగాహన పెంచేందుకు హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌ ఇప్పటి వరకూ ఎన్నో పుస్తకాలు ప్రచురించింది. ముఖ్యంగా ''వైద్యుడు లేనిచోట'', ''మనకు డాక్టర్‌ లేనిచోట- ఆడవాళ్లకు అందుబాటులో వైద్యం'', ''సవాలక్ష సందేహాలు'', ''జబ్బుల గురించి మాట్లాడుకుందాం'' వంటి పుస్తకాలు మన సమాజంలోని వివిధ వర్గాల వారికి ఎంతో చేరువయ్యాయి.

వాటిలాగే పిల్లల ఆరోగ్యానికి సంబంధించి తెలుగులో ఒక మంచి హ్యాండ్‌ బుక్‌ లేని లోటును కొంతరకైనా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని మీ ముందుకు తెస్తున్నాం.

పిల్లలు మన జాతి రత్నాలు. వాళ్లు చక్కగా పెరిగి మంచి పౌరులుగా తయారయ్యేందుకు ఆరోగ్యం, భద్రత, సంరక్షణ, పోషకాహారం, విద్య, సంతోషకరమైన వాతావరణం అనేవి తప్పనిసరిగా కావాలి. పిల్లలకు సంబంధించిన ఈ కనీసావసరాల పట్ల ప్రజల్లో సరైన స్పృహ పెంచడానికి ఈ పుస్తకం చాలా తోడ్పడుతుందని మేం భావిస్తున్నాం.

హాస్టళ్లు, శిశు సంరక్షణా కేంద్రాలు, బ్రిడ్జి స్కూళ్లు నడుపుతున్నవారికీ, ఆరోగ్య కార్యకర్తలకూ, వైద్య సదుపాయాలకు దూరంగా వున్న గ్రామీణ తల్లిదండ్రులకూ ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆమాటకొస్తే, వైద్యం ఖరీదైన వ్యవహారంగా, వ్యాపారంగా మారిపోయిన ఈ రోజుల్లో చుట్టూ ఎన్ని సదుపాయాలు అందుబాటులో వున్నా పట్టణాల్లోని తల్లిదండ్రులకు కూడా ఈ పుస్తకం ఎంతైనా అక్కరకొస్తుంది.

పిల్లల పెంపకంలో వైద్యపరమైన అవగాహన, ఆరోగ్యపరమైన స్పృహ కీలకమైన అంశాలు. పిల్లల్లో కనిపించే చాలా రకాల ఆరోగ్య సమస్యల గురించి ఈ పుస్తకం సులభమైన భాషలో, తేలికగా అర్థమయ్యే రీతిలో చర్చిస్తుంది. ముఖ్యంగా పిల్లలను జబ్బుల బారిన పడకుండా కాపాడుకోవడం ఎలా? ఒకవేళ ఏవైనా సమస్యలు వస్తే వారిని సంరక్షించుకోవడం పలా? అన్న రెండు అంశాల గురించీ ఇందులో సవివరమైన సమాచారం పొందుపరచడం జరిగింది.

పోషకాహారం, నోటి ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం వంటి అంశాలతో పాటు తరచుగా ఎదురయ్యే నీళ్ల విరేచనాలు, వడదెబ్బ, జ్వరాలు మొదలైనవి వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? దెబ్బలు, కాలిన గాయాలు, బెణుకుళ్లు, ఎముకలు విరగడం వంటి సమస్యలు తలెత్తినప్పుడు ఎలాంటి ప్రథమ చికిత్సలు చేయాలి? కలరా, కామెర్లు వంటి తీవ్రమైన సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? తదితర అనేక విషయాలను సవివరంగా చర్చిస్తుందీ పుస్తకం.

పిల్లల సంరక్షణకు శాస్త్రీయమైన సలహాలనిచ్చే ప్రాణ స్నేహితుడిలాంటిది ఇది. పిల్లలున్న ప్రతి ఇంట్లో, ప్రతి ఆవరణలో తప్పనిసరిగా వుండాల్సిన పుస్తకం ఇది.పిల్లల సంరక్షణ
మనకు డాక్టరు అందుబాటులో లేనప్పుడు


- కాసడీ టామస్‌, లారెన్‌ హ్యూయి

ఆంగ్లమూలం: THE HEALTHY CHILD HANDBOOK, Cassady Thomas and Lauren Hughey, 2011, World's Children


తెలుగు అనువాదం: భవాని దేవినేని

202 పేజీలు, ధర : రూ.150/-

ప్రతులకు వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌ నెం. 040-2352 1849

ఇమెయిల్‌ : hyderabadbooktrust@gmail.com

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌