Saturday, March 1, 2014

వేగుచుక్కలు - అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మంల సామాజిక దృక్పథం - ఎమ్‌.ఎమ్‌.వినోదిని -

వేగుచుక్కలు
అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మంల సామాజిక దృక్పథం
- ఎమ్‌.ఎమ్‌.వినోదిని


ఈ వ్యాస సంపుటిలో తొలి తెలుగు సంకీర్తనాచార్యుడు తాళ్లపాక అన్నమాచార్యులు, తొలి తెలుగు అభ్యదయ కవి వేమన, అగ్రకుల ఆధిపత్యం నుండి దేవుడిని, దైవత్వాన్ని ప్రజాపరం చేసిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిలపై సహేతుకమైన, సత్య శోధనాయుతమైన వ్యాసాలు ఉన్నాయి.

ఈ మూడే కాకుండా కక్కయ్య, సిద్ధయ్య గురించిన లఘు రచనలూ ఉన్నాయి. అన్నమయ్య, వేమన, బ్రహ్మన్న తమ దృక్పథాన్ని, తత్వాన్ని జనసామాన్యానికి యెరుకపరచడానికి కవితా రచనే బలమైన ఆయుధంగా స్వీకరించారు.

వెయ్యేళ్లకు పైగా లిఖిత చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో ప్రబంధ, పురాణకర్తల సాహిత్యం మేధావుల మస్తిష్కాలలో పదిలంగా ఉంటే - ఈ మువ్వురూ తమ సామాజిక దృక్పథంతో వెలువరించిన కవిత్వంతో అశేష జనావళికి సతత హరిత స్ఫూర్తిని ఇస్తూనే ఉన్నారు. అక్షరం ముక్క రాని పామరులు సైతం ఈ ముగ్గురి కవిత్వంలోని పద్యమో, పాటో, తత్వగీతమో అడిగినదే తడవుగా వినిపిస్తారు. తరతరాలుగా నాలుక నుండి నాలుక మీదికి ఈ ముగ్గురి జవజీవ కవిత్వం, వారసత్వం సంపదగా అంది వస్తూనే ఉంది. కాల పరీక్షల్లో ఎదురు నిలిచి పురోగమిస్తూనే ఉంది. ఇంతటి ఘనమైన కాలాతీత విజయసాధనకంటే ఏ కవులైనా, ఏ తాత్వికులైనా, ఏ సంస్కర్తలైనా ఏమి ఆశించగలరు?

స్ఫటికం వంటి వాస్తవం ఏమిటంటే ఈ ముగ్గురూ రాజ ఆస్థానాలకు బయటివారే. అదే వీరి బలం. అదే వీరి విజయసాధనలోని రహస్యంకూడా.

అలాగే ఈ ముగ్గురూ తాము నమ్మిన భావజాలాన్ని ఏ సామాన్యులకైతే మనసుకు ఎక్కేటట్లు చెప్పాలనుకున్నారో ఆ పనిని జయప్రదంగా, ఫలప్రదంగా చేశారు. ఆ చెప్పడానికి ప్రజల వాడుక భాషను, సాహిత్యంలో ఆనాటి పండితులు ఉపేక్షించిన దేశీయ ఛందస్సులను స్వీకరించి అద్వితీయ ఫలితాలను సాధించారు.

వేగుచుక్కలు
అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మంల సామాజిక దృక్పథం
- ఎమ్‌.ఎమ్‌.వినోదిని


140 పేజీలు, ధర రూ. 80/-

ISBN 978-81-907377-4-6

ప్రతులకు వివరాలకు :
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌ నెం. 040-2352 1849


రచయిత్రి పరిచయం

వినోదిని గుంటూరులో పుట్టారు. ఏ.సి.కాలేజీ నుండి డిగ్రీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, రాజమండ్రి ప్రాంగణం నుండి ఎం.ఎ. చేశారు. స్త్రీవాద కవిత్వంపై ఎం.ఫిల్‌ చేశారు., పిహెచ్‌.డి చేశారు. 

కుల వివక్ష నిర్మూలన, జోగిన వ్యవస్థ నిర్మూలనపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో యాక్షన్‌ ఎయిడ్‌ సంస్థతో కలిసి పనిచేశారు.
ప్రస్తుతం కడప లోని యోగి వేమన విశ్వ విద్యాలయం, తెలుగు శాఖలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
కథ, కవిత్వం, విమర్శ రాస్తున్నారు.

దళిత స్త్రీల సమస్యలు, దళిత క్రైస్తవ జీవనంలోని వాస్తవాలు తన రచనల్లో ప్రధానంగా ప్రతిబింబిస్తున్నారు.

ప్రాచీన సాహిత్య బోధన గురించి వినోదిని రాసిన వ్యాసాలు తెలుగు సాహిత్య,లో సుదీర్ఘ చర్చను లేవనెత్తాయి. 'దాహం' పేరుతో రాసిన నాటకం ఇంగ్లీషు అనువాదం థరస్ట్‌ హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వ విద్యాలయం ఆంగ్ల సాహిత్య విద్యార్థులకు సిలబస్‌గా ఉంది.

'తప్పిపోయిన కుమార్తె' కథ ఇంగ్లీషు అనువాదం ద పారబుల్‌ ఆఫ్‌ ఎ లాస్ట్‌ డాటర్‌ కేరళ విశ్వవిద్యాలం, ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ విద్యార్థులకు సిలబస్‌గా వుంది. వినోదిని రచనలు కొన్ని ఇంగ్లీషు, హిందీ, ఇతర భాషలలోకి అనువాదం అయ్యాయి.

వినోదిని రచనల ఆంగ్ల అనువాదాలు కొన్ని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ ప్రెస్‌, పెంగ్విన్‌ పబ్లికేషన్స్‌ ద్వారా ప్రచురణ పొందాయి. స్త్రీవాద కవిత్వం - భాష, వస్తు రూప నవీనత పేరుతో తన పిహెచ్‌.డి పరిశోధన ప్రచురితమైంది. 

.






1 comment:

  1. This book is all about 3 great personalities with a different (saamajika spruha) angle. Good Read.

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌