Saturday, May 28, 2011

హృదయంతో చేసిన అనువాదం - చివరకు మిగిలింది? ('గాన్‌ విత్‌ ద విండ్‌') పుస్తక సమీక్ష - విజయకుమార్‌ (ఈ భూమి మాసపత్రిక)


కొన్ని కొన్ని కొందర్ని ఆకర్షిస్తాయి.
వాటికి ఎన్నో కారణాలు వుంటాయి.
ఎం.వి.రమణారెడ్డి గారిని మార్గరెట్‌ మిచ్చెల్‌ 'గాన్‌ విత్‌ ద విండ్‌' ఆకర్షించింది.
దానికి కారణాలు ఆయన చెప్పుకున్నారు.
ప్రపంచ ప్రసిద్ధ నవలను పరవశంగా అనువదించారు.
ఇది నవ్య వారపత్రికలో సీరియల్‌గా కూడా వచ్చింది.
ఇప్పుడు పుస్తకంగా మనముందు వుంది.
'ప్రతి అనువాదకుడు ఆ భాష కొక ప్రవక్తలాంటివాడు' అన్నాడు జర్మన్‌ మహాకవి గోథె.
రచనను, ఇతర భాషలోని రచనను ఆత్మీయంగా భావించినప్పుడే దాన్ని మాతృభాషలోకి తేవాలనిపిస్తుంది. మన ప్రాచీన మహాకవులందరూ అనువాదకులే.

'గాన్‌ విత్‌ ద విండ్‌' నవల గురించి చెబుతూ రమణారెడ్డి గారు 'అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్రలో సంభవించిన ఒకానొక మలుపు ఈ నవలకు నేపథ్యం... సామాజిక శక్తుల పోరాట క్రమంలో భూస్వామ్య వ్యవస్థకూ పెట్టుబడిదారీ వ్యవస్థకూ మధ్య జరిగిన ముఖాముఖి పోరాటాన్ని చిత్రించిన నవల ఇది. ఈ నవలలో ప్రధానపాత్ర 'స్కార్లెట్‌' అనే అమ్మాయిది. ఆమె పాత సమాజంలో ఇమడనూ లేదు. కొత్త సమాజాన్ని అందుకోనూ లేదు' అన్నారు. ఈ నవలను గతంలో సంక్షిప్తంగా పరిచయం చేసిన మాలతీ చందూర్‌ గారి పట్ల ఆయన కృతజ్ఞత ప్రకటించారు.

'గాన్‌ విత్‌ ద విండ్‌' నవల 1936లో అచ్చయింది.
1998 వరకు ప్రపంచ వ్యాప్తంగా రెండుకోట్ల కాపీలు అమ్ముడుపోయింది.
ప్రతిష్టాత్మకమైన పులిట్జర్‌ బహుమతిని 1937లో అందుకుంది.
1939లో సినిమాగా వచ్చి 9 అకాడమీ అవార్డులు గెలుచుకుంది.
డిసెంబర్‌ 15, 1939న 'గాన్‌ విత్‌ ద విండ్‌' చిత్రం విడుదలయింది.
ఆ చిత్రం విడుదల రోజు జార్జియా రాష్ట్రంలో సెలవుదినంగా ప్రకటించారు.
అట్లాంటా నగరంలో మూడురోజులు ఉత్సవాలు జరపాల్సిందిగా నగర మేయర్‌ ఆజ్ఞలు జారీ చేశారు.
చలన చిత్ర చరిత్రలోనే అది అపూర్వ విషయం.

మార్గరెట్‌ మిచ్చెల్‌ నవల వెలుగు చూడడానికి పూర్వాపరాల్ని రమణారెడ్డిగారు ఆసక్తిగా వివరించారు. మార్గరెట్‌ మిచ్చెల్‌ 48వ ఏట కారు ఢీకొని స్పృహతప్పి ఆస్పత్రిలో చేరి ఐదురోజులుండి 1949 ఆగస్టు 16 న చనిపోయింది. ఈ నవల వచ్చి 70 సంవత్సరాలు గడచినా ఇప్పటి దాకా తెలుగులో రాలేదు. సంక్షిప్త కథా పరిచయాలు తప్ప సమగ్రంగా రాలేదని రమణారెడ్డి గారన్నారు. ఆ బృహత్తర బాధ్యతని స్వీకరించి ఈ నవలను ఆయన తెలుగు పాఠకుల ముందుంచారు.

బానిసత్వాన్ని రద్దు చేస్తూ లింకన్‌ చట్టం చేశాడు.
దాంతో అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి దక్షిణాది రాష్ట్రాలు విడిపోయాయి.
అంతర్యుద్ధం మొదలయింది.

జార్జియా రాష్ట్రంలో పుట్టి పెరిగిన స్కార్లెట్‌ ఓహరా జీవిత కథ ఈ నవల. ఆమె యాష్‌లీ అనే అతన్ని ప్రేమిస్తుంది. కానీ అతను మెలనీ అనే అమ్మాయిని పెళ్లిచేసుకుంటాడు. తన అందాన్ని లెక్కపెట్టని అతని పై ఆగ్రహంతో అతని తమ్ముడు చార్లెస్‌ను పెళ్లిచేసుకుంటుంది. అతను అంతర్యుద్దంలో చనిపోతాడు. కానీ ఆమె యాష్‌లీని మరచిపోదు. అంతర్యుద్ధంలో కాలిపోతున్న ఇళ్ల నించి స్కార్లెట్‌ను, ఆమె బంధువుల్ని బట్లర్‌ అనే అతను రక్షిస్తాడు. అతనంటే స్కార్లెట్‌కు ఇష్టముండదు. కానీ అతన్ని పెళ్లాడుతుంది. మనసులో యాష్‌లీ వుంటాడు. యాష్‌లీ భార్య చనిపోతుంది. స్కార్లెట్‌ మనసు తెలిసి బట్లర్‌ ఆమెను వదిలి వెళ్లిపోవాలనుకుంటాడు. ఈ మధ్యకాలంలో పిల్లలు కలగడం, పోవడం కూడా జరుగుతుంది. మధ్యలో అంతర్యుద్ధంలో అతలాకుతలమైన జీవితాలు ఎన్నెన్నో.

చివరిదాకా తన అహంకారాన్ని, అభిజాత్యాన్ని వదిలిపెట్టని స్కార్లెట్‌ తత్వం మనల్ని ఆకర్షిస్తుంది. చివరికి తన మనసులో వున్నది యాష్‌లీ కాదని, తన భర్త బట్లర్‌ అని తెలిసినా ఆ విషయం బాహాటంగా భర్తతో చెప్పదు. వ్యక్తులు కలుస్తూ, విడిపోతూ, అకర్షిస్తూ, సంక్షోభంలో సాగిపోతూ అడుగడుగునా మనకు ఉత్కంఠ కలిగిస్తారు.

యాష్‌లీ భార్య మిలెనీ మరణశయ్యపై వుంది. తన భర్తనీ, కొడుకునీ స్కార్లెట్‌కి ఒప్పగించి కళ్లు మూస్తుంది. అన్నాళ్లుగా తను ఆరాటపడిన వ్యక్తి తనకందినా తను ఎండమావులవెంట పరిగెత్తానని గుర్తిస్తుంది. తన మనసులో వున్నది తన భర్త బట్లరని తెలుసుకుంటుంది. బట్లరేమో ఆమెని వదిలి వెళ్లడానికి నిర్ణయించుకుంటాడు. తన అహంకారం వల్ల ఆమె భర్తని అభ్యర్థించదు. బట్లర్‌ లేని జీవితం అంధకారమనిపిస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచించే ఓపిక, ధైర్యం వుండవు. కానీ ఓటమిని ఒప్పుకొని భర్తని వేడుకోలేదు. తన అందంతో, ప్రేమతో అతన్ని లొంగ దీసుకోగల ననుకుంటూనే నిద్రపోతుంది.

నవలలో స్కార్లెట్‌, బట్లర్‌ పాత్రలు ప్రధానమయినవి. అందంలో, తెలివితేటల్లో, స్వార్థంలో ఒకరికొకరు తీసిపోరు. వాళ్లని యిష్టపడతాం, కోప్పడతాం, భూమిలో కలిసిపోతున్న భూస్వామ్య మనస్తత్వాలకు వాళ్లు ప్రతినిధులు. తన గొప్ప శిల్పంతో మార్గరెట్‌ మిచ్చెల్‌ మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేసి చదివిస్తుంది.

రమణారెడ్డిగారు ఈ నవలని రసవంతంగా అనువదించారు. ఉదాహరణకి చివర్లో స్కార్లెట్‌ భర్త బట్లర్‌ ఆమెని వదలివెళ్లాలనుకున్నప్పుడు ఆమెతో అన్న మాటలు చూడండి.
''మన పెళ్లినాటికే నువ్వు నన్ను ప్రేమించడం లేదని తెలుసు. నీ మనవులో నుండి యాష్‌లీ తొలగిపోలేదని తెలుసు. నేను ఎంత మూర్ఖుణ్ణంటే నువ్వు అతన్ని మరచిపోయేలా చేయగలననుకున్నాను. నువ్వు ఏది కోరినా కాదనకుండా సంతోషపెట్టాలనుకున్నాను. వివాహ బంధంతో రక్షణ కలిగించాలనుకున్నాను. నీ స్వేచ్ఛకు అడ్డు తగలకుండా గారాబంగా చూసుకోవాలనుకున్నాను. కష్టాల నుండి నీకు విముక్తి కలిగించాలనుకున్నాను... ఎందుకో తెలుసా? చీకూ చెంత లేకుండా నువ్వు చిన్నపిల్లలా సరదాగా ఆడుకోవాలని. నా దృష్టిలో నువ్వు యింకా చిన్నపిల్లవే. చిన్న పిల్లలు తప్ప నీ అంత మొండిగా తల బిరుసుగా మరొకరు ఉండలేరు.''

రమణారెడ్డిగారి అనువాదంలో తెలుగు పలుకుబడివుంది.
అనువాదం సహజంగా, సరళంగా సాగింది.
తెలుగువాళ్లు హాయిగా చదువుకోవడానికి తగినట్టుగావుంది.
ఆ పేర్లని అనువదించడం అన్నది కుదరదు.
తక్కిన సంభాషణలు, సన్నివేషాలు, రాగద్వేషాలు అన్నీ మన ముందు అపూర్వంగా, ప్రతిభావంతంగా ఆవిష్కరించారు.

అనువాదం ఒక తపస్సు, ఒక తన్మయత్వం.
తన ఆనందాన్ని పంచుకోవాలని భావుకుడు అనుకుంటాడు.
రమణారెడ్డిగారు అనుకున్నారు.
తన మనసుగుండా సాగిన గాన్‌ విత్‌ ద విండ్‌ మన ముందు తియ్యని తెలుగై వెలుగుతోంది.
చదవండి.
- విజయ్‌కుమార్‌
ఈ భూమి, సామాజిక రాజకీయ మాసపత్రిక, మే 2011.

చివరకు మిగిలింది?
513 పేజీలు, వెల: రూ.200/-
ప్రతులకు : హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌.

1 comment:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌