చంద్రగిరి శిఖరం
- బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ -
బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ పేరు వినగానే తెలుగు పాఠకులకు రెండు అపురూపమైన నవలలు గుర్తొస్తాయి.
ఒకటి: పథేర్ పాంచాలి.
రెండు: వనవాసి -
వాటితో పోల్చినప్పుడు ఈ చంద్రగిరి శిఖరం (చందేర్ పహార్) కాస్త భిన్నమైనదిగా తోచవచ్చు. (ఇది పూర్తిస్థాయి సాహసగాథ కావటం వల్ల అలాఅనిపిస్తుంది) కానీ, కొంచెం లోతుగా పరిశీలించి చూస్తే బిభూతి భూషణుడి జీవన తాత్వికతా, ప్రకృతితో ఆయనకున్న ప్రగాఢమైన అనుబంధమూఈ మూడు నవలల్లోనూ సమానంగానే ప్రతిఫలించాయని అర్థమవుతుంది.
ప్రకృతి సౌందర్యాన్ని దర్శించటంలో ఈ రచయిత దొక విలక్షణమైన దృష్టి. ప్రకృతిలోని అన్ని పార్శ్వాల్లోనూ, అన్ని శక్తుల్లోనూ వ్యక్తమయ్యే సౌందర్యాన్ని ఆస్వాదించి పాఠకుల అనుభూతికి అందించగలడాయన.
పూల వనాలూ, కీకారణ్యాలూ, వెన్నెల రాత్రులూ, కార్చిచ్చు జ్వాలలూ, జలపాతాలూ, అగ్నిపర్వతాలూ... ప్రకృతిలోని ప్రతి అంశాన్నీ మానవజీవితంలోని వెలుగునీడలంత సహజంగా స్వీకరించి, ప్రేమించగలడాయన. ఈ తాత్వికతే ఆయన రచనలకు గొప్ప గాఢతనూ, సౌందర్యాన్నీచేకూర్చింది.
'పథేర్ పాంచాలి' నవలలో బెంగాల్ పల్లెసీమల ప్రకృతి దృశ్యాలనూ, 'వనవాసి' నవలలో లవటులియా, మౌహన్‌పురా ప్రాంతాల అరణ్య శోభనూ వర్ణించిన బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ ఈ చందేర్ పహార్ (చంద్ర గిరి శిఖరం)లో ఆఫ్రికన్ అడవుల భయద సౌందర్యాన్ని దృశ్యమానం చేశాడు.
శంకర్ అన్న బెంగాలీ యువకుడు ఆఫ్రికన్ అరణ్యాల్లోని చందేర్ పహార్ అనే పర్వతాన్ని అధిరోహించాలన్న ఆశతో సాగించిన సాహస యాత్రను
ఉత్కంఠ భరితంగా చిత్రించాడు.
అయితే ఇది కేవలం కాలక్షేపాన్ని అందించే సాహస గాథ వంటిది కాదు. ప్రకృతితో గాఢమైన అనుంబంధం ద్వారా మానవ స్వభావానికి చేకూరే సౌకుమార్యాన్నీ, స్వార్థ రాహిత్యాన్నీ, తాత్విక దృష్టినీ గురించి ఎంతో సున్నితంగా చెప్తుందీ నవల. బిభూతి భూషణుడి రచనలతో తెలుగు పాఠకుల అనుబంధాన్ని ఇది మరింత గాఢం చేస్తుంది.
చంద్రగిరి శిఖరం
బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ
బెంగాలీ మూలం : చందేర్ పహార్
తెలుగు అనువాదం: కాత్యాయని
104 పేజీలు
వెల: రూ.50/-
No comments:
Post a Comment