విస్మృత విముక్తి దాత: సావిత్రిబాయి ఫూలే జీవితం - పోరాటం
''ది ఫర్‌గాటన్ లిబరేటర్ : ది లైఫ్ అండ్ స్ట్రగుల్ ఆఫ్ సావిత్రిబాయి ఫూలే'' అనే ఇంగ్లీషు పుస్తకంను (మౌంటెన్ పీక్ పబ్లికేషన్) భారతదేశంలో కుల వివక్ష తదితర సామాజిక రుగ్మతలపై పోరాడిన ఒక మహోన్నత స్త్రీ గురించి రాసిన పుస్తకంగా పరిగణించవచ్చు. ఈ పుస్తకాన్ని ''సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి ... సావిత్రిబాయి ఫూలే జీవితం - ఉద్యమం'' పేరుతో 'చూపు' కాత్యాయని తెలుగులోకి అనువాదం చేస్తే, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించారు.
చరిత్రకారులు వాస్తవాన్ని వెలుగులోకి తేవడానికి ఎంతో ధైర్యం నిజాయితీ, చిత్తశుద్ధి కలిగి వుండాలి. దురదృష్ట వశాత్తూ చాలామంది చరిత్రకారులు వాస్తవాలను వక్రీకరించే ధోరణులకు పాల్పడి, నిజాలను ప్రజలకు చేరవేయటంలో విఫల మవుతుంటారు. చరిత్రను కల్పనలతో జోడించి గందరగోళం సృష్టించి ప్రజలను అహేతుకంగా తయారు చేయటంలో ఇటువంటి వారి పాత్ర చాలా ఎక్కువ.
ఈ పుస్తకానికి బ్రజ్ రంజన్ మణి రాసిన ముందుమాటలో బ్రాహ్మణుల చేతుల్లో దళితులు, ఆదివాసీలు, సిక్కులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర వెనకబడిన తరగతుల వారు ఏవిధంగా అణచివేతకు గురైందీ వివరంగా రాశారు.
ఈ పుస్తకం చదివిన తరువాత సహేతుకంగా ఆలోచించగలిగిన ప్రతి ఒక్కరూ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, గాంధీ, నెహూృ కుటుంబాల పేర్లు చరిత్రలో చోటు చేసుకుని సావిత్రిబాయి ఫూలే వంటి ఒక గొప్ప వ్యక్తిని
ఎట్లా విస్మరించగలిగాయా అని ప్రశ్నించక మానరు.
ముందు మాట గురించి నాలుగు వాక్యాలు:
''ఈ భూమ్మీద భారతదేశమే ఒక అసమ సమాజంగా వుంది. ఎన్ని మార్పులు చోటు చేసుకున్నప్పటికీ వారి పరిస్థితి యధాతధంగానే వుంది. ఆరోగ్యం సంపద, విద్య అనేవి పెరుగుతున్నప్పటికీ వాటి పంపిణీలోని తేడాలవల్ల రెండు దేశాల సిద్ధాంతం ప్రచారంలోకి వచ్చింది. అవి - ఒకటి : వెలిగిపోతున్న దేశమైతే, రెండోది: బాధాతప్త దేశం.
జనాభాలో కేవలం 10 శాతంగా వున్న పెత్తందారీ కులాలు అధికారాన్ని తమ చేతుల్లో పెట్టుకుని తక్కిన 90 శాతం ప్రజలను నిరంతరం అణచివేయబడి మానసికంగా క్రుంగిపోయి జాతికి చౌకగా శ్రమను అందించే సమూహంగా తయారు చేయడంలో విజయం సాధించారు.
పేదలను అభివృద్దిచేయటం, జాతి నిర్మాణం పేరిట అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నప్పటికీ పదలు మాత్రం మరింత పేదలుగా మిగిలిపోయారు. వారు ఇప్పటికీ తిండి, నీరు, విద్య వంటి కనీస అవసరాల కోసం పోరాడుతూనే వున్నారు. వీరంతా ఎవరు? 90శాతంగా వున్న ఆదివాసీలు, దళితులు, ఓబీసీలు అంటే ఇతర వెనుకబడిన తరగతులవారు, ముస్లింలు. పెరుగుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక వ్యాపార రంగాల్లో, సమాచార
సాంకేతిక రంగాలలో, వినోద పరిశ్రమల్లో వీరి ప్రాతినిధ్యం శూన్యం.''
ఈ దేశంలోని కుల వ్యవస్థకు బ్రాహ్మణీయ కుల సంస్కృతికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించిన వారిలో తొలి వ్యక్తులు జ్యోతిబా ఫూలే, ఆయన భార్య సావిత్రిబాయి ఫూలే. మహారాష్ట్రకు చెందిన ఈ జంట బ్రాహ్మ'ణీయ విలువలకు వ్యతిరేకంగా అణగారిన కులాలను ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించింది. పేదలనూ, అణచివేతకు గురైన వారినీ ఉద్ధరించే ఉద్యమంలో సావిత్రిబాయి ఫూలే సమాన భాగస్వామ్యాన్ని నిర్వహించారు.
ఆమె నిరక్షరాస్యురాలు అయినప్పటికీ మహాత్మా ఫూలే ఆమెను చదువుకోమని ప్రోత్సహించాడు. తర్వాత కాలంలో భర్త ప్రారంభించిన పాఠశాలలో మొదటి మహిళా ఉపాధ్యాయిని అయింది. వారు అట్టడుగువర్గాల వారికి, సామాజిక, సాంస్కృతిక విలువల పునరుద్ధరణకు అవసరమైన విద్యను అందించడానికి చొరవ చేశారు. 1852లో సావిత్రిబాయి ఫూలే మహిళా సేవా మండల్ ను స్థాపించారు. ఆ సంస్థ మహిళలకు తమ హక్కులు, ఆత్మ గౌరవం తదితర సామాజిక అంశాల ఎడల చైతన్యం కలిగించడానికి కృషి చేసింది. ఆమె వ్యకితగత ప్రమాదాలను కూడా లెక్కచేయకుండా విధవలకు గుండ్లు చేసే దురాచారానికి నిరసనగా బొంబాయి, పూణే నగరాలలో క్షురకుల సమ్మెను విజయవంతంగా నిర్వహించింది.
స్త్రీ విద్య ఒక నేరంగా పరిగణించబడే కాలంలో సావిత్రిబాయి ఫూలే, ఆమెకు మద్దతుగా నిల్చిన మరికొందరు ఎదుర్కొన్న కడగండ్లను వివరించారు. మరొక రచయిత్రి గెయిల్ ఆంవెట్ ఒక పాఠశాల ఉపాధ్యాయినిగా ఛాందసవర్గాల వ్యతిరేకతల మధ్య నిరంతరం పేడ, రాళ్ల దెబ్బలను ఎదుర్కొంటూ సావిత్రిబాయి చేసిన జీవిత పోరాటాన్ని హృద్యంగా చిత్రీకరించారు. సావిత్రిబాయి ఫూలే అటువంటి వాటన్నిటినీ ప్రశాంతచిత్తంతో,
సాహసంతో ఎదుర్కొంది.
అస్పృశ్యుల నీడను అపవిత్రంగా భావిస్తూ దప్పికగొన్న వారికి మంచినీళ్లను కూడా ఇవ్వని రోజుల్లో సావిత్రిబాయి, జ్యోతిరావు ఫూలేలు తమ ఇంట్లో చోటు ఇచ్చారు. ఈ చర్య బ్రాహ్మణులను తమ మనోధర్మాన్ని మార్చుకోమంటూ విసిరిన ఒక సవాల్. అయితే 200 ఏళ్ల తరువాత ఇవాళ్టికి కూడా దేశంలో దళితులు నీటి హక్కుల కోసం పోరాడవలసి రావడం దారుణం.
ఫూలే దంపతులు ఆనాటి సమాజంలోని అన్ని వర్గాల వ్యతిరేకతను ఎదుర్కొన్న వైనాన్ని సావిత్రిబాయి ఫూలే పాఠశాలకు వెళ్తూ రాళ్లు, పేడ దెబ్బలను ఎదుర్కోవడం తన దైనందిన జీవితంలో భాగంగా భావించడాన్ని సింధియా స్టీఫెన్ వర్ణించారు.
ఈ పుస్తకంలో సావిత్రిబాయి ఫూలే తన భర్తకు రాసిన మూడు ఉత్తరాలను కూడా చేర్చారు. వాటి ద్వారా సావిత్రిబాయి ఫూలేకు తన భర్త పట్ల గల గౌరవం వివిధరంగాల్లో ఆమెకు గల పరిజ్ఞానం, విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న వైనం మనకు అర్థం అవుతాయి.
సునీల్ సర్దార్ మరియు విక్టర్ పాల్ లు సావిత్రిబాయి రాసిన ఐదు గీతాలను అనువదించారు. భారత దేశంలోని ఒక మహిళ, అందులోనూ అణగారిన వర్గాల మహిళ రాసిన గీతాలను ఇంగ్లీషువారు ఆదరించడమనేది ఈమెతోనే ప్రారంభమయింది. ఇంగ్లీషు ప్రాధాన్యతను, విద్య ప్రాధాన్యతను తన గీతాల ద్వారా వివరించిన సావిత్రిబాయి ఫూలే ఆధునిక గీత సాహిత్యానికి తల్లివంటిది.
ఈ పుస్తకంలోని మరొక విశేషం ఫూలేలు ప్రారంభించిన పాఠశాలలో చదువుకున్న ఒక బాలిక రాసిన ఉత్తరం. అందులో మంగ్, మహర్ల కడగండ్లపై ఆమె రాసిన విషయాలు చాలా లోతైన అవగాహనతో వున్నాయి. ఫూలేల పాఠశాలలోని విద్యా ప్రమాణాలకు ఇదొక మచ్చుతునక.
1876-1898ల మధ్య కరువుకాలంలో సావిత్రిబాయి ఫూలే తన భర్తతో కలిసి ఎంతో సాహసంగా కరువు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉచితంగా ఆహారాన్ని దుస్తులను పంచి పెట్టారు. ఒక ప్లేగు వ్యాధి పీడితుడైన బిడ్డకు సేవచేస్తూ ఆ వ్యాధి సోకి సావిత్రిబాయి మరణించింది.
ఈ వ్యాసాలతో పాటు ఆమె జీవితంలోని ప్రముఖ ఘట్టాలకు సంబంధించిన చిత్రాలు కూడా ఎంతో అర్థవంతంగా వున్నాయి. ఒక అంధకార యుగంలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టే సాహసం చేసిన ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం గల సావిత్రిబాయి ఫూలే గురించి భారత మహిళలకు అవగాహన లేదు. భారత సమాజం మహిళలపై విధించిన ఆంక్షలకు నిరసనగా గళం ఎత్తిన సాహసి ఆమె. అందుకు గాను నేటి మహిళ ఆమెకు కృతజ్ఞులై వుండాలి.
మానవ హక్కువలలో విశ్వాసం కలిగిన వారు, మహిళా సాధికారత గురించీ స్త్రీవాదం గురించీ ఎక్కువగా మాట్లాడే మహిళా సంఘాలవారు ఈ పుస్తకాన్ని తప్పక చదవాలి.
-శిశిర
సమాంతర మాసపత్రిక (ఆగస్ట్ 2010) సౌజన్యంతో
EMAIL : samaantaravoice@gmail.com
సామాజిక విప్లవకారిణి సావిత్రీబాయి
- సావిత్రీబాయి ఫూలే జీవితం-ఉద్యమం
సంకలనం: బ్రజ్ రంజన్ మణి, ప్యామెల సర్దార్
మూలం: A Forgotten Liberator : The Life and Struggle of Savitribai Phule, Mountain Peak, Delhi 2008.
తెలుగు అనువాదం: కాత్యాయని
72 పేజీలు , వెల: రూ. 40
ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్, గుడిమల్కాపూర్,
హైదరాబాద్ 500 067
ఫోన్: 040 2352 1849
ఇ మెయిల్: hyderabadbooktrust@gmail.com
.
No comments:
Post a Comment