Tuesday, March 31, 2009

పురాణాలు - కుల వ్యవస్థ -3 ... షట్చక్రవర్తులు ... డాక్టర్‌ విజయ భారతి



షట్చక్రవర్తులు

భారతదేశ ప్రాచీన సారస్వతంలో షోడశ మహారాజులూ, షట్చక్రవర్తులూ ప్రసిద్ధులు.

సుహోత్రుడు, అంగుడు, మరుత్తు, శిబి, దశరథరాముడు, భగీరథుడు, దిలీపుడు, మాంధాత, యయాతి, అంబరీషుడు, శశిబంధుడు, గయుడు, రంతిదేవుడు, భరతుడు, పృథుడు, పరశురాముడు అనే పదహారుమంది రాజులను షోడశ మహారాజులుగా పరిగణిస్తారు.

అలాగే హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యుడు అనే ఆరుగురిని షట్చక్రవర్తులుగా పరిగణిస్తారు.

వీళ్లు వర్ణాశ్రమ ధర్మాన్ని కాపాడుతూ భారతదేశాన్ని ప్రతిష్టాత్మకంగా పాలించినట్టు కీర్తించబడ్డారు.
వర్ణాశ్రమ ధర్మాలను కాపాడే రాజులనూ చక్రవర్తులనూ సృష్టించవలసిన అవసరం ఎందుకు కలిగిందో ఆలోచిస్తే చరిత్ర నేపథ్యంలోకి వెళ్ళాల్సి వస్తుంది.
...

భారత దేశం వర్గ సంఘర్షణల నిలయమే కాదు, పోరాటాల భూమి కూడా అ లాంటి పోరాటాలలో అత్యంత తీవ్రమైనది బ్రాహ్మణులకు క్షత్రియులకు మధ్య జరిగినపోరాటం.
ఈ రెండు వర్ణాల మధ్య జరిగిన వర్గ పోరాటాన్ని ప్రాచీన భారతీయ సారస్వతం చక్కగా చిత్రించింది.

మొట్ట మొదట నమోదైన సంఘర్షణ బ్రాహ్మణులకు క్షత్రియుడైన వేనునికి మధ్య జరిగినటువంటిది....
బ్రాహ్మణులకు క్షత్రియ రాజైన పురూరవునికి మధ్య జరిగిన పోరాటం రెండవది.
బ్రాహ్మణులకు సహుషునితో జరిగిన ఘర్షణ మూడోది.
బ్రాహ్మణులకు నిమికి జరిగిన సంఘర్షణ నాల్గవది. అన్నారు డాక్టర్‌ అంబేడ్కర్‌.

ఆ స్ఫూర్తితో చేసిన పరిశీలన ఇది.

వర్ణ వ్యవస్థను ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రచారం చేసిన షట్చక్రవర్తుల కథల పరిశీలన ఈ గ్రంథంలో చూడవచ్చు.

డాక్టర్‌ బి. విజయభారతి తెలుగు అకాడమీ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు. వారు అనేక పుస్తకాలు రచించారు. వాటిలో అంబేడ్కర్‌, ఫూలేల జీవిత చరిత్రలు. వ్యవస్థను కాపాడిన రాముడు ప్రముఖమైనవి. పురాణాలు - కుల వ్యవస్థ పైన ఇది మూడవ పుస్తకం. మొదటిది సత్య హరిశ్చంద్రుడు. రెండవది దశావతారాలు.

పురాణాలు-కుల వ్యవస్థ-3 షట్చక్రవర్తులు
- డాక్టర్‌ విజయభారతి
70 పేజీలు, వెల: రూ.20



ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడి మల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500028
ఫోన్‌: 040-2352 1849


ఇ మెయిల్‌:
hyderabadbooktrust@gmail.com

.............................

Monday, March 30, 2009

జబ్బుల గురించి మాట్లాడుకుందాం ! ... హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌









జబ్బులు రాకుండా ఆరోగ్యంగా వుండాలన్నా, వచ్చిన జబ్బులను సత్వరమే
నయం చేసుకోవాలన్నా వాటి గురించి మనకి ప్రాథమిక అవగాహన తప్పనిసరి వుండాలి.
జబ్బుల గురించి మనకు కనీస సమాచారం అందించే ఓపికా, తీరికా
డాక్టర్లకు వుండదు. నోరువిప్పి అడిగితే చాలామంది డాక్టర్లు విసుక్కుంటారు.

సమాచార దారిద్య్రం రోగులను తీవ్ర నిరాశా నిస్పృహలకు గురిచేస్తుంది.
అది రోగ నివారణమీద కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
ఇట్లాంటి నేపథ్యంలో సామాన్య ప్రజానీకానికి ఆయా జబ్బుల గురించి
ప్రశ్నలు జవాబుల రూపంలో వివరించేందుకు, వారి సందేహాలను
నివృత్తి చేసేందుకు హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ''జబ్బుల గురించి
మాట్లాడుకుందాం!'' అనే చిరు పుస్తకాల సిరీస్‌ని వెలువరించింది.
లాభాపేక్ష లేకుండానే కాదు ఒకింత
నష్టాన్ని భరిస్తూ అతి తక్కువ వెలతో పేదలకు కూడా అందుబాటులో వుండేలా
ప్రచురించిన ఈ పుస్తకాలు ఇప్పటికే పలు పునర్ముద్రణలు పొందాయి.

మొదట పూనాలో కొందరు ప్రజా వైద్యులు లోక విజ్ఞాన్‌ సంఘటన పేరుతో
ఈ పుస్తకాలను వెలువరించారు. ఆ డాక్టర్ల బృందం ప్రతి నెల సమావేశమవుతూ
రోగులు తమను తరచుగా అడిగే ప్రశ్నల గురించి, వారి సమస్యల గురించి
చర్చించేవారు. ఆ చర్చల ఫలితంగానే తమ దగ్గరకు వచ్చే రోగులకు జబ్బుల గురించిన
ప్రాథమిక సమాచారాన్ని అందించడం వల్ల మంచి ఫలితముంటుందని
భావించారు. మరాఠీ భాషలో కరపత్రాల రూపంలో, ఆతరువాత చిన్న పుస్తకాల రూపంలో
వారు వీటిని ప్రచురించి తమ దగ్గరకు వచ్చే రోగులకు వాటిని పంచిపెట్టడం మొదలుపెట్టారు.
అవి వ్యాధి గ్రస్తులనే కాక, వారి బంధు మిత్రులను కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి.
సత్ఫలితాలను యిచ్చాయి.

అద్భుతమైన వారి కృషిని తెలుగు పాఠకులకు అందించాలన్న సంకల్పంతో
ఆ పుస్తకాలను తెలుగులోకి తేవడమే కాక ఇతరత్రా మరికొన్ని పుస్తకాలను
ఆయా వైద్యుల సహకారంతో స్వయంగా హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ రూపొందించింది.

జబ్బులగురించి మాట్లాడుకుందాం సిరీస్‌లో ఇప్పటి వరకు వెలువడిన పుస్తకాల
వివరాలు ఇలా వున్నాయి:


1. గుండెనొప్పి .... 16 పేజీలు వెల: రూ.3
2. అధిక రక్తపోటు (హై బి.పి.) .... 8 పేజీలు వెల: రూ.2
3. మధుమేహం (డయాబెటీస్‌) .... 8 పేజీలు వెల: రూ.2
4. అ ల్సర్‌, గ్యాస్‌ ట్రబుల్‌ ....8 పేజీలు, వెల: రూ.2
5. హిస్టరెక్టమీ (గర్భసంచిని తీసేయడం) ....14 పేజీలు, వెల: రూ.3
6. మోకాలి నొప్పి (డాక్టర్‌ జతిన్‌ రచన) ....16 పేజీలు, వెల: రూ.3
7. ఆస్తమా (ఉబ్బసం) ....12 పేజీలు, వెల: రూ.2
8. క్యాన్సర్‌ ....16 పేజీలు, వెల: రూ.2
9. టాన్సిల్స్‌ (గవద బిళ్లలు) ....6 పేజీలు, వెల: రూ.2
10. కంటి శుక్లం ఆపరేషన్‌ (క్యాటరాక్ట్‌) ....8 పేజీలు, వెల: రూ.2
11. చర్మవ్యాధులు ....32 పేజీలు, వెల: రూ.8
12. మూత్రపిండాల వైఫల్యం (కిడ్నీ ఫెయిల్యూర్‌) ....12 పేజీలు, వెల: రూ.3
13. మలబద్ధకం, ఫిషర్‌, పైల్స్‌ ....28 పేజీలు, వెల: రూ.7
14. దంతాలు చిగుళ్ల వ్యాధులు ....12 పేజీలు, వెల: రూ.2
15. ఎపిలెప్సీ (ఫిట్స్‌/మూర్ఛ) ....12 పేజీలు, వెల: రూ.2
16. ప్రథమ చికిత్స (డాక్టర్‌ జతిన్‌ కుమార్‌ రచన) ....28 పేజీలు, వెల: రూ.7
17. పిల్లల్లో ఊపిరితిత్తుల వ్యాధులు, ఫ్లూ ....24 పేజీలు, వెల: రూ.7
18. ఆరోగ్యం కోసం వ్యాయామం ....12 పేజీలు, వెల: రూ.3
19. స్మోకింగ్‌ డిసీజ్‌ ....48 పేజీలు, వెల: రూ.10
20. తొలియవ్వనంలో వచ్చే శారీరక మార్పులు , కలవరపరిచే సెక్స్‌ సందేహాలు
- సమాధానాలు ....73 పేజీలు, వెల: రూ.20
21. సంపూర్ణ స్వస్థతకు మూలికా వైద్యం ( డాక్టర్ జి. లక్ష్మణ రావు రచన) ... 42 పెజీలు, వెల: రూ. 15.

జబ్బుల గురించి మాట్లాడుకుందాం
మూలం: హెల్త్‌ కమిటీ, లోక్‌ విజ్ఞాన్‌ సంఘటన, మెడికల్‌ జర్నల్స్‌
తెలుగు అనువాదం: ప్రభాకర్‌ మందార


ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడి మల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500028
ఫోన్‌: 040-2352 1849

ఇ మెయిల్‌:

hyderabadbooktrust@gmail.com

Wednesday, March 25, 2009

మూడడుగుల స్వంతనేలతో వామన జైత్ర ''జాతర''



నేలని నమ్మిన రైతు గాధ!


నరేంద్రనాధ్‌ బాల్య జీవితం వడ్డించిన విస్తరని చెప్పవచ్చు-సంపన్న కుటుంబం, అందరూ ఊళ్లో ఉన్నంత విద్య తరువాత ఉన్నత విద్యని అభ్యసించిన వారు అయితే అతను జీవిత పరమార్థం తెలుసు కోవాలనుకున్నాడు. ''నరేంద్రనాథ్‌'' నామకరణం వల్ల వివేకానందుడవ్వాలన్న కాంక్ష ఉగ్గు పాలతో వచ్చిందేమో! అందుకే ఈ నిత్య కృషీవలుడు బలి చక్రవర్తిని, ''అయ్యా, మా కుటుంబసంపదలో ఒక మూడడుగులు అట్టి పెట్టుకోనియ్యి'' అనికోరి, ఢిల్లీలో మంచి ఉద్యోగం వదలి, దారా పుత్రికలతో చిత్తూరు జిల్లాలోని స్వగ్రామం వెంకట్రామపురం చక్కా వచ్చాడు, ఒక పాతిక సంవత్సరాల కిందట. ఈ పద్ధతిలో గాంధీయానం ఎన్నుకొని, పట్నం వదలి గ్రామవాసులు అయిన బహుకొద్ది మంది ఈ తరం విద్యావంతులలో ఈ సాహసి ఒకడు. తన గడ్డ నుండి ప్రారంభించిన శోధన గాధని ఈ చిన్న పుస్తకంలో పొందు పరచి, చదువరిని తనకు ఎంతయో రుణపరుచుకున్నాడు నరేంద్రనాధ్‌.

తన కృషిలో నరేంద్రనాధ్‌ చేపట్టిన పనులు అనేకానేకం. స్వంత భూమిలో సేంద్రీయ వ్యవసాయం; నీటి సమస్యలు; విద్యుత్‌ సంస్కరణలూ, తన ఇలాకాలోని పేద రైతులమీద వాటి ప్రభావం; భూ సంస్కరణలూ, వాటి ఆచరణలో సమస్యలూ; వీటన్నింటికీ అవసరమయిన ప్రజా పోరాటాలూ; ప్రపంచీకరణం దానివల్ల దాపరిస్తోన్నముప్పు -వేయేల ! ఈనాడు సమాజాన్ని భాధిస్తున్న అన్ని రుగ్మతల గురించీ ఆలోచించి పోరాడుతున్న సవ్యసాచి నరేంద్రనాధ్‌ అనడంలో అతిశయోక్తి లేదు.

తనని తాను రైతు అని చెప్పుకున్నా, నరేంద్రనాథ్‌ నిశితమైన విశ్లేషకుడు కూడా. ఆ సంగతి పుస్తకం ద్వారా తెలుస్తూనే ఉన్నది. సంక్షిప్తంగా వదిలేసిన అనేక విషయాల గురించి నరేంద్రనాథ్‌ ఇంకా లోతుగా, విపులంగా చెప్పగలడు, చెప్పవలసి ఉన్నది. ఆప్రయత్నం కూడా నరేంద్రనాధ్‌ తప్పకుండా చేయాలని అనేకథా ఆశిస్తూ, అందరూ చదువవలసినదిగా ఈ చిన్న పుస్తకాన్ని స్వాగతిస్తున్నాను.

ఎం.వి.శాస్త్రి
(వార్త దిన ప్రత్రిక 15-3-2009)

''ఇట్లు ఒక రైతు'',
- గొర్రెపాటి నరేంద్రనాధ్‌,


పేజీలు 138, వెల రూ..50,

ప్రథమ ముద్రణ: ఫిబ్రవరి 2009,

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85,
బాలాజి నగర్‌,
గుడి మల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500028
ఫోన్‌ నెం. 040-2352 1849
.....................

Tuesday, March 24, 2009

గడ్డి పరకతో విప్లవం ... మసనోబు ఫుకుఓకా ...


అన్ని వృత్తులలోకి వ్యవసాయం మహత్తరమయినది.
అందరికీ అన్నం పెట్టేవాడు రైతే అని మన నానుడి. అంటే అన్ని రంగాలకూ వ్యవసాయమే ఆధారం. సేద్యం నిలిచిపోయిన నాడు ఇంకేదీ పురోగమించలేదు. ...

ఈనాడు ఒకవైపు వినాశనం మరోవైపు మనుగడ వున్న కూడలిలోకి మానవాళి చేరుకొంది. ఇటువంటి విషమ పరిస్థితిలో ఎలా ఇరుక్కున్నాం అని ప్రశ్నించుకుంటే - ప్రకృతి నుంచి మనిషి చేజేతులా దూరం కావడమేనన్న సమాధానం ఒక్కటే మిగులుతుంది.

ఫుకుఓకా మాటల్లో చెప్పాలంటే ''మానవ ప్రాణం కేవలం తన శక్తి ద్వారా నిలబడటం లేదు. మానవులకు జన్మనిచ్చి, వాళ్ల ప్రాణాలను ప్రకృతే కాపాడుతోంది. ప్రకృతికీ మనిషికీ మధ్య వున్న సంంధం ఇది.''

జీవన ప్రదాయిని అయిన ఈ సబంధాన్నే మనం తెగ నరుక్కున్నాం. ఇదే సమస్యలన్నిటికీ మూలం. మానవాళి బట్టకట్టి, మనగలగాలంటే మన ఆలోచనల్లోనూ, ఆచరణల్లోనూ ఈ సంబంధాన్ని పునరుద్ధరించాలి. ఇంతకు మించి మరో మార్గం లేదు. తన ప్రకృతి వ్యవసాయ అనుభవాల గురించి విస్తృతంగా చర్చించిన ఈ పుస్తకంలో ఫుకుఓకా చెప్పదలచుకున్నది ఇదే.
.......

దక్షిణ జపానులోని షికోకు దీవులలోని ఓ చిన్న గ్రామంలో ఫుకుఓకా పుట్టాడు.

మైక్రో బయాలజీలో శిక్షణ పొంది పంట తెగుళ్ల నిపుణుడయ్యాడు. యోకోహామాలో కస్టమ్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగంలో చేరేడు. జీవితం సాఫీగా, ఖుషీగా గడిచిపోతుందనుకొంటున్న సమయంలో ఎన్నో ప్రశ్నలు అతన్ని పీడించాయి. 25 ఏళ్ల ప్రాయంలో పొందిన అనుభవం అతని జీవితాన్ని మార్చివేసింది.
మానవ ప్రయత్నమంతా వృథా అని అతనికి బోధపడింది. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి సొంత ఊరుకు చేరాడు.

ఆధునిక వ్యవసాయాన్ని సవాలు చేస్తూ పొలాన్ని దున్నకుండా, ఎరువులూ, పురుగు మందులూ, కలుపునాశిని మందులూ వాడకుండా, యంత్రాలూ లేకుండా వ్యవసాయం చేయసాగాడు.
ప్రకృతిని సాధ్యమయినంతగా అనుసరిస్తూ ''ఏమీ చెయ్యనవరంలేని'' వ్యవసాయ విధానాన్ని రూపొందించాడు.

అతను అవలంభించిన పద్ధతుల వల్ల నేల ఏ ఏటి కాఏడు సారవంతం అవుతూ వచ్చింది. జపానులో మరే ప్రాంతానికీ తీసిపోని దిగుబడులు వచ్చాయి..

తన ఆ అనుభవసారాన్నంతా ఈ పుస్తకంలో నింపాడాయన.

ఆహార సంస్కృతి గురించీ, ప్రకృతి జీవనం గురించీ ఇందులో వివరించాడు.

ఇది 1975లో జపనీస్‌ భాషలో ప్రచురితమయ్యింది. 1976లో ఇంగ్లీషులోకి అనువాదమయ్యింది. ఆ తరువాత దేశ విదేశాల్లో ఎన్నో భాషల్లోకి అనువాదం అయ్యి, ఎన్నో ముద్రణలను పొందింది.

వ్యవసాయానికీ, జీవితానికీ, సంస్కృతికీ మధ్య విడదీయరాని సంబంధం వుందని ఫుకుఓకా విశ్వాసం.

ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకోవాలని వున్న ప్రతి ఒక్కరూ చదవదగిన పుస్తకమిది.

రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయం మసనోబు ఫుకుఓకాకు 1988లో ''దేశికోత్తమ'' బిరుదునిచ్చి గౌరవించింది. ఆ సందర్భంలో ఆయన హైదరాబాదు కూడా సందర్శించారు. వ్యవసాయం వ్యాపారం కాదు జీవిత విధానమన్న భారతీయ సంప్రదాయానికి జీవం పోసే పుస్తకమిది.




గడ్డి పరకతో విప్లవం
-మసనోబు ఫుకుఓకా
ఆంగ్ల మూలం: The One Straw Revolution, Originally published in Japanese as Shizen Noho Wara Ippon No Kakumei, translated into English and published by Other India Press, Goa, 1992.

తెలుగు: సురేష్‌, సంపత్‌

తెలుగులో మొదటి ముద్రణ: టింబక్టూ కలెక్టివ్‌, 1990
రెండవ ముద్రణ: హెచ్‌బిటి, 2001

199 పేజీలు, వెల: రూ.50
.....


ప్రతులకు వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడి మల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500 067
ఫోన్‌ నెం.040-2352 1849

ఇ మెయిల్‌:
hyderabadbooktrust@gmail.com

.........

Friday, March 20, 2009

అతడు అడవిని జయించాడు ..... డాక్టర్‌ కేశవరెడ్డి


1984లో ప్రచురితమై పాతికేళ్లపాటు తన అస్తిత్వవాద నిసర్గ సౌందర్యంతో పాఠకులను అ లరించిన కేశవరెడ్డి ''అతడు అడవిని జయించాడు'' నవలిక నిస్సందేహంగా తెలుగు సాహిత్యంలో విశిష్ట రచన.

లేశమాత్రమైన కథాంశంతో,
అనామకుడూ అపరిచితుడూ అయిన నాయకుడితో,
అద్భుతమూ అపూర్వమూ అయిన అరణ్య నేపథ్యంతో
తన రచనను ఒక పురాణగాథ స్థాయికి తీసుకెళ్లారు కేశవరెడ్డి.

కేశవరెడ్డి రచనల్లో సైతం యిది ఒక ప్రత్యేక విశిష్ట రచన.
తెలుగు నవలల్లో అపూర్వం, అనితర సాధ్యం.

కనీసం ఇంకో పాతిక సంవత్సరాలు ఈ నవల తెలుగు సాహిత్యంలో దీపస్తంభంలా నిలబడి దిక్దర్శనం చేయించడంతో పాటు శిష్ట నాగరిక సమాజపు కళ్లు మిరుమిట్లు గొలపుతుందని నిస్సంకోచంగా నమ్మవచ్చు.

'అతడు అడవిని జయించాడు'లో కథా సమయాన్ని రచయిత ఒకానొక సూర్యాస్తమయాన మొదలెట్టి సూర్యోదయానికల్లా ముగిస్తాడు.
ఈ అస్తమయ ఉదయాల మధ్య
పందుల్ని సాకే ఓ అనామక ముసలివాడి బహిరంతర అన్వేషణ,
అడవిలో చిక్కులు చిక్కులుగా ముళ్లుపడి,
మానవ జీవితంలోని అస్తిత్వ సంఘర్షణగా సామాన్యీకరించబడి,
తీగలు తీగలై నిర్నిరోధంగా సాగుతుంది.

గుప్పెడు గంటల వ్యవధిలోనే కొన్ని కఠోర మరణాలు,
యింకొన్ని అదివాస్తవిక జననాలు,
సంక్లిష్ట సందేహాలు,
గుబులు గొల్పే సందిగ్ధాలు,
వెయ్యివెయ్యిగా తలలెత్తే ప్రశ్నలు,
భీతి కలిగించే హింస,
విశ్వం మొత్తాన్ని గుండెల్లో పొదువుకునే అవ్యాజ ప్రేమభావం,
అమాయక వాత్సల్యాలు, విశృంఖలత్వం, విహ్వలత్వం, వైవిధ్యం, మోహం,
గూఢత్వం, మార్మికత్వం, నిష్ఫలత్వం, నిరర్థకత, పాశవికత, నిస్పృహ, నిరీహ -
ముసలివాడి అనుభవంలోకి నిరంతర ప్రవాహంగా ముప్పిరిగొని, అతణ్ణి నివ్వెర పరుస్తాయి.
అతని అంతరంగం ఎక్కడో మొదలయ్యి ఎక్కడో అంతమయ్యే అరణ్యంగా, సిద్ధపరచిన యుద్ధ రంగంగా సాక్షాత్కరిస్తుంది.

..... (-శ్రీనివాస ప్రసాద్‌ రాసిన ముందుమాట 'అధోమానవుడు అధిమానవుడైన వేళ' నుంచి)

..............

ఈ రచయితలోని రసదృష్టి ఎంత పదునైనదో!
పందిలో నందిని సందర్శించ గలిగేడు.
నైచ్యం అనబడే దానిలో ఔన్నత్యం చూడకలిగేడు.
సేయంలో ప్రేయం అనుభూతించాడు.
దీన్నే కురూపపు సురూపం (ది బ్యూటీ ఆఫ్‌ అగ్లీనెస్‌) అంటారు.
రసద్రష్టకు లోకంలో ఏదీ కురూపం కాదు, అంతా సురూపమే.
ఏదీ కునాదం కాదు, అంతా సునాదమే.

( .......... డాక్టర్‌ సంజీవదేవ్‌ రాసిన చివరిమాట 'సింహావలోకనం ' నుంచి)

...........

డాక్టర్‌ కేశవరెడ్డి చిత్తూరు జిల్లాలోని తలుపులపల్లిలో 1946 మార్చి 10న పుట్టారు.
తిరుపతిలో పి.యు.సి., పాండిచ్చేరిలో ఎం.బి.బి.ఎస్‌. చేశాక నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి విక్టోరియా మెమోరియల్‌ ఆసుపత్రిలో స్కిన్‌ స్పెషలిస్ట్‌గా కుష్టురోగులకు సేవలందించారు.

ప్రస్తుతం నిజామాబాద్‌లో వుంటూ ఆర్మూరులో వైద్య సేవలు అందిస్తున్నారు.
కుష్టు వ్యాధిపై వీరు రాసిన పరిశోధనా పత్రాలు పలు జాతీయ, అంతర్జాతీయ మెడికల్‌ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.

పాతిక సంవత్సరాలుగా పీడితజన పక్షపాతంతో, దళితుల సమస్యలపట్ల సానుతాపంతో రాయలసీమ గ్రామీణ జీవిత సంఘర్షణే ఇతివృత్తంగా రచనా వ్యాసంగాన్ని కొనసిగిస్తున్నారు.

బానిసలు,
భగవానువాచ,
ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌,
స్మశానం దున్నేరు,
అతడు అడవిని జయించాడు,
రాముడుండాడు రాజ్జిముండాది,
మునెమ్మ,
మూగవాని పిల్లన గ్రోవి,
చివరి గుడిసె,
సిటీ బ్యూటిఫుల్‌
వీరి రచనలు.

అతడు అడవిని జయించాడు నవలను నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ వారు 14 భారతీయ భాషల్లోకి అనువదించారు.
ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌ నవల మరాఠీలోకి అనువాదమైంది.

తన రచనా స్పర్శతో బాధల గాయాలు స్పృశించి,
హృదయాలను తేలకి పరచటం,
అనివార్యమైన జీవిత పోరాటానికి ఉపక్రమించపజేయటమే
తన లక్ష్యమని వినమ్రంగా చెప్పే వీరిది వర్ణాంతర, మతాంతర వివాహం.
కొడుకూ, కూతురూ సంతానం.
..............

అతడు అడవిని జయించాడు
- డాక్టర్‌ కేశవరెడ్డి


(ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో 1984లో ధారవాహికగా వెలువడింది).
ప్రథమ ముద్రణ: నవోదయ పబ్లిషర్స్‌, విజయవాడ, 1985

హెచ్‌.బి.టి. ముద్రణ: ఫిబ్రవరి, 2009
ముఖచిత్రం : కాళ్ల

98 పేజీలు, వెల: రూ.40


ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడి మల్కాపూర్‌, హైదరాబాద్‌ 500067
ఫోన్‌ నెం. 040- 2352 1849
.........
ఇ మెయిల్‌:
http://hyderabadbooktrust.blogspot.com

.....................................

Wednesday, March 18, 2009

నూరేండ్ల దళిత చరిత్ర ... - అడప సత్యనారాయణ


ప్రపంచంలో ఏ దేశంలోనూ, ఏ మతంలోనూ లేని కుల వ్యవస్థ భారత దేశంలో వుంది. ప్రాచీన కాలం లో పుట్టి ఇప్పటికీ ఇంకా పెంచి పోషించబడుతున్న అతి భయంకరమైన సామాజిక రుగ్మత ఇది.

ఈ కుల వ్యవస్థలో అతి దారుణంగా అణచివేతకు గురైన నిమ్న కులాల ప్రజలు పంచములుగా, అంటరానివాళ్లుగా అతి దుర్భరమైన, హేయమైన, పశువులకంటే హీనమైన జీవితాలను వెళ్లదీస్తున్నారు.
ఈ అమానవీయ వ్యవస్థకు వ్యతిరేకంగా గతంలో అనేక పోరాటాలు జరిగాయి. చార్వాక, బౌద్ధ, జైన తత్వాలు క్రీ.పూ.5వ వతాబ్దంలోనే కులవ్యవస్థను ఎదురించాయి.

ఎందరో కింది కులాలకు చెందిన తత్వవేత్తలు హిందూ మతంలో వుంటూనే కులతత్వాన్నీ, అంటరానితనాన్నీ నిరసించారు. భక్తి ఉద్యమకారులైన నందనార్‌, చోకమేళ, రవిదాస్‌, కబీర్‌దాస్‌ వంటి వారు బ్రాహ్మణ భావజాలాన్ని కొంతవరకు తట్టుకుని ఎదురు నిలిచినప్పటికీ కుల రక్కసిని నిర్మూలించలేకపోయారు. అయితే వారి కృషి దళిత ఉద్యమాలకు నాంది పలికింది.

హిందూ మతాన్ని ఎదురించి మేం హిందువులం కాము అంటూ అయ్యంకాళి, అయోతిదాస్‌ వంటివారి తత్వాన్ని దళితులు జీర్ణించుకుంటున్న క్రమంలోనే దళిత ఉద్యమాలు ఊపందుకున్నాయి.
మహత్మా జ్యోతీరావు ఫూలే భక్తి ఉద్యమ వారసత్వానికి భిన్నంగా హిందూ ధర్మశాస్త్రాల్ని అవహేళన చేస్తూ నిమ్న కులాలవారి దైన్యాన్ని ఎత్తి చూపుతూ నూతన కుల నిర్మూలనా భావజాలాన్ని నిర్మించారు.

మన రాష్ట్రంలో మొదటి దశలోని ఆది హిందూ, ఆది ఆంధ్ర ఉద్యమాలకు, దళిత ఉద్యమాలకు మూలపురుషుడైన భాగ్యరెడ్డి వర్మ, ఆతరువాత అరిగె రామస్వామి, ఆదెయ్య, శ్యాంసుందర్‌, వెంకట్రావ్‌ లాంటి వారు దళిత జాగృతికి, ఉద్యమ నిర్మాణానికి ఎంతగానో శ్రమించారు. భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన జగన్‌ మిత్ర మండలి హైందవ (వైదిక) ధర్మాన్ని, వర్ణవ్యవస్థను నిరసించి బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేసింది.

గాంధీ ప్రవేశపెట్టిన హరిజనోద్ధరణ, అంటరానితన నిర్మూలన, దళితుల దేవాలయ ప్రవేశం లాంటి కార్యక్రమాలలోని డొల్లతనాన్ని ఆది ఆంధ్ర నాయకులు ఎప్పుడో ఎండగట్టారు. పూనా ఒప్పందం సందర్భంగా గాంధీ - అంబేడ్కర్‌ ల మధ్య చెలరేగిన వివాదం దళితుల్లో కొత్త ఆలోచనా విధానానికి దోహదం చేసింది.

కారంచేడు, పదిరికుప్పం, చుండూరులలో జరిగిన దళిత మారణకాండలోంచి పుట్టిన దళిత మహాసభ దళితుల ఆత్మగౌరవాన్ని తట్టిలేపింది. అనేక ఉద్యమాలు జీవం పోసుకున్నాయి.

ఈవిధంగా గత వందసంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన దళిత ఉద్యమాల స్వభావ, స్వరూపాల్ని ఈ పుస్తకంలో సమగ్రంగా విశ్లేషించడం జరిగింది. మొత్తం దళిత ఉద్యమాలను నాలుగు దశలుగా విభజించి వివిధ దశల్లోని ఉద్యమ స్వభావాన్ని అంచనా వేశారు. ఆది ఆంధ్ర, దళిత మహాసభ, దండోరా ఉద్యమాల పూర్వాపరాల్ని, తాత్వికతను, వాటి ప్రాధాన్యతలను రచయిత సోదాహరణంగా వివరించారు.

ఆచార్య అడపా సత్యనారాయణ ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర శాఖ అధ్యాపకులు.
ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన తర్వాత జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ నుండి యంఫిల్‌ పట్టాను; జర్మనీలోని హైడెల్‌బర్గ్‌ విశ్వవిద్యాలయంనుండి పిహెచ్‌డిని పొందారు.

దళిత బహుజనుల చరిత్రకు సంబంధించిన అంశంపై పోస్ట్‌ డాక్టరేట్‌ స్థాయిలో విశేష కృషి చేసినందుకు గాను ఆయనకు టోక్యో, బెర్లిన్‌, ఆమ్‌స్టర్‌డామ్‌ విశ్వవిద్యాలయాలలో విజిటింగ్‌ ఫెలోషిప్స్‌ లభించాయి. ప్రస్తుతం ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగువారి వలసలు అనే అంశంపై యు.జి.సి. ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు.



ఆంధ్రప్రదేశ్‌లో నూరేండ్ల దళిత చరిత్ర
- అడప సత్యనారాయణ
కవర్‌ డిజైన్‌: వెంకట్‌
ప్రథమ ముద్రణ: ఫిబ్రవరి 2009
45 పేజీలు, వెల: రూ.30

........................
ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడి మల్కాపూర్‌, హైదరాబాద్‌ 500067
ఫోన్‌ నెం. 040- 2352 1849

సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌
12-13-427, స్ట్రీట్‌ నెం. 17, తార్నాక,
సికింద్రాబాద్‌
ఫోన్‌ నెం. 040- 2344 9192

ఇ మెయిల్‌:
http://hyderabadbooktrust.blogspot.com

Tuesday, March 17, 2009

మూలికా వైద్యంతో ఆరోగ్యం ... డాక్టర్‌ జి. లక్ష్మణ్‌రావు



ఉబ్బసం, కడుపులో మంట, నడుంనొప్పి, పార్శ్వపు నొప్పి, వివిధ రకాల తలపోట్లు, చర్మవ్యాధులు, బహిష్టు సమస్యలు, కీళ్ల వాపులు, మూత్రపిండాల్లో రాళ్లు తదితర ఆరోగ్య సమస్యలకు, రుగ్మతలకు మూలికా వైద్యం చక్కటి పరిష్కారాన్ని అందిస్తుంది.

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే రోగులు అ ల్లోపతి వైద్యంతో పూర్తిగా నిరాశ చెందిన తర్వాతే మూలికా వైద్యం వంటి ప్రత్యామ్నాయ వైద్యాన్ని అశ్రయిస్తుంటారు.

మూలికా వైద్యం చాలా నెమ్మదిగా పనిచేస్తుందని, సత్వర రోగ నివారణ అందించలేదని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇది కేవలం అపోహే తప్ప వాస్తవం కాదు. మూలికా వైద్యం అత్యధిక సందర్భాల్లో సత్వరంగానూ, సంపూర్ణంగానూ రోగనివారణ చేస్తుంది. పైగా దీని వలన ఎట్లాంటి దుష్ఫలితాలు (సైడ్‌ ఎఫెక్ట్స్‌) వుండవు.

అమెరికా, కెనడా, బ్రిటన్‌, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మూలికా వైదాయనికి తిరిగి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. మన దేశం నుంచి విదేశాలకు ఏడాదికి దాదాపు 3,000 కోట్ల రూపాయల మేరకు మూలికలు ఎగుమతి అవుతున్నాయి. అద్భుత ఔషధ గుణాలు కలిగిన వనమూలికలను భారీగా విదేశాలకు ఎగుమతి చేస్తున్న మనం మన ప్రజల ఆరోగ్యాభివృద్దికి మాత్రం వాటిని సరిగా వినియోగించుకోకపోవడం విచారకరం.

మన దేశంలో వేదకాలం నుండి ప్రజల ఆరోగ్యాభివృద్ధికి మూలికా వైద్యం ఎంతగానో తోడ్పడింది.
చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటుడు అసమాన వైద్యులుగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ప్రపంచంలో అద్భుతమైనవిగా గుర్తింపు పొందిన వందకు పైగా మూలికలలో 49 మూలికలను భారతీయ వైద్యులు వేలాది సంవత్సరాలుగా వాడుతున్నారు. అదేవిధంగా ప్రంపంచంలో అతి గొప్పవిగా గుర్తించబడిన 30 చైనీస్‌ మూలికల్లో 19 మూలికలను మన దేశీయ వైద్యులు అతి ప్రాచీనకాలం నుంచే వినియోగిస్తున్నారు.

ఔషధ గుణాలలో భారతీయ మూలికలు మిగతా దేశాల మూలికలకన్నా ఎంతో మిన్న అని నిస్సందేహంగా చెప్పవచ్చు. భారతీయ మూలికల్లో ఆస్తమా, మధుమేహం, కీళ్ల వాపులు, నొప్పులు, వెన్నునొప్పి, మానసిక వత్తిళ్లు, నిద్రలేమి, స్త్రీ సంబంధ వ్యాధులకు చక్కటి ఔషధాలు వున్నాయి.
మూలికా వైద్యం గురించి ఈ పుస్తకంలో పొందుపరచిన వ్యాసాలు గతంలో వార్త, ఆంధ్ర జ్యోతి వంటి దినపత్రికలలో ప్రచురించబడ్డాయి.
ఈ పుస్తక రచయిత డాక్టర్‌ జి. లక్ష్మణరావు సివిల్‌ ఇంజనీరు. కొంతకాలం బొంబాయి నుంచి వెలువడే ఓ ఇంగ్లీషు వారపత్రికకు విలేఖరిగా పనిచేశారు. ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్శిటీలో పిహెచ్‌.డి. చేశారు. ఆయన తన సహజ జిజ్ఞాసా మనస్తత్వం వల్ల, అనూహ్యంగా మూలికా వైద్యంలో ప్రవేశించారు.
ఆయనకు ఒకసారి తీవ్రమైన చిగుళ్ల వ్యాధి వచ్చింది. ఒక దంతం పూర్తిగా కదిలిపోయింది. దంత వైద్యుడు దానిని పీకివేసి బ్రిడ్జికట్టక తప్పదని, ఒక వేళ పీకక పోయినా దానంతటదే ఊడి పోవడం తధ్యమని చెప్పారు. కానీ అందుకు ఆయన ఒప్పుకోక సహజ జిజ్ఞాసతో మూలికా వైద్యం వైపు మొగ్గు చూపారు. రోజుకు మూడు సార్లు జామ చిగురాకులు నములుతూ, ఆ రసాన్ని పుక్కిలిస్తూ పదిరోజుల్లోనే పూర్తిగా శాశ్వతంగా నయం చేసుకోగలిగారు. అదే ఆయన మూలికా వైద్యంలో ప్రవేశించడానికి నాంది అయింది.

ఆనాటి నుంచీ ఆయన మూలికా వైద్యంపై సునిశతమైన పరిశోధనలు చేస్తూ, ప్రాచీన గ్రంథాలను కూలంకషంగా అధ్యయనం చేస్తూ వివిధ పత్రికలలో అనేక పరిశోధనాత్మక వ్యాసాలను ప్రచురించారు. పాఠకుల సౌలభ్యం కోసం ఎంతో శ్రమ తీసుకుని వివిధ మూలికల చిత్రాలను కూడా సమకూర్చారు. సాధారణ జబ్బులతో పాటు తీవ్ర ఆరోగ్య సమస్యలను కూడా అతి తక్కువ ఖర్చుతో నయం చేసుకునే మార్గాలను సూచించే ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ తప్పక చదవాలి.

మూలికా వైద్యంతో ఆరోగ్యం
- డాక్టర్‌ జి. లక్ష్మణ్‌రావు
235 పేజీలు, వెల: రూ.180/-


ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడి మల్కాపూర్‌, హైదరాబాద్‌ 500067
ఫోన్‌ నెం. 040- 2352 1849


ఇ మెయిల్‌:
hyderabadbooktrust@gmail.com

............................

Thursday, March 12, 2009

కేరళ సామాజిక తత్వవేత్త శ్రీ నారాయణ గురు పుస్తకం పై పుస్తకం లో పుస్తక సమీక్ష



పుస్తకం డాట్ నెట్ లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన " కేరళ సామాజిక తత్వవేత్త శ్రీ నారాయణ గురు " అనే పుస్తకాన్ని సమీక్షించారు.
పుస్తకం డాట్ నెట్ యు ఆర్ ఎల్ :
http://pustakam.net/?p=610

సమీక్షకులకు, పుస్తకం డాట్ నెట్ వారికీ మా ధన్యవాదాలు .
.................


some Quotations about Sri Narayana Guru:

'శ్రీనారాయణ గురు ఉద్యమం ప్రయోజనకరమైన, ఆధ్యాతిక ఉద్యమం. ఆయన ప్రజల జీవన పరిస్థితులను, సామాజిక అవసరాలను గుర్తెరిగిన క్రియాశీల జ్ఞాని, ధార్మిక మేధావి.''
............................................. సుప్రసిద్ధ ఫ్రెంచ్‌ రచయిత రోమా రోలాండ్‌

''నేను ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో పర్యటిస్తూ వస్తున్నాను. నా పర్యటన సందర్భంగా ఎందరో యోగులను, మహర్షులను కలుసుకునే అవకాశం లభించింది. అయితే కేరళకు చెందిన స్వామీ శ్రీ నారాయణ గురును మించిన గొప్ప ఆధ్యాత్మిక తత్వవేత్త నాకు ఎక్కడా తారసపడలేదని నిజాయితీగా ఒప్పుకుంటున్నాను''
............................................. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

''శోభాయమానమైన తిరువాన్కూరు రాష్ట్రంలో పర్యటించడం, పూజ్యులైన యోగి శ్రీ నారాయణ గురు స్వామి త్రిప్పదంగల్‌ వారిని కలుసుకోవడం నా జీవితానికి లభించిన మహద్భాగ్యంగా భావిస్తున్నాను.''
............................................. మహత్మా గాంధీ

''ఈళవ కులస్థుల (వెనుకబడిన కులం) ఆధ్యాత్మిక నాయకుడైన శ్రీ నారాయణ గురు కేరళలోని రైతాంగాన్ని, భూమిలేని వ్యవసాయదార్లను ప్రప్రథమంగా సమీకరించి, జాగృతపరచి వారిని ప్రజాస్వామ్య ఉద్యమంలో భాగస్వాములను చేశాడనే విషయాన్ని మనం తప్పక గుర్తించవలసి వుంటుంది.''
............................................ ఇ.ఎం.ఎస్‌. నంబూద్రిపాద్‌

Tuesday, March 10, 2009

పుస్తక ప్రేమికులకు శుభవార్త

ఎ వి కే ఫౌండేషన్ వారి ద్వారా హెచ్ బి టి పుస్తకాలు సులువుగా పొందవచ్చు

విదేశాలలో వున్నవారు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పుస్తకాలను ఇకనుంచి ఎ వి కే ఫౌండేషన్ వారి ద్వారా సులువుగా సరసమైన ధరలకే పొందవచు. ప్రస్తుతం వారి వద్ద హెచ్ బి టి ప్రచురించిన ౬౦ కి పైగా పుస్తకాలు లభిస్తున్నాయి. త్వరలో మేము ప్రచురించిన అన్ని పుస్తకాలను వారి ద్వారా అందించేందుకు ఏర్పాటు చేస్తున్నాము.
ఎ వి కే ఫౌండేషన్ వారి వెబ్ సైట్ చిరునామా:
http://www.avkf.org/

Sunday, March 8, 2009

ఆదివారం ఆంధ్రజ్యోతి లో " ఇట్లు ఒక రైతు"



ఈరోజు ఆదివారం ఆంధ్రజ్యోతి లో గొర్రె పాటి నరేంద్రనాథ్ రచన " ఇట్లు ఒక రైతు " పై పుస్తక సమీక్ష వెలువడింది. శ్రీ వి. శ్రీనివాస్ చేసిన ఆ సమీక్ష లింకు ఇక్కడ పొందుపరుస్తున్నాము.

http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=2009/8-3/newbooks


"....ఈ పుస్తకాన్ని పడక కుర్చీలో కూర్చుని తీరికగా చదువుదామంటే కుదరదు.. మధ్యలో ఉలిక్కిపడి లేచి అటూ ఇటూ అసహనంగా తిరగడం తధ్యం. పుస్తకం లో ఆయన ఇచ్చిన డాటా కూడా సాధారణమైంది కాదు.

ప్రజలకు రెండు రూపాయల కిలో బియ్యం చేకూర్చిన నష్టం.... తిండి గింజలను ధ్వంసం చేస్తున్న బయో ఇంధనాలు....విద్యుత్ ఉద్యమాల నేపధ్యం .... కుల వ్యవస్థపై మెదడును కదిలించే వ్యాఖ్యానాలు .... ఇట్లు ఒక రైతు ను జీవధారగా మార్చాయి.
వినయంతో ఆయన తన ఆత్మా కథకు ఆ పేరు పెట్టుకున్నా ఒక రైతు జీవితం కంటే చాలా చాలా ఎక్కువే ఉంది. ఇందులో రైతులూ, కానివాళ్ళూ కూడా దీన్నించి తెలుసుకోగలిగిన విషయాలు చాలా వున్నాయి. "

- వి. శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతి )


సహ బ్లాగర్లకు ఒక విజ్ఞప్తి :
ఈనాడు, ఆంధ్రజ్యోతి , సాక్షి తదితర దినపత్రికల లోని తెలుగు ఫాంటులను యునీ కోడు ఫాంటు లోకి మార్చే సౌలభ్యం ఏమైనా వుంటే తెలియజేయండి ప్లీజ్.

...........................
..........

Thursday, March 5, 2009

ఆనాడు 'సాక్షి'లో ప్రచురణకాని ఒక అభిప్రాయం!


మునెమ్మ నవలపై జరిగిన చర్చ -
నన్నెందుకు కాత్యాయని కులం పేరుతో దూషించాలి?
ఆనాడు 'సాక్షి'లో ప్రచురణకాని ఒక అభిప్రాయం!


అక్టోబర్‌ 13వతేది (2008) సాక్షి రెండో పేజీలో అమానుషమైన ఫొటో ఒకటి వచ్చింది. ఫొటోని ఎంపికచేయడంలోని అమానుషత్వమది!
బెర్లిన్‌లో జరిగిన డబ్ల్యూబీసీ హెవీ వెయిట్‌ బాక్సింగ్‌ పోటీల్లో నైజీరియా బాక్సర్‌ శామ్యూల్‌ పీటర్‌ ముఖంపై ఉక్రెయిన్‌ బాక్సర్‌ వితాలికిష్కో ఇచ్చిన 'పంచ్‌' ఫొటో అది. అడ్డంగా, పేజీలో సగభాగం వున్న ఈ కలర్‌పోటోకి ఇచ్చిన రైటప్‌, హెడ్డింగ్‌ అంతకన్నా అమానుషంగా వున్నాయి.
''మొహం పచ్చడి'' అనేది హెడ్డింగ్‌!
''ఈ పోటీలో కిష్కోనే విజేత అని ఈ పంచ్‌ చూసిన తర్వాత కూడా చెప్పాల్సిన అవసరం లేదన్నది'' రైటప్‌!!
రెండు రోజులు అన్నం తినలేకపోయాను!

అదేరోజు నాలుగో పేజీలో ఇంకో 'పంచ్‌'!
మొదటి పంచే నయమనిపించే 'పంచ్‌' అది!!
కాత్యాయని అనే వ్యాసకర్త, డాక్టర్‌ కేశవరెడ్డి అనే రచయితను కండలు తెగిపడేలా కొడుతూ కనిపించారు.
ఆ కొట్టడం ఎలా వుందంటే - కేశవరెడ్డి నవల ''మునెమ్మ''లో జయరాముడు బొల్లిగత్తను కొట్టినట్లుగా వుంది.
మునెమ్మ ను చదివాక ఆ కోపం తట్టుకోలేకపోయిన కాత్యాయని - ''రాసేవాళ్లకు చదివేవాళ్లు లోకువా?'' అని అడుగుతూ కేశవరెడ్డిని వెంటబడి వెంటబడి కొట్టినట్లుగా వుంది.

పాఠకుల సంక్షేమం గురించి ఎంచేతనో ఈ మధ్య కథా విమర్శకులు, నవలా సమీక్షకులు అమితంగా ఆందోళన కనబరుస్తున్నారు!
ఇటీవల 'దర్గామిట్ట' సాహితీవేత్త మహమ్మద్‌ ఖదీర్‌బాబు ఇలాగే కలతచెంది ''పాఠకులు క్షమించలేని కథలు'' అంటూ సాక్షిలోనే ఏదో రాశారు. చాలా తెలివిగా రాశారు. పాఠకుడిగా నేను చేస్తున్న ఈ విమర్శ కథకుడిగా నాక్కూడా వర్తిస్తుంది'' అని రాశారు.

కాత్యాయని మాత్రం - సమీక్షో,. విమర్శో తెలియని తన వ్యాసంలో కనీసం అ లాంటి తెలివితేటల్ని కూడా ప్రదర్శించలేకపోయారు!
'గొప్ప' ని సింగిల్‌ కోట్స్‌లో పెట్టి కేశవరెడ్డిని గొప్ప రచయిత అని ఆవిడ అన్నారు.
కొంచెం వ్యంగ్యం కూడా జోడించి - స్త్రీల సమస్యలపై సానుభూతితో కేశవరెడ్డి 'మునెమ్మ' ను రాశారు అన్నారు.
ఆయన చుట్టూ భజన బృందాలు వున్నాయనీ, సమర్థకులు ఆయన వెనుక నిలబడి ఆయన శిరస్సు చుట్టూ కాంతి వలయాన్ని గిరగిరా తిప్పుతూ అది పడిపోకుండా పట్టుకున్నారని, కేశవరెడ్డి ''నేను మార్క్సిస్టును'' అని చెప్పుకుంటూ పేద ప్రజలు - దళిత సమస్యలు అనే రెండు చురకత్తులను జేబులో పెట్టుకు తిరుగుతన్నారనీ అన్నారు.
తెలుగు సాహిత్య రంగం ముఠాలుగా, భజన సంఘాలుగా స్థిరపడిపోయిందనీ, పాఠకుల అజ్ఞానం (!) మీదా (ఆశ్చర్యార్థకం ఒక పాఠకుడిగా నేను పెట్టుకున్నది). విమర్శకుల జడత్వం మీదా ఈ రచయితలకు గొప్ప విశ్వాసం అనీ, విమర్శకులు మర్యాదస్తులుగా స్థిరపడిపోయాక, పాఠకులు అసంఘటిత జీవులుగా నిస్సహాయులయ్యాక ఇంతకన్నా గొప్ప వాతావరణాన్ని ఆశించలేమని చెప్పడానికి కాత్యాయని ఇంత పెద్ద తిట్ల కవనం రాసినట్లున్నారు.!

వీటన్నిటితో నాకు పనిలేదు. కాత్యాయని కేశవరెడ్డిని కొడితే కొట్టారు.
ఫెమినిస్టు కవయిత్రి జయప్రభ జుట్టు పట్టుకుంటే పట్టుకున్నారు.
పోస్ట్‌ మోడర్నిస్ట్‌ క్రిటిక్‌ అంబటి సురేంద్రరాజు నిద్ర చెడగొడితే చెడగొట్టారు.
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ను చింపి పోగులు పెడితే పెట్టారు.
బతికున్న యండమూరి వీరేంద్రనాథ్‌ నోట్లో తులసి తీర్థం పోస్తే పోశారు.
కానీ నన్ను! నన్ను!! నన్నెందుకు కాత్యాయని కులం పేరుతో దూషించారు?!
నన్ను తిడితే తిట్టారు.
నా కులం వాళ్లందరినీ ఎందుకు ఇందులోకి లాగారు?

తన బుర్రలో పుట్టిన పర్వర్షన్లను ఒక నిస్సహాయ స్త్రీకి ఆరోపించి చవకబారు పాఠకులను ఆకట్టుకోవాలని కేశవరెడ్డి తపించిపోయారట!
చ-వ-క-బా-రు పాఠకులు!!
ఎస్‌. నేను కూడా ఒక చవకబారు పాఠకుడినే.
చిన్ననాడే అశ్లీల భావాల పట్ల, అశ్లీల సాహిత్యం పట్ల ఆకర్షితుడైనవాడిని.

2003లో మీరు ... మీరంటే మీలోని గొప్పగొప్ప పురుషపుంగవులైన కవులు, రచయితలు అచ్చువేసి సర్క్యులేట్‌ చేసిన అశ్లీల కరపత్ర సాహిత్యాన్ని కూడా ఇష్టంగా చదివి సమానంగా ఆదరించినవాడిని. అదే నా చవకబారు తనమైందా?
మీరేం రాసినా నమ్ముతున్నాం.
మీరేం రాసినా చదువుతున్నాం.
సృజనశీలురు మీరు.
మీ మాటలో వేదాలు వెదుక్కుంటున్నవాళ్లం మేము.

మీకై మీరు రాయడం మానేసి, ఒకళ్ల మీద ఒకళ్లు రాసుకుంటున్నవీ సీరియస్‌గా ఫాలో అవుతున్నాం.
కాసేపు మమ్మల్ని 'తెలివైనవాళ్లు' అంటారు.
కాసేపు 'అజ్ఞానులు' అంటారు.
చవకబారు పాఠకులని కాత్యాయని అంటారు.
పాఠకులు క్షమించరని ఖదీర్‌ బాబు అంటారు.
మా గురించి అన్నీ మీరే అంటారు.
అన్నీ మీరే అనుకుంటారు.
ఏమిటిదంతా?

రాసేవాళ్లకు చదివేవాళ్లు లోకువైనట్లే, రాసేవాళ్లమీద రాసే వాళ్లకి మేము లోకువయ్యామా?
కథకులు, విమర్శకులు చవకబారుగా రాస్తే, చవకబారుగా మాట్లాడితే ... మావంటి చవకబారు మనుషుల్లో కలిసిపోతారు.

- మాధవ్‌ శింగరాజు
(ఒకానొక చవకబారు పాఠకుడు)
16 అక్టోబర్‌ 2008


(మాధవ్‌ శింగరాజు గారి కోరిక మేరకు ఈ అముద్రిత విమర్శని ఇక్కడ యథాతధంగా పొందుపరచడం జరిగింది. ఇది కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయంగానే పరిగణించాలి. - హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌)

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌