Thursday, January 31, 2019

డి.డి.కోశాంబి చరిత్రను పక్కదారి పట్టనివ్వలేదు- కొత్తదారి చూపించారు బి బి సి తెలుగు


 "ప్రాచీన భారత దేశ చరిత్ర పుస్తకం పై బి బి సి న్యూస్ తెలుగు లో ప్రచురించిన పరిచయ వ్యాసం:
https://www.bbc.com/telugu/india-45007924

https://www.bbc.com/telugu/india-45007924

డి.డి.కోశాంబి: చరిత్రను పక్కదారి పట్టనివ్వలేదు.. కొత్తదారి చూపించారు
డి.డి.కోశాంబి.. పరిచయం అక్కర్లేని చరిత్రకారుడు. చరిత్ర రచనను కొత్త దారి పట్టించిన పరిశోధకుడు.
చరిత్ర అంటే రాజులు, రాజ్యాలే కాదు మానవ జీవితాలను మలుపు తిప్పిన పరిణామాలను చూడాలంటూ కొత్త విశ్లేషణా పరికరాలను అందించిన వ్యక్తి.
ప్రాచీన భారత చరిత్రపై ఆయన చేసిన పరిశోధన, నిర్ధరణ అన్నీ అంతకుముందున్న చరిత్ర రచనా పద్ధతులను, సరళిని సమూలంగా మార్చేశాయి. సరికొత్త దారి చూపించాయి.
డి.డి.కోశాంబి ప్రస్తుత గోవాలో 1907 జులై 31న జన్మించారు. ఆయన పూర్తి పేరు దామోదర్ ధర్మానంద్ కోశాంబి. చరిత్రతో పాటు గణితం, విజ్ఞాన, తత్వశాస్త్రాలనూ అధ్యయనం చేసిన ఆయన పదుల సంఖ్యలో పుస్తకాలు రాశారు.
డి.డి.కోశాంబి అభిప్రాయాలతో మానవహక్కుల ఉద్యమకారుడు కె.బాలగోపాల్ రాసిన 'ప్రాచీన భారతదేశ చరిత్ర-డి.డి.కోశాంబి పరిచయం' పుస్తకం నుంచి తీసుకున్న అంశాల సమాహారం మీకోసం.
చరిత్ర పరిశోధనకు ఆధారాలు స్థూలంగా రెండు రకాలు. మొదటిది సాహిత్య ఆధారాలు, రెండోది పురావస్తు ఆధారాలు.
సాహిత్య ఆధారాలంటే మత ధార్మిక, పురాణ తదితర గ్రంథాలు, కాల్పనిక సాహిత్య కావ్యాలు, రాజవంశాల అనువంశిక ఆస్థాన చరిత్రలు, పరిపాలనా సంబంధమైన రికార్డులు మొదలైనవి.
వీటిని అధ్యయనం చేసి గతకాలపు చరిత్రను చరిత్రకారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.
పురావస్తు ఆధారాలంటే గత కాలపు నివాసాలు, దేవాలయాలూ మొదలైన కట్టడాలు, వాడకపు పనిముట్లు, ఆయుధాలు, అలంకార ప్రాయమైన వస్తువులు, కర్మకాండ సంబంధమైన సామగ్రి మొదలైన వాటి అవశేషాలు.
కట్టడాలు సాధారణంగా శిథిలాల రూపంలో దొరుకుతాయి. ఆయుధాలు, పనిముట్లు పురావస్తు తవ్వకాలలో బయటపడతాయి.
ఇవికాకుండా అతిముఖ్యమైన ఆధారాలు రాజులుగాని, వర్తకులు గాని ప్రకటించే శాసనాలు, అచ్చు వేసే నాణాలు వగైరా.
శాసనాలు ఎక్కువగా రాళ్లమీద, దేవాలయాల మీద, సమాధుల మీద చెక్కి ఉంటారు. కాబట్టి పురావస్తు ఆధారాలుగా పరిగణించవచ్చును గాని, చరిత్రకారులు శిలాశాసన ఆధారాలు(epigraphic sources) అనే ప్రయోగం చేయడం చూస్తుంటాం.
మన దేశంలో పురావస్తు పరిశోధన చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. మొదట్లో చరిత్రకారులు ఎక్కువగా సాహిత్య ఆధారాలను ఉపయోగించుకున్నారు. ఇతర దేశాలలాగ మన దేశంలో ప్రాచీన కాలపు రాజవంశాలూ రాజస్థానాలూ తమ వ్యవహారాలను గ్రంథస్థం చేయలేదు.
కాబట్టి వేదాలు, ధర్మశాస్త్రాలు, పురాణాలు, కావ్యాలు మొదలైన మత, సాంస్కృతిక సంబంధమైన గ్రంథాలపై ఆధారపడి వాటి నుంచి ఇక్కడొక వాక్యం, అక్కడొక వాక్యం తీసి చరిత్రను మొత్తం వ్యాఖ్యానించేవారు.
పదాల సారూప్యాన్ని బట్టి అలవాట్ల సారూప్యాన్ని, మాటల పోలికను బట్టి కొన్ని శతాబ్దాల చరిత్రనూ 'నిరూపించడం' అలవాటైంది.
పురాణాలలో ఇచ్చిన రాజవంశాల పట్టికలనూ, కథలనూ ఉన్నదున్నట్లుగా స్వీకరించి చరిత్రను వ్యాఖ్యానించారు.
ఈ పద్ధతిని కోశాంబి తీవ్రంగా విమర్శించారు. బాలగంగాధర్ తిలక్ రుగ్వేదంలోని నాలుగు పదాల వాక్యం ఒకటి తీసుకొని ఆర్యులు ఉత్తర ధ్రువం నుంచి వచ్చారని నిర్ధారించిన వైనాన్ని కోశాంబి 'అద్భుతమైన వక్రీకరణ'గా వర్ణించాడు.
శాసన సాహిత్య ఆధారాలను పురావస్తు ఆధారాలతో సమన్వయపరచనిదే చరిత్ర పరిశోధన శాస్ర్తీయం కాదన్న అభిప్రాయాన్ని కోశాంబి పదేపదే వ్యక్తం చేశారు.
పురావస్తు ఆధారాలను పట్టించుకోకుండా కేవలం ప్రాచీన సాహిత్యాన్ని ఆధారం చేసుకుని ఊహాగానాలు చేసే చరిత్రకారులు కోశాంబి చేతిలో చాలా తీవ్రంగా విమర్శకు గురయ్యారు.
పౌరాణిక గాథల నుంచి(అంటే బ్రాహ్మణుల పురాణాలే కాదు, పోచమ్మ, గంగమ్మ మొదలైన గ్రామదేవతల గురించి జనంలో ప్రచారంలో ఉన్న గాథలు కూడా) చరిత్రను అర్థం చేసుకునే ప్రయత్నం కోశాంబి పెద్దఎత్తునే చేశారు.
నిజానికి ఆయన చేసిన పరిశ్రమలో ఇది అత్యంత ముఖ్యమైన భాగం. అయితే, ఎక్కడికక్కడ తన అభిప్రాయాలను పురావస్తు మూలాలతోనూ నైసర్గిక స్థితిగతులతోనూ పోల్చి చూసుకోకుండా ఉండలేదాయన.
సంస్కృత భాషలో తమకున్న పాండిత్యాన్ని ఆసరా చేసుకుని కొందరు పాశ్చాత్యులు కేవలం పద విశ్లేషణ(philological analysis)తో చరిత్రను నిర్ధారించడానికి చేసిన ప్రయత్నాన్ని ఆయన ఖండించారు.
కానీ, సాహిత్య పురావస్తు ఆధారాలను రెండింటినీ సమన్వయపరచి వాడుకున్నా, మన దేశ చరిత్రను పునర్నిర్మించుకోవడానికి అది సరిపోదని కోశాంబి గుర్తించారు.
మన దేశంలో పురావస్తు పరిశోధన చాలా అపరిణతంగా ఉంది. సాహిత్య ఆధారాల విషయంలో కూడా ఇతర దేశాలతో పోలిస్తే మన దేశం పరిస్థితి చాలా అసంతృప్తికరమైనది.
మన ప్రాచీన సాహిత్యంలో లౌకిక సాహిత్యం దాదాపు మృగ్యం. ముస్లింలకు పూర్వం ఏ రాజవంశమూ తన చరిత్రను రాసుకోలేదు, రాయించలేదు. రాజాస్థానాలు ఏ విషయాలలోనూ రికార్డులు నిర్వహించలేదు.
మన దేశ లిఖిత చరిత్ర మొత్తం పురాణాలతో కలిసిపోయి పౌరాణిక గాథలు, ఉపాఖ్యానాల రూపంలో మిగిలింది. ముస్లిం రాజులకు పూర్వం ఏ ఒక్కరి జన్మ సంవత్సరం గానీ ఏ ఒక్క గ్రంథం రాసిన సంవత్సరం కానీ కచ్చితంగా చెప్పలేం. ఒక రాజు పరిపాలించిన ప్రాంతమేమిటో ఇదమిత్థంగా నిర్ణయించలేం. ఒక్కోసారి ఒక సంఘటన ఏ శతాబ్దంలో జరిగిందో కూడా చెప్పలేం.
''ఒక్కో గ్రంథానికి రచయిత ఒకరున్నారని చెప్పగలం. కొన్నిటికి అదికూడా సాధ్యం కాదు'' అంటారు కోశాంబి.
మన దేశాన్ని ఏలిన వాళ్లెవ్వరూ తమ జీవితాలను కానీ, పరిపాలనా వ్యవహారాలను కానీ గ్రంథస్థం చేసే ప్రయత్నం చేయలేదు. అశోకుని శాసనాలు అరుదైన మినహాయింపు. తరువాత కాలంలో ఒక్క భూదానాలను మాత్రమే శాసనాలలో ప్రకటించారు
భారతీయ సంస్కృతి ప్రత్యేకత భిన్నత్వం కాదు అవిచ్ఛిన్నత
మరైతే మన దేశ చరిత్ర రాయడం అసాధ్యమా అన్న ప్రశ్న వస్తుంది. అసాధ్యం కాదు.
ఎందుచేతనంటే వేరే ఏ ఇతర దేశానికీ లేని ఒక గొప్ప సౌకర్యం భారత దేశ చరిత్రకు ఉంది. అదేమిటంటే గతం యొక్క భౌతిక అవశేషాలే కాకుండా సామాజిక సాంస్కృతిక అవశేషాలూ సమాజం పొరలలో భద్రంగా ఉండడం.
అపారమైన భిన్నత్వ భారతీయ సంస్కృతి ప్రత్యేకత అని చాలామంది భావిస్తారు కానీ నిజమైన ప్రత్యేకత భిన్నత్వం కాదు, అవిచ్ఛిన్నత అంటారు కోశాంబి.
గతంలో జరిగిన సామాజిక మార్పులన్నీ తమ ముద్రను మన సమాజం మీద వదిలాయి. వాటి నుంచి చరిత్రను చదవవచ్చుననీ ఆ సౌకర్యాన్ని భారత చరిత్రకారులు వాడుకోవాలనీ అంటాడు.
ఈ అవశేషాలను రెండు రకాలుగా చూడొచ్చు.
ఒకటిమన సామాజిక చరిత్రలో ఏ మార్పూ సంపూర్ణంగా రాలేదు. 5 వేల ఏళ్ల పూర్వం మన దేశంలో అందరూ ఆహార సేకరణ మీద ఆధారపడ్డ సంచార జీవులే. అంటే దొరికిన ఆహారాన్ని ఏరుకుని(లేదంటే వేటాడి) తింటూ స్థిర నివాసం లేకుండా సంచరిస్తూ ఉండేవారు.
ఆ తరువాత క్రమంగా ఆహార సేకరణ మాని ఆహారాన్ని ఉత్పత్తి చేయడం అలవర్చుకున్నారు. కానీ, 5 వేల ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆ మార్పు పూర్తికాలేదు. ఆహార సేకరణ మీద ఆధారపడ్డ ఆటవిక తెగలు ఇంకా మిగిలే ఉన్నాయి.
ఆ తరువాత వచ్చిన అన్ని మార్పులూ ఇంతే. నాగలితో వ్యవసాయం చేయడం, ఇనుప పనిముట్ల వాడకం, స్థిర నివాస గ్రామీణ జీవనం, భూమిపైన వ్యక్తి యాజమాన్యం, సాంస్కృతిక రంగంలో అనాగరిక జంతుబలుల స్థానంలో నాగరిక పూజా విధానం- ఏ మార్పూ కూడా పూర్తిగా రాలేదు. అన్నింటిలోనూ పాత వ్యవస్థను ఇప్పటికీ మిగుల్చుకున్న ప్రజలున్నారు.
రెండోదిమార్పు వచ్చిన చోట కూడా కొత్త వ్యవస్థ పాత వ్యవస్థను పూర్తిగా నాశనం చేయకుండా - కొత్త రూపంలో ఒక్కోసారి అభావ రూపంలో-తనలో ఇముడ్చుకుంది.
చారిత్రకంగా ఉన్నతమైన వ్యవస్థ చారిత్రకంగా వెనుకబడిన వ్యవస్థపైన విజయాన్ని సాధించినా ఓడిపోయిన సమాజం ఆచార వ్యవహారాలపైన తన ముద్ర వేసి తనకు లోబరచుకుని, తనలో చేర్చుకుంది. గతం ఉన్నదుదన్నట్లుగా మిగిలిపోని చోట కూడా పరిణత రూపంలో మిగిలిపోయింది. ఈ అపరిణత రూపంలో గత కాలపు ఛాయలే కాకుండా అది లొంగిపోయిన క్రమం ఛాయలు కూడా ఉంటాయి. గతాన్ని ఇంతగా మిగుల్చుకున్న దేశం మరొకటి లేదు.
ఈ సామాజిక అవక్షేపాలను చరిత్ర పరిశోధనకు ఒక ప్రబలమైన ఆధారంగా గుర్తించడం కోశాంబి ప్రత్యేకత. చరిత్ర పరిశోధనా పద్ధతిలో ఆయన సాధించిన ఆవిష్కరణగా దీన్ని భావించాలి.
తరచుగా ఆయన సాహిత్య ఆధారాలనైనా ఈ స్పష్టాస్పష్టమైన అవక్షేపాలను గుర్తించడం కోసమే పరిశీలిస్తాడు. ఈ విధంగా గుర్తించిన అవక్షేపాలను తిరిగి సాహిత్య పురావస్తు ఆధారాలతో సమన్వయపరిచి చారిత్రక విషయాలను నిర్ధారిస్తాడు.
ఈ దృష్టి కోశాంబికి ఎంతగా అలవాటైందంటే మన పట్టణాలలోని అస్తవ్యస్తమైన రహదార్లలో కూడా ఆయనకు ఆ పట్టణాల పుట్టుకే కనిపిస్తుంది.
హరప్పా, మొహెంజోదారో తరువాత మన దేశంలో ఏ పట్టణమూ ఒక నమూనా ప్రకారం నిర్మించింది కాదని, అన్నీ కూడా కొన్ని సమీప గ్రామాల కలయికగా ఏర్పడినవేనని, పట్టణాల రహదార్లన్నీ ఒకప్పటి పల్లెలను కలిపిన బాటలు కావడం వల్లే అంత అస్తవ్యస్థంగా ఉంటాయని అంటారు.

కోశాంబి దృష్టిలో చరిత్ర అంటే..

§  ''చరిత్ర అంటే మహారాజులు, మహాసంగ్రామాల పట్టిక మాత్రమే అయితే భారతదేశ చరిత్ర రాయడం అసాధ్యం. ఒక ప్రాంతానికి రాజు ఎవరు అనే ప్రశ్న కంటే ఆ ప్రాంతం ప్రజలకు నాగలి వాడకం తెలుసునా లేదా అన్నదే ముఖ్యమైన ప్రశ్న అయితే భారతదేశానికి కచ్చితంగా ఒక చరిత్ర ఉంది. దాన్ని రాయడం కూడా సాధ్యమే'' అన్నది కోశాంబి అభిప్రాయం.
§  ''ఉత్పత్తి శక్తులలోనూ, ఉత్పత్తి సంబంధాలలోనూ క్రమానుసారంగా వచ్చే మార్పులను కాలానుగతంగా వివరించడం చరిత్ర'' అని నిర్వచిస్తారు కోశాంబి.
§  తన దృక్పథం గతితార్కిక భౌతికవాదమనీ, దానికే మార్క్సిజం అంటారనీ చెబుతూ.. అయితే, ఇది ఎంతమాత్రమూ నియతివాదం కాదని కోశాంబి హెచ్చరిస్తారు.
§  ''చరిత్రను పురోగామి స్వభావం ఉన్నదిగా మార్క్సిజం భావిస్తుంది. అంటే ఉత్పత్తి సామర్థ్యంలో వెనుకబడిన దశ నుంచి అభివృద్ధి చెందిన దశకు చరిత్ర పురోగమిస్తుందని, అయితే, ఇది చరిత్రను మొత్తంగా.. అంటే విశాలం భౌగోళిక ప్రాతిపదికన చూసినప్పుడు మాత్రమే. ఒక పరిమితమైన ప్రాంతంలో చరిత్రను పరిశీలిస్తే చరిత్ర చాలాకాలం పురోగమించకుండా కరడుగట్టిపోవడం, ఒక్కోసారి తిరోగమించడం కనిపిస్తుంది.
మనదేశ చరిత్రలో ఇలాంటి ప్రముఖ ఉదాహరణ ఉంది. ఆర్యుల కంటే సింధు నాగరికత ప్రాచీనమైనదప్పటికీ అదే ఆర్థికంగా పైదశలో ఉండింది. సింధు నాగరికతలో నాగలి వాడకం తెలియకపోయినా తేలిక వ్యవసాయ పద్ధతులతో చెప్పుకోదగ్గ అదనపు ఉత్పత్తిని సాధించి పట్టణాలు నిర్మించారు.
వాళ్ల తరువాత వచ్చిన ఆర్యులకు తొలి రోజులలో వ్యవసాయం కానీ పట్టణ నాగరికత కానీ తెలియవు. వాళ్లు పశుపోషణపై ఆధారపడ్డ సంచార జీవులు'' అని కోశాంబి సూత్రీకరిస్తారు.

గోదావరి తీరానికి ఇనుము ఎప్పుడు పరిచయమైంది?

* ఇనుము వాడకం, వ్యవసాయం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి దక్షిణాపథం మీదుగా గోదావరి తీరానికి చేరిందన్నది కోశాంబి అభిప్రాయం.
* గ్రామీణ స్వయంపోషకత్వానికి ఫలితంగా శ్రమ విభజన పెరిగి అనేక వృత్తులు పుట్టుకొచ్చాయని సూత్రీకరిస్తారు కోశాంబి. ఇది క్రీస్తు శకం 2వ శతాబ్దం తరువాత పరిణామంగా ఆయన చెబుతారు.
* క్రీ.శ. 9వ శతాబ్దం తరువాత సామంతస్వామ్యం నుంచి గ్రామీణ భూస్వామ్యం అనే దశ మొదలైందని కోశాంబి అభిప్రాయపడతారు.

(కర్టెసీ: హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ, కె.బాలగోపాల్ రాసిన 'ప్రాచీన భారతదేశ చరిత్ర - డి.డి.కోశాంబి పరిచయం')

ప్రాచీన భారతదేశ చరిత్ర డి. డి. కోశాంబి పరిచయం 
- కె. బాలగోపాల్‌
పేజీలు 196, వెల : రూ. 80/-



కినిగే డాట్ కాం లోఇప్పుడు ఈ పుస్తకం " E BOOK"  రూపం లో లభిస్తోంది:
ఇక్కడ క్లిక్ చేయండి:


హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌