Saturday, September 26, 2009

''బ్రాహ్మణ కులం దేవతల నుంచి, శూద్రకులం అసురుల నుంచి పుట్టాయి.''

దశావతారాలు పుస్తకంపై వచ్చిన విమర్శకు డా.విజయభారతి గారి వివరణ.

పురాణాలు కులవ్యవస్థ:2, దశావతారాలు పుస్తకంపై వెంకటరమణ గారు గత ఏప్రిల్ లో ఈ కిందివిధంగా కామెంట్‌ చేశారు. (పుస్తక పరిచయం కోసం ఇక్కడ నొక్కండి.)

>>>>>''అసురులు'' అంటే రాక్షసులు అని అర్థం. శూద్రులు అని నేను ఎప్పుడూ వినలేదు. మీరు చెప్పినదాన్ని బట్టి శూద్రులందరూ రాక్షసులు అని అర్థం వస్తుంది. దీనికి మీ వివరణ ఏమిటి? దయచేసి మీ ఇష్టం వచ్చిన అర్థంతో వ్రాసి విద్వేషాలను పేన్చకండి.

దశావతారాలలో డార్విన్‌ సిద్ధాంతాన్ని వెతికిన వారిని చూశాను కానీ, ఇలా కులతత్వాన్ని వెతికిన వారిని చూడటం ఇదే మొదటిసారి. విజయభారతి గారి నూతన కోణానికి వందనాలు.<<<<<<

దీనిపై డా.విజయ భారతి గారు యిచ్చిన సమాధానమిది.
కొంత ఆలస్యమైనందు వల్ల ఇక్కడ విడిగా పొందుపరుస్తున్నాము. :


'' బ్రాహ్మణ కులం దేవతల నుంచి, శూద్రకులం అసురుల నుంచి పుట్టాయి'' అని మూయిర్‌ సంస్కృత గ్రంథాలు 1, పుట.12 ఆధారంగా డా|| బి.ఆర్‌ అంబేడ్కర్‌ చెప్పారు (చూ. డా|| అంబేడ్కర్‌ ప్రసంగాలు
తెలుగు అనువాదం సంపుటి 4.పే 273).

కులవ్యవస్ధ ఆవిర్భావం గురించి పురాణాలలోనూ బ్రాహ్మణాలలొనూ ఉన్న ఎన్నెన్నో కధనాలు చెబుతూ ఆయన పై దాన్ని కూడా చెప్పారు.

'అసుర' పదాన్ని మొదట్లో దేవ, దానవ, దైత్య జాతులన్నింటికీ కలిపి వాడేవారు. వరుణుడు, సూర్యుడు మొదట్లో అసురులు గానే వేద మంత్రాలలొ పేర్కొనబడ్డారు. తర్వాతి కాలంలో వేర్వేరు అర్థాలలో ఈ పదాలు వాడారు. ప్రత్యేకించి నాగులనూ, యక్షులనూ రాక్షసులుగా పేర్కొన్నారు.

తెలుగుమాట్లాడే ప్రాంతాలలోనివారంతా నాగజాతి వారనీ, వారిని రాక్షసులుగా పిలిచేవారనీ హిస్టరీ కాంగ్రెస్‌ వారి పరిశీలనలు తెలుపుతున్నాయి. పురాణాలలో వీరిని దేవ బ్రాహ్మణ వర్గాలు తమకంటే తక్కువ వారిగా అద్విజులుగా చూశారు. కులవ్యవస్ధలో మనువు శూద్రులకు ఉపనయనం వంటి సంస్కారాలు చెప్పలేదు. వారు అద్విజులే. ద్విజ, అద్విజ భేదాలు అనంతర కాలంలో ఏర్పడ్డాయి .

ఆంధ్రులు/తెలుగువారు నాగ జాతీయులు, వారిని రాక్షసులు అనేవారు అని ఆంధ్రప్రదేశ్‌ హిస్టరీ కాంగ్రెస్‌ వారు నిర్ధారించారు.

- విజయభారతి


......

Wednesday, September 9, 2009

బషీర్ కథలు - వైక్కం మొహమ్మద్‌ బషీర్


'' దాదాపు వెయ్యేళ్లకు ముందునుంచీ ముస్లింలు ఇక్కడున్నారు. కానీ ఎవరూ వారి గురించి రాయలేదు. రాస్తేగీస్తే వాళ్లను ప్రతిసారీ తక్కువ రకం మనుషులుగానే చూపించారు. ఈ దేశంలో ముస్లింలకు రాముడు తెలుసు, రావణుడు తెలుసు. కానీ ఆవలి వైపు నుంచి ఈ అన్యోన్యత లేదు. ఇటువంటి సంస్పందన ఉండాలనే నేను ముస్లిం వాతావరణం నేపథ్యంగా రచనలు చేస్తాను.''
- వైక్కం మహ్మద్‌ బషీర్‌
.... .... ....
వైక్కం మహమ్మద్‌ బషీర్‌ (1908 - 1994) ప్రఖ్యాత మళయాళ రచయిత. తన జీవితకాలంలోనే ఓ 'లెజెండ్‌'లా ఎదిగి విశిష్ట ఆధునిక భారతీయ రచయితగా ప్రపంచ ఖ్యాతిని ఆర్జించారాయన. చిన్న చిన్న కథలు, నవలికల్లోనే సంక్లిష్ట మానవ ఇతివృత్తాలను, వైవిధ్యభరితమైన చిక్కటి జీవితానుభవాలను ఆవిష్కరించే నేర్పు. ఏకకాలంలో పండిత పామరుల్నీ, ఆబాల గోపాలాన్నీ ఆలరించే రచనా చమత్కృతి బషీర్‌ ప్రత్యేకతలు.

మానవతావాదిగా ఆయన సాధించిన విజయపరంపర జగద్వితితం. ముస్లిం జాతీయతావాదిగా కూడా బషీర్‌ రచనలకు అసమాన ప్రాశస్త్యం వుంది. అది నానాటికీ పెరుగుతోంది.

ఆయన రచనలను తెలుగు పాఠకులకు చేరువ చేసే అపూర్వ కథా సంకలనమిది.
.....
ఇందులోని కథలు:

1. ఒక ప్రేమ లేఖ
2. ఏనుగుల దొంగ - బంగారు శిలువ
3. పూవన్‌ బనానా
4. బంగారు ఉంగరం
5. దుడ్డులాఠీ పణిక్కర్‌
6. అమ్మ
7. మోసకారి కూతురు
8. తాయెత్తు
9. విశ్వవిఖ్యాత ముక్కు
10. ఏకాంత తీరం
11. గోడలు
12. ఒకనాటి ప్రేమకథ
13. పుట్టిన రోజు
14. టైగర్‌
15. ఒక మనిషి
16. అవని తల్లికి అసలైన వారసులు
17. అనల్‌ హఖ్‌
18. శబ్దాలు
19. ఏనుగు పిలక
20. పాత్తుమ్మా మేక కథ నేపథ్యం
21. పాత్తుమ్మా మేక

సతీష్‌ పొదువాల్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, కల్చరల్‌ స్టడీస్‌ విభాగం, ఈఎఫ్‌ఎల్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌ ఈ పుస్తకానికి ''ఆధునిక వైతాళికుడికి సమకాలీన పరిచయం'' పేరుతో ముందుమాట రాశారు.
........................

ఈ కథలను తెలుగులోకి అనువదించినవారు:

సి.అనంత్‌
జి.షేక్‌బుదన్‌
విమల
ప్రభాకర్‌ మందార
సి.వనజ
హెచ్చార్కె
పి.సత్యవతి
ఎస్‌.జయ
భార్గవ
కాత్యాయని
ఆకెళ్ల శివప్రసాద్‌
సంధ్య
కలేకూరి ప్రసాద్‌
పట్నం ఉమాదేవి
....................

మధ్య కేరళలోని ఓ మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో 1908లో పుట్టిన బషీర్‌ చాలావరకు తనను తానే రచనకు ముడిసరుకు చేసుకున్నారు. చదువుకుంటున్న రోజుల్లోనే భారత జాతీయోద్యమంలో చేరి ఎన్నోసార్లు జైలుకెళ్లారు. ఆ తర్వాత జర్నలిస్టుగా, తీవ్రవాదిగా, దేశ దిమ్మరిగా, సూఫీ సాధువుగా, హోటల్లో పనిమనిషిగా, మిల్లు కూలీగా, వంటమనిషిగా, హస్త సాముద్రికుడిగా, ట్రావెల్‌ ఏజెంట్‌గా ... ఇంకా ఎన్నెన్నో వృత్తులు చేశాడాయన. ప్రముఖ రచయితగా పేరు గడించిన తర్వాత పుస్తకాల దుకాణం నడిపారు. ఈ సహస్ర వృత్తుల బలం కేవలం బషీర్‌ వ్యక్తిత్వాన్నే కాదు, ఆయన రచనలనూ పదును దేల్చింది. ఆయనను ఎన్నో అవార్డులు వరించాయి. 1970: కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌, 1972: స్వాతంత్య్ర సమరంలో పాల్గోన్నందుకు కేంద్రప్రభుత్వ తామ్రపత్రం,1981: కేరళ సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌, 1982: పద్మశ్రీ పురస్కారం, 1987 కాలికట్‌ యూనివర్సిటీ డిలిట్‌ ప్రదానం. బషీర్ మాత్రం ఇవేమీ పట్టనట్టే వుండేవారు. అదే ఆయన ప్రత్యేకత. బషీర్‌ 1994 జులై 5న కన్నుమూశారు.

బషీర్‌ రచనలను ఎన్నింటినో స్కూళ్లలో పాఠ్యాంశాలుగా చేర్చారు. భారతీయ/కేరళ సాహిత్య చరిత్ర గ్రంధాలన్నింటిలో వీటిని ప్రత్యేకంగా చర్చించారు. విఖ్యాత దర్శకులు పలు సినిమాలుగా కూడా తీశారు. బషీర్‌ ఫొటోలు, చిత్రాలు ఎంతగా జన బాహుళ్యంలోకి వెళ్లిపోయాయంటే కేరళలోని ప్రతి ఒక్కరూ ఆయనను గుర్తు పట్టగలరు . ఆయన మరణించి ఎన్నో ఏళ్లు గడచిపోయినా ఇప్పటికీ 'బేపూర్‌ సుల్తాన్‌'గా (బషీర్‌ ఈ పేరుతోనే లబ్ధప్రతిష్టులు), భారతీయ సాహితీ జగత్తులో అత్యంత సమ్మోహనాత్మక రచయితగా ఎప్పటికీ నిలిచే వుంటారు.
................

బషీర్‌ కథలు
-వైక్కం మొహమ్మద్‌ బషీర్‌

ముఖచిత్రం: శంకర్‌
మొదటి ముద్రణ: ఆగస్ట్‌ 2009

289 పేజీలు, వెల: రూ.100

.....................

ప్రతులకు, వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067

ఫోన్‌: 040 2352 1849

ఇమెయిల్‌: hyderabadbooktrust@gmail.com


.............

కాంక్రీటు కీకారణ్యాల నుంచి పచ్చటి పల్లెలోకి


ఊరు వాడ బతుకు
ఇండియా టు డే
8-9-2009 సంచికలో వెలువడిన సమీక్ష



చెయ్యి పట్టుకుని ఊరంతా చూపిస్తూ ముచ్చట చెబుతున్నట్టుగా సాగే ఓ చక్కని దృశ్య కావ్యం ఈ ఆత్మకథ .
ఊరుచివర మిద్దె. ఇంటి ముందు దొరోరి మోటబావి. బావి గట్టున మర్రిచెట్టు. దాని మధ్య నుండి రెండు తాటిచెట్లు. పక్కన పంట పొలాలు. అటు పనుల కొట్టం, ఆనుకొని గడ్డివాములు, దొడ్లు, పెంట కుప్పలు. ఎదురుగా ఇంకో ఇల్లు లేదు. ఎప్పుడూ ఇంటి ముందు నుండి చెక్కలకు పోయే బండ్లు, పనులు, మేకలు వచ్చిపోయే జనాలు. ఇక మా ఇల్లు తూర్పు వసారాలో రెండు మగ్గాలు ఎదురెదురుగా నడుస్తుండేవి. మా అన్నలిద్దరు మగ్గాలు నేస్తుండేటోళ్ళు, పెద్ద వసారాలో ఓ బల్ల పీట, పెద్ద మనుఘలు కూర్చోటానికని, పక్కన కుంపటి. దాని వెనుకకు వంటిల్లు ప్రక్కకు పోతె పడమటిల్లు, అదే దేవుని అర్ర. దాంట్లో బియ్యం ఉప్పులు పప్పులు ఉండేవి..''

నాగరికత పేరుతో తుడిచిపెట్టుకుపోయిన ఇలాంటి ఊరు, ఇల్లు ఈ రోజుల్లో మచ్చుకైనా కనబడే అవకాశం ఉందంటారా? అందుకే దేవులపల్లి కృష్ణమూర్తి ఆ పచ్చటి పల్లెబాటన, ఆ చల్లటి ఇంటిలోకి తన ఊరు వాడ బతుకు ద్వారా ఆహ్వానం పలుకుతున్నారు.

బాల్యం నుండి యౌవ్వనం దాకా సాగిన తన ఆత్మకథను ఊరు వాడ బతుకు అంటూ ఒక జోలి (ముచ్చట) లాగా చెప్పుకుంటూ పోయిన కృష్ణమూర్తి, డెబ్భై ఏళ్ళ తన జీవితపు కిటికీ లోంచి బాల్యపు ఆనంతారం, యౌవ్వనపు సూర్యాపేటలోకి తలుపులు బార్లా తెరచుకుని తెరలు తెరలుగా కదలివచ్చిన అనుభవ జ్ఞాపకాలను పూనగుచ్చినట్టు అల్లుకుంటూ పోయారు. రచయితగా తనకిది తొలి పుస్తకమే అయినా మంచి చేయి తిరిగిన రరచనా పటిమను కనబరిచారు. కవులకు కళాకారులు, రచయితలతో విస్తృతమైన పరిచరయాలు, ఏ సాహిత్య సమావేశాన్ని వదలకుండా హాజరైన అనుభవం, నిరంతర పుస్తక పఠనం ఆయనకీ పుస్తక రచనలొ బాగా తోడ్పడి ఉండవచ్చు. 'పొద్దు పొడుస్తుంది లేరా అని తల్లి నిద్ర లెనపడంతో మొదలయ్యే ఈ కథ, పద్దెనిమిదో ఏట భార్య కమల తన జీవితంలోకి ప్రవేశించే 'కలికి గాధారి వేళకు ముగుస్తుంది. తాను రాసే విషయం పట్ల పూర్తి అవగాహన, పుస్తక పరిమితి పై పట్టు, చక్కని ప్లాను ఉన్న రచయితకే ఇలాంటి ఎత్తుగడలతో కతను ప్రారంభించి ముగించడం సాధ్యపడుతుంది. ఈ ఊరు వాడ బతుకు కూడా అంతే పకబ్చందీ ప్రణాళికతో రాసిన నవల లాంటి ఆత్మకథ.

1940 నుండి 58 దాకా ఒక ప్రవాహంలాగా సాగే కృష్ణమూర్తి జీవితకథ, వెనుకబడిన తెలంగాణ పల్లెల్లోని అందరి జీవితాలకూ ప్రతీక లాంటిది. ఆయన తన ఊరును పూర్తిగా తనలోకి ఇంకించుకుని మహాప్రదర్శన చేసి చూపుతారు. ఊరు వెంట తనను, తన వెట ఊరును ఉరికించుకుంటూతీసుకెళ్ళే కథన రీతి ఆద్యంతం ఉత్సాహంగా చదివిస్తుంది. చదువుతుంటే ఆ వేగం, ఆ ఉరుకు పాఠకులూ అందుకుంటారు. మీలో ఊరు, ఊరిలో మీరు లాగా ఉంటుంది. ఆత్మకథ కథ అంటే 'ఎట్లా జరిగింది అట్లాగే' అన్న మూస పద్దతిలో కాకుండా మొదలుపెడితే అపకుండా చదివించడంలాంటి నవలా టెక్నిక్‌ కథ ఒడుపుగా నడుస్తుంది.

పైగామనసు,కళ్ళుఅక్షరాలవెంటఉరుకులుపెడ్తుంటే,చెవులకు మధురమైన జానపద గీతాల హోరు వినబడుతుంటుంది. కథ, కథనం మాట పాట, చక్కని స్క్రీన్‌ప్లే అన్నీ ఉన్న ఈ ఊరు వాడ బతుకు 'అపూ చూపు నుంచి రాసిన సత్యజిత్‌ రే పథేర్‌ పాంచాలి' అని వరవరరావు కొనియాడారు.

ఊరు ఊరి పరిసరాలు, ఊళ్ళో ఉండే ఇళ్ళు, వాటి ఆర్కి టెక్చర్‌, కుటుంబాలు, ఆ కుంటుంబాల మధ్య ఉండే సంబంధాలు. వృత్తులు, దొరోరి పెత్తనాలు, ఇతరత్రా కొత్తగా వచ్చిన పరిణామాలు అన్నీ విపులంగా, విస్తారంగా చెప్పుకుంటూ పోతారు రచయిత. ఆ చెప్పడం చెయ్యి పట్టుకుని ఊరంతా తిప్పుతూ ముచ్చట చెబుతున్నట్లుగా ఉంటుంది.

''ఎర్ర మన్నుతో గోడలు పూసి సున్నంతో మూరకో నిలువు గీత గీసే టోళ్ళు కింది భాగాన చుట్టూ అడ్డ గీతచ వీటిని పట్టేలు పెట్టటమంటారు. ఈ పట్టెలు కోడి రెక్కతో గీస్తే అందంగా అమరేవి. మా వదినెలు పండగలకు పబ్బాలకు ఇల్లు అలికి ముగ్గులు పెడ్తే ఎంతో అందంగా ఉండేది. పేడ, పుట్టమన్ను కలిపి ఇల్లంతా అలికితే నున్నగా ఉండేది. తలుపులకు, దర్వాజాలకు జాజు రంగు ఎర్రగా ఉండేది.'' పేదరికంలో నూ ఇలాంటి ఇల్లల్లో జీవనం పచ్చగా ఉండేదో, ప్రజలు ఎంత సంతోషంగా ఉండేవారో తెలంగాణ ప్రాంత ప్రజలు మాట్లాడుకునే భాషలో రాసిన ఈ వివరణాలు అన్ని ప్రాంతాల వారినీ అసక్తిదాయకంగా చదివిస్తాయనడంలో సందేహం లేదు.

బల్లెపీట, దేవుని అర్ర, పటేండ్లు, దర్వులు, ముసుర్లు, పొటుకు పెట్టడం, గిన్నె పండ్లు,తాతీళ్ళు, గాబులు అటిక, ఆట, బెర్ర, దూప, చింతపాల పళ్ళు, కలికి గాంధారి వేళ... లాంటి తెలంగాణ మాండలికంలోని లెక్కకు మిక్కిలి పదాలతో జీవధారలా సాగే ఈ రరచనలో, ''తీరకుంట చేస్తే చాల కుంటాయె, నాభికాడ చల్లబడితే నవాబు కాడ జవాబియ్యొచ్చు, గుడ్డి కొంగకు కొమ్రట్ట దొరికినట్టు'' లాంటి సామెతలు సందర్భశుద్ధితొ పుస్తకమంతా పరచుకుంటవి.

ఇలా తన పల్లె ప్రపంచంలో జరిగే రకరకాల ఆచార వ్యవహారాలు, పండగ పబ్బాలు, జాతర్లు, ప్రదర్శనలు, బాగోతాలు, ఆనాటి నైజాం రజాకార్ల దురాగతాలు, సంఘపోల్ల తిరుగుబాట్లు, కమ్యూనిస్టు నాయకుల ప్రభావం, ఊరి దొరల పలాయనం ఇంకా అనేకానేక సామాజిక విషయాలు కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తూనే బాల్యం నుంచి తాను పెరుగుతున్న క్రమాన్నీ సమానంగా నడుపుకుంటూ వచ్చారు కృష్ణమూర్తి.

నేత కుంటుంబంలో పుట్టినందున అబ్బిన విద్యేమో, దేనికి దాన్ని ఒక పద్ధతి ప్రకారం అల్లుకుంటూ గాడి తప్పని, గాడీగా లేని చక్కని పట్టువస్త్రం నేశారీ సాలాయన. ఈ వస్త్రానికి గొప్పగా అమరిన వెండి జరీ అంచు లక్ష్మణ్‌ బొమ్మలు.తెలంగాణ పునరుజ్జీవనాన్ని మరొక్కసారి కళ్ళముందు అవిష్కరించిన ఈ ఊరు వాడ బతుకుకు కొనసాగింపుగా, కృష్ణమూర్తి 'అసలు జీవితం 'లోకి ప్రవేశించిన కథ మరో భాగంగా రావచ్చు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఊరు వాడ బతుకు
- దేవులపల్లి కృష్ణమూర్తి
ముఖచిత్రం, బొమ్మలు : లక్ష్మణ్‌ ఏలే
మొదటి ముద్రణ: మే 2009
136 పేజీలు, వెల: రూ.40


ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500 067
ఫోన్‌ నెం. 040 2352 1849

ఇమెయిల్‌: hyderabadbooktrust@gmail.com

మా పుస్తకాలని ''ఎవికెఎఫ్‌ బుక్‌ లింక్‌'' వారి ద్వారా (http://www.avkf.org/BookLink/book_link_index.php) కూడా పొందవచ్చు.

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌