Wednesday, December 30, 2015

వ్యవస్థను కాపాడిన రాముడు - డా.బి.విజయభారతి రచన - పునర్ముద్రణ ...

వ్యవస్థను కాపాడిన రాముడు 
- డా.బి.విజయభారతి 


ప్రకృతిలోని రంగులను పరిచయం చేసే పసి వయస్సులోనే -

'' ఏనుగు ఏనుగు నల్లన
ఏనుగు కొమ్ములు తెల్లన
ఏనుగు మీద రాముడు
ఎంతో చక్కని దేముడు...''

అంటూ పిల్లలకు రాముని దైవత్వాన్ని నూరిపోస్తున్న వ్యవస్థ ఇది. చిన్నప్పటి నుంచే వారికి రాముడంటే ఒక ఇష్టం - ఆరాధనా భావం ఏర్పడిపోతాయి.

మత విషయాలను ప్రశ్నించటం పాపం కాబట్టి, రామాయణం చెప్పిన విషయాలను గానీ రామాయణ సంఘటనలను గానీ ఎవరూ ప్రశ్నించరు. ఆలోచించరు. వాటిని నమ్ముతూ ఆదర్శంగా గ్రహిస్తూ వుంటారు.

రామాయణం ప్రవేశపెట్టిన సామాజిక ధర్మాల వల్ల నష్టపోతున్న వారు కూడా అంతే. అలా ఆలోచించటం నేరం అనుకుంటారు. ఈవిధంగా నష్టపోతున్న అధిక శాతం ప్రజల గురించి ఆలోచించేవారు మాత్రమే ఈ సమస్యను విశ్లేషించారు.

ఆధునిక యుగంలో మహాత్మా జోతిరావ్‌ ఫూలే, డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ లు ఈ సామాజిక వ్యవస్థ గురించి తపన పడ్డారు. అసమానతల మూలాలను అన్వేషించే క్రమంలో పురాణాల నేపథ్యాన్ని అధ్యయనం చేశారు.

సమ సమాజం కోసం, మానవతా విలువల కోసం వారు చేసిన అన్వేషణ- అందించిన సమాచారం అనంతర తరాలకు వెలుగు బాటలయ్యాయి.

ప్రాచీన కాలం నుంచీ భారతీయ వేదాంతులు - తత్వవేత్తలు, సంస్కర్తలు - రాజకీయ నాయకులు ఈ సామాజిక ధోరణులను సరిచేస్తున్నామంటూనే ఆ చిక్కుముడులను మరింత బిగిస్తూ వచ్చారు. పురాణాలు - రామాయణ మహాభారతాలు చెప్పిన ధర్మాలను అతిక్రమించే సాహసం చేయలేకపోయారు.

ఈనాటికీ రామాయణం జనంపై ప్రభావం చూపుతూనే వున్నది. ప్రజల జీవనాన్నే కాక దేశ రాజకీయాలనూ, రామాయణ కథాంశాలు నిర్దేశిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రామాయణం గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.

రామాయణం చాలా పెద్ద గ్రంథం. దాన్ని చదవటం కష్టం అనుకునే వారికి రామాయణంలోని అంశాలను పరిచయం చేయటం ఈ రచన లక్ష్యం.
(రచయిత్రి తొలిపలుకుల నుంచి)



వ్యవస్థను కాపాడిన రాముడు 

- డా.బి.విజయభారతి

270 పేజీలు; వెల రూ. 150/-

ప్రతులకు వివరాలకు:

: హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500006

ఫోన్‌ : 040 2352 1849

ఇమెయిల్‌ : hyderabadbooktrust@gmail.com

Tuesday, December 29, 2015

మనుగడ కోసం పోరాటం - ఆంధ్రప్రదేశ్‌ (తెలంగాణ) ఆదివాసులు...రచన: హైమన్‌డాఫ్‌, అనువాదం : అనంత్‌ - పునర్ముద్రణ .

మనుగడ కోసం పోరాటం - 
ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసులు
-  హైమన్‌డాఫ్‌

నాలుగు కోట్ల జనాభా వున్న భారత ఆదివాసుల జీవితంలో వెలుగు నీడలను హైమన్‌డాఫ్‌ పుస్తకం కన్నా వివరంగా మరేదీ ప్రస్తావించలేదనే చెప్పాలి. ఇలాంటి పుస్తకం శాస్త్ర ఔచిత్యాన్ని గుర్తుచేయడమే కాదు మరింత పెంచుతుంది కూడా.
...      ...     ...

భారతదేశంలో, మరీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో (తెలంగాణాలో) మానవ పరిణామ శాస్త్రాన్ని ఆదివాసీ సముదాయాల జీవితాన్ని అధ్యయనం చేసేందుకే కాక మార్చేందుకూ ఉపయోగించిన వైతాళికుడిగా హైమన్‌డాఫ్‌ (1909-1995)ను చెప్పుకోవాలి.

ఆదివాసులను అయితే దొంగలుగా, అనాగరికులుగా, అభివృద్ధికి ఆటంకంగా చూసే వలసవాద దృక్పథానికీ, ఆదివాసులంటే 'ఇలాగే వుండాలి' అని మూస జీవితాన్ని ఆపాదించి, పరోక్షంగా వెనుకబాటుతనాన్ని ప్రతిపాదించే అధునాతనవాదుల తీవ్ర దృక్పథానికీ మధ్య స్పష్టంగా ఆదివాసుల పక్షం వహించే హైమన్‌డాఫ్‌ దృక్పథం, పరిశోధన ఈ పుస్తకం ఆమూలం కనిపిస్తుంది.
...        ...        ...

1940 నుండి 1980 వరకూ భారతీయ ఆదివాసీ సముదాయాల మధ్య నేను గడిపిన జీవితపు పరిశీలనల కదంబమే ఈ పుస్తకం. ...

లండన్‌ విశ్వ విద్యాలయంలో ఆసియా మానవ పరిణామ శాస్త్ర విభాగాధిపతిగా 1976లో పదవీ విరమణ చేసిన తరువాత నాకు క్షేత్ర పరిశోధనకు మరింత సమయం లభించింది. 1940ల్లో నేను పర్యటించిన ఆదివాసీ సముదాయాలలో చోటుచేసుకుంటున్న మార్పులను పరిశోధించేందుకే  ఆ సమయాన్ని కెటాయించాలనుకున్నాను.

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ రిసెర్చ్‌ అందజేసిన ఆర్థిక సహకారంతో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన జయప్రకాశ్‌ రావు నలభై ఏళ్ల క్రితం నా పరిశోధనల్లో కేంద్రక స్థానాన్ని ఆక్రమించిన కొండరెడ్ల గురించి తను చేయదలచుకున్న పరిశోధనను పూర్తి చేయగలిగాడు. తద్వారా అతను నా పరిశోధనా కార్యక్రమంలోనూ అంతర్భాగమయ్యాడు.

నా పరిశోధనల ఫలితంగా వెలువడిన మూడు సంకలనాల్లో ప్రస్తుత పుస్తకం చివరిది. 'ది గోండ్స్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ : ట్రెడిషన్‌ అండ్‌ ఛేంజ్‌ ఇన్‌ యాన్‌ ఇండియన్‌ ట్రైబ్‌ (1979; ఢిల్లీ, లండన్‌), ఎ హిమాలయన్‌ ట్రైబ్‌ : ఫ్రమ్‌ క్యాటిల్‌ టు క్యాష్‌ (1980; ఢిల్లీ, బెర్కిలీ) అనేవ గతంలో విడుదలయ్యాయి.

వర్తమాన భారతీఝయ ఆదివాసుల గురించిన ఏ వాస్తవ, నిష్పాక్షిక విశే&్లషణలోనయినా ఆయా ప్రభుత్వాల పథకాల విజయాలతోపాటు, వైఫల్యాల ప్రస్తావన వుండటం తప్పనిసరి. అదేవిధంగా ఆదివాసీల ప్రస్తుత దుస్థితికి కారణమైన వారి (వాటి) గురించి విమర్శ కూడా చోటు చేసుకోవడం అనివార్యం. తన పరిశోధన ఆమూలం వివిధ ప్రభుత్వ అధికారుల సహాయ సహకారాలతో సాగిన నాలాంటి వారి రచనల్లో ఇంతటి విమర్శ వుండటం అసమంజసంగా కనిపించవచ్చు.  కానీ అవినీతి పట్ల ఉదాసీనంగా వుండటం వల్ల ఎవ్వరికైనా ఒరిగేదేమీ లేదు. పైగా ప్రభుత్వానికి మనస్తాపం కలిగించకుండా వుండేందుకు చూసీ చూడనట్లు వ్యవహరించడం మూలాన వాస్తవిక ఆదివాసీ జీవన చిత్రణే తప్పుదోవ పడుతుంది.
అందుకే ప్రస్తుత పుస్తకంలో ప్రభుత్వంపైనా, అధికార యంత్రాంగంపైనా, పథకాలపైనా మర్యాదగా చిలక పలుకులు పలకడం కన్నా నిర్ద్వంద్వంగా విమర్శించే పద్ధతినే ఎంచుకున్నాను. అంతేకానీ ఆయా ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలపట్ల కృతఘ్నత ప్రదర్శించినట్టు కాదని భావిస్తున్నాను.

(- హైమన్‌డాఫ్‌ ముందుమాట నుంచి)


మనుగడ కోసం పోరాటం - ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసులు
- హైమన్‌డాఫ్‌

ఆంగ్ల మూలం: Tribes of India : The Struggle for Survival, Christoph Von Fuirer-Haimendorf, Published in arrangement with The University of California Press Ltd.,

అనువాదం : అనంత్‌ 
185 పేజీలు ; వెల రూ. 150/-
ప్రతులకు వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500006

ఫోన్‌ : 040 2352 1849

ఇమెయిల్‌ : hyderabadbooktrust@gmail.com


సారె తిప్పు-సాలు దున్ను ... మన కాలపు శ్రమగౌరవ పాఠాలు..ప్రొ. కంచె ఐలయ్య రచన - పునర్ముద్రణ ...


మన పిల్లలకు శ్రమ గౌరవ (డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌) 
పాఠాలు నేర్పిద్దాం



మన సమాజంలో శ్రమకు గౌరవం లేకపోవడానికి ప్రధాన కారణం కులవ్యవస్థే.
ఈ కుల వ్యవస్థ చట్రంలో ... ఒళ్లు వంచి శ్రమ చేసే ఏదైనా అమర్యాదగా, అగౌరవంగా చూపించబడ్డాయి.

శ్రమ చెయ్యటం హీనం! శ్రమ చెయ్యకుండా తినడం హుందా!!

మన విద్యా వ్యవస్థల్లో కూడా ఇదే ధోరణి ప్రతిఫలిస్తోంది.

డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ చెప్పినట్టుగా ఈ కుల వ్యవస్థ అన్నది కేవలం 'శ్రమ విభజన' కాదు.. ఇది 'శ్రామికుల విభజన'.

మన దేశంలో ఈ నిచ్చెనమెట్ల కులవ్యవస్థ శారీరక శ్రమకూ, మానసిక శ్రమకూ మధ్య స్పష్టమైన విభజన రేఖ గీచింది. దురదృష్టవశాత్తూ ఇదే ఆలోచనాధోరణి నేటి మన స్కూలు విద్యా వాధానాలను నడిపిస్తోంది. పాఠ్యప్రణాళికల్లోనూ ఇదే ధోరణి నిండి వుంది.

మన భారతీయ పిల్లలు ఉన్నత చదువులకు ఎదిగిన కొద్దీ ఫ్రాథమికమైన ఉత్పాదక శ్రమ పట్ల విముఖత పెంచుకుంటున్నారు. చదువుల్లో ఎంత ఎదిగితే వీటి పట్ల చికాకు, చిన్నచూపు అంత పెరుగుతున్నాయి. స్కూలుకు వెళ్లే ప్రతి పిల్లా, ప్రతి పిల్లవాడూ కూడా రోజువారీ పనులైన ఇల్లు ఊడ్వడం, నేల తుడవడం, గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం, చెత్తాచెదారం ఎత్తటం వంటి ఇంటి పనుల పట్ల ఏహ్యాన్నీ, అసహ్యాన్నే ప్రదర్శిస్తున్నారు. పైగా ఈ పనులన్నీ చాలా వరకూ 'అమ్మ చెయ్యాల్సిన' పనులుగా భావిస్తున్నారు.  లేదూ కాస్త కలిగిన కుటుంబానికి చెందిన వాళ్లయితే ఇవన్నీ 'పని మనిషి' చూసుకోవాల్సిన చెత్తపనులని భావిస్తున్నారు.

చిత్రమేమిటంటే, ఆ 'పనిమనిషి' కూడా చాలాచోట్ల  'కింది కులాలకు' చెరదిన  మహిళే అయ్యుంటుంది. మొత్తానికి ఇంటి పని చేసే ఏ మహిళకైనా కూడా ... కుమ్మరి, మంగలి, చాకలి వంటి కింది కులాల స్థాయినే ఇస్తున్నారు.

ఇటువంటి పనులకు సరైన గౌసవమే కాదు, గౌరవప్రదమైన వేతనం కూడా ఉండదు. కాబట్టి శ్రమ గౌరవం లేకపోవటం, శ్రమను చులకనగా చూడటమన్నది కులం, జెండర్‌లు రెంటితోనూ ముడిపడి వుందని గుర్తించాలి.

శ్రమను నీచంగా చూసే ఈ ఆలోచనలన్నీ కూడా పిల్లలకు ఇళ్లలోనూ, స్కూళ్లలోనూ, శతాబ్దాలుగా పరంపరగా వస్తున్న సాంస్కృతిక, సామాజిక విలువల వ్యవస్థల ద్వారానూ చాలా తేలికగా ఒంటబడుతున్నాయి.

ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే... శ్రమను గౌరవించటమన్నది మన పిల్లలకు స్కూలులో బోధనాంశాల్లో భాగంగానూ, ఇంట్లోనూ నేర్పించాల్సిన అవసరం వుంది.   ...

రేపటి పౌరులకు శ్రమ గౌరవాన్ని నేర్పించటానికీ, హేతుబద్ధమైన, శాస్త్రీయమైన, ప్రజాస్వామికమైన భారతదేశాన్ని నిర్మిచటానికీ ఈ పుస్తకం ఎంతో దోహదపడుతుందని ఆశిస్తున్నాను. (రచయిత ముందుమాట నుంచి)



సారె తిప్పు-సాలు దున్ను ... 
మన కాలపు శ్రమగౌరవ పాఠాలు

- కంచె ఐలయ్య 

బొమ్మలు : దుర్గాబాయ్‌ వ్యామ్‌
తెలుగు : 'చంద్రిక'

108 పేజీలు, వెల రూ. 140/-

ప్రతులకు వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500006

ఫోన్‌ : 040 2352 1849

ఇమెయిల్‌ : hyderabadbooktrust@gmail.com









 

Thursday, December 24, 2015

బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ - బి.విజయభారతి రచన - పన్నెండో ముద్రణ అదనపు సమాచారంతో...

బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 
- బి. విజయభారతి రచన 

డాక్టర్‌ విజయభారతి ఈ పుస్తకంలో డాక్టర్‌ అంబేడ్కర్‌ దళిత జనోద్ధరణ కోసం చేసిన కృషిని, పోరాటాలను చక్కని శైలిలో వివరించారు. అంబేడ్కర్‌ జీవితమే కాకుండా అప్పటి సాంఘిక, రాజకీయ స్థితిగతుల్ని బాగా అధ్యయనం చేసి రచన సాగించారు. ఈ పుస్తకం ప్రస్తుత మూఢ విశ్వాసాలతో నిండివున్న సమాజంపై కులతత్వం, మతతత్వం, అనైక్యతలపై 'డైనమైట్‌' వంటిది. సాంఘిక విప్లవానికి ఈ పుస్తకం దోహదపడుతుంది.
-- డాక్టర్‌ ఎం. ఏబెల్‌
(మాజీ వైస్‌ ఛాన్స్‌లర్‌, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం)

డాక్టర్‌ విజయభారతిగారి ఈ పుస్తకం 'టైంబాంబ్‌ ' లాంటిది. కులతత్వంతో కూడిన సమాజ వ్యవస్థను ఇది బ్రద్దలు చేస్తుంది. ఈ పుస్తకం వల్ల కొందరి హృదయాలు బాధపడ్డా, మరికొందరి హృదయాలు సంస్కరింపబడతాయి.
-- జస్టిస్‌ కె. పున్నయ్య
............................

ఈ పుస్తకం నుంచి ఒక అధ్యాయం సంక్షిప్తంగా...

1954 డిసెంబర్‌లో ప్రపంచ బౌద్ధ మహాసభలు రంగూన్‌లో జరిగాయి. అంబేడ్కర్‌ ఆరోగ్యం అంత బాగుండలేదు. అయినా రంగూన్‌ వెళ్లాడు. భార్య, ఒక సేవకుడు వెంట వెళ్లారు. బౌద్ధ ధర్మ సంబంధమైన ఆధ్యాత్మిక- మానసిక భావ సంచలనం ఆయనను విచలితున్ని చేసింది. ఉపన్యసించేటప్పుడు చెక్కిళ్లమీద కన్నీరు జాలువారింది. అయినా నిగ్రహించుకుని భావశబలతతో ఉపన్యసించాడు.

... అంబేడ్కర్‌ బౌద్ధ మతాన్ని స్వీకరించబోతున్నాడన్న వార్త బౌద్ధులను ఆనందపరచింది. నిమ్న జాతులంతా బౌద్ధం స్వీకరిస్తే భారతదేశపు రూపురేఖలే మారిపోగలవని వారు భావించారు.

... 1956 పూర్వార్థానికి బౌద్ధ ధర్మాన్ని గురించి అంబేడ్కర్‌ మొదలుపెట్టిన పుస్తకం సుమారుగా పూర్తి కావచ్చింది. ... చివరికి ఆ గ్రంధం ''ద బుద్ధా అండ్‌ హిజ్‌ గాస్పెల్‌'' అనే పేరుతో ముద్రితమైంది. ...చివరలో పేరు మార్చాడు. 1956 ఫిబ్రవరిలో 'దేరీజ్‌ నో గాడ్‌', 'దేరీజ్‌ నో సోల్‌ ' అనే మరో రెండు అధ్యాయాలు చేర్చాడు.

బౌద్ధమతాన్ని గురించిన ఆయన అభిప్రాయాలను లండన్‌ రేడియో 1956 మే  నెలలో ప్రసారం చేసింది. మానవ జీవితానికి ముఖ్యంగా కావలసిన ప్రజ్ఞ, కరుణ, సమత అనే మూడు ప్రధానాంశాలను బోధిస్తున్న మతం ఇది ఒక్కటే అని అంబేడ్కర్‌ చెప్పాడు.

మార్క్స్‌ సిద్ధాంతాలకు, కమ్యూనిజానికి బౌద్ధమతమే చక్కని సమాధానమిస్తుందన్నాడు. 'కమ్యూనిజాన్ని దిగుమతి చేసుకున్న బౌద్ధ దేశాలకు కమ్యూనిజం అంటే నిజమైన అవగాహన లేదు.  బౌద్ధ ధర్మంతో కూడిన కమ్యూనిజం శాంతియుత విప్లవాన్ని తెస్తుంది. నేటి కమ్యూనిస్టు దేశాలలో రక్తపాతం లేకుండా మార్పు రావడంలేదు' అన్నాడు అంబేడ్కర్‌.

ఆసియా దేశాలు త్వరపడి రష్యా మార్గాన్ని అనుసరించరాదనీ, బుద్ధుని సిద్దాంతాలకు రాజకీయ రూపం ఇస్తే అదే మానవాళి మనుగడకు చక్కని మార్గమనీ చెప్పాడు. వాయిస్‌ ఆఫ్‌ అమెరికాకు ఇచ్చిన ప్రసంగంలో ప్రజాస్వామ్య ప్రగతిని గూర్చి మాట్లాడాడు. పార్లమెంటరీ ప్రభుత్వంలో గానీ, మరేరకమైన ప్రభుత్వంలో గానీ ప్రజాస్వామ్య పరిరక్షణకు సహజీవన దృక్పథం అవసరమనీ, హిందూదేశ సమాజంలో కులం అనేక విచ్ఛేదాలను తెచ్చిపెడుతున్నదనీ వివరించాడు.

... (1956 అక్టోబర్‌ 14న) ఉదయం 9 గంటల 15 నిమిషాలకు అంబేడ్కర్‌ (నాగపూర్‌లో వాక్సీన్‌ ఇన్‌స్టిట్యూట్‌ వద్ద 14 ఎకరాల విస్తీర్ణం గల మైదానంలో లక్షలాది అభిమానుల మధ్య) వేదిక నలంకరించాడు. తెల్లని సిల్కు పంచె, తెల్లని కోటు ధరించాడు. డి వలీసిన్హా, సంఘరత్న తీర్థ, తిస్సా తీర్థ, పన్నానంద తీర్థలు వేదిక మీద వున్నారు. అంబేడ్కర్‌ను స్తుతించే ఒక మరాఠీ గీతంతో కార్యక్రమం ఆరంభమైంది. అంబేడ్కర్‌ తండ్రికి శ్రద్ధాంజలి సూచకంగా ఒక నిమిషం మౌనం పాటించాక కుశీ నగరానికి చెందిన వృద్ధ భిక్షు మహాస్థవిర చంద్రమణి తన నలుగురు శిష్యులతో అంబేడ్కర్‌ దంపతులకు దీక్షా విధిని నిర్వహించాడు. ...

... ''అసమానతకు, దాస్యానికి నిలయమైన నా తాత తండ్రుల (హైందవ) ధర్మాన్ని త్యజించి నేనీనాడు తిరిగి జన్మించాను'' అన్నాడు అంబేడ్కర్‌. ఆయనకు అవతారాల మీద నమ్మకం లేదు. బుద్ధుడు విష్ణువు అవతారమని చెప్పే వాదాన్ని ఆయన ఖండించాడు.

''నేనిక ఏ హిందూ దేవుణ్నీ, దేవతనూ పూజించను. శ్రాద్ధ కర్మలు  చేయను. బుద్ధుని అష్టాంగమార్గాన్ని అనుసరిస్తాను. బౌద్ధమే నిజమైన ధర్మం.  త్రిశరణాల ఆధారంతో జీవితాన్ని కొనసాగిస్తాను'' అని దీక్ష వహించాడు.

... తాను దీక్ష గ్రహించడం పూర్తయినాక, బౌద్ధమతంలో చేరదల్చుకున్న వారిని లేచి నిలబడమని అంబేడ్కర్‌ కోరాడు. సభామండపంలో ఉన్న యావన్మందీ లేచి నిల్చున్నారు....
..........

బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 
- బి.విజయభారతి 

292 పేజీలు; వెల: రూ.120/-

మొదటి ముద్రణ : 1982
పునర్ముద్రణ : 1986, 1990, 1992, 1999, 2005, 2008, 2009, 2010, 2012, 2013, 2015

ప్రతులకు వివరాలకు:
: హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500006
ఫోన్‌ : 040 2352 1849
ఇమెయిల్‌ : hyderabadbooktrust@gmail.com


హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌