Wednesday, June 29, 2011

ఘంటారావం - The Hunchback of Notre Dame - రచన: విక్టర్‌ హ్యూగో- అనువాదం: సూరంపూడి సీతారాం -ముందుమాట: చలసాని ప్రసాద్‌

ఘంటారావం
రచన: విక్టర్‌ హ్యూగో
ప్రపంచ సాహిత్యంలో పేరెన్నికగన్న రచనల్లో ఒకటిగా నిలిచిపోయిన ''హంచ్‌బాక్‌ ఆఫ్‌ నోత్ర్‌దామ్‌''కు తెలుగు అనువాదం ఈ ఘంటారావం. సుప్రసిద్ధ ఫ్రెంచ్‌ రచయిత విక్టర్‌ హ్యూగో 1830లలో రాసిన నవల ఇది. దాదాపు రెండు శతాబ్దాలు కావొస్తున్నా ఇప్పటికీ ఈ నవలకు ప్రభ తగ్గలేదు.
దాదాపు ప్రపంచంలోని ప్రధాన భాషలన్నింటిలోకీ అనువాదమైంది.
దీని ఆధారంగా 1905లో మూకీలతో మొదలుకొని ఇప్పటి వరకూ ప్రతి తరంలోనూ సినిమాలు తీస్తూనే వున్నారు.
ఇక టీవీ సీరియళ్లు, నాటకాలు, రేడియో అనుసరణలు, సంగీత రూపకాలకు లెక్కలేదు.
1997లో పిల్లల కోసం వాల్ట్‌ డిస్నీ దీన్ని విజయవంతమైన యానిమేషన్‌ చిత్రంగా కూడా తెచ్చింది. నిజానికి పౌరాణిక గాథలకు తప్పించి ఒక కాల్పనిక రచనకు శతాబ్దాలుగా ఇంతటి ప్రాభవం, ఆదరణ లభించటం అరుదనే చెప్పాలి.
దీనికింత వైభోగమెందుకు? ఏమిటి దీని ప్రత్యేకత?
:::            :::            :::
విక్టర్‌ హ్యూగో (1802-85) సాటిలేని మేటి ఫ్రెంచి రచయిత. ఇతిహాసాల స్థాయిలో నవలలు రాసి విశ్వ సాహిత్యంలోనే వన్నెకెక్కాడు. అతని ''లే మిసరబ్ల'' (బీదలపాట్లు)కి సాటిరాగల నవలలు ఎన్నో వుండవు. విశ్వసాహిత్య పరిశీలకులు ఒకే గొంతుకతో ఒప్పుకునే మాట ఇది. ఆ మాటకొస్తే అటు విప్లవాలలోనూ, ఇటు సాహిత్యరంగంలోనూ కూడా ఫ్రాన్స్‌ది ఎప్పుడూ పైచేయి. అందుకే ఫ్రాన్స్‌ని ''విప్లవాల ఉయ్యాల'' అన్నారు. ఇంచు మించు అన్ని సాహిత్య సిద్ధాంతాలకి పుట్టినిల్లు ఫ్రాన్స్‌, మనందరం వీటిని మరీ మరీ మననం చేసుకోవాలి.
:::            :::            :::
అనువాద కళలో సిద్ధహస్తులు సూరంపూడి సీతారాం తెలుగు పాఠకుల కోసం దాదాపు అరవై ఏళ్ల క్రితం (1954లో) చేసిన అనువాదం ఇది.
దీన్ని ఇప్పుడు పునర్ముద్రించి మీ ముందుంచుతున్నాం.
:::            :::            :::
ఘంటారావం
రచన: విక్టర్‌ హ్యూగో
అనువాదం: సూరంపూడి సీతారాం
186 పేజీలు, వెల: రూ.100/-

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ 500 067

ఫోన్‌ నెం. 040- 2352 1849
ఇ మెయిల్‌ ఐడి: hyderabadbooktrust@gmail.com






Saturday, June 4, 2011

అలెగ్జాండర్‌ ద్యుమా ప్రపంచ ప్రఖ్యాత నవల 'ది కౌంట్‌ ఆఫ్‌ మాంటి క్రిస్టో' తెలుగులో : ''అజేయుడు'' ... అనువాదం : సూరంపూడి సీతారాం ...

ప్రెంచి నవలా రచయిత, నాటకకర్త అయిన అలెగ్జాండర్‌ ద్యుమా రాసిన అద్భుత నవల - ద కౌంట్‌ ఆఫ్‌ మాంటి క్రిస్టో.
ఈ నవలలోని కథ చరిత్రతో, రాజకీయాలతో ముడివడింది.
ఇందులో చాలా సంఘటనలు వాస్తవ ఆధారితాలు.
సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం ... ఫ్రెంచి విప్లవం కారణంగా వచ్చిన మానవీయ విలువలు ఈ నవలలో స్పష్టంగా కనిపిస్తాయి.
స్వతహాగా ఈ విలువలపట్ల ఎంతో విశ్వాసం వున్న ద్యుమా ... ఈ నవలలో అంతర్లీనంగా అవి కన్పించేలా కథనాన్ని చక్కగా మలిచారు. అసూయాపరులైన స్నేహితుల కుట్రకు జైలుపాలైన వ్యక్తి విడుదల కాగానే మారుపేరుతో సొంత ఊరికి తిరిగి వచ్చి అమోఘమైన ప్రణాళికలతో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వారిపై పగ తీర్చుకుని జీవితంలో ''అజేయుడు'' గా నిలబడటం ఇందులోని మూల కథాంశం.

1844-46లో ఒక ఫ్రెంచి పత్రికలో సీరియల్‌గా వచ్చిన ఈ నవలకు అశేష ప్రజాదరణ లభించింది. సీరియల్‌ తరువాయి భాగం కోసం జనం పత్రికల దుకాణాల ముందు బారులు తీరేవారట. పుస్తకంగా వెలువడిన కొద్ది నెలల్లోనే పది భాషల్లోకి అనువాదమైంది. 1846లో వెలువడిన ఆంగ్ల ముద్రణ విశేష పాఠకాదరణ పొందింది. దాంతో  అలెగ్జాండర్‌ ద్యుమా పేరు ప్రపంచమంతటా మార్మోగింది.

శతాబ్దాలు గడిచినా ... నేటికీ ఈ నవల పట్ల పాఠకుల ఆదరణ చెక్కు చెదరలేదు. సమాజంలో సంస్కృతుల మధ్య, విలువల మధ్య ఎంతో అంతరం వచ్చినా ఈ నవలని అప్పటి పాఠకులు ఎంతగా ఆస్వాదించారో, నేటి పాఠకులు కూడా అంతగా ఆస్వాదిస్తున్నారు. ఈ నవల ఆధారంగా ఐదు సినిమాలు వచ్చాయి. ఇక సంగీత, రేడియో రూపకాలకైతే లేక్కేలేదు.

అలెగ్జాండర్‌ ద్యుమా (1802-1870) ప్రపంచంలో అత్యధికంగా చదువబడుతున్న ఫ్రెంచి రచయిత. ఆయన అనేక నవలలు, నాటకాలు రాశారు. వాటిలో ద ''కౌంట్‌ ఆఫ్‌ మాంటి క్రిస్తో'', ''త్రీ మస్కిటీర్స్‌'' ఎంతో ప్రసిద్ధి పొందాయి.

సూరం పూడి సీతారాం 65 ఏళ్ల కిందట ఈ నవలను తెలుగులోకి అనువదించారు. ఆయన గతంలో చేసిన అనువాదాలను ...విక్టర్‌ హ్యూగో 'హంచ్‌బాక్‌ ఆఫ్‌ నొత్ర్‌దామ్‌' (ఘంటారావం), మహాశేతాదేవి 'హజార్‌ చౌరాశీర్‌ మా (ఒక తల్లి), 'దాయన్‌' (దయ్యాలున్నాయి జాగ్రత్త), 'శ్రీశ్రీ గణేశ్‌ మహిమ' (రాకాసి కోర) ...  హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించింది. ప్రపంచ సాహిత్యాన్ని, భారతీయ సాహిత్యాన్ని సహజ సుందర అనువాదాల రూపంలో తెలుగు పాఠకులకు చేరువ చేసిన ఘనత వారిది. ఆయన 1997లో మరణించారు.

అజేయుడు (నవల)
మూలం: ద కౌంట్‌ ఆఫ్‌ మాంటి క్రిస్టో
రచన: అలెగ్జాండర్‌ ద్యుమా
తెలుగు అనువాదం: సూరంపూడి సీతారాం
404 పేజీలు, వెల: రూ. 160 /-

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ 500 067

ఫోన్‌ నెం. 040- 2352 1849
ఇ మెయిల్‌ ఐడి: hyderabadbooktrust@gmail.com

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌