Tuesday, July 28, 2009

ఆంధ్ర దేశంలో సంఘ సంస్కరణోద్యమాలు ... మూలం : వి. రామకృష్ణ ... అనువాదం: రాచమల్లు రామచంద్రారెడ్డి ...



ఆంధ్ర దేశంలో 19వ శతాబ్దంలో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంఘిక పరిణామాల నేపధ్యంలో అదే శతాబ్దంలోని ఉత్తరార్థంలో తలెత్తిన సాంఘిక సంస్కరణోద్యమాలకు ఆంధ్రదేశ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యం వుంది. అదే కాలంలో భరతదేశంలోని బెంగాల్, మహారాష్త్ర, పంజాబ్ లాంటి ప్రాంతాలలో ఇలాటి ఉద్యమాలు ఎన్నో వచ్చాయి. వాటిలో భాగంగానే అంధ్ర దేశంలోని సంస్కరణలను కూడా గమనించవలసి ఉంటుంది. ఆంధ్ర దెశంలోని ఈ ఉద్యమాలపై ఇంతవరకూ ఒక సమగ్రమైన పరిశోధన జరగలేదు.

ఈ గ్రంధం లో ఆ ప్రయత్నం తొలిసారిగా జరిగింది.
కందుకూరి వీరేశలింగం కేంద్రం గా నడిచిన ఈ ఊద్యమాల చరిత్ర ఈ గ్రంధం లో వీలున్నంత మేరకు సమగ్రంగా కనిపిస్తుంది.
సంస్కరణోద్యమాలు ఆంధ్రదేశ చరిత్రలొ ఆధునిక యుగం ఆవిర్భావానికి ఎలా దోహదం చేశాయో చెబుతూ, అవి ఆ తరువాత రాసాగిన రాజకీయ ఉద్యమాలకు ఏవిధంగా పూర్వ రంగాన్ని సిధ్ధం చేశాయో, నాంది పలికాయో ఈ గ్రంధం వివరిస్తుంది.

సంఘ సంస్కరణల బీజాలు మధ్య యుగాల నుంది ఆంధ్రదేశంలో ఎలా పాదుకుని ఉన్నాయో వివరించి, వీరేశలింగానికి పూర్వం ఉందే సంస్కరణ ధోరణలను కూడా స్పృశిస్తుంది. ఈ గ్రంధం మన సామాజిక ఉద్యమాలను తెలుసుకోవాలని కుతూహలపడే సామాన్య పాఠకులకే గాక భావి పరిశొధకులకు కూడా ఉపకరిస్తుందని మా నమ్మకం.

రచయిత గురించి :

డాక్తర్ వి రామకృష్ణ (1938) ఆధునికాంధ్ర సామాజిక చరిత్రలో విశేషమైన కృషిచేసిన పరిశోధకులు.. జవహర్లాల్ నెహౄ విశ్వవిద్యాలయం చారిత్రక అధ్యయనాల కేంద్రంలో ఆచార్య సర్వేపల్లి గోపాల్ పర్యవేక్షణలో పి.హెచ్.డి. చేసారు.

డా. రామకృష్ణ ఆంధ్రప్రదేష్ చరిత్ర కాంగ్రెస్ సంస్థాపక సభ్యులు. మూడేళ్ళపాటు దాని ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు భారతీయ చరిత్ర కాంగ్రెస్ సమ్యుక్త కార్యదర్శి.

ఆంధ్ర సామాజిక చరిత్రపై అనేక వ్యాసాలు రచించదమే కాకుండా ఆంధ్ర సామాజిక చరిత్ర నిర్మాణం ఒక సమ్యక్ దృక్పఠంతో జరగాలని ఆకాక్షించే జిజ్ణాసువు.



ఆంధ్ర దేశంలో సంఘ సంస్కరణోద్యమాలు
మూలం : వి. రామకృష్ణ
అనువాదం: రాచమల్లు రామచంద్రారెడ్డి ...
140 పేజీలు, వెల : రూ.30

Monday, July 27, 2009

ఓ "కౌమారుడి" ఆత్మ కథ ... "ఊరు వాడ బతుకు" పై సాక్షి సమీక్ష ...


"కత్తులు దూసుకు పోయినా
నెత్తురు టేరులు పారినా
ఎత్తిన జండా దించకోయ్
అరుణ పతాకకు జై ......"

వామపక్ష భావజాలం ఉధృతంగా ఉన్న రోజుల్లో, చాలామంది లాగే అటువైపు ఆకర్షితుడైన దేవులపల్లి కృష్ణమూర్తి ఆత్మ కథ ఇది. తన పుట్టినరోజును 1940గా పేర్కొన్నాడు గనుక, 1958లో ఆయన పెళ్లయ్యేవరకు అంటే అటూఇటుగా 18 ఏళ్ల జీవితాన్ని 'ఊరు వాడ బతుకు' స్కృశిస్తుంది. నల్లగొండ జిల్లాతోపాటు తెలంగాణ ఊరూ వాడల్లోని బతుకుల్నీ ఇది చిత్రిస్తుంది.

మేలురకం అమ్ముతాడమ్మా చందమామా రైతు తాలురకం తింటాడమ్మా చందమామా రైతు
నాలుగు భాగాలుగా ఉన్న ఈ పుస్తకంలో అప్పటి కుటుంబ జీవితాలు, వారాలు చేసుకుని చదువుకోవటాలు, పిల్లల ఆటలు, సాధనా శూరుల గారడీలు, నాటకాలు, పంచాయితీలు, తాగి కొట్టుకోవడాలు, తాతాక్కలిక మోహాలు... ఎన్నిటింలో జ్ఞాపకాల మాలగా కట్టాడు రచయిత.

''ఎండకాలం అపోయివచ్చిందంటే తాటిపండ్ల కాలం వచ్చేది. పొద్దున్నే చీకటితో లేచి చెరువు కట్టమీదకు పోయి తాటిచెట్లకింద రాలిపడ్డ తాటిపండ్లను ఏరుకొచ్చుకునేది. కొన్ని చెట్లపండ్లు తియ్యగా వుండేవి.ఆ చెట్లేవో మాకు బాగా తెల్సు . ఎరగ్రావున్న తాటిపండ్లను బాపని పండ్లనేది. వాటిని చెత్తతో కాల్చి చల్లారినాక తోలు తీసి చీకితే చాలా రుచిగా వుండేవి. బొచ్చెలు భూమిలో పాతితే సంకురాత్రి వరకు గేగులుగా మారేవి. ఆ గేగులు కాల్చితింటే కమ్మగా వుండేవి. ఇవే మా చిరుతిండ్లు''

సందర్భానుసారంగా వచ్చే పల్లెపాటలే కాదు, నాభికాడ చల్లబడితే నవాబకాడ జవాబియ్యొచ్చు', 'వండిన కుండాగదు వంగిన పొద్దాగదు', ధైర్యం దండిది చెయ్యి మొండిది' లాంటి పలుకుబడులు పుస్తకం సొగసును మరింత పెంచుతాయి.

రచయిత శైలి రాసనట్టుగా కాకుండా, చెప్పినట్టుగా ఉంటుంది. ఆ చెప్పడంలో కూడా ఏ ఆవేశాలూ, ఉద్రేకాలూ లెకుండా కేవలం ఓ మౌనసాక్షిగా తాను చూసినవి వివరించుకుంటూ వెళ్తాడు. ఈ విధానం కొన్ని సందర్భాల్లో బాగుంటుంది, కొన్నిసార్లు ఇంతేనా అనిపిస్తుంది. అయితే, జీవితపు చివరిదశకు చేరిన మనిషికి, ఇదంతా ఓ ఆటగా భావించే మానసిక స్థితి వచ్చివుంటుంది కాబట్టి, ఇది సహజంగానే భావించొచ్చు.
.....

ఊరు వాడ బతుకు పుస్తకం పై సాక్షి దినపత్రిక సమీక్ష ...ఇక్కడ నొక్కి. చదవండి.

సమీక్షకులు : రాజిరెడ్డి

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=32745&Categoryid=10&subcatid=42


ఊరు వాడ బతుకు
రచయిత దేవులపల్లి కృష్ణమూర్తి

పేజీలు; 138. వెల 40

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
పాట్ల్‌ నం; 85 బాలాజీనగర్‌
గుడిమల్కాపూర్‌
హైదరాబాద్‌ 500067
ఫోన్‌; 040-23521849.


......................

Tuesday, July 21, 2009

చరిత్ర అంటే ఏమిటి? - ఇ.హెచ్‌. కార్‌ ...అనువాదం : వల్లంపాటి వెంకట సుబ్బయ్య ...



What is History? by E.H.Carr ...

అన్ని వాస్తవాలూ చారిత్రక వాస్తవాలేనా ?
చరిత్రకారుడు వాస్తవాలను ఎలా ఎన్నుకుంటాడు ?
పాలకవర్గ భావజాలం చరిత్రకారుణ్ణి ఎలా ప్రభావితం చేస్తుంది ?
చరిత్రకూ, తత్వశాస్త్రానికీ మధ్య వున్న సంబంధం ఎలాంటిది ?
ఏ తత్వశాస్రాన్నీ నమ్మని గొప్ప చరిత్రకారుడుంటాడా ?
చరిత్ర అంటే కొందరు ప్రముఖుల జీవిత చరిత్రేనా ?
చరిత్రలో కార్యకారణ సంబంధాన్ని నిర్ణయించటం ఎలా ?
చారిత్రక సంఘటనలను యాదృచ్ఛికత ఎలా నిర్ణయిస్తుంది ?
చరిత్ర తయారుచేసిన చరిత్రకారుడు చరిత్రను ఎలా రాస్తాడు ?
చరిత్ర శాస్త్రమేనా ?
ఆక్టస్‌, ఇసయా మెర్లిన్‌, కాలింగ్‌వుడ్‌, టాయన్‌బీ మొదలైన చరిత్రకారుల చారిత్రక దృక్పథాల్లోని లోపాలేమిటి?

చరిత్రను గురించిన ఇలాంటి ఇంకెన్నో ప్రశ్నలను ఈ గ్రంథం కూలంకషంగా చర్చిస్తుంది.
మన చారిత్రక చైతన్యాన్ని తట్టిలేపుతుంది.
ఇది ప్రతి చరిత్ర విద్యార్థికీ కరదీపికగా వుండతగ్గ పుస్తకం.
ఈ గ్రంథంలోని చరిత్రను గురించిన సిద్ధాంతాలను కొన్ని చిన్న చిన్న మార్పులతో సాహిత్యానికీ, సాహిత్య చరిత్రకూ అన్వయింపజేయవచ్చు.
అందుచేత ప్రతి రచయితా, విమర్శకుడూ తప్పకుండా చదవవలసిన పుస్తకం యిది.

చరిత్ర అంటే ఏమిటి?
- ఇ.హెచ్‌.కార్‌

ఆంగ్లమూలం : What is History? -E.H.Carr
తెలుగు అనువాదం: వల్లంపాటి వెంకటసుబ్బయ్య

ట్రస్ట్‌ సంపాదకుడు: చేకూరి రామారావు
తొలి ముద్రణ: 1983
మలి ముద్రణలు: 1984, 1994, 1997
115 పేజీలు, వెల: రూ.22

Thursday, July 16, 2009

ఊరు వాడ బతుకు పుస్తకావిష్కరణ సభ జూలై 17, 2009 న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ...

దేవులపల్లి కృష్ణమూర్తి రచించిన " ఊరు వాడ బతుకు " పుస్తకాన్ని

హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో
జూలై 17 శుక్రవారం సాయంత్రం 6 గంటలకు


ప్రముఖ సినీ దర్శకులు శ్రీ బి. నరసింగ రావు
ఆవిష్కరిస్తున్నారు.


అధ్యక్షత : శ్రీ నోముల సత్యనారాయణ

ముఖ్య అతిధి : శ్రీ జయధీర్ తిరుమల రావు

వక్తలు : శ్రీ గుడిపాటి , శ్రీ ఎ కే ప్రభాకర్

ప్రచురణకర్తల అభిభాషణ : గీతా రామస్వామి , హైదరాబాద్ బుక్ ట్రస్ట్

అందరికీ ఇదే మా ఆహ్వానం

Tuesday, July 14, 2009

పంచమం నవలలో దళిత ఉద్యమం ... డాక్టర్ దార్ల వెంకటేశ్వర రావు గారి సమీక్ష



పంచమం నవలలో దళిత ఉద్యమం

తెలుగు సాహిత్యంలో కుల అస్తిత్త్వ ఉద్యమాల నేపథ్యంతో దళిత ఉద్యమం, దాన్ని ఆధారంగా చేసుకొని సాహిత్యం విస్తృతంగానే వచ్చింది. అది అనేక ప్రక్రియలుగా విస్తరించింది. నవలా ప్రక్రియలోనూ తన దైన ప్రత్యేకతను చాటుకుంది.

.......

అలా వచ్చిన దళిత నవలల్లో పంచమం ఒకటనీ, దీన్ని చిలుకూరి దేవపుత్ర రాశారని తెలిసింది. ఇది అమెరికన్ తెలుగు అసోసియేషన్ ( ఆటా) 1998 లో నిర్వహించిన నవలల పోటీల్లో బహుమతి పొందింది. ఈ నవలను పోటీల కోసం రాశారా? రాసిన దాన్ని పోటీకి పంపారా? అనే విషయాన్ని పక్కకు పెట్టి దీనిలో ప్రతిఫలించిన దళిత ఉద్యమాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.

.......

….సమీక్ష ను పూర్తిగా వి ఆర్ దార్ల బ్లాగ్ స్పాట్ డాట్ కాం లో చదవండి ...

http://vrdarla.blogspot.com/2009/07/blog-post_12.html

...........

పంచమం (నవల)
రచన: చిలుకూరి దేవపుత్ర
ముఖచిత్రం : రమణ జీవి
275 పేజీలు, వెల: రూ.100

ప్రతులకు వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడిమల్కా పూర్‌,
హైదరాబాద్‌- 500 067
ఫోన్‌ నెం. 040-2352 1849
......................................

Wednesday, July 8, 2009

అనుభవ యాత్ర ... ఈనాడులో ఊరు వాడ బతుకు పుస్తక సమీక్ష




ఈనాడు 5 జూలై 2009 ఆదివారం అనుబంధంలో డా. కావూరి లాస్య శ్రీనిధి " ఊరు వాడ బతుకు " పుస్తకాన్ని క్లుప్తంగా సమీక్షంచారు. ఆ సమీక్షను ఇక్కడ చూడవచ్చు.

http://www.eenadu.net/htm/2vnewhomoe.asp

ఈనాడుకు కృతజ్ఞతలతో ...

Monday, July 6, 2009

మిత్రులారా ఇక సెలవు ... ఇట్లు ఒక రైతు ...







గొర్రెపాటి రవీంద్ర నాధ్ మృతికి సంతాపం ...


సేంద్రీయ వ్యవసాయం లో అనేక ప్రయోగాలు, రైతు సమస్యలపై ఎనలేని పోరాటాలు చేసి తన అనుభవాల సారాన్ని "ఇట్లు ఒక రైతు" అనే పుస్తక రూపం లో మనకు అందించిన గొర్రెపాటి నరేంద్రనాథ్ 5 జూలై 2009 ఆదివారం తుది శ్వాస విడిచారు.

గత రెండు సంవత్సరాలనుంచీ వారు బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నారు. తను మరెంతో కాలం జీవించనని, తను మరణించే లోపు "ఇట్లు ఒక రైతు" ను తీసుకు రావాలని చివరి రోజుల్లో వారు ఎంతో ఆరాటపడేవారు. మేము ఆ పుస్తకాన్ని సకాలంలో ప్రచురించి, ఆవిష్కరించినప్పుడు ఆయన ఎంతగానో సంతోషించారు. నరేంద్రనాథ్ కు వ్యవసాయ మన్నా , ప్రజా ఉద్యమాలన్నా ఎనలేని మక్కువ. సేంద్రీయ వ్యవసాయ ప్రాధాన్యతను, వ్యసాయ రంగంలోని సాధక బాధకాలను, పల్లె జీవితం లోని ఒడిదొడుకులను చిత్రించిన ఇట్లు "ఒక రైతు" చిరకాలం అయన స్మృతి/కృషి చిహ్నంగా నిలిచివుంటుంది.

ఆయన మృతికి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రగాఢ సంతాపాని తెలియజేస్తోంది.



ఆంధ్ర జ్యోతి వార్త:

........










నరేంద్రనాథ్ గురించి మరింత తెలుసుకునేందుకు ఈ పోస్టులు చదవండి :

నేషనల్ అలయన్స్ ఫర్ పీపుల్స్ మూవ్ మెంట్స్ (NAPM) నివాళి :
http://aravinda.aidindia.org/?p=181

గడ్డి పరక విప్లవం ( బ్లాగు గుండె చప్పుడు )
http://hridayam.wordpress.com/2009/05/19/one-straw-revolution/

ఒక గొప్ప రైతు అస్తమయం ( బ్లాగు గుండె చప్పుడు )

http://hridayam.wordpress.com/2009/07/07/gorrepati-narendranath-passes-away/#more-718

నరేంద్ర నాథ్ వున్నాడు (నారాయణీయం బ్లాగు )
http://naaraayaneeyam.blogspot.com/2009/07/blog-post.html

Saturday, July 4, 2009

ప్రాచీన భారతంలో ఆహారపు అ లవాట్లు - డి. ఎన్‌ ఝా ...పారడాక్స్ అఫ్ ది కౌ ....



ప్రాచీన భారతంలో ఆహారపు అ లవాట్లు
- డి. ఎన్‌ ఝా ...


మన దేశంలో ఆహారపు అ లవాట్లు ఎప్పుడూ ఒకేలా లేవు. కాలమాన పరిస్థితులను బట్టి, ప్రాంతాలను బట్టి, అవసరాలను బట్టి మారుతూ వచ్చాయి.
ఇప్పటికీ ఒక్కో ప్రాంతంలో ఒకో రకమైన ఆహారపు అ లవాట్లు కనిపిస్తాయి. పశ్చిమ బెంగాల్‌లో బ్రాహ్మణులు చేపలు తింటారు. చేపలను వాళ్లు ''జలపుష్పాలు''గా పరిగణిస్తారు. అంటే వాళ్ల దృష్టిలో చేపలంటే ఒకరకం సముద్రపు ఆకుకూర లాంటివన్నమాట. అయితే వాళ్లు కూడా ఇతర మాంసాహారం ముట్టుకోరు. కాశ్మీర్‌లో బ్రాహ్మణులు మరోరకం పాక్షిక మాంసాహారులు. అదేవిధంగా మనదేశంలో చాలా చోట్ల శాఖాహారులు కోడిగుడ్లను శాఖాహారంగా పరిగణించి స్వీకరించడం కనిపిస్తుంది.

ఈ నాడు ఆవు హిందువుల మత చిహ్నంగా మారిపోయింది. పరమ పవిత్రమైన జంతువుగా పూజలందుకుంటోంది. కానీ వేదకాలంలో, ఆతరువాత బ్రాహ్మణ, బ్రాహ్మణేతర సంప్రదాయాల్లో అంత పవిత్రమైనదిగా చూడబడలేదని, ఆకాలంలో ఇతర జంతువులలాగే ఆవులను యజ్ఞ యాగాల్లో బలియిచ్చేవారని, బ్రాహ్మణులు సైతం గోమాంసాన్ని ఆరగించేవారనీ ప్రాచీన గ్రంథాల ఆధారంగా సోదాహరణంగా వివరిస్తారు ప్రొఫెసర్‌ డి.ఎన్‌.ఝా.

గోసంరక్షణ ఆహ్వానించదగ్గదే ఆయినా అది శాస్త్రీయ పద్ధతిలో, దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జరగాలి తప్ప పరమత ద్వేషంతోనో, మూఢనమ్మకాలతోనో కాదనీ, ఒక్క ఆవునే ఎందుకు మిగతా జంతువులను మాత్రం ఎందుకు రక్షించకూడదు అంటారాయన. ఆయన రాసిన Paradox of the Cow: Attitudes to Beef Eating in Early India పరిశోధనా గ్రంథం పెద్ద సంచలనమే సృష్టించింది. అయితే చరిత్రను నిష్పాక్షికంగా పరిశోధించాలనే తప్ప ఇందులో ఎవరినీ నొప్పించే ఉద్దేశం లేదంటారాయన.

స్వయంగా శాఖాహారి అయిన ప్రొఫెసర్‌ ద్విజేంద్ర నారాయణ్‌ ఝా ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్ర బోధకులు. ఆయన సుదీర్ఘ పరిశోధనా పత్రంలోని కొంత భాగాన్ని ఈ చిరుపుస్తకంగా తెలుగులోకి తీసుకురావడం జరిగింది. అందులోంచి కొన్ని వ్యాఖ్యలు:

...గోమాంసం తినే అ లవాటు భారతదేశానికి విదేశాల నుంచి వలస వచ్చినవాళ్ల ద్వారా ముఖ్యంగా ముస్లింల ద్వారా మన దేశానికి సంక్రమించిందనీ, గోమాంస భక్షణని వాళ్లే మనదేశంలో ప్రవేశపెట్టారనీ కొందరు నమ్ముతారు. కానీ యజ్ఞయాగాల్లో గోవధ, గోమాంస భక్షణ అనేది మన దేశంలో చాలా ప్రాచీన కాలంనుంచే వుంది.

...పాకిస్థాన్‌లోని షిన్‌ తెగకు చెందిన ముస్లింలు ఇతర ముస్లింల మాదిరిగా పంది పట్ల ఎంత ఏహ్య వైఖరి కనబరుస్తారో ఆవు పట్ల కూడా అంతే ఏహ్య వైఖరి కనబరుస్తారు. వాళ్లు ఆవు మాంసాన్ని కూడా పంది మాంసంలాగే ఏవగించుకుంటారు.

...ప్రాచీన కాలపు హిందూ సాంప్రదాయం ప్రకారం గోమేథ లేదా అశ్వమేధ యాగాల్లో గోవును లేదా గుర్రాన్ని బలి ఇవ్వడం సర్వసాధారణమైన ఆచారంగా వుండేది.

...వేదాలలో మొత్తం 250 రకాల జంతువుల ప్రస్తావన వుంది. వాటిలో 50 రకాల జంతువులు పవిత్రమైన బలికి, మానవ వినియోగానికి అర్హమైనవిగా పేర్కొన్నారు. ''తైత్తరేయ బ్రాహ్మణం''లో వాస్తవానికి ఆవు మన ఆహారం (అథో అన్నం వాయ్‌ గోవః) అని చాలా స్పష్టంగా పేర్కొనబడింది. ''సుతపథ బ్రాహ్మణం''లో యజ్ఞవల్క్యుడు లేత ఆవు మాంసాన్ని కోరడం గురించిన ప్రస్తావన వుంది.

...ఋగ్వేద కాలంలో చనిపోయిన వ్యక్తి శవాన్ని కప్పేందుకు దళసరి ఆవు కొవ్వును ఉపయోగించేవారు. ఆ వ్యక్తి పరలోక యాత్రకు వాహనంగా ఉపయోగపడేందుకని శవంతో పాటు ఒక ఎద్దును కూడా దహనం చేసేవారు. ఉత్తర క్రియల్లో (దశదిన కర్మ) భాగంగా ఆవునో ఎద్దునో వధించి బ్రాహ్మణులకు విందు యిచ్చేవారు. ఆరోజు సమర్పించే జంతువుల స్థాయిని బట్టి పితృదేవతల సంతృప్తి ఆదారపడి వుంటుందని నమ్మేవారు. (ఋగ్వేదం X.14-18), అధర్వణ వేదం X 11.2, 48)

...మహా భారతంలోని అత్యధిక పాత్రలు మాంసాహారం తినేవే. రంతిదేవుని కథ ఇందుకు పరాకాష్ట. ప్రతిరోజూ ఆయన వంటగదిలో అనేక ఆవులను వధించి బ్రాహ్మణులకు ధాన్యంతో పాటు మాంసం పంచేవారు. రామాయణంలో ఆవుతో సహా వివిధ జంతువులను బలియివ్వడం, తిండి కోసం వధించడం గురించి వాల్మీకి అనేక సందర్భాల్లో ప్రస్తావించాడు.

... యమునా నదిని దాటేటప్పుడు సీత ''రాముడు తన ప్రతిజ్ఞా పాలన పూర్తిచేసిన తరువాత 1000 ఆవులతో , 100 పీపాల మద్యంతో నిన్ను కొలుస్తాను తల్లీ'' అని మొక్కడం గమనించవచ్చు.

... సీతకు దుప్పి మాంసం అంటే చాలా ఇష్టం. అందుకే రాముడు లేడి రూపంలో వున్న మారీచుణ్ని వెంటాడి వేటాడి చంపుతాడు. అట్లాగే భరద్వాజుడు ఒక ఆవుదూడను వధించి రాముడిని ఆహ్వానించిన వైనం కూడా రామాయణంలో కనిపిస్తుంది.

... గౌతమ బుద్ధుడు, మహావీరుడు అహింసా సిదాంతాన్ని ప్రచారం చేశారు. వైదిక కాలపు జంతుబలిని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే బుద్ధుడు మాంసాహారాన్ని తినకూడదని చెప్పలేదు. బౌద్ధ మతస్థులకు మాంసాహారం ఆమోదయోగ్యమనేందుకు గ్రంథస్త ఆధారాలు అనేకం వున్నాయి.

... మధ్యయుగపు తొలి రోజుల నుంచే గోవధ, గోమాంస భక్షణ పాపకార్యంగా చూడబడుతోంది.

...హిందూ గో సంరక్షణ ఉద్యమాన్ని మొదలు పెట్టినప్పటి నుంచీ రాజకీయ జన సమీకరణకు ఆవు ఒక సాధనంగా మారింది. 1882లో మొట్టమొదటి గోరక్షిణి సభ ను స్థాపించి స్వామీ దయానంద సరస్వతి అశేష జన బాహుళ్యాన్ని సంఘటిత పరిచేందుకు ఆవును మరింత బలమైన ప్రతీకగా తీర్చిదిద్దాడు. 1880లలో, 1890లలో ముస్లింల గోవధను ఎదిరించడం, తత్ఫలితంగా మతకలహాలు చెలరేగడం అనేక సార్లు జరిగింది. 1966లో జాతీయ స్థాయిలో గోవధను నిషేధించాలన్న డిమాండుతో అన్ని మతతత్వ పార్టీలు పార్లమెంటు ముందు భారీ ప్రదర్శనలు నిర్వహించాయి. 1979లో ఆచార్య వినోభా భావే దేశ వ్యాప్తంగా గోవధను నిషేధించాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్షకు కూచున్నారు. అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌ చట్టం తెచ్చేందుకు ప్రయత్నిస్తానని అస్పష్ట హామీ ఇవ్వడంతో ఆయన దీక్ష విరమించుకున్నారు.

ప్రాచీన భారతంలో ఆహారపు అ లవాట్లు
- డి.ఎన్‌. ఝా
ఆంగ్ల మూలం: Paradox of the Cow : Attitudes to Beef Eating in Early India, D.N.Jha

తెలుగు అనువాదం : రవి
ప్రచురణ కర్తలు: హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, ప్రజాశక్తి బుక్‌ హౌస్‌
ప్రథమ ముద్రణ: 2002
16 పేజీలు, వెల : రూ.4


.............

Friday, July 3, 2009

”నేను మేధావుల మధ్యన సెక్స్‌ వర్కర్‌ని”…. నళినీ జమీలాతో జె.దేవిక ఇంటర్వ్యూ … భూమిక సౌజన్యంతో ...



భూమిక తెలుగు స్త్రీవాద పత్రిక జూన్ ౨౦౦౯ సంచిక లో ప్రచురించబడ్డ ఈ ఇంటర్వ్యూని మాబ్లాగు సందర్శకుల సౌకర్యార్థం తిరిగి ఇక్కడ యదాతధంగా పొందుపరుస్తున్నాము. భూమిక వారికి మా కృతజ్ఞతాభినందనలు

భూమిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి

”నేను మేధావుల మధ్యన సెక్స్‌ వర్కర్‌ని”….

మీ ఆత్మకథ మలయాళంలో వెలువడిన తర్వాత, ”ఇప్పుడిక నళిని సెక్స్‌ వర్కర్ల మధ్యన ఓ మేధావి అన్నమాట” అంటూ ఎవరో ఓ కామెంటు చేశారు. ”లేదు నేను మేధావుల మధ్యన సెక్స్‌ వర్కర్‌ని”అని మీరు ప్రతిస్పందించారు. దీన్ని కొంచెం వివరిస్తారా?

అలాగే. నన్ను అవమానించాలని ఉద్దేశ్యపూర్వకంగా కొందరు చేసిన వ్యాఖ్యలకు నా ప్రతిస్పందన అది. కొన్నాళ్ళ కిందట నేనో షార్ట్‌ ఫిల్మ్‌ తీసిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ”ఈ సినిమాను ఓ సెక్స్‌ వర్కర్‌ తీసిందట.” అంటూ మాట్లాడుకున్నారు చాలామంది. ”అక్షరజ్ఞానం లేని పల్లెటూరి మనిషి సినిమా తీసింది ” అని కూడా చర్చించుకున్నారు. కనీసం ”ఓ స్త్రీ తీసిన సినిమా” అనే పద్ధతిలో కూడా లేవామాటలు. అంటే నేనొక సెక్స్‌ వర్కర్‌ను మాత్రమేననీ, అలాగే ఉండాలనీ వాళ్ళు నొక్కి చెప్తున్నారన్నమాట. ఆ మాటల్ని వాళ్ళకే అప్పచెప్దామన్పించి అలా మాట్లాడాను.

మలయాళంలో నా పుస్తకం వచ్చాక దాని మీద ఇలా ముద్ర వెయ్యాలని చాలా ప్రయత్నించారు. కేరళ రాష్ట్రంలో ఈ ప్రయత్నం మరింత ఎక్కువగా జరిగింది.కొన్ని చోట్ల నా పుస్తకానికి మంచి గౌరవం లభించింది.మైసూరులోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇటీవల నేను కొన్ని కార్యక్రమాల్లో కలిసి పనిచేశాను. వాటిలో పాల్గొన్న డాక్టర్లతో సమానంగా నన్నూ గౌరవంగా చూశారు. నేను ఓ సెక్స్‌వర్కర్‌గా వుంటూ జ్వాలాముఖి సంస్థలో మాత్రమే పని చేస్తుండిన రోజుల్లో చాలామంది నాతో బాగానే ఉండేవాళ్ళు. నేను అప్పట్లో ఇతరులను ”సహాయం” అడగాల్సిన స్థితిలో ఉన్న స్త్రీని అని. అలా వాళ్ళ సహాయ, సహకారాలకోసం దేబిరిస్తూ ”రక్షించండి, సాయం చెయ్యండి”అని పాకులాడినన్నాళ్ళూ వాళ్ళు నాపై ఔదార్యాన్ని కురిపించారు. ఎప్పుడయితే నాకంటూ ఓ స్వంత వ్యక్తిత్వాన్ని నిర్మించుకుని, అందరి సహాయాలూ అర్ధించడం మానేశానో - ఆ క్షణం నుంచీ నా మీద కురిసే దయా ప్రవాహం ఇంకిపోయింది. సరిగ్గా చెప్పాలంటే నిస్సహాయమైన నా రోదన వాళ్ళకు గొప్ప కిక్‌ ఇచ్చేదన్నమాట.నేను నా ఏడుపులు ఆపేసి వాళ్ళ ఆనందానికి భంగం కలిగించటం వాళ్ళు భరించలేకపోయారు! నేనలా ఏడుస్తూ ఉంటే, వాళ్ళంతా నన్ను రక్షించటానికి ముందుకొచ్చేవాళ్ళు - కానీ అది ఇంత త్వరగా ముగిసిపోయింది, పాపం.

ఒకప్పుడు నాకెంతో సన్నిహితంగా ఉండిన వాళ్ళలో చాలామంది, ఇప్పుడు దూరంగా పారిపోయారు. అందుకు నేనేమీ బాధపడటం లేదు. వాళ్ళ భయం చూస్తుంటే సరదాగా ఉంటుందంతే! మరో చిత్రమైన ప్రశ్నకూడా నాకు తరచుగా ఎదురవుతూ ఉంటుంది. నాతోటి సెక్స్‌వర్కర్ల బాధామయగాధలెన్నో ఉండగా పుస్తకం రాయటానికి నా ఆత్మకథనే ఎందుకు ఎంచుకున్నానని అడుగుతూ ఉంటారు. రెండు తప్పుడు అభిప్రాయాలు ఈ ప్రశ్నలో ఇమిడి ఉన్నాయి. మొదటిది-నేను ఇతర సెక్స్‌వర్కర్ల గురించీ, వాళ్ళ దుర్భర జీవితాల గురించి రాసి ఉండాల్సిందనీ- అందులో బాగంగానే నా కష్టాలను కూడా రాసుకోవాల్సిందనీ వాళ్ళ అభిప్రాయం.”ఇది కేవలం నా కథ కాదు అంతకన్నా లోతైనది-ఆత్మకథ” అని జవాబిచ్చాను. ఈ సమాధానంతో వాళ్ళు హతాశులయ్యారు. ఎందుకంటే ‘రక్షించండి!రక్షించండి!” అంటూ ప్రాధేయపడిన స్త్రీ స్వరం కాదిది!

ఇక రెండో విషయానికొస్తే - సెక్స్‌ వర్కర్‌గా పనిచెయ్యటంలో నాకసలే బాధాలేనట్టుగా ఈ పుస్తకంలో వస్తోందట! ఎంత పకడ్భందీగా వ్యూహం పన్నారో చూశారా?

లయాళంలో వచ్చిన మీపుస్తకాన్ని చదువుతుంటే నేనో విషయాన్ని గమనించాను. మీ గత జీవితానుభవాలను వర్తమానకాలంలోకి తెచ్చిన శైలిని వాడారు. ఎందుకలా?

నా జ్ఞాపకాలను నేను నెమరువేసుకున్న పద్ధతే ఆ శైలిని రూపొందించిందను కుంటాను. నా మనసులో ముద్రించుకు పోయిన అనుభవాలను సినిమాలో దృశ్యాలను లాగా కళ్ళ ముందుకు తెచ్చుకుంటూ ఈ పుస్తకం రాశాను. మా నాయనమ్మ నేలమీద పాకుతూ వస్తున్న దృశ్యం నా జ్ఞాపకాల సంపుటిలో మొట్టమొదటిది. ఆమె అలా దేకుతూ వుంటే పొడుగ్గా సాగిన ఆమె చెవి తమ్మెలు కదులుతూ వుండటం కూడా ఇప్పటికీ నా కళ్ళముందు ఉంది. నా జీవితంలో ప్రతి అడుగునా ఓ పోరాటం చెయ్యాల్సి రావటంకూడా ఈ జ్ఞాపకాలు నాలో సజీవంగా ఉండటానికి కారణం కావచ్చు. జీవితపు ప్రతి దశలోనూ ఆగి వెనక్కి చూసుకుంటే నేను దాటివచ్చిన ప్రమాదాల అగాధాలు కనబడుతూనే వుంటాయి. ఇంతకాలం ఎలా బతికి ఉన్నాననా అని ఆశ్చర్యం వేస్తుంది ఒక్కోసారి. జీవితాన్ని అతి తరచుగా సమీక్షించుకుంటూ, నెమరు వేసుకుంటూ ఉండే లక్షణం వల్లనే నా జ్ఞాపకాలను ఇంత స్పష్టంగా పదిల పరచుకోగలిగానని కూడా అన్పిస్తుంది.

నా ఈ జీవితాలనుభవాల స్మృతులే గడ్డుకాలంలో నాకు గొప్ప ధైర్యాన్నిచ్చాయి. పెద్ద సమస్య ఎదురైనప్పుడల్లా ఓ క్షణం ఆగి గత అనుభవాలను తలుచుకుంటాను. ఇన్ని సమస్యల్ని దాటి వచ్చినదాన్ని ఇప్పుడింతగా భయపడాలా? అని ప్రశ్నించుకుంటాను.ఇన్ని ఇబ్బందులు మోయగలిగినదాన్ని అమ్మగా, అమ్మమ్మగా నా కర్తవ్యాలను, నేరవేర్చినదాన్ని ఎందుకింత భయపడాలని నాకు నేనే ధైర్యం చెప్పుకుంటాను. నా తోటి స్త్రీలతో మాట్లాడి, వాళ్ళ బాధల్ని విన్న తర్వాత నా గత జీవితానుభవాలనూ, ఎదుర్కొన్న సమస్యలనూ మలచుకోవటం నాకు గొప్ప శక్తి నిస్తుంది.

నా ఆత్మకథను గురించి కొందరు లేవనెత్తుతున్న మరొక అభ్యంతరం ఏమిటంటే - ఈ పుస్తకంలో వినబడుతున్నది నా అసలైన గొంతుకాదనీ, ‘క్లయింట్లు’లాంటి పదాలను వాడటం నా చైతన్య స్థాయిని మించినదనీ, ఈ పదం ఇటీవలనే వాడుకలోకి వచ్చిందనీ, నేను నా గతాన్ని చెప్పేటప్పుడు కూడా దాన్ని వాడటం అసహజమని వాళ్ళ వాదన. ఆ అభిప్రాయం సరైందికాదని నేనంటాను. సెక్స్‌ వర్కర్ల హక్కుల గురించి చైతన్యం మొదలవని రోజుల్లో కూడా మేము ”క్లయింట్లు” అనే మాటను మరో ఉద్దేశ్యంతో వాడుతుండే వాళ్ళం. మా వృత్తి ఏమిటన్నది బయట పడకుండా ఉండేందుకు ఉపయోగించే సంకేత భాషలో ఈ పదాన్ని సెక్స్‌ వర్కర్లు ఎప్పటినుంచో వాడుతూ ఉన్నారు. ఇటీవలి కాలంలో ఆ మాటను వాడటం సత్యాన్ని దాచటమనే ప్రయోజనంకోసం కాదు.

మీరు అత్తావారింట్లో ఎదుర్కొన్న సమస్యలకూ-సెక్స్‌వర్కర్‌గా మారటానికీ మధ్యనున్న సంబంధాన్ని మీరెలా అర్ధం చేసుకుంటున్నారు?


నిజం చెప్పాలంటే ఆ విషయాలను గురించి నేనంత లోతుగా ఆలోచించనే లేదు. డబ్బుకోసం ఓ మగవాడితో వెళ్ళటం, అతను ఎంతో కొంత ఇవ్వటం- అంతటితో కథ ముగిసేది. ఈ వృత్తిని జీవనోపాధిగా మార్చుకోవాలని అనుకోలేదు-కానీ తప్పనిసరైంది. ఓ సారి ఇందులోకి దిగాల్సిన పరిస్థితంటూ వచ్చాక , ఎదురయ్యే కష్ట నష్టాలను ధైర్యంగా ఎదుర్కోవటానికే సిద్ధపడ్డాను.

ఈ సమస్యలను ఏదో ఒకనాటికి దాటగలమని నాకు విశ్వాసం ఉంది. ఎంతో అందమైన యువతులు ఈ వృత్తిలోకి వచ్చాక అపరాధ భావంతో కుంగిపోతూ దుర్భరమైన జీవితాలు గడపటం చూస్తున్నాను. దానివల్ల వాళ్ళు మరింత దోపిడీకి గురౌతున్నారు. వాళ్ళకు నేనిచ్చే సలహా ఒకటే- ఏ కారణాల వల్లనైనా కావచ్చు. ఒకసారి వృత్తిలోకి అడుగుపెట్టటమంటూ జరిగిపోయాక ధైర్యంగా నిలబడాలి. నీ మీద నువ్వు జాలి పడటం మానేసి ”నాకు సంబంధించిన వాస్తవం ఇదీ” అని గుర్తుంచుకోవాలి.

ఈ వృత్తి నా దినసరీ జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చింది. అంతకుముందు కూడా నా జీవితంలో సుఖాలూ, సంతోసాలూ ఏమీ లేవు. దిన దిన గండంగా బతుకుతూ వుండడంతో నా మీద నాకే శ్రద్ధ లేకుండా తయారయ్యాను. ఈ వృత్తిలోకి వచ్చాక నా శరీరం మీద శ్రద్ధ తీసుకోవటం తప్పనిసరి అయింది. మంచి బట్టలు కట్టుకుని హూందాగా తయారవటం నాలో ఓ రకమైన ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇలా ఆకర్షణీయంగా తయారవటమనేది మగవాళ్ళను శారీరకంగా ఆకట్టుకోవటానికి మాత్రమేనని నేనెప్పుడూ భావించలేదు. కానీ నాకు నేను ధైర్యంగా, హుందాగా ఉండటంవల్ల మగవాళ్ళు నన్ను తేలిగ్గా చూడటానికి ‘సంకోచిస్తారన్నది నా అనుభవంలో తేలిన విషయం.

కంపెనీలో పనిచేస్తున్నప్పుడు పొద్దున్నే లేచి స్నానం చేసి శుభ్రంగా తయారవటమనేది ఓ తప్పనిసరి నిబంధనగా అలవాటయింది. తర్వాత కాలంలో హోటళ్ళలోనూ, యాత్రా స్థలాల్లోనూ క్లయింట్లను కలుసుకోవాల్సిన సందర్భాల్లో కూడా ఇదే దినచర్యను పాటించేదాన్ని. ఉదయం ఐదింటికల్లా హోటలు గదినుండి గుడికి వెళ్తున్నట్టుగా తయారై బయటకి రావాల్సుంటుంది. కాబట్టి వేకువనే లేచిసిద్ధమయేదాన్ని.

నేను సెక్స్‌ వర్కర్‌గా మారకముందు ఎంతో సన్నితంగా ఉండిన స్నేహితురాళ్ళతో తర్వాతకాలంలో స్నేహాన్ని కొనసాగించటం చాలా ఇబ్బందిగా తయారైంది. వాళ్ళ భర్తలు అందుకు ఇష్టపడేవాళ్ళుకాదు. ఐనా నా స్నేహితురాళ్ళు ఏ సినిమాకో టౌనుకు వచ్చినపుడు నన్ను కలిసి మాట్లాడేవాళ్ళు. ఈ వృత్తి మానెయ్యమని కూడా చెప్పేవాళ్ళు. నాకు దూరమవుతున్నామన్న బాధతోనే వాళ్ళామాట చెప్తారని నాకు తెలుసు. మగవాళ్ళ కారణంగా నేను పడిన బాధలకు నా స్నేహితురాళ్ళు దిగులు పడేవాళ్ళు. భర్తలతో వాళ్ళు పడుతున్న బాధలను కూడా నాతో చెప్పేవాళ్ళు, ఆ భర్తలకూ, ఈ క్లయింట్లకూ పెద్ద తేడా కనబడేదికాదు, అదే చెప్పి, నా కోసం బెంగ పడొద్దని ఓదార్చే దాన్ని.


మీరు ఈ వృత్తికి వచ్చిన రోజుల్లో దేశంలో ఎమర్జెన్సీ కొనసాగుతోంది కదా! ఆ రోజుల్లో మీకెదురైన ప్రత్యేకమైన సమస్యలేమయినా ఉన్నాయా?కొందరు పోలీసుల గురించి మీ ఆత్మకథలో ప్రస్తావించారు కదా?


ఎమర్జెన్సీ కాలంలో నాకెదురైన మొదటి అనుభవం చెప్తాను-ఆ రోజు నేను పోలీసు స్టేషన్లో నిలబడి వున్నాను. పోలీసుల ఆధీనంలో ఉన్న బందీలను చూట్టానికి వాళ్ళ బంధుమిత్రులు చాలామంది గుంపులుగా తోసుకుని వచ్చారు.పోలీసులు వాళ్ళపై విరుచుకుపడి విచక్షణా రహితంగా కొట్టారు. మొదటిసారి అరెస్టు చేసినపుడు నాతో చాలా దురుసుగా ప్రవర్తించటంతో భయపడి పోయాను. ఐతే రెండోసారి పుతుకాడ్‌ పోలీసులు అరెస్టు చేసినప్పుడు నాకు పోలీసుల గురించి బాగా అర్ధమయింది. సాధారణ ప్రజలను భయభ్రాంతులను చెయ్యటానికి వాళ్ళెంత మొరటుగా ప్రవర్తిస్తారో కళ్ళారా చూశాను.

పుతుక్కాడ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఓ పోలీస్‌ అధికారి చాలా దుర్మార్గుడని నేను అప్పటికే విన్నాను. నన్ను ఎంత హింసిస్తారోనని బాగా భయపడ్డాను. మొదటిసారి దెబ్బలు తిన్నప్పుడే ఓ విషయం నాకు అర్ధమయింది. పోలీసులు మా క్లయింట్లుగా ఉంటే ఈ ఇబ్బందులు తగ్గుతాయని తెలుసుకున్నాను. పోలీసుల్లో ఎవరిస్థాయిని బట్టి వాళ్ళకు అధికారాలుంటాయి. కొందరు కిందస్థాయి పోలీసులక్కూడా వాళ్ళ పై అధికారుల ದగ్గరబాగానే చనువుంటుంది. అలాంటి కొందరిని నాకు మద్ధతుగా సంపాదించుకోగలిగాను. పుతుక్కాడ్‌ స్టేషన్లో నాకు పరిచయస్థుడైన ఓ పోలీసు ఉండటంతో సులభంగా బయట పడగలిగాను.

నన్ను వదిలిపెట్టాలంటే నాకు బంధువైనా మగవాడెవరయినా హామీ ఇవ్వాలని ఆ రోజు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ షరతు పెట్టాడు.నా క్లయింటుగా ఉన్న పోలీసాయనే ఆ గండం నుంచి గట్టెక్కించాడు. తనకు తెలిసిన ఓ ప్యాక్టరీ సూపర్‌వైజర్‌ను నాకు అన్నయ్యగా ప్రవేశపెట్టాడు. ఆ రోజుల్లో మాలాంటి వాళ్ళు పోలీసు స్టేషన్‌ నుంచి క్షేమంగా బయటకి రావటమంటే పెద్ద ఘనకార్యం చేసినంత పనిగా ఉండేది.

సెక్స్‌వర్కర్లకూ, ఇతర స్త్రీలకూ మధ్యన సమాజం నిర్మించే నైతికమైన సరిహద్దులను గురించి మీ పుస్తకంలో చర్చించారు. జీవనోపాధి కోసం ఇతర పనులు చేసే స్త్రీలకూ, సెక్స్‌ వర్కర్లకూ తేడా లేదనటం సమంజసమేనా?


మనుషులు పొట్ట పోసుకోటానికి ఎన్నో రకాల పనులు చేస్తున్నారు. ఇల్లు గడపటానికి, వృద్ధుల అవసరాలనూ, పిల్లలపోషణనూ చూసుకోటానికీ-ఆడవాళ్ళు ఎంతగానో సతమతమవుతున్నారు. డబ్బున్న ఆడవాళ్ళకయితే ఆర్ధికమైన ఇబ్బందు లుండవు మాకున్నట్టుగా. కానీ, పేద స్త్రీలకు, తలకుమించని భారాన్ని మోయాల్సి వాళ్ళకు - ఏదో ఒక రకంగా సంపాదించాలన్నదే ప్రధాన లక్ష్యంగా మారుతుంది. చేస్తున్న పని గౌరవప్రదమైనదా, కాదా అని ఆలోచించి ఎన్నిక చేసుకునే వెసులుబాటు ఎంత మాత్రమూ లభించదు.

ఉద్యోగాలు వెతుక్కుని, సంపాదించు కునే క్రమంలో కూడా ఎందరో స్త్రీలు శారీరకంగా దోపిడికి గురౌతూనే వున్నారు. అలాంట ిస్త్రీలు గౌరవ పాత్రులైన భార్యలుగా మిగలకపోవచ్చు.ఇక ఇళ్ళలో పనిమనుషులు చేస్తున్న చాకిరీకి గౌరవం దక్కుతోందని నాకు నమ్మకం లేదు. ఇంటిల్లిపాదివీ మురికి బట్టలుతికి, కుళ్ళు పనులన్నీ చేసినా యజమానులైన మగవాళ్ళకు ఏ మాత్రమూ గౌరవం ఉండదు.. అంతేకాదు ఎన్నో ఇళ్ళలోని మగవాళ్ళు పనిమనుషులుగా ఉన్న స్త్రీలను చేజిక్కించుకోటానికి కప్పను వేటాడే పాముల్లా కనిపెట్టుకుని ఉండి కాటు వెయ్యటమూ చూశాన్నేను.

ఈ విషయాలన్నీ ఉన్నత వర్గాల స్త్రీలకు తెలీనివికాకున్నా, తెలీనట్టే నటిస్తూ ఉంటారు. తమలాంటి గౌరవనీయమైన స్త్రీలకూ, మాలాంటి చవకరకం ఆడవాళ్ళకూ మధ్యనుండే సరిహద్దు రేఖనుండి వాళ్ళు ప్రయోజనం పొందుతూ ఉంటారు. ఆ సరిహద్దు నిజానికి చాలా బలహీనమైనదనీ, మగవాళ్ళ దృష్టిిలో ఏ స్త్రీలకూ సమాన హోదాలేదనీ మాకు తెలుసు.

ఇక మా వృత్తిలోని ప్రమాదాలనూ, హింసనూ గురించి చాలా మంది అడుగుతుంటారు. ప్రమాదాలు లేనిదెక్కడని నాప్రశ్న! చెట్టు మీద పండు ఉందనుకోండి. కొందరు దాన్ని నాజూగ్గా కోసుకుని తింటారు. మరికొందరు రాళ్ళతో రాలగొట్టి తింటారు. చివరికి రెండు రకాల వాళ్ళూ చేసేది ఆ పండును మింగటమేకదా! పెళ్ళిళ్ళ ద్వారా రక్షణ దొరుకుతుందన్నది కూడా ఉత్తి భ్రమగానే మిగులుతోంది. కాకపోతే క్లయింట్ల చేతుల్లో దెబ్బలు తినటాన్ని ‘హింస’గా గుర్తించగలిగిన వాళ్ళక్కూడా భర్తల చేతుల్లో దెబ్బలు తినటంలోని ‘హింస’అంత సులభంగా అర్ధం కాదు.

తల్లిగా మీ బాధ్యతలను నెరవేర్చటానికి మీరు చేసిన ప్రయత్నాలు చదువుతుంటే నిజంగా మనసు చలించిపోతుంది. సెక్స్‌వర్కర్ల జీవితాలను గురించి కొన్ని అపోహలున్నాయి. ఆ స్త్రీలనుండి ఇలాంటి విషయాలను గతంలో ఎవరూ విని వుండరు.

ఏ వ్యక్తినైనా ఒక్క కోణం నుంచి మాత్రమే చూడడం సరైందికాదని నా ఉద్దేశ్యం. రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ ఉన్న ఆడవాళ్ళకు పిల్లల సంరక్షణ గురించి పట్టించుకునేంత సమయం ఉండదని తరచుగా వింటుంటాం. అంటే కుటుంబ బాధ్యతలు చూసుకోవాల్సిన స్త్రీకి మరొక జీవితమంటూ ఉండకూడదన్న మాట. ఒక వ్యక్తి ఒకే పని చెయ్యగలరన్న మాటను నేను ఒప్పుకోను. అన్నమూ, కూరలూ వడ్డించుకున్న వాళ్ళు అన్నీ కలిపి తినటం లేదూ? ఇదీ అలాగే.

నేను చేస్తున్న ఈ పనులన్నీ కేవలం పేరు ప్రతిష్టలకోసమేనని భావించేవాళ్ళు ఉన్నారు. స్వప్రయోజనాల కోసం పాకులాడే ఏ వ్యక్తీ తన చుట్టుపక్కలవాళ్ళనూ, తనపై ఆధారపడిన వాళ్ళనూ పట్టించుకోడు. అనేక సమస్యలపై పనిచెయ్యాలనుకుంటున్న వాళ్ళు అలా వుండరు. ఇతరుల ప్రయోజనాల గురించి ఆలోచిస్తూ , పనిచేస్తూనే ఉంటారు.

ఇకమాతృత్వం గురించి -సెక్స్‌ వర్కర్లుగా ఉన్న వాళ్ళకు మాతృత్వ బావనలూ, బాధ్యతలూ ఉండవనుకోవటం పొరబాటు. నా చేతుల్లో పెరిగిన నా బిడ్డకు ఈ విషయం బాగా తెలుసు.చిన్నప్పుడే నాకు దూరమైన నా పెద్ద కూతురికి నా అవస్థల గురించి సరిగ్గా తెలిసే అవకాశం లేదు. పిల్లలను పెంచి పెద్ద చెయ్యటానికి మేము పడే బాధలను జనం ఎప్పుడూ అర్ధం చేసుకోరు. ఈ వృత్తిలో ఉన్నందుకు పట్టుబడి జైలు పాలయిన సెక్స్‌వర్కర్లు పిల్లలకు దూరమవుతారు. ఆ పిల్లలు ఇంకెవరి దగ్గరో పెరుగుతారు. ఈ స్త్రీలు జైలునుంచి బయటకొచ్చేసరికి పిల్లలెక్కడున్నారో, ఏమయ్యారో తెలీకుండా పోతుంది. ఇలాంటి సంఘటనల్లో ఆ స్త్రీలు పడే బాధ అర్ధం చేసుకోలేని మనుషులు, సెక్స్‌ వర్కర్లు పిల్లలను గాలికి వదిలేస్తారని తేలిగ్గా మాట్లాడేస్తారు పిల్లలకు దూరమైన స్త్రీలు నిస్సహాయతా, వేదనా ఎవరికీ అర్ధం కావు.

సెక్స్‌వర్కర్ల మీద క్లయింట్లు చెలాయించే ఆధిపత్యాన్ని ప్రతిఘటించడానికి మీ పుస్తకంలో ఒక అధ్యాయాన్నే కేటాయించారు. అలాంటి మగవాళ్ళను వెక్కిరించటంతో ప్రారంభించి తర్వాత తీవ్రు.మైన ఎదురుదాడికి దిగారు.


అవును సెక్స్‌వర్కర్‌తో క్లయింటు ప్రవర్తించే విధానం అణువణువునా అహంతో, ఆధిపత్యంతో నిండివుంటుంది. అసలు అతను ఆ స్త్రీ దగ్గరికి రాకముందు నించీ కూడా ఆమె మీద సహజమైన అధికారమేదో తనకు సంక్రమించినట్టుగా భావించు కుంటాడు. అతనితో కలిసివున్న ఆ కాసేపైన ఆ స్త్రీ ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో నిబంధనలు పెడతాడు. అతనిచ్చే డబ్బులు తీసుకోవడంద్వారా అన్ని విధాలుగానూ లొంగిపోవాలని ఆశిస్తాడు. నిజానికి నేనెప్పుడూ క్లయింట్లతో వివాదా లకు దిగను. మర్యాదగా, సున్నితంగా ప్రవర్తిస్తూ అతని కోరికల్లో నాకు ఇష్టంలేని వాటిని తిరస్కరించే అవకాశాన్ని ఏర్పరచుకుంటాను. దీనివల్ల ఆ వ్యక్తికి నా అభిప్రాయాల్ని మన్నించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత క్రమంగా నిర్ణయాలు నా చేతిలోకి వస్తాయి. ఏ హోటలుకు వెళ్ళాలో, ఎలాంటి భోజనం కావాలో నేనే చెప్పగలుగుతాను.

క్లయింట్లు రమ్మన్న చోటికల్లా అనాలోచితంగా వెళ్లటం వల్ల స్త్రీలు చాలా ప్రమాదాల్లో పడతారు. హోటలు రూములకు తీసుకెళ్ళి స్త్రీలపై సామూహిక అత్యాచారా లకు పాల్పడ్డ ఉదంతాలు చాలా జరిగాయి. ఐతే, ఈ ప్రమాదాలను తప్పించుకోగలగటం కూడా అంత సులభమేమికాదు. ఎంతో జాగ్రత్తగా, దృఢంగా వ్యవహరించగలిగితే తప్ప ఈ వృత్తిలోకి స్త్రీలు తమను తాము కాపాడుకోలేరన్నది నిజం.

నేను మొట్ట మొదట కలుసుకున్నది ఓ పోలీసు అధికారిని. అతనే తర్వాత నన్ను అరెస్టు చెయ్యటానికి కారణమయ్యాడు. దాంతో నాకో విషయం అర్ధమయింది. ఏ క్లయింటూ సెక్స్‌వర్కర్‌నుంచి ఆత్మీయతను కోరుకోడు. వాళ్ళెప్పుడూ తమ అధికారాన్ని ప్రదర్శించుకునేందుకే చూస్తారు. అప్పట్నించీ వాళ్ళ అధిపత్యాన్ని ఇష్టమొచ్చినట్టుగా చెలాయించనివ్వకుండా జాగ్రత్త పడసాగాను.
మీ రచన ముగింపు అధ్యాయాన్ని తగినంత బలంగా రూపొందించలేక పోయారని చాలామంది పాఠకులు భావిస్తున్నారు. నాకూ అలానే అన్పిస్తోంది.

నిజమే, ఒప్పుకుంటున్నాను. ఈ భాగాన్ని చాలా హడావుడిగా రాశాను. మొదటి ప్రచురణ సమయంలో జరిగిన ఇబ్బందులవల్ల ఈ సారి త్వరగా ముగించా లన్న ఆత్రుతతో రచన ఎలా వస్తోందో గమనించుకోలేకపోయాను. మరోసారి ఈ రచనను తిరగరాసే అవకాశం వచ్చిందంటే నా తోటి స్త్రీలకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ప్రజా జీవితంతో, సమస్యలతో సంబంధాలు ఏర్పరచుకోమనీ, సమాజాభివృద్ధికి పనికొచ్చే రంగాల్లో పనిచెయ్యమనీ చెప్పాలన్నది నా ఆశ. ఎంతోమంది అమాయకమైన ఆడపిల్లలు సెక్స్‌రాకెట్‌ వలలో పడి ధ్వంసమై పోతున్నారు. అలాంటి అమ్మాయి లకు ఆత్మరక్షణకోసం కొన్ని సూచనలు ఇవ్వాలని వుంది.

మీరిలా ఆత్మకథను రాసుకోవటమనేది నిజంగా ఓ సాహసం. ఇందుకు ప్రేరణనిచ్చిందేమిటో చెప్తారా?

నేనిలా పుస్తకం రాయాలనుకుంటు న్నానని తెలిసినప్పుడే చాలామంది గగ్గోలు పెట్టారు. మొదటి ప్రచురణ వచ్చాక, అదంతా నిజంకాదనీ, ఉత్తి కట్టుకథలు చెప్పాననీ వ్యాఖ్యానించారు. అసలు ఈ పుస్తకం రాసిన వ్యక్తి నిజంగా ఉందా అనే చర్చ కూడ మొదలయింది. తర్వాత నేను పుస్తకాన్ని తిరిగి రాస్తున్నానని తెలిసి మరో గొడవ ప్రారంభమయింది. నన్ను అడ్డుపెట్టుకుని వేరే వాళ్ళెవరో నా పేరిట ఇదంతా రాశారనీ, ఇదొక స్త్రీ ఆత్మకధ కావటంతో ‘ఫెమినిస్టు’లు దాన్ని ప్రచారం లోకి తెచ్చారనీ- ఇలా రకరకాల కధనాలు.

ఇవన్నీ విన్నాక పుస్తకాన్ని తిరగరాసి తీరాలనీ, అందుకునా స్నేహితుల సాయం తీసుకోవాలనీ నిర్ణయించుకున్నాను. నా మిత్రుల్లో కొందరు ఫెమినిస్టులు కూడా ఉన్నారు. నాకు సాయపడిన స్నేహితుల్లో ఎన్‌.బైజూ, షాజూ వి,వి, షమీనా, పి.వి.రేష్మా భరద్వాజ్‌, ఎస్‌.సంజీవ్‌, దిలీప్‌రాజ్‌ - వీళ్లంతా ముఖ్యులు. వాళ్ళు నాకు రాత పనిలో సాయం చేస్తామని ముందుకొచ్చారే తప్ప, ఏం రాయాలో నిర్ణయించే పద్ధతిలో ఎప్పుడూ ప్రవర్తించలేదు. నాకన్నా బాగా తెలిసిన వాళ్ళమూ, మేధావులమూ అన్న ఆధికత్యాభావం వాళ్ళలో ఏ కోశానా లేదు. చదువురానిదాన్నన్న ఆత్మన్యూనత నాలోనూ కలగలేదు. నా మనసులో భావాలను నాకు చేతనైన పద్ధతిలో వ్యక్తం చేశాను. వాళ్ళందరూ కలిసి నా జ్ఞాపకాలనూ, అను భవాలనూ అడిగి తెలుసుకుంటూ పుస్తకం రాయటానికి తోడ్పాటు నందించారు.

ఐతే మొదటి ప్రచురణ సమయంలో ఇలాంటి వాతావరణం నాకు దొరకలేదు. రాత పనిలో సాయంచేసిన వ్యక్తి ఇతరులెవ్వరి జోక్యాన్ని అనుమతించలేదు. అతను రాస్తున్న పద్ధతి నాకు నచ్చక ఎక్కడన్నా సవరించ బోయినా అతను అంగీకరించలేదు. ఆత్మకథా రచనకు కొన్ని పద్ధతులుంటాయని వాటిని పాటించి తీరాలనీ చెప్పేవాడు.

ఈ పుస్తకాన్ని ఇప్పుడున్న రూపంలో రాయాటానికీ, పాఠకులముందుకు తీసుకురావటానికీ నేనెంత శ్రమపడాల్సి వచ్చింది. నా అభిప్రాయాన్ని గౌరవించి పనిపూర్తయ్యేదాకా నాకు తోడుగా నిలిచిన మిత్రులందరికీ కృతజ్ఞురాలిని. నా ఆత్మకథ రెండో బాగాన్ని కూడా రాసి తీరుతాను. నా జీవితం కొనసాగినంత కాలమూ, నా అనుభవాలు ఇతరులకు ఉపయోగకరంగా తోచినంతకాలమూ పాఠకులు నా రచనలను ఆదరిస్తారు. అందుకే నా కథను మీకు ఇలా విన్పిస్తూనే వుండాలని నా కోరిక.



ఒక సెక్స్‌ వర్కర్‌ ఆత్మకథ-
నళినీ జమీలా
వెల : రూ. 50 –
ప్రచురణ: హెద్రాబాద్‌ బుక్‌ట్రస్ట్‌


వివరాలకు: హెచ్‌బిటి, ఫ్లాట్‌నెం. 85, బాలాజీనగర్‌, గుడిమల్కాపూర్‌
హైద్రాబాద్‌- 500067
(ఫోన్‌ 23521849)

Wednesday, July 1, 2009

ది సండే ఇండియన్ పత్రికలో వరవర రావు "పథేర్ పాంచాలి"

"ఊరు వాడ బతుకు"

ది సండే ఇండియన్ 12 జూలై 2009 సంచికలో దేవులపల్లి కృష్ణమూర్తి "ఊరు వాడ బతుకు" పుస్తకానికి వరవర రావు రాసిన ముందుమాట " పథేర్ పాంచాలి" ని సాహిత్యం శీర్షిక కింద (42-44 పేజీల్లో) యధాతధంగా ప్రచురించారు. ఆసక్తి వున్నవారు ఈ కింది సండే ఇండియన్ లింకు లో చూడవచ్చు.
http://www.thesundayindian.com/telugu/20090712/telugu.html

ఈ పత్రిక ఏకకాలం లో 14 భారతీయ భాషల్లో వెలువడుతోంది.
అదేవిధంగా వరవర రావు తెలుగు ఇంగ్లీష్ వెబ్ సైట్ ని ఈ కింది లింకులో చూడవచ్చు.
http://varavararao.org

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌