Thursday, June 27, 2013

భారత రాజ్యాంగం : కేంద్రం తో అప్పుడూ ఇదే పంచాయితీ !

" .... తెలంగాణా ఏర్పాటుచేస్తే దేశవ్యాప్తంగా అ లాంటి డిమాండ్లు మరెన్నో తలెత్తి దేశం ముక్క చెక్కలైపోతుందనీ కొందరు ఎలా దుష్ప్రచారం చేస్తున్నారో - ఆనాడు స్వయంగా కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకత్వమే భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటువల్ల 'ఉప జాతీయవాదం' పెరుగుతుందనీ, దేశ సమగ్రత, జాతీయ భావన దెబ్బతింటాయనీ హెచ్చరికలు జారీ చేసింది.

    ఇందుకు సంబంధించిన పలు ఆధారాలు మనకు గ్రాన్‌విల్‌ ఆస్టిన్‌ రాసిన 'ది ఇండియన్‌ కాన్‌స్టిట్యూషన్‌ - కార్నర్‌స్టోన్‌ ఆఫ్‌ ఎ నేషన్‌' అన్న పుస్తకంలో లభిస్తాయి. ఆక్స్‌ఫర్డ్‌ యునివర్సిటీ ప్రెస్‌ వారు ఈ పుస్తకాన్ని 1966లో ప్రచురించారు. 1972లో తొలి భారతీయ ముద్రణ వెలువడింది. విశేష పాఠకాదరణ పొందిన ఈ పరిశోధనాత్మక గ్రంధంలో గ్రాన్‌విల్‌ ఆస్టిన్‌ 'భారత రాజ్యాంగాన్ని ఎలా రాశారు, ఒక్కో అధికరణం తుదిరూపు సంతరించుకునే ముందు ఎలాంటి చర్చ జరిగింది' వంటి అంశాలను సవివరంగా విశ్లేషించారు.

ఇన్నాళ్ల తరువాత ఈ పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, నేషనల్‌ ట్రాన్స్‌లేషన్‌ మిషన్‌ వారు ''భారత రాజ్యాంగం - దేశానికి మూలస్తంభం'' అనే పేరుతో తెలుగులో వెలువరించారు.
....

పూర్తి వ్యాసం ఈ బ్లాగులో చదవండి
" ఉయ్యాల "

http://uyyaala.blogspot.in/2013/06/blog-post.html
.

భారత రాజ్యాంగం - దేశానికి మూలస్తంభం
-గ్రాన్‌విల్‌ ఆస్టిన్‌
తెలుగు అనువాదం :  ప్రభాకర్ మందార

483 పేజీలు, వెల: రూ.250


ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌- 500 006 


Monday, June 24, 2013

Thursday, June 20, 2013

ఒక మాదిగ ఎగరేసిన బతుకు జెండా : “మా నాయిన బాలయ్య”

సారంగ సాహిత్య వారపత్రిక లో
మా నాయన బాలయ్య పుస్తకం కోసం ఎస్ ఆర్ శంకరన్ గారు రాసిన ముందుమాటను
ప్రచురించారు
ఈ కింది శీర్షిక పై లేదా చిత్రం పై క్లిక్ చేసి చదవవచ్చు.


ఒక మాదిగ ఎగరేసిన బతుకు జెండా : “మా నాయిన బాలయ్య”

 

 

పురాణాలు కుల వ్యవస్థ - 5: రామాయణ మునులు - మతంగుడు, విశ్వామిత్రుడు, శంబూకుడు - బి. విజయభారతి

పురాణాలు కుల వ్యవస్థ - 5:

రామాయణాన్ని ఒక కావ్యంగానూ మత గ్రంథంగానూ కాకుండా సామాజిక దృష్టితో పరిశీలిస్తే ఎన్నెన్నో కొత్త అంశాలు ప్రకటితమవుతూ ఉంటాయి. రాముని కథలో అనేక కథలున్నాయి. మునుల కథలు, అసురుల కథలు - శాపాల కథలు - వీటితోబాటు శాస్త్ర చర్చలు - ధర్మాధర్మ నిరూపణ యత్నాలు చాలా కనిపిస్తాయి. మునుల కథల ఆధారంగా అప్పటి వర్ణధర్మాన్ని విద్యా వ్యవస్థను పరిశీలించటం ఈ గ్రంథం లక్ష్యం. ఈ కోణంలో పరిశీలనకు మతంగ, విశ్వామిత్ర, శంబూకుల కథలు ప్రధానంగా గ్రహించటం జరిగింది. ...
...
ఈ కథలలో ఒక సామాజిక క్రమం ఉన్నది. మతంగుని కాలం నాటికి విద్యలపైనా తపస్సులపైనా ఆంక్షలు లేవు. విశ్వామిత్రుని కాలం నాటికి కొన్ని వ్యవస్థలు బ్రాహ్మణ, వైశ్య వర్గాలకే ప్రత్యేకించారు. క్షత్రియులకు కొన్ని వ్యవస్థలు నిరాకరించారు. అప్పటికి క్షత్రియులు అద్విజులు. శంబూకుని కాలం నాటికి క్షత్రియుల నుండి శూద్రులను - అతి శూద్రులను వేరుచేసి వారికి అన్ని విద్యలు నిషేధించారు. రామరాజ్య వ్యవస్థలోని పరిణామ క్రమం ఇది. శూద్రుల సామాజిక స్థాయిలో అమానవీయత ఎందువల్ల ఎప్పుడు ప్రవేశించింది అనేది ఆలోచించాలి. ...
...
రామాయణ కాలంలో ప్రజలకూ మునులకూ మధ్య ఉన్న ధార్మిక సంబంధాల గురించీ యోగాభ్యాస నిరతి గురించీ ప్రస్తావిస్తున్న ఈ పుస్తకం కొన్ని కొత్త కోణాలను కూడా ఆవిష్కరిస్తున్నది.

శ్రమ విలువను ఎంతో గొప్పగా విశ్లేషించిన మార్క్స్‌ మహాశయుని కంటే శతాబ్దాల ముందరే ''శ్రమ నుండి ఎదిగినది నశించదు'' అంటూ రాక్షసుడుగా చెప్పబడుతున్న కబంధుడు రామునికి చెప్పాడనటం మతంగ సంస్కృతిని గురించి ఆలోచనలను రేకెత్తిస్తుంది.
...
డా. విజయభారతి తెలుగు అకాడమీ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు. వారు అనేక పుస్తకాలు రచించారు. వాటిలో అంబేడ్కర్‌, ఫూలేల జీవిత చరిత్రలు ప్రముఖమైనవి. పురాణాలు- కుల వ్యవస్థ పైన ఇది ఐదవ పుస్తకం. ఇంతకు ముందు వెలువడినవి:

1) పురాణాలు- కుల వ్యవస్థ -1 : సత్యహరిశ్చంద్రుడు (వెల: రూ.15/-)
2) పురాణాలు- కుల వ్యవస్థ -2 : దశావతారాలు (వెల: రూ.25/-)
3) పురాణాలు- కుల వ్యవస్థ -3 : షట్చక్రవర్తులు (వెల: రూ.30/-)
4) పురాణాలు- కుల వ్యవస్థ -4 : వ్యవస్థను కాపాడిన రాముడు (వెల: రూ.100/-)



పురాణాలు కుల వ్యవస్థ - 5:
రామాయణ మునులు - మతంగుడు, విశ్వామిత్రుడు, శంబూకుడు
- బి. విజయభారతి

92 పేజీలు, వెల రూ. 50/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ 500006
ఫోన్‌ నెం. 040 2352 1849




Wednesday, June 19, 2013

నూటా ఇరవై ఏళ్ళుగా పిల్లల్నీ పెద్దల్నీ అలరిస్తున్న ఎవర్ గ్రీన్ కథలు

మొగ్లీ - జంగిల్‌ బుక్‌ కథలు



మొగ్లీ 
జంగిల్‌ బుక్‌ కథలు

రడ్‌యర్డ్‌ కిప్లింగ్‌



రడ్‌యర్డ్‌ కిప్లింగ్‌ 'జంగిల్‌ బుక్‌' రాసి నూటా ఇరవై ఏళ్లు గడిచిపోయాయి. అయినప్పటికీ ఈ పుస్తకం అశేష పాఠకులను ఇంకా అలరిస్తూనే వుంది. ఇందులోని కథలన్నీ 1893-94 సంవత్సరాల్లో వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా అనేక సంపుటాలుగా, చలన చిత్రాలుగా, యానిమేషన్‌ చిత్రాలుగా, నాటకాలుగా వెలువడ్డాయి. బాయ్‌ స్కౌట్‌ వంటి ఎన్నో సంస్థలు వాటిని వినియోగించుకున్నాయి. ప్రధానంగా మొగ్లీ చుట్టూ తిరిగే తొమ్మిది కథలను ఈ తెలుగు అనువాదంలో పొందుపరచడం జరిగింది.

కిప్లింగ్‌ కథనంలో పందొమ్మిదవ శతాబ్దపు ప్రకృతి చిత్రణ విధానం వ్యక్తమవుతుంది. మానవుల నియమాలకంటే ప్రకృతి నియమాలే ఎంతో ఉన్నతమైనవి అని చాటడం కనిపిస్తుంది. అడవిలో అజ్ఞానం, హింస కొంత ఎక్కువగా వున్నప్పటికీ మంచీ చెడు తెలిసిన, దేనినైనా ఎన్నుకునే స్వేచ్ఛ వున్న మానవ సమాజంలో వాటి పరిస్థితి మరీ దారుణం అంటారు. ఈ కథలు అడవిలో కాటగలసిపోయిన ఒక పసివాడికీ, మాట్లాడే జంతువులతో అతనికి ఏర్పడ్డ స్నేహానికీ సంబంధించిన కథలుగా పైకి అనిపిస్తాయి. కానీ ఎంతటి సమస్యలనైనా ఎలా ఎదుర్కోవాలో, స్నేహం ఎంత విలువైనదో చాటి చెప్పడమే వీటి ప్రధాన లక్ష్యం.

రడ్‌యర్డ్‌ కిప్లింగ్‌ రచనల మీద అనేక అధ్యయనాలు, పరిశోధనలు జరిగాయి. ఆయన రచనల్లో అనేక వివాదాస్పద అంశాలు కూడా వున్నాయి. మొగ్లీ అడవి మీద సాధించిన పట్టు పరోక్షంగా భారతదేశం మీద తెల్లవారి పాలనను సూచిస్తుంది అంటారు విమర్శకులు. భారతదేశంలో పుట్టి పెరిగిన ఒక వలసవాద తెల్ల అబ్బాయి దృక్పథమే ఈ కథల్లో ప్రతీకాత్మకంగా వ్యక్తమయిందనీ, ఈ కథలను ఆ కోణంలోనే చూడాల్సి వుంటుందని కొందరు  భావిస్తారు. ఇందులో కనిపించే వివిధ జంతువులు భారతదేశంలోని విభిన్న తరహా వ్యక్తులను, వారి మధ్యనున్న హెచ్చుతగ్గుల దొంతరలను సూచిస్తున్నాయంటారు. బ్రిటిష్‌ పాలకులు విభిన్న వర్గాలకు చెందిన భారతీయులతో ఎలా వ్యవహరించారో మొగ్లీ కూడా ఆయా జంతువులతో అ లాగే వ్యవహరించడం కనిపిస్తుందంటారు. జంతువులకూ మనుషులకూ మధ్య వున్న తేడా, మొగ్లీ వాడిచూపుల వర్ణనల్లో ఇది స్పష్టమవుతుందనీ, మొగ్లీ తన కంటి చూపుతోనే జంతువులను హడలగొట్టడం, అదుపులో పెట్టుకోవడం దానినే సూచిస్తుందనీ అంటారు.

రడ్‌యర్డ్‌ కిప్లింగ్‌ రాసిన 'కిమ్‌' తన అభిమాన నవల అని జవహర్‌లాల్‌ నెహ్రూ పేర్కొన్నారు. కిప్లింగ్‌ 'బ్రిటిష్‌
సామ్రాజ్యవాద ప్రవక్త' అని జార్జి ఆర్వెల్‌ అభివర్ణించారు. అయితే బ్రిటిష్‌ సామ్రాజ్యం అస్తమించిన తరువాత అందరూ ఆయనను ఒక అసాధారణ రచయితగా, వివాదాస్పదకోణంలో సైతం ఆ సామ్రాజ్య అనుభవాలకు భాష్యం చెప్పినవ్యక్తిగా గుర్తిస్తున్నారు. అనితరసాధ్యమైన రచనా శైలి ఆయన పేరుప్రఖ్యాతులను ఇంకా విస్తరింపజేస్తోంది.

జంగిల్‌ బుక్‌ కేవలం పిల్లల పుస్తకమా?

కొన్ని పరిమితులతో ఆలోచించినప్పుడు మాత్రమే ఇది పిల్లల పుస్తకం అన్న భావన కలుగుతుంది. కానీ ఇది పిల్లలూ పెద్దలూ అందరికీ వర్తించే పుస్తకమని కిప్లింగ్‌ని అభిమానించే విజ్ఞులైన అనేక మందిపాఠకులు విశ్వసిస్తారు. బాల్యంలో ఈ కథలను చదివినవాళ్లు లేదా విన్నవాళ్లు పెద్దయిన తరువాత ఈ పుస్తకాన్ని మళ్లీ ఎంతో ఆసక్తిగా తిరగేస్తూ ఆనందించడం సర్వసాధారణం.

ఈ అద్భుతమైన కథలు పిల్లల్నీ పెద్దల్నీ ఆకట్టుకుంటాయి, అబ్బురపరుస్తాయి, ఆనందింపచేస్తాయి, ఆలోచింపజేస్తాయి. మళ్లీ మళ్లీ చదవాల్సిన కథలివి.
...

రడ్‌యర్డ్‌ కిప్లింగ్‌ (1865-1936) ఇంగ్లీష్‌ భాషనుంచి సాహిత్యంలో తొలి నోబుల్‌ బహుమతిని (1907) అందుకున్న

రచయిత. అతి చిన్న వయసులో నోబుల్‌ పురస్కారాన్ని పొందినవాడిగా ఆయన రికార్డు ఇప్పటికీ అలాగే వుంది. కిప్లింగ్‌ ముంబయిలో జన్మించారు. ఆయన తండ్రి ముంబయి జె.జె.స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో ఆర్కిటెక్చరల్‌ ప్రొఫెసర్‌గా, ప్రిన్సిపల్‌గా పనిచేశారు. ఐదేళ్ల వయసులో కిప్లింగ్‌ని తల్లిదండ్రులు ఇంగ్లండ్‌ పంపించారు. అయితే పదహారేళ్ల వయసులో ఆయన తిరిగి భారత దేశానికి వచ్చారు. ఏడేళ్ల పాటు ఇక్కడే పత్రికా రచయితగా పనిచేశారు. ఆ కాలంలోనే కిప్లింగ్‌ అనేక కథలు, కవితలు రాశారు. తదనంతరం కొంతకాలం అమెరికాలో వుండి
బ్రిటన్‌ చేరుకుని శేష జీవితం అక్కడే గడిపారు.

...
అనువాదకుడు ప్రభాకర్‌ మందార హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పాఠకులకు సుపరిచితులే. అనువాదాలతో పాటు పలు కథలు, రేడియో నాటికలు రాశారు. హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించిన ప్రొ.యాగాటి చిన్నారావు పరిశోధనా గ్రంథం 'ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర' అనువాదానికి గాను 2009లో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాన్ని (2009) అందుకున్నారు. అపరాజిత అనే నాటక రచనకు ఆకాశవాణి జాతీయ బహుమతిని(1987) గెలుచుకున్నారు. ఆర్టీసీలో ఉద్యోగవిరమణ చేశారు.



మొగ్లీ - జంగిల్‌ బుక్‌ కథలు

రడ్‌యర్డ్‌ కిప్లింగ్‌

English Original : The Jungle Book by Rudyard Kipling


స్వేచ్ఛానువాదం : ప్రభాకర్‌ మందార


166 పేజీలు, వెల : రూ. 100/-



ప్రతులకు: 

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ 500006
ఫోన్‌ నెం. 040 2352 1849


Tuesday, June 18, 2013

తెలంగాణా ప్రాంతానికి చెందిన మొట్టమొదటి దళిత ఆత్మకథాత్మక జీవిత చరిత్ర 'మా నాయన బాలయ్య'

'మా నాయన బాలయ్య'

- వై.బి.సత్యనారాయణ


అ లెక్స్‌ హేలీ 'ఏడుతరాలు' రాసి ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపాడు. ఆ పుస్తకం నల్లవాళ్ల బైబిల్‌గా ప్రసిద్ధికెక్కింది. ఇప్పుడు వై.బి.సత్యనారాయణ మూడు తరాల ఆత్మకథ రచించి చరిత్ర సృష్టించాడు. సాహిత్యంలో మరాఠీ ఆత్మకథ విజయకేతనం ఎగురవేస్తే ఇప్పుడు తెలుగులో తొలిజెండా ఎగురవేసిన ఈ పుస్తకం సాహిత్య చరిత్రలో ఓ మైలురాయి. మాదిగల చరిత్రను అక్షరీకరిస్తే అది రామాయణ, మహాభారతాలను మించిపోతుంది. ఇది ఒక బాలయ్య ఆత్మకథ మాత్రమే కాదు, లక్షలాది బాలయ్యల భార చరిత. రచయిత తన అపూర్వ మేధతో, పరిశీలనతో, రచనా శిల్పంతో ఈ పుస్తకాన్ని అమూల్యం చేశాడు. ఈ పుస్తకం చిదివితే మాట తప్పని మానధనులైన మాదిగల మహోన్నత మనస్తత్వం, స్వేచ్ఛ, వారి అమాయకత్వం పరోపకారప్రియత్వం, బహుభాషా పరిజ్ఞానం, సౌందర్యాత్మక దృష్టి మరియు చెప్పుల నిర్మాణంలో గొప్ప కళాసృష్టి పాఠకుల దృష్టిని ప్రగాఢంగా ఆకర్షిస్తాయి.

.................................................................................................................. - ఎండ్లూరి సుధాకర్‌

తెలంగాణా గ్రామీణ జీవితాల్లో పొరలు పొరలుగా ఎదురయ్యే పేదరికం, సామాజిక వెలి, అంటరానితనం, శ్రమ దోపిడీ, కష్టాల కడగండ్ల వంటి వాటన్నింటిపై ఓ దళిత కుటుంబం సాగించన యుద్ధాన్ని కళ్లకు కట్టే రచన ఇది. వాళ్లీ క్రమంలో చేసిన ప్రయత్నాలనూ, అనుభవించిన వేదననూ నిజాయితీగా ఆవిష్కరిస్తుందిది. విద్యకోసం, ఆత్మగౌరవం కోసం, స్వేచ్ఛకోసం జరిపే పోరాటంలో విజయం ఎంత ప్రధానమో బలంగా నొక్కి చెప్పే ఈ రచన - మనల్ని కల్లోల పరుస్తుంది. అదే సమయంలో ఎంతో స్ఫూర్తినీ రగిలిస్తుంది.

............................................................................................................................. - శాంతా సిన్హా

'... తన కొడుకుని గ్రామంలో వెట్టిచాకిరి నుంచి రక్షించాలనుకున్నాడు నర్సయ్య. అగ్రకులస్థుల నిరంతర వేధింపులు భరించలేక అతను తన పూర్వీకుల గ్రామాన్ని వదిలిరావడం- నర్సయ్యనే కాక తరువాతి తరాలను కూడా బంధవిముక్తుల్ని చేసింది. ఆత్మగౌరవమూ, కృషీ మనుషులకు శక్తినీ ఆత్మవిశ్వాసాన్నీ గుర్తింపునీ ఇస్తాయనేది బాలయ్య నమ్మకం. ఆ నమ్మకమే తన బిడ్డలను విద్యావంతులను చేయాలనే జీవిత ధ్యేయాన్ని కలుగచేసింది. నగరానికి వలసరావడం రైల్వేలో నౌకరీ సంపాదించడం భూస్వామల ఆగడాలకు దూరంగా, కొంత అజ్ఞాతంగా వుండడానికి కూడా దోహదం చేసింది. అయితే కుల వ్యవస్థా, దానితో వచ్చిన అవమానమూ దళితులను అన్నిచోట్లా వెంటాడుతూనే వుంటాయని ఈ జీవితకథ చెబుతుంది. విద్యాలయాల్లోనూ, ఇళ్లు అద్దెకు తీసుకునేటప్పుడూ ఒక్కొక్కసారి కులం దాచిపెట్టుకునే అవసరాన్ని కూడా పరిస్థితులు కల్పిస్తాయి. సమాజంలో మార్పుకు విద్య కీలకమైన పాత్ర పోషిస్తుందనీ, అది ఒక ఆయుధంవలె పనిచేస్తుందనీ ఈ పుస్తకం నొక్కి చెబుతుంది. ''

..................................................................................................- ఎస్‌.ఆర్‌. శంకరన్‌ (మార్చి 2010)

'మై ఫాదర్‌ బాలయ్య' పేరుతో ఆంగ్లంలో వెలువడిన రచనకు తెలుగు అనువాదం ఈ పుస్తకం. తెలంగాణా ప్రాంతానికి చెందిన ఓ మాదిగ రచయిత రాసిన మొట్టమొదటి ఆత్మకథాత్మక జీవిత చరిత్ర ఇది. ఒక రకంగా ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి ఇంగ్లీషులో వచ్చిన పూర్తిస్థాయి దళిత ఆత్మకథగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. రచయిత దీన్ని తన మాతృ భాష అయిన తెలుగులో కాకుండా ఇంగ్లీషులో ఎందుకు రాశారన్నది ఆసక్తికర అంశం. పుస్తకం చదువుతుంటే బాలయ్య, ఆయన కుటుంబం విద్యకు ఎంతటి ప్రాధాన్యం ఇచ్చారో మనకు అవగతమవుతుంది. అంటరానితనాన్ని, దాని మూలంగా నిత్య జీవితంలో అనుభవంలోకి వచ్చే తీవ్ర వివక్షలను అధిగమించడానికి విద్యను ఓ అత్యవసర సాధనంగా, మార్గంగా గుర్తించిన కుటుంబం వారిది. ఈ క్రమంలో రచయిత వై.బి.సత్యనారాయణ ఇంగ్లీషును మార్పునకు, ప్రభావశీలతకు కీలక సంకేతంగా కూడా గుర్తిస్తారు.

ప్రధానంగా రండు లక్ష్యాలను ఆశించి మేమీ తెలుగు అనువాదాన్ని మీ ముందుకు తెస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇంగ్లీషులో వచ్చిన తొలి దళిత ఆత్మకథాత్మక జీవిత చరిత్రగా తెలుగునాట దీనికి సముచిత స్థానాన్ని కల్పించటం మొదటి ఉద్దేశం. రెండోది - తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన మాదిగ, దళిత అనుభవాలు, కులానికి సంబంధించి ఎన్నో అంశాలను 'డాక్యుమెంట్‌' చేసిన ఈ రచనను తెలుగు పాఠకులకు అందుబాటులో ఉంచటం అవసరం అని మేం భావాస్తున్నాం.

............................................................................................................   - హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌

మా నాయన బాలయ్య

- వై.బి.సత్యనారాయణ



ఆంగ్లమూలం :  My Father Balaiah, Harper Collins, New Delhi, 2011

తెలుగు అనువాదం: పి.సత్యవతి

184 పేజీలు, వెల: రూ. 100/-

ప్రతులకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ 500006
ఫోన్‌ నెం. 040 2352 1849

.

Monday, June 17, 2013

మా నాయన బాలయ్య - వై బి సత్యనారాయణ పుస్తకావిష్కరణ సభ...

వై బి సత్యనారాయణ రచించిన ఆత్మకథ "మై ఫాదర్ బాలయ్య" తెలుగు అనువాదం "మా నాయన బాలయ్య" పుస్తకావిష్కరణ సభ   22 జూన్ 2013 సాయంత్రం 5. 30 కి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరుగుతుంది. అందరికీ ఇదే మా ఆహ్వానం 



హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌