Saturday, January 30, 2010

మోతె - తెలంగాణ బతుకుబాట - ఎం. కోదండరాం, మల్లెపల్లి లక్ష్మయ్య, ఆర్‌.లింబాద్రి ...

ఇది ఒక తెలంగాణా గ్రామం కథ.
ఉమ్మడి రాష్ట్రంలో కనీస వసతులు లేక తెలంగాణా గ్రామాలు ఎట్లా తిప్పలు పడుతున్నాయో తెలియజేసే కథ.

ఆ గ్రామం పేరు మోతె.
నిజామాబాద్‌ జిల్లా, వేల్పూరు మండలంలో వుంది.
తొమ్మిదేళ్ల క్రితం ఎం. కోదండరాం, మల్లెపల్లి లక్ష్మయ్య, ఆర్‌. లింబాద్రి మోతె వెళ్లి అక్కడి స్థితిగతులపై చేసిన అధ్యయన సారాంశమే ఈ చిరు పుస్తకం.

మోతె విరాట్‌ స్వరూపమే తెలంగాణ. ఆ గ్రామానికి ఉత్తర దక్షిణాలలో వాగులున్నట్లే తెలంగాణాకు ఉత్తరాన గోదావరి, దక్షిణాన కృష్ణా నదులున్నాయి. రెండు వాగులుండీ మోతె గ్రామం నీళ్లకు ఏడ్చినట్టే, తెలంగాణా కూడా రెండు నదులుండీ నీటి ఎద్దడితో బాధపడుతున్నది. అంకెలు గణాంకాలు కూడా తెలంగాణాకు జరిగిన అన్యాయాన్ని రుజువు చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో నీటి పారుదలకు చేసిన కేటాయింపుల్లో 90% భారీ మధ్య తరహా ప్రాజెక్టులకే వెచ్చించారు. అందువల్ల వచ్చిన ఫలితాలు కోస్తా ఆంధ్రకే ఎక్కువగా దక్కాయి. చిన్న నీటి పారుదలను విస్మరించడం వలన మోతెలో ఎండిపోయినట్టే తెలంగాణా అంతటా చెరువులు ఎండిపోయాయి. మోతె చిత్రం తెలంగాణాకు జరిగిన అన్యాయానికి ఒక మచ్చుతునకగా భావించవచ్చు.

మోతెకి రెండు వాగులే కాదు దక్షిణాన ఐదు చెరువులు కూడా వున్నాయి. వాటిలో పెద్ద చెరువు ప్రధానమైనది. అది నిండి అ లుగు పారితేనే మిగతా నాలుగు చెరువులకు నీరొస్తుంది. ఆ అ లుగు నీరు నాలుగు చెరువుల్లోకి పారడానికి నిజాం కాలంలోనే గ్రామస్తులు శ్రమదానంతో కాలువలు తవ్వుకున్నారు. అయితే ఇప్పుడు ఆ చెరువులకు వరదనీరు వచ్చే అవకాశాలు సన్నగిల్లడంతో అవి ఎండిపోతున్నాయి.

నలభై ఏళ్ల క్రిందటి వరకూ ఆ ఊళ్లో దాదాపు 300 బావులుండేవి. అవి కూడా ఎండిపోతుండటంతో 1969 నుంచి వాటిలో ఇన్‌వెల్‌ బోర్లు వేయడం మొదలుపెట్టారు. అయినా ఫలితం అంతంతమాత్రమే కావడంతో 1976 నుంచి బోర్లు వేయడం ప్రారంభించారు.

తెలంగాణాలో మొట్టమొదటి బోరు వేసింది మోతె లోనే అంటారు. ఇప్పుడు అక్కడ వ్యవసాయం ప్రధానంగా బోరు బావులపై ఆధారపడే సాగుతోంది. మొతేలో నేడు 900 బోర్లు, 25వ వరకు ఫిల్టర్లు వున్నాయి.

గత పది సంవత్సరాలుగా బోర్లలో కూడా నీళ్లు తగ్గిపోయాయి. గతంలో 150 అడుగులకే నీరు వస్తే ఇప్పుడు దాదాపు 300 అడుగుల కంటే లోతుగా బోర్లు వేయించాల్సి వస్తోంది.

బోర్లు ఒకసారి వేస్తే ఎప్పటికీ నీళ్లుంటాయన్న గ్యారెంటీ వుండదు. నీళ్లు ఎండిపోయినప్పుడు బావుల మాదిరిగా పూడిక తీయడం కుదరదు. బోరు ఎండి పోయిందంటే మరో కొత్త బోరు వేయించుకోవాల్సిందే. ఇక్కడ ఆవిధంగా ఒక్కొక్క రైతు గత పదేళ్లలో సగటున ఐదారు సార్లు బోర్లు వేయించారు. బంగ్ల భూమయ్య అనే రైతైతే యాభై బోర్లు వేయించారు.

బోరు వేయిస్తే నీరు పడుతుందని, ఆ నీరు చాలాకాలం వుంటుందని ఎలాంటి భరోసా వుండదు. ఈ ఊళ్లో గత పదేళ్లలో పది కన్నా ఎక్కువ బోర్లు వేయించిన కుటుంబాలు 30 వున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు. రైతులు వేలకు వేలు బోర్లకే ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దానికి తోడు ఓల్టేజీ సమస్య వల్ల మోటార్లు కాలిపోయి వారిపై అదనపు భారం పడుతూ వుంటుంది. మరో దారిలేక తెలంగాణా రైతులు ఇన్ని కష్టాలు పడుతూనే వ్యవసాయం చేస్తుంటారు.

ఆర్థికంగా పూర్తిగా చితికిపోయిన వాళ్లు రైతు కూలీలుగా, కార్మికులుగా మారి వలస పోతుంటారు. ఈ చిన్న ఊరి నుంచి ఇప్పటి వరకు 355 మంది దుబాయికి వలసపోయారు. మరెందరో బొంబాయి, భివాండీలకు వలస పోయారు.

మొత్తం తెలంగాణా అంతటా ఇదే పరిస్థితి.

తెలంగాణాలో బావుల కింద సాగయ్యే భూమి 1955 లో 2,56,809 ఎకరాలు కాగా, ఇప్పుడు బావుల కింద సాగయ్యే భూమి 25,26,451 ఎకరాలు!

చెరువులు ఎండి పోయాయి. కాలువలు రాలేదు. కనుక తెలంగాణా రైతులు అనేక వ్యయప్రయాసలకోర్చి మరో గత్యంతరంలేక బావులపై ఆధారపడవలసి వస్తున్నది. 53 ఏళ్ల ఉమ్మడి సమైక్య రాష్ట్రంలో తెలంగాణా సాధించిన ప్రగతి ఇది!

కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతం తెలంగాణా లోనే అత్యధికంగా వున్నప్పటికీ ఇక్కడి రైతులకు కడగండ్లు తప్పడం లేదు. ఇక్కడి ప్రజలకు తాగు నీటికి కూడా దిక్కులేకుండా పోతున్నది. ఉన్నది పోయింది. ఉంచుకున్నది పోయింది అన్నట్టు తయారైంది పరిస్థితి.

నికరమైన సాగునీటి వనరులు లేక ఇటు కరెంటు దేవుడు, అటు వాన దేవుడు ఈ ఇద్దరు దేవుళ్లపై ఆధారపడి తెలంగాణా భారంగా బతుకీడుస్తున్నది. ఆ ఇద్దరు దేవుళ్లు కనికరిస్తేనే తెలంగాణాలో వ్యవసాయం సాగుతుంది. లేకుంటే లేదు. ఈ నేపథ్యం నుండే ఇవ్వాళ తెలంగాణా రైతులు న్యాయాన్ని కోరుతున్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

మోతె - తెలంగాణా బతుకు బాట
-ఎం. కోదండరాం, మల్లెపల్లి లక్ష్మయ్య, ఆర్‌. లింబాద్రి

ప్రథమ ముద్రణ : 2001
24 పేజీలు, వెల: రూ.5


.

Sunday, January 24, 2010

మహారణ్యం సమక్షంలో మహామానవుడి సాక్షాత్కారం - చినవీరభద్రుడు ...

ప్రసిద్ధ బెంగాలీ రచయిత బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ (1884-1950) రాసిన పథేర్‌ పాంచాలిని సత్యజిత్‌ రాయ్‌ సినిమాగా మలిచి ప్రపంచ ప్రసిద్ధం చేశాడు.

ఆ స్థాయిలో ప్రసిద్ధి చెందనప్పటికీ, బిభూతి భూషణ్‌ రాసిన మరో నవల ''అరణ్యక'' (1938) కూడా ఎంతో విశిష్టమైన రచన.

దాన్ని సాహిత్య అకాడెమీ కోసం సూరంపూడి సీతారాం ''వనవాసి'' (1961) పేరిట తెలుగు చేశారు. ఎంతో కాలంగా ఆ పుస్తకం ప్రతులు ఎక్కడా దొరకడం లేదు. ఆ లోటు తీర్చడం కోసం ఇప్పుడు హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారు ఈ పుస్తకాన్ని మళ్లా తెలుగు ప్రజలకు అందించడం నాకెంతో సంతోషం కలిగించింది.

ఇప్పటికి దాదాపు ముఫ్ఫై ఏళ్ల కిందట ఎనభైల ప్రారంభంలో ఈ పుస్తకాన్ని మొదటిసారి నేనే కనుగొన్నట్టుగా ఎందరికో పరిచయం చేశాను. ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత ఆ పుస్తకాన్ని చూడగానే, పేజీలు తిప్పగానే- మహాలిఖారూప పర్వత శ్రేణి, మోహన్‌పురా రిజర్వు ఫారెస్టు, జ్యోత్స్నా పులకిత జలరాశి మయమైన సరస్వతీహ్రదం, వన్యశేఫాలికాపుష్పాల సౌరభం, పసుపు పచ్చని దూధలి పుష్పాల పరాగం
నన్నొక్కసారిగా ముంచెత్తాయి.

ప్రాచీన సంతాల్‌ రాజకుటుంబం, చకుమికి టోలాలో వాళ్ల ఇల్లు, బోమాయి బూరు పచ్చికబయళ్లు, నాఢా, లటులియాల్లో అ ల్లుకుంటున్న నూతన జీవన సంరంభం; నా జ్ఞాపకాల్లో మరుగుపడ్డవి ఒక్కసారిగా మేల్కొనడంతో, నా నిద్రాణ స్వప్నాల్నీ, నా చుట్టూ వున్న నగర జీవితాన్నీ సముదాయించుకోలేక నేను చాలా అవస్థపడ్డాను.

వనవాసి కథాంశం చాలా సరళం.
కలకత్తాలో నిరుద్యోగిగా వున్న సత్యచరణ్‌ అనే యువకుడు అవినాశ్‌ అనే మిత్రుడి కోరిక మీద బీహార్‌లోని పూర్ణియా జిల్లాలో వున్న దాదాపు పదివేల ఎకరాల ఎస్టేట్‌ వ్యవహారాలు చూసే పనికి ఒప్పుకుంటాడు.
నగరాన్ని వదిలిపెట్టి, ఆ అడవిలో దాదాపు ఆరేళ్లపాటు వుండిపోతాడు. అక్కడ అడవి నరికించి, భూమిని సాగులోకి తెచ్చి ఎస్టేటు ఆదాయం పెంచలవలసిన పని ఒకవైపూ, నెమ్మదిగా తనను లోబరుచుకున్న అడవి సౌందర్యం ముందు వివశుడైపోవడం మరొకవైపూ అతణ్ణి లాగుతుంటాయి. ఆ క్రమంలో దీన దరిద్ర భారతదేశ ముఖచిత్రమొకవైపూ, ప్రాచీన అరణ్య సీమల మహా సౌందర్యం మరొకవైపూ అతడికి సాక్షాత్కరిస్తాయి.

ఈ అనుభవాలన్నిటినీ ఎన్నాళ్ల తరువాతనో ''కలకత్తా నగరంలో క్షుద్రమైన ఒక గొందిలో, అద్దె కొంపలో మధ్యాహ్నవేళ కూర్చుని భార్య కుట్టుపని సూది చేసే సవ్వడి వింటూ వున్న సమయంలో తలచుకుంటూ మనకి చెప్తాడు. 'ఆ నిగూఢారణ్య సౌందర్యం, తెల్లవారు ఝామున చంద్రాస్తమయ దృశ్యం, కొండల పైన ఆకులు లేని గోల్‌గోలీ చెట్లపై కొమ్మకొమ్మకూ పూసిన పచ్చని పూలరాశి, శుష్కకాశవనం వ్యాపింపచేసిన కసరువాసనలు 'గుర్తొస్తూంటే' మళ్ళీ ఎన్ని పర్యాయాలు ఊహాకల్పనలోనే గుర్రమెక్కి, వెన్నెల రాత్రిలో పూర్ణియా ప్రయాణం చేశానో గుర్తులేదు' (పే.106) అంటాడు.

కథకుడు పూర్ణియా అడవులకు వెళ్లిన మొదటి రోజుల్లో అతడి కచేరీ ఉద్యోగి ఒకడు 'అడవి మిమ్మల్ని ఆవహిస్తుంది, అప్పుడింక ఎలాటి కోలాహలమూ జనసమ్మర్థమూ రుచించవు' అంటాడు.
అడవి ఆవహించిన అనుభవం ఎలా వుంటుందో కథకుడు నెమ్మదిగా మనకు వర్ణించడం మొదలుపెట్టడంతో మనని కూడా అటవీ సౌందర్యం ఆవహించడం మొదలుపెడుతుంది. అందుకు బిభూతి భూషణ్‌ వాడిన భాష, చిత్రించిన సన్నివేశాలూ, వాటికి సూరంపూడి సీతారాం వాడిన తెలుగూ మనల్ని గాఢంగా సమ్మోహపరుస్తాయి. అది ప్రతి ఒక్కరికీ అనుభవంలోకి వచ్చేదిగా వుంటుంది.

అయినా కూడా కథకుడు తాను చూసిన సౌందర్యాన్ని మనకు పూర్తిగా చెప్పలేకపోయాననే అనుకుంటాడు. ''పూల్కియా భైహార్‌ల''లో ఆ వెన్నెల రాత్రులను వర్ణించడానికి ప్రయత్నించను. ఆ సుందరలోకాన్ని, ఆ రూపంలో ప్రత్యక్షంగా చూడనంతకాలం, దాని గురించి చెప్పగా వినీ, రాయగా చదివీ గ్రహించడం అసంభవం... అంటువంటి వెన్నెల రాత్రిని జీవితంలో ఒక్కసారైనా చూడటం ఉచితం. అ లా చూడని వారికి ఈశ్వర సృష్టిలో ఒకానొక సౌందర్యానుభూతి నష్టమైపోయిందన్న మాటే' (పే.21) అంటాడొకచోట.

కానీ, కేవలం అడవి అందాన్ని వర్ణించడానికే బిభూతి భూషణుడు ఈ నవల రాయలేదు.
అడవి ఒక నెపం మాత్రమే. వనవాసం వల్లనే అతడు ప్రపంచమంటే ఏమిటో తెలుసుకుంటాడు.
అడవికి వెళ్లిన తరువాతనే మనుషుల్ని ప్రేమించడం మొదలుపెడతాడు.
అడవికి వెళ్లిన మొదటి రోజుల్లో కలకత్తాను తలచుకుంటూ ''మనుషుల మధ్య వుండడం అంటే, అంత ప్రియమైనదని ఇంతకు ముందు తెలియలేదు. మనుషుల పట్ల నా కర్తవ్యాన్ని సర్వదా నిర్వర్తించలేకపోయినమాట నిజమే.; అయినా ఎంత ప్రేమ!'' (పే.10) అనుకుంటాడు. ఈ వాక్యాలు ఈ నవల మొత్తానికి ప్రాతిపదిక.

కథకుడు కలకత్తాలో వున్నప్పుడు తన చుట్టూ మనుషులుండడంలోని ఆనందాన్ని పరిపూర్ణంగా అనుభవించాడు. కానీ వాళ్ల పట్ల తన కర్తవ్యం నిర్వహించే విషయంలో అతనికప్పుడేమీ ప్రాధాన్యత లేదు. కానీ అడవికి వెళ్లిన తరువాత అతడి చిత్తప్రవృత్తిలో వచ్చిన మార్పు సుస్పష్టం. అతడు మనుషుల కోసం ఆర్రులు చాచడమే కాదు, తనకు తారసపడ్డ ప్రతి ఒక్కరి పట్లా అతడెంతో ఉదారంగా, ఆప్యాయంగా, సుస్నేహంగా ప్రవర్తించడం కనిపిస్తుంది మనకి. తను కలిసిన ప్రతి ఒక్కరి భౌతిక, మానసిక, సాంఘిక అవసరాలు గుర్తించడంలో, వాటిని తీర్చడానికి ప్రయత్నించడంలో అతడి వ్యక్తిత్వంలో ధీరత్వం మన ముందు ఆవిష్కృతమౌతూ ముగ్ధుల్ని చేస్తుంది.
నవదాలక్ష్మీపురం సరిహద్దుల్లో మిఛీనది ఒడ్డున కనిపించే ధన్‌ ఝరి కొండ ఎంత గంభీరంగా కనిపిస్తుందో కథకుడి జీవితానుభవం కూడా అంతే గంభీరంగా కనిపిస్తుంది. అతడికి తారసపడ్డ రకరకాల మనుషులు కథకుడు జీవితంలో ప్రవేశించినట్లే మన జీవితంలోకి నెట్టుకొచ్చేస్తారు.

కథంతా చదివాక మనకేమనిపిస్తుంది?
కథకుడొకచోట ఇలా అంటాడు. ''నాఢా అరణ్యమూ, అజామాబాద్‌ విస్తృత మైదానాల్లో గోధూళివేళ రక్తరాగ రంజితమైన మేఘాలనూ, దిగంచలాల వరకూ వ్యాపించి జ్యోత్స్నాప్లావితమైన నిర్జన మైదానాలనూ చూచినప్పుడల్లా తోచేది ఈ స్వరూపమే. ప్రేమ ఇదే రోమాన్స్‌, కవిత, సౌందర్యం శిల్పం, భావుకత- ఈ దివ్య మంగళ రూపమే మనం ప్రాణాధికంగా ప్రేమించేది, ఇదే లలితకళను సృష్టించేది. ప్రీతి పాత్రులైన వారికోసం తనను తాను పూర్తిగా సమర్పించుకుని నిశ్శేషంగా మిగిలి పోయేది'' (పే.230). ఒక మహారణ్య సమక్షంలో కథకుడు తనలోని మహామానవుణ్ణి సాక్షాత్కరించుకున్నాడనీ, గొప్ప సౌందర్యం మనలోని మనిషిని మేల్కొల్పుతుందనీ, అదే సౌందర్య ప్రయోజనమనీ, సాహిత్య ప్రయోజనమనీ చెప్పకుండానే చెప్తుందీ రచన.

- చినవీరభద్రుడు
ఆదివారం ఆంద్రజ్యోతి 24 జనవరి 2010 సౌజన్యంతో.



వనవాసి
బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ
తెలుగు అనువాదం: సూరంపూడి సీతారాం

తొలి ముద్రణ: అద్దేపల్లి అండ్‌ కో, రాజమండ్రి; సాహిత్య అకాడెమీ, న్యూఢిల్లీ తరఫున,1961
హెచ్‌బిటి ముద్రణ: సెప్టెంబర్‌ 2009

278 పేజీలు, వెల: రూ.120


ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067
ఫోన్‌: 040 2352 1849


...

Sunday, January 10, 2010

అడవి బిడ్డల జీవితం - ఈనాడు సమీక్ష ...



బెంగాలీ నవలల అనువాదాలు రెండుమూడు దశాబ్దాల పాటు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి, మధ్యతరగతి జీవుల్లో పఠనాభిలాషను పెంపొందించాయి.

శరత్‌ నవలలైతే తెలుగువారికి ఎంత హృదయగతమయ్యాయో చెప్పనవసరమే లేదు.

బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ వంటి బెంగాలీ రచయితలు తెలుగు పాఠకులకు పరిచయమైంది అప్పుడే.

ఆయన రాసిన ''అరణ్యన్‌'' గిరిజన జీవితాల లోతుల్లోకి వెడుతూ ప్రకృతితో మమేకమై అరణ్య ప్రాంతాల స్థితిగతులతో మమేకం చేస్తుంది.

బెంగాలీలో 1938లోనే ముద్రితమైన ఈ నవలను ''వనవాసి'' పేరుతో సూరంపూడి సీతారాం అనువదించారు.

1961లో సాహిత్య అకాడమీ తొలి అనువాదాన్ని వెలువరించింది.

దాదాపు యాభై ఏళ్ల తర్వాత హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పునర్ముద్రించింది.


- ఈనాడు ఆదివారం 09 జనవరి 2010 సౌజన్యంతో


వనవాసి
బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ
తెలుగు అనువాదం: సూరంపూడి సీతారాం

తొలి ముద్రణ: అద్దేపల్లి అండ్‌ కో, రాజమండ్రి; సాహిత్య అకాడెమీ, న్యూఢిల్లీ తరఫున,1961
హెచ్‌బిటి ముద్రణ: సెప్టెంబర్‌ 2009

278 పేజీలు, వెల: రూ.120


ప్రతులకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067
ఫోన్‌: 040 2352 1849

ఇమెయిల్‌: hyderabadbooktrust@gmail.com

Monday, January 4, 2010

పుస్తకం డాట్ నెట్ లో సుజాత గారి వనవాసి నవలా సమీక్ష ...



పుస్తకం డాట్ నెట్ లో బిభూతి భూషణ్ బందోపాధ్యాయ "వానవాసి" నవలపై 'మనసులో మాట' సుజాత గారు చక్కని సమీక్ష రాశారు. పుస్తకాభిమానుల స్పందనలతో సహా ఆ సమీక్షను ... ఇక్కడ ... చూడవచ్చు.
మా బ్లాగు సందర్శకుల సౌలభ్యం కోసం పుస్తకం డాట్ నెట్ వారికి, సుజాత గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ సమీక్షను తిరిగి ఇక్కడ పొందు పరుస్తున్నాం.
కొందరు ఈ ప్రచురణ అసలు నవలకు సంక్షిప్త రూపమా అని అడుగుతున్నారు. ఇది 1961 నాటి తొలి ముద్రణకు యధాతధ రూపమని గమనిచగలరు.
- హైదరాబాద్ బుక్ ట్రస్ట్

........

"వానవాసి"

కొన్ని పుస్తకాలు చదువుతున్నపుడు అంత ఆసక్తిగా అనిపించకపోయినా పూర్తయ్యేసరికి ఒక గాఢమైన నిట్టూర్పు వెలువడక మానదు. కనీసం ఒక పదినిమిషాలన్నా అప్పటికప్పుడు ఆలోచనల్లో పడెయ్యక మానదు. ఆ తర్వాత పదే పదే గుర్తుకు రాకా మానదు.ఆ కోవలోదే “వనవాసి” నవల!

ఇది నవలా? సామాజిక ప్రయోజనం కోసం రాసిన డాక్యుమెంటరీ రచనా? ఒక ఏకాంత స్వాప్నికుడి జీవిత ప్రయాణంలో భాగమా? అని తలెత్తే ప్రశ్నలకు ఎవరికి వారు సమాధానం చెప్పుకోవలసిందే!

అప్పుడెప్పుడో పథేర్ పాంచాలి నవల చదువుతుంటే ముందు మాటలో భిభూతి భూషణ్ వంద్యోపాధ్యాయ గారి మరో నవల ‘అరణ్యక” గురించి చదివి దానికోసం ప్రయత్నిస్తే అది దుర్లభమని తేలింది.
అనుకోకుండా ఆ మధ్య విజయవాడలో పాత పుస్తకాల షాపులో వనవాసి మొదటి ప్రచురణ కాపీ,(1961 లో సాహిత్య అకాడేమీ తరఫున అద్దేపల్లి అండ్ కో రాజమండ్రి వారు వేసింది) దొరికింది. చాలా జాగ్రత్తగా చదవాల్సి వచ్చింది. కొన్ని పేజీలు పట్టుకుంటే పొడి అయిపోయేలా ఉన్నాయి.

ఇందులో కథంటూ పెద్దగా ఏమీ ఉండదు. ఉండేవల్లా ఆలోచనలే! రచయిత కథకుడిగా మారగా అతని మెదడులో ప్రాణం పోసుకుని హృదయం ద్వారా మనలోకి ప్రవహించి మనలో కూడా ఆలోచనల్ని రేకెత్తించే ఆలోచనలు!

విద్యావంతుడై ఉన్నత సంస్కారం కలిగిన ఒక బెంగాలీ యువకుడు సత్యచరణ్ బాబు!ఉద్యోగార్థియై తిరుగుతుండగా పాత స్నేహితుడు కనపడతాడు. మాటల మధ్యలో తమకు పూర్ణియా జిల్లాలో 30 వేల బిఘాల (బిఘా అంటే సుమారు 40 సెంట్ల నేల)ఎస్టేట్ అడవి ఉందనీ దాని బాగోగులు చూస్తూ అడవిని వ్యవసాయానికి కౌలుకిస్తూ వసూళ్ళు చూసే మేనేజర్ అవసరం ఉందని చెప్తాడు. ఏ పనికైనా సిద్ధంగా ఉన్న సత్యచరణ్ తాను ఆ ఉద్యోగం చేస్తానని ఒప్పుకుని అడవికి ప్రయాణమవుతాడు. ఒకవైపు కలకత్తా నగరాన్ని “మిస్”అవుతానేమో అన్న బెంగతోనే, అయిష్టంగానే పొట్టకూటికోసం అడవికి వెళతాడు.

ఎటుచూసినా అడవి, నిశ్శబ్దమైన అడవి, జన సంచారం లేని అడవి,కొద్ది మంది జనం ఉన్నా.. గిరిజనులు! వారి భాష అర్థం కాదు! బంధుమిత్రులు, పాటకచేరి, లైబ్రరీ,సాహిత్యం లేని జీవితాన్ని ఎన్నడూ ఎరగని సత్యచరణ్ ఈ జీవితాన్ని చూసి కుంగిపోతాడు.

కానీ రోజులు గడిచేకొద్దీ,అరణ్య సౌందర్యం అతన్ని వ్యామోహంలా ఆవహిస్తుంది.ఎంతగా అంటే కొన్నాళ్ళకి తిరిగి కలకత్తా నగరానికి పోలేనేమో అని భయం వేస్తుందతనికి!

అపూర్వ రక్తారుణ రాగరంజిత మేఘమాలలు ధరించిన సంధ్యలూ,ఉన్మాదిని అయిన భైరవీ స్వరూపం ధరించిన ఉగ్ర మధ్యాహ్నాలు,హిమస్నిగ్ధ వనకుసుమపరిమళంతో జ్యోత్స్నాలంకారాలతో ఎన్నో గంభీర నిశీధులు అతన్ని కట్టి పడేస్తాయి.అడవి కాచిన వెన్నెలే సార్ధకం అని నిర్ధారిస్తాడు అతడు.ఏకాంతంలో దిగంతాల వరకూ వ్యాపించిన వెన్నెల్ని అనుభవించి అడవిలో వెన్నెల రాత్రిని చూడని వారి జీవితంలో ఈశ్వర సృష్టిలో ఒకానొక అద్భుత సౌందర్యానుభూతి నష్టపోయినట్లే అంటాడు.

ఒకపక్క అడవిని నరికించి కౌలుకిస్తూనే ఆ చుట్టుపక్క పల్లెల్లో పేద జీవితాల దరిద్రం వికృత స్వరూపాన్ని చూసి నిర్ఘాంతపోతాడు. ఆకలితీర్చుకోడానికి పచ్చి మినప్పిండి తినేవారిని చూస్తాడు.పిల్లల ఆకలి తీర్చడానికి ఎంగిలాకుల కోసం ఆశపడుతూ, రేగుపళ్ళు దొంగతనం చేసి శిక్షకు సిద్ధమయ్యే అద్భుత సౌందర్యరాశిని చూస్తాడు. డబ్బుతో తనను కొనాలని చూసే భూస్వామిని చూస్తాడు. గొర్రెలు కాస్తూ ఒక ఆటవిక తెగకు రాజుగా పరిచయమయ్యే ముసలివాడిని కలుస్తాడు.

మొక్కలమీద ప్రేమతో ఎక్కడెక్కడినుంచో పూలతీగలు తెచ్చి సరస్వతీ మడుగు వద్ద నాటి అడవిని సప్తవర్ణ శోభితం చేయాలనుకునే బన్వారీని చూసి ముగ్ధుడవుతాడు.అతడితోపాటు మడుగు చుట్టూ అద్భుత పుష్ప వనాన్ని సృష్టిస్తాడు.పూలతో పందిరి వేస్తాడు.కోతల సమయంలో ఎక్కడెక్కడినుంచో వచ్చి పని చేసే కూలివాళ్లను, వాళ్ల కష్టాన్ని దోచుకునే చిల్లర వ్యాపారులనీ పరికించి నిశ్చేష్టుడవుతాడు.

కొన్నాళ్ళకి…మొత్తం అడవంతా నరికి కౌలుకివ్వడం పుర్తవుతుంది. ఇక సరస్వతి మడుగు ప్రాంతాన్ని ఇవ్వడానికి ఎంతో దుఃఖపడినా లాభం లేకపొతుంది.ఇక అతడికి అక్కడ పనేముంది?

భారమైన మనసుతో ఇరుకు వీధుల కలకత్తా నగరానికి తిరుగు ప్రయాణమవుతాడు.
తిరిగి వచ్చాక కూడా అతన్ని అడవి జ్ఞాపకాలు వదిలిపెట్టవు. వేధిస్తాయి.

అడవుల మనుగడ, వాటిమీద ఆధారపడి బతికే ఆదిమజాతుల మనుగడ,కరువైపోతున్న ప్రాణవాయువు…పచ్చదనం, వీటన్నిటిగురించీ రచయిత ఏమీ మాట్లాడడు. ఉపన్యాసాలివ్వడు. గగ్గోలుపెట్టడు.ప్రశ్నించడు.

కానీ ఆ పని మనచేత చేయిస్తాడు!

ఒక కల్లోలాన్ని రేకెత్తిస్తాడు మెదడులో!
“అడవులంతరించిపోతే?” అని నెమ్మదిగా పాకే ఆందోళనని మనలో సృష్టిస్తాడు.
కుంత,బన్వారీ,భానుమతి,రాజూపాండే,థాతురియా,నక్ఛేదీ, కవి వెంకటేశ్వర ప్రసాద్…వీళ్ళందరినీ మనకు అంటగట్టి తను మాత్రం నిశ్చింతగా ఉంటాడు.

అడవిలోని ప్రతి చిన్న సౌందర్యానికీ ముగ్ధుడయ్యే భిభూతి ప్రసాద్ ని ఈ నవల్లో చూడొచ్చు. వెన్నెల రాత్రుల వర్ణన పుస్తకంలో చాలా చోట్ల ఉంటుంది.

ఏకాంతంలో తనకు మాత్రమే గోచరమయ్యే ఆ అద్భుత వన సౌందర్యానికి పరవశుడై కవితావేశంతో స్పందిస్తాడు.రాగరంజితమైన మేఘాలను,దిగంతాల వరకూ వ్యాపించి జ్యోత్స్నా ప్లావితమై నిర్జనమైన మైదాన ప్రాంతాలనూ చూసి” ఈ స్వరూపమే ప్రేమ!ఇదే రొమాన్స్! కవిత, సౌందర్యం,శిల్పం, భావుకత. ఈ దివ్యమంగళ రూపమే మనం ప్రాణాధికంగా ప్రేమించేది.ఇదే లలిత కళను సృష్టించేది. ప్రీతిపాత్రులైన వారికోసం తనను తాను పూర్తిగా సమర్పించుకుని నిశ్శేషంగా మిగిలిపోయేది. తిరిగి విశ్వ జ్ఞాన శక్తినీ, దృష్టినీ వినియోగించి గ్రహాలను, నక్షత్ర లోకాలనూ, నీహారికలనూ సృష్టించేది ఇదే..” అంటాడు.

విద్యావంతుడైన సత్యచరణ మూఢనమ్మకాలకు విలువనివ్వడు. అడవి దున్నలకు ప్రమాదం రాకుండా ఎప్పుడూ కాపాడే ఒక దేవుడి గురించి ఆదివాసీలు చెపితే కొట్టిపారేస్తాడు. కలకత్తా వచ్చాక ఒకసారి రోడ్డు పక్కన నడుస్తూ….బరువు ను లాగలేక ఇబ్బంది పడుతున్న ఒక దున్నపోతుని బండివాడు చెర్నాకోలాతో ఛెళ్ళున కొట్టడం చూసి చలించి “ఆ వనదేవత ఇక్కడుంటే ఎంత బావుండు”అని అప్రయత్నంగా అనుకుంటాడు.

ఇలాంటి అద్భుత సన్నివేశాలు, అపూర్వమైన వనసౌందర్య వర్ణనలూ, ఆదివాసీల జీవితంలో దరిద్ర దేవత విశ్వరూపం,
ప్రతి పేజీలో కనపడతాయి.

ఈ పుస్తకం చదవాలంటే కేవలం పుస్తకం చదవాలన్న ఆసక్తి చాలదు. ఆ తర్వాత వెంటాడే యదార్థ జీవిత వ్యథార్త దృశ్యాలు,అడవుల మనుగడ పట్ల రేగే ఆలోచనలు, మనసంతా ఆక్రమించే ఆదివాసీ పాత్రలు, అన్నానికి, రొట్టేలకూ కూడా నోచుకోక గడ్డిగింజలూ, పచ్చి పిండీ తినే దృశ్యాలు, ఒక్క రొట్టె కోసం పన్నెండు మైళ్లు నడిచి వచ్చే పేదలూ..వారిని దోచే భూస్వాములూ..వీటన్నింటినీ భరించగలిగే శక్తి మనసుకు ఉండాలి. ఒక హాయిని, వేదనను ఒకేసారి కలిగించే భావాన్ని భరించగలగాలి. అప్పుడే ఈ పుస్తకం కొనాలి. ఇది కాఫీ టేబుల్ బుక్ కాదు. మస్ట్ రీడ్ బుక్!
ఈ పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ఇప్పుడు అందుబాటులోకి తెచ్చారు. ప్రకాశకులు చెప్పినట్లు ఈ పుస్తకం అవసరం రచనాకాలం కంటే ఇప్పుడే ఎక్కువ. మరీ ఎక్కువ.

స్వర్గీయ శ్రీ సూరంపూడి సీతారామ్ గారు అనువదించిన ఈ పుస్తకం ఇప్పుడు అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతోంది. వెల నూట ఇరవైరూపాయలు!
..................
వ్యాసం రాసిపంపినవారు: సుజాత(మనసులో మాట) – నా స్వపరిచయం ప్రత్యేకంగా ఏమీ లేదు. జర్నలిజం చదువుకుని కొద్ది రోజుల పాటు పని చేసాను. రంగనాయకమ్మ, కొడవటిగంటి కుటుంబరావు,నామిని గారి రచనలంటే బాగా ఇష్టపడతాను. జీవితాన్ని నిజాయితీగా ఆవిష్కరించే ఏ రచనైనా నా అభిమాన రచనే! ఇంకా చదవని, వెదుకుతున్న పుస్తకం క్రిస్టఫర్ రీవ్(హాలీవుడ్ సూపర్ మాన్) రాసిన still me! ఏ పనైనా చేస్తూ సరే పుస్తకాలు చదవగలను. వంట చేసేటపుడు కూడా పుస్తకం చేతిలో ఉండాల్సిందే! రాయడం అంటే బద్ధకం, చదవడం అంటే ఎక్కడ లేని ఉత్సాహం!
- pustakam.net


......

...............

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌