Showing posts with label కథలు / నవలలు. Show all posts
Showing posts with label కథలు / నవలలు. Show all posts

Wednesday, January 28, 2015

'మరల సేద్యానికి ' శివరామ కారంత్‌ నవల, తెలుగు అనువాదం: తిరుమల రామచంద్ర






'మరల సేద్యానికి'
శివరామ కారంత్‌ నవల




ఈ నవల కాలానికి అతీతమైనది. అందుకే సుమారు అర్థ శతాబ్దం తర్వాత కూడా యిది సజీవంగావుంది. గతించిపోతున్న భారతీయ సమాజ మూలాలను మన ముందుంచి, దేశ భవిష్యత్తుకొక గమ్యాన్ని నిర్దేశిస్తూ పర్యావరణ, ప్రకృతి పరిరక్షణ, అర్థిక స్వాలంబన సాధించడం అవసరమని చెప్తుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో సహజ వనరులు ధ్వంసమై వ్యవసాయం 'దండగ'నే  అభిప్రాయాన్ని వ్యాపింప చేస్తున్న తరుణంలో 'మళ్లీ సేద్యానికి' తరలమని చెప్తోందీ నవల. అదే దీని ప్రాసంగికత.

...............................................................- వకుళాభరణం రామకృష్ణ

మనదేశపు పల్లె జీవనానిర ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులకు నిలువెత్యు నిదర్శనం ఈ కథ, ఇంత గొప్ప పుస్తకం తెలుగోకి రావడం అద్భుతమైన విషయం.

................................................................- సి.రమాదేవి, రచయిత్రి

మూల భాష నుంచి నేరుగా లక్ష్య భాషలోకి అనువదించిన రచనలకు విశ్వసనీయత ఎక్కువ. అసలు రచనలోని సొగసు, కథనంలోని ప్రత్యేకతలను పెద్దగా మార్పులేమీ లేకుండానే పాఠకులు గ్రహించే అవకాశం ఉంటుంది. 'మరల సేద్యానికి' కూడా మూల భాష నుంచి నేరుగా అనువదించిన రచనే. సూక్ష్మ అంశాలను కూడా విస్మరించకుండా సవివరంగా రికార్డు చేసినట్టు రాసిన ఈ నవలలో ప్రకృతి వర్ణనలు కథలో లీనమయ్యేలా చేస్తాయి. సముద్ర హోరు నవల పొడవునా కథనానికి నేపథ్య సంగీతంలా వినిపిస్తుంటుంది'. తిరుమల రామచంద్ర అనువాద నైపుణ్యం, నిఘంటువుల్లో కూడా దొరకని కన్నడ మాండలిక పదాలను అనువదించేందుకు ఆయన తీసుకున్న శ్రద్ధ, శ్రమ ఈ నవల ఉన్నతంగా రూపొందటానికి కారణం.

...................................................-సిహెచ్‌. వేణు, జర్నలిస్ట్‌, ఈనాడు
వందేళ్ల కాలంలో ఒక కుటుంబంలో జరిగిన మూడు తరాల జీవన యానాన్ని అద్భుతంగా చిత్రితమైన కథ ఇది. ఈ నవల అవసరం ఇప్పుడు చాలా వుంది. కళ్ల  ముందే కరిగిపోయిన సహజ జీవన శైలిని ఇప్పుడు తిరిగి జీవితాల్లోకి ఆహ్వానించలేకపోయినా, అది కరిగిపోయిన క్రమం ఎలాటిదో ఈ నవల్లో తెల్సుకోవచ్చు. ఒక ప్రశాంతమైన నవల. తప్పక చదవాల్సిన నవల.
....................................................................... - సుజాత, ఆస్టిన్ 



'మరల సేద్యానికి'
శివరామ కారంత్‌ నవల,

తెలుగు అనువాదం: తిరుమల రామచంద్ర
336 పేజీలు, ధర రూ.150/-

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006
ఫోన్‌ : 040 23521849

Email: hyderabadbooktrust@gmail.com 



Saturday, January 10, 2015

దారులేసిన అక్షరాలు - ఇరవైయవ శతాబ్దపు భారతీయ మహిళల రచనలు : సంపాదకులు : సుశి తారు, కె.లలిత





దారులేసిన అక్షరాలు - ఇరవైయవ శతాబ్దపు  భారతీయ మహిళల రచనలు 
సంపాదకులు : సుశి తారు, కె.లలిత



భారతీయ స్త్రీల రచనలను తొలిసారిగా ఇంగ్లీష్‌లోకి అనువదించి 1989-91ల లోనే 'అన్వేషి' రెండు భాగాలుగా వెలువరించింది. ఆ సంకలనంలోని రెండో భాగానికి తెచ్చిన తెలుగు అనువాదమే ప్రస్తుత గ్రంథం. సమాజ వికసనంలో తమదైన ముద్ర వేసిన మనదేశపు స్త్రీల భావజాలానికి దర్పణం. పితృస్వామ్య శక్తులతో ఘర్షణ పడుతూనే తమ అస్తిత్వాలను నిరూపించుకున్న ఇరవయ్యవ శతాబ్దికి చెందిన 73 మంది రచయిత్రుల అక్షరాల దారులు మనందరి కోసమే.

- విజయ భారతి

విశ్రాంత డైరెక్టర్‌, తెలుగు అకాడెమీ


ఈనాటి మహిళల సాహిత్య ప్రస్థానం గొప్పగా సాగుతున్నదంటే దానికి పునాది ఎన్నో ఏళ్ల క్రితం వాటికి బీజం వేసిన రచయిత్రులదే. ఈ రోజున మహావృక్షం నీడన కూర్చున్నాం కదా అని మనం విత్తనాన్ని మరవలేం. మహిళల సాహిత్య కృషి భారతీయ సాహిత్యాన్ని ఎంత సుసంపన్నం చేసిందో చెప్పడానికి ''విమెన్‌ రైటింగ్‌ ఇన్‌ ఇండియా'' అన్న గ్రంథం వచ్చినపుడు అందరూ అవాక్కయ్యారు. మనకు ఎంతో తెలుసుననుకున్న భారతీయ సాహిత్యం గురించి ఎంత తక్కువ తెలుసో చెప్పిన ఆ పుస్తకం ఒక చారిత్రక ఘట్టం. ఇప్పటికే రాస్తున్న స్త్రీలకు మరింత ప్రోత్సాహాన్ని, ఇక పై రాయనున్న వారికి గొప్ప స్ఫూర్తిని అందజేయగల ఈ పుస్తకం అక్షరాలా అక్షర మార్గమే.

- మృణాళిని,
డైరెక్టర్‌, సెంటర్‌ ఫర్‌ ప్రిపరేషన్‌ ఆఫ్‌ ఎన్‌సైక్లోపీడియా, తెలుగు యూనివర్సిటీ


''విమెన్‌ రైటింగ్‌ ఇన్‌ ఇండియా'' రెండు భాగాలూ చరిత్రను సృష్టించాయి. వలసవాద వాసనలతో జాతీయవాద చట్రం నుంచి రాసిన సాహిత్య చరిత్రని విమర్శనాత్మకంగా పరిశీలించాయి. సాహిత్య చరిత్రలో మరుగునపడ్డ పీడితుల గురించి ఆలోచించే గొప్ప సైద్ధాంతిక దృష్టిని అందించాయి. ఈ పుస్తకాలు ఆఫ్రికన్‌ స్త్రీలూ, దళితులూ, ఇంకా అనేక పీడిత సమూహాలు సాహిత్య చరిత్ర రచనకు పూనుకోవడానికి గొప్ప స్ఫూర్తినిచ్చాయి. తెలుగులో వీటి అవసరం చాలా ఉంది.

- కె. సత్యనారాయణ,
అసోసియేట్‌ ప్రొఫెసర్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కల్చరల్‌ స్టడీస్‌,
ఇంగ్లీష్‌ & ఫారిన్‌ లాంగ్వేజెస్‌ (EFLU)


దారులేసిన అక్షరాలు - 
ఇరవైయవ శతాబ్దపు భారతీయ మహిళల రచనలు 
సంపాదకులు : సుశి తారు, కె.లలిత
600 పేజీలు, ధర : రూ. 400/-

ప్రతులకు, వివరాలకు: 

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006
ఫోన్‌ : 040 23521849

...................................................................................................................................................

ఈ పుస్తకం ముందుమాట నుంచి కొంత భాగం :
...  ... ... 
స్త్రీల సాహిత్యంలో అద్భుతమైన 'మచ్చుతునకలు' వెలికితీయటం సంతోషకరమైన ప్రయత్నం. ఇంకొక స్థాయిలో అది స్త్రీవాద విమర్శ సిద్ధాంతం, ఆచరణలకు సంబంధించిన కష్టతరమైన, ప్రయోగాత్మక చర్య. పేరుపొందిన రచయిత్రుల కృషిని తిరిగి 'చదవటానికి', ప్రపంచానికి అంతగా పరిచయంలేని వాళ్ళను పరిచయం చేయటానికీ, మేం ప్రయత్నించాం. ఇందులో కొన్ని మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేసే విషయాలున్నాయి. తెలుగు సాహిత్యంలో తెలుగు పాఠకులకి కూడా ఆనందాన్ని కలగజేసే విషయాలున్నాయి. సాంప్రదాయక అంచనాల్తో చూస్తే ఇక్కడ ఉన్న రచనలు చాలా వరకు ప్రఖ్యాత గ్రంథాల నుంచే. అందులో కొన్ని కాలం పెట్టిన పరీక్షలకు- అవి ఎంత కఠినమైనాసరే- తట్టుకొని నిలబడినవి. ... ...

ఇంతకు ముందు రూపొందించిన ఎన్నో రకాల సిద్ధాంత భావనల్ని ప్రశ్నించే అవసరం ఈ సంకలనానికి ఉంది. ఇంతకు ముందు రచనా ప్రపంచంలో ఏరి వేయబడిన; 'కొనసాగలేని' ఎన్నో రకాల అంశాలను నిర్లక్ష్యం చేయకుండా వాటికి స్పష్టతనిచ్చి, ప్రాముఖ్యత కలిగిస్తామని మా ఆశ. సాహిత్య గ్రంథాన్ని, దాని సాంఘిక సందర్భాలను విడదీసి గత నూటయాభై సంవత్సరాలుగా సాహిత్య సౌందర్య శాస్త్రం మీద పెట్టిన భారాన్ని వదిలించుకోవాలని, తిరుగుబాటు ధోరణుల రూపాలు వైరుధ్యాలను ఎత్తిచూపే విధిని నిర్వర్తించాలని మా కోరిక. అటువంటి ఆచరణ చేసే వాగ్దానం ఒక సాహిత్యానికే పరిమితం కాదు. అకాడెమీలో కూడా - గాయిత్రీ స్పీవాక్‌ అన్నట్టు, ''చరిత్ర, రాజకీయార్ధ శాస్త్రం - ప్రపంచంతోటి కలిపి సాహిత్య రూపాల్ని చూడాలి''.68 పాతకాలం విశ్వజనీనత మాసిపోయి, ఆకర్షణావిహితంగా కన్పించటం ప్రారంభమైతేనే నూతన ప్రపంచపు సౌందర్యం కంటికి తోచే అవకాశం ఉంది. ఆ సాహిత్యాలలోని ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడే భావ ప్రకటనలూ, వాటి అనుభూతులూ, రుచులూ - జీవం లేనివిగా, ఉత్త సెంటిమెంట్లుగా కన్పించడం మొదలవుతుంది.

... ... రాజకీయ ఆర్థిక విధానాల మధ్య సంబంధాల్ని శోధించటం మా ఉద్దేశం. మా నమ్మకంలో ఈ సంబంధాలే స్త్రీల రచనల్లో అంశాలకు వెలుగు పడతాయి. మొదటి సంకలనంలో సంస్కరణ, జాతీయ ఉద్యమ సాహిత్యాల ముందుమాటల్లో పంథొమ్మిది, ఇరవై శతాబ్దాలలో 'స్త్రీలు', 'పితృస్వామ్యం' అనే అంశాలకు సంబంధించిన స్త్రీల సాహిత్య చొరవల గురించి ఉంది. మొదట సామ్రాజ్యాధిపత్య స్థాపన గురించీ, తర్వాత జాతీయ ఉద్యమం పెరుగుదల గురించీ అందులో కనిపిస్తుంది. 


వర్గం, జెండర్‌, కులం, జాతి, మతం, పరస్పరం ప్రభావితం అయ్యే క్రమాల గురించి వివరించే ప్రయత్నం చేసాం. ఈ సంపుటంలో 1940-50లలో మనదేశం సృష్టించిన సామాజిక ఊహా చిత్రణ, 1970లలో పైకెగసిన తిరుగుబాటు ఉద్యమాల గురించి ఉంది. వివిధ  పద్ధతుల్లో ముందుకొచ్చిన ఈ నూతన ఆధిపత్యాన్ని  స్త్రీల రచనలు నిలదీస్తాయని మా వాదన. ఐతే కొన్ని సార్లు అవి అధికారిక పద్ధతుల్ని కూడా  స్థిరీకరిస్తాయి. స్త్రీల పోరాటాలు ఏ రూపాల్ని తీసుకుంటాయన్న అంశం మీదే మా దృష్టి ఎక్కువ. 

వాళ్ళ ప్రపంచాలెలా మలచబడ్డాయి? ఇతర ప్రయోజనాల కోసం నిర్దేశించిన ఇతివృత్తాలను, చిత్రణలను, కవితా కల్పనా సృష్టిని, తమ ప్రయోజనాలకోసం స్త్రీలెలా వినియోగించారు? వాళ్ళ పట్ల శత్రుబద్ధమైన, నిర్లక్ష్యమైన ధోరణి ప్రదర్శించిన సాంస్కృతిక  చిహ్నాలని తెలివిగా వారికనువుగా ఎట్లా మల్చుకున్నారు? సైద్ధాంతిక వలల్ని తప్పించుకుంటూ, 'సంఘ, చట్ట' విరుద్ధమైన సౌఖ్యాలనెట్లా కోరుకున్నారు? 'ఆత్మశక్తి', చిత్తశుద్ధి గురించి వాళ్ళ కలలు ఏ రూపాల్ని తీసుకున్నాయి? అన్నింటికంటే ముఖ్యంగా వాళ్ళ తిరుగుబాటు రూపాలేమిటి? మా ఎంపికలో కూడా ప్రధానంగా చూసిన విషయం ఇదే. 

వాళ్ళ కోసం నిర్దేశించిన కార్యక్రమాల్ని ప్రశ్నించి, దాటేసి, తిప్పిరాసి, మార్పుచేసి చివరికి తారుమారు ఎలా చేయగలిగారు?

ఇంకొక రకంగా చెప్పాలంటే, మనకు సంక్రమించిన ప్రపంచాల్ని ఈ స్త్రీలెలా మలిచారో తెలుసుకోవాలని మా ఆసక్తి. ఆధిపత్యానికి సంబంధించిన చరిత్రనా, సవాలు చేసిన చరిత్రనా, దేనిని మనం కోరుకుంటున్నాం? ఈ ప్రయత్నాలలో రచయిత్రులు పడ్డ ఇబ్బందులు, పోగొట్టుకున్న నిక్షేపాలు, చేసుకున్న ఒప్పందాలు, ఒదులుకున్న  రాయితీలు అవన్నీ మనకు సంక్రమించిన అంశాల మీద ఏం ప్రభావాల్ని కలిగించాయి అని పరిశీలించగలిగాం. ఈ రచనల ద్వారా ఇంత వరకూ ఉన్న దానికంటే మరింత శక్తివంతమైన సంక్లిష్టమైన స్త్రీవాద చరిత్రవైపు దృష్టి నిలిపే ప్రయత్నం చేసాం. ఈ ప్రయత్నం 'అణచివేత', 'విముక్తి' అనే సులభతరమైన సూత్రీకరణలను మించిన, మరింత ఇబ్బందికరమైన చరిత్ర గురించే!
 






Wednesday, September 3, 2014

తారుమారు - దేవులపల్లి కృష్ణమూర్తి

తారుమారు
- దేవులపల్లి కృష్ణమూర్తి

ఏ కథానిక అయినా జీవిత చిత్రణే. ఊహాత్మక జీవిత చిత్రణ కాక రచయిత అనుభవ పరిధిలోకి వచ్చే జీవిత చిత్రణలో విశ్వసనీయత ఎక్కువ. స్థలకాలాలు, వాటి మూలంగా అమిరే వాతావరణంలో పాఠకుడు సులభంగా మమేకమవుతాడు.
...
దేవులపల్లి కృష్ణమూర్తి గారివి తీగలు సాగి పందిరిని అల్లుకుంటున్న కథానికలు. దేశీయమైన వాతావరణంలో సహజమైన సన్నివేశాల మధ్య, సంభావ్యత పుష్కలంగా వున్న సంఘటనలతో ఈ కథానికల్ని వారు సృష్టించారు. 'సృష్టించారు' అనేకంటే సమకాలీన జీవితాన్ని చూస్తూ, దాన్ని 'చిత్రించార'ంటే బాగుంటుంది.

అందుకే ఈ కథానికల్లో ఒక మట్టి వాసనతో కూడిన మోటుదనం కనిపిస్తుంది. రచయిత వీటిని కళాత్మకం చేయటానికి ప్రయత్నించలేదు. తనకు తెలిసిన మనుషులే వీటిల్లో పాత్రలు. పేరు మార్చుకుని కనిపిస్తారనిపిస్తుంది. వాళ్లలో కథకుడు కలిసిపోతాడు. వాళ్ల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాడు. ఈ మేరకు కొంత ఆత్మకథాత్మకత చోటుచేసుకుంది.

ఇవి - మన పక్కింట్లోనో, ఎదురింట్లోనో జరుగుతున్న అనుభూతి పాఠకునికి కలుగుతుందే తప్ప, ఊహాలోకంలోంచి ఊడిపడ్డట్టుగా వుండవు. ఇట్లాంటి కథానికలు తెలంగాణాలో 1950కి ముందు వచ్చాయి. అయితే వాటి మీద అప్పట్లో విమర్వ, విశ్లేషణ అంతగా రాలేదు.

ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ జీవిన చిత్రణ పట్ల రచయితలలో చైతన్యం పెరిగిందనటానికి 'తారుమారు' కథానికలు ఒక సాక్ష్యం.
(డా. అమ్మంగి వేణుగోపాల్‌ ఈ పుస్తకానికి రాసిన ముందుమాట నుంచి)

తారుమారు
దేవులపల్లి కృష్ణమూర్తి
(నలభై కథానికల సంకలనం)

130 పేజీలు, వెల రూ.100/-
ప్రథమ ముద్రణ: ఆగస్ట్‌, 2014

ప్రచురణ: 
డికె ప్రచురణలు, 17/98, శ్రీశ్రీ మార్గం, నకిరేకల్‌, నల్గొండ- 508211 (ఫోన్‌: 92900 94015).

ప్రతులకు:
 హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌- 500006


Tuesday, December 10, 2013

ఏనుగంత తండ్రికన్నా యేకులబుట్టంత తల్లి నయం - గోగు శ్యామల

ఏనుగంత తండ్రికన్నా యేకులబుట్టంత తల్లి నయం

- గోగు శ్యామల
ముందుమాట : డా|| కేశవరెడ్డి

సూర్యగ్రహణాన్ని వర్ణించనీ,
చావడి దగ్గర చేరిన గ్రామస్తులను గురించి చెప్పనీ,
బర్రెమీద సవారీ చేసే పల్లెటూరి పిల్లను గురించి చెప్పనీ,
దళితులు కొట్టే డప్పు చప్పుడులోని వివిధ దరువులు పరిచయం చేయనీ...
గోగు శ్యామల కథనంలో వుండే మంత్ర శక్తి ఒకే స్థాయిలో వుంటుంది.

దానికి పరిమితులు లేవు. ఆమె మనకు ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని చూపిస్తూనే విశాల విశ్వంలోకి నడిపిస్తుంది. ఒక్కసారిగా బాల్యంలోకి పరుగు తీసి అవధులూ ఆకాంక్షలూ ఎరుగని అమాయకపు కళ్లతో దళిత జీవితాన్ని మన ముందుకు తెస్తుంది. దళితుల రోజువారీ జీవితాన్ని వివరంగా కళాత్మకంగా ఎంతో చాతుర్యంతో కళ్లకు కట్టిస్తుంది.

ఈ కథలకి నేపథ్యం ఒక తెలంగాణా గ్రామంలోని మాదిగ వాడ.
అక్కడి వివిధ సందర్భాలనూ, సనినివేశాలనూ, జనం అనుభవాలనూ చిత్రిస్తూ వాటిని అవగాహన చేసుకునే ఒక కొత్త చూపును పాఠకులకు ప్రసాదిస్తుంది.

పూర్వపు రచనలలో అటువంటి ప్రదేవాలను, ప్రజలను వర్ణించడానికి ఉపయోగించిన భాష గురించి, వాటి పట్ల ఆ చరనలలో కనబడిన భావుకత, పరిపాలనా దృక్పథం, గాంధీత్వ దృష్టి గురించి చెపుతున్నప్పుడు ఆమె చమత్కారం చాలా నవ్వు తెప్పిస్తుంది. ఈ కల పరిష్కారాలు ఊరి నుంచి, మాదిగవాడ నుంచి, ఆటువంటి ఇతర సమూహాల నుంచి మనుషుల్ని బయటికి పంపించడంలో లేదు. అక్కడి జన జీవితాన్నే భవిష్యత్‌ ఆశగా చూపించే కథలు ఆమెవి.

తన పదునైన రాజకీయ భావాలను గాఢమైన కథన సౌందర్యంతో మేళవించి, దళిత రచనంటే కేవలం పీడన గురించి వ్రాయడమేననే మూసాభిప్రాయాన్ని బద్దలు కొట్టింది గోగు శ్యామల.
.........................................................................................................



 స్పందన

The crowds were amazed at his
teaching, because he taught as
one who had authority and not
as their teachers of  the law.               Matthew 7:28 (Bible)


''మీ పుస్తకానికి ముందు మాటలు రాయలేను. " ఐ యాం ఎ పూర్ జడ్జ్ " అని ''నేనన్నప్పుడు
గోగు శ్యామలగారు, జడ్జ్  చేయవద్దు. కథలు చదివి మీ స్పందన రాస్తే చాలు'' అన్నారు. ఆ
వెసలుబాటు లభించాక ఇక కూర్చుని ఈ నాలుగు మాటలు రాస్తున్నాను.

    దళిత అస్తిత్వాన్ని పలు కోణాలలో విశ్లేషించే కథలు పన్నెండు ఇందులో ఉన్నాయి. ఈ
సంకీర్ణ సమాజంలో ఏ మనిషికి గాని ఒకే అస్తిత్వం ఉండదు. ఒకటి కన్నా ఎక్కువ అస్తిత్వాలే
ఉంటాయి. ఆ విధంగా ఈ ప్రపంచంలో ఎంత మంది జనం ఉన్నారో దానికి నూరు రెట్లు అధిక సంఖ్యలో
అస్తిత్వాలున్నాయి. ఈ అస్తిత్వాలలో వెయ్యోవంతునైనా ప్రపంచ సాహిత్యం యావత్తూ కలిసి గూడా
ఇంతవరకు విశ్లేషించలేదు, విశ్లేషించ జాలదు. అందుకే  అంటారు  రాసే నేర్పు, కౌశలం ఉండాలే గాని
ఇతివృత్తాలకు ఏ కాలంలోను, ఏ దేశంలోను కొరతలేదని.

    మనిషికున్న ఎన్నో ఎన్నో అస్తిత్వాలలో ప్రధానమైనవి రెండు: ఆర్థిక అస్తిత్వం,
సాంస్కృతిక అస్తిత్వం. వీటిలో ఏది పునాది, ఏది ఉపరితలం అన్న దానిని గురించి కొందరికి ఇంకా
స్పష్టత లేదు. అయితే అవి రెండు ఒక దానినొకటి అనివార్యంగా ప్రభావితం చేసుకుంటాయన్నది
కాదనలేని సత్యం. సమాజం చలనశీలమని, మానవ సంబంధాలు చరిత్ర పొడవునా ఒకే రీతిగా
ఉండవని తెలిసిన వారికి ఈ సత్యాన్ని గుర్తించడం కష్టమేమీ కాదు. ఆర్థిక అస్తిత్వం మనుషులందరికీ
ఉమ్మడి అస్తిత్వమై ఉండగా, సాంస్కృతికం ఆయా వర్గాలకు మాత్రం ప్రత్యేకమైన అస్తిత్వంగా ఉంటుంది. రెండు అస్తిత్వాలు కలగలసిపోయి ఉంటాయి. గనక, పరస్పరం ప్రభావితం చేసుకుంటాయి గనక గిరిగీసుకుని సాంస్కృతిక
అస్తిత్వాన్ని గురించి మాత్రమే రచన చేయటానికి వీలుపడదు. అలాగే ఆర్థిక అస్తిత్వాన్ని గురించి
మాత్రమే రాయడానికీ వీలుపడదు. ఇక్కడే మనకు ఏది దళిత సాహిత్యం? అనే ప్రశ్నకు సమాధానం
దొరకవచ్చు. రచయిత దళితుడైనంత మాత్రాన అది దళిత సాహిత్యమైపోదు. అలాగే దళితులను
గురించి రాసిందంతా దళిత సాహిత్యం కాజాలదు. దళితులకు ప్రత్యేకమైన సాంస్కృతిక అస్తిత్వం పైనా
ప్రధానంగా కేంద్రీకరించి దానిని పరిశీలించి, విశ్లేషించిన రచనను దళిత సాహిత్యమని నిర్వచించవచ్చు.

అంటే రచయితకు బలమైన సాంస్కృతిక మూలాలు, స్వానుభవం
ఉండితీరాలి. ఐతే అవి రెండు ఉన్నంత మాత్రాన ఆ రచన సాధికారతను, పరిపూర్ణతను సాధించజాలదు.
ఎందుకంటే సాహిత్యం మరీ అంత యాంత్రికమైన ప్రక్రియ కాదు గనక. సాంస్కృతిక మూలాలు,
స్వానుభవము పుష్కలంగా ఉన్న ఒక దర్శకుడు, స్క్రిఫ్టు రైటరు కలిసి తీసిన సినిమాలో బ్రాహ్మణ
పూజారికి జందెం పెట్టడం మరచిపోయిన ఉదంతం మనం విన్నాంగదా. ఇక్కడే ఇందుకు భిన్నమైన ఇంకొక ఉదాహరణ గూడా చెప్పుకోవాలి.

సాంస్కృతిక మూలాలు, స్వానుభవము ఏమాత్రం లేని ఒక పరమ నాస్తికుడైన నటుడు 'శ్రీ చైతన్య
ప్రభు' నాటకంలో ప్రధాన పాత్ర పోషించి రక్తి కట్టించాడట. రామకృష్ణ పరమ హంస ఆ నాటకం చూడడం
తటస్తించి చైతన్య ప్రభుని భక్తిరసానికి ముగ్ధుడైపోయి, నాటకం అయిపోయాక గ్రీన్‌ రూంలోకి వెళ్ళి
నటుడ్ని అభినందించి, ''నీలో కృష్ణపరమాత్మను దర్శించుకొన్నానయ్యా. దేవుని కృపాకటాక్షాలు నీకు
నిండుగా ఉన్నాయి'' అన్నాడట. అందుకా నటుడు, ''అయ్యా, నువ్వంటున్నదేమిటో నాకర్థం
కావటంలేదు. దేవుని కృపా కటాక్షాలను గురించి నాకేమీ తెలియదు. నేను నాస్తికుడిని, నేను కేవలం
నటించానంతే'' అన్నాడట. ఇక్కడ భక్తిరసాన్ని పండించింది నటుని నటనా కౌశలమే గాని సాంస్కృతిక
మూలాలు, స్వానుభవమూ కాదు. అందుకే గదా అంటారు: కళకు అసాధ్యం ఏదీలేదని. ఇక
రచయితకు సాంస్కృతిక మూలాలు, స్వానుభవాలతోబాటు రచనా కౌశలం గూడా ఉన్నప్పుడు ఆ
రచనకు మరింత సాధికారత, మరింత పరిపూర్ణత లభిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.

    ఈ అంశాలన్నీ నిండార్లుగా ఉండడం వల్లనే గోగు శ్యామలగారి కథలు సాధికార దళిత
సాహిత్యంగా రూపుదిద్దుకున్నాయి. ఎంత బలమైన మూలాలు లేకపోతే రచయిత్రి బైండ్లామె చేత,
''దొరా, మీరు నాకు కూలి పైసలియ్యకుండ్రి. నేనే కూలి పైసలిస్త. మీ బిడ్డను గోజుకిడ్వుండ్రి. పండగల
రంగమెక్కమనుండ్రి. నేనే నీ బిడ్డకు కూలిస్త!'' అనిపించ గలదు! ఆ సమయంలో బైండ్లామె
ధర్మాగ్రహాన్ని, రౌద్రాన్ని వర్ణించడానికి రచయిత్రి ఇరవై ఏడు వాక్యాలు రాశారు. అవి ఒక్కొక్కటి వొళ్ళు
గగుర్పొడిచే వాక్యాలు. (బైండ్లామె భూమడగదా మరి).

    స్వానుభవం నుండి పుట్టిందే 'బడెయ్య' కథలోని బొక్కబండి ఉదంతం. మనం మట్టి
బండిని చూశాం. కొయ్య బండిని చూశాం. బంగారు బండిని గురించి విన్నాం. చచ్చిపోయిన దూడ
పుర్రెతో బండి తయారు చేయొచ్చునని నాకిప్పుడే తెలిసింది. ఆ బండిని తయారుచేసే విధానం రచయిత్రి
వివరిస్తుంటే వినడం ఒక అనుభవం. బడెయ్య ఆ బండితో ఆడుకోవడమే గాక దాంతో పొలానికి ఎరువు
తోలడం గూడా చేస్తాడు. అంత చిన్న వయసులోనే వాడికి అది ఆటవస్తువేగాక ఒక పనిముట్టు అని
గూడా తోచడం గమనార్హం. పని, పాట - ఇవి రెండూ వేర్వేరు కాదనే సాంస్కృతిక నేపథ్యం రచయిత్రికి
ఉండడంవల్లనే ఇది సాధ్యమయింది. ఇక 'జాడ' కథను చదవడమంటే ఒక పండగ సంబరంలో
పాలుపంచుకోవడమే.  మోర్స్‌ కోడ్‌తో నడిచే టెలిగ్రాఫ్‌ వ్యవస్థకు మనదేశం ఇటీవలే చరణగీతం
పలికింది. మోర్స్‌కోడ్‌కు దీటుగా డప్పుమీద రచయిత్రి వినిపించిన తొమ్మిది రకాల సంకేతాలను
వింటుంటే ఎంత సంబరం! ఆ కథ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా చిర్ర, చిటికెన పుల్లలు డప్పుమీద వేసిన
తొమ్మిది రకాల దరువులు నా చెవుల్లో హోరెత్తుతాయి.

    మిగిలిన కథలు కలగచేసిన స్పందనలను గూడ ఏకరవు పెట్టగలను. కాని మీ
పఠనోత్సాహానికి భంగం కలిగించకూడదు కదా.

    మనిషికి ఉన్న ఎన్నెన్నో అస్తిత్వాలను విశ్లేషిస్తూ తెలుగులోను, ఇతర భాషలలోను
విస్తారమైన సాహిత్యం వస్తూ ఉంది. ఐతే ఎaఱఅర్‌తీవaఎ  సాహిత్యం అనబడే దిమ్మిసా  కొట్టిన రస్తాల
వెంబడి నడిచి నడిచి పాఠకలోకం విసుగెత్తిపోయింది. సమాజంలోని సందు గొందుల వెంబడి తిప్పగలిగే
రచయితల కోసం పాఠకులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వారి ఆర్తిని తీర్చడానికి ఈ కథలు
ఎంతో దోహదపడతాయి. గోగు శ్యామల గారు ఈ కృషిని ఇంకింతగా, మరింతగా సాగిస్తారని
ఆశిస్తున్నాను.

18-7-2013

నిజామాబాద్‌    ......................................................................................డా|| కేశవరెడ్డి


 ఏనుగంత తండ్రికన్నా యేకులబుట్టంత తల్లి నయం

- గోగు శ్యామల


ధర : రూ. 80/-
పేజీలు  : 101
మొదటి ముద్రణ : డిసెంబర్ 2013 


ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌

ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ 500006
ఫోన్‌ నెం. 040 2352 1849
Mail: hyderabadbooktrust@gmail.com


.................................................................

రచయిత గురించి...


తెలుగు దళిత సాహిత్య ప్రపంచంలో గోగు శ్యామల గొంతు ప్రత్యేకమైనది.
పది సంవత్సరాల క్రితం కథలు రాయటం మొదలుపెట్టిన శ్యామల తన రచనల్లో దళిత సమాజంలో బాల్యం, దళిత స్త్రీలు భూమి కోసం పడే తపన, దళిత కుటుంబాలలో, సమూహాలలోని ప్రజాస్వామిక తత్త్వం, దళిత సబ్బండ కుల సంబంధాలు, మాదిగ అస్తిత్వం, మాదిగ ఉపకులాల అస్తిత్వాలను కొత్త దృక్పథంలో చూపిస్తూ వచ్చారు.

ఆమె రచనల్లో దళితులు పీడిత అస్తిత్వంతోకాక, తమ జీవితం, ఇప్పటి ప్రపంచం, దానిలో రావలసిన మార్పుల గురించి తదేకంగా ఆలోచించే తాత్త్విక దృక్పథం కలవారిగా కనిపిస్తారు.

అనేక సాహితీ పురస్కారాలు అందుకున్న శ్యామల మొదటి పుస్తకం 'నల్లపొద్దు.' తరువాత, 'నల్లరేగడి సాల్లు', 'ఎల్లమ్మలు' పుస్తకాలు ఆమె సంపాదకత్వంలో వెలువడ్డాయి. 2011లో శ్యామల రాసిన ''నేనే బలాన్ని'' సదాలక్ష్మి బతుకు కథ ప్రచురించబడింది.

'ఎడ్యుసెండ్‌' అనే దళతుల విద్యపై పనిచేసే సంస్థని స్థాపించి, 'అందరికీ విద్య' అనే మాస పత్రికను కూడా నడుపుతున్నారు.

అనేక సంస్థలలోనూ, సాహితీ వేదికలలోనూ క్రియాశీలకంగా పాల్గొంటారు.
ప్రస్తుతం అన్వేషిలో సీనియర్‌ ఫెలోగా పనిచేస్తున్నారు, ఐఎఫ్‌ఎల్‌యులో పిహెచ్‌డి చేస్తున్నారు.








Tuesday, January 22, 2013

బొజ్జా తారకం "పంచతంత్రం" నవలపై చర్చ జనవరి 25 న బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ! ...

ఆహ్వానం

బొజ్జా తారకం రాసిన "పంచతంత్రం" నవల పై చర్చ నిర్వహిస్తున్నాం.


ప్రముఖ రచయితలు 

బి. కళ్యాణరావు, 
నందిగం కృష్ణారావు, 
ఎన్. వేణుగోపాల్ 
మొదలైన వారు మట్లాడతారు. 

మీరు తప్పక రండి !


తేదీ: 25 జనవరి 2013 

సాయంత్రం 5-30 కి.
బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్, 

హైదరాబాద్ .





Thursday, December 13, 2012

పంచతంత్రం (నవల) రచన: బొజ్జా తారకం ...

పంచతంత్రం (నవల)  రచన: బొజ్జా తారకం ...

కారంచేడు (1985) నుంచి లక్ష్మింపేట (2012) వరకూ దళిత ఉద్యమాలలో కీలకపాత్రవహిస్తూ న్యాయపోరాటాలు చేస్తూ రాజకీయ సామాజిక రంగాలను ప్రభావితం చేస్తున్న రచయిత బొజ్జా తారకం కలం నుంచి రూపుదిద్దుకున్న ఈ నవల అట్టడుగు వర్గాల బాధామయ జీవితాలకు దర్పణం పడుతుంది.

కారంచేడులో అగ్రవర్ణాలవారు దళితులపై సాగించిన అమానుష మారణకాండకు నిరసనగా 1984లోనే బొజ్జాతారకం గారు హైకోర్టులో గవర్నమెంట్‌ ప్లీడర్‌ ఉద్యోగానికి రాజినామా చేశారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ సహవ్యవస్థాపకుడిగా దళితుల నిరసనోద్యమానికి దశాబ్దకాలంపాటు వెన్నుదన్నుగా నిలిచారు. అగ్రకుల దౌష్ట్యానికీ, వర్గ దోపిడీకీ గురయ్యే ప్రజల పక్షాన రాజీలేని పోరాటం సాగించే ఆయన ఇప్పటికీ దళితులను సంఘటితపరిచే కార్యక్రమాలకే తన పూర్తికాలాన్ని వెచ్చిస్తున్నారు.

భారత రిపబ్లికన్‌ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నారు. మానవ హక్కుల ఉద్యమాల్లో ఎంతో క్రియాశీలంగా పాల్గొంటున్నారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా రచయితగా కూడా ఆయనకు మంచి పేరుంది. వీరి రచనల్లో ''పోలీసులు అరెస్టు చేస్తే'', ''కులం-వర్గం'', ''నది పుట్టిన గొంతుక'', ''నేల నాగలి మూడెద్దులు'', ''దళితులు-రాజ్యం'' ప్రముఖమైనవి.

పంచతంత్రం నవల గురించి రచయిత మాటల్లోనే ...

'' ఈనవల ఇలా సాగుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఇలా రాయాలనీ అనుకోలేదు. ఈయీ పాత్రలు, ఈయీ సన్నివేశాలు ఉండాలనీ అనుకోలేదు. ముగింపు ఇలా ఉండాలనీ అనుకోలేదు. వరదపొంగులా అది అ లా సాగిపోయింది. నవల ఇలా మొదలుపెట్టాలని మాత్రం అనుకున్నాను. అంతే. ఆ తర్వాత నా చేతుల్లో లేపోయింది.

పాత్రలు, సన్నివేశాలు, అ లా అ లా అనుకోకుండా సాగిపోయాయి. హఠాత్తుగా తెరమీదికి అనుకోని వ్యక్తులు వచ్చినట్టు చాలా పాత్రలు నవలలోకి వచ్చేశాయి. చెప్పాపెట్టకుండా బంధువులు ఇంటికి వచ్చినట్టు, తలుపు తోసుకుని లోపలికి వచ్చినట్టు ఈ పాత్రలు వచ్చేశాయి. నాకే ఆశ్చర్యం వేసింది, ఎలా వచ్చాయా అని. అయితే అన్నీ నాకు తెలిసిన పాత్రలే కాబట్టి వాళ్ల చుట్టూ, వాళ్లతో కథ అ ల్లుకుపోయాను. ఒక జీవితానికి సంబంధించిన కథ కాదిది. వేలాది, లక్షలాది జీవితాలకు సంబంధించిన గాధ, వేదన, ఆవేశం, ఆకాంక్ష. నలభై ఏళ్లుగా రాయాలనుకున్న నవల....

ఇందులోని సంఘటనలు అన్నీ గొప్పవి. సన్నివేశాలూ పాత్రలూ అంతే. అయితే వాటిని నేను పూర్తిగా చిత్రీకరించలేకపోతే లోపం నాది, పాత్రలది కాదు. ఈ పాత్రలన్నీ మనముందే తిరుగుతున్నాయి. ...''



పంచతంత్రం (నవల)
రచన: బొజ్జా తారకం
290 పేజీలు, వెల: రూ.100/-




ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీనగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500 006.

ఫోన్‌ నెం. 040-2352 1849

ఇమెయిల్‌:  hyderabadbooktrust@gmail.com

Friday, October 5, 2012

కథలగూడు... దేవులపల్లి కృష్ఞమూర్తి ...




ప్రతి కథా రియలిస్టిక్‌ పెయింటింగే

తెలంగాణా సాయుధ పోరాట జ్ఞాపకాలు మెయిన్‌ స్ట్రీమ్‌ రాజకీయాల నుండి మెల్లగా తప్పుకుంటున్నాయి.
ప్రత్యేక ఉద్యమం, అస్తిత్వ ఉద్యమాలూ తెచ్చిన తక్షణ ఎజెండాలు కూడా కారణం కావచ్చు.
ఇదంతా తాత్కాలికమే ననిపిస్తుంది.

ఇవి వట్టి జ్ఞాపకాలు కావు. వయసు మళ్లిన వాళ్లు ''మా రోజుల్లో'' అంటూ నెమరేసుకునే సంగతులు మాత్రమే కాదు, ఆ పోరాటం ఈ నేల రంగూ రుచీ వాసనని పట్టిచ్చింది. ఈ జనం స్వభావాన్నీ, టెంపర్‌నీ చూపించింది.

చే గువేరా ఏనాడో అరవయ్యో దశకంలో చనిపోతే అదంతా నిన్నో మొన్నో అయినట్టు ఎందుకు తలుచుకుంటుందీ ప్రపంచం. మన స్వతంత్ర పోరాటం గురించీ అంతకు ముందెప్పుడో వందల ఏళ్ల క్రితం వచ్చిన పోర్చుగీసు పాలనా, గోవా ప్రతిఘటన గురించి ఈ రోజుకీ చెప్పుకుంటున్నాం రాస్తున్నాం. సినిమాలు కూడా తీస్తున్నాం. చూస్తున్నాం.

తెలంగాణా సాయుధ పోరాటమూ అంతే.
అది సజీవం.
దాన్ని మన కథలూ నవలలూ, సాహిత్యం మరింత నిత్యనూతనంగా ఉంచుతాయి.
ఉంచుతున్నాయి కూడా.

ఈ అరవైయ్యేళ్లుగా పోరాట సాహిత్యం చాలా వచ్చింది. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముఖ్దుం మొహియుద్దీన్‌, రాజ్‌బహదూర్‌ గౌర్‌ లాంటి యోధుల జ్ఞాపకాలు పుస్తకాలుగా వచ్చాయి. ఇందులో చాలా వాటికి అట్టమీది బొమ్మలు గీసింది నేనే.

సుద్దాల హన్మంతు, యాదగిరి పాటలు,
దాశరథి, తెన్నేటి సూరి, సోమసుందర్‌ కవితలు ఒక వరస.
కిషన్‌ చందర్‌, వట్టికోట ఆళ్వారుస్వామి, బొల్లిముంత శివరామకృష్ణ నవలలు మరో వరస.

చిత్త ప్రసాద్‌ బొమ్మలూ, సునీల్‌ జెనా ఫొటోలూ చరిత్రని రికార్డు చేశాయి.
'మా భూమి' లాంటి సినిమాలూ అదే చేశాయి.
ఈ పరంపర ఇంతటితోనే ఆగిపోలేదు.

ఈ మధ్య ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతమై క్లైమాక్స్‌కు చేరినప్పుడు కూడా హైదరాబాద్‌లో, ఇతర పట్నాల్లో జరిగిన అనేక సభల్లో సాయుధ పోరాట ప్రస్తావన పదే పదే వస్తూనే ఉంది.

దేవులపల్లి కృష్ణమూర్తి కథలకి ఓ విశేషం, ప్రత్యేకతా ఉన్నాయి.
అన్నీ పోరాటకాలం నాటివే.
అన్నీ అసాధారణమైన పోరాట పటిమ చూపిన అన్‌సంగ్‌ హీరో, హీరోయిన్స్‌వే.
పాత్రలన్నీ నిజంగా బతుకులో ఉన్నవే.
కృష్ణమూర్తికి తెలిసినవే.
త్యాగం, పోరాటం, విషాదం, విజయం లాంటివి చెప్పేటప్పుడు పాఠకుణ్ణి కన్నీరు పెట్టించాలనో, పిడికిళ్లు బిగించేట్టు చేయాలనో, మెలో డ్రామాలో ముంచెత్తాలనో రచయితకి అనిపిస్తుంది.

కృష్ణమూర్తి కథలు ఆ పనిచేయలేదు.
పైగా తెలిసిన మనుషులనీ, వాళ్లున్న సందర్భాల్నీ వరుసగా చెప్పుకు పోతాడు.
రియలిస్టిక్‌గా మేటర్‌ ఆఫ్‌ ఫాక్ట్‌గా వినిపిస్తున్నట్టే ఉంటుంది.
ఎక్కడా అతి ఉండదు.
అలాగని ఒక్క దగ్గరా విసుగనిపించదు.
అల్లికలో అందంతో అలనాటి ఊళ్లూ, మనుషులూ, ఘటనలూ కళ్లముందు రూపుకడతాయి.
ప్రతి కథా రియలిస్టిక్‌ పెయింటింగే.
కథలో, నవలలో, సినిమాలో ఒకనాడొచ్చిన ఇటాలియన్‌ నియోరియలిస్టిక్‌ పెయింటింగ్‌ ధోరణిలో కథనం సాగుతుంది.
....
- మోహన్‌
(చిన్నమాట నుంచి)


కథలగూడు
దేవులపల్లి కృష్ఞమూర్తి
ముఖచిత్రం : లక్ష్మణ్‌ ఏలె
122 పేజీలు, వెల: రూ. 60/-

ప్రతులకు, వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌- 500006
ఫోన్‌ నెం. 040 23521849

ఇమెయిల్‌ ఐడి: hyderabadbooktrust@gmail.com



.

Friday, July 6, 2012

అపరాజితుడు ... రచన: బిభూతిభూషణ్‌ బందోపాధ్యాయ ... తెలుగు అనువాదం: కాత్యాయని ...

బిభూతిభూషణ్‌ బందోపాధ్యాయ ప్రసిద్ధ నవల ''పథేర్‌ పాంచాలి'' రెండో భాగమే ఈ 'అపరాజితో' (అపరాజితుడు). ఈ రెండు నవలలనూ కలపి 'పథేర్‌ పాంచాలి', 'అపూర్‌ సంసార్‌', 'అపరాజితో' అనే మూడు కళాఖండాలుగా మలిచాడు సత్యజిత్‌ రే.

ప్రపంచంపై ముసురుకుంటున్న యుద్ధ మేఘాలు, బెంగాల్‌ కరువు, ఛిన్నాభిన్నమవుతున్న గ్రామీణ వ్యవస్థ, బీటలు వారుతున్న భూస్వామ్య సమాజం, పర్యావరణ విధ్వంసం, పల్లెల నుండి పట్నాలకు వలసలు, తెగిపోతున్న మానవ సంబంధాలు - ఈ నేపథ్యంలో బతుకు పోరాటం సాగిస్తూ జీవన మార్మికతనూ, తాత్వికతనూ శోధించే వ్యక్తుల జీవిత చిత్రణ ఈ నవల.

బిభూతిభూషణుడి జీవన దృక్పథానికి అచ్చమైన ప్రతిబింబమే - అపూ. కష్టాలూ కన్నీళ్లూ ముసురుకుంటున్న చీకట్ల నడుమ నుండి ఒక చిరు దీపాన్ని చేతబట్టుకుని జీవిత సాఫల్యానికై నిరంతరాన్వేషణ సాగించడమే బిభూతి భూషణుడి తాత్వికత. అతడి రచనలన్నిటికీ అంతిమ సారాంశం ఇదే.

తాను కోల్పోయిన జీవితానందాన్ని కేవలం జ్ఞాపకాల వడపోతలకు కుదించకుండా కలకత్తా నగర కాలుష్యం నుండి నిశ్చిందిపురానికి, ఇచ్ఛామతీ నదీ తీరానికి తన కొడుకు కాజల్‌తో కలిసి పయనమవుతాడు అపూ. ప్రకృతిలోని నిరంతరత్వాన్నీ, జీవన కాంక్షనూ మానవ జీవితంలోనికి అనువదించుకునే అద్భుతమైన కళను కొత్తతరానికి అందించే ప్రక్రియను అపూ ఇలా ప్రారంభించాడు. అక్కడితో నవల పూర్తవుతుంది...
పాఠకుల ఆలోచనల వికాసం ప్రారంభమవుతుంది!

అన్ని మానవీయ విలువలనూ చిదిమివేసే కటిక పేదరికంలో, నిరాశలో సైతం అపూ తాను నిటారుగా నిలబడుతూ తన సాన్నిహిత్యంలోకి వచ్చిన వ్యక్తులకు భౌతికంగానో, ఆత్మికంగానో ఆసరాగా నిలిచేందుకు తపిస్తాడు. కాస్తంత వెసులుబాటు దొరికితే అడవితోనూ, ఆకాశంతోనూ మౌనంగా, ధ్యానంగా సంభాషిస్తాడు. దాదాపు ఎనభయ్యేళ్ల కిందటే ... పర్యావరణ విధ్వంసాన్ని చూసి బిభూతిభూషణుడు పడిన ఆందోళననూ, విడిపోతున్న మానవ హృదయాలను కలపటానికి ఆయన పడిన తపననూ ఈ రచన అపురూపంగా నమోదు చేసింది.

అన్ని మానవీయ స్పందనలూ ఎండిపోతున్న ఈవేళ ఈ అపరాజితుడితో సంభాషించడం ఒక అద్భుతమైన అవకాశం.
ఈ పుస్తకాన్ని సరళమైన తెలుగులోకి అనువదించిన కాత్యాయని తెలుగు పాఠకులకు సుపరిచితురాలు. పలు నవలలు, సాహిత్య పుస్తకాలు తెలుగులోకి అనువదించారు. ''చూపు'' పత్రికను నిర్వహించారు.

అపరాజితుడు
రచన: బిభూతిభూషణ్‌ బందోపాధ్యాయ
తెలుగు అనువాదం: కాత్యాయని
పేజీలు : 197, వెల : రూ. 100/-


ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849


హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పుస్తకాలను ఇప్పుడు మీరు " ఫ్లిప్ కార్ట్ " ద్వారా ఆర్డర్ చేసి నేరుగా ఇంటికే తెప్పించుకోవచ్చు. ఎలాంటి అదనపు రవాణా చార్జీలు లేకుండా!
వివరాలకు ... ఇక్కడ ... క్లిక్ చేయండి !

 


ప్రఖ్యాత ఉర్దూ రచయిత్రి ఇస్మత్‌ చుగ్తాయ్‌ కథలు... తెలుగు అనువాదం: పి. సత్యవతి ...


ఇస్మత్‌ చుగ్తాయ్‌ కథలు 

ఆధునిక ఉర్దూ సాహిత్యంలో అగ్రస్థానంలో నిలిచే విలక్షణ రచయిత్రి ఇస్మత్‌ చుగ్తాయ్‌. స్వతంత్ర ఆలోచనా ధోరణితో ఛాందసాన్ని దునుమాడుతూ, సాహసం, ధిక్కారం అనే రెండు అస్త్రాలతో సాహిత్యంలోనూ, సమాజంలోనూ కూడా విప్లవాలు తెచ్చిన శక్తి, అభివ్యక్తి ఆమెది.

1915లో జన్మించిన ఇస్మత్‌ చుగ్తాయ్‌ అలీగఢ్‌ విశ్వవిద్యాలయంలో చదువుకొని, ప్రేమ్‌చంద్‌ ప్రారంభించిన అభ్యుదయ రచయితల సంఘంలో కొంతకాలం పనిచేసింది. స్త్రీల గొంతులు ఇంకా పెగిలిరాని కాలంలో, ఒక కవితో, కథో రాయాలన్న ప్రయత్నాన్ని సైతం 'తిరుగుబోతుతనం'గా పరిగణిస్తున్న రోజుల్లో ఇస్మత్‌ చుగ్తాయ్‌ సంప్రదాయాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగరేసి నిర్భీతిగా నిలబడింది. స్త్రీల జీవితాల్లోని విషాదాన్ని చురుక్కుమనిపించేలా పాఠకుల ముందుంచే అసాధారణ ప్రజ్ఞ ఇస్మత్‌ సొంతం.

1944లో 'లిహాఫ్‌' అనే కథమీద వచ్చిన అశ్లీల ఆరోపణలను ఆమె జయప్రదంగా ఎదుర్కొంది. శక్తిమంతమైన, బహుముఖమైన ఇస్మత్‌ రచనలు భారత, పాకిస్థాన్లలో అశేషమైన ఆదరణ పొందాయి.
...

...''స్త్రీల జీవితాలలో వివాహ వ్యవస్థా, సంప్రదాయాలూ, పిత్రుస్వామ్యమూ కలిసికట్టుగా సృష్టించిన విధ్వంసం ఈ కథలనిండా పరుచుకుని వుంది. అంతా చదివేసి పుస్తకం పక్కన పెట్టేసి, హాయిగా వుండడం  కుదరదు. బేగమ్‌ జాన్‌, కుబ్రాతల్లి, కుబ్రా, ఆమె చెల్లీ, రుక్సానా, హలీమా, గోరీబీ, సరలాబెన్‌ బిచ్చూ అత్తయ్య, వదినె, షబ్నమ్‌ ఇల్లూడ్చే ముసలమ్మ, ఫర్హత్‌ అంతా చాలాకాలం మన చుట్టూ తిరుగుతూనే వుంటారు. రచయిత్రినీ, రచననూ చాలా ఇష్టపడి చేసిన అనువాదం కనుక చాలా సంతోషాన్నిచ్చింది నాకు.''
- పి. సత్యవతి
...

ఇస్మత్‌ చుగ్తాయ్‌ కథలు
ఆంగ్లమూలం: The Quilt & Other Stories translated from Urdu by Tahira Naquvi and Syed S. Hamed


తెలుగు అనువాదం: పి. సత్యవతి

ముఖ చిత్రం : శంకర్ 
పేజీలు : 184, వెల : రూ.100/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849



హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పుస్తకాలను ఇప్పుడు మీరు " ఫ్లిప్ కార్ట్ " ద్వారా ఆర్డర్ చేసి నేరుగా ఇంటికే తెప్పించుకోవచ్చు. ఎలాంటి అదనపు రవాణా చార్జీలు లేకుండా!
వివరాలకు ... ఇక్కడ ... క్లిక్ చేయండి !




ఇస్మత్ చుగ్తాయ్ కథల "ఇ బుక్ " కోసం
ఇక్కడ క్లిక్ చేయండి:


.

Wednesday, June 29, 2011

ఘంటారావం - The Hunchback of Notre Dame - రచన: విక్టర్‌ హ్యూగో- అనువాదం: సూరంపూడి సీతారాం -ముందుమాట: చలసాని ప్రసాద్‌

ఘంటారావం
రచన: విక్టర్‌ హ్యూగో
ప్రపంచ సాహిత్యంలో పేరెన్నికగన్న రచనల్లో ఒకటిగా నిలిచిపోయిన ''హంచ్‌బాక్‌ ఆఫ్‌ నోత్ర్‌దామ్‌''కు తెలుగు అనువాదం ఈ ఘంటారావం. సుప్రసిద్ధ ఫ్రెంచ్‌ రచయిత విక్టర్‌ హ్యూగో 1830లలో రాసిన నవల ఇది. దాదాపు రెండు శతాబ్దాలు కావొస్తున్నా ఇప్పటికీ ఈ నవలకు ప్రభ తగ్గలేదు.
దాదాపు ప్రపంచంలోని ప్రధాన భాషలన్నింటిలోకీ అనువాదమైంది.
దీని ఆధారంగా 1905లో మూకీలతో మొదలుకొని ఇప్పటి వరకూ ప్రతి తరంలోనూ సినిమాలు తీస్తూనే వున్నారు.
ఇక టీవీ సీరియళ్లు, నాటకాలు, రేడియో అనుసరణలు, సంగీత రూపకాలకు లెక్కలేదు.
1997లో పిల్లల కోసం వాల్ట్‌ డిస్నీ దీన్ని విజయవంతమైన యానిమేషన్‌ చిత్రంగా కూడా తెచ్చింది. నిజానికి పౌరాణిక గాథలకు తప్పించి ఒక కాల్పనిక రచనకు శతాబ్దాలుగా ఇంతటి ప్రాభవం, ఆదరణ లభించటం అరుదనే చెప్పాలి.
దీనికింత వైభోగమెందుకు? ఏమిటి దీని ప్రత్యేకత?
:::            :::            :::
విక్టర్‌ హ్యూగో (1802-85) సాటిలేని మేటి ఫ్రెంచి రచయిత. ఇతిహాసాల స్థాయిలో నవలలు రాసి విశ్వ సాహిత్యంలోనే వన్నెకెక్కాడు. అతని ''లే మిసరబ్ల'' (బీదలపాట్లు)కి సాటిరాగల నవలలు ఎన్నో వుండవు. విశ్వసాహిత్య పరిశీలకులు ఒకే గొంతుకతో ఒప్పుకునే మాట ఇది. ఆ మాటకొస్తే అటు విప్లవాలలోనూ, ఇటు సాహిత్యరంగంలోనూ కూడా ఫ్రాన్స్‌ది ఎప్పుడూ పైచేయి. అందుకే ఫ్రాన్స్‌ని ''విప్లవాల ఉయ్యాల'' అన్నారు. ఇంచు మించు అన్ని సాహిత్య సిద్ధాంతాలకి పుట్టినిల్లు ఫ్రాన్స్‌, మనందరం వీటిని మరీ మరీ మననం చేసుకోవాలి.
:::            :::            :::
అనువాద కళలో సిద్ధహస్తులు సూరంపూడి సీతారాం తెలుగు పాఠకుల కోసం దాదాపు అరవై ఏళ్ల క్రితం (1954లో) చేసిన అనువాదం ఇది.
దీన్ని ఇప్పుడు పునర్ముద్రించి మీ ముందుంచుతున్నాం.
:::            :::            :::
ఘంటారావం
రచన: విక్టర్‌ హ్యూగో
అనువాదం: సూరంపూడి సీతారాం
186 పేజీలు, వెల: రూ.100/-

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ 500 067

ఫోన్‌ నెం. 040- 2352 1849
ఇ మెయిల్‌ ఐడి: hyderabadbooktrust@gmail.com






Saturday, June 4, 2011

అలెగ్జాండర్‌ ద్యుమా ప్రపంచ ప్రఖ్యాత నవల 'ది కౌంట్‌ ఆఫ్‌ మాంటి క్రిస్టో' తెలుగులో : ''అజేయుడు'' ... అనువాదం : సూరంపూడి సీతారాం ...

ప్రెంచి నవలా రచయిత, నాటకకర్త అయిన అలెగ్జాండర్‌ ద్యుమా రాసిన అద్భుత నవల - ద కౌంట్‌ ఆఫ్‌ మాంటి క్రిస్టో.
ఈ నవలలోని కథ చరిత్రతో, రాజకీయాలతో ముడివడింది.
ఇందులో చాలా సంఘటనలు వాస్తవ ఆధారితాలు.
సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం ... ఫ్రెంచి విప్లవం కారణంగా వచ్చిన మానవీయ విలువలు ఈ నవలలో స్పష్టంగా కనిపిస్తాయి.
స్వతహాగా ఈ విలువలపట్ల ఎంతో విశ్వాసం వున్న ద్యుమా ... ఈ నవలలో అంతర్లీనంగా అవి కన్పించేలా కథనాన్ని చక్కగా మలిచారు. అసూయాపరులైన స్నేహితుల కుట్రకు జైలుపాలైన వ్యక్తి విడుదల కాగానే మారుపేరుతో సొంత ఊరికి తిరిగి వచ్చి అమోఘమైన ప్రణాళికలతో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వారిపై పగ తీర్చుకుని జీవితంలో ''అజేయుడు'' గా నిలబడటం ఇందులోని మూల కథాంశం.

1844-46లో ఒక ఫ్రెంచి పత్రికలో సీరియల్‌గా వచ్చిన ఈ నవలకు అశేష ప్రజాదరణ లభించింది. సీరియల్‌ తరువాయి భాగం కోసం జనం పత్రికల దుకాణాల ముందు బారులు తీరేవారట. పుస్తకంగా వెలువడిన కొద్ది నెలల్లోనే పది భాషల్లోకి అనువాదమైంది. 1846లో వెలువడిన ఆంగ్ల ముద్రణ విశేష పాఠకాదరణ పొందింది. దాంతో  అలెగ్జాండర్‌ ద్యుమా పేరు ప్రపంచమంతటా మార్మోగింది.

శతాబ్దాలు గడిచినా ... నేటికీ ఈ నవల పట్ల పాఠకుల ఆదరణ చెక్కు చెదరలేదు. సమాజంలో సంస్కృతుల మధ్య, విలువల మధ్య ఎంతో అంతరం వచ్చినా ఈ నవలని అప్పటి పాఠకులు ఎంతగా ఆస్వాదించారో, నేటి పాఠకులు కూడా అంతగా ఆస్వాదిస్తున్నారు. ఈ నవల ఆధారంగా ఐదు సినిమాలు వచ్చాయి. ఇక సంగీత, రేడియో రూపకాలకైతే లేక్కేలేదు.

అలెగ్జాండర్‌ ద్యుమా (1802-1870) ప్రపంచంలో అత్యధికంగా చదువబడుతున్న ఫ్రెంచి రచయిత. ఆయన అనేక నవలలు, నాటకాలు రాశారు. వాటిలో ద ''కౌంట్‌ ఆఫ్‌ మాంటి క్రిస్తో'', ''త్రీ మస్కిటీర్స్‌'' ఎంతో ప్రసిద్ధి పొందాయి.

సూరం పూడి సీతారాం 65 ఏళ్ల కిందట ఈ నవలను తెలుగులోకి అనువదించారు. ఆయన గతంలో చేసిన అనువాదాలను ...విక్టర్‌ హ్యూగో 'హంచ్‌బాక్‌ ఆఫ్‌ నొత్ర్‌దామ్‌' (ఘంటారావం), మహాశేతాదేవి 'హజార్‌ చౌరాశీర్‌ మా (ఒక తల్లి), 'దాయన్‌' (దయ్యాలున్నాయి జాగ్రత్త), 'శ్రీశ్రీ గణేశ్‌ మహిమ' (రాకాసి కోర) ...  హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించింది. ప్రపంచ సాహిత్యాన్ని, భారతీయ సాహిత్యాన్ని సహజ సుందర అనువాదాల రూపంలో తెలుగు పాఠకులకు చేరువ చేసిన ఘనత వారిది. ఆయన 1997లో మరణించారు.

అజేయుడు (నవల)
మూలం: ద కౌంట్‌ ఆఫ్‌ మాంటి క్రిస్టో
రచన: అలెగ్జాండర్‌ ద్యుమా
తెలుగు అనువాదం: సూరంపూడి సీతారాం
404 పేజీలు, వెల: రూ. 160 /-

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ 500 067

ఫోన్‌ నెం. 040- 2352 1849
ఇ మెయిల్‌ ఐడి: hyderabadbooktrust@gmail.com

Thursday, December 2, 2010

''గాన్‌ విత్‌ ద విండ్‌'' తెలుగులో ... 'చివరకు మిగిలింది?'.... అనువాదం: ఎం.వి.రమణారెడ్డి ...




ప్రపంచ వ్యాప్తంగా
రెండు కోట్ల కాపీలు అమ్ముడుబోయి
చరిత్ర సృష్టించిన నవల...


సినిమాగా విడుదలై పది అకేడమీ అవార్డులు
సొంతం చేసుకున్న నవల...


ప్రేమ, పెళ్లి, కుటుంబ జీవితాలతో పాటు
అమెరికాలో భూస్వామ్య విధానం జరిపిన
చిట్టచివరి పోరాటాన్ని
కళ్లకు కట్టినట్టు చూపించే నవల...


బైబిల్‌ తర్వాత అమ్మకాల్లో ప్రథమ స్థానం
పొందిన  నవల...

''గాన్‌ విత్‌ ద విండ్‌'' 

ఇప్పుడు తెలుగులో

''చివరకు మిగిలింది?''


మూలం: మార్గరెట్‌ మిచ్చెల్‌
అనువాదం,   ప్రచురణకర్త : ఎం.వి.రమణారెడ్డి

వెల: రూ.200/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500067
ఫోన్‌ నెం. 040 23521849

ఇ మెయిల్‌:   hyderabadbooktrust@gmail.com


.

Friday, October 15, 2010

చంద్రగిరి శిఖరం (చందేర్‌ పహార్‌) - బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ - తెలుగు అనువాదం: కాత్యాయని-


చంద్రగిరి శిఖరం 
- బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ -

బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ పేరు వినగానే తెలుగు పాఠకులకు రెండు అపురూపమైన నవలలు గుర్తొస్తాయి.
ఒకటి: పథేర్‌ పాంచాలి.
రెండు: వనవాసి - 

వాటితో పోల్చినప్పుడు ఈ చంద్రగిరి శిఖరం (చందేర్‌ పహార్‌) కాస్త భిన్నమైనదిగా తోచవచ్చు. (ఇది పూర్తిస్థాయి సాహసగాథ కావటం వల్ల అలాఅనిపిస్తుంది) కానీ, కొంచెం లోతుగా పరిశీలించి చూస్తే బిభూతి భూషణుడి జీవన తాత్వికతా, ప్రకృతితో ఆయనకున్న ప్రగాఢమైన అనుబంధమూఈ మూడు నవలల్లోనూ సమానంగానే ప్రతిఫలించాయని అర్థమవుతుంది.

ప్రకృతి సౌందర్యాన్ని దర్శించటంలో ఈ రచయిత దొక విలక్షణమైన దృష్టి.  ప్రకృతిలోని అన్ని పార్శ్వాల్లోనూ, అన్ని శక్తుల్లోనూ వ్యక్తమయ్యే సౌందర్యాన్ని ఆస్వాదించి పాఠకుల అనుభూతికి అందించగలడాయన.

పూల వనాలూ, కీకారణ్యాలూ, వెన్నెల రాత్రులూ, కార్చిచ్చు జ్వాలలూ, జలపాతాలూ, అగ్నిపర్వతాలూ... ప్రకృతిలోని ప్రతి అంశాన్నీ మానవజీవితంలోని వెలుగునీడలంత సహజంగా స్వీకరించి, ప్రేమించగలడాయన. ఈ తాత్వికతే ఆయన రచనలకు గొప్ప గాఢతనూ, సౌందర్యాన్నీచేకూర్చింది.

'పథేర్‌ పాంచాలి' నవలలో బెంగాల్‌ పల్లెసీమల ప్రకృతి దృశ్యాలనూ, 'వనవాసి' నవలలో లవటులియా, మౌహన్‌పురా ప్రాంతాల అరణ్య శోభనూ వర్ణించిన బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ ఈ చందేర్‌ పహార్‌ (చంద్ర గిరి శిఖరం)లో ఆఫ్రికన్‌ అడవుల భయద సౌందర్యాన్ని దృశ్యమానం చేశాడు. 

శంకర్‌ అన్న బెంగాలీ యువకుడు ఆఫ్రికన్‌ అరణ్యాల్లోని చందేర్‌ పహార్‌ అనే పర్వతాన్ని అధిరోహించాలన్న ఆశతో సాగించిన సాహస యాత్రను
ఉత్కంఠ భరితంగా చిత్రించాడు.

అయితే ఇది కేవలం కాలక్షేపాన్ని అందించే సాహస గాథ వంటిది కాదు. ప్రకృతితో గాఢమైన అనుంబంధం ద్వారా మానవ స్వభావానికి చేకూరే సౌకుమార్యాన్నీ, స్వార్థ రాహిత్యాన్నీ, తాత్విక దృష్టినీ గురించి ఎంతో సున్నితంగా చెప్తుందీ నవల. బిభూతి భూషణుడి రచనలతో తెలుగు పాఠకుల అనుబంధాన్ని ఇది మరింత గాఢం చేస్తుంది.

చంద్రగిరి శిఖరం
బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ
బెంగాలీ మూలం : చందేర్‌ పహార్‌
తెలుగు అనువాదం: కాత్యాయని
104 పేజీలు
వెల: రూ.50/-

Thursday, February 25, 2010

గెట్‌ పబ్లిష్డ్‌ ... మహమ్మద్‌ ఖదీర్‌ బాబు కథ ...


ఒక్క దోషికి శిక్ష పడకపోయినా పర్వాలేదు
కానీ నూరుమంది నిర్దోషులు తప్పించుకోవాలి.

....
వాళ్లు దర్గాలో వుండగానే ముంబై తాజ్‌ హోటల్‌లో పొగలు టీవీల్లో కనిపించాయి.
ఆ తరువాత మంటలు చెలరేగాయి.
ఆ తర్వాత పేలుళ్ల శబ్దాలు వాళ్ల గుండెలను దడదడలాడించాయి.
వాళ్లు కంగారు పడ్డారు.
ఆ భయంతో, ఆ ఆందోళనతో, ఇలాంటి సమయంలో తిరుగు ప్రయాణం మంచిది కాదని రెండు రోజులపాటు అక్కడే వుండిపోయారు.
మూడో రోజు సద్దు మణిగినట్టు అనిపించాక, మరేం భయం లేదని బయలు దేరి అదేరోజు ఇళ్లకు చేరుకున్నారు.
ఆ రోజు సాయంత్రం గడిచింది. ఆ రోజు రాత్రి గడిచింది. మరుసటి రోజు పగలు గడిచింది. సాయంత్రం గడిచింది. రాత్రి అత్తర్‌ నయాబ్‌ యింటి తలుపు తట్టిన చప్పుడు వినిపించింది. ...
... ... ...
ఊ... ఇదంతా పబ్లిష్‌ అవుతుందనే అనుకుంటున్నావా షకీలూ?
నేను మాట్లాడలేదు. ...
తెలుగు సంగతి పక్కన పెట్టు కనీసం ఇంగ్లీష్‌ మెయిన్‌ స్ట్రీమ్‌ పత్రికల్లో అయినా ఇలాంటివి పబ్లిష్‌ అవడం ఎప్పుడైనా చూశావా నువ్వు?
నేను మాట్లాడలేదు.
... ... ...
యాల్లా... మాకు దక్కవలసిన రొట్టెను మాకు దక్కించు.
యాల్లా... మా బతుకు తెరువులో బర్కత్‌ ఇవ్వు.
మేము నిస్సహాయులం.
నీవు తప్ప వేరే దిక్కులేని వాళ్లం. కనికరించు.
మా ఇళ్లలో రోగాలతో పీడితులైనవారు ఎందరో వున్నారు. వాళ్లకు స్వస్థత చేకూర్చు.
పనిలేని బేరోజ్‌గార్‌లు మరెందరో వున్నారు. వాళ్లకు పని ఇవ్వు.
పెళ్లిళ్లు జరగక బండ శిలల వలె తండ్రుల గుండెలపై కూర్చున్న ఆడపిల్లలు లెక్కకు మించి వున్నారు. వాళ్లపై దయ చూపు.
యాల్లా... మాకు మర్యాదతో కూడిన జీవితం ఇవ్వు.
నిర్భయంగా జీవించే బతుకు ఇవ్వు.
యాల్లా... మాకు ప్రార్థించడం రాదు.
అడగడం కూడా రాదు.
ఈ ముక్కల చెక్కల దుఆను నువ్వే కుబూల్‌ చేయాలి పర్‌వర్‌దిగార్‌.
ఆమీన్‌.
... ... ...

చదవండి. చదివించండి.

గెట్‌ పబ్లిష్‌డ్‌ (కథ)
రచన: మహమ్మద్‌ ఖదీర్‌ బాబు


ముఖచిత్రం, బొమ్మలు: మోహన్‌
కవర్‌ డిజైన్‌: లేపాక్షి

39 పేజీలు, వెల: రూ.20

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067
ఫోన్‌: 040 2352 1849


...

Sunday, November 29, 2009

వనవాసి - బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ (పథేర్‌ పాంచాలి రచయిత) - తెలుగు అనువాదం: సూరంపూడి సీతారాం...


వనవాసి (నవల) ...

భారతీయ సాహిత్యంలో అజరామరంగా నిలబడే గొప్ప బెంగాలీ నవల ఇది. ''పథేర్‌ పాంచాలీ'' నవలాకర్తగా విఖ్యాతినొందిన బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ కలం నుంచి జాలువారిన మరో అపురూప రచన ఇది. పథేర్‌ పాంచాలితో సమానమైన ప్రాచుర్యం దీనికి లభించనప్పటికీ ఇది కూడా అంతటి (లేదా అంతకంటే ఎక్కువే) విశిష్ట రచన అన్నది వివేచనాపరులైన విమర్శకుల అభిప్రాయం.
నానాటికీ అంతరించిపోతున్న అరణ్యాలు, కనుమరుగైపోతున్న మన జీవనం గురించి ఇంతటి హృద్యమైన అనుభూత్యాత్మక రచన మరోటి మన సాహిత్యంలో అరుదనే చెప్పవచ్చు.

.....

ముందుమాట నుంచి ...


బిభూతిభూషణ్‌ బంధోపాధ్యాయ (1894-1950) బెంగాలీలో రాసిన 'అరణ్యక' నవలకి అనువాదం 'వనవాసి'. అరణ్యక నవల 1938 ఏప్రిల్‌లో మొట్ట మొదటగా ప్రచురింపబడింది.

భిభూతి భూషణ్‌ అనగానే పాఠకుల మనసులో 'పథేర్‌ పాంచాలీ' మెదులుతుంది. సత్యజిత్‌రే తన చిత్రం ద్వారా పథేర్‌ పాంచాలికి అంతర్జాతీయ ఖ్యాతిని సాధించిపెట్టిన విషయం పాఠకులకు తెలుసు. ''వనవాసి''ద్వారా భభూతి భూషణ్‌ తెలుగు పాఠకులకు మరింత చేరువయ్యారు.

డెబ్భై ఏళ్లక్రితం రాయబడిన నవల వనవాసి. అప్పటికీ ఇప్పటికీ వాతావరణ పిరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి. భౌగోళిక ఉష్ణోగ్రత నానాటికీ పెరిగి పోతోంది. వర్షాభావం వల్ల రాబోయే కాలంలో జరగబోయేవి జల యుద్ధాలేననిపిస్తుంది.

వంద సంవత్సరాల క్రితం భారత భూభాగంలో 40% ఆక్రమించుకొని వున్న అడవులు 1997 నాటికి 19% అయ్యాయి. కాస్త హెచ్చుతగ్గులున్నప్పటికీ మొత్తం మీద అడవులు అంతరించి పోతున్నాయన్నది వాస్తవం. అభివృద్ధి పేరుతో అడవులు కనుమరుగవు తున్నాయన్నది చేదు నిజం.

అరణ్య ఉత్పత్తుల మీద ఆధారపడి జీవించే ఆదిమ జాతుల సంక్షేమం ప్రశ్నార్థకమవుతోంది. అత్యధిక ప్రజానీకానికి ఉపయోగపడకుండా పేద బడుగు వర్గాలని నిర్వాసితులను చేసే అనివృద్ధి అధివృద్ధికాదు. ఈ దృష్టితో చూసినప్పుడు సాహిత్యంలో ''వనవాసి'' వంటి నవలల అవసరం అప్పటికంటే ఇప్పుడే ఎక్కువ.

ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ మనదేశంలోకి ప్రవేశించి ప్రజల ఆర్థిక, సాంఘిక పరిస్థితుల్లో సంక్షోభాన్ని సృష్టిస్తున్న సందర్భంలో; కాలుష్య భూతం భోగోళాన్ని కబళించడానికి పొంచివున్న తరుణంలో, కుల, మత, వర్గ, ప్రాంతీయ వైరుధ్యాలతో మనిషి ఘర్షణపడుతూ ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న సమయంలో; స్వచ్ఛమైన ప్రాణవాయువును అతి స్వచ్ఛమైన అరణ్య వృక్షాల మీద నుంచి సభ్య సమాజపు నాగరికత సోకని అరణ్యవాసుల స్వచ్ఛమైన జీవితాలనుంచి మనకందిస్తున్నాడు రచయిత ఈ నవల ద్వారా.

...

అభివృద్ధి అంటే ఏమిటన్నది నేటికీ చర్చనీయాంశమే.

చలం ''జీవితాదర్శం'' చదివాక భీమ్లీ సముద్రం చూడాలని మనసు ఆరాటపడేది. అట్లాగే వనవాసి నవల చదివాక ఆ అరణ్యాలన్నీ సంచరించాలనే ప్రగాఢ వాంఛ పీడిస్తుంది.

రచయిత తనతో పాటు పాఠకులనీ అరణ్య సంచారం చేయించి అరణ్య ప్రకృతినీ, ప్రకృతితో మమేకమయిన కపటమెరుగని గిరిజనుల స్వచ్ఛమైన జీవనాన్ని అనుభూయమానం చేస్తాడు. మానవ నిర్మితమైన ఉద్యాన వనాలే కాదు సహజ సుందరమైన అరణ్య ప్రకృతినీ, వనాలనీ సందర్శాన స్థలాలుగా ఏర్పాటుచేసి అడవుల నిర్మూలనకి వ్యతిరేక దిశగా ఉద్యమించాల్సిన అవసరముంది.
వన విహారానుభూతిని స్వయంగా అనుభవించగలిగితే భిభూతి భూషణుని తపనలోని గాఢత ఏమిటో అర్థం చేసుకోగలుగుతాం. అతడు మన ఆత్మలమీది పొరల్ని తొలగిస్తున్నాడు. అతడి చేయిపట్టుకుని దుర్గమారణ్యంలోకి ప్రవేశించడానికి మనం సిద్ధం కావాలి మరి!

...

ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువందించిన సూరంపూడి సీతారాం తూర్పుగోదావరి జిల్లా కోరుమిల్లిలో జన్మించారు. దేశవ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో ఉద్యోగాలు చేశారు. ఢిల్లీ ఆకాశవాణిలో, చెన్నైలో ఆంధ్రప్రభలో, కలకత్తాలో ఈస్టర్న్‌ ఎక్స్‌ప్రెస్‌లో,ఆంధ్రపత్రికలో, చివరగా భారతీయ సమాచారవిభాగంలో పనిచేసి 1981లో పదవీ విరమణ పొందారు. సహజ సుందర అనువాదాల రూపంలో ప్రపంచ సాహితాన్ని తెలుగు పాఠకులకు దగ్గర చేసిన ఘనత ఆయనది. వారు అనువదించిన మహాశ్వేతాదేవి రచనలైన 'హజార్‌ చౌరాసియాకి మా' (ఒకతల్లి), 'డాయిన్‌' (దయ్యాలున్నాయి జాగ్రత్త), 'శ్రీశ్రీగణేష్‌ మహిమ' (రాకాసి కోర) లను గతంలో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించింది. సీతారాం 1997లో మరణించారు.


వనవాసి
బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ
తెలుగు అనువాదం: సూరంపూడి సీతారాం


తొలి ముద్రణ: అద్దేపల్లి అండ్‌ కో, రాజమండ్రి; సాహిత్య అకాడెమీ, న్యూఢిల్లీ తరఫున,1961
హెచ్‌బిటి ముద్రణ: సెప్టెంబర్‌ 2009

278 పేజీలు, వెల: రూ.120

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067
ఫోన్‌: 040 2352 1849

ఇమెయిల్‌: hyderabadbooktrust@gmail.com

Saturday, November 28, 2009

సూర్యుడి ఏడో గుర్రం (సూరజ్‌ కా సాత్వా ఘోడా) ... ధర్మవీర్‌ భారతి ... తెలుగు అనువాదం : వేమూరి ఆంజనేయశర్మ ... ముందుమాట : శ్యామ్‌ బెనెగల్‌ ...


సూర్యుడి ఏడో గుర్రం

హిందీ సాహిత్యంలో ఆత్యంత ప్రయోగాత్మకమైన తొలితరం రచన ఇది. నవల కాని
నవల, కథా సంకలనం కాని కథా సంకలనం.

పైకి సాధారణంగా కనిపిస్తూనే నిగూఢమైన మానవ సంబంధాలనూ, ప్రేమ
పరిణామాలనూ అసాధారణ సహజత్వంతో కొత్తకోణం ఆవిష్కరిస్తుందీ ఆధునిక రచన.
ధర్మవీర్‌ భారతి దీన్ని ఆరు దశాబ్దాల క్రితం రాశారు. అయినా నేటికీ వన్నెతగ్గకపోగా
ప్రముఖ దర్శకుడు శ్యాం బెనెగల్‌ చేతుల్లో (అదే పేరుతో) చలనచిత్రంగా రూపుదిద్దుకుని
అంతర్జాతీయ ప్రాశస్త్యాన్నీ సంతరించుకుంది.
................

శ్యాం బెనెగల్‌ రాసిన ముందు మాట నుంచి ...

1980ల చివర్లో అనుకుంటా... ఓ రోజు షమా జైదీ వచ్చి మీరు ధర్మవీర్‌ భారతి రాసిన ''సూరజ్‌కా సాత్వా ఘోడా'' నవల చదివారా? అని నన్నడిగారు. స్క్రిప్టులు రాయటంలో చిరకాలంగా నాకు సహకరిస్తున్న ఆమె ఆ సమయంలో ఈ నవల ప్రస్తావన తేవటానికి ఓ చిన్న నేపథ్యం ఉంది. ... ...

ఇదిగో సరిగ్గా అప్పుడే ''సూరజ్‌ కా సాత్వా ఘోడా'' నా కంటబడింది షమా జైదీ ద్వారా! దాన్ని చదువుతూనే కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ నవల సినిమా హక్కులు కొందామనుకుని వెంటనే ధర్మవీర్‌ భారతిని సంప్రదించాను గానీ ... అప్పటికే దాన్ని టీవీ
సీరియల్‌గా తీస్తానన్న ఓ నిర్మాతకు హక్కులు అమ్మటమో లేక మాట ఇవ్వటమో జరిగిందని చెప్పారాయన. ప్రాణం ఉసూరు మనిపించింది.
....

''సూరజ్‌ కా సాత్వా ఘోడా'' నవలలో ఎన్నో కథలున్నాయి. అన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకుని, బిగువుగా అ ల్లుకుపోతూ చదువరులకు గాఢమైన, నిగూఢమైన అనుభూతిని కలగజేస్తాయి. అ లాంటి దీన్ని విడి విడి భాగాలుగా ముక్కలు చేసి, టీవీ
సీరియల్‌గా నడిపిస్తే... పురి విప్పిన దారంలా ... ఆ అ ల్లిక, బిగువు, పొందిక... ...అన్నీ పేలవంగా తేలిపోతాయనిపించింది. చూస్తూ వుండలేక, ఆ టీవీ ప్రొడ్యూసర్‌తో ఎలాగైనా తెగతెంపులు చేసుకోవాలని ధర్మవీర్‌ భారతిపై ఒత్తిడి తేవటం ఆరంభించాను.

నిజానికది నా తత్వానికి సరిపడని పనే. ముందెన్నడూ ఇలా చేయలేదు, భవిష్యత్తులో చేస్తాననీ అనుకోను. కానీ అప్పటికీ, ఇప్పటికీ కూడా నా విశ్వాసం ఏమంటే - అసాధారణ ప్రాముఖ్యం గల ఈ నవలను ఏ ముక్క కాముక్కగా విడగొట్టటం,
ఇందులోని ఒక్కో కథనూ ఒక్కో ఎపిసోడ్‌గా మలిచి సీరియల్‌గా తియ్యటం సరికాదని! మొత్తానికి కొన్ని నెలలు పెనుగులాడి దాన్ని ఎలాగైనా సాధించగలిగాను.
.... .... ....

ఇక నవల గురించి చెప్పుకోవాలంటే ... నాటి సమకాలీన భారతీయ సాహిత్యంలో అత్యంత ఆధునికతను సిద్ధించుకున్న ''మోడర్నిస్ట్‌'' నవలగా దీన్ని నిస్సందేహంగా పేర్కొనవచ్చు. అనువాద రూపంలో ''సూర్యుడి ఏడో గుర్రాన్ని'' నేటితరం తెలుగు
పాఠకుల ముందుకు తెస్తుండటం ముదావహం.

ధర్మవీర్‌ భారతి గురించి వినని, భారతీయ సాహిత్యంపై ఆయన వేసిన ముద్ర ఏమిటో అంతగా తెలియని కొత్త తరానికి ఇదో అమూల్యమైన కానుక అని భావిస్తున్నాను.


- శ్యాం బెనెగల్‌

4 జులై 2009

సూర్యుడి ఏడో గుర్రం
ధర్మవీర్‌ భారతి

(సూరజ్‌ కా సాత్వా ఘోడా - హిందీ నవల)
తెలుగు అనువాదం: వేమూరి ఆంజనేయ శర్మ

ముందు మాట : శ్యాం బెనెగల్‌
మలిమాట : ఎన్‌. వేణు గోపాల్‌
ముందుమాట అనువాదం: అనంత్‌

115 పేజీలు, వెల: రూ.50

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీనగర్‌, గుడిమల్కాపూర్‌,
మెహదీపట్నం, హైదరాబాద్‌ - 500067 (ఫోన్‌ 040-23521849)

E Mail ID : hyderabadbooktrust@gmail.com

Wednesday, September 9, 2009

బషీర్ కథలు - వైక్కం మొహమ్మద్‌ బషీర్


'' దాదాపు వెయ్యేళ్లకు ముందునుంచీ ముస్లింలు ఇక్కడున్నారు. కానీ ఎవరూ వారి గురించి రాయలేదు. రాస్తేగీస్తే వాళ్లను ప్రతిసారీ తక్కువ రకం మనుషులుగానే చూపించారు. ఈ దేశంలో ముస్లింలకు రాముడు తెలుసు, రావణుడు తెలుసు. కానీ ఆవలి వైపు నుంచి ఈ అన్యోన్యత లేదు. ఇటువంటి సంస్పందన ఉండాలనే నేను ముస్లిం వాతావరణం నేపథ్యంగా రచనలు చేస్తాను.''
- వైక్కం మహ్మద్‌ బషీర్‌
.... .... ....
వైక్కం మహమ్మద్‌ బషీర్‌ (1908 - 1994) ప్రఖ్యాత మళయాళ రచయిత. తన జీవితకాలంలోనే ఓ 'లెజెండ్‌'లా ఎదిగి విశిష్ట ఆధునిక భారతీయ రచయితగా ప్రపంచ ఖ్యాతిని ఆర్జించారాయన. చిన్న చిన్న కథలు, నవలికల్లోనే సంక్లిష్ట మానవ ఇతివృత్తాలను, వైవిధ్యభరితమైన చిక్కటి జీవితానుభవాలను ఆవిష్కరించే నేర్పు. ఏకకాలంలో పండిత పామరుల్నీ, ఆబాల గోపాలాన్నీ ఆలరించే రచనా చమత్కృతి బషీర్‌ ప్రత్యేకతలు.

మానవతావాదిగా ఆయన సాధించిన విజయపరంపర జగద్వితితం. ముస్లిం జాతీయతావాదిగా కూడా బషీర్‌ రచనలకు అసమాన ప్రాశస్త్యం వుంది. అది నానాటికీ పెరుగుతోంది.

ఆయన రచనలను తెలుగు పాఠకులకు చేరువ చేసే అపూర్వ కథా సంకలనమిది.
.....
ఇందులోని కథలు:

1. ఒక ప్రేమ లేఖ
2. ఏనుగుల దొంగ - బంగారు శిలువ
3. పూవన్‌ బనానా
4. బంగారు ఉంగరం
5. దుడ్డులాఠీ పణిక్కర్‌
6. అమ్మ
7. మోసకారి కూతురు
8. తాయెత్తు
9. విశ్వవిఖ్యాత ముక్కు
10. ఏకాంత తీరం
11. గోడలు
12. ఒకనాటి ప్రేమకథ
13. పుట్టిన రోజు
14. టైగర్‌
15. ఒక మనిషి
16. అవని తల్లికి అసలైన వారసులు
17. అనల్‌ హఖ్‌
18. శబ్దాలు
19. ఏనుగు పిలక
20. పాత్తుమ్మా మేక కథ నేపథ్యం
21. పాత్తుమ్మా మేక

సతీష్‌ పొదువాల్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, కల్చరల్‌ స్టడీస్‌ విభాగం, ఈఎఫ్‌ఎల్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌ ఈ పుస్తకానికి ''ఆధునిక వైతాళికుడికి సమకాలీన పరిచయం'' పేరుతో ముందుమాట రాశారు.
........................

ఈ కథలను తెలుగులోకి అనువదించినవారు:

సి.అనంత్‌
జి.షేక్‌బుదన్‌
విమల
ప్రభాకర్‌ మందార
సి.వనజ
హెచ్చార్కె
పి.సత్యవతి
ఎస్‌.జయ
భార్గవ
కాత్యాయని
ఆకెళ్ల శివప్రసాద్‌
సంధ్య
కలేకూరి ప్రసాద్‌
పట్నం ఉమాదేవి
....................

మధ్య కేరళలోని ఓ మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో 1908లో పుట్టిన బషీర్‌ చాలావరకు తనను తానే రచనకు ముడిసరుకు చేసుకున్నారు. చదువుకుంటున్న రోజుల్లోనే భారత జాతీయోద్యమంలో చేరి ఎన్నోసార్లు జైలుకెళ్లారు. ఆ తర్వాత జర్నలిస్టుగా, తీవ్రవాదిగా, దేశ దిమ్మరిగా, సూఫీ సాధువుగా, హోటల్లో పనిమనిషిగా, మిల్లు కూలీగా, వంటమనిషిగా, హస్త సాముద్రికుడిగా, ట్రావెల్‌ ఏజెంట్‌గా ... ఇంకా ఎన్నెన్నో వృత్తులు చేశాడాయన. ప్రముఖ రచయితగా పేరు గడించిన తర్వాత పుస్తకాల దుకాణం నడిపారు. ఈ సహస్ర వృత్తుల బలం కేవలం బషీర్‌ వ్యక్తిత్వాన్నే కాదు, ఆయన రచనలనూ పదును దేల్చింది. ఆయనను ఎన్నో అవార్డులు వరించాయి. 1970: కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌, 1972: స్వాతంత్య్ర సమరంలో పాల్గోన్నందుకు కేంద్రప్రభుత్వ తామ్రపత్రం,1981: కేరళ సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌, 1982: పద్మశ్రీ పురస్కారం, 1987 కాలికట్‌ యూనివర్సిటీ డిలిట్‌ ప్రదానం. బషీర్ మాత్రం ఇవేమీ పట్టనట్టే వుండేవారు. అదే ఆయన ప్రత్యేకత. బషీర్‌ 1994 జులై 5న కన్నుమూశారు.

బషీర్‌ రచనలను ఎన్నింటినో స్కూళ్లలో పాఠ్యాంశాలుగా చేర్చారు. భారతీయ/కేరళ సాహిత్య చరిత్ర గ్రంధాలన్నింటిలో వీటిని ప్రత్యేకంగా చర్చించారు. విఖ్యాత దర్శకులు పలు సినిమాలుగా కూడా తీశారు. బషీర్‌ ఫొటోలు, చిత్రాలు ఎంతగా జన బాహుళ్యంలోకి వెళ్లిపోయాయంటే కేరళలోని ప్రతి ఒక్కరూ ఆయనను గుర్తు పట్టగలరు . ఆయన మరణించి ఎన్నో ఏళ్లు గడచిపోయినా ఇప్పటికీ 'బేపూర్‌ సుల్తాన్‌'గా (బషీర్‌ ఈ పేరుతోనే లబ్ధప్రతిష్టులు), భారతీయ సాహితీ జగత్తులో అత్యంత సమ్మోహనాత్మక రచయితగా ఎప్పటికీ నిలిచే వుంటారు.
................

బషీర్‌ కథలు
-వైక్కం మొహమ్మద్‌ బషీర్‌

ముఖచిత్రం: శంకర్‌
మొదటి ముద్రణ: ఆగస్ట్‌ 2009

289 పేజీలు, వెల: రూ.100

.....................

ప్రతులకు, వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067

ఫోన్‌: 040 2352 1849

ఇమెయిల్‌: hyderabadbooktrust@gmail.com


.............

Saturday, June 27, 2009

బతుకంతా (కన్నడ మూలం: ఒడళాల) ... దేవనూర మహదేవ... అనువాదం: వల్లంపాటి వెంకట సుబ్బయ్య ...



ఎవరో వచ్చి తమను ఏదో ఉద్ధరిస్తారనే పగటి కలలకు దూరంగా - సుఖదుఃఖాలను పెనవేసుకుని, ఆప్యాయం అనురాగంతో ఒకరి కొకరు తోడుగా నీడగా బతుకంతా సాగించే దళితుల, నిరుపేదల బతుకుల ప్రతిబింబింబం ఈ 'బతుకంతా...' కథ.

అష్టకష్టాలతో జీవనం సాగిస్తూ అర్థాకలితో అ లమటిస్తూ బతుకు బండిలాగే నిరుపేద కుటుంబాలు సాంఘికంగా ఏ స్థితికి నెట్టబడ్డాయో సజీవంగా చిత్రిస్తూ, వారిపై ''పైవారి'' దౌష్ట్యం ఏవిధంగా సాగుతోందో తెలియజేస్తుంది మనకీ కథ.

దేవనూర మహదేవ కర్ణాటక ప్రాంతంలో సుపరిచితులైన ప్రఖ్యాత దళిత రచయిత. ''వ్యాపనూర్‌ కథలు'' ఈయన మొదటి కథా సంకలనం. ''ఒడళాల'' (బతుకంతా ...) రెండవ రచన.

ప్రఖ్యాత సాహితీ విమర్శకుడు, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత స్వర్గీయ వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు ఈ కథను తెలుగులోకి అనువదించారు.

బతుకంతా ...
రచన: దేవనూర మహదేవ

కన్నడ మూలం: ఒడళాల
తెలుగు అనువాదం : వల్లంపాటి వెంకటసుబ్బయ్య


ముఖచిత్రం : సూరిబాబు

ప్రథమ ముద్రణ : 1984
ద్వితీయ ముద్రణ : 2000

24 పేజీలు, వెల : రూ.7

.......

Thursday, June 18, 2009

మంచీ చెడూ (నవల)…రచన: శారద … సంక్షిప్తం: సహవాసి … బ్మొమ్మలు: కాళ్ల



మంచీ చెడూ (నవల)…
రచన: శారద ...

అరవై డెబ్బై ఏళ్ల కిందట వందకు పైగా కథలు, ఆరు నవలలతో ఆంధ్ర దేశాన్ని వశీకృతం చేసుకుని అశేష తెలుగు పాఠకలోకానికి శారద గా పరిచితుడైన ఈ రచయిత అసలు పేరు నటరాజన్‌.

ఈయన తెలుగువాడు కాదు. స్కూల్లో చదువుకోలేదు. 12-13 ఏళ్లు వచ్చేదాకా ఆంధ్రలో అడుగుపెట్టి ఎరుగడు. బ్రతుకు తెరువు వెతుక్కొంటూ మద్రాసు నుంచి తెనాలి వచ్చి వంటవాడిగా స్ధిరపడ్డ నటరాజన్‌ తెలుగు నేర్చుకున్నాడు.

సాంస్కృతిక సంప్రదాయ వారసత్వం కలిగిన తెనాలి, త్రిపురనేని రామస్వామి చదౌరి మొదలు చలం, చక్రపాణి, కొడవటిగంటి, జి.వి.కృష్ణారావు ప్రభృత భావ విప్లవకారులైన సంస్కర్తలు, రచయితల నెందరినో పూచిన తెనాలి నటరాజన్‌ను సహజంగానే ప్రభావితం చేసింది.
జీవితం పాఠాలు నేర్పింది.
అతనిలోని సృజనశీలి మేలుకొన్నాడు, వికసించాడు. సాహితీ పరిమళాలు వెలార్చాడు.

శారద (నటరాజన్‌) తొలి కథ... ప్రపంచానికి జబ్బు చేసింది. 1946లో ప్రజాశక్తిలో వెలువడింది.
ఆ తరువాత జ్యోతి, తెలుగు స్వతంత్ర, విశాలాంధ్ర, యువ, రేరేణి వగైరా ఎన్నో పత్రికల్లో ఆయన రచనలు అచ్చయ్యాయి.

1950 ప్రాంతంలో వెలువడిన ఏది సత్యం నవల ప్రతులన్నీ ఒక్క నెలలో అయిపోయాయి. ఆనాడది అపూర్వమైన రికార్డు ఆంధ్ర పత్రికలో ధారావాహికంగా ప్రచురితమైన ... మంచీ-చెడూ, అపస్వారాలు నవలలు తెలుగు పాఠకలోకాన్ని ఊపిశేశాయి. ముసిరిన దారిద్య్రంలో శారద కన్ను మూశాడు.

మంచీ-చెడూ, అపస్వారాలు సమాజంలో ఆనాడు కొత్తగా చోటుచేసుకొంటున్న వ్యాపార విలువలను చిత్రించాయి. ఫ్యూడల్‌ వ్యవస్థ నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థ వైపు వడివడిగా అడుగులు వేసుకుంటూ వస్తూన్న మనుషుల స్వభావ శీలాల పరివర్తనాన్ని కళ్లకు కడతాయి ఆ నవలలు.

శారద జీవితం వ్యక్తిత్వం, జనం కోసం కలం పట్టాలన్న ఆయన తపన తరాలు గడచిపోయినా పలిగిపోని స్ఫూర్తి దీపమై
నిబద్ధతగల వర్ధమాన రచయాతలందరికీ ఇన్‌స్పిరేషన్‌ యిస్తాయి.

......


మంచీ చెడూ
రచన: శారద
సంక్షిప్తం: సాహవాసి
బ్మొమ్మలు: కాళ్ల
వెల: రూ.25

Thursday, April 23, 2009

మాలపల్లి .... ఉన్నవ లక్ష్మీనారాయణ


ఉన్నవ లక్ష్మీనారాయణ స్వాతంత్య్ర సమర యోధుడు.
సాహిత్య విశారదుడు, సంస్కర్త, కార్య శూరుడు.

బార్‌-ఎట్‌-లా చదివినా పరప్రభుత్వోద్యోగానికి పాకులాడక తనకు తానుగా ఎన్నుకొన్న సంఘసేవలో కాలం గడిపాడు. గుంటూరు జిల్లాలో పన్నుల నిరాకరణోద్యమాన్ని నడిపినందుకు బ్రిటీషు ప్రభుత్వం ఒక సంవత్సరం జైలు శిక్ష విదించి రాయవెల్లూరు జైలులో నిర్బంధించింది.


జైలులోనే ఆయన ''మాలపల్లి'' రచించారు.

అసమాన సామాజిక స్పృహతో ఆనాడు రాసిన నవలల్లో
''మాలపల్లి'' తరువాతే మరే రచన అయినా.
సమకాలీన సాంఘిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాలకు
దర్పణం పట్టిన నవల ''మాలపల్లి''.
వాడుక భాష బొత్తిగా వ్యాప్తిలో లేని కాలంలో, మాదిరి(మోడల్‌)కు
తగిన పుస్తకాలు లేని పరిస్థితిలో తెలుగుభాష నడక కనుకూలంగా
ఈ నవలను రాయడం విశేషం.

దాదాపు ఒక శతాబ్దం కిందటి పరిస్థితులు తెలియని ఈ తరం పాఠకులకు
''ఇదేమి వాడుక భాష?'' అనిపించవచ్చు.
జాతీయాలు, సామెతలు, తెలుగు పలుకుబళ్లు పొంగి పొరలే ''మాలపల్లి''
భావ, భాషా విప్లవాలను ఏకకాలంలో సాధించిన ఉత్తమ కృతి.
పల్లెటూరును వేదికగా చేసుకొని వెలువరించిన చాలా కొద్ది నవలల్లో
''మాలపల్లి'' వెలకట్టలేని అక్షరాభరణం.

''మాలపల్లి''ని బ్రిటీషు ప్రభుత్వం రెండు సార్లు నిషేధించింది.

గుంటూరులో స్త్రీ విద్యాభివృద్ధికోసం ఆయన నెలకొల్పిన ''శారదానికేతనం''
ఆయనను సదా జ్ఞాపకం చేస్తుంది.

ఉన్నవవారు 1958లో కన్నుమూశారు.

''ప్రగతిని కోరేవారూ, సాహిత్యంలో వెలుగును కోరేవారూ కోట్లాది కడజాతి వారి గుండె వెతలను విన్పించే ''మాలపల్లి'' మనజాతి గర్వించదగిన నవల అని గుర్తించగలరు.''

ఈ మేటి రచనను ''సహవాసి'' గారు సంక్షిప్తం చేశారు.
అందమైన బొమ్మలను ''అన్వర్‌'' అందించారు.

మన జాతి గర్వించదగ్గ మేటి రచనలను సజీవ చిత్రాలతో,
సంక్షిప్తంగా పరిచయం చేయటం - చదువరులలో ఆసక్తిని రేకెత్తిస్తుందనీ,
తిరిగి మూల రచనలు చదివేలా స్ఫూర్తినిస్తుందనీ ఆశిస్తున్నాం.



మాలపల్లి
- ఉన్నవ లక్ష్మీనారాయణ

సంక్షిప్తం : సహవాసి
బొమ్మలు : అన్వర్‌

68 పేజీలు, వెల: రూ.25


ప్రతులకు వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడి మల్కాపూర్‌, హైదరాబాద్‌. - 500067
ఫోన్‌ : 040-2352 1849


ఇ-మెయిల్‌:
hyderabadbooktrust@gmail.com

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌