Friday, November 9, 2018

అనేక రామాయణాలు - తెలుగు అనువాదం: పి.సత్యవతి



అనేక రామాయణాలు 
- తెలుగు అనువాదం: పి.సత్యవతి

''రాముడిని ఆదర్శానికి ప్రతీకగా చేసి, జనరంజకంగా చేప్పే రామాయణాలనే
హిందుత్వవాదులు ఇష్టపడతారు. పిల్లలని నిద్రపుచ్చడానికి చెప్పే కథలాగా,  విన్నదంతా నమ్మేసి నిద్రపోయేలా చేసేటట్లువుండే రామాయణమే వారికి నచ్చుతుంది''

- సుగత శ్రీనివాసరాజు (పత్రికా రచయిత్రి)

భారతదేశ చరిత్రలో అనేక రామ కథలున్నాయి.

చాలామంది పండితులు వాల్మీకి రామాయణమే ప్రామాణికమైనదిగా భావిస్తున్న తరుణంలో, ఈ సంకలనంలోని వ్యాస రచయితలు ఆ అభిప్రాయంతో విభేదిస్తారు. అనేక రామాయణాల గురించి ప్రస్తావించి వాటిని విశ్లేషిస్తారు. స్థలకాలాలు, రాజకీయ నేపథ్యం, ప్రాంతీయ సాహిత్య సాంప్రదాయాలు, మతాచారాలు, పాఠకుల, శ్రోతల అభిరుచులు, సృజన ప్రక్రియ మొదలైన వాటిని దృష్టిలో పెట్టుకుని ఎన్ని రామాయణాలు రూపుదిద్దుకున్నాయో సోదాహరణంగా నిరూపిస్తారు. ...

కొంతమంది ఆధ్యాత్మిక ప్రయోజనానికి, కొంతమంది రాజకీయ ప్రయోజనాలకు రామాయణాన్ని పునర్విశ్లేషించారు. చరిత్ర కారులకూ, దక్షిణాసియాపై అధ్యయనం చేసే  పండితులకూ, జానపద సాహిత్యకారులకూ, సామాజిక సాంస్కృతిక పరిణామాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసేవారికీ ఈ వ్యాసాలు ఒక కొత్తచూపునిస్తాయి.

1991లో ప్రచురితమైన ఈ ''మెనీ రామాయణాస్‌'' పుస్తకంలో ఎ.కె.రామానుజన్‌ వ్రాసిన ''మూడువందల రామాయణాలు: ఐదు ఉదాహరణలు'' అనే వ్యాసాన్ని 2008వ సంవత్సరంలో ఢిల్లీ యూనివర్సిటీ వారు చరిత్ర విభాగంలో ఒక బోధనాంశంగా ప్రవేశ పెట్టినప్పుడు అది వివాదానికి దారితీసింది.

హిందూ మితవాద విద్యార్థి కార్యకర్తలు ఈ పాఠ్యాంశాన్ని తొలగించాలని కోరుతూ అందుకు నిరసనగా చరిత్ర విభాగంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అప్పుడు నలుగురు ఎకడెమిక్‌ సభ్యులతో ఒక కమిటీ వేసి ఈ వ్యాసం బోధనాంశంగా వుంచాలా తొలగించాలా అనే విషయంపై విచారణ జరిపించమని సుప్రీంకోర్టు యూనివర్సిటీని ఆదేశించింది.

అందులో ముగ్గురు సభ్యులు ఈ వ్యాసం, సంబంధిత కోర్సుకు చాలా ముఖ్యమైనదని, అందులో వివాదాస్పదమైన అంశం ఏమీ లేదనీ అభిప్రాయపడ్డారు. నాలుగవ సభ్యుడు కూడా ఈ వ్యాసంలో తప్పేమీ లేదనీ కాకపోతే అది విద్యార్థుల మనోభావాలను గాయపరిస్తే తొలగించవచ్చనీ అన్నాడు.

కమిటీ 3-1 ఓట్లతో అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ అకడెమిక్‌ కౌన్సిల్‌ ఆ తీర్పును బేఖాతరు చేస్తూ పాఠాన్ని తొలగించింది. అనేకమంది చరిత్రకారులో మేధావులూ దీనిపై ఆందోళన చేసారు. కమిటీ అట్లా లొంగిపోవడాన్ని తప్పుపట్టారు.

పౌలా రిచ్మన్‌ సంపాదకత్వంలో వెలువడిన ఈ పుస్తకంలో ఏడు వ్యాసాలున్నాయి.
వీటిని పి. సత్యవతి తెలుగులో అనువదించారు.

ఆంగ్ల మూలం : 
MANY RAMAYANAS : The Diversity of a Narrative Tradition in South Asia, edited by Paula Richman, University of California Press, Bderkeley, Los Angeles, USA, 1991

పేజీలు : 160, ధర : రూ.150/-



నవంబర్ 11 ఆదివారం ఉదయం 10-30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు  
హైదరబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం (దొడ్డి కొమురయ్య హాల్)లో 
జరిగే ఒక సాహితీ మిత్రుల సమావేశంలో ఈ పుస్తక అవిష్కరణ ఆ తరువాత చర్చ వుంటుంది. 
పి. సత్యవతి గారు, హెచ్ బి టి మిత్రులు, పుస్తకాభిమానులు పాల్గొంటారు. 
వివరాలకు ఫోన్ చేయండి : 
040 23521849
9441559721  



హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌