ఏనుగంత తండ్రికన్నా యేకులబుట్టంత తల్లి నయం
- గోగు శ్యామల
ముందుమాట : డా|| కేశవరెడ్డి
సూర్యగ్రహణాన్ని వర్ణించనీ,
చావడి దగ్గర చేరిన గ్రామస్తులను గురించి చెప్పనీ,
బర్రెమీద సవారీ చేసే పల్లెటూరి పిల్లను గురించి చెప్పనీ,
దళితులు కొట్టే డప్పు చప్పుడులోని వివిధ దరువులు పరిచయం చేయనీ...
గోగు శ్యామల కథనంలో వుండే మంత్ర శక్తి ఒకే స్థాయిలో వుంటుంది.
దానికి పరిమితులు లేవు. ఆమె మనకు ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని చూపిస్తూనే విశాల విశ్వంలోకి నడిపిస్తుంది. ఒక్కసారిగా బాల్యంలోకి పరుగు తీసి అవధులూ ఆకాంక్షలూ ఎరుగని అమాయకపు కళ్లతో దళిత జీవితాన్ని మన ముందుకు తెస్తుంది. దళితుల రోజువారీ జీవితాన్ని వివరంగా కళాత్మకంగా ఎంతో చాతుర్యంతో కళ్లకు కట్టిస్తుంది.
ఈ కథలకి నేపథ్యం ఒక తెలంగాణా గ్రామంలోని మాదిగ వాడ.
అక్కడి వివిధ సందర్భాలనూ, సనినివేశాలనూ, జనం అనుభవాలనూ చిత్రిస్తూ వాటిని అవగాహన చేసుకునే ఒక కొత్త చూపును పాఠకులకు ప్రసాదిస్తుంది.
పూర్వపు రచనలలో అటువంటి ప్రదేవాలను, ప్రజలను వర్ణించడానికి ఉపయోగించిన భాష గురించి, వాటి పట్ల ఆ చరనలలో కనబడిన భావుకత, పరిపాలనా దృక్పథం, గాంధీత్వ దృష్టి గురించి చెపుతున్నప్పుడు ఆమె చమత్కారం చాలా నవ్వు తెప్పిస్తుంది. ఈ కల పరిష్కారాలు ఊరి నుంచి, మాదిగవాడ నుంచి, ఆటువంటి ఇతర సమూహాల నుంచి మనుషుల్ని బయటికి పంపించడంలో లేదు. అక్కడి జన జీవితాన్నే భవిష్యత్ ఆశగా చూపించే కథలు ఆమెవి.
తన పదునైన రాజకీయ భావాలను గాఢమైన కథన సౌందర్యంతో మేళవించి, దళిత రచనంటే కేవలం పీడన గురించి వ్రాయడమేననే మూసాభిప్రాయాన్ని బద్దలు కొట్టింది గోగు శ్యామల.
.........................................................................................................
స్పందన
The crowds were amazed at his
teaching, because he taught as
one who had authority and not
as their teachers of the law. Matthew 7:28 (Bible)
''మీ పుస్తకానికి ముందు మాటలు రాయలేను. " ఐ యాం ఎ పూర్ జడ్జ్ " అని ''నేనన్నప్పుడు
గోగు శ్యామలగారు, జడ్జ్ చేయవద్దు. కథలు చదివి మీ స్పందన రాస్తే చాలు'' అన్నారు. ఆ
వెసలుబాటు లభించాక ఇక కూర్చుని ఈ నాలుగు మాటలు రాస్తున్నాను.
దళిత అస్తిత్వాన్ని పలు కోణాలలో విశ్లేషించే కథలు పన్నెండు ఇందులో ఉన్నాయి. ఈ
సంకీర్ణ సమాజంలో ఏ మనిషికి గాని ఒకే అస్తిత్వం ఉండదు. ఒకటి కన్నా ఎక్కువ అస్తిత్వాలే
ఉంటాయి. ఆ విధంగా ఈ ప్రపంచంలో ఎంత మంది జనం ఉన్నారో దానికి నూరు రెట్లు అధిక సంఖ్యలో
అస్తిత్వాలున్నాయి. ఈ అస్తిత్వాలలో వెయ్యోవంతునైనా ప్రపంచ సాహిత్యం యావత్తూ కలిసి గూడా
ఇంతవరకు విశ్లేషించలేదు, విశ్లేషించ జాలదు. అందుకే అంటారు రాసే నేర్పు, కౌశలం ఉండాలే గాని
ఇతివృత్తాలకు ఏ కాలంలోను, ఏ దేశంలోను కొరతలేదని.
మనిషికున్న ఎన్నో ఎన్నో అస్తిత్వాలలో ప్రధానమైనవి రెండు: ఆర్థిక అస్తిత్వం,
సాంస్కృతిక అస్తిత్వం. వీటిలో ఏది పునాది, ఏది ఉపరితలం అన్న దానిని గురించి కొందరికి ఇంకా
స్పష్టత లేదు. అయితే అవి రెండు ఒక దానినొకటి అనివార్యంగా ప్రభావితం చేసుకుంటాయన్నది
కాదనలేని సత్యం. సమాజం చలనశీలమని, మానవ సంబంధాలు చరిత్ర పొడవునా ఒకే రీతిగా
ఉండవని తెలిసిన వారికి ఈ సత్యాన్ని గుర్తించడం కష్టమేమీ కాదు. ఆర్థిక అస్తిత్వం మనుషులందరికీ
ఉమ్మడి అస్తిత్వమై ఉండగా, సాంస్కృతికం ఆయా వర్గాలకు మాత్రం ప్రత్యేకమైన అస్తిత్వంగా ఉంటుంది. రెండు అస్తిత్వాలు కలగలసిపోయి ఉంటాయి. గనక, పరస్పరం ప్రభావితం చేసుకుంటాయి గనక గిరిగీసుకుని సాంస్కృతిక
అస్తిత్వాన్ని గురించి మాత్రమే రచన చేయటానికి వీలుపడదు. అలాగే ఆర్థిక అస్తిత్వాన్ని గురించి
మాత్రమే రాయడానికీ వీలుపడదు. ఇక్కడే మనకు ఏది దళిత సాహిత్యం? అనే ప్రశ్నకు సమాధానం
దొరకవచ్చు. రచయిత దళితుడైనంత మాత్రాన అది దళిత సాహిత్యమైపోదు. అలాగే దళితులను
గురించి రాసిందంతా దళిత సాహిత్యం కాజాలదు. దళితులకు ప్రత్యేకమైన సాంస్కృతిక అస్తిత్వం పైనా
ప్రధానంగా కేంద్రీకరించి దానిని పరిశీలించి, విశ్లేషించిన రచనను దళిత సాహిత్యమని నిర్వచించవచ్చు.
అంటే రచయితకు బలమైన సాంస్కృతిక మూలాలు, స్వానుభవం
ఉండితీరాలి. ఐతే అవి రెండు ఉన్నంత మాత్రాన ఆ రచన సాధికారతను, పరిపూర్ణతను సాధించజాలదు.
ఎందుకంటే సాహిత్యం మరీ అంత యాంత్రికమైన ప్రక్రియ కాదు గనక. సాంస్కృతిక మూలాలు,
స్వానుభవము పుష్కలంగా ఉన్న ఒక దర్శకుడు, స్క్రిఫ్టు రైటరు కలిసి తీసిన సినిమాలో బ్రాహ్మణ
పూజారికి జందెం పెట్టడం మరచిపోయిన ఉదంతం మనం విన్నాంగదా. ఇక్కడే ఇందుకు భిన్నమైన ఇంకొక ఉదాహరణ గూడా చెప్పుకోవాలి.
సాంస్కృతిక మూలాలు, స్వానుభవము ఏమాత్రం లేని ఒక పరమ నాస్తికుడైన నటుడు 'శ్రీ చైతన్య
ప్రభు' నాటకంలో ప్రధాన పాత్ర పోషించి రక్తి కట్టించాడట. రామకృష్ణ పరమ హంస ఆ నాటకం చూడడం
తటస్తించి చైతన్య ప్రభుని భక్తిరసానికి ముగ్ధుడైపోయి, నాటకం అయిపోయాక గ్రీన్ రూంలోకి వెళ్ళి
నటుడ్ని అభినందించి, ''నీలో కృష్ణపరమాత్మను దర్శించుకొన్నానయ్యా. దేవుని కృపాకటాక్షాలు నీకు
నిండుగా ఉన్నాయి'' అన్నాడట. అందుకా నటుడు, ''అయ్యా, నువ్వంటున్నదేమిటో నాకర్థం
కావటంలేదు. దేవుని కృపా కటాక్షాలను గురించి నాకేమీ తెలియదు. నేను నాస్తికుడిని, నేను కేవలం
నటించానంతే'' అన్నాడట. ఇక్కడ భక్తిరసాన్ని పండించింది నటుని నటనా కౌశలమే గాని సాంస్కృతిక
మూలాలు, స్వానుభవమూ కాదు. అందుకే గదా అంటారు: కళకు అసాధ్యం ఏదీలేదని. ఇక
రచయితకు సాంస్కృతిక మూలాలు, స్వానుభవాలతోబాటు రచనా కౌశలం గూడా ఉన్నప్పుడు ఆ
రచనకు మరింత సాధికారత, మరింత పరిపూర్ణత లభిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.
ఈ అంశాలన్నీ నిండార్లుగా ఉండడం వల్లనే గోగు శ్యామలగారి కథలు సాధికార దళిత
సాహిత్యంగా రూపుదిద్దుకున్నాయి. ఎంత బలమైన మూలాలు లేకపోతే రచయిత్రి బైండ్లామె చేత,
''దొరా, మీరు నాకు కూలి పైసలియ్యకుండ్రి. నేనే కూలి పైసలిస్త. మీ బిడ్డను గోజుకిడ్వుండ్రి. పండగల
రంగమెక్కమనుండ్రి. నేనే నీ బిడ్డకు కూలిస్త!'' అనిపించ గలదు! ఆ సమయంలో బైండ్లామె
ధర్మాగ్రహాన్ని, రౌద్రాన్ని వర్ణించడానికి రచయిత్రి ఇరవై ఏడు వాక్యాలు రాశారు. అవి ఒక్కొక్కటి వొళ్ళు
గగుర్పొడిచే వాక్యాలు. (బైండ్లామె భూమడగదా మరి).
స్వానుభవం నుండి పుట్టిందే 'బడెయ్య' కథలోని బొక్కబండి ఉదంతం. మనం మట్టి
బండిని చూశాం. కొయ్య బండిని చూశాం. బంగారు బండిని గురించి విన్నాం. చచ్చిపోయిన దూడ
పుర్రెతో బండి తయారు చేయొచ్చునని నాకిప్పుడే తెలిసింది. ఆ బండిని తయారుచేసే విధానం రచయిత్రి
వివరిస్తుంటే వినడం ఒక అనుభవం. బడెయ్య ఆ బండితో ఆడుకోవడమే గాక దాంతో పొలానికి ఎరువు
తోలడం గూడా చేస్తాడు. అంత చిన్న వయసులోనే వాడికి అది ఆటవస్తువేగాక ఒక పనిముట్టు అని
గూడా తోచడం గమనార్హం. పని, పాట - ఇవి రెండూ వేర్వేరు కాదనే సాంస్కృతిక నేపథ్యం రచయిత్రికి
ఉండడంవల్లనే ఇది సాధ్యమయింది. ఇక 'జాడ' కథను చదవడమంటే ఒక పండగ సంబరంలో
పాలుపంచుకోవడమే. మోర్స్ కోడ్‌తో నడిచే టెలిగ్రాఫ్ వ్యవస్థకు మనదేశం ఇటీవలే చరణగీతం
పలికింది. మోర్స్‌కోడ్‌కు దీటుగా డప్పుమీద రచయిత్రి వినిపించిన తొమ్మిది రకాల సంకేతాలను
వింటుంటే ఎంత సంబరం! ఆ కథ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా చిర్ర, చిటికెన పుల్లలు డప్పుమీద వేసిన
తొమ్మిది రకాల దరువులు నా చెవుల్లో హోరెత్తుతాయి.
మిగిలిన కథలు కలగచేసిన స్పందనలను గూడ ఏకరవు పెట్టగలను. కాని మీ
పఠనోత్సాహానికి భంగం కలిగించకూడదు కదా.
మనిషికి ఉన్న ఎన్నెన్నో అస్తిత్వాలను విశ్లేషిస్తూ తెలుగులోను, ఇతర భాషలలోను
విస్తారమైన సాహిత్యం వస్తూ ఉంది. ఐతే ఎaఱఅర్‌తీవaఎ సాహిత్యం అనబడే దిమ్మిసా కొట్టిన రస్తాల
వెంబడి నడిచి నడిచి పాఠకలోకం విసుగెత్తిపోయింది. సమాజంలోని సందు గొందుల వెంబడి తిప్పగలిగే
రచయితల కోసం పాఠకులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వారి ఆర్తిని తీర్చడానికి ఈ కథలు
ఎంతో దోహదపడతాయి. గోగు శ్యామల గారు ఈ కృషిని ఇంకింతగా, మరింతగా సాగిస్తారని
ఆశిస్తున్నాను.
18-7-2013
నిజామాబాద్ ......................................................................................
డా|| కేశవరెడ్డి
ఏనుగంత తండ్రికన్నా యేకులబుట్టంత తల్లి నయం
- గోగు శ్యామల
ధర : రూ. 80/-
పేజీలు : 101
మొదటి ముద్రణ : డిసెంబర్ 2013
ప్రతులకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్ 500006
ఫోన్ నెం. 040 2352 1849
Mail: hyderabadbooktrust@gmail.com
.................................................................
రచయిత గురించి...
తెలుగు దళిత సాహిత్య ప్రపంచంలో గోగు శ్యామల గొంతు ప్రత్యేకమైనది.
పది సంవత్సరాల క్రితం కథలు రాయటం మొదలుపెట్టిన శ్యామల తన రచనల్లో దళిత సమాజంలో బాల్యం, దళిత స్త్రీలు భూమి కోసం పడే తపన, దళిత కుటుంబాలలో, సమూహాలలోని ప్రజాస్వామిక తత్త్వం, దళిత సబ్బండ కుల సంబంధాలు, మాదిగ అస్తిత్వం, మాదిగ ఉపకులాల అస్తిత్వాలను కొత్త దృక్పథంలో చూపిస్తూ వచ్చారు.
ఆమె రచనల్లో దళితులు పీడిత అస్తిత్వంతోకాక, తమ జీవితం, ఇప్పటి ప్రపంచం, దానిలో రావలసిన మార్పుల గురించి తదేకంగా ఆలోచించే తాత్త్విక దృక్పథం కలవారిగా కనిపిస్తారు.
అనేక సాహితీ పురస్కారాలు అందుకున్న శ్యామల మొదటి పుస్తకం 'నల్లపొద్దు.' తరువాత, 'నల్లరేగడి సాల్లు', 'ఎల్లమ్మలు' పుస్తకాలు ఆమె సంపాదకత్వంలో వెలువడ్డాయి. 2011లో శ్యామల రాసిన ''నేనే బలాన్ని'' సదాలక్ష్మి బతుకు కథ ప్రచురించబడింది.
'ఎడ్యుసెండ్' అనే దళతుల విద్యపై పనిచేసే సంస్థని స్థాపించి, 'అందరికీ విద్య' అనే మాస పత్రికను కూడా నడుపుతున్నారు.
అనేక సంస్థలలోనూ, సాహితీ వేదికలలోనూ క్రియాశీలకంగా పాల్గొంటారు.
ప్రస్తుతం అన్వేషిలో సీనియర్ ఫెలోగా పనిచేస్తున్నారు, ఐఎఫ్‌ఎల్‌యులో పిహెచ్‌డి చేస్తున్నారు.