Showing posts with label కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం. Show all posts
Showing posts with label కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం. Show all posts

Thursday, February 27, 2020

పి సత్యవతి గారికి "ఒక హిజ్ర ఆత్మకథ" అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం

పి సత్యవతి గారికి "ఒక హిజ్ర ఆత్మకథ" అనువాదానికి  కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం

హైదరాబాదు బుక్ ట్రస్ట్ ప్రచురించిన ఒక  హిజ్రా ఆత్మకధ పుస్తకానికి అనువాద విభాగంలో 2019 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన రచయిత్రి పి.సత్యవతి గారికి అభినందనలు. ఈ పుస్తకం చదివితే హిజ్రాల పట్ల అంత వరకూ మనం ఏర్పరచుకున్న దురభిప్రాయాలుఏహ్యతచిన్నచూపు అన్నీ పటాపంచలయ్యి వారి పరిస్థితి పట్ల సానుభూతిదుఖం కలుగుతాయి.  వారిని ఇంటా బయటా  అడుగడుగునా అవమానిస్తూ చీదరించుకున్నందుకు మన పట్ల మనకు అపరాధ భావం కలుగుతుంది. కొత్త కోణంలోనుంచి వారిని కూడా మనుషులుగా చూస్తూ వారి సమస్యలను అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తాం.  శారీరకంగా తాము ఎదుర్కొనే సమస్యలు తమలో కలిగే భావాల గురించి ఎవరికీ చెప్పుకోలేకహిజ్రా అని తెలిసిన తర్వాత కుటుంబాలసమాజ వెలివేతకు గురై ఎవరి ఆదరణకూ నోచుకోక,  ఎటువంటి ఆసరా లేక  జీవించడానికి హిజ్రాలు ఎంచుకున్న మార్గాలు అనుభవిస్తున్న అతి దారుణమైన పరిస్థితులూ  మన హృదయాన్ని మెలిబెడతాయి.  వారి పరిస్థితిని ఆసరా చేసుకుని వారిపై  దౌర్జన్యాలు చేస్తున్న వారిపట్ల ఆగ్రహం కలుగుతుంది.  హిజ్రాలు  అనుభవిస్తున్న దుఖం ఏమిటోవాళ్ల అంతరంగం ఎంత కల్లోలభరితంగా ఉంటుందోవాళ్ళ పట్ల ఈ సమాజంప్రభుత్వాలు ఎంత నిర్ధయగా ఉన్నాయో పి. సత్యవతి గారు అత్యద్భుతంగా అనువదించి  మన కళ్ల ముందుంచారు. రేవతి కధ కల్పించిన ప్రేరణ అవగాహనతో ఎంతో మంది స్త్రీ వాదులుహిజ్రాలు తమ సమస్యలపై జరుపుతున్న పోరాటాలకు ఈనాడు అండగా నిలబడుతున్నారు.       
- హైదరాబాద్ బుక్ ట్రస్ట్ 
,,,,,,,,,,,,,,,,,,,,,,

పి.సత్యవతికి కేంద్ర సాహిత్య పురస్కారం
న్యూఢిల్లీ, విజయవాడ/కల్చరల్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ కథా రచయిత్రి పి.సత్యవతిని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. ఆమె అనువదించిన ‘ఓ హిజ్రా ఆత్మకథ’ రచనకు ఈ పురస్కారం లభించినట్టు అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు తెలిపారు. 23 భాషల్లో అనువాద పురస్కారాలను సోమవారం ప్రముఖ కన్నడకవి చంద్రశేఖర కంబార నేతృత్వంలోని కార్యవర్గ సమితి ఆమోదించింది.

ఈ పురస్కారం క్రింద సత్యవతికి రూ.50వేలు నగదు, ప్రశంసాపత్రం అందజేస్తారు. ఎ.రేవతి తమిళంలో రాసిన ఆత్మకథ ‘ద ట్రూత్‌ ఎబౌట్‌ మీ: ఏ హిజ్రా స్టోరీ’ పేరిట ఆంగ్లంలోకి అనువాదం అయింది. ఈ రచనను హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ కోసం సత్యవతి ‘ఓ హిజ్రా ఆత్మకథ’’ పేరుతో తెలుగులోకి తెచ్చారు.

ఆంధ్ర జ్యోతి 26-2-2020



Monday, March 9, 2015

'ఇంట్లో ప్రేమ్‌చంద్‌' అనువాదానికి గాను శ్రీమతి ఆర్‌.శాంతసుందరికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక పురస్కారం

'ఇంట్లో ప్రేమ్‌చంద్‌' అనువాదానికి గాను శ్రీమతి ఆర్‌.శాంతసుందరికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక పురస్కారం

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించిన ''ఇంట్లో ప్రేమ్‌చంద్‌'' పుస్తక అనువాదానికి గాను  కేంద్ర సాహిత్య అకాడమీ వారు శ్రీమతి ఆర్‌. శాంతసుందరికి ఈ యేడు అనువాదక అవార్డును ప్రదానం చేయబోతున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.

గత 40 సంవత్సరాలుగా అనువాద ప్రక్రియలో కృషి చేస్తున్న శ్రీమతి ఆర్‌. శాంతసుందరి ఇప్పటివరకు కథ, నవల, కవిత్వం, నాటకం, వ్యక్తిత్వ వికాసం మొదలైన అన్ని ప్రక్రియలలో మొత్తం 68 పుస్తకాలకు అనువాదం చేశారు. 


ఇంగ్లీషు హిందీ భాషల నుంచి తెలుగులోకే కాకుండా అనేక పుస్తకాలను హిందీలోకి అనువదించి తెలుగు సాహిత్యానికి జాతీయ స్థాయి ప్రాచుర్యాన్ని కల్పించారు. అలాంటి అనువాదాల్లో సలీం నవల 'కాలుతున్న పూలతోట', పెద్దింటి అశోక్‌ కుమార్‌ కథలు, ఓల్గా కథలు, డా. కె.శివారెడ్డి 'అంతర్జనం', డా.ఎన్‌.గోపి 'కాలాన్ని నిద్రపోనివ్వను', వరవరావు ఎంపిక చేసిన 51 కవితలు మొదలైనవి వున్నాయి.

ప్రఖ్యాత రచయిత శ్రీ కొడవటిగంటి కుటుంబరావు కుమార్తె అయిన శ్రీమతి ఆర్‌. శాంతసుందరి 1947లో మద్రాసులో జన్మించారు. బిఎ ప్రెసిడెన్సీ కాలేజీలో, ఎంఎ, బిఎడ్‌ దిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసారు. వీరి సోదరుడు శ్రీ కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ రచించిన పలు పుస్తకాలను హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించిన విషయం విదితమే. 


కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారానికి ఎంపికైన ''ఇంట్లో ప్రేమ్‌ చంద్‌'' పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ 2012 సెప్టెంబర్‌లో ప్రచురించింది. అంతకంటే ముందు జనవరి 2009 నుండి జూలై 2012 వరకు భూమిక మాస పత్రికలో సీరియల్ గా వెలువడింది.  ప్రేమ్‌చంద్‌ రచనల గొప్పదనాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఆ మహారచయిత వ్యక్తిత్వం, మానవీయత, విశాల హృదయం గురించి మనకు తెలియని అనేక విషయాలను స్వయంగా ఆయన సతీమణి శివరాణీదేవి ఇందులో అద్భుతంగా ఆవిష్కరించారు. శ్రీమతి ఆర్‌.శాంతసుందరి ఈ పుస్తకాన్ని హిందీ నుంచి సరళమైన తెలుగులోకి అనువదించి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు .

శ్రీమతి ఆర్‌. శాంతసుందరి గతంలో భారతీయ అనువాద్‌ పరిషద్‌, దిల్లీ వారి 'డా.గార్గీ గుప్త్‌ ద్విగాగీష్‌ పురస్కార్‌; నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ దిల్లీ వారి అనువాద పురస్కారం; హైదరాబాద్‌ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారి అనువాద పురస్కారం అందుకున్నారు.

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించిన పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక బహుమతి  లభించడం ఇది రెండో సారి. గతంలో హెచ్‌బిటి ప్రచురించిన డా.యాగాటి చిన్నారావు రచన దళిత్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఐడెంటిటీ (ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర) అనువాదానికి గాను ప్రభాకర్‌ మందారకు ఈ అవార్డు లభించింది.

ఈసందర్భంగా శ్రీమతి ఆర్‌. శాంతసుందరికి హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ శుభాభినందనలు తెలియజేస్తోంది. 




Thursday, October 27, 2011

కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీతలకు వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా వారి సత్కారం

...

1961 నుంచీ ఇప్పటి వరకూ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అందుకున్న తెలుగు కవులూ, రచయితలూ, అనువాదకులను వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా వారు తమ 17వ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా సత్కరించారు.

హైదరాబాద్‌ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గాన సభలో 23 అక్టోబర్‌ 2011 న డా.సి.నారాయణరెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం విలక్షణరీతిలో జరిగింది. డా. సినారెతో పాటు డా. ఎన్‌. గోపి, శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, గొల్లపూడి మారుతీరావు, శ్రీజొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, శ్రీ వంగూరి చిట్టెన్‌ రాజు, శ్రీ వంశీ రామరాజు, డా. తెన్నేటి సుధాదేవి, శ్రీ ద్వానా శాస్త్రి ప్రభృతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ వంగూరి చిట్టెన్‌ రాజు రచించిన ''అమెరి 'కాకమ్మ' కథలు'' పుస్తకాన్ని సభలో ఆవిష్కరించారు.

తెలుగుకు ప్రాచీన భాషా ప్రతిపత్తి లభించిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనున్న తెలుగు భాష విశేష అధ్యయన పీఠాన్ని మైసూర్ లో కాకుండా హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది.


కేంద్ర సాహిత్య అ
కాడెమీ పురస్కార గ్రహీతలలో -
ఆచార్య చేకూరి రామారావు (చేరా),
డా. ఎన్‌.గోపి,
డా.కేతు విశ్వనాథరెడ్డి,
డా.భూపాల్‌ రెడ్డి (భూపాల్‌),
శ్రీ ప్రభాకర్‌ మందార
మొదలైన వారితో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టుకు ఆత్మీయమైన అనుబంధం వుంది.


2009 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ వారి అనువాదక బహుమతి పొందిన ''ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర'' పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టే ప్రచురించిందన్న విషయం విదితమే.

ఈ శుభ సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీతలందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం.
...

డాక్టర్. చేరా















డాక్టర్ కేతు విశ్వనాధ రెడ్డి

















డాక్టర్ ఎన్. గోపి
















శ్రీ ప్రభాకర్ మందార















డాక్టర్ ఎం . భూపాల్ రెడ్డి (భూపాల్)



















ముఖ్య అతిధి, సత్కర గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డి



















సత్కార గ్రహీతలు:
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ... సంవత్సరం ... గ్రంథం పేరు... వరుసక్రమంలో
1. కళాప్రపూర్ణ బాలాంత్రపు రజనీకాంతారావు... 1961 ... ఆంధ్రవాగ్గేయకార చరిత్రము
2. జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత, పద్మభూషణ్‌ డా.సి.నారాయణరెడ్డి ... 1973 ... మంటలూ మానవుడూ (వచన కవితా సంపుటి)
3. కళాప్రపూర్ణ రావూరి భరద్వాజ ... 1983 ... జీవన సమరం (స్కెచ్‌)
4. డా.కె. శివారెడ్డి ...................... 1990 ... మోహనా ఓ మోహనా (కవితా సంపుటి)
5. శ్రీమతి మాలతీ చందూర్‌ .......... 1992 ... హృదయనేత్రి (నవల)
6. డా.యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ ....... 1992 ... తమస్‌ (హిందీ నుండి తెలుగు అనువాదం)
7. డా.పి.ఆదేశ్వరరావు .............. 1994 ... అమృతం-విషం (హిందీ నుండి తెలుగు అనువాదం)
8. శ్రీ కాళీపట్నం రామారావు ....... 1995 ... యజ్ఞంతో తొమ్మిది (కథలు)
9. పద్మశ్రీ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు ... 1996 ... కావ్య ప్రకాశం (సంస్కృతం నుండి తెలుగులోకి అనువాదం)
10. డా.కేతు విశ్వనాథరెడ్డి ....................... 1996 ... కేతు విశ్వనాథరెడ్డి కథలు
11. డా.ఐ.పాండురంగారావు .................... 1998 ... అనువాద సాహిత్యం
12. డా.ఎన్‌. గోపి ................................... 2000 ... కాలాన్ని నిద్రపోనివ్వను (కవితా సంపుటి)
13. డా.ఆర్‌.అనంత పద్మనాభ రావు ... 2000 ... ఛాయా రేఖలు (ఆంగ్లం నుండజీటి తెలుగు అనువాదం)
14. ఆచార్య రవ్వా శ్రీహరి ................. 2001 ... ప్రపంచపది (డా.సినారె ప్రపంచపదులు సంస్కృతంలోకి అనువాదం)
15. శ్రీ పింగళి సూర్య సుందరం .......... 2001 ... ఆత్మ సాక్షాత్కారం (రమణ మహర్షి జీవిత చరిత్ర, బోధనలు - ఆంగ్లం నుండి తెలుగు అనువాదం)
16. ఆచార్య చేకూరి రామారావు ........ 2002 ... స్మృతికిణాంకం (విమర్శ)
17. శ్రీ దీవి సుబ్బారావు .................. 2002 ... మాటన్నది జ్యోతిర్లింగం (కన్నడం నుండి తెలుగు అనువాదం)
18. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం ...... 2003 ... దేవీ భాగవతం (సంస్కృతం నుండి తెలుగులోకి అనువాదం)
19. డా.డి.నవీన్‌ (అంపశయ్య నవీన్‌) ... 2004 ... కాలరేఖలు (నవల)
20. ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ ... 2004 ... పర్వ (కన్నడం నుండి తెలుగులోకి అనువాదం)
21. శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి .......... 2005 ... తన మార్గం (కథలు)
22. డా.జి.ఎస్‌.మోహన్‌ .................... 2005 ... మాస్తి (కన్నడం నుండి తెలుగు అనువాదం)
23. శ్రీ మునిపల్లె రాజు ...................... 2006 ... అస్తిత్వనదం ఆవలి తీరాన (కథలు)
24. శ్రీ చిట్టిప్రోలు కృష్ణమూర్తి ............... 2008 ... పురుషోత్తముడు (పద్యకావ్యము)
25. శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు ............ 2008 ... ఒక విజేత ఆత్మకథ (అబ్దుల్‌ కలాం - ఆంగ్లం నుండి తెలుగు అనువాదం)
26. పద్మశ్రీ డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ... 2009 ... ద్రౌపది (నవల)
27. శ్రీ ప్రభాకర్‌ మందార ................... 2009 ... ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర (ఆంగ్లం నుండి తెలుగు అనువాదం)
28. శ్రీ సయ్యద్‌ సలీం ....................... 2010 ... కాలుతున్న పూలతోట (నవల)
29. శ్రీ జిల్లేళ్ల బాలాజీ ...................... 2010 ... కళ్యాణి (తమిళం నుండి తెలుగు అనువాదం)
30. డా.ఎం.భూపాల్‌రెడ్డి (భూపాల్‌) ... 2011 ... ఉగ్గుపాలు (కథలు- బాలసాహిత్యం)

...

Friday, September 3, 2010

కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక అవార్డుల ప్రదానం

కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక అవార్డుల ప్రదానం

2009 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక అవార్డుల ప్రదానోత్సవం 20 ఆగస్ట్‌ 2010న పనాజీ (గోవా) లోని దీనానాథ్‌ మంగేష్కర్‌ కళా మందిర్‌ గోవా కళా అకాడమీలో జరిగింది. మొత్తం 23 భాషలకు చెందిన 23 మంది అనువాదకులకు కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు శ్రీ సునీల్‌ గంగోపాధ్యాయ ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఉపాధ్యక్షులు శ్రీ సుతీందర్‌ సింగ్‌ నూర్‌ అవార్డు గ్రహీతలను సత్కరించారు. సభకు అకాడమీ కార్యదర్శి శ్రీ అగ్రహార కృష్ణమూర్తి అధ్యక్షత వహించగా ప్రముఖ మళయాలీ రచయిత శ్రీ ఎం.టి. వాసుదేవన్‌ నాయర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

తెలుగు భాషకు సంబంధించి ఈ అవార్డు శ్రీ ప్రభాకర్‌ మందారకు లభించింది. ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహృ యునివర్సిటీ ప్రొఫెసర్‌ డా. యాగాటి చిన్నారావు సిద్ధాంత గ్రంథం ''దళిత్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఐడెంటిటీ'' ని ''ఆంధ్ర ప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర'' పేరిట చేసిన తెలుగు అనువాదానికి గాను ఈ పురస్కారం లభించింది. ఈ పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించింది.
అవార్డు కింద ఒక్కొక్క విజేతకు రూ.50 వేల చెక్కును, తామ్ర పత్రాన్ని అందజేశారు.

అవార్డు గ్రహీతల వివరాలు ఇలా వున్నాయి:

1. శ్రీ జతీంద్ర కుమార్‌ బర్గోహాయ్‌ (అస్సామీ)
2. శ్రీ ఉజ్జల్‌ సింఘ (బెంగాలీ)
3. శ్రీ గోబింద నర్జరీ (బోడో)
4. శ్రీ ఓం గోస్వామి (డోగ్రీ)
5. శ్రీ త్రిదీప్‌ సుహృద్‌ (ఇంగ్లీష్‌)
6. శ్రీ రమణీక్‌ సోమేశ్వర్‌ (గుజరాతీ) (డాక్టర్ ఎన్‌. గోపీ ''జలగీతం'' తెలుగు కవితా సంపుటిని గుజరాతీ భాషలోకి చేసిన తర్జుమాకు )
7. శ్రీ బాలచంద్ర జయశెట్టి (హిందీ)
8. శ్రీ డి.ఎన్‌. శ్రీనాథ్‌ (కనడ)
9. శ్రీ షాద్‌ రంజాన్‌ (కశ్మీరీ)
10. శ్రీమతి కస్తూరి ఎన్‌. దేశాయ్‌ (కొంకణి)
11. శ్రీ బాలచంద్ర ఎస్‌ ఝా (మైథిలీ)
12. శ్రీ కె. రాధాకృష్ణ వారియర్‌ (మళయాలం)
13. శ్రీ ఎస్‌. బ్రజేశ్వర్‌ శర్మ (మణిపురీ)
14. శ్రీ జయప్రకాశ్‌ సావంత్‌ (మరాఠీ)
15. శ్రీ ఓం నారాయ్‌ గుప్తా (నేపాలీ)
16. శ్రీ ధరణీధర్‌ పాణిగ్రాహి (ఒరియా)
17. శ్రీ షా చమన్‌ (పంజాబీ)
18. శ్రీ అర్జున్‌ సింగ్‌ షెకావత్‌ (రాజస్థానీ)
19. శ్రీ ప్రేమ్‌ నారాయణ్‌ ద్వివేది (సంస్కృతం) (ఇటీవలే వీరు స్వర్గస్థులయ్యారు)
20. శ్రీ ఝాము చుగానీ (సింధీ)
21. శ్రీమతి భువనా నటరాజన్‌ (తమిళ్‌)
22. శ్రీ ప్రభాకర్‌ మందార (తెలుగు)
23. శ్రీమతి ఆస్మా సలీమ్‌ (ఉర్దూ)

ఈ సందర్భంగా తీసిన కొన్ని ఛాయా చిత్రాలను ఇక్కడ పొందు పరుస్తున్నాము









Saturday, August 14, 2010

కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక బహుమతుల ప్రదానోత్సవం ఆగస్టు 20న గోవాలో!

కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక బహుమతుల ప్రదానోత్సవం ఆగస్టు 20న గోవాలో!

2009 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ముందు అనుకున్నట్టు కొత్త ఢిల్లీలో కాకుండా గోవాలో ఈ నెల 20న (శుక్రవారం సా.5.30కి) నిర్వహిస్తున్నారు.

దీనానాథ్‌ మంగేష్కర్‌ కళా మందిర్‌, కాంపాల్‌, పానాజీలో - సాహిత్య అకాడమీ చైర్మన్‌ సునీల్‌ గంగోపాధ్యాయ అధ్యక్షతన జరిగే ఈ సభకు - ప్రఖ్యాత మళయాళీ రచయిత ఎం.టి.వాసుదేవన్‌ నాయర్‌ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. సాహిత్య అకాడమీ కార్యదర్శి అగ్రహార కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు సుతీందర్‌ సింగ్‌ నూర్‌ ప్రభృతులు సభలో పాల్గొంటున్నారు.

మొత్తం 24 భాషల్లో ఒక్కో భాషనుంచి ఎంపిక చేసిన ఒక్కొకరికి చొప్పున ఇరవైనలుగురు అనువాదకులకు బహుమతులు అందిస్తారు.
ఆ భాషలు: అస్సామీస్‌, బెంగాలీ, బోడో, డోగ్రీ, ఇంగ్లీష్‌, గుజరాతీ, హిందీ, కనడ, కశ్మీరీ, కొంకణి, మైథిలీ, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, రాజస్థానీ, సంస్కృతం, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూ.

తెలుగు నుంచి ఈ అవార్డుకు ప్రభాకర్‌ మందార ఎంపికైన విషయం విదితమే.
డా.యాగాటి చిన్నారావు సిద్ధాంత గ్రంథం ''దళిత్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఐడెంటిటీ'' ని ''ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర''పేరిట చేసిన అనువాదానికి గాను ఈ అవార్డు దక్కింది.

ఈ పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించింది.

Tuesday, March 2, 2010

''ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర'' అనువాదకుడికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక అవార్డు

.

ఢిల్లీ లోని జవహర్‌లాల్‌ నెహూృ యునివర్సిటీ ప్రొఫెసర్‌ డా. యాగాటి చిన్నారావు పిహెచ్‌డి కోసం రాసిన పరిశోధనా గ్రంథం ''దళిత్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఐడెంటిటీ''ని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ కొద్ది కాలం క్రితం ''ఆంధ్ర ప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర (1900-1950)'' పేరుతో తెలుగులో వెలువరించిన విషయం విదితమే.

కాగా ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన ప్రభాకర్‌ మందార ''2009 సంవత్సరపు కేంద్ర సాహిత్య అకాడమీ ట్రాన్స్‌లేషన్‌ ప్రైజ్‌'' కు ఎంపికయ్యారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఆగస్ట్‌లో ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డు ప్రదానం చేస్తారు. అవార్డు కింద రూ.50,000/- నగదు, తామ్రపత్రం లభిస్తాయి.

ప్రభాకర్‌ మందార దాదాపు పదిహేనేళ్ల నుంచీ మా సంస్థకు అనువాదాలు చేస్తున్నారు. వీరు అనువాదం చేసిన - 1) జబ్బుల గురించి మాట్లాడుకుందాం సిరీస్‌ 2) హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ మనమూ మన సమాజం, 3) నేటి పిల్లలకు రేపటి ముచ్ఛట్లు 4) తిరగబడ్డ తెలంగాణ - దొరలను దించాం నిజాంను కూల్చాం (ప్రొ.ఇనుకొండ తిరుమలి, పిహెచ్‌డి పరిశోధనా గ్రంథం) 5) దేవుడి రాజకీయతత్వం- బ్రాహ్మణత్వం పై బుద్ధుని తిరుగుబాటు (ప్రొ.కంచ ఐలయ్య పిహెచ్‌డి పరిశోధనా గ్రంథం) మొదలైనవి ప్రాచుర్యం పొందాయి.

గతంలో కూడా వీరికి రేడియో నాటక రచనల పోటీలో ఒక జాతీయ అవార్డు లభించింది. 1987 లో "అపరాజిత" అనే నాటక రచనకు గాను అప్పటి కేంద్ర సమాచార శాఖ మంత్రి నుంచి జాతీయ స్థాయి తృతీయ బహుమతి అందుకున్నారు. వరకట్న మరణాల సమస్య పై రాసిన ఆ నాటకం భారతీయ భాష లన్నింటి లోకీ అనువదించబడి ప్రసారమయింది.

ఈ అవార్డు వార్త కోసం ఇక్కడ (ది హిందూ) క్లిక్ చేయండి.

ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన సందర్భంగా
ప్రభాకర్‌కు హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ హార్థిక శుభాభినందనలు తెలియజేస్తోంది.

ఆంధ్ర ప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర
రచన: యాగాటి చిన్నారావు

ఆంగ్లమూలం:Dalits' Struggle for Identity, Yagati Chinna Rao, Kanishka Publishers, New Delhi, 2003
తెలుగు అనువాదం: ప్రభాకర్‌ మందార
ప్రథమ ముద్రణ : ఏప్రిల్ 2007
ద్వితీయ ముద్రణ : మర్చి 2008
198 పేజీలు వెల: రూ.70.

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500 067
ఫోన్‌ నెం. 040 - 2352 1849
E mail : hyderabadbooktrust@gmail.com

.

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌