ఒక హిజ్రా ఆత్మకథ
నేటి ప్రపంచంలో దాదాపు 1,53,24,000 మంది ట్రాన్స్ జెండర్స్ (హిజ్రాలు) వున్నారని అంచనా. అంటే
కజకిస్థాన్, ఈక్వెడార్, కాంబోడియా ఈ మూడు దేశాల మొత్తం జనాభాతో సమానం. ఈ సంఖ్యను చూస్తే
మనలో ఒక కొత్త ఆలోచనకు నాంది కలుగుతుంది.
తమిళ నాడులో ఒక మారుమూల కుగ్రామంలో, సాధారణ కుటుంబంలో ముగ్గురన్నలకు, ఒక ఆక్కకు
తోడుగా ఐదో సంతానంగా పుట్టాడు దొరైస్వామి. ఇంట్లో ఎవరికీ లేనివిధంగా అతనిలో అంతర్గతంగా
చిన్నప్పటినుంచే స్త్రీ లక్షణాలుండేవి. ఆడవాళ్లలా అలంకరించుకోవాలనీ, వాళ్ల దుస్తులు ధరించాలని
విపరీతమైన వ్యామోహం కలిగేది. స్కూల్లో తోటి విద్యార్థులు తనని 'ఆడంగి', 'ఆడపిల్లోడు' అని ఎగతాళి
చేస్తుంటే బాధగా అనిపించేది. అయితే తను అమ్మాయిలా ప్రవర్తిస్తున్న విషయం అతనికి తెలుసు. అట్లా
ప్రవర్తించడం తనకు చాలా సహజంగా అనిపించేది. ఒక మగశరీరంలో ఇరుక్కుపోయిన స్త్రీని అన్న భావన
వుండేది. దేవుడు తనకు ఎందుకు ఇలాంటి శిక్ష వేశాడు, తనను పూర్తిగా స్త్రీగానో లేక పూర్తిగా
పురుషుడిగానో ఎందుకు సృష్టించలేదు అన్న మనో వేదన కలిగేది.
కాలక్రమంలో దొరైస్వామి రేవతిగా మారిపోయాడు. ఆ పరిణామ క్రమాన్నీ, నిత్య జీవితంలో అతను/ఆమె
ఎదుర్కొన్న వివక్షనూ, అవమానాలనూ, అవహేళనలను కళ్లకు కట్టేలా చిత్రించిన పుస్తకమిది.
దీనికి పాఠకులను పట్టి చదివించే శక్తి, వాళ్ల ఆలోచనలను ప్రేరేపించే శక్తి వున్నది. పుస్తకమంతటా రేవతి
తాను ఎదుర్కొన్న భయానక సంఘటనల గురించి చెబుతుంది. కానీ ఎవరి సానుభూతినీ కోరదు. ఆమె
అడిగేది ఒక్కటే, హిజ్రాలను అందరిలా కోరికలూ ఆశలూ వున్న తోటి మనుషులుగా చూడమని!
ఒక హిజ్రాగా తన వ్యక్తిగత విషయాలను... తన లింగ మార్పిడి శస్త్ర చికిత్స గురించీ, పోలీసులు పెట్టిన
హింసల గురించీ, తన క్లయింట్స్ గురించీ నిర్భయంగా, నిస్సంకోచంగా చెప్పిన తీరు అభినందనీయమే
కాక అది హృదయానికి హత్తుకుంటుంది. జెండర్ గురించీ పురుషాధిక్యత గురించీ ఆమె చేసిన
విమర్శలు, వ్యాఖ్యలు చాలా స్పష్టంగా. శక్తివంతంగా వుండి స్త్రీ పురుషులతో పాటు మూడవ లింగాన్ని
(థర్డ్ జెండర్) కూడా మనం మానవీయంగా అర్థం చేసుకోలాలనే, అందుకు కృషి చెయ్యాలనే
అవగాహనను కలిగిస్తుంది.
రేవతి ఈ పుస్తకానికి రాసుకున్న ముందుమాటలో ఇలా అంటారు:
''ఒక హిజ్రాగా నేను సమాజపు చివరి అంచులలోకి నెట్టబడ్డాను. అయినా నా జీవితాన్ని మీముందు పెట్టే
సాహసం చేస్తున్నాను. ఒక హిజ్రాగా వుండటమే కాదు, సెక్స్ వర్క్ చేయడం గురించి కూడా
చెబుతున్నాను. ఎవరి మనోభావలనూ నొప్పించడానికి గానీ, ఎవరినీ నిందించడానికి గానీ నేనీ పుస్తకం
రాయడంలేదు. హిజ్రాల జీవన విధానం గురించీ వారి ప్రత్యేక సంస్కృతి గురించీ వారి కలలూ కోరికల
గురించీ పాఠకులకు తెలియజెప్పడానికే రాస్తున్నాను.
నేను రాసిన 'ఉనర్వుమ్ ఉరువమమ్' తమిళనాడులో తెచ్చిన ఫలితాలను చూసి గర్వపడుతున్నాను.
ఇప్పుడు నాజీవిత చరిత్ర సమాజంలో మరిన్ని మంచి మార్పులు తేగలదని ఆశిస్తున్నాను. అడుక్కోడానికీ,
సెక్స్ వర్క్ చెయ్యడానికే కాదు అనేక మంచి పనులు చేసే సామర్థ్యం హిజ్రాలకు వుందన్న విషయాన్ని ఈ
పుస్తకం చదివి తెలుసుకుంటారని కూడా నేను ఆశిస్తున్నాను. నేను ప్రభుత్వం నుంచి, ప్రజల నుంచి
సానుభూతి ఆశించడం లేదు. హిజ్రాలమైన మాకు సమాజంలో అందరిలా జీవించే హక్కు వుందని
చెప్పాలనుకుంటున్నాను.''
( అక్టోబర్ 1 సాయంత్రం హైదరాబాద్ ఎస్ పీ హాల్ లో జరిగే పుస్తకావిష్కరణ సభలో పుస్తక రచయిత్రి రేవతి స్వయంగా పాల్గొంటున్నారు.)
నిజం చెప్తున్నా-
ఒక హిజ్రా ఆత్మకథ
- ఎ. రేవతి
ఆంగ్ల మూలం :The Truth About Me: A Hijra Life Story by A. Revathi, Penguin Books India, 2010
తెలుగు : పి. సత్యవతి
పేజీలు: 154, ధర : రూ.130/-
ప్రతులకు వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్, గుడిమల్కాపూర్, హైదరాబాద్ - 500006
ఫోన్ నెం. 040-2352 1849
ఇమెయిల్ : hyderabadbooktrust@gmail.com