Sunday, March 24, 2019

బిభూతి భూషణ్ బందోపాధ్యాయ “వనవాసి” నవల తృతీయ ముద్రణ వెలువడింది.




బిభూతిభూషణ్‌ బంధోపాధ్యాయ (1894-1950) బెంగాలీలో రాసిన 'అరణ్యక' నవలకి తెలుగు అనువాదం 'వనవాసి'. 
అరణ్యక నవల 1938 ఏప్రిల్‌లో మొట్ట మొదటగా ప్రచురింపబడింది. కేంద్ర సాహిత్య అకాడమీ కోసం సూరంపూడి సీతారాం అనువదించగా అద్దేపల్లి అండ్ కో రాజమండ్రి వారు 1961లో మొట్టమొదట తెలుగులో పుస్తక రూపంలో ప్రచురించారు. 
2009 సెప్టెంబర్ లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వనవాసిని తిరిగి వెలువరించింది. సంవత్సరం తిరిగేసరికే కాపీలన్నీ అయిపోవడం తో 2011 ద్వితీయ ముద్రణకు వెళ్ళింది. ఇప్పుడు తృతీయ ముద్రణ మీముందు వుంది.

బిభూతిభూషణ్‌ బంధోపాధ్యాయ ఈ పుస్తకాన్ని రచించి 80 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ పచ్చగా, నిత్యనూతనంగా వుండడం...  సాహిత్యాభిమానుల్ని ముఖ్యంగా పర్యావరణ ప్రేమికులని నిరంతరంగా ఆకట్టుకుంటూ వుండడం ఒక విశేషం.

ఈ పుస్తకం పై కొన్ని అభిప్రాయాలు : 

“... వర్గ, ప్రాంతీయ వైరుధ్యాలతో మనిషి ఘర్షణ పడుతూ ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న సమయంలో, స్వచ్ఛమయిన ప్రాణవాయువును   అతి స్వచ్చమయిన అరణ్య వృక్షాల మీద నుంచి, సభ్యసమాజపు నాగరికత సోకని అరణ్యవాసుల స్వఛ్ఛమయిన జీవితాలనుండి మనకందించే నవల బిభూతిభూషణ్‌ బంధోపాధ్యాయ వ్రాసిన  వనవాసి.

బిభూతిభూషణ్‌ అనగానే పాఠకుల మనసులో పథేర్‌ పాంచాలి మెదులుతుంది. సత్యజిత్‌రే తన చిత్రం ద్వారా పధేర్‌ పాంచాలికి అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించిపెట్టిన విషయం మనకు తెలుసు. వనవాసి ద్వారా బిభూతిభూషణ్‌  తెలుగు పాఠకులకు మరింత చేరువ అయ్యారని చెప్పవచ్చు. 80 యేళ్ళ క్రితం వ్రాసిన పుస్తకమిది !.  అప్పటికీ ఇప్పటికీ వాతావరణ పరిస్థితులలో చాలా మార్పులొచ్చాయి. అయితే అడవులంత రించిపోతున్న వాస్తవం మనందరికీ తెలుసు. అభివృధ్ధి ముసుగులో అడవులు కనుమరుగవుతున్నాయన్నది చేదునిజం. దీని వల్ల అరణ్య ఉత్పత్తుల మీద ఆధారపడి జీవించే ఆదిమ జాతుల సంక్షేమం ప్రశ్నార్ధకమవుతోంది. ఈ విషయం మనందరికీ తెలుసు. అత్యధిక ప్రజానీకానికి ఉపయోగపడకుండా పేద,బడుగు వర్గాలని నిరాశ్రయులను చేసే అభివృద్ధి అభివృద్ధి కాదు. ఈ దృష్టితో చూసినపుడు సాహిత్యంలో వనవాసీవంటి నవలల అవసరం అప్పటికంటే ఇప్పుడే ఎక్కువని చెప్పవచ్చు.

ఒక మహాద్భుతమయిన అనుభూతిని కలగజేసి, ఆ అనుభూతి తరంగాలలో పుస్తకం చదివిన చాలా రోజుల పాటు మనని ఓలలాడించే  ఒక అద్భుతమయిన పుస్తకం వనవాసి.  దీనికి బెంగాలీ మూలం అరణ్యక్‌  అనే నవల. తెలుగులో సూరంపూడి సీతారాం గారు అనువదించారు. ఉద్యోగరీత్యా బీహార్‌ లోని ఒక అరణ్య ప్రాంతానికి వెళ్ళిన యువకుడు తనదుెరయిన అనుభవాలను,  తను కనుగొన్న విషయాలను మనకు చెప్పే నవల ఇది.   నాగరికత ఎరుగని అరణ్య పరిసరాలలో ఆది వాసుల జీవనం, అరణ్య శోభ, ప్రకృతి ఆ యువకుడు నేర్చుకున్న పాఠాలు, అన్నీ మనోహరమయిన వర్ణనతో మన మనసుకు హత్తుకొంటాయి. ...”  
                                  
............................................  - ఉమామహేశ్వరి నూతక్కి (భూమిక స్త్రీవాద పత్రిక)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

“... అడవుల మనుగడ, వాటిమీద ఆధారపడి బతికే ఆదిమజాతుల మనుగడ,కరువైపోతున్న ప్రాణవాయువుపచ్చదనం, వీటన్నిటిగురించీ రచయిత ఏమీ మాట్లాడడు. ఉపన్యాసాలివ్వడు. గగ్గోలుపెట్టడు.ప్రశ్నించడు.
కానీ ఆ పని మనచేత చేయిస్తాడు!
ఒక కల్లోలాన్ని రేకెత్తిస్తాడు మెదడులో!
అడవులంతరించిపోతే?” అని నెమ్మదిగా పాకే ఆందోళనని మనలో సృష్టిస్తాడు.

కుంత,బన్వారీ,భానుమతి,రాజూపాండే,థాతురియా,నక్ఛేదీ, కవి వెంకటేశ్వర ప్రసాద్వీళ్ళందరినీ మనకు అంటగట్టి తను మాత్రం నిశ్చింతగా ఉంటాడు.
అడవిలోని ప్రతి చిన్న సౌందర్యానికీ ముగ్ధుడయ్యే భిభూతి ప్రసాద్ ని ఈ నవల్లో చూడొచ్చు. వెన్నెల రాత్రుల వర్ణన పుస్తకంలో చాలా చోట్ల ఉంటుంది.
ఏకాంతంలో తనకు మాత్రమే గోచరమయ్యే ఆ అద్భుత వన సౌందర్యానికి పరవశుడై కవితావేశంతో స్పందిస్తాడు.రాగరంజితమైన మేఘాలను,దిగంతాల వరకూ వ్యాపించి జ్యోత్స్నా ప్లావితమై నిర్జనమైన మైదాన  ప్రాంతాలనూ చూసి  స్వరూపమే ప్రేమ!ఇదే రొమాన్స్! కవిత, సౌందర్యం,శిల్పం, భావుకత. ఈ దివ్యమంగళ రూపమే మనం ప్రాణాధికంగా ప్రేమించేది.ఇదే లలిత కళను సృష్టించేది. ప్రీతిపాత్రులైన వారికోసం తనను తాను పూర్తిగా సమర్పించుకుని నిశ్శేషంగా మిగిలిపోయేది. తిరిగి విశ్వ జ్ఞాన శక్తినీ, దృష్టినీ వినియోగించి గ్రహాలను, నక్షత్ర లోకాలనూ, నీహారికలనూ సృష్టించేది ఇదే..అంటాడు.

విద్యావంతుడైన సత్యచరణ మూఢనమ్మకాలకు విలువనివ్వడు. అడవి దున్నలకు ప్రమాదం రాకుండా ఎప్పుడూ కాపాడే ఒక దేవుడి గురించి ఆదివాసీలు చెపితే కొట్టిపారేస్తాడు. కలకత్తా వచ్చాక ఒకసారి రోడ్డు పక్కన నడుస్తూ….బరువు ను లాగలేక ఇబ్బంది పడుతున్న ఒక దున్నపోతుని బండివాడు చెర్నాకోలాతో ఛెళ్ళున కొట్టడం చూసి చలించి ఆ వనదేవత ఇక్కడుంటే ఎంత బావుండుఅని  అప్రయత్నంగా అనుకుంటాడు.
ఇలాంటి అద్భుత సన్నివేశాలు, అపూర్వమైన వనసౌందర్య వర్ణనలూ, ఆదివాసీల జీవితంలో దరిద్ర దేవత విశ్వరూపం,ప్రతి పేజీలో కనపడతాయి.

ఈ పుస్తకం చదవాలంటే కేవలం పుస్తకం చదవాలన్న ఆసక్తి చాలదు. ఆ తర్వాత వెంటాడే యదార్థ జీవిత వ్యథార్త దృశ్యాలు,అడవుల మనుగడ పట్ల రేగే ఆలోచనలు, మనసంతా ఆక్రమించే ఆదివాసీ పాత్రలు, అన్నానికి, రొట్టేలకూ కూడా నోచుకోక గడ్డిగింజలూ, పచ్చి పిండీ తినే దృశ్యాలు, ఒక్క రొట్టె కోసం పన్నెండు మైళ్లు నడిచి వచ్చే   పేదలూ..వారిని దోచే భూస్వాములూ..వీటన్నింటినీ  భరించగలిగే శక్తి మనసుకు ఉండాలి. ఒక హాయిని, వేదనను ఒకేసారి కలిగించే  భావాన్ని  భరించగలగాలి. అప్పుడే ఈ పుస్తకం కొనాలి. ఇది కాఫీ టేబుల్ బుక్ కాదు. మస్ట్ రీడ్ బుక్!...”
............................................................-సుజాత(మనసులో మాట), పుస్తకం డాట్ నెట్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

“.... ఈ నవలలో ప్రకృతితో మమేకమవగల గొప్పగుణం ఉన్న ఒక మనిషి కనిపిస్తాడు. ఇది అందరికీ అందే స్వర్గం కాదు. ఆ రుచి తెలుసుకున్నవాడే ఆ ఆనందపు రహస్యాన్ని అందుకోగలుగుతాడు. ఉత్తమ పురుషలో రాసిని ఈ నవలలో కధానాయకుడు సత్యచరణ్ చదువు ముగిసి ఉద్యోగాన్వేషణలో కొన్ని చోట్ల విఫలం అయ్యి గడ్డు పరిస్థితులలో ఉన్నప్పుడూ ఒక మిత్రుడి సలహాతో బీహార్ ప్రాంతంలో ని అరణ్యాలలోని ఒక ఎస్టేట్ మేనేజరుగా వెళతాడు. 

తొలి రోజులలో అక్కడి వాతావరణానికి అలవాటుపడడానికి ఇబ్బంది పడ్డా తరువాత అది అతని ఆత్మను వశికరించుకుంటుంది. అక్కడి పకృతిలోని అందం మనుష్యులలోని స్వచ్చత అతన్ని కట్టిప్డేస్తాయి. నిరుపేదలు కడుపునిండా కూటికి నోచుకోలేని వ్యక్తులు ప్రకృతిలోని ఒక ముఖ్య భాగంగా కనిపిస్తారు.

ఒక చిన్న ఇత్తడి గిన్న కోసం కలలు కనే మునేశ్వర్, ఒక అద్దం కోసం పలవరించే భారతదేశం పేరు కూడా వినని రాచకన్య భానుమతి, కేవలం నాట్యంలోనే ఆనందం వెతుక్కునే అనాధ బాలుడు, విత్తం పట్ల నిరాసక్తి, పెద్ద నష్టాలపట్ల కూడా నిర్లక్ష్యము చూపగల వేదాంతి ధౌతాల సాహు, పేదరికంలో కూడా డబ్బు సంపాదన మీద ఆశలేక ఉన్న సమయాన్ని ప్రకృతి ఒడిలో సెదతీరుతూ జీవిస్తున్న రాజూ పాండే, అడవిలో పూల చెట్లను నాటడమే జీవితంగా మార్చుకున్న యుగళప్రసాద్, ప్రేమకు మారుపేరయిన మంచి, వీరిని చూసి సత్యచరణ్ ఆశ్చర్యపడతాడు. ఆనందం అనుభవించగల శక్తి వీరికి ఇంత ఉందా అని అబ్బురపడతాడు. వారి అమాయకమైన కల్పిత గాధలను విస్మయంతో వింటూ, "ఇటువంటివి వినాలంటే అన్ని స్థలాలు పనికిరావు" అని తెలుసుకుంటాడు. అక్కడి ప్రజల జీవన విధానాన్ని చూస్తూ గొప్ప సత్యాలను కనుగొంటాడు. కంకుల మధ్య శరీరాన్ని కప్పుకుని పడుకునే కుటుంబాన్ని చూసి "నేడు నిజమైన భారతదేశాన్ని చూసాను" అనకుంటాడు.
"ఏ వస్తువు ఎంత దుర్లభమౌతుందో, మనిషికి అది అంతే, అమూల్యంగా కనపడుతుంది. ఇది కేవలం మనిషి కల్పించుకున్న కృత్రిమ మూల్యం; వస్తువుల యధార్ధ అవసరాలు అనవసరాలతో దీనికి సంబంధం లేదు. కాని ఈ ప్రపంచంలో అనేక వస్తువులకు కృత్రిమమైన మూల్యం మనమే ఆరోపించి, ఆపాదించి వాటిని గొప్పవనీ హీనమైనవనీ భావిస్తాము." ఇది అడవిలో అతను నేర్చుకున్న పాఠం.

............................................................... - Jyothi Spreading Light (curtesy Anil Battula)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

“ ..... ఒక మహాద్భుత మైన  అనుభూతిని పొంది, ఆ అనుభూతి తరంగాలలో కొనాన్ళల్పాటు ఓలలాడాలంటే తపప్క చదవాలిస్న నవల "వనవాసి". వనవాసి బెంగాలీ మూలం అరణయ్క ’. భారతీయ నవలాసాహితయ్ంలోని ఉతత్మ రచనలలో ఒకటి ఇది. గద్యం లో రాసిన ఒక ఖండ కావ్యంగా  ఈ నవలను పరిగణిస్తారు. బిభూతిభూషణ బందోపాధాయ్య బెంగాలీ రచనకు  సూరంపూడి సీతారామ్ గారు అందమైన పదాలతో కూడిన బహు చక్కని  తెలుగు అనువాదాన్ని అందించారు. ఉద్యోగరీత్యా  బీహార్ లోని  ఒక అరణ్య ప్రాంతానికి వెళ్ళిన  ఓ యువకుడు తనకు ఎదురైన అనుభవాలను, తాను కనుగొన్న విషయాలను ఉత్తమపురుషలో తెలియచెప్పే నవల ఇది. నాగరికత ఎరుగని అరణ్య  పరిసరాలలో ఆదివాసుల జీవనం, అరణ్య పరిసరాల్లో, ప్రక్రుతి  ఒడిలో ఆ యువకుడు నేర్చిన  పాఠాలూ అన్నీ  మనోహరమైన వర్ణన తో మనసుకు హత్తుకుంటాయి . సుమారు డెబ్భై ఐదేళ్ళ క్రితం  రాయబడిన ఈ నవలను చదువుతూంటే, ప్రఖ్యాత  ఆంగ్ల రచయితా  ప్రకృతి ఆరాధకుడు  William Wordsworth రాసిన 'Tintern Abbey' అనే పద్యం, ప్రఖ్యాత  అమెరికన రచయిత Henry David Thoreau రచించిన 'Walden' గుర్తుకు వచ్చాయి నాకు. అప్పటికి ఇంకో వందేళ్ళ  పూర్వం పద్దెనిమిదవ శతాబ్దం లో  ఈ రెండు రచనలూ చేయబడ్డాయి . రెంటికీ కూడా ప్రకృతే  పేర్రణ.  బీహాఉత్తర బీహార్ లోని  ఒక జమిందారీ ఎస్టేట్  అడవిలో మేనేజరుగా పనిచేసిన తర్వాత , ఆ అనుభవాలసారాన్నే వనవాసి ద్వారా  పాఠకులకు అందించారు బిభూతిభూషణ. "వనవాసి" పై ఈ రెండు ఆంగ్ల రచనల ప్రభావం ఉన్నా లేకపోయినా ప్రకృతి వర్ణన లో  రసానుభూతిపరంగా ఈ ముగ్గురు  రచయితల మనోభావాలలో ఎన్నో  కనబడ్డాయి  నాకు. బహుశా ప్రకృతి ఆరాధకులంతా okeలా ఆలోచిస్తారు  కాబోలు....”
............................................................-తృష్ణ (కౌముది వెబ్ మాగజైన్)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
వనవాసి
బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ
తెలుగు అనువాదం: సూరంపూడి సీతారాం

తొలి ముద్రణ: అద్దేపల్లి అండ్‌ కో, రాజమండ్రి; సాహిత్య అకాడెమీ, న్యూఢిల్లీ తరఫున,1961
హెచ్‌బిటి తొలి ముద్రణ: సెప్టెంబర్‌ 2009, ద్వితీయ ముద్రణ 2011,
తృతీయ ముద్రణ : 2019

278 పేజీలు, వెల: రూ.200/-
ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067
ఫోన్‌: 040 2352 1849

ఇమెయిల్‌: hyderabadbooktrust@gmail.com




2 comments:

  1. I very very very strongly recommend this book...it will take you to the deep forest..and you feel you are living there...!!!! A MUST READ..!

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌