Showing posts with label తెలంగాణ. Show all posts
Showing posts with label తెలంగాణ. Show all posts

Wednesday, September 24, 2014

" ఊరు వాడ బతుకు " ఆంగ్లానువాదం " Life in Anantaaram " ఉచిత పీడీఎఫ్


" ఊరు వాడ బతుకు " ఆంగ్లానువాదం " Life in Anantaaram " ఉచిత పీడీఎఫ్

దేవులపల్లి కృష్ణమూర్తి ఆత్మకథాత్మక నవల "ఊరు వాడ బతుకు" తెలుగు పాఠకుల విశేషాదరణను పొందింది. పోలీసు యాక్షన్ పేరిట  ఆనాటి హైదరాబాద్ రాజ్యంలో జరిగిన సైనిక చర్య ముందరి  తన బాల్య  జీవితం, అనంతారం, సూర్యాపేటల్లో కొనసాగిన తన చదువు, ఆనాటి గ్రామీణ జీవితం, కమ్యూనిస్టు ఉద్యమం , రజాకార్ల ఆగడాల నేపధ్యంతో  సరళమైన తెలంగాణా భాషలో ఒక అద్భుతమైన డాక్యుమెంటరీలా సాగుతుందీ రచన.   తెలంగాణా ప్రజా జీవనం లో అంతర్భాగమైన పాటలు, సామెతలు, జాతీయాలు పుస్తకం నిండా పరచుకుని ఆనాటి తెలంగాణా బతుకులోని విలక్షనతను, ఔన్నత్యాన్ని చాటి చెబుతాయి. ఏలె లక్ష్మణ్ చిత్రాలు ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ.
తెలంగాణా సామాన్య జన జీవితాన్ని అసామాన్యంగా ఆవిష్కరించిన ఈ పుస్తకాన్ని ప్రపంచ పాఠకుల దృష్టికి తీసుకెళ్లాలన్న ఆకాంక్షతో కొన్నాళ్ళ క్రితం గీతా రామస్వామి ఇంగ్లిష్ లోకి అనువదించారు. కానీ పుస్తక రూపంలో తీసుకు రావడానికి వీలుపడక " మిషన్ తెలంగాణా " వారి ద్వారా పీడీఎఫ్ రూపం లో పాఠకులకు  అందుబాటులో వుంచారు. కింది లింక్ ద్వారా ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎడిటింగ్  ఇంకా పూర్తి  కాలేదు కనుక పాఠకులు తమ దృష్టికి వచ్చిన లోపాలు, సూచనలు ఈ కింది మెయిల్ ఐడీకి తెలియజేయగలరు.

http://missiontelangana.com/life-in-anantharam/

Mail ID: gita.ramaswamy@gmail.com

Monday, April 1, 2013

1948: హైదరాబాద్ పతనం ... రచన: మహమ్మద్ హైదర్, తెలుగు అనువాదం: అనంతు ...


1948: హైదరాబాద్ పతనం

హైదరాబాద్‌ విమోచన, విముక్తి, విలీనం, విద్రోహం, పోలీసు చర్య, ఆపరేషన్‌ పోలో ...
1948లో భారత సైన్యం హైదరాబాద్‌ సంస్థానంపైకి దండెత్తినప్పటి ఘటనలను వివరించేందుకు ఇలా ఎన్నో పేర్లు వినపడతుంటాయి.

నాడు చోటు చేసుకున్న చారిత్రక ఘటనల పరంపర ఒకటేగానీ వాటిని దర్శించే దృష్టి కోణాల్లోనే మరే సందర్భంలోనూ లేనంతటి తీవ్ర వైవిధ్యం, పరస్పరం సంఘర్షించుకునే భావ వైరుధ్యాలు ఎన్నో వ్యక్తమవుతుంటాయి. ఈ ఉద్వేగపూరిత కథనాల మధ్య చాలాసార్లు అసలు జరిగిందేమిటో గ్రహించటం కష్టసాధ్యంగా పరిణమిస్తుంది.

నాటి ఘటనల చుట్టూ పేరుకున్న ఆ మాయనూ, మబ్బుతెరలనూ తొలగించి చూపిస్తుందీ మొహమ్మద్‌ హైదర్‌ రచన.

నాటి ఉద్రిక్త కాలంలో ఉస్మానాబాద్‌ కలెక్టర్‌గా పని చేశారు హైదర్‌.
ఏడాది తిరగక ముందే ఆయనను తన జిల్లా జైలుకే పంపించారు.

జైలులో గడుపుతూనే ఓ పరిపాలనాధికారిగా 1948 ఘటనలకు సంబంధించి తన ప్రత్యక్ష అనుభవాలను, జ్ఞాపకాలను కాగితంపై పెట్టారాయన. ఎంతో హుందాగా, అక్కడక్కడ చెణుకులతో సాగిపోయే ఈ రచన- ఎటువంటి ఆవేశకావేశాలకూ లోనుకాకుండా సాగిపోవటమే కాదు- చివరకు మన కళ్లు తెరిపిస్తుంది కూడా !

    ''స్వతంత్రం అనంతరం దేశంలో చోటుచేసుకున్న ఓ పెద్ద కూహకం గురించి దేశ పౌరులకు తెలియకుండా కప్పిపుచ్చటం, పైగా విదేశీ వర్గాలు దీన్ని బయటపెట్టిన తర్వాత కూడా దాచిపెట్టాలనే చూస్తుండటం దారుణం.
1948 మారణహోమం గురించి ముస్లిం మీడియాకూ తెలుసు. కానీ ఎక్కడా మాట్లాడదు. పైగా తన మౌనానికి హిందూ వర్గాల అణిచివేతే కారణంగా చూపిస్తోంది. ఓ ఉదారవాద ప్రజాస్వామ్యం పనిచేసే తీరు ఇది కాదు. నివేదికలను తొక్కి పెట్టటం, పాఠ్యపుస్తకాల్లో ఇటువంటి ప్రస్తావనలు కూడా రాకుండా తుడిచెయ్యడం ద్వారా భారత్‌ ఎన్నటికీ నిజమైన సమైక్య జాతిగా అవతరించ జాలదు.

                        - స్వామినాధన్‌ అయ్యర్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, 2012 నవబంరు, 26




ఈ నెల 7న (2013 ఏప్రిల్ 7) ఉదయం 10 గంటలకు హైదరాబాద్ సారస్వత పరిషత్ హాల్ లో
ఈ పుస్తకం ఆవిష్కరించ బడుతోంది.

1948: హైదరాబాద్ పతనం
- మహమ్మద్ హైదర్  
ఇంగ్లీష్ మూలం : October Coupe: A Memoir Of The Struggle For Hyderabad - Mohammad Hyder, Published by Roli Books, New Delhi, 2012.

తెలుగు అనువాదం : అనంతు 
ప్రధమ ముద్రణ : ఏప్రిల్ 2013
 వెల : రూ 100/-

ప్రతులకు, వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 - 2352 1849
ఇ మెయిల్‌: hyderabadbooktrust@gmail.com

.










Saturday, January 30, 2010

మోతె - తెలంగాణ బతుకుబాట - ఎం. కోదండరాం, మల్లెపల్లి లక్ష్మయ్య, ఆర్‌.లింబాద్రి ...

ఇది ఒక తెలంగాణా గ్రామం కథ.
ఉమ్మడి రాష్ట్రంలో కనీస వసతులు లేక తెలంగాణా గ్రామాలు ఎట్లా తిప్పలు పడుతున్నాయో తెలియజేసే కథ.

ఆ గ్రామం పేరు మోతె.
నిజామాబాద్‌ జిల్లా, వేల్పూరు మండలంలో వుంది.
తొమ్మిదేళ్ల క్రితం ఎం. కోదండరాం, మల్లెపల్లి లక్ష్మయ్య, ఆర్‌. లింబాద్రి మోతె వెళ్లి అక్కడి స్థితిగతులపై చేసిన అధ్యయన సారాంశమే ఈ చిరు పుస్తకం.

మోతె విరాట్‌ స్వరూపమే తెలంగాణ. ఆ గ్రామానికి ఉత్తర దక్షిణాలలో వాగులున్నట్లే తెలంగాణాకు ఉత్తరాన గోదావరి, దక్షిణాన కృష్ణా నదులున్నాయి. రెండు వాగులుండీ మోతె గ్రామం నీళ్లకు ఏడ్చినట్టే, తెలంగాణా కూడా రెండు నదులుండీ నీటి ఎద్దడితో బాధపడుతున్నది. అంకెలు గణాంకాలు కూడా తెలంగాణాకు జరిగిన అన్యాయాన్ని రుజువు చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో నీటి పారుదలకు చేసిన కేటాయింపుల్లో 90% భారీ మధ్య తరహా ప్రాజెక్టులకే వెచ్చించారు. అందువల్ల వచ్చిన ఫలితాలు కోస్తా ఆంధ్రకే ఎక్కువగా దక్కాయి. చిన్న నీటి పారుదలను విస్మరించడం వలన మోతెలో ఎండిపోయినట్టే తెలంగాణా అంతటా చెరువులు ఎండిపోయాయి. మోతె చిత్రం తెలంగాణాకు జరిగిన అన్యాయానికి ఒక మచ్చుతునకగా భావించవచ్చు.

మోతెకి రెండు వాగులే కాదు దక్షిణాన ఐదు చెరువులు కూడా వున్నాయి. వాటిలో పెద్ద చెరువు ప్రధానమైనది. అది నిండి అ లుగు పారితేనే మిగతా నాలుగు చెరువులకు నీరొస్తుంది. ఆ అ లుగు నీరు నాలుగు చెరువుల్లోకి పారడానికి నిజాం కాలంలోనే గ్రామస్తులు శ్రమదానంతో కాలువలు తవ్వుకున్నారు. అయితే ఇప్పుడు ఆ చెరువులకు వరదనీరు వచ్చే అవకాశాలు సన్నగిల్లడంతో అవి ఎండిపోతున్నాయి.

నలభై ఏళ్ల క్రిందటి వరకూ ఆ ఊళ్లో దాదాపు 300 బావులుండేవి. అవి కూడా ఎండిపోతుండటంతో 1969 నుంచి వాటిలో ఇన్‌వెల్‌ బోర్లు వేయడం మొదలుపెట్టారు. అయినా ఫలితం అంతంతమాత్రమే కావడంతో 1976 నుంచి బోర్లు వేయడం ప్రారంభించారు.

తెలంగాణాలో మొట్టమొదటి బోరు వేసింది మోతె లోనే అంటారు. ఇప్పుడు అక్కడ వ్యవసాయం ప్రధానంగా బోరు బావులపై ఆధారపడే సాగుతోంది. మొతేలో నేడు 900 బోర్లు, 25వ వరకు ఫిల్టర్లు వున్నాయి.

గత పది సంవత్సరాలుగా బోర్లలో కూడా నీళ్లు తగ్గిపోయాయి. గతంలో 150 అడుగులకే నీరు వస్తే ఇప్పుడు దాదాపు 300 అడుగుల కంటే లోతుగా బోర్లు వేయించాల్సి వస్తోంది.

బోర్లు ఒకసారి వేస్తే ఎప్పటికీ నీళ్లుంటాయన్న గ్యారెంటీ వుండదు. నీళ్లు ఎండిపోయినప్పుడు బావుల మాదిరిగా పూడిక తీయడం కుదరదు. బోరు ఎండి పోయిందంటే మరో కొత్త బోరు వేయించుకోవాల్సిందే. ఇక్కడ ఆవిధంగా ఒక్కొక్క రైతు గత పదేళ్లలో సగటున ఐదారు సార్లు బోర్లు వేయించారు. బంగ్ల భూమయ్య అనే రైతైతే యాభై బోర్లు వేయించారు.

బోరు వేయిస్తే నీరు పడుతుందని, ఆ నీరు చాలాకాలం వుంటుందని ఎలాంటి భరోసా వుండదు. ఈ ఊళ్లో గత పదేళ్లలో పది కన్నా ఎక్కువ బోర్లు వేయించిన కుటుంబాలు 30 వున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు. రైతులు వేలకు వేలు బోర్లకే ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దానికి తోడు ఓల్టేజీ సమస్య వల్ల మోటార్లు కాలిపోయి వారిపై అదనపు భారం పడుతూ వుంటుంది. మరో దారిలేక తెలంగాణా రైతులు ఇన్ని కష్టాలు పడుతూనే వ్యవసాయం చేస్తుంటారు.

ఆర్థికంగా పూర్తిగా చితికిపోయిన వాళ్లు రైతు కూలీలుగా, కార్మికులుగా మారి వలస పోతుంటారు. ఈ చిన్న ఊరి నుంచి ఇప్పటి వరకు 355 మంది దుబాయికి వలసపోయారు. మరెందరో బొంబాయి, భివాండీలకు వలస పోయారు.

మొత్తం తెలంగాణా అంతటా ఇదే పరిస్థితి.

తెలంగాణాలో బావుల కింద సాగయ్యే భూమి 1955 లో 2,56,809 ఎకరాలు కాగా, ఇప్పుడు బావుల కింద సాగయ్యే భూమి 25,26,451 ఎకరాలు!

చెరువులు ఎండి పోయాయి. కాలువలు రాలేదు. కనుక తెలంగాణా రైతులు అనేక వ్యయప్రయాసలకోర్చి మరో గత్యంతరంలేక బావులపై ఆధారపడవలసి వస్తున్నది. 53 ఏళ్ల ఉమ్మడి సమైక్య రాష్ట్రంలో తెలంగాణా సాధించిన ప్రగతి ఇది!

కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతం తెలంగాణా లోనే అత్యధికంగా వున్నప్పటికీ ఇక్కడి రైతులకు కడగండ్లు తప్పడం లేదు. ఇక్కడి ప్రజలకు తాగు నీటికి కూడా దిక్కులేకుండా పోతున్నది. ఉన్నది పోయింది. ఉంచుకున్నది పోయింది అన్నట్టు తయారైంది పరిస్థితి.

నికరమైన సాగునీటి వనరులు లేక ఇటు కరెంటు దేవుడు, అటు వాన దేవుడు ఈ ఇద్దరు దేవుళ్లపై ఆధారపడి తెలంగాణా భారంగా బతుకీడుస్తున్నది. ఆ ఇద్దరు దేవుళ్లు కనికరిస్తేనే తెలంగాణాలో వ్యవసాయం సాగుతుంది. లేకుంటే లేదు. ఈ నేపథ్యం నుండే ఇవ్వాళ తెలంగాణా రైతులు న్యాయాన్ని కోరుతున్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

మోతె - తెలంగాణా బతుకు బాట
-ఎం. కోదండరాం, మల్లెపల్లి లక్ష్మయ్య, ఆర్‌. లింబాద్రి

ప్రథమ ముద్రణ : 2001
24 పేజీలు, వెల: రూ.5


.

Wednesday, June 3, 2009

కొత్త పుస్తకం : ఊరు వాడ బతుకు... దేవులపల్లి కృష్ణమూర్తి రచన ... వి.వి. ముందుమాటతో ...



ఊరు వాడ బతుకు
- దేవులపల్లి కృష్ణమూర్తి ...


''...ఇరవై ఏళ్ల క్రితం జెఎన్‌యు ప్రొఫెసర్‌ జి.పి.దేశ్‌పాండే అద్భుత పరిచయంతో అప్పుడు అర్జున్‌ డాంగ్లే అనువాదం చేసి ఓరియంట్‌ లాంగ్మన్‌ వాళ్లు ప్రచురించిన మరాఠీ దళిత ఆత్మకథలు చదివిన అనుభూతి మళ్లీ ఈ పుస్తకం చదివితే కలిగింది.

తెలుగులో ఇట్లా ఎవరైనా ఆత్మకథలు రాసుకున్నారా తెలియదు. రావూరి భరద్వాజ ''జీవన సమరం'', దాశరథి రంగాచార్య ''జీవన యానం'', దాశరథి కృష్ణమాచార్య ''యాత్రాస్మృతి'' వంటివి లేవని కాదు.

బహుశా ఈ ''ఊరు వాడ బతుకు'' రావూరి భరద్వాజ ''జీవన సమరం'' వంటిది.
అయితే ఈ రచనా పథకం చాలా విచిత్రమైంది. అందువల్ల తెలుగు ఆత్మకథల్లో ఇది విలక్షణమైనది. అపూర్వమైనది.

ఆయనకింకా ఇరవై ఏళ్ల వయస్సు కూడా రాకుండానే, ఆయనగా తనదయిన జీవితంలోకి, వైవాహిక జీవితంలోకి ప్రవేశించే దగ్గరే ఈ నవల వంటి ఆత్మకథ ముగుస్తుంది. బహుశా ఇది మొదటి భాగమేమో.
కాదు. ఇప్పటికే నాలుగు భాగాలు 1) బాల్యం 2) ప్రాథమిక విద్య, 3) మాధ్యమిక విద్య, 4) ఉన్నత విద్య - పదవ తరగతి వరకు (తెలంగాణాలో అప్పటికదే గొప్ప. తహసీల్దార్‌ కావచ్చు!).

బాల్యంలో పోలీసు చర్య పేరుతో జరిగిన సైనిక చర్యకు ముందు జీవితం, కమ్యూనిస్టు ఉద్యమం రజాకార్లు, ప్రవాసం.
చదువులో అనంతారం, సూర్యాపేట అనుభవాలు.
నల్లగొండ జిల్లా సూర్యాపేట తాలూకా నాగుల పాటు పరగణాలోని అనంతారంలో 1940 కృష్ణాష్టమి నాడు పుట్టాడు గనుక కృష్ణమూర్తి అని పేరు పెట్టారు.
'బడికి పోయేటప్పుడు పుట్టిన తేదీ 14.06.1940 అని రాసిండ్రు'.

1958 ఏప్రిల్‌ 9న చివరి పరీక్ష మధ్యాహ్న వరకు రాసి సైకిల్‌ మీద ఊరికి పోయి అంతకు ముందే నిర్ణయమైవున్న ముహూర్తానికి పెళ్లి చేసుకున్నాడు. అంటే అప్పటికింకా ఆయనకు 18 ఏళ్లు నిండలేదు.

''1958 ఏప్రిల్‌ 9న చివరి పరీక్ష మధ్యాహ్నం వరకు అయిపోయింది.
అదే రోజు రాత్రి (నా) పెండ్లి.
అప్పుడు బస్సులేదు.
సైకిల్‌ కిరాయకు తీసుకున్న.
నాకు తొక్కడం సరిగ్గా రాదు.
అప్పుడప్పుడు స్నేహితులు సైకిల్‌ కిరాయకు తీసుకుంటె ఒకటి రెండు చక్కెర్లు కొట్టేటోణ్ని. అంతంతమాత్రం తొక్కేటోణ్ని.

సైకిల్‌ను ఊరి బయటి దాక నడిపించి రాయి చూసుకుని, రాయిమీద కాలుబెట్టి సైకిలెక్కి తొక్కడం మొదలుపెట్టిన.
చిన్నగ తొక్కుకుంటూ పోయిన.
ఏదైన బస్సు, లారీ ఎదురొస్తే దిగి మరల ఎక్కేటోణ్ని.
ఎట్లయితేంది ఇంటికి చేరుకున్నా.
ఇంకా (పెండ్లి కొడుకు) రాలేదేమని ఎదురుచూస్తుండ్రు.
వచ్చినందుకు సంతోషించిండ్రు.
బయలుదేరి బండ్ల మీద నకిరేకల్‌ చేరుకున్నం.
పెండ్లి అయ్యేవరకు కలికి గాంధారి వేళ అయింది.
నా భార్య పేరు కమల.''


ఇది కథన పద్ధతి.

పద్దెనిమిదేళ్ల జీవిత కథ పద్దెనిమిది పర్వాల మహాభారత కథకన్నా తక్కువ ఆసక్తిదాయకంగా ఏమీ లేదు.
పైగా మహాభారతం శ్మశానంగా మారిన యుద్ధ భూమి నుంచి స్వర్గారోహణతో ముగుస్తుంది.
ఈ పద్దెనిమిదేళ్ల జీవిత కథ కమల కలికి గాంధారి వేళ కృష్ణమూర్తి జీవితంలో ప్రవేశించడంతో నిజానికి జీవితం మొదలవుతుంది.

ఎంత బాగా రాసాడు.ఎంత అద్భుతంగా రాసాడు.
ఇది ఒక దృశ్య కావ్యం.
పథేర్‌ పాంచాలీ వంటి జానపద బాధల గాథ.
మా కృష్ణమూర్తేనా రాసింది.
నలభై ఏళ్లుగా నాకు తెలిసిన కృష్ణమూర్తి ... అని ఆశ్యర్యపోవడం కన్నా విశ్లేషణ కందనిదీ అపూర్వ గ్రంథం.

- వి.వి. (ముందుమాట నుంచి)

ఊరు వాడ బతుకు
- దేవులపల్లి కృష్ణమూర్తి

ముఖచిత్రం, బొమ్మలు : లక్ష్మణ్‌ ఏలే

మొదటి ముద్రణ: మే 2009

136 పేజీలు, వెల: రూ.40


ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500 067
ఫోన్‌ నెం. 040 2352 1849

ఇమెయిల్‌: hyderabadbooktrust@gmail.com

మా పుస్తకాలని ''ఎవికెఎఫ్‌ బుక్‌ లింక్‌'' వారి ద్వారా (http://www.avkf.org/BookLink/book_link_index.php) కూడా పొందవచ్చు.

......................................................................

Sunday, April 12, 2009

పాఠకులను తెలంగాణా పల్లెల్లోకి తీసుకెళ్ళే ఓ సాహితీ మిత్రుడి ఆత్మకథ

స్వేచ్చగా చిమ్మిన జలధార :

పస్తుతం ముద్రణలో వున్న దేవులపల్లి కృష్ణ మూర్తి ఆత్మ కథ " ఊరు వాడ బతుకు " పై ఆదివారం ఆంధ్ర జ్యోతిలో (12-4-2009) ప్రత్యేక కథనం వెలువడింది. ఈ పుస్తకానికి వరవర రావు ముందు మాట రాసారు. ఆంధ్ర జ్యోతి కథనాన్ని ఈ కింది లింకు లో చూడవచ్చు :

http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=2009/12-4/others4

Sunday, November 9, 2008

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ వ్యవస్థ ... తెలంగాణా రాజకీయాలు ... దాగ్మార్‌ బెర్న్‌స్టార్ఫ్‌, హ్యూగ్‌ గ్రే ...




ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ముఖ్యంగా తెలంగాణాలో రాజకీయాలు, పంచాయతీరాజ్‌ వ్యవస్థ నేపథ్యంలో జరిగిన గ్రామీణ అధికార నిర్మాణం, శిష్టవర్గాల ఏర్పాటు, పరిణామాలు వంటి వివిధ అంశాలను సమగ్రంగా చర్చించిన వ్యాసాల సంకలనమిది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అసమాన అభివృద్ధిని ప్రశ్నించిన ప్రాంతీయ గుర్తింపు ఉద్యమాలను కూడా ఈ వ్యాసాలు విశ్లేషించాయి..

ఇందులో మొత్తం పన్నెండు వ్యాసాలున్నాయి. వాటి వివరాలు:

1. ఆంధ్రప్రదేశ్‌ రాజనిర్మాతలు
2. 1956-1973ల మధ్య ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాయకత్వం.
3. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వ పునర్నిర్మాణానికి ప్రయత్నం
4. తెలంగాణా భూస్వామ్య వర్గం
5. 1967 సార్వత్రిక ఎన్నికలు - ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైదరాబాద్‌ ప్రాంత అభ్యర్థులు
6. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రానికై డిమాండ్‌
7. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండ్‌ వైఫల్యం
8. ప్రాంతం, జాతి, తెలంగాణా ఉద్యమ ద్వంద్వ అస్తిత్వం
9. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కమ్యూనిస్టుల కంచుకోటలో 1962 సాధారణ ఎన్నికలు
10. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కరీంనగర్‌ జిల్లాలో 1962 సార్వత్రిక ఎన్నికలు
11. భారతదేశంలో ఏడవ సార్వత్రిక ఎన్నికలు - క్షమించే ఓటర్లు
12. ప్రాంతం, రాజకీయ చైతన్యం


ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ వ్యవస్థ ...
తెలంగాణా రాజకీయాలు

- దాగ్మార్‌ బెర్న్‌స్టర్ఫ్‌, హ్యూగ్‌ గ్రే

తెలుగు అనువాదం: బి.జనార్ధనరావు, కె.సీతారామారావు, డా.యం యాదగిరాచార్యులు, డా. ఇ.రేవతి

అట్టమీది బొమ్మలు: ఏలె లక్ష్మణ్‌

222 పేజీలు, వెల: రూ.60

Thursday, August 7, 2008

ప్రాంతీయ అసమానతలు ప్రత్యేక తెలంగాణ - సిహెచ్‌. హనుమంతరావు


ప్రాంతీయ అసమానతలు

ప్రత్యేక తెలంగాణ

-సిహెచ్‌. హనుమంతరావు

ప్రాంతీయ అసమానతలు, ప్రత్యేక తెలంగాణ అనువాదం వెనుక ఒక ప్రత్యేకమైన నేపథ్యం వుంది. నేటి తెలుగు సమాజంలో ప్రత్యేక తెలంగాణ నినాదం సంతరించుకొన్న ప్రాముఖ్యత, రాష్ట్ర భవితవ్యాన్ని ప్రభావితం చేయడంలో తెలంగాణ ఉద్యమానికున్న విశిష్టతతోపాటు దేశవ్యాప్తంగా చిన్న రాష్ట్రాల ఆవశ్యకత గురించి కొనసాగుతున్న చర్చలే ఈ తెలుగు ప్రచురణకు ప్రేరణ.

అభివృద్ధి అసమానతలుగల అన్ని ప్రాంతాలు వేర్పాటు ఉద్యమాలకు నెలవుకాలేదు. అదేవిధంగా ప్రాంతీయ అసమానతలకు గురైన అన్ని ప్రాంతాలు ఒకే రీతిలో లేవు. చారిత్రక కారణాల వల్ల కొన్ని నిర్దిష్ట ప్రాంతాలు మొత్తంగా అభివృద్ధికి దూరమైతే (బీహారు), పెద్ద రాష్ట్రాల్లో భాగంగా అభివృద్ధికి దూరమయి ఉప ప్రాంతీయ భావనకు లోనయినవి మరికొన్ని (ఉత్తరాఖండ్‌, విదర్భ, తెలంగాణ). రెండు శతాబ్దాలుగా భిన్న రాజ్య వ్యవస్థల క్రిందనున్న వేరు వేరు రాష్ట్రాలను ఒకే భాష కారణంగా ఏకం చేసిన నేపథ్యం గల ప్రాంతాలూ వున్నాయి (తెలంగాణ). అయితే ఈ ప్రాతాలన్నింటికీ వెనుకబాటుతనం ముఖ్య లక్షణం. వెనుకబాటుతనం వెనుక సహజసిద్ధ లక్షణాలే కాక రాజ్య/ప్రభుత్వ నిర్లక్ష్యం, పక్షపాత వైఖరులు, నిర్ణయాధికారం లేకపోవడం కారణాలుగా కూడా వుంటాయి. ప్రణాళికా రచన లో రాజకీయాలు ఇమిడి వుంటాయన్న రచయిత విశ్లేషణ ఈ అంశాన్ని స్పష్టంగా చెపుతుంది.

చిన్న రాష్ట్రాల ఉనికికి సంబంధించిన చర్చ పాతదే అయినప్పటికీ, కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల అనుభవాలు ఒక వైపు ప్రపంచీకరణ సరళీకరణ వాదనల నేపథ్యంలో క్రొత్త దృక్కోణాలను సందరించుకున్నది. పెద్ద రాష్ట్రాల్లో ద్రవ్యవనరుల పంపిణీ కన్నా కేంద్ర - రాష్ట్ర సంబంధాల ద్వారా వుండే పంపిణీ సమత్వాన్ని పెంచేదిగానూ, పాలనా సామర్థ్యం పెంచడానికి అనుకూలంగానూ వుంటుంది. ఈ విషయంల ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ ఉతబ్రిఖండ్‌లో స్పష్టంగా కనబడుతున్నది.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అన్ని రాష్ట్ర ఉద్యమాల్లోకి దీర్ఘకాలంగా కొనసాగుతున్నది. తెలంగాణ ప్రాంత పరిరక్షణకు, సర్వతోముఖాభివృద్ధికి ఎన్ని ఒప్పందాలు చేసుకున్నా, ఎన్ని వ్యవస్థలను ప్రవేశ పెట్టినా అన్ని ప్రయత్నాలు విఫలమైనాయనేది తెలంగాణ అనుభవం. ఉమ్మడి రాష్ట్ర రాజకీయార్థిక వ్యవస్థ అంతా నిర్ణయాధికారం చుట్టూ పరిభ్రమిస్తున్నది. నిర్ణయాధికారం లేకపోబట్టే తెలంగాణ ప్రాంత మిగులు తెలంగాణలో ఖర్చు కాదు. ప్రాంత వెనుకబాటుతనం కారణంగా వచ్చే వనరులు తెలంగాణ కోసం ఖర్చుకావు. అధికారగణానికి ప్రజలకు వుండాల్సిన సహజ సంబంధం లోపిస్తున్నది. కనుక ప్రాంత అభివృద్ధి పట్ల, ప్రజల పట్ల అవశ్యమైన నిబద్ధత కొరవడుతుంది. అవస్థాపన మీద అభివృద్ధి ప్రాజెక్టుల మీద ఖర్చు చేయడంలో జరిగిన జాప్యం వలన ఎంత నష్టం వాటిల్లుతుందో మూడవ ప్రణాళికలో స్పష్టంగానే ఉద్ఘాటించారు. ఈ విషయాన్ని తెలంగాణ బడ్జటరీ మిగులు వ్యాసంలో రచ్యరీత మరింత స్పష్టం చేస్తారు - జరగవలసిన పెట్టుబడి జరగనప్పుడు తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో విధాలుగా పొందవలసిన ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను పొందలేకపోవడం తీరని నష్టంగా చూడాలి.

తెలంగాణకై వివిధ రంగాల ప్రణాళిక వ్యాసం యాభై ఏండ్ల ముందున్న పరిస్థితిని వివరిస్తుంది. అయినా ఆనాడు ప్రస్తావించిన అంశాలు ఈనాటికీ ఇంకా ప్రశ్నలుగానే మన ముందున్నాయి. భవిష్యత్‌ తెలంగాణ రాష్ట్రానికి ఇది విజన్‌ డాక్యుమెంట్‌గా కూడా వర్తిస్తుంది. అన్ని ప్రయోగాలు జరిగి, విఫలమైన పరిస్థితిలో తెలంగాణకు స్వయం పాలన ఒక్కటే ప్రత్యామ్నాయం ప్రజలకు లేదు.

.......

ఇందులో ప్రాంతీయ అసమానతలు శీర్షిక కింద నాలుగు వ్యాసాలు, చిన్నరాష్ట్రాల ఆవశ్యకత శీర్షిక కింద రెండు వ్యాసాలు, ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకత శీర్షిక కింద నాలుగు వ్యాసాలు వున్నాయి.

రచయిత ప్రొఫెసర్‌ చెన్నమనేని హనుమంతరావు 1929లో కరీంనగర్‌ జిల్లాలో జన్నించారు. హైదరాబాద్‌ విద్యార్థి సంఘం కార్యకర్తగా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌ లోని నిజాం కళాశాలలో డిగ్రీ చదివారు. 1957లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి అర్థశాస్త్రంలో ఎం.ఎ. పట్టాను, 1962లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్‌ పట్టాను పొందారు. చికాగో విశ్వవిద్యాలయంలో పోస్ట్‌ డాక్టొరల్‌ ఫెలో గా పనిచేశారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ గ్రోత్‌, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పనిచేశారు. అదే సంస్థకు కొంతకాలం డైరెక్టర్‌గా కూడా వున్నారు. అనేక పురస్కారాలతో పాటు 2004లో భారత రాష్ట్రపతి నుండి పద్మభూషణ్‌ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌లో ఆనరరీ ప్రొఫెసర్‌గా, ఇన్స్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ గ్రోత్‌ న్యూఢిల్లీ, బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ చైర్మన్‌గా, జాతీయ సలహామండలి సభ్యులుగా వున్నారు.


ప్రాంతీయ అసమానతలు

ప్రత్యేక తెలంగాణ

-ప్రొఫెసర్‌ సిహెచ్‌. హనుమంతరావు

తెలుగు అనువాదం : ఇ. రేవతి. మామిడి భరత్‌ భూషణ్‌

108 పేజీలు, వెల రూ. 60

Sunday, August 3, 2008

తిరగబడ్డ తెలంగాణ ... దొరలను దించాం - నిజాంను కూల్చాం


తిరగబడ్డ తెలంగాణ

దొరలను దించాం - నిజాంను కూల్చాం

తెలంగాణ పోరు

తెలంగాణ సాయుధ పోరాటాన్ని విభిన్నమైన దృక్కోణంలో విశ్లేషించే పరిశోధనాత్మక రచన ... తిరగబడ్డ తెలంగాణ. భూస్వాముల, దొరల, నిజాం పాలకుల దోపిడీకి గురయిన సాధారణ ప్రజలు ఆ అణచివేతను ఎంతో కాలం సహించలేకపోయారు. బాంచెన్‌, కాల్మొక్త అని పడున్నవారే ఆ అసమానతలపై తిరగబడ్డారు. ఆ పీడిత ప్రజల చైతన్యాన్ని ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీలు ఉద్యమక్రమానికి ఉపయోగించుకున్నాయి. కులాలు, వర్గాలు, వృత్తుల వారీగా ప్రజల చైతన్యక్రమాన్ని పేర్కొంటూ, అట్టడుగు వర్గాల పోరాట తీరును ఇందులో విశ్లేషించారు రచయిత. అగెనెస్ట్‌ దొర అండ్‌ నిజాం, పీపుల్స్‌ మూమెంట్‌ ఇన్‌ తెలంగాణ పేరుతో ఇనుకొండ తిరుమలి రాసిన పుస్తకానికి తెలుగు అనువాదమిది.

- వెంకట్‌ (ఈనాడు ఆదివారం 3 ఆగస్ట్‌ 2008)

దొరలకు - నిజాంకు వ్యతిరేకంగా:

భారతదేశంలో సాగిన ప్రజోద్యమాలన్నింటిలోనూ తెలంగాణ ఉద్యమం ఎంతో విలక్షణమైనది. జాతీయోద్యమంతో ఎలాంటి సంబంధం లేకుండా వర్గ భాగస్వామ్య దృష్ట్యా, పోరాట రూపం రీత్యా ఇది విభిన్నమైన ప్రజా ఉద్యమంగా రూపు దిద్దుకుంది. ఈ పోరాటంలోని ప్రత్యేకత ఏమిటంటే ఉద్యమకారులు దుర్మార్గమైన దొరల వ్యవస్థను సమూలంగా పెకిలించివేయాలని నిర్ణయించుకోవడం.

చాలామంది అభివర్ణిస్తున్నట్టు ఈ పోరాటం కేవలం భూమికోసమో, భుక్తికోసమో సాగింది కాదు. ఇది దోపిడీ నీతికి, దొరల పెత్తనానికి, వారి సంస్కృతికి, సామాజిక విధానాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటం. దొరల రాజ్యం స్థానంలో ప్రజారాజ్యాన్ని స్థాపించేందుకు సాగిన పోరాటం. ఉద్యమ ఆవిర్భావం వెనుక ఉన్న చారిత్రక, సామాజిక కారణాలను పరిశోధకుడు ఆసక్తికరంగా వివరించారు.

పందొమ్మిదో శతాబ్ది చివర్లో ప్రవేశపెట్టిన నూతన భూ రెవెన్యూ విధానాలు ఈ ప్రాంతంలో వ్యవస్థీకృత మార్పులను తీసుకొచ్చాయి. అవే వ్యవసాయిక గ్రామీణ సమాజంలో తీవ్రమైన ఘర్షణలకు నాంది పలికాయి. వీటి ఫలితంగా పుట్టుకొచ్చిన కొత్త భూస్వాములు దొరలుగా అవతారమెత్తి భూమి, శ్రమ విషయంలో స్వేచ్ఛా మార్కెట్‌ అనేవి లేకుండా అడ్డుపడ్డారు. తమకు నిరంతర చాకిరి అందుబాటులో వుండే విధంగా శ్రమదోపిడీకి పాల్పడ్డారు. కులం ఆధారంగా అధికార హెచ్చుతగ్గులను నిర్ణయించి ఆర్థిక వ్యవస్థనూ, సమాజాన్నీ, ప్రజా జీవితాన్నీ నియంత్రించేవారు. సాంస్కృతిక పెత్తనాన్ని చెలాయించేవారు. వారు ఈ కొత్త పెత్తనానికి, సంస్కృతికి ప్రతీకలుగా నిలవడమేకాకుండా గ్రామాల్లో నిజాం అధికార వ్యవస్థకు కొమ్ముకాసేవారు. అందుకే ప్రజలు ఉద్యమ సమయంలో దొరలను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రతిదానిమీద అంటే భూమి, శ్రమ, మార్కెట్లు, దుక్కిదున్నే పశువులు, గ్రామీణ నీటి వనరలు, బంజరు భూములు, ఊరుమ్మడి స్థలాలు, చెట్లు చేమలు, స్త్రీలు, పిల్లలు అందరి మీదా, అన్నింటి మీదా దొరల పెత్తనం పెరగడమే 1940లనాటి ఉద్యమాన్ని ప్రేరేపించింది.

ఉదార జాతీయ వాదులు 1930లో స్థాపించుకున్న ఆంధ్రమహాసభ రాడికల్‌ వ్యవసాయిక కార్యక్రమాల ఫలితంగా 1942 నాటికి వామపక్ష వేదికగా మారిపోయింది. 1944 నాటికి కమ్యూనిస్టులు నిర్వహణపరంగా దానిని తమ చేతుల్లోకి తీసుకుని సంఘాల పేరిట ఆంధ్ర మహాసభ శాఖలను గ్రామ గ్రామానికి విస్తరించారు. దొరలు, ప్రభుత్వాధికారులు ప్రజల మీద సాగిస్తున్న దురాగతాలను ఖండిస్తూ రాజకీయ సభల్లో విరివిగా ఉపన్యాసాలిచ్చారు. ప్రజారాజ్య స్థాపన కోసం భూస్వాములకు వ్యతిరేకంగా సాగే తమ పోరాట సిద్ధాంతాన్ని కమ్యూనిస్టులు సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.

పోరాటంలో రైతుల పాత్ర అత్యంత కీలకమైనది. 1939లో టెనెన్సీ కమిటీని నియమించిన పిదప భూస్వాములు పెద్ద ఎత్తున మఖ్తా వ్యవసాయదార్లను పొలాల్లోంచి వెళ్లగొట్టడంతో ఒక్కసారిగా రైతు పోరాటాలు పెల్లుబికాయి. పోరాటంలో రైతుల భాగస్వామ్యానికి కమ్యూనిస్టులు అత్యంత ప్రాధాన్యత నిచ్చారు. కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రజా ఉద్యమం గ్రామాల్లో వేళ్లూనుకొనడంతో భూస్వాములు తమ పెత్తనాన్ని, స్వప్రయోజనాలను కాపాడుకునేందుకు రజాకార్లతో చేతులు కలిపారు. ప్రజల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసేందుకు ప్రభుత్వ బలగాలు, రజాకార్లు ఒక్కటయ్యారు. గ్రామాల మీద నిరంతర దాడులు నిర్వహించేందుకు వాళ్లు శిబిరాలను ఏర్పాటుచేసుకున్నారు. రజాకార్ల దాడులతో ప్రజలు మరింతగా రాటుదేలారు. వారిలో ఐక్యత బలపడింది. సంఘ రాజ్యం కోసం పోరాడేవాళ్లు గ్రామీణ పోరాటాల మధ్య సమన్వయాన్ని సాధించేందుకు గ్రామీణ దళాలను, ప్రాంతీయ దళాలను ఏర్పాటు చేశారు. ఆ పోరాటం దుర్మార్గమైన దొరల పెత్తనాన్ని/ నిజాం రాజ్యాన్ని కూల్చే రాజకీయ పోరాటంగా పరిణితి చెందింది. పోరాట కాలంలో ఏర్పడ్డ అపూర్వ ఐక్యత ప్రధాన శత్రువు లొంగి పోయిన తర్వాత బలహీనపడటం మొదలయింది. సంపన్న రైతాంగ వర్గాలు గ్రామీణ కమిటీలపై పట్టు బిగించాయి. పోరాటాన్ని తమకు అనుకూలంగా, తమ ప్రయోజనాలనే తీర్చేలా మలిచేందుకు వాళ్లు ప్రయత్నించారు. అ లా వాళ్లు కమ్యూనిస్టుల భూపంపిణీ కార్యక్రమాన్ని హైజాక్‌ చేసి, పార్టీ నాయకత్వ స్థానాల్ని ఆక్రమించుకుని అసలు ఉద్యమ లక్ష్యాలను నీరుగార్చారు.

తెలంగాణా ప్రజా ఉద్యమంలోని మరో ప్రత్యేకత ఏమిటంటే - ఆ కాలంలో అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ మతపరమైన ఘర్షణలు తీవ్రంగా జరుగుతున్నప్పటికీ ఉద్యమం ఏమాత్రం మతపర ప్రభావానికి గురికాకపోవడం. ఉద్యమానికి సంబంధించినంత వరకు మరో కీలకమైన అంశం కులాలు - కులాల ఆధునీకరణ. అగ్రకులాల నుండి నాయకులు ఎదిగిన తీరును ఒకవైపు, ఇతర కులస్తులలో కుల చైతన్యాన్ని ఆధునీకరించుకోకపోవడం వల్ల కింది కులాలకు చెందిన వారు ఎన్నో త్యాగాలు చేసినప్పటికీ తమ నాయకులను సృష్టించుకోలేకపోయారని తెలిపిన విధానం బాగుంది.

తెలంగాణా ప్రజా పోరాటంపై వచ్చిన నవలలు, కమ్యూనిస్టుల రాతలు కొంత పాక్షిక దృష్టితో, అతిశయోక్తులతో వచ్చాయని తెలిపిన రచయిత - చారిత్రక దృష్టితో, తగిన ఆధారాలో రూపొందించిన ఈ పరిశోధనా గ్రంథాన్ని ప్రామాణికంగా తీర్చిదిద్దడంలో చేసిన కృషిని అభినందించకుండా వుండలేం.

- కె.పి అశోక్‌ కుమార్‌ (వార్త దినపత్రిక 1 జూన్‌ 2008)

తిరగబడ్డ తెలంగాణ: దొరలను దించాం - నిజాంను కూల్చాం

ఆంగ్లమూలం: ఎగెనెస్ట్‌ దొర అండ్‌ నిజాం: పీపుల్స్‌ మూమెంట్‌ ఇన్‌ తెలంగాణ

రచన : ఇనుకొండ తిరుమలి

తెలుగు అనువాదం : ప్రభాకర్‌ మందార

266 పేజీలు, వెల : రూ.80

Monday, July 7, 2008

మనకు తెలియని మన చరిత్ర తెలంగాణా రైతాంగ పోరాటంలో స్త్రీలు


మనకు తెలియని మన చరిత్ర

తెలంగాణా రైతాంగ పోరాటంలో స్త్రీలు

- కె.లలిత, వసంత కన్నబిరాన్‌, రమా మేల్కోటే, ఉమా మహేశ్వరి, సుసీ తారూ, వీణా శత్రుఘ్న, ఎమ్‌.రత్నమాల ( స్త్రీ శక్తి సంఘటన )

తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన స్త్రీల మౌఖిక చరిత్రల్ని వెలుగులోకి తీసుకు రావాలని చేసిన ప్రయత్నమే ఈ మనకు తెలియని మన చరిత్ర. 1946 నుండి 1951 వరకు హైద్రాబాద్‌ సంస్థానంలోని ఫ్యూడల్‌ జమీందారుల మీదా, రజాకార్ల రాక్షసత్వం మీదా, ఆతర్వాత భారత సైన్యం మీదా తెలంగాణాలోని అసంఖ్యా స్త్రీ పురుషులు చేసిన తిరుగుబాటు చారిత్రాత్మకమైనది. ఈనాడు అదొక ఇతిహాసం. అదే తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం.

తెలంగాణా పోరాట చరిత్రను ఆ పోరాటంలో పాల్గొన్న కొందరు గ్రంథస్తం చేశారు. మరికొందరు ఆ పోరాట జ్ఞాపకాలను రాశారు. అయితే ఆ పోరాటంలో కదం తొక్కిన మహిళల పాత్ర గురించిన పుస్తకాలు దాదాపు రాలేదనే చెప్పాలి. నిర్ణయాలు చెయ్యడంలో స్త్రీల ప్రమేయం లేకపోయినంత మాత్రాన, నాయకత్వ స్థానాల్లో స్త్రీలు లేకపోయినంత మాత్రాన, పోరాటంలో వారి పాత్ర అప్రధానమై పోదు. ఎందుకంటే ఆనాటి సాంఘిక నిర్మాణంలో, ఆ పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకనే స్థానంలో స్త్రీలు వుండటమనేది సాధ్యం అవునా కాదా అనేది పరిశీలించాల్సిన విషయం.

స్త్రీలకు సబంధించిన ఏ పాలసీనీ ఆనాటి కమ్యూనిస్టు పార్టీ తయారు చేయలేకపోయింది. ఉద్యమానికి స్త్రీలు అత్యవసరమని గుర్తించినప్పటకీ, పార్టీ వాళ్లని సహాయకులుగా మాత్రమే చూసింది.

నిజాం రాజ్యంలో భూస్వామికి భూమి మీదే కాదు ఆ భూమి నాశ్రయించుకుని బ్రతికే ప్రతి మనిషి మీదా హక్కు వుండేది. పెద్ద భూస్వాములుగా తెలంగాణా జమీందారులు రైతులను - స్త్రీలు, పురుషులు, పిల్లలు అనే తేడా లేకుండా తమ స్వంత ఆస్తిగా పరిగణించేవాళ్లు. ఆ వ్యవస్థలో స్త్రీలు పురుషులకంటే బాధలు పడ్డారు. నీ బాంచెను దొరా అన్నది తెలంగాణా రైతాంగానికి ఊతపదం అయిపోయింది. బాంచెను అంటే బానిసను అని అర్థం. ఆనాటి దుర్మార్గపు వ్యవస్థకు, నిజాం ప్రభుత్వానికి, భూస్వాములకు, దొరలకు, రజాకార్లకు వ్యతిరేకంగా సమసమాజ నిర్మాణ లక్ష్యంతో సాగిన నాటి సాయుధ రైతాంగ పోరాటంలో స్త్రీలు సమధికోత్సాహంతో పాల్గొన్నారు. దళాల్లో సాయుధులుగా పాల్గొని రజాకార్లను ఎదుర్కొన్నారు. వారిలో కొందరు స్త్రీలను ఇంటర్వ్యూ చేసి రూపొందించిన పుస్తకమిది. మామూలు చరిత్ర చెప్పని విషయాలెన్నో ఈ స్త్రీల గొంతుల్లో వినవచ్చు.

చాకలి ఐల్లమ్మ జ్ఞాపకాలు....

...అప్పుడు కమ్మరాయన ఇల్లు గాలబెట్టిండ్రు..ఇద్దరన్నదమ్ములను సంపిండ్రు..ఒక

కోమటాయన్ను సంపిండ్రు..కుమ్మరోల్ల పిల్లలగాన్ని సంపిండ్రు..గొల్లోల్ల పోరగాడు గొర్లను

దోల్తాంటె సంపిండ్రు...సెట్టుగ్గట్టేసి సంపిండ్రు...వాల్ల కడుపులు గాల...ఆడోళ్లను ఆగం

చేసిండ్రు...ఇగ నేను లేని టైముల.. నా బిడ్డను గూడ కరాబు జేసిరి...నా బిడ్డ పేరు సోము నర్సమ్మ. ఇద్దరు పిల్లలు పుట్టిండ్రు.. అప్పుడు సంటిపిల్ల తల్లి...పచ్చి బాలింత..కొట్టిండ్రు...కరాబు చేసిండ్రు. ఇగ నా బిడ్డను అ ల్లుడు దీస్క వోలె. ఆ అ ల్లుడు

పాడుగాను..వాడు దీస్కవోలె. మల్లో దాన్ని దెచ్చుకున్నడు….

ఆడోల్ల , మొగోల్ల గడీలకి దీస్కపోతాంటె ఊళ్లోల్లు మేం సచ్చిన మంచిదెగని ఆడోల్లని

పోనియ్య మన్నరు. పోనిత్తరా? ఇప్పుడయితె .. నువ్వు సత్తె నాకేంది...నేను సత్తె

నీకేంది...అన్నట్టుండె..ఆ ఇప్పుడయితే నేను సత్తె నాది తిందామని నీకుండె... గట్ల.. ఇప్పటి సంగమేంది... వస్తరు ..సూసుకుంట వోతరు..వొచ్చినోల్లకింత వండి పెడ్తరు.. తింటరు..అప్పుడు బయముండేది.. ఇప్పుడెక్కడిది? అప్పటి సంగానికి..ఇప్పటి సంగానికి చాన తేడుంది.

అప్పుడు సంగమంటె మురిసిన... సంగమంటె పేదోళ్లు సమంగుండాలని...ఆ రాజ్యం

రావాలని... అప్పుడు జెప్పిండ్రు...ఇప్పుడు తిన్నోల్లె తింటాండ్రు..పేదోనికిత్తాండ్రా...వాని

కడుపు గాల వాడే తింటాండు.పేదోల్ల కొస్తాందా మరిప్పుడు...పోరాటం జేసినం..సేస్తె

మాత్రం...పోరాటం జేసినోల్లున్నరా..పోయిరి, సేసినోల్లు సచ్చిరి..

పాలకుర్తిలోని చాకలి ఐలమ్మ లాగే ఆనాటి పోరాటంలో పాల్గొన్న మరికొందరు మహిళల కమలమ్మ, ప్రియంవద, సుగుమ్మ, ప్రమీలాతాయి, కోటేశ్వరమ్మ, దూడల సాలమ్మ, సూర్యావతి, అచ్చమాంబ, ్మబిలున్సీబి బాజీ, రజియా బేగం, మోటూరి ఉదయం, బ్రిజ్‌రాణీ, లలితమ్మ, పెసర సత్తెమ్మ, మల్లు స్వరాజ్యం, అక్కిరాజుపల్లి మహిళలు మొదలైన వారి అనుభవాలు, జ్ఞాపకాలు, ఇంటర్వ్యూలు ఇందులో వున్నాయి.

324 పేజీలు, వెల రూ.50

Monday, June 23, 2008

తిరగబడ్డ తెలంగాణ : దొరలను దించాం నిజాంను కూల్చాం - డా. ఇనుకొండ తిరుమలి


తెలంగాణా ప్రజా ఉద్యమ చరిత్రను వివరించే రచనలు ఎన్నో వచ్చాయి. వాటిలో కొన్ని ఎంతో ప్రాముఖ్యాన్నీ సంతరించుకున్నాయి. కానీ అవన్నీ చాలా వరకు ఆ ఉద్యమాన్ని నడిపించిన కమ్యూనిస్టు పార్టీ దృక్పథం నుంచి, పార్టీనే కేంద్రంగా చేసుకుని సాగిన రచనలు. వీటికి భిన్నంగా ఆ ఉద్యమంలో నిమగ్నమై వీరోచితంగా పోరాడిన ప్రజలను కేంద్రంగా చేసుకుని నిజాంనూ, దొరలనూ ఇరువురినీ దించాలన్న కృతనిశ్చయంతో సాగిన అపూర్వ ప్రజా పోరాటానికి అద్దం పడుతుందీ రచన. తెలంగాణా పోరాట చరిత్ర రచన కోసం మొట్టమొదటిసారిగా అధికార/ప్రభుత్వ రికార్డులను విరివిగా ఉపయోగించుకోవటం ఈ పుస్తకం ప్రత్యేకత. ఇది లోతైన పరిశోధనాత్మక కృషి మాత్రమే కాదు, అప్పటి దృశ్యాలను సాక్ష్యాధారాలతో సహా మనముందు అసక్తికరంగా అవిష్కరించే సజీవ చారిత్రాత్మక కథనం .

తిరగబడ్డ తెలంగాణ పుస్తకంపై ఆంధ్ర జ్యోతిలో 23-6-2008 నాడు వెలువడిన సమీక్ష:

అపూర్వ ప్రజాపోరాటానికి సజీవచిత్రం

కమ్యూనిస్టు భావజాలంతో ప్రభావితమైనప్పటికీ సంప్రదాయ కమ్యూనిస్టు రైతాంగ పోరాటాలకు భిన్నంగా జరగడం వల్లే తెలంగాణ ప్రజల సాయుధ పోరాటానికి ప్రపంచ రైతాంగ పోరాట చరిత్రలో ఒక ప్రత్యేకస్థానం ఉంది. సంప్రదాయ కమ్యూనిస్టులు భావించినట్టుగా ఈ ఉద్యమం మధ్యతరగతి రైతాంగం లేక పట్టణశ్రామికవర్గం అధిపత్యంలో జరగలేదు. ఈ వర్గాల పాత్ర తెలంగాణ ఉద్యమంలో మచ్చుకైనా కనిపించదు. ఇది కేవలం పేదరైతుల, రైతు కూలీల ఉద్యమం. అక్షరం ముక్కరాని పేదరైతుకూలీలు కుల గ్రామ సమాజంలో ఇమిడి వున్న పోరాట సంప్రదాయాన్ని పోరాట పటిమను ఆధునిక రాజకీయ భావ జాలంతో జోడించి దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా మహత్తర ఉద్యమాన్ని నిర్మించారు. ఈ కారణంగానే ఈ పోరాటం దేశ విదేశీ పరిశోధకుల, మేధా వుల దృష్టిని ఆకర్షించింది. అయితే వీరి రచనలు ప్రజల పోరాట పటిమను గుర్తించకపోవడమే కాకుండా కించపరిచే విధంగా ఉన్నాయి. ఈ ఉద్యమం కమ్యూనిస్టు పంథాలో జరగలేదన్న నెపంతో ఇది ఆధునిక రైతాంగ పోరాటమే కాదని కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరు-ముఖ్యంగా ట్రాట్స్కీ యిస్టులు ఈ పోరాటాన్ని విఫలపోరాటంగా అభివర్ణించారు. ఇంకొంతమంది పరిశోధకులు మరో అడుగు ముందుకువేసి తెలంగాణ అణగారిన కులాలు బానిసత్వానికి అలవాటు పడ్డవారని వారికి పోరాటపటిమ మచ్చుకైనా ఉండ దని తేల్చిచెప్పారు. ఇటువంటి అనేక అభిప్రాయాలకూ వాదనలకూ మంచి సమాధానమే ఇనుకొండ తిరుమలి రచించిన తిరగబడ్డ తెలంగాణ దొరలను దించాం... నిజాంను కూల్చాం చారిత్రక (ఆర్కైవ్స్‌లూ ఉన్నవాటిని) మౌఖిక ఆధారాలతోపాటు స్వీయ అనుభవాలను జోడించి ప్రజలపక్షాన నిలబడి తిరుమలి ఈ పుస్తకాన్ని రాశా రు. ఉత్పత్తికులాలు ఈ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన విషయాన్ని ఆయన బలంగా చెప్పారు. ఉద్యమం మొదటి దశలో (1939-46) గ్రామ సముదాయాల సంబంధాలను పునాదులుగా చేసుకుని పోరా టం చేస్తే రెండవ దశలో (1946-51) కమ్యూనిస్టు భావజాలంతో పోరాటా న్ని నడిపించారు.

మొదటి దశ కేవలం దొరల పెత్తనానికి వ్యతిరేకంగా జరిగిం ది. రెండవ దశ అంటే ఈ ఉద్యమం ఎప్పుడైతే ఆంధ్రమహాసభ కమ్యూనిస్టు పార్టీల ఆధిపత్యంలోకి వెళ్ళిపోయిందో- అప్పుడది నిజాం రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా రూపుదిద్దుకుంది. అనాదినుండి భారతదేశ గ్రామ సమాజంలో బ్రాహ్మణీయ హిందూధర్మంతో పాటు నీతిసూత్రాలు కూడా ఉన్నాయి. గ్రామ సమాజం రోజువారీ వ్యవహారంలో హిందూధర్మం కంటే ఈ నీతిసూ త్రాలే ఎక్కువ పాత్ర పోషించాయి. తిరుమలి ఈ పుస్తకంలో ఉద్యమ నిర్మాణ పునాదులను వివరిస్తూ కుల >గ్రామ సమాజంలో ఉండే సహజ నీతివిలువలు గ్రామ సమా జాన్ని రెండు వర్గాలుగా విభజించిన విషయాన్ని చాలా చక్కగా వివరించారు.
ఈ నీతి సూత్రాల ఆధారంగానే గ్రామ సమాజం దొరలదోపిడీని అరాచకాలను నీతిలేని చర్యగా దొరలను నీతిలేనివారుగా పరిగణించి వారిని శత్రువర్గంగా ప్రకటించుకుంటుంది. గ్రామ నీతిసూత్రాల న్యాయం ప్రకారం నీతిలేనివారికి గ్రామంలో స్థానం ఉండదు. ఈ నేపథ్యం నుంచే మొదటిదశలో ప్రజల్లో వచ్చిన చైతన్యాన్నీ దొరలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమా న్నీ అర్థం చేసుకోవలసివుంటుంది. తెలంగాణలో కమ్యూనిస్టు భావజాలం రాకముందే ఇక్కడి ప్రజలు దొరలదోపిడీని పెత్తనాన్ని అర్థం చేసుకున్నారు. అంతేకాదు దొరలకు వ్యతి రేకంగా వీరోచితమైన పోరాటాలను కూడా నడిపించారు. ఈ రకమైన చైతన్యం పోరాట స్ఫూర్తి మనకు సాయుధపోరాట కాలంలోనూ విరమణ తరువాత కాలంలోనూ కూడా కని పిస్తుంది. పోరాటం హోరాహోరీ కొనసాగుతున్న కాలంలో కూడా ప్రజలు కమ్యూనిస్టు పార్టీకి సంబంధం లేకుండా గ్రామస్థాయిలో అనేక ఉద్యమాలు చేశారు. తెలంగాణ ఉత్పత్తి కులాలు కమ్యూనిస్టు భావజాలంవల్లనే చైతన్యం పొంది దొరల దోపిడీ వ్యవస్థను నిజాం రాచరిక వ్యవస్థను అర్థం చేసుకోగలిగారన్న సాయుధపోరాటాన్ని నిర్మించారన్న వాదనలో వాస్తవం లేదని రచయిత ఈ రకమైన విశ్లేషణ ద్వారా తేల్చిచెప్పారు.
నిజాం పాలనని ఒక భూస్వామ్యవ్యవస్థగా బూజుపట్టిన వ్యవస్థగా అభివర్ణించడం పరిపాటి. అయితే వ్యవస్థను ఎవరు బూజుపట్టించారు నిజాం రాజులా వాస్తవా నికి తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ 19వ శతాబ్దం చివరిదశకంలోనే పురుడుపోసుకుంది. అంతకుముందు రాజ్యంలో ఎక్కడా ఈ రకమైన వ్యవస్థ మనకు కనిపించదు. భూమిమీద రాజ్యానికి కానీ శిస్తు వసూలు చేసే అధికారులైన వతన్‌దారులు, జాగీరుదారులు, దేశ్‌ ముఖ్‌లు, దేశ్‌పాండ్యలకు కానీ ఎటువంటి హక్కూ ఉండేది కాదు. అయితే బ్రిటిష్‌ ఇండి యా రైతువారీ విధానం రావడంతో పరిస్థితి తారుమారైంది. వేల సంవత్సరాలుగా భూమి సాగుచేస్తున్నవారు కౌలుదారులుగా రైతుకూలీలుగా మారిపోయారు.

సాంప్రదాయికంగా రెవిన్యూ వసూలు చేస్తున్నవారు అగ్రకుల రైతులు వేల ఎకరాల భూమిని తమ పేర పట్టా చేయించుకొని భూస్వాములుగా అవతారమెత్తారు. వడ్డీవ్యాపారం ధాన్యం కొనుగోలు ద్వారా అక్రమంగా వేల ఎకరాల భూములను సంపాదించుకున్నారు. గ్రామాల్లో దొరలు ప్రత్యామ్నాయ ప్రభుత్వాలను నడిపించారు. వారి గడీలు కచేరీలుగా మారాయి. 19వ దశాబ్దంనుంచి దొరల పెత్తనం గ్రామ సమాజంమీద అంచెలంచెలుగా బలపడుతూవచ్చింది. పాత కొత్త రెవిన్యూ గ్రామ అధికారులూ అగ్రకుల రైతులూ భూస్వాములుగా అవతరిం చిన తీరునూ నూతన రెవిన్యూ విధానంలో పెట్టుబడిదారీ వ్యవస్థలో మారిన దోపిడీ ఉత్పత్తి సంబంధాలనూ రచయిత వివరించారు.
ఈ దొరల దోపిడీ చాలా ఆలస్యంగా నిజాం ప్రభుత్వ దృష్టికి వచ్చింది. గ్రామాల్లో ఈ దోపిడీని గ్రహించిన నిజాం ప్రభుత్వం మొదట్లో ఉద్యమకారుల పట్ల సానుకూల వైఖరితోనే ఉంది. అంతేకాదు ఉద్యమ కారుల డిమాండ్‌ చాలా న్యాయమైనదిగా భావించింది. కానీ ఎప్పుడైతే ప్రజల ఉద్యమం కమ్యూనిస్టుల ఆధి పత్యంలోకి వెళ్ళిందో అప్పుడు ప్రభుత్వం దానిని రష్యన్‌ బోల్షివిక్‌ ఉద్యమంతో పోల్చుకుని నిర్దాక్షిణ్యంగా అణచివేసే ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రభుత్వమూ ప్రత్యేక ముస్లిం రాజ్య స్థాపనానినాదంతో ఆవిర్భవించిర రజాకారులూ భూస్వాములకు అండగా నిలచి ఉద్యమ అణచివేతను ఉధృతం చేశారు. దొరల గూండాలు పోలీసులు రజాకార్ల దోపిడీ హింసలు ప్రజలను మరింతగా ఉద్యమంవైపు నడిపించాయే తప్ప నీరసపరచలేకపో యాయి.

రాజ్యహింసను ప్రజలు ప్రతిఘటించిన వివిధ సంఘటనల వివరణ పుస్తకానికి అదనపు ఆకర్షణ. ఉద్యమంలో కీలకపాత్ర వహించిన నాయకుల సామాజికవర్గాన్ని సుందరయ్యగారు తన స్వీయచరిత్రలో అక్కడక్కడ ఉటంకించినప్పటికీ ఉత్పత్తికులాల పాత్రను సమగ్రంగా వివరించలేదు. వడ్డెర లంబాడి చాకలి గొల్లకుర్మలు మొదటగా దొరల దోపిడీకి పెత్తనానికీ వ్యతిరేకంగా ఏ విధంగా పోరాటం చేసిందీ తదనంతరం సాయుధపోరాట నిర్మాణంలో సంఘం కీలకపాత్ర గురించి ఈ పుస్తకం వివరించింది. దొరల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల ను చైతన్యపరచడంలో ఆంధ్ర ప్రజానాట్యమండలి కీలకపాత్ర వహించింది. ఈ మండలి ప్రచార కార్యక్రమాల్లో ఉత్పత్తికులాలే ప్రధాన భూమిక నిర్వహించాయి.
గొల్లసుద్దులు వీర వస్తి, పగటివేషాలు, బుర్రకథ, ఒగ్గుకథ, జానపద పాటలు ఈ ఉద్యమ నిర్మాణంలో ప్రచారంలో ప్రముఖ పాత్ర వహించాయి. సాధారణంగా సాయుధపోరాటాలు పురుషాధి పత్య స్వభావాన్ని కలిగివుంటాయి. అటువంటి పోరాటంలో కూడా తెలంగాణ స్త్రీలు అనేక దశల్లో వీరోచితమైన పాత్ర నిర్వహించారు. మనకు తెలియని మన చరిత్ర పుస్తకంలో అగ్ర కుల స్త్రీల భూమిక గురించి మనకు కొంత తెలుస్తుంది. కానీ ఉత్పత్తికులాల స్త్రీల పాత్ర ఏ రచనలోనూ మనకు కనిపించదు. ఈ పుస్తకంలో రచయిత ఆ లోటును భర్తీచేసేందుకు ప్రయత్నించారు. ఉత్పత్తికులాల పోరాట పటిమనుఆవేశాన్ని సాయుధపోరాటంగా మలచడంలో కమ్యూనిస్టుపార్టీ విజయం సాధించినా సాయుధదళాల్లో వారి ఆధిపత్యమే నడిచింది. ఉత్పత్తికులాలవారు కార్యకర్తలుగా రెండవ శ్రేణి నాయకులుగా మాత్రమే రాణించగలిగారు. ఒకానొక దశలో ఉద్యమం మొత్తం తెలంగాణ రెడ్ల , ఆంధ్ర కమ్మల ఆధిపత్యంలోకి వెళ్ళిపో యింది. ముఖ్యంగా కదంపట్టించే కార్యక్రమంలోనూ భూ పంపిణీ విషయంలోనూ ఈ కులస్తుల పక్షపాత బుద్ధి అనేక సందర్భాల్లో బైటపడింది. భూ పంపిణీ విషయంలో కేవలం దేశ్‌ముఖ్‌ జాగీరుదారుల భూములనే పంపిణీ చేసేవారు. అనేకమంది రెడ్డి, వెలమ భూస్వాముల భూములను పార్టీ సానుభూతిపరులనే నెపంతో పంచకుండా వదిలి పెట్టేవారు. సైనికచర్య తరువాత కమ్మ, భూస్వాములు మా రాజ్యం వచ్చేసిందం టూ పంపిణీ చేసిన భూములను రైతులనుండి తిరిగిలాగేసుకుంటున్నప్పుడు పార్టీ మౌనం గా ఉండిపోయింది. సాయుధ ఉద్యమ విరమణలోనూ విశాలాంధ్ర ఉద్యమం చేపట్టడం లోనూ రెడ్డి, కమ్మ కులస్తుల ఎజెండా దాగి ఉందన్న విషయాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది.

తిరగబడ్డ తెలంగాణ
దొరలను దించాం నిజాంను కూల్చాం
రచయిత డా. ఇనుకొండ తిరుమలి
తెలుగు అనువాదం ప్రభాకర్‌ మందార
కాపీ రైట్‌ రచయిత
మూలం ఎగెనెస్ట్‌ దొర అండ్‌ నిజామ్‌ పీపుల్స్‌ ముమెంట్‌ ఇన్‌ తెలంగాణ
ముద్రణ : జనవరి 2008
266 పేజీలు, వెల : రూ. 80/-

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌