Showing posts with label విద్యారంగం. Show all posts
Showing posts with label విద్యారంగం. Show all posts

Thursday, April 30, 2009

దళితబహుజన కులాలకు తెలుగు మీడియం ...! అగ్రకులాలకు ఇంగ్లీషు మీడియం ...!! ఇదేనా తెలుగు భాషా పరిరక్షణోద్యమం లక్ష్యం?


దళితబహుజనులకు తెలుగు
అగ్రకులాలకు ఇంగ్లీషు చదువా!?


తెలుగు భాష పరిరక్షణ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి ఇంగ్లీషును ప్రవేశపెట్టకుండా అడ్డుకుంటున్న వారిని నిలదీస్తూ వార్త దినపత్రికలో కంచ ఐలయ్య చేసిన వాదనల సంకలనమిది.

ఇందులో
1) మాతృభాషా వాదంలోని మతలబు ఏమిటి?
2) ఆంగ్లం వలస భాష అవుతుందా?
3) రెండు కాళ్లపై నడిచే విద్యావిధానం కావాలి
4) భాషా రాజకీయం బహుజనులతో చలగాటం
5) సైన్సును అడుక్కునే దశలో ఎందుకున్నాం?
6) ఇంగ్లీషు + డబ్బు = ప్రతిభ
అనే వ్యాసాలున్నాయి.

స్వాతంత్య్రం రాగానే హిందీని జాతీయ అధికార భాషగా ప్రకటించారు. కానీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థల్లో ఇప్పటికీ ఇంగ్లీషు భాషలోనే విద్యా బోధన జరుగుతోంది. ఐఐటిలు, ఐఐఎంలు, కేంద్ర మెడికల్‌ కాలేజీలు, కేంద్రీయ విద్యాలయాలు ఇంగ్లీషు భాషలో మాత్రమే బోధిస్తున్నాయి…..

అన్ని కేంద్ర సంస్థలూ అగ్రకులాల, ముఖ్యంగా బ్రాహ్మణుల గుత్తాదిపత్యంలో వున్నాయి. వాళ్ల సిద్ధాంతం ప్రకారం వాళ్లు సంస్కృతంలోనో, హిందీలోనో చదువుకోవాలి. కానీ వారు అ లా చేయరు. ఎందుకంటే తమ పిల్లలు ఇంగ్లీషులో చదువుకుంటేనే అన్ని రంగాలలో అభివృద్ధి చెందగలరని వాళ్లకి తెలుసు……

ప్రభుత్వ స్కూళ్లలో ఎక్కువగా బీద ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి కులాలవారే చదువుకుంటారు. అగ్రకులాలకు చెందిన పిల్లలెవరూ చదవరు. తెలుగు పరిరక్షణ కోసం ప్రతినిత్యం యుద్ధం చేసే పెద్దలు తమ పిల్లల్ని ఇంగ్లీషు మీడియం స్కూళ్లలోనే చదివించుకుంటారు. ….

మాతృభాషలను పరిరక్షించే బాధ్యత ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి కులాలవారు చేపట్టాలట.
తమ పిల్లలు మాత్రం ఇంగ్లీషు చదువుకొని అమెరికా ఐరోపా దేశాలకు పోయి, అన్ని ఉన్నతోదోగ్యాలను చేజిక్కించుకుని అభివృద్ధి చెందాలి. దళితబహుజనుల పిల్లలేమో ఈ కంప్యూటర్‌ యుగంలో కూడా ఇంకా తెలుగు మీడియంలోనే చదువుకుంటూ అగ్రకులాల అడుగులకు మడుగులొత్తుతూ పడివుండాలట…….

ఇదీ ఈనాటి భాషా రాజకీయం!

ప్రజలు తమ భాషను ఉత్పత్తి పనిలో భాగంగా నేర్చుకుంటారు.
మన రాష్ట్రంలోనే గోండు తెగకు ఒక భాష, కోయ తెగకు ఒక భాష, లంబాడీ తెగకు ఒక భాష, ఎరుకలి తెగకు ఒక భాష వున్నాయి. ……

కాస్త అభివృద్ధి చెందిన తెగ భాష మిగతా తెగ భాషలను మింగేసి, ఆ తెగలన్నింటినీ తెగాంతర భాషలోకి మారుస్తుంది. ...ఈ క్రమంలో ప్రజలు ఎన్నో అభివృద్ధి చెందని భాషలను వదులుకొంటూ, అభివృద్ధి చెందిన భాషలను నేర్చుకుంటూ ముందుకు సాగుతారు…..

ప్రాచీన కాలంలో సంస్కృతం పాలకుల భాషగా, పాళీ పాలితుల భాషగా వుండేది. సంస్కృతం అగ్రకులాల గుత్త సొత్తుగా వుంటూ వచ్చింది. ఇవాళ ఇంగ్లీషును కూడా అగ్రకులాలు తమ గుత్తసొత్తుగా చేసుకోవాలని, దళితబహుజనులను ప్రాంతీయ భాషలకు కట్టిపడేయాలని చూస్తున్నాయి. …..

మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుండి ఇంగ్లీషు, తెలుగు రెండు భాషలనూ సమానంగా నేర్పాలని దళితబహుజన ఉద్యమాలు ఎప్పటి నుండో డిమాండ్‌ చేస్తున్నాయి. ….

ఇంగ్లీషు చదువుల వల్లనే దళితుల్లోంచి జ్యోతీరావు ఫూలే, అంబేడ్కర్‌ వంటి మేధావులు, తత్వవేత్తలు పుట్టుకొచ్చారు…..

బ్రాహ్మణులు తమ సంస్కృత భాష అభివృద్ధిని పక్కన పెట్టి ఇంగ్లీషు భాషలోకి చొరబడ్డారు. దాన్ని కేంద్రీయ భాషగా ఎదిగించింది కూడా వాళ్లే. కనుక దళిత బహుజనులు కూడా ఆంగ్ల భాషలోకి చొరబడి శత్రువును అధిగమించడం తప్ప మరో మార్గంలేదు. …..

ఈ దేశంలో వేలాది సంవత్సరాలుగా దళితులకు సంస్కృతం నేర్చుకునే హక్కుని నిరాకరిస్తూ వచ్చారు. కానీ బ్రిటీషువారు ఈ దేశంలోకి వచ్చీ రావడంతోనే ఇంగ్లీషుని పాలనా భాషగా చేశారు. దళితులకు ఇంగ్లీషుని నేర్చుకునే హక్కుని, అవకాశాన్నీ కల్పించారు. ఇప్పటికీ ఇంగ్లీషే పాలనా భాషగా వుంది. మరి ఇప్పుడు దళితులు ఏ భాషను ఎన్నుకోవాలి?
కచ్చితంగా ఇంగ్లీషునే……..

లంబాడీ, గోండు, కోయ తదితరులకు తెలుగు వలస భాషే...!
మరి అ లాటప్పుడు ఆదివాసీ గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాషలో ఎందుకు బోధిస్తున్నారు?

తెలుగు భాషా పెత్తనం కింద కురుమ భాష ఇప్పటికే చచ్చిపోయింది.
లంబాడీ, కోయ, గోండు మొదలైన మరెన్నో భాషలు చచ్చిపోయేక్రమంలో వున్నాయి.
ఎబికె ఉటంకించే యునెస్కో మృతభాషల హెచ్చరిక తెలుగు భాష చేతిలో చనిపోతున్న లంబాడీ తదితర భాషలకు వర్తించదా?

ప్రభుత్వ పాఠశాలల్లో లంబాడీ, గోండు, కోయ భాషలను పరిరక్షించే బాధ్యత అధికార భాషా సంఘానికి లేదా?
అవి ఆయా పిల్లల మాతృభాషలు కావా?

మన దేశంలో ఏ భాష అధికారం లోకి వస్తే ఆ భాషను (ఉర్దూ, పర్షియన్‌, ఇంగ్లీషు) ముందుగా నేర్చుకున్నది అగ్రకులాలవారూ, సంపన్న వర్గాలవారే. అందుకే వారు తమ ఆధిపత్యాన్ని కాపాడుకోగలిగారు. …..

రాజా రామమోహన్‌ రాయ్‌, సురేంద్రనాథ్‌ బెనర్జీ, దాదాభాయి నౌరోజీ, తిలక్‌, సావర్‌కార్‌,. గాంధీ, నెహ్రూ అందరూ ఇంగ్లాండుకు పోయి ఇంగ్లీషు నేర్చుకున్నవారే. ఇంగ్లీషు వ్యతిరేకి రామ్‌మనోహర్‌ లోహియా కూడా ఆంగ్ల భాషను అమెరికాలో నేర్చుకున్నాడు. విదేశీ వస్తుభహిష్కరణ రోజుల్లో కూడా ఎవరూ ఇంగ్లీషు విద్యను బహిష్కరించలేదు. …..

జాతీయ వాదం దళితబహుజనులకు...ప్రాపంచిక వాదం అగ్రకులాలకా... ఇదెక్కడి న్యాయం?
ఐఐటి, ఐఐఎంలలో ప్రవేశించే ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థుల పట్ల ఈ అగ్రకులాల విద్యార్థులు చాలా దారుణంగా ప్రవర్తిస్తుంటారు. వారు మధ్యలో చదువు మానుకోవలసిన పరిస్థితిని కల్పిస్తుంటారు. …

అగ్రకులాలవారిని సవాలు చేయడానికి ఒకే ఒక మార్గం విద్యావిధానాన్ని ఒకే భాషలో (ఇంగ్లీషులో) నడపాలనీ, దేశమంతటా ఒకే సిలబస్‌ అమలు చేయాలనీ, ద్వంద్వ విద్యావిధానాన్నీ ట్యుటోరియల్‌ కాలేజీలను రద్దు చేయాలనీ డిమాండ్‌ చేయడమే…….

ఈ రకమైన విద్యావిధానం కుల వ్యవస్థ కీళ్లను కూడా సడలించగలుగుతుంది. ….

ఇవీ కంచ ఐలయ్య మన ముందుకు తెచ్చిన వాదనలు.......
గతం లో వీరు రాసిన " నేను హిందువు నెట్లయిత ? " మరియు " సారే తిప్పు - సాలు దున్ను " పుస్తకాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.



దళిత బహుజనులకు తెలుగు
అగ్రకులాలకు ఇంగ్లీషు చదువా!?

- కంచ ఐలయ్య

32 పేజీలు, వెల: రూ.5


ఇ మెయిల్‌:
hyderabadbooktrust@gmail.com

....................

Thursday, October 9, 2008

మన విశ్వవిద్యాలయాల్లోకి జ్యోతిషం చెదలు? ... కె.అశోకవర్ధన్‌ శెట్టి, వై.నాయుడమ్మ, ఎస్‌.జి.కులకర్ణి


నక్షత్రాలు చూడటం, జ్యోతిషం, రాశుల ఆధారంగా అదృష్ట, దురదృష్ట సంఘటనలను ముందే చెప్పటం, భవిష్యత్తులో సంభవించే మంచిచెడ్డలను జోస్యం చెప్పడం ఇవన్నీ నిషిద్ధం.
..... గౌతమ బుద్ధుడు

జ్యోతిషం లాంటి మార్మికమైన విషయాలన్నీ కూడా చాలా వరకు బలహీన మనస్తత్వానికి చిహ్నాలు. కాబట్టి అవి మన మనసుల్ని ఆక్రమిస్తున్నాయని అనిపించగానే మనం డాక్టరును సంప్రదించటం, మంచి ఆహారం, విశ్రాంతి తీసుకోవడం మంచిది.
... స్వామి వివేకానంద

భూమి ఈ విశ్వాంతరాళానికి కేంద్రం కాదని తేలిన మరుక్షణం... జ్యోతిషం అర్థరహితంగా మారిపోయింది.
.... ప్రొఫెసర్‌ స్టీఫెన్‌ హాకింగ్‌

వంద అబద్ధాల్లో ఒక నిజం చెప్పి జ్యోతిష్కులు ఎంత హాయిగా గడిపేస్తున్నారు! అదే వేరే ఎవరన్నా అయితే వంద నిజాలు చెప్పి ఒక్క అబద్ధం ఆడినా వాళ్లకున్న పరపతి మొత్తం పోతుంది.
... ఫ్రాన్సిస్కో గిసియార్డినీ (1483-1540)

జ్యోతిషంతో జగడమన్నది ఇవాల్టిది కాదు.
బహుశా జ్యోతిషం పుట్టటంతోటే దానిని వ్యతిరేకించే వాదాలు కూడా పుట్టి వుంటాయి.
అహేతుకమైన ఆ సంప్రదాయాన్ని హేతుబద్ధ ప్రగతిశీల ఆలోచనా ధోరణి ఎన్నడూ ఆమొదించలేదు.
సామాజికంగా వ్యక్తిగతంగా ఎన్నో అనర్థాలకు, ఆయోమయాలకు దారితీసే అతి బలమైన మూఢనమ్మకం జ్యోతిషం.
దీనిని విశ్వవిద్యాలయాల్లో ఒక బోధనాంశంగా ప్రవేశపెట్టాలని ఇటీవల యూజీసీ నిర్ణయం తీసుకోవటం ... మన ఏలికల తలతిరుగుడు పెడమార్గానికి పరాకాష్ట.

పైకి పక్కా శాస్త్రంలా కనిపించే ఈ కుహనా విజ్ఞానం తరతరాలుగా ఎలా మనగలుగుతోంది?

మన సమాజంలో ఇదింతగా వేళ్లూనుకోవటానికి కారణాలేమిటి?

దీనిని మనం ఒక సైన్స్‌గా ఎందుకు పరిగణించలేం?
ఈ జాతకకాల తతంగం ఇట్లా నలుచెరగులా విస్తరించిపోవటానికి మన సైన్స్‌ రంగం అచేతనత్వం, వైఫల్యాలే కారణమా?
మన పాలకుల కార్యాచరణలోకి ఇప్పుడిది ఎందుకు వచ్చి చేరినట్టు?
తదితర ప్రశ్నలన్నింటినీ తరచి చూసేందుకు చేసిన చిన్న ప్రయత్నమే ఈ పుస్తకం.

మన విశ్వవిద్యాలయాల్లోకి జ్యోతిషం చెదలు?
కె.అశోకవర్ధన్‌ శెట్టి, వై.నాయుడమ్మ, ఎస్‌.జి.కులకర్ణి

36 పేజీలు, వెల : రూ.10

Tuesday, September 30, 2008

చదువు చర్చ ... ప్రొఫెసర్‌ కృష్ణకుమార్‌ ... స్వతంత్ర భారతంలో సమాజం - విద్య, చదువు మంచి చెడ్డలు, పాఠ్యపుస్తకాలూ పరీక్షా విధానాల్లో వలసవాద విధానాలు




ఏది బోధించదగింది?
దానిని ఎలా బోధించాలి?
విద్యావకాశాల వ్యాప్తి ఏ స్థితిలో వుంది?
పాఠ్యక్రమం సమస్యలతో ముడిపడి వున్న ఈ మూడు ప్రశ్నలు విద్యారంగంతో సబంధంవున్న వారందరూ ఆలోచించాల్సినవి.
వీటిపై విస్తృత చర్చ జరిగినప్పటికీ అది వికలచర్చగానే ముగిసిందని డాక్టర్‌ కృష్ణకుమార్‌ అభిప్రాయం. ప్రణాళికా కర్తలు, ఆర్థిక వేత్తలు, సమాజ శాస్త్రజ్ఞులు వాడే భాషది ఒక దారి, అధ్యాపకులు, విద్యా శిక్షకులు, మనస్తత్వ శాస్త్రజ్ఞులు వాడే భాషది మరో దారి. ఈ రెంటిలో ఏదీకూడా ప్రతి పిల్లవాడు తాను విద్యావంతుడు కావడానికి సాగుతున్న క్రమంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని, అనుభవిస్తున్న మానసిక ఆందోళనల్ని ఆకళింపు చేసుకుని పరిష్కరించగలిగిందిగా లేదు.
ప్రొఫెసర్‌ కృష్ణకుమార్‌ తనదైన సునిశిత వివేచనా దృష్టితో విద్యా పరిశోధన, విద్యా విచారం అంకితమైపోయిన ఈ మూడు ప్రశ్నల పరస్పర సంబంధాన్ని కనుగొని పథ నిర్దేశం చేయగలిగారు. అద్యాపకులు, విద్యార్థులు, విద్యావేత్తలు, బాలల చదువంటే ఆసక్తి కలిగిన వారందరి ఆలోచనాలోచనాలను తెరిపించే ఈ అమూల్య సంకలనం ఆవశ్యం చదవదగింది.
డాక్టర్‌ కృష్ణకుమార్‌ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎడ్యుకేషన్‌ ప్రొఫెసర్‌గా వున్నారు. హిందీ, ఇంగ్లీషు భాషా కోవిదులు. హిందీలో రాజ్‌ సమాజ్‌ ఔర్‌ శిక్ష, త్రికాల్‌ దర్శన్‌, విచార్‌ కా ధారా, వగైరా పుస్తకాలతో పాటు ఇంగ్లీషులో సోషియల్‌ కారెక్టర్‌ ఆఫ్‌ లెర్నింగ్‌, పొలిటికల్‌ అజెండా ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, ద చైల్డ్స్‌ లాంగ్వేజ్‌ అండ్‌ ద టీచర్‌, లెర్నింగ్‌ థ్రూ కాన్‌ఫ్లిక్ట్‌ (పిల్లల పాఠాలు పెద్దలకు గుణపాఠాలు) తదితర పుస్తకాలు రాశారు.

చదువు చర్చ
- కృష్ణకుమార్‌
ఆంగ్ల మూలం: What is Worth Teaching, Social Character of Learning, Education and Society in Post Independecnce India - Looking towards the future.

తెలుగు అనువాదం: సహవాసి, కలేకూరి ప్రసాద్‌, ప్రభాకర్‌ మందార
115 పేజీలు, వెల: రూ.25

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌