చంద్రగిరి పై సాహసయాత్ర-2 ...
బిభూతి భూషణ్ బందోపాధ్యాయ అనే భావుకుడూ, తాత్వికుడూ, మానవతావాదీ అయిన రచయిత చేతిలో పడకపోయి వుంటే ఈ కథ ఒక మామూలు సాహస గాథగా మిగిలిపోయేది. కానీ, సంపదల కోసం పరుగులు తీయటం మానవ జీవితాన్ని ఎంత విషాదంగా అంతం చేస్తుందో చెప్పటానికి ఈ కథను ఉపయోగించుకున్నాడు రచయిత. జిమ్‌కార్టర్, అ ల్వరెజ్, అటీరియో లాంటి వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన తీరును చూస్తుంటే ''గోల్డ్ రష్'' తాలూకు అమానవీయ పరిణామాలను చిత్రించిన జాక్ లండన్ కథలు గుర్తొస్తాయి. పాశ్చాత్య దేశాల పెట్టుబడిదారీ సమాజాలకు చెందిన ఆ యాత్రికులూ, నిరుపేద భారతీయ యువకుడు శంకర్ ప్రయాణించిన మార్గం ఒకటే అయినా లక్ష్యాలు ఒకటి కావనీ, కాకూడదనీ ఎంతో సున్నితంగా చెప్తాడు రచయిత. శంకర్‌నొక సూపర్‌మాన్‌గా- సాహసాలు చేసే, డబ్బు సంపాదించే యంత్రంగా ఆయనెక్కడా చూపలేదు. సాహసం, భావుకత్వం, సౌందర్య దృష్టి, మానవ సంబంధాలపై గౌరవం, తన గ్రామంతో అనుబంధం, సత్యాన్వేషణ- అన్ని గుణాలూ కలబోసిన సహజమైన పాత్ర శంకర్. ఖండాంతరాల్లో పర్యటిస్తున్న అతని హృదయమెప్పుడూ మానవీయంగా ఉంటుంది. వజ్రాలగని దొరికితే తను ఎంత సంపన్నుడవుతాడో, జీవితం ఎంత సుఖవంతమవుతుందోననే ఊహకు బదులుగా- ఎందరు పేదల కన్నీళ్లు తుడవగలనో, ఎందరు నిరుపేద యువతులకు పెళ్లిళ్లు చెయ్యగలనో, ఎందరు వృద్ధులకు రక్షణ కల్పించగలనో అనే ఆలోచిస్తాడు శంకర్. వజ్రాల వేటకు బయలుదేరిన ఇతరులకూ. అతనికీ ఉన్న భేదం అదే.
'పథేర్ పాంచాలి', 'అపరాజితో', 'వనవాసి' వంటి నవలల్లో బిభూతి భూషణ్ తిరిగిన ప్రాంతాల, ఆయన జీవితానుభవాల చాయలు స్పష్టంగా వ్యక్తమవుతాయని ఆయన జీవిత చరిత్రను రాసిన సునీల్ కుమార్ ఛటోపాధ్యాయ చెప్పారు. కానీ, తానెన్నడూ చూడని ఆఫ్రికా గురించి ఇంత వివరంగా రాయగలగటమే 'చందేర్ పహార్' (చంద్రగిరి శిఖరం) లోని విశేషం. ప్రపంచం నలుమూలల్లోని భౌగోళిక, ప్రకృతి విశేషాలనూ-సాహస గాథలనూ ఎంతో ఆసక్తిగా చదువుతుండేవాడు బిభూతి భూషణ్. కెన్యాలోని రైల్వే కంపెనీలో పనిచేసిన జాన్ హెన్రీ పాటర్సన్ అనే బ్రిటీష్ అధికారీ, బాబూ పురుషోత్తం హర్‌బీ అనే భారతీయుడూ రాసిన అనుభవాల నుండీ, 'వైడ్ వరల్డ్ మాగజైన్' అనే పత్రికలో వచ్చిన సాహస గాథలనుండీ ఆ నవలకు కావలసిన సమాచారాన్ని సేకరించాడట రచయిత. అ లాగే ఆఫ్రికాలోని వృక్ష, జంతుజాతులను గురించీ, గిరిజన తెగల సంస్కృతుల గురించీ అధ్యయనం చెయ్యటం కూడా ఆయనకు ఎంతగానో ఉపయోగపడింది. ఆ వివరాలన్నిటినీ క్షుణ్ణంగా అర్థం చేసుకుని, తనదైన దృక్పథంతో మేళవించి పునసృష్టించటమే ఆయన ప్రతిభ. తను స్వయంగా చూసి, కొన్నాళ్లు నివసించిన లవటురియా, మోహన్‌పురా అరణ్యాలను గురించి ''వనవాసి''లో, ''చంద్రగిరి శిఖరం''లో వర్ణించగలగిన నేర్పరి బిభూతి భూషణ్. శంకర్‌కు అ ల్వరెజ్‌తో ఏర్పడిన అనుబంధాన్ని, అటీలియోపై కలిగిన సానుభూతి కరిగిస్తుంది.
బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ రచనల్లో ప్రకృతి వర్ణన ఎంత హృద్యంగా సాగుతుందో తెలుగు పాఠకులకు కొత్తగా చెప్పనవసరం లేదు. ''వనవాసి''లో ప్రధానంగా ప్రకృతి ముగ్ధ సౌందర్యాన్ని చిత్రించిన రచయిత, ఈ నవలలో దాని భయద సౌందర్యాన్ని సాక్షాత్కరింపజేస్తాడు. ''ఎలిఫెంట్ గ్రాస్ మైదానాల్లో పరుచుకున్న వెన్నెల వణికిపోయే సింహగర్జన''లనూ, ''ఆకాశ మధ్యాన బాణసంచా ప్రదర్శనలా'' ప్రారంభమై ''దిగంతాలకు అరుణవర్ణాన్ని పులిమి, మేఘాలను నిప్పు ముద్దలుగా మార్చి... పర్వతం మొత్తం ఒకే అగ్ని జ్వాలలా దగ్ధమైపోయిన అగ్నిపర్వతపు విస్ఫోటనాన్నీ'' కళ్లముందు నిలిపి పాఠకులను విభ్రాంతి పరుస్తాడు.
ప్రకృతిలో బిభూతి భూషణుడికున్న గాఢమైన అనుబంధానికీ, తాదాత్మ్యతకూ ఒక ప్రతీక శంకర్. తన అంతిమ క్షణాలు సమీపిస్తున్నాయన్పించిన సమయంలో కూడా శంకర్‌కు భయం తప్ప, పశ్చాత్తాపం లేదు. ఏ మలేరియాతోనో రోగగ్రస్తుడై నిస్సహాయంగా ఆస్పత్రిలో చావటంకన్నా ఎంచుకున్న మార్గంలో సాహసిగా మరణించటం మేలనుకుంటాడు. ''తారలతో నిండిన నీలాకాశపు కప్పుకింద ఈ పర్వతారణ్య సీమలలో, ఈ రేయి నిశ్శబ్ధ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ'' మరణాన్ని ఆహ్వానించడానికి సిద్ధపడతాడు. మృత్యు బీభత్సాన్నీ, సౌందర్య దృక్పథాన్నీ అతి నైపుణ్యంతో గాఢమైన అనుభవాన్ని అందిస్తాడు ఈ నవలతో బిభూతి భూషణ్.
''మూన్ మౌంటెన్'', ''మౌంటెన్ ఆప్ ది మూన్'' పేర్లతో మూడు నాలుగు ఇంగ్లీషు అనువాదాలు వచ్చాయి. ''చందేర్ పహార్'' నవలను హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ''చంద్రగిరి శిఖరం'' పేరిట తెలుగు పాఠకులకు అందించింది.
......
బిభూతి భూషణ్ బందోపాధ్యాయ.
ఆయన పేరు తలచుకుంటే చాలు - స్వచ్ఛమైన ఆడవి గాలి మనసును చల్లగా తాకుతుంది. బెంగాల్ పల్లెసీమలూ, పంట పొలాలూ, లవటూరియా, మోహన్‌పురా అటవీ ప్రాంతాలూ, మహాలిఖారూప పర్వతారణ్యాలూ ... మనో నేత్రం ముందు ఆకుపచ్చ సముద్రం ఉప్పొంగుతుంది. అడవిగాచిన వెన్నెల దారుల్లోంచి మార్మికమైన సౌందర్య లోకాల్లోకి నడిచిపోతున్నట్టుగా ఉంటుంది. బిభూతి భూషణ్‌ను చదివాక ప్రకృతిలో కొత్త అందాలూ, కొత్త అర్థాలూ మనకు గోచరించకపోతే, మన హృదయగత సంస్కారాన్ని శంకించాల్సిందే.
- కాత్యాయని
(చినుకు, మాసపత్రిక, జూలై 2010 సౌజన్యంతో)
No comments:
Post a Comment