Tuesday, March 10, 2020

అనుభవాల వంతెన – కొండపల్లి కోటేశ్వరమ్మ అరణ్య కృష్ణ


అనుభవాల వంతెన – కొండపల్లి కోటేశ్వరమ్మ
అరణ్య కృష్ణ  
(కొలిమి - ప్రత్యామ్నాయ కళా సాహిత్య సంస్కృతిక వేదిక)

కొండపల్లి కోటేశ్వరమ్మ! జీవితం ఆమెకిచ్చినంత అనుభవం, జ్ఞాపకాలు మరొకరి ఎవరి జీవితమూ అంతటి జీవితానుభవం, జ్ఞాపకాలు ఇచ్చి వుండదు. కొండపల్లి సీతారామయ్య భార్యగా కంటే ఆమె గురించి చెప్పాల్సిందే ఎక్కువగా వుంది.

ఆమె నిండు నూరేళ్లు జీవించిన పరిపూర్ణమైన మనిషి. ఇరవయ్యో శతాబ్దపు తొలినాళ్లల్లో ఈసడించబడ్డ, జాలి చూపించబడ్డ పుత్తడిబొమ్మ
పూర్ణమ్మలాంటి బాల వితంతువు.
చిన్న వయసులోనే గాంధిగారి జోలెలో బంగారు నగలు వేసిన పెద్ద మనసుగల చిన్నారి.
ఆదర్శ వివాహం చేసుకున్న సంస్కరణాభిలాషి. భర్త ఆశయాల వల్ల ప్రభావితమై చేదోడువాదోడుగా వుండటమే కాక తానూ మానసికంగా అభివృద్ధి చెందిన ఉన్నత హృదయామయి.
స్వాతంత్ర్య సమర యోధురాలు.
కష్టకాలంలో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త. ఎన్నో వందల గ్రామాల్లో పాటలు పాడి బుర్రకథలు చెప్పిన “ప్రజా నాట్యమండలి” కళాకారిణి.
తెలంగాణ సాయిధ పోరాటానికి వెన్ను దన్నుగా నిలిచి అనేక సంవత్సరాలు అజ్ఞాతంలో పనిచేసిన వీరనారి.
సాయుధపోరాటంలో ఆయుధాలు స్మగ్లింగ్ చేసి డెన్ కీపర్ గా బాధ్యతలు నిర్వర్తించిన సాహసి.
ప్రజా జీవితంలో కేసులు ఎదుర్కొన్న నిందితురాలు.
జైలు జీవితం గడిపొచ్చిన ఖైదీ.
ఏ సహచరుడైతే తనని ప్రేరేపించి ఉద్యమంలోకి తీసుకొచ్చాడో అదే భర్త నిరాదరణకు గురై అల్లాడిపోయిన స్త్రీ.
పిల్లల బాగోగుల కోసం వాళ్లకే దూరమై పోయి ఒంటరితనపు శిక్షను అనుభవించిన ఓ నిరపరాధ తల్లి.
తన ఒక బిడ్డని లాటిన్ అమెరికన్ ప్రభుత్వాల తరహాలో రాజ్యమే మాయం చేసి “రైలు పట్టాల మీది మృతదేహం మీది దుస్తులు నీ కొడుకువేనా? అని అడిగితే వణికిపోయిన తల్లడిల్లిన మాతృమూర్తి.
మరో బిడ్డ చనిపోయిన తన భర్త ప్రేమని మరిచిపోలేక ఒక చిన్న ఉత్తరంలో తన తల్లికి క్షమాపణలు చెబుతూ ఈ లోకం విడిచి వెళ్లిపోతే కుదేలైపోయిన పిచ్చి తల్లి.
ఆస్తిపాస్తులన్నీ ప్రజలకి పార్టీకి అంకితం చేసిన కారణంగా భర్త సహచరుడు వదిలి వెళ్లిపోయాక పొట్ట గడవటం కోసం ఏదో వుమన్స్ హోంలో తలదాచుకున్న అందరూ వున్న అనాథ.
బతుకు తెరువుకోసం అమ్మాయిల హాస్టళ్లలో వార్డెన్ గా పని చేసిన ఉద్యోగస్తురాలు.
వృద్ధాశ్రమంలో చేరి తనలాంటి వృద్ధులకు సేవ చేసిన దయామయి.

ఆమె తన మనవరాలి దగ్గర బతికిన చివరి రోజులు మినహాయిస్తే మొత్తం జీవితం అంతా దుఃఖ సన్నివేశాల పరంపర.
అతి తక్కువ పుస్తకాలు మాత్రమే పఠితుల కంటి కొసల్లో కన్నీటి చుక్కలవుతుంటాయి. పాఠకుల గుండెల్ల్లో ప్రమిదెల్లా వెలుగుతుంటాయి. నాకు సంబంధించినంత వరకు స్పార్టకస్, ఏడుతరాలు, ఒక తల్లి వంటి పుస్తకాల జాబితాలో కొండపల్లి కోటేశ్వరమ్మగారి ఆత్మ కథ “నిర్జన వారధి” చేరుతుంది. మనవి కాని అంతర్జాతీయ సమాజాల్ని ప్రతిఫలించిన సాహిత్యాలే గొప్పవి అనుకోవటం పొరబాటు. మన భాషల్లో కూడా అంతర్జాతీయ సాహిత్యం వస్తుంది. కాకపోతే మనం వాటిని అంతర్జాతీయం చేయలేక పోతుంటాం. వాటిలో “నిర్జన వారధి” ఒకటి.

ఏమున్నది ఈ పుస్తకంలో?
ఆమె ఏదో మామూలు మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టి, తల్లిదండ్రులు కట్టపెట్టిన కుర్రాడిని చేసుకొని, ఒక నలుగురైదుగురు పిల్లల్ని కనేసి, తల్లిగా, ఇల్లాలిగా తన బాధ్యతల్ని నిర్వర్తించి, భర్త ఒడిలో కనుమూసే సాధారణ మహిళ ఆత్మ కథ కాదు ఇది. తన కాలపు సమాజంలో జరుగుతున్న అన్ని రకాల మానవ సంబంధాలు, ఆర్ధిక సంబంధాలు, సామాజిక సంబంధాలకు సంబంధించిన సాంస్కృతిక, సామాజిక ఘర్షణలన్నింటినీ స్వీకరిస్తూ, వాటిని ఢీకొంటూ, పడుతూ, లేస్తూ, దిగ్భ్రాంతికి గురవుతూ, దుఃఖిస్తూ, ఎదురు తిరుగుతూ, ఒక్కోసారి మౌనంగా ఉండిపోతూ, కొన్నిసార్లు అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ… మొత్తం మీద తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ బతికిన కొండపల్లి కోటేశ్వరమ్మ జీవితముంది ఈ పుస్తకంలో.

నిజానికి ఏ ఆత్మ కథ అయినా అది సమకాలీన సమాజ చరిత్ర. అప్పటి సమాజంలో ఘర్షించే శక్తుల చరిత్ర. మనుషులు, వారి వ్యక్తిత్వాలు, ప్రవర్తనల్ని ప్రభావితం చేసే వర్తమాన చారిత్ర కథనం. అది చెప్పకుంటే గుళ్లో పురాణ కాలక్షేపానికో లేక టీవీ సీరియల్ చూడటానికో పరిమితమయ్యే అనుభవంతో సమానం అలాంటి పొడి పొడి మాటల ఆత్మకథల్ని చదవటం. శ్రీశ్రీ “అనంతం” చదవండి మీరు ఆ నాటి సమాజంలోకి వెళ్లి పోతారు.

రెండు ప్రపంచ యుద్ధాల మధ్య నలిగిపోయిన దందహ్యమాన మూడు నాలుగు దశకాల నాటి సమాజంలో మీరు కొట్టుకుపోతారు. సమాజంతో ఆత్మ కథకులు ఎంతగా పెనవేసుకుపోతే అంతగా సమాజం ఆ ఆత్మకథలో ప్రతిఫలిస్తుంటుంది. అప్పుడు వ్యక్తి జీవితం ఆ సమాజానికి అద్దం అవుతుంది.
ఆ అద్దంలో మనం అక్షరాల్ని చూడం. ఆ కాలపు జీవితాల్ని చూస్తాం.

అగ్రశ్రేణి భారత విప్లవ నాయకుడు కొండపల్లి సీతారామయ్య భార్యగానే కొండపల్లి కోటేశ్వరమ్మ ఎంతోమందికి తెలుసు. కానీ ఒక ఉద్యమకారిణిగా ఆమె చాలా తక్కువమందికి తెలుసు. తన ఎదుగుదలలో సహచరుడి పాత్రని అంగీకరించిన ఆమె నిజానికి తన సహచరుడి విప్లవ రాజకీయ ఆచరణలో, ఎదుగుదలలో తన పాత్రని కూడా ఈ పుస్తకంలో వివరిస్తారు. ఆమె సహకారం లేని యువ విప్లవ సీతారామయ్య లేడు. ఏవో విభేదాలొచ్చి
విడిపోయినప్పటికీ ఇన్ని దశాబ్దాల తరువాత కూడా ఆమె సీతారామయ్యలోని సమానత్వ దృక్పథాన్ని, సాహస తత్వాన్ని, సామాజిక నిబద్ధతని,త్యాగ నిరతిని కొంచెం కూడా తక్కువ చేసి చూపకుండా ఎంతో నిజాయితీగా రాస్తారు. ఎక్కడా ఆయన పట్ల అగౌరవాన్ని కానీ, కించపరుస్తూ మాట్లాడటం కానీ ఆమె చేయరు. తన మీద ఆయన ప్రభావాన్ని వివరంగా రాస్తారు. కులం, సామాజిక కట్టుబాట్లని, వ్యక్తిగత ఆస్తిని ధిక్కరించిన సీతారామయ్యని గొప్పగా అభిమానిస్తారు.

ఆమెలో నిష్కర్షతో కూడిన సహజ పరిశీలనా శక్తి వుంది. కులం, జెండర్ కి సంబంధించిన వివక్షల గురించి చాలా చిన్న వయసులోనే ఆమె గమనిస్తారు. తనని శూద్రకులానికి చెందిన వ్యక్తిగా గుర్తించినప్పుడు ఎంతటి అవమానాన్ని పొందారో, మేని చాయ కారణంగా బ్రాహ్మణ స్త్రీగా తనకి మర్యాదలు ఇచ్చినప్పుడూ అంతే నిష్కర్షగా తిరస్కరిస్తారు. కమ్యూనిస్టు పార్టీ సానుభూతి పరుల్లోని కుల కోణం ఆమెని హతాశురాలిని చేస్తుంది.

అలాగే కమ్యూనిస్టు భర్తల్లోని జెండర్ వెనుకబాటుతనం, పితృస్వామిక ప్రవర్తనని కూడా బైత పెడతారు. వ్యక్తుల్ని అంచనా వేయటంలో వారి బలాబలాలు గమనిస్తుంటారు. ఈ నిష్కర్ష దృక్పథం లేకుంటే సాంస్కృతికంగా వెనుకబడి పోవలిసిందే కదా!

కమ్యూనిస్టు పార్టీల చరిత్రంటే ఉద్యమాల చరిత్రే కాదు చీలికల చరిత్ర కూడా! నాయకత్వపు అహాల, మూర్ఖపు పట్టుల చరిత్ర కూడా. అప్పటి దాకా ప్రబలంగా వుండి కలిసి మెలిసి తిరిగిన కామ్రెడరీ అంతా ఎక్కడికి పోతుందోనని ఆశ్చర్యపోతుంటారు. ఒక్కసారి మొదలైన విభేదాలు శతృత్వాలకు దారి తీయటం ఆమెని నిర్ఘాంతపోయేలా చేస్తుంది. ఈ విషయంలో పురుష కామ్రేడ్స్ కంటే మహిళా కామ్రేడ్స్ మానవీయ కోణమో మసులుకుంటారని ఆమె చెప్పకనే చెబుతారు. బహుశా అది నిజం కావొచ్చేమో అనిపిస్తుంది. పార్టీల చీలికల గురించి తన ఆత్మకథలో ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేస్తారు. బహుశా భారతదేశంలో విప్లవం రాకపోవటానికి శత్రువు బలం కంటే అతి ముఖ్య కారణం కమ్యూనిస్టులు ఐక్యంగా వుండలేని బలహీనతే ప్రధానం కావొచ్చేమో.

తల్లిదండ్రులు, అత్త మామలు, భర్త పిల్లలు, సోదరుడు, అశేష సంఖ్యలో స్నేహిత కామ్రేడ్స్ వున్నప్పటికీ ఒక్క తల్లి తప్పితే ఆమె తనతో వున్నారని లేదా వుంటారని నమ్ముకున్న వారెవ్వరూ లేకపోవటం కనిపిస్తుంది. ఆమెకి భరోసగా వున్న మానవ సంబంధం ఏమైనా వున్నదంటే అది తల్లితో మాత్రమే. కోటేశ్వరమ్మ తనకున్న ప్రతి మానవసంబంధాన్ని ఎంతో గౌరవించారు. ఆమెకి భారతదేశపు అగ్రశ్రేణి కమ్యూనిస్టు నాయకుల నుండి గ్రామ
స్థాయి వరకు బలమైన పరిచయాలున్నాయి. ఇందులో ఆమె తన తండ్రిలా భావించే సుందరయ్య, రాజేశ్వర్రావు నుండి తాను పెద్దబ్బాయిగా పిలుచుకునే రాఘవరావు వరకు వున్నారు. ఎన్ని సెంటిమెంట్స్ వున్నా, ఎన్ని మానవసంబంధాలున్నా ఆమె జీవితంలో ఒంటరితాన్నే ఎక్కువగా ఫీలయ్యారు. మొత్తం మీద జీవితం అంటే ఒక పెద్ద నిర్వేద ప్రయాణమనే భావనకి ఎన్నోసార్లు గురయ్యారు ఆమె.

ఆమె రాసే విధానం కూడా చాలా సరళంగా, సూటీగా వుంటుంది. చెప్పే విధానంలో గొప్ప నిజాయితీ కనబడుతుంది. మనుషుల అల్ప బుద్ధుల్ని అర్ధం చేసుకోవటంలో, ఆచరించే ఉన్నత విలువల్ని మెచ్చుకోవటంలో ఆమె దృష్టి కోణం నిశితమైనది. ఒకే సమయంలో, ఒకే సమాజంలో మనుగడ సాగించే సామాజిక వైరుధ్యాలతో మనుషులందరూ సంఘం చెక్కిన శిల్పాలుగా కనబడుతుంటారు ఆమె చెప్పే విధానం చూస్తే. ఇందులో మనసుని హృద్య పరిచే సందర్భాలతో పాటు హృదయాన్ని కలిచివేసే సంఘటనలెన్నో వున్నాయి. ఇది మనుషుల కోసం, ఒక మంచి సమాజం కోసం పరితపించిన ఒక వ్యక్తి జీవితం మాత్రమే కాదు. ఇది గత శతాబ్దపు ముఖ్య కాలానికి చెందిన సమాజం, అందులో భాగమైన మనుషుల చరిత్ర.

కమ్యూనిస్టు మహిళా ఉద్యమకారుల తొలితరానికి చెందిన కొండపల్లి కోటేశ్వరమ్మగారు తన జీవితాన్ని ఒక “నిర్జన వారధి”గా చెప్పుకున్నారు కానీ నిజానికి అది తనకి సమాజానికి మధ్యన ఒక అనుభవాల వంతెన! అసలు నిష్కర్షగా చెప్పుకోవాలంటే ఈ సమాజమే ఒక నిర్జన వారధి. ఇక్కడ మనిషికి మనిషీ మధ్య మానవ సంబంధమే సరిగ్గా లేదు. మన సమాజం మనుషుల మధ్య మానవీయ వారధి కావాలని కోరుకుంటూ అందుకు
కృషి చేయటమే కోటేశ్వరమ్మగారికి మనం ఇచ్చే నివాళి!

(“నిర్జన వారధి” కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మ కథ. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ. వెల 150 రూపాయిలు)


- అరణ్య కృష్ణ
"నెత్తురోడుతున్న పదచిత్రం", "కవిత్వంలో ఉన్నంతసేపూ...." అనే  రెండు కవితా సంపుటల వయసున్న కవి.  
సామాజిక వ్యాఖ్యానం, యాత్రా కథనాల్లోనూ వేలు పెట్టే సాహసం చేస్తుంటాడు.

(కొలిమి - ప్రత్యామ్నాయ కళా సాహిత్య సంస్కృతిక వేదిక సౌజన్యం తో )


https://kolimi.org

1 comment:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌