ధైర్యే సాహసే "సదా లక్ష్మీ"
మన రాష్ట్రరాజకీయాల్లో తనదైన ముద్రవేసిన శ్రీమతి టి.ఎన్.సదాలక్ష్మి గురించి శ్రీమతి గోగు శ్యామల రాసిన సదాలక్ష్మి గారి మొట్టమొదటి జీవితచరిత్ర.
సదాలక్ష్మి గారి ఆఖరి దశలో ఆమెని ఇంటర్వ్యూ చేసి ఆమె ఆత్మచరిత్రని ఆధారంగా చేసుకుని, ‘నేనే బలాన్ని’ అన్న శీర్షికతో, పరిశోధనాత్మకంగా సదాలక్ష్మిగారి సన్నిహిత బంధువుల్నీ, మిత్రుల్నీ, సమకాలీన రాజకీయ నాయకుల్నీ, ఉద్యమాలలో పాల్గొన్న ప్రముఖుల్నీ ఇంటర్వ్యూ చేసి ఆమె జీవితచరిత్రని ‘అన్వేషి’ సంస్థ ఆధ్వర్యంలో రాయగా, హైదరాబాద్ బుక్ ట్రస్టు వారు ఆకర్షణీయమైన ముఖచిత్రంతో ప్రచురించిన అపూర్వగ్రంథం ఇది.
ప్రధానంగా ఇంటర్వ్యూల మీద ఆధారపడిన గ్రంథం కాబట్టి, ఇందులో కాలక్రమానుసారంగా సదాలక్ష్మి జీవితాన్ని చిత్రించడంలో కొంత ముందు వెనకలయి నప్పటికీ, ప్రతి అధ్యాయం ఆసక్తికరమైన వివరాలను అందించింది.
”ఆమెకు ఎవ్వరంటే భయం లేదు. స్వయంగ నేను చూసాను. అందరు మినిస్టర్లు వచ్చేవాల్లు. నేను ఆమె వెనుకనే వుండేవాన్ని. తను ఎవ్వర్నీ ‘సర్’ అన్నదిగానీ, తలవంచి మాట్లాడిందిగానీ లేదు. సంజీవరెడ్డితో, పి.వి.నరసింహరావుతో, బ్రహ్మానందరెడ్డితో మాట్లాడినా… ఆమె ఎప్పుడూ గూడా వాళ్ళతో సమానంగా మాట్లాడింది. ఏదో వాల్లకంటే కిందికి తగ్గాలనే మాట ఆమెకు లేకుండె. అంత నిర్భయత్వంల ఆమె వుండేది” అని సదాలక్ష్మి గారి గురించి ఆమె భర్త టి.వి.నారాయణగారే అన్న మాటలబట్టి సదాలక్ష్మిగారి వ్యక్తిత్వం తెలుస్తుంది.
‘నేనే బలాన్ని’ అనడంలోనే సదాలక్ష్మిగారి ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటమవుతుంది. సదాలక్ష్మికి చిన్నప్పుడు ట్యూషన్ మాస్టర్ చెప్పేదిట - ”రాదు అనే మాటను మన లిస్టులో నుంచి తీసెయ్యాల” అని. ”ఎవరు ఏ పనిచేస్తే, ఎవరు ఏ పని మీద ధ్యాసపెడితే ఆ పనిలో ప్రావీణ్యత ఒచ్చేస్తది. ఏ పనైన మనం చేస్తూ పోవాలి. మేము చెయ్యమూ అనొద్దు… నన్నడిగితె నాకు రాదూ అని ఎవరైన అంటే అట్లనొద్దు! దేన్నిగూడ రాదని చెప్పొద్దు. గమ్మున వూర్కోవాలె, చేస్తున్నది చూడాలె. అది నేర్చుకోవాలె అని చెప్పుత. నేను అట్లనే చేస్త” అన్న సదాలక్ష్మిగారి ఉద్ఘాటన అన్ని తరాలవారూ అనుసరించవలసిన మార్గదర్శకసూత్రం.
”నిండ మన్సుబెట్టకుండ నా జీవితంల నేనేదీ చెయ్యను. చిన్నదానికి పెద్దదానికి మన్సుబెట్టాల్సిందే. ఇది దినచర్యలాగ అలవాటైయింది నాకు. ఆ విధంగా మా నాయినే అన్నీ చెప్పేది” అని చెప్పిన విశేషమే సదాలక్ష్మిగారి విజయరహస్యం.
హిందూసమాజంలోని ”అట్టడుగు కులాలన్నింటిలోకీ అడుగున ఉండే మాదిగ ఉపకులమైన, మరుగుదొడ్లు సాఫు జేసే ‘మెహతర్’ వృత్తికులంలో పుట్టి, ఏటికి ఎదురీదుతూ మంత్రివర్గ సభ్యురాలిగా,” ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రిగా తన సత్తా నిరూపించుకుని, ”డిప్యూటీ స్పీకర్ స్థాయికి చేరుకున్న సదాలక్ష్మి జీవితాంతం కాంగ్రెస్, తెలుగుదేశం వంటి అధికారపార్టీ రాజకీయాల్లో కీలకంగా ఉంటూ,” దళిత, తెలంగాణా మొదలైన ఉద్యమాలలో నాయకురాలిగా తనదైన ముద్రవేసిన తెలుగు మహిళ.
సదాలక్ష్మి 1928 వ సంవత్సరంలో డిసెంబర్ 25న పుట్టింది. అగ్రవర్ణ స్త్రీలలోనే చదువు అంతగా లేని పరిస్థితిలో తల్లిదండ్రుల ప్రోద్బలంతో 1939లో ”వీరి వంశంలోనే తొలి తరంగా పాఠశాలలోకి, ప్రాథమిక విద్యలోకి ప్రవేశించింది,” ముందుగా బొల్లారంలో ప్రైవేటు పాఠశాలలోనూ, పై తరగతులు కీస్ హైస్కూల్లోనూ చదివింది. ఇంటర్‌మీడియట్ కోసం నిజాం కాలేజిలో చేరి, నాలుగు నెలలపాటు చదివింది. ”రజాకార్లను ఎదుర్కొనేందుకు ఆమె ఎంత ధైర్యంగా ఉండేదంటే, నిజాం కాలేజికి వచ్చినప్పుడల్లా ఎప్పుడూ ఒక కత్తి దగ్గర పెట్టుకొని ఉండేది” అని సదాలక్ష్మిగారి భర్త గుర్తు చేసుకున్నారు. అది కో-ఎడ్యుకేషన్ కాలేజి అని ఆమె పెద్దన్న కాలేజి మాన్పించాడు. ఎక్కడన్నా ఆడపిల్లల కాలేజి ఉంటే అక్కడ చదివిస్తానని తల్లి ప్రోత్సహించిందిట. ”మద్రాసులోని క్వీన్ మేరీస్ విమెన్స్ కాలేజిలో యఫ్.ఏ. (ఫస్ట్ ఆర్ట్స్ కోర్సు)లో చేరింది.
అంతకుముందు పదవ తరగతి చదువుతూండగానే 1947లో తను ఇష్టపడిన టి.వి.నారాయణని పెళ్ళి చేసుకుంది. వాళ్ళది ”ఇంటర్‌కాస్ట్ మ్యారేజి”. ఆమెది మాదిగ సబ్‌కాస్ట్ పాకీ వృత్తి. ఆయనది చెప్పులు కుట్టే వృత్తి. ”ఆ కాస్త తేడాలోనే నరకం చూశాను” అని చెప్పారు సదాలక్ష్మి, గోగు శ్యామలకి ఇచ్చిన ఇంటర్వ్యూలో. సదాలక్ష్మిగారు రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఆమెని అత్త కొట్టేదిట. భర్త ఏమీ చెయ్యలేకపోయేవాడుట. ”నా మ్యారేజి లైఫ్ చాలా ఘోరమైన లైఫ్. ఇప్పటికీ ఎదురీదుతున్నాను…” అని ఆమె ఆఖరి రోజుల్లో కూడా చెప్పుకున్నారు.
మద్రాసుకీ హైదరాబాదుకీ మధ్య తిరగడంతో ఆమె చదువు సరిగ్గా సాగలేదు. అదే సమయంలో ”లేడీస్ కావాలని కాంగ్రెస్ పార్టీనుంచి స్వయంగా పిలుపు వచ్చింది… ఎందుకంటే స్కూలు చదువులనుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉండేదని.”
మొదటిసారి పార్లమెంటుకి ఎన్నికలలో కమ్యూనిస్ట్ పార్టీవల్ల ఓడిపోయినప్పటికీ, ”ఆమె జీవితంలో ఒక నూతన దశ మొదలయింది. తరవాత ఎం.ఎల్.ఎ.గా గెలిచింది.” ఇక ”ఆమె స్వయం నిర్ణయాలు” తీసుకోవడం మొదలుపెట్టింది. ఆమె ఇష్టంతో చేసిన మరొక పని వ్యవసాయం. ”ధైర్యం సాహసం వుంటే తమకు తాము రక్షించుకుంటారు. ఇంక కొంతమందిని రక్షిస్తారు” అంటూ, ఒకసారి పెద్దపులిని ఎలా ఎదుర్కొందో చెప్పారు సదాలక్ష్మి. ఆనాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌తో, ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూతో, రాష్ట్రంలో బ్రహ్మానంద రెడ్డితో, సంజీవరెడ్డితో, చెన్నారెడ్డి మొదలైన వారితో ఎలా వ్యవహరించారో సదాలక్ష్మి జీవితచరిత్ర చదివితే తెలుస్తుంది.
”రకరకాల ఆధిపత్యాలు, పెత్తనాలు రాజ్యమేలుతుండే పార్టీల్లోనూ, సమాజంలోనూ మనుగడ సాగిస్తూ, అట్టడుగు కుల, తెగ, జండరు, ప్రాంత అంశాలపై పనిచేస్తున్నప్పుడు ఎదురయ్యే అడ్డంకులను, అనుభవాలను అర్థం చేసుకోవాలంటే సదాలక్ష్మి జీవితాన్ని చదవాల్సిందే” అని ఈ గ్రంథ రచయిత్రి గోగు శ్యామల అన్నది అక్షరాల నిజం. ఇది అందరూ చదవాల్సిన పుస్తకం.
- అబ్బూరి ఛాయాదేవి
భూమిక
http://bhumika.org/archives/1997
...
No comments:
Post a Comment