సత్యానికీ, మిథ్యకీ మధ్య ...
...
చరిత్రపుటలకు ఎక్కని చరితార్థులకు మన దేశంలో లోటు లేదు.
జనం నోళ్లలో (నిజానికి హృదయాలలో) పాటల రూపంలో, గాథల రూపంలో వారి చరిత్ర మౌఖికంగా వినిపిస్తూనే ఉంటుంది.
అ లాంటి వీరులు, వీరవనితల గురించిన కథలు మనకూ ఉన్నాయి.
ద్వారబంధాల చంద్రారెడ్డి, అ ల్లూరి సీతారామరాజు, చిన్నపరెడ్డి వంటి వారిపైనా, బీర్సా ముండా వంటి వారి చుట్టూ అనేక కట్టు కథలు చుట్టుముట్టి ఉంటాయి.
శాస్త్రీయంగా జరిగే చరిత్ర రచనలో స్థల పురాణాల పాత్ర వాస్తవాల నడుమ చెదిరిన లంకెను కూర్చడానికి మాత్రమే పరిమితం.
అంతేగానీ స్థలపురాణమే చరిత్ర కాదు.
కానీ హెచ్‌బీటీ వెలువరించిన ''వీరనారి ఝాన్సీ ఝల్‌కారీబాయి'' స్థలపురాణానికి సమీపంగానే ఉంది తప్ప, చరిత్ర లక్షణాలను పూర్తిగా సంతరించుకోలేకపోయింది.
ఝాన్సీ లక్ష్మీబాయికి సమకాలీనురాలైన ఝల్‌కారీ యుద్ధవేళ తానే రాణినని కంపెనీ సేనను ముప్పు తిప్పలు పెట్టిందని ఇందులో కనిపిస్తుంది. చిరుతను చంపడం, ఆవు దూడ ఉదంతం, కోట ఆక్రమణ వేళ కనిపించిన ప్రతి తెల్ల సైనికుడి తలను నరకడం వంటి ఘట్టాలు స్థలపురాణాల స్థాయివే తప్ప చారిత్రక వాస్తవాలు అనిపించుకోలేవు. చరిత్ర రచనలో దినుసులు కాలేవు.
ఝల్‌కారీ గురించిన ప్రస్తావన చాలా పుస్తకాలలో ఉన్నదని ఒక పక్క చెబుతూనే ఆమె చరిత్ర మరుగున పడిందని ప్రచురణకర్తలు భావించడం వింతగా ఉంది. ఝాన్సీ ప్రాంతంలో దొరుకుతున్న ఝల్‌కారీ చారిత్రక విశేషాలను సరిగా మథించకుండా ఇలాంటి పుస్తకం రాయడం వల్ల అంతటి చారిత్రక మహిళను ఈ తరానికి పరిచయం చేయాలన్న లక్ష్యం నెరవేరదు.
పుస్తక ముఖచిత్రం రమణీయంగా ఉంది. కానీ ఝల్‌కారీభాయి అంటూ అట్ట శీర్షికలో కనిపించే తప్పు మీద దృష్టి పడితే ఆ ఆనందం కూడా మిగలదు. హిందీలో మోహన్‌దాస్ నైమిశ్ రాయ్ రాసిన ఈ పుస్తకాన్ని డాక్టర్ జీ.వీ. రత్నాకర్ తెలుగులోకి అనువదించారు.
- కల్హణ
(సాక్షి దినపత్రిక తేది31-10-2011 సౌజన్యంతో)
No comments:
Post a Comment