...
సరిగ్గా 33 ఏళ్ల్ల క్రితం (నవంబర్, 1978) 'గాన్ విత్ ద విండ్' నవలని మాలతీ చందూర్ (స్వాతి మాసపత్రికలో) పరిచయం చేసినప్పుడు పాఠకులంతా అబ్బురపడి,
'ఇంత గొప్ప నవలని ఎవరైనా తెలుగులోకి పూర్తిగా తీసుకొస్తే బాగుండేది కదా' అని మధనపడ్డారు.
వాళ్ల బాధని అర్థం చేసుకున్నట్టుగా మూడు దశాబ్దాల తర్వాత పూర్తి అనువాదంతో తెలుగు పాఠకుల ముందుకు తీసుకొచ్చారు ఎం.వి.రమణారెడ్డి.
ప్రపంచ ప్రఖ్యామైన వంద నవలల్ని ఎంపిక చేస్తే అందులో తొలి పది నవలల్లో 'గాన్ విత్ ద విండ్' ఉంటుందన్న అనువాదకుడి మాటతో పాఠకులు పూర్తిగా ఏకీభవిస్తారు.
అయితే ఈ నవల చదవడానికి ముందు కొంత అమెరికా చరిత్ర, 1861 నుండి 1865 మధ్య కాలంలో అక్కడ జరిగిన సివిల్ వార్ గురించి తెలిసివుంటే మరింత ఆసక్తిగా చదివిస్తుంది.
యూరోపియన్లు అమెరికాను ఆక్రమించి స్థానిక 'రెడ్ ఇండియన్స్'ని తరిమేసి వందలాది ఎకరాల్ని ఆక్రమించి, పత్తి పండించే భూకామందులుగా చలామణి అయ్యారు. ఆ క్రమంలో ఆఫ్రికా ఖండం నుండి లక్షలాది నల్లజాతీయుల్ని బానిసలుగా తీసుకెళ్లి వారితో ఊడిగం చేయించుకున్న చరిత్ర ప్రపంచానికి తెలిసిందే.
బానిసత్వ నిర్మూలన పోరాటాల నేపథ్యంలో అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ నీగ్రోలకి పూర్తి స్వేచ్ఛనివ్వడం అమెరికా దక్షిణాది రాష్ట్రాలకు నచ్చలేదు.
అవి యునైటెడ్ స్టేట్స్‌తో విడిపోయి 'కాన్ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్'గా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ తిరుగుబాటుని అణిచివేసి, దేశాన్ని ఏకతాటిపై తెచ్చే ప్రయత్నంలో సాగిందే అమెరికా అంతర్యుద్ధం.
1900 సంవత్సరంలో పుట్టిన 'మార్గరెట్ మిచ్చెల్' తన 25-35 ఏళ్ల మధ్యకాలంలో ఈ నవల రాశారు. 65 ఏళ్ల క్రితం జరిగిన అంతర్యుద్ధ చరిత్రని శోధించి, మధించి ఒక అద్భుతమైన ప్రేమ కావ్యంగా మలిచారు.
ఈ నవలలో ప్రధాన పాత్ర స్కార్లెట్. తను అనుకున్నది సాధించే అసమాన స్త్రీగా స్కార్లెట్ పాత్రని మలిచిన తీరు పాఠకుల్ని అడుగడుక్కీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. స్వార్థం మూర్తీభవించిన స్కార్లెట్‌కి సమాన స్థాయిలో సృష్టించిన మరో పాత్ర 'రెట్ బట్లర్'. ఈ రెండు పాత్రలు ఒకే జాతి పక్షులు. వాళ్ల సుఖం కోసం ఎదుటివారు ఏమైపోయినా పర్వాలేదనుకునే మనస్తత్వం వీరిది. వీరిద్దర్నీ ఇష్టపడకుండానూ, ఏవగించుకోకుండానూ ఉండలేరు పాఠకులు.
మొదట్నుంచి 'యాష్లీ' ప్రేమ కోసం పరితపించిన స్కార్లెట్, అతని ప్రేమ అందకపోవడం లోంచి పుట్టిన కసితో ఛార్లెస్, కెనడి, రెట్ బట్లర్‌లను ఒకరి తర్వాత ఒకర్ని పెళ్లాడి ... ఎవరికీ స్వంతం కాలేక చివరికి ఒంటరిగా మిగిలిపోతుంది. 'నిజానికి యాష్లీ అర్థమయ్యి ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని ప్రేమించేది కాదని, రెట్ బట్లర్ అర్థమై ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని వదులుకునేది కాదనే' స్కార్లెట్ అంతర్మథనంతో నవల ముగించడం గొప్పగా అన్పిస్తుంది.
'గాన్ విత్ ద విండ్' నవల 1940-50 దశకాల మధ్య ఇతర ప్రపంచ రచయితల మీద కూడా గాఢమైన ప్రభావం చూపించివుండాలి. గమనిస్తే పి.శ్రీదేవి 'కాలాతీత
వ్యక్తులు' నవలలోని ఇందిర, కృష్ణమూర్తి, కళ్యాణి, ప్రకాశం పాత్రలు స్కార్లెట్, రెట్ బట్లర్, మెలనీ, యాష్లేల మనస్తత్వాలకు అతి దగ్గరగా అనిపిస్తాయి. అ లాగే మట్టిమనిషి (వాసిరెడ్డి సీతాదేవి) వరూధినిలోనూ స్కార్లెట్ లక్షణాలు కనిపిస్తాయి.
'గాన్ విత్ ద విండ్' నవల 1939లో సినిమాగా విడుదలై పది ఆస్కార్ అవార్డులు సాధించడం గమనార్హం. ముఖ్యంగా స్కార్లెట్ పాత్రతో ఆస్కార్ స్వంతం చేసుకున్న నటి వివియన్ లీహ్ ఇండియాలోని డార్జీలింగ్‌లో పుట్టి ఊటీలో బాల్యం
గడపడం ఆసక్తి కలిగించే విషయం.
నవల సాంతం ఏకబిగిన చదివించే చక్కటి అనువాదం చేసిన రమణారెడ్డి ఇంత గొప్ప నవల రాసిన మూల
రచయిత్రి 'మార్గరెట్ మిచ్చెల్' పేరుని ముఖచిత్రంపై వేయకపోవడం, ఆమె ఛాయాచిత్రం పుస్తకంలో ఎక్కడా ప్రచురించకపోవడం పాఠకుల మనసును చివుక్కు మనిపిస్తుంది.
- గొరుసు
(ఆదివారం ఆంధ్రజ్యోతి 6-11-2011 సౌజన్యంతో)
చివరకు మిగిలింది?
మూలం : మార్గరెట్ మిచ్చెల్
అనువాదం : ఎం.వి.రమణారెడ్డి,
పేజీలు : 512, వెల : రూ.200
ప్రతులకు
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
No comments:
Post a Comment