Thursday, April 30, 2009

దళితబహుజన కులాలకు తెలుగు మీడియం ...! అగ్రకులాలకు ఇంగ్లీషు మీడియం ...!! ఇదేనా తెలుగు భాషా పరిరక్షణోద్యమం లక్ష్యం?


దళితబహుజనులకు తెలుగు
అగ్రకులాలకు ఇంగ్లీషు చదువా!?


తెలుగు భాష పరిరక్షణ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి ఇంగ్లీషును ప్రవేశపెట్టకుండా అడ్డుకుంటున్న వారిని నిలదీస్తూ వార్త దినపత్రికలో కంచ ఐలయ్య చేసిన వాదనల సంకలనమిది.

ఇందులో
1) మాతృభాషా వాదంలోని మతలబు ఏమిటి?
2) ఆంగ్లం వలస భాష అవుతుందా?
3) రెండు కాళ్లపై నడిచే విద్యావిధానం కావాలి
4) భాషా రాజకీయం బహుజనులతో చలగాటం
5) సైన్సును అడుక్కునే దశలో ఎందుకున్నాం?
6) ఇంగ్లీషు + డబ్బు = ప్రతిభ
అనే వ్యాసాలున్నాయి.

స్వాతంత్య్రం రాగానే హిందీని జాతీయ అధికార భాషగా ప్రకటించారు. కానీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థల్లో ఇప్పటికీ ఇంగ్లీషు భాషలోనే విద్యా బోధన జరుగుతోంది. ఐఐటిలు, ఐఐఎంలు, కేంద్ర మెడికల్‌ కాలేజీలు, కేంద్రీయ విద్యాలయాలు ఇంగ్లీషు భాషలో మాత్రమే బోధిస్తున్నాయి…..

అన్ని కేంద్ర సంస్థలూ అగ్రకులాల, ముఖ్యంగా బ్రాహ్మణుల గుత్తాదిపత్యంలో వున్నాయి. వాళ్ల సిద్ధాంతం ప్రకారం వాళ్లు సంస్కృతంలోనో, హిందీలోనో చదువుకోవాలి. కానీ వారు అ లా చేయరు. ఎందుకంటే తమ పిల్లలు ఇంగ్లీషులో చదువుకుంటేనే అన్ని రంగాలలో అభివృద్ధి చెందగలరని వాళ్లకి తెలుసు……

ప్రభుత్వ స్కూళ్లలో ఎక్కువగా బీద ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి కులాలవారే చదువుకుంటారు. అగ్రకులాలకు చెందిన పిల్లలెవరూ చదవరు. తెలుగు పరిరక్షణ కోసం ప్రతినిత్యం యుద్ధం చేసే పెద్దలు తమ పిల్లల్ని ఇంగ్లీషు మీడియం స్కూళ్లలోనే చదివించుకుంటారు. ….

మాతృభాషలను పరిరక్షించే బాధ్యత ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి కులాలవారు చేపట్టాలట.
తమ పిల్లలు మాత్రం ఇంగ్లీషు చదువుకొని అమెరికా ఐరోపా దేశాలకు పోయి, అన్ని ఉన్నతోదోగ్యాలను చేజిక్కించుకుని అభివృద్ధి చెందాలి. దళితబహుజనుల పిల్లలేమో ఈ కంప్యూటర్‌ యుగంలో కూడా ఇంకా తెలుగు మీడియంలోనే చదువుకుంటూ అగ్రకులాల అడుగులకు మడుగులొత్తుతూ పడివుండాలట…….

ఇదీ ఈనాటి భాషా రాజకీయం!

ప్రజలు తమ భాషను ఉత్పత్తి పనిలో భాగంగా నేర్చుకుంటారు.
మన రాష్ట్రంలోనే గోండు తెగకు ఒక భాష, కోయ తెగకు ఒక భాష, లంబాడీ తెగకు ఒక భాష, ఎరుకలి తెగకు ఒక భాష వున్నాయి. ……

కాస్త అభివృద్ధి చెందిన తెగ భాష మిగతా తెగ భాషలను మింగేసి, ఆ తెగలన్నింటినీ తెగాంతర భాషలోకి మారుస్తుంది. ...ఈ క్రమంలో ప్రజలు ఎన్నో అభివృద్ధి చెందని భాషలను వదులుకొంటూ, అభివృద్ధి చెందిన భాషలను నేర్చుకుంటూ ముందుకు సాగుతారు…..

ప్రాచీన కాలంలో సంస్కృతం పాలకుల భాషగా, పాళీ పాలితుల భాషగా వుండేది. సంస్కృతం అగ్రకులాల గుత్త సొత్తుగా వుంటూ వచ్చింది. ఇవాళ ఇంగ్లీషును కూడా అగ్రకులాలు తమ గుత్తసొత్తుగా చేసుకోవాలని, దళితబహుజనులను ప్రాంతీయ భాషలకు కట్టిపడేయాలని చూస్తున్నాయి. …..

మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుండి ఇంగ్లీషు, తెలుగు రెండు భాషలనూ సమానంగా నేర్పాలని దళితబహుజన ఉద్యమాలు ఎప్పటి నుండో డిమాండ్‌ చేస్తున్నాయి. ….

ఇంగ్లీషు చదువుల వల్లనే దళితుల్లోంచి జ్యోతీరావు ఫూలే, అంబేడ్కర్‌ వంటి మేధావులు, తత్వవేత్తలు పుట్టుకొచ్చారు…..

బ్రాహ్మణులు తమ సంస్కృత భాష అభివృద్ధిని పక్కన పెట్టి ఇంగ్లీషు భాషలోకి చొరబడ్డారు. దాన్ని కేంద్రీయ భాషగా ఎదిగించింది కూడా వాళ్లే. కనుక దళిత బహుజనులు కూడా ఆంగ్ల భాషలోకి చొరబడి శత్రువును అధిగమించడం తప్ప మరో మార్గంలేదు. …..

ఈ దేశంలో వేలాది సంవత్సరాలుగా దళితులకు సంస్కృతం నేర్చుకునే హక్కుని నిరాకరిస్తూ వచ్చారు. కానీ బ్రిటీషువారు ఈ దేశంలోకి వచ్చీ రావడంతోనే ఇంగ్లీషుని పాలనా భాషగా చేశారు. దళితులకు ఇంగ్లీషుని నేర్చుకునే హక్కుని, అవకాశాన్నీ కల్పించారు. ఇప్పటికీ ఇంగ్లీషే పాలనా భాషగా వుంది. మరి ఇప్పుడు దళితులు ఏ భాషను ఎన్నుకోవాలి?
కచ్చితంగా ఇంగ్లీషునే……..

లంబాడీ, గోండు, కోయ తదితరులకు తెలుగు వలస భాషే...!
మరి అ లాటప్పుడు ఆదివాసీ గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాషలో ఎందుకు బోధిస్తున్నారు?

తెలుగు భాషా పెత్తనం కింద కురుమ భాష ఇప్పటికే చచ్చిపోయింది.
లంబాడీ, కోయ, గోండు మొదలైన మరెన్నో భాషలు చచ్చిపోయేక్రమంలో వున్నాయి.
ఎబికె ఉటంకించే యునెస్కో మృతభాషల హెచ్చరిక తెలుగు భాష చేతిలో చనిపోతున్న లంబాడీ తదితర భాషలకు వర్తించదా?

ప్రభుత్వ పాఠశాలల్లో లంబాడీ, గోండు, కోయ భాషలను పరిరక్షించే బాధ్యత అధికార భాషా సంఘానికి లేదా?
అవి ఆయా పిల్లల మాతృభాషలు కావా?

మన దేశంలో ఏ భాష అధికారం లోకి వస్తే ఆ భాషను (ఉర్దూ, పర్షియన్‌, ఇంగ్లీషు) ముందుగా నేర్చుకున్నది అగ్రకులాలవారూ, సంపన్న వర్గాలవారే. అందుకే వారు తమ ఆధిపత్యాన్ని కాపాడుకోగలిగారు. …..

రాజా రామమోహన్‌ రాయ్‌, సురేంద్రనాథ్‌ బెనర్జీ, దాదాభాయి నౌరోజీ, తిలక్‌, సావర్‌కార్‌,. గాంధీ, నెహ్రూ అందరూ ఇంగ్లాండుకు పోయి ఇంగ్లీషు నేర్చుకున్నవారే. ఇంగ్లీషు వ్యతిరేకి రామ్‌మనోహర్‌ లోహియా కూడా ఆంగ్ల భాషను అమెరికాలో నేర్చుకున్నాడు. విదేశీ వస్తుభహిష్కరణ రోజుల్లో కూడా ఎవరూ ఇంగ్లీషు విద్యను బహిష్కరించలేదు. …..

జాతీయ వాదం దళితబహుజనులకు...ప్రాపంచిక వాదం అగ్రకులాలకా... ఇదెక్కడి న్యాయం?
ఐఐటి, ఐఐఎంలలో ప్రవేశించే ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థుల పట్ల ఈ అగ్రకులాల విద్యార్థులు చాలా దారుణంగా ప్రవర్తిస్తుంటారు. వారు మధ్యలో చదువు మానుకోవలసిన పరిస్థితిని కల్పిస్తుంటారు. …

అగ్రకులాలవారిని సవాలు చేయడానికి ఒకే ఒక మార్గం విద్యావిధానాన్ని ఒకే భాషలో (ఇంగ్లీషులో) నడపాలనీ, దేశమంతటా ఒకే సిలబస్‌ అమలు చేయాలనీ, ద్వంద్వ విద్యావిధానాన్నీ ట్యుటోరియల్‌ కాలేజీలను రద్దు చేయాలనీ డిమాండ్‌ చేయడమే…….

ఈ రకమైన విద్యావిధానం కుల వ్యవస్థ కీళ్లను కూడా సడలించగలుగుతుంది. ….

ఇవీ కంచ ఐలయ్య మన ముందుకు తెచ్చిన వాదనలు.......
గతం లో వీరు రాసిన " నేను హిందువు నెట్లయిత ? " మరియు " సారే తిప్పు - సాలు దున్ను " పుస్తకాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.



దళిత బహుజనులకు తెలుగు
అగ్రకులాలకు ఇంగ్లీషు చదువా!?

- కంచ ఐలయ్య

32 పేజీలు, వెల: రూ.5


ఇ మెయిల్‌:
hyderabadbooktrust@gmail.com

....................

Tuesday, April 28, 2009

ఆదివాసుల పొలికేక - ‘అడవి తల్లి ‘





మీరు చదివారా?
అడవితల్లి జాను పై దుప్పల రవికుమార్ గారి సమీక్ష ......

2003 ఫిబ్రవరి 19వ తేదీన కేరళలో వైనాడ్ జిల్లాలోని ముతాంగ రిజర్వ్ ఫారెస్టులో ఆందోళన చేస్తున్న గిరిజనులపై జరిపిన పోలీసు కాల్పులలో ఒక గిరిజనుడు, ఒక కానిస్టేబుల్ చనిపోయారు. అప్పుడు ఆ ఆందోళనలో ప్రముఖంగా వినిపించిన పేరు సి. కె. జాను. ఎలాంటి సర్టిఫికేట్లు, డిగ్రీలు లేని జాను పాఠశాల చదువుకు చాలా దూరం. కేరళ ప్రభుత్వం చేపట్టిన ‘అక్షరాస్యత’ కార్యక్రమాల్లో చదవడం, రాయడం నేర్చుకున్న జాను ఆ తరువాత ఒక ప్రజా ఉద్యమానికి నయకురాలవడం యాదృచ్చికం కాదు. మూడు పదుల ప్రాయం నిండకుండానే భారతదేశమంతటా పర్యటించి, నాలుగు పదులలోనే ప్రపంచమంతా చుట్టివచ్చి ఆదివాసీల అసలు సిసలు సమస్యల గురించి, పరిష్కారాల గురించి సభలలో, సమావేశాలలో కీలక చర్చలకు పెట్టడం అపురూపమైన విషయం.

అబ్బురపరిచే తన జీవనయానాన్ని సి. కె. జాను మలయాళంలో చెప్పుకుపోతుంటే ఆంగ్లవార పత్రిక ‘ది వీక్’లో చిత్రకారుడు భాస్కరన్ అక్షరరూపమిచ్చారు. దానిని ఎన్. రవిశంకర్ ఇంగ్లిషులోకి అనువాదం చేయగా, ప్రముఖ స్త్రివాద రచయిత్రి పి. సత్యవతి తెలుగు పాఠకులకు అందించారు. ఎంతో సరళంగా, సాఫీగా సాగిన అనువాదం మనలో ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తుంది..................

దుప్పల రవికుమార్ గారు
అడవి తల్లి జాను పుస్తకం పై చేసిన సమీక్షను పూర్తిగా ఈ కింది లింకులో చదవండి

http://chaduvu.wordpress.com/2009/04/03/adavitalli/


........

ఈనాడు ఆదివారం సంచికలో ఇట్లు ఒక రైతు



ఏప్రిల్ 26 ఈనాడు ఆదివారం సంచికలో ఇట్లు ఒక రైతు పై వెలువడిన సమీక్ష:







ఒక రైతు కథ
"నాగలి పట్టిన ప్రతి రైతూ నా కళ్ళకు శిలువ మోస్తున్న జీసస్ లాగే కనిపిస్తాడు " అంటాడు శేషేంద్ర .
నిజమే.
దేశ ప్రజల ఆకలి శిలువ భారమంతా రైతన్నే మోస్తున్నాడు.
అయినా అతని శ్రమకు గుర్తింపు లేదు.
పంటకు గిట్టుబాటు ధర లేదు.
వ్యవసాయమంటేనే దండగ వ్యవహారం అన్నంత అపప్రద వచ్చింది.
దాన్ని పోగొట్టడానికే అన్నట్టు ఉన్నత విద్యావంతుడైన నరేంద్ర నాథ్ లక్షణమైన ఉద్యోగాన్ని వదులుకుని
సొంతూరుకి చేరుకున్నాడు.
అక్కడినుంచి మొదలవుతాయి ఆ రైతు ప్రయోగాలు.
ఆ అనుభవ సారాన్నంతా రంగరించి
ఇట్లు ఒక రైతు
అంటూ ఆత్మీయ శైలిలో చెప్పుకున్నారు.



..................

Saturday, April 25, 2009

పురాణాలకూ, కులవ్యవస్థకూ, దశావతారాలకూ మధ్య వున్న సంబంధం - డాక్టర్ విజయ భారతి గారి విశ్లేషణ


పురాణాలు - కుల వ్యవస్థ - 2
దశావతారాలు


''పరిత్రాణాయ సాధూనాం
వినాశాయచ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ
సంభవామి యుగేయుగే''


'సాధువులను రక్షించి, దుష్కర్ములను నశింపజేయటానికి , ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలోనూ పుడుతున్నాను'.

భిన్న యుగాలలోని అవతార మూర్తుల కథలనూ వారి చుట్టూ అ ల్లిన భావజాలాన్నీ పరిశీలిస్తే వర్ణవ్యవస్థ విధించే ఆంక్షలను పటిష్టంగా సామాన్యుని జీవితంలో చొప్పించడానికే ఈ ప్రయత్నమంతా జరిగిందని అర్థమవుతుంది.

ధర్మసంస్థాపనం అంటే వర్ణ ధర్మ సంస్థాపనమే!

''మత్స్య కూర్మో వరాహశ్చ నరసింహో థ వామనః
రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధః కల్కీ చతేదశ''


హిందూ మతంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలవారు మాత్రమే చదువు నేర్చుకోవచ్చు, వేదాలను చదవవచ్చు. మళ్లీ అందులో బ్రాహ్మణులకు మాత్రమే వేదాలను బోధించే అధికారం వుంటుంది.

శూద్రుల విషయానికి వస్తే వాళ్లు వేదాలను చదవడమే కాదు. ఎవరైనా చదువుతుంటే వినడానికి కూడా వీలు లేదు. దొంగచాటుగా ఏ శూద్రుడైనా విన్నాడంటే వాడి చెవుల్లో సీసం కరిగించిపోయాలి, వాణ్ణి భౌతికంగా చంపేయాలి అంటుంది మనుధర్మం!!

ఒకసారి బ్రహ్మ నిద్రలో వేదాలను పలవరిస్తుండగా హయగ్రీవుడనే దైత్య భటుడు విన్నాడట.
విని వేదాలను నేర్చుకున్నాడు. (అప్పుడు ఏదైనా విని నేర్చుకోవడమే కదా). ఆ తర్వాత అతనికి భయం పట్టుకుంది. ఆ సంగతి తెలిస్తే సురులు (అగ్రవర్ణాల వారు) తనని ప్రాణాలతో బతకనివ్వరు. అని గజగజ వణికిపోతూ సముద్రంలో దూకి (రసాతలంలో) దాక్కున్నాడు.

……''ఇట్లు వేదంబులు దొంగిలి దొంగ రక్కసుండు మున్నీట మునింగిన వారి జయింపవలసియు మ్రానుదీగెల యందు విత్తనంబుల పొత్తరులు పెన్నీట నాని చెడకుండ మనుపవలసియ నెల్ల కార్యంబులకు గావలియగు నా పురుషోత్తముండప్పెను రేయి చొరుదలయంచు...'' (భాగవతం)

హయగ్రీవుడు భయపడినంతా అయింది.
ఎవరో చూడనే చూశారు. చూసి
'అమ్మో... హయగ్రీవుడు వినడమే కాదు తనవాళ్లకి నేర్పించేస్తాడు.
క్రమంగా వేదాలు అసురులందరికీ (శూద్రులందరికీ) చేరతాయి.' అని బెంబేలెత్తిపోయారు.
హాహాకారాలు చేస్తూ ఆ వార్తని నారాయణుడి చెవిలో వేశారు సురులు.
అంతే. ఆయన మరి ఆలస్యం చేయకుండా మత్స్యావతారం (చేప రూపం) దాల్చి సముద్ర గర్భంలోకి వెళ్లి హయగ్రీవుడిని సంహరించేశాడు. సంభవామి యుగేయుగే ప్రారంభం…..
ఇది “మత్స్యావతారం” కథ.

అట్లాగే “కూర్మావతారం” (తాబేలు రూపం)లో అసురులతో చేతులు కలిపి సాగర మథనం చేసి అమృతం సాధించి అసురులను వంచించి సురులే దానిని చేజిక్కించుకున్నారు. ఎంత ధర్మాత్ములో సురులు.

ఇక “వరహావతారం” (పంది రూపం)లో భూ ఆక్రమణ వ్యవహారం,.... “నృసింహావతారం” (సగం మనిషి సగం జంతువు రూపం)లో వైష్ణవాన్ని కాదన్నవారిని చీల్చిచెండాడటం ... “వామనావతారం” (మరుగుజ్జు రూపం) లో - అసురులు ఎంత మంచివారైనా, ఎంత సమర్థులైనా వారిని రాజ్యాధికారం చేయన్వికూడదు అన్న కుతంత్రం కనిపిస్తుంది.

“పరశురామావతారం” ఈ భూమి మొత్తం బ్రాహ్మణుల అధీనంలోనిదేననీ, క్షత్రియులు బ్రాహ్మల అధికారానికి లోబడి వుండాలని చాటుతుంది. “రామావతారం” క్ష్రత్రియులకూ బ్రాహ్మణులకూ మధ్య రాజీ కుదిర్చి వర్ణధర్మాన్ని పటిష్ట పరుస్తుంది. “కృష్ణావతారం” శూద్ర కులాలు విద్యా రాజకీయ రంగాలలో ఎదగటం, వారిని అణచే ప్రయత్నాలు, కర్మసిద్దాంతం ... గీతా రహస్యం.

ఇక “బుద్ధావతారం” వైదిక కర్మకాండకు వ్యతిరేకంగా ప్రబలుతున్న ఉద్యమాలను అణచలేక బుద్ధుడూ విష్ణువు అవతారమే అని ప్రజలను తప్పుదారి పట్టించే కుట్ర. కాగా ''కల్కి'' అవతారం ఇంకా అవతరించాల్సి వుంది. (ఇప్పటికే అక్కడా ఇక్కడా నేనే కల్కి అవతారాన్ని అని కొందరు చాటుకుంటున్నా వారు సర్వామోదాన్ని మాత్రం పొందలేకపోతున్నారు).

దశావతారాలు సామాజిక నియంత్రణ విధానాల అమలుకు ఉద్దేశించినవే అంటూ డా. విజయ భారతి గారు ఈ పుస్తకంలో విశ్లేషిస్తున్నారు.
………………………………………………………………………….

''జన సామాన్యాన్ని విద్యావంతులను చేయటంలో వైఫల్యానికి
ప్రాచీన ప్రపంచాన్ని మొత్తంగా తప్పుపట్టవచ్చు.
కానీ ఏ సమాజం కూడా దాని మతానికి సంబంధించిన గ్రంథాలను
ఆ సమాజంలోని ప్రజలు చదవకుండా చేసే నేరానికి పాల్పడలేదు.
సామాన్యుడు జ్ఞాన సముపార్జన చేయటం అనేది శిక్షించదగిన నేరం
అని ప్రకటించడానికి ప్రయత్నించిన సమాజం ఏదీ లేదు.
హిందూ మతానికే ఆ కీర్తి దక్కుతుంది.
చదవటం, రాయటం అనేవి అగ్రవర్యాల వారి హక్కుగానూ,
నిరక్షరాస్యత నిమ్న కులాల వారి తలరాతగానూ
మనుధర్మ సూత్రాలు నిర్దేశించాయి.''
-బాబా సాహెబ్‌ భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌

………………………………………………………………………….


డాక్టర్‌ విజయభారతి గారు తెలుగు అకాడమీ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు. వారు అనేక పుస్తకాలు రచించారు. వాటిలో అంబేడ్కర్‌, ఫూలే రచనలు ప్రముఖమైనవి. లోగడ వీరు రచించిన ''వ్యవస్థను కాపాడిన రాముడు'', ''షట్చక్రవర్తులు'' పుస్తకాలను ఈ బ్లాగులో పరిచయం చేయడం జరిగింది.




పురాణాలు కుల వ్యవస్థ - 2 ''దశావతారాలు''
- డాక్టర్‌ విజయ భారతి

76 పేజీలు, వెల: రూ.25



ప్రతులకు వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500085
ఫోన్‌ నెం. 040 - 2352 1849

ఇ మెయిల్‌:
hyderabadbooktrust@gmail.com

Friday, April 24, 2009

వంద శాతం లక్ష్యాన్ని నెరవేర్చిన "పంచమం"

సాక్షి దినపత్రిక 20 ఏప్రిల్ 2009 నాటి సంచికలో పంచమం నవలపై విద్యాసాగర్ గారి విమర్శకు సమాధానంగా ఎస్. వి. ప్రసాద్ స్పందన వెలువడింది. మా బ్లాగు వీక్షకుల సౌకర్యం కోసం దానిని ఇక్కడ పొందుపరుస్తున్నాము. ఈ లింకు లో చూడండి లేదా జె పి జి ఇమేజ్ పై క్లిక్ చేయండి :

http://epaper.sakshi.com/Details.aspx?id=154225&boxid=29725398

.............................................................





...........

Thursday, April 23, 2009

మాలపల్లి .... ఉన్నవ లక్ష్మీనారాయణ


ఉన్నవ లక్ష్మీనారాయణ స్వాతంత్య్ర సమర యోధుడు.
సాహిత్య విశారదుడు, సంస్కర్త, కార్య శూరుడు.

బార్‌-ఎట్‌-లా చదివినా పరప్రభుత్వోద్యోగానికి పాకులాడక తనకు తానుగా ఎన్నుకొన్న సంఘసేవలో కాలం గడిపాడు. గుంటూరు జిల్లాలో పన్నుల నిరాకరణోద్యమాన్ని నడిపినందుకు బ్రిటీషు ప్రభుత్వం ఒక సంవత్సరం జైలు శిక్ష విదించి రాయవెల్లూరు జైలులో నిర్బంధించింది.


జైలులోనే ఆయన ''మాలపల్లి'' రచించారు.

అసమాన సామాజిక స్పృహతో ఆనాడు రాసిన నవలల్లో
''మాలపల్లి'' తరువాతే మరే రచన అయినా.
సమకాలీన సాంఘిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాలకు
దర్పణం పట్టిన నవల ''మాలపల్లి''.
వాడుక భాష బొత్తిగా వ్యాప్తిలో లేని కాలంలో, మాదిరి(మోడల్‌)కు
తగిన పుస్తకాలు లేని పరిస్థితిలో తెలుగుభాష నడక కనుకూలంగా
ఈ నవలను రాయడం విశేషం.

దాదాపు ఒక శతాబ్దం కిందటి పరిస్థితులు తెలియని ఈ తరం పాఠకులకు
''ఇదేమి వాడుక భాష?'' అనిపించవచ్చు.
జాతీయాలు, సామెతలు, తెలుగు పలుకుబళ్లు పొంగి పొరలే ''మాలపల్లి''
భావ, భాషా విప్లవాలను ఏకకాలంలో సాధించిన ఉత్తమ కృతి.
పల్లెటూరును వేదికగా చేసుకొని వెలువరించిన చాలా కొద్ది నవలల్లో
''మాలపల్లి'' వెలకట్టలేని అక్షరాభరణం.

''మాలపల్లి''ని బ్రిటీషు ప్రభుత్వం రెండు సార్లు నిషేధించింది.

గుంటూరులో స్త్రీ విద్యాభివృద్ధికోసం ఆయన నెలకొల్పిన ''శారదానికేతనం''
ఆయనను సదా జ్ఞాపకం చేస్తుంది.

ఉన్నవవారు 1958లో కన్నుమూశారు.

''ప్రగతిని కోరేవారూ, సాహిత్యంలో వెలుగును కోరేవారూ కోట్లాది కడజాతి వారి గుండె వెతలను విన్పించే ''మాలపల్లి'' మనజాతి గర్వించదగిన నవల అని గుర్తించగలరు.''

ఈ మేటి రచనను ''సహవాసి'' గారు సంక్షిప్తం చేశారు.
అందమైన బొమ్మలను ''అన్వర్‌'' అందించారు.

మన జాతి గర్వించదగ్గ మేటి రచనలను సజీవ చిత్రాలతో,
సంక్షిప్తంగా పరిచయం చేయటం - చదువరులలో ఆసక్తిని రేకెత్తిస్తుందనీ,
తిరిగి మూల రచనలు చదివేలా స్ఫూర్తినిస్తుందనీ ఆశిస్తున్నాం.



మాలపల్లి
- ఉన్నవ లక్ష్మీనారాయణ

సంక్షిప్తం : సహవాసి
బొమ్మలు : అన్వర్‌

68 పేజీలు, వెల: రూ.25


ప్రతులకు వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడి మల్కాపూర్‌, హైదరాబాద్‌. - 500067
ఫోన్‌ : 040-2352 1849


ఇ-మెయిల్‌:
hyderabadbooktrust@gmail.com

Tuesday, April 21, 2009

పుట్టుక, పెళ్లి, చావు వంటి సందర్భాలలో ఖర్చులని, కర్మకాండలని, మూఢనమ్మకాలని నిరసించిన పెరియార్‌


పెరియార్‌నామా ...కె. వీరమణి, పెరియార్‌

పెరియార్‌ ఇ.వి.రామస్వామి నాయకర్‌ ఆలోచనలు, జీవితం, కృషి గురించి క్లుప్తంగా పరిచయం చేసే చిరుపుస్తకమిది. గాంధీకి 'మహాత్మా' లాగా ఇవిఆర్‌ కి 'పెరియార్‌' అనేది గౌరవనామం. పెరియార్‌ అంటే గొప్ప వ్యక్తి అని అర్థం. ఆపేరుతోనే ఆయన సుప్రసిద్ధులు.

పెరియార్‌ 1879 సెప్టెంబర్‌ 17న తమిళనాడులో దైవభక్తి, మతవిశ్వాసాలు మెండుగావున్న ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. అయితే ఇంట్లో వాళ్లంతా భక్తి శ్రద్ధలతో గుళ్లూ గోపురాలచుట్టూ తిరుగుతూ మతపరమైన గోష్టుల్లో పాల్గొంటూ వుంటే ఆయనకు మాత్రం చిన్నప్పటినుంచే ప్రతి అంశాన్నీ హేతువాద దృక్పథంతో పరిశీలించడం, ప్రశ్నించడం అ లవాటైంది. పండితుల ప్రసంగాలలోని పరస్పర విరుద్ధమైన అంశాల్ని నిర్మొహమాటంగా ఎత్తి చూపేవాడు. అసంబద్ధ విషయాలను అపహాస్యం చేసేవాడు.

కొంతమంది స్వార్థపరులు, మతాన్ని ఒక ముసుగుగా ధరించి అమాయక ప్రజలను వంచిస్తున్నారనీ, దోచుకుంటున్నారనీ ఆయన యుక్తవయసులోనే గ్రహించాడు. మూఢవిశ్వాసాలకు, పూజారుల దురాగతాలకు వ్యతిరేకంగా ప్రజల్ని జాగృతపరచాలని నిర్ణయించుకున్నాడు.

రాజాజీ ప్రోద్బలంతో కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. సహాయనిరాకరణోద్యమంలో, మద్యపాన నిషేధ ఉద్యమంలో పాల్గొన్నాడు. కేరళలో దళితుల హక్కులకోసం పెద్ద ఎత్తున సాగిన వైకోం సత్యాగ్రహంలో, అంటరానితన నిర్మూలనోద్యమంలో పాల్గొన్నాడు. కానీ గాంధీ ఆదర్శాలలోని డొల్లతనాన్ని, కాంగ్రెస్‌లో అగ్రకుల ఆధిపత్యాన్ని గుర్తించి అందులోంచి అనతికాలంలోనే బయటికొచ్చాడు. 1929లో బ్రాహ్మణేతర వెనుకబడిన తరగతులవారితో స్వాభిమాన ఉద్యమాన్ని ప్రారంభించాడు. మతం పేరిట, దేవుడి పేరిట సాగుతున్న దోపిడీని నిర్మూలించేందుకు విశేషంగా కృషి చేశాడు. పుట్టుక, వివాహం, చావు వంటి సందర్భాలలో ఎలాంటి ఆచారాలను, కర్మకాండను నిర్వహించరాదనీ, అర్థంకాని సంస్కృత శ్లోకాల తంతుని కొనసాగించరాదని, జ్యోతిష్యం వంటి మూఢనమ్మకాలనుంచి బయటపడాలని ప్రచారం చేశాడు. అంటరానితన నిర్మూలనా కార్యక్రమంలో భాగంగా దళితులు ముస్లిం మతంలోకి మారడాన్ని ప్రోత్సహించాడు. జస్టిస్‌ పార్టీనుంచి బయటికొచ్చి 1944లో ద్రావిడార్‌ కజగన్‌ (డికె) పార్టీని స్థాపించాడు. తరువాత దానిలోంచే ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె), ఆల్‌ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఎఐడిఎంకె) పార్టీలు ఆవిర్భవించాయి.

ఈ పుస్తకం హిందీ, ఇంగ్లీష్‌ అనువాదాల్ని లోగడ ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం నిషేదించింది. ఉత్తర ప్రదేశ్‌ హైకోర్టు ఆ ఉత్తర్వులను కొట్టేస్తే ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ అప్పీలును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవలసిన కారణాలేమీ కన్పించడం లేదని తీర్పుచెప్పింది.

పెరియార్‌ నామా
-కె.వీరమణి, పెరియార్‌

తెలుగు అనువాదం : దెంచెనాల శ్రీనివాస్‌, ప్రభాకర్‌ మందార

ప్రథమ ముద్రణ సెప్టెంబర్‌ 1998
26 పేజీలు, వెల: రూ.7


........................

Sunday, April 19, 2009

మనసుతో రాసిన శరీరం కథ....రాజి, సాక్షి దినపత్రిక 19 ఏప్రిల్‌ 2009

“ వ్యభిచారం నైతికమా? కాదా? అన్న అంశాన్ని కాసేపు పక్కనపెట్టి,
ఈ పుస్తకం గురించి మాట్లాడాల్సి వుంటుంది.
అతి ప్రాచీన వృత్తిగా 'పేరుపడ్డ' ఈ బురదలోకి తెలిసో, తెలియకో దిగేవారు ఎందరో!
అ లాంటి ఎందరో మహిళల్లోంచి,
ఇదిగో నాకూ ఒక ఆత్మకథ వుంది,
ఓపిక చేసుకుని వినమంటూ ఎలుగెత్తింది
మలయాళీ సెక్స్‌ వర్కర్‌ నళినీ జమీలా..... …


ఇవాళ్టి సాక్షి దినపత్రికలో ''ఒక సెక్స్‌ వర్కర్‌ ఆత్మకథ''పై వచ్చిన పుస్తక సమీక్షను ఈ దిగువ లింకులో చదవండి.

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=25650&Categoryid=10&subcatid=42

ఈ పుస్తకంపై మీరూ స్పందించండి.

Friday, April 17, 2009

మనుగడ కోసం పోరాటం - ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసులు - హైమన్‌డాఫ్‌




భిన్న జాతుల సమాహారమైన భారత ఉపఖండంలో అనేక సముదాయాల మధ్య సమన్వయ సహజీవనం ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది.

ఈ సముదాయాల్లో స్వంత ఆస్తి, మేథోపరమైన ప్రగతుల్లో విపరీతమైన తారతమ్యాలు, వుడటం కూడా గమనించవచ్చు.

తిరుగుబాట్లు, సర్దుబాట్లు ఈ రెండూ కూడా ఈ తరహా రాజ్యాల పరిపాలనా పద్ధతుల్లోంచి పుట్టుకొచ్చిన లక్షణాలే.

ప్రాచీన జీవిత విధాన వారసత్వంగా నిన్నమొన్నటి దాకా ఉనికిలో వుంటూ వచ్చిన ఆదివాసీ సమాజాలపై, రాజకీయంగా శక్తివంతమైన, ఆర్థికంగా అభివృద్ధి చెందిన సమాజాలు విపరీతమైన ప్రభావాన్ని, ఆధిపత్యాన్ని చూపాయి.

ఫలితంగా ఆదివాసీ సామాజిక ఆర్థిక వ్యవస్థల్లో చోటుచేసుకున్న వివిధ మార్పులను చర్చించడానికే ఈ పుస్తకంలో ప్రయత్నించాను.

అయితే దాదాపు నాలుగు కోట్ల జనాభా వున్న భారతీయ ఆదివాసీ సముదాయాలలోని మొత్తం ఆదివాసీ జీవితం ఏ మేరకు భద్రమయ్యిందో అర్థం చేసుకోడానికీ అంచనా వేయడానికీ మూస సాధారణీకరణలు సరిపోవు. ఎందుకంటే - విభిన్న సముదాయాల వైవిధ్య సాంస్కృతిక జీవన విధానాలను సాధారణీకరించడం అసాధ్యమేకాదు, ఆచరణ సాధ్యం కూడా కాదు. ఈ కారణంగానే ఆదివాసీ జీవితాలనూ, వాటి సామాజిక పరిణామ క్రమాన్నీ ప్రభావితం చేసిన ప్రత్యేక సమస్యలను సూక్ష్మ్ర పరిశోధనల ఆధారంగా ఒక్కొక్కటిగా పరిశీలించే ప్రయత్నం చేశాను.

....

నా పరిశోధనల ఫలితంగా వెలువడిన మూడు సంకలనాల్లో ప్రస్తుత పుస్తకం చివరిది.
''ది గోండ్స్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ : ట్రెడిషన్‌ అండ్‌ ఛేంజ్‌ ఇన్‌ యాన్‌ ఇండియన్‌ ట్రైబ్స్‌
(1979: ఢిల్లీ, లండన్‌),
''ఎ హిమాలయన్‌ ట్రైబ్‌: ఫ్రం క్యాటిల్‌ టు క్యాష్‌'' (1980: ఢిల్లీ, బెర్కెలీ) అనేవి గతంలో వెలువడ్డాయి.
-హైమన్‌డాఫ్‌

....
... ''భారతదేశంలో ఆదివాసీ సంక్షేమ పథక రచయితలూ, సామాజిక శాస్త్రవేత్తలూ తప్పని సరిగా చదవవలసిన పుస్తకంయిది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని ఆదివాసీ జీవ యదార్థ చిత్రణ వుంది.''
- కంట్రిబ్యూషన్స్‌ టు ఇండియా సోషియాలజీ, న్యూఢిల్లీ.

...''ఆదివాసుల జీవితంలోని వెలుగు నీడలను హైమన్‌డాఫ్‌ పుస్తకం కన్నా వివరంగా మరేదీ ప్రస్తావించలేదనే చెప్పాలి. ఇలాంటి పుస్తకం శాస్త్ర ఔచిత్యాన్ని, ఔన్నత్యాన్ని గుర్తుచేయడమే కాదు మరింత పెంచుతుంది కూడా.''
- ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ముంబాయి.

....

ఈ పుస్తకంలోని అధ్యాయాలు:
1) ఆదివాసులు - ప్రభుత్వం
2) చేతులు మారుతున్న ఆదివాసీ నేల
3) ఆదివాసులు - అటవీ విధానం
4) అర్థికాభివృద్ధి
5) ఆదివాసీ విద్య - సమస్యలు
6) సామాజిక క్రమ పరిణామం
7) విశ్వాసాలు, ఆచారాల్లో మార్పులు
8) ఆదివాసులు - ఇతరులు

మనుగడ కోసం పోరాటం - ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసులు
క్రిస్టాఫ్‌ ఫాన్‌ ఫ్యూరర్‌ హైమన్‌డాఫ్‌


ఆంగ్లమూలం: Tribes of India: The Struggle for Survival, Christoph Von Furer-Haimendorf,
Published in Arrengement with The University of California Press Ltd. Copy right: 1982 by The Regents of The niversity of California.

తెలుగు అనువాదం: అనంత్‌

ప్రథమ ముద్రణ: జులై 2000

185 పేజీలు, వెల: రూ.50/-

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500028
ఫోన్‌: 040-2352 1849

ఇమెయిల్‌ :
hyderabadbooktrust@gmail.com

Tuesday, April 14, 2009

భారతదేశ చరిత్ర - నిన్న, నేడు, రేపు ... డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌



భారతదేశ చరిత్ర - నిన్న, నేడు, రేపు
- డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌


ఈ చిన్న పుస్తకంలో డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ భారతదేశ చరిత్రపై రాసిన పలు వ్యాసాలున్నాయి. ఇవి భారతదేశ చరిత్రను మొత్తంగా మన కళ్లముందుచుతాయి.

గతకాలం మొదలుకొని నేటి ఆధునిక కాలం వరకూ హిందువులు , బౌద్ధులు, ముస్లింలు, బ్రిటీష్‌ పాలకులకు సంబంధించిన అన్ని కోణాలను విశ్లేషిస్తాయి.

మనదేశ గత చరిత్రపై డాక్టర్‌ అంబేడ్కర్‌ వ్యాసాలు ఎంతో సూటిగా, సరళంగా వుంటాయి.
భారతదేశ చరిత్రలోని చీకటి కోణాలపై ఆయన రచనలు కొత్త వెలుగును ప్రసరిస్తాయి.
అంతేకాక ఆయన భారతదేశ భవిష్యతుతలోకి కూడా తొంగి చూసి ఈ దేశం మళ్లీ తన స్వాతంత్య్రాన్ని కోల్పోకుండా తీసుకోవలసిన చర్యలు, జాగ్రత్తలను కూడా సూచిస్తారు.
ఇది చరిత్రపై ఒక మంచి పుస్తకం.

ఇందులోని అధ్యాయాలు:

1. మధ్య ప్రాచ్య దేశాలతో భారతదేశ వాణిజ్య సంబంధాలు.
2. భారతదేశంలో బౌద్ధమత ఆవిర్భావం - పతనం.
3. భారతదేశ చరిత్ర - కొన్ని ముఖ్యాంశాలు.
4. బ్రిటీష్‌ పాలనలో భారతదేశం.
5. భారతదేశ భవ్యిత్తు.


భారతదేశ చరిత్ర - నిన్న, నేడు, రేపు
- డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌

ఆంగ్లమూలం: Commmercial Relations of India in the Middle East. - Dr.Bbasaheb Ambedkar, Writings and speeches, Vol.12, pp-30, Govt. of Maharashtra, Bomb` 1993
The Triumph of Brabminism: Regicide or the Birth of Counter-Revolution. op cit. 266, Vol.3.
Notes on History of India, Ps709-718, Vol.12, op cit, Bomb`y 1993 India on the eve of the crown Government, pp 53-72, Vol. 12, op cit Constituent Assembly Debates, 25 Nov. 1949, op.cit, Vol. 13, pp 1213.

తెలుగు అనువాదం: ప్రభాకర్‌ మందార


72 పేజీలు; వెల: రూ.20


ప్రతులకు వివరాలకు:
1) హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీనగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500067
ఫోన్‌: 040-2352 1849


2) సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌,
నెం.3-4-142/6, ఫస్ట్‌ ఫ్లోర్‌,
బర్కత్‌పుర, హైదరాబాద్‌ -500027
ఫోన్‌: 040-2344 9192

Monday, April 13, 2009

లక్ష్యానికి దూరమైన "పంచమం ".... విద్యాసాగర్ అంగుళకుర్తి



పంచమం నవలపై సాక్షి సమీక్ష

6 ఏప్రిల్ 2009 నాటి సాక్షి దినపత్రిక లో (నాల్గవ పేజీ) చిలుకూరి దేవపుత్ర " పంచమం " నవలపై విద్యాసాగర్ అంగుళకుర్తి సమీక్ష వెలువడింది. లోతైన విశ్లేషణతో కూడిన ఈ సమీక్ష కోసం ఈ కింది లింకు లోకి వెళ్లి 4 వ పేజీలో చూడండి:







http://epaper.sakshi.com/epapermain.aspx?queryed=1&eddate=4%2f6%2f2009&+edcode=1


పంచమం (నవల)
రచన: చిలుకూరి దేవపుత్ర
ముఖచిత్రం : రమణ జీవి
275 పేజీలు, వెల: రూ.100

ప్రతులకు వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడిమల్కా పూర్‌,
హైదరాబాద్‌- 500 067
ఫోన్‌ నెం. 040-2352 1849

Sunday, April 12, 2009

పాఠకులను తెలంగాణా పల్లెల్లోకి తీసుకెళ్ళే ఓ సాహితీ మిత్రుడి ఆత్మకథ

స్వేచ్చగా చిమ్మిన జలధార :

పస్తుతం ముద్రణలో వున్న దేవులపల్లి కృష్ణ మూర్తి ఆత్మ కథ " ఊరు వాడ బతుకు " పై ఆదివారం ఆంధ్ర జ్యోతిలో (12-4-2009) ప్రత్యేక కథనం వెలువడింది. ఈ పుస్తకానికి వరవర రావు ముందు మాట రాసారు. ఆంధ్ర జ్యోతి కథనాన్ని ఈ కింది లింకు లో చూడవచ్చు :

http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=2009/12-4/others4

ఒక సెక్స్ వర్కర్ సూటి ప్రశ్నలు ....

ఆంధ్ర జ్యోతి ఆదివారం 12 ఏప్రిల్ 2009 సంచికలో
నళినీ జమీల "ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ " పుస్తకం పై
అరుణ పప్పు గారి సమీక్ష కోసం ఈ కింది లింకు చూడండి :

http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=2009/12-4/newbooks

ఇదే సమీక్ష పుస్తకం డాట్ నెట్ లో కూడా చూడవచ్చు

http://pustakam.net/?p=772

Tuesday, April 7, 2009

ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ --- నళినీ జమీలా ....


ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ --- నళినీ జమీలా ....

"మాకు కావాల్సింది మీ దయా, దాక్షిణ్యాలు కాదు - మా స్తిత్వానికి గుర్తింపు. అయితే, జయశ్రీ లాంటి కొద్ది మంది తప్ప సాధారణంగా ఫెమినిస్టులు కూడా సెక్స్ వర్కర్లకు గుర్తిమ్పునివ్వటానికి ఇష్టపడటం లేదు. సెక్స్ అనేది కేవలం మగవాళ్ళ అవసరం మాత్రమేననీ, స్త్రీలకు దాని అవసరం లేదనీ అందరూ భావిస్తూ వుంటారు. చాలా మంది ఫెమినిస్టుల ఆలోచన కూడా ఇందుకు భిన్నంగా లేదు."

"సెక్స్ వర్క్ నా దినవారీ జీవితంలో మార్పులు తెచ్చింది. నా గత జీవితమంతా కష్టాలతో, వేదనతో గడచిపోయింది. కాస్త శుభ్రంగా తయారయ్యేందుకు కూడా సమయమ దొరికేది కాదు. సెక్స్ వర్కర్ గా జీవితం మొదలుపెట్టాక నా శరీరంపై శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరయింది. శుభ్రమైన, మంచి బట్టలు వేసుకోవరం నా మనసుకు ఆహ్లాదాన్నీ, ఆత్మస్తైర్యాన్నీ కలిగించింది. దీనివల్ల మగవాళ్ళు నన్ను చూసే దృష్టి లో మార్పు వచ్చింది. అంటే, వాళ్ళు నా క్లయింట్లుగా రావతమని కాదు నా వుద్దేశం - నా ఉనికిని గుర్తించి తీరాల్సిన అవసరం వాళ్లకు ఏర్పడుతోందని మాత్రమే."

"ఇళ్ళలో పాచిపని చేసే ఆడవాళ్ళ పరిస్థితి కూడా మెరుగ్గా లేదు. ఆ ఇళ్ళల్లో మగవాళ్ళు ఈ పని మనుషులను "నీచమైన" పనులు చెయ్యమని వత్తిడి చేస్తుంటారు. కప్పల్ని మింగటానికి పాముల్లాగా పొంచి వుండి, ఏమరుపాటుగా కనబడగానే గుటుక్కున మింగేస్తారు."

" పెళ్ళయితే జీవితానికి రక్షణ దొరుకుతుందన్న భరోసా కరువయింది. ఐతే క్లయింట్లు చేసే హింసకు బాధపడే వాళ్ళు కూడా ... భర్తల హింసను భరించటానికి అలవాటు పడ్డారంతే."

" సెక్స్ వర్కర్లుగా మేం నాలుగు రకాల అవస్థలను తప్పించుకున్నాం. మొగుడికి వండి వార్చటం , అతని మురికి గుడ్డలు వుతకటం, పిల్లల్ని పెంచుకునేదుకు అతని మీద ఆధారపడనక్కర్లేదు., అతని ఆస్తిపాస్తుల్లో వాతాలిమ్మని దేబిరించే అవసరమూ మాకు లేదు. "

" నా ఆత్మకథ రాసుకోవాలని ౨౦౦౧లొ నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయం వెనుక ఓ కథ వుంది ........."


ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ
- నళినీ జమీలా

ఆంగ్ల మూలం: The Autobiography of a Sex Worker. Westland Books Pvt.Ltd.Chennai - 2007, Originally Published in MALAYALAM by DC Books, Kottayam, Kerala- 686001

తెలుగు అనువాదం : కాత్యాయని

121 పెజీలు, వేల రూ. 50



ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడి మల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500028
ఫోన్‌: 040-2352 1849

ఇ మెయిల్‌:

hyderabadbooktrust@gmail.com

............................

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌