Friday, July 6, 2012

అపరాజితుడు ... రచన: బిభూతిభూషణ్‌ బందోపాధ్యాయ ... తెలుగు అనువాదం: కాత్యాయని ...

బిభూతిభూషణ్‌ బందోపాధ్యాయ ప్రసిద్ధ నవల ''పథేర్‌ పాంచాలి'' రెండో భాగమే ఈ 'అపరాజితో' (అపరాజితుడు). ఈ రెండు నవలలనూ కలపి 'పథేర్‌ పాంచాలి', 'అపూర్‌ సంసార్‌', 'అపరాజితో' అనే మూడు కళాఖండాలుగా మలిచాడు సత్యజిత్‌ రే.

ప్రపంచంపై ముసురుకుంటున్న యుద్ధ మేఘాలు, బెంగాల్‌ కరువు, ఛిన్నాభిన్నమవుతున్న గ్రామీణ వ్యవస్థ, బీటలు వారుతున్న భూస్వామ్య సమాజం, పర్యావరణ విధ్వంసం, పల్లెల నుండి పట్నాలకు వలసలు, తెగిపోతున్న మానవ సంబంధాలు - ఈ నేపథ్యంలో బతుకు పోరాటం సాగిస్తూ జీవన మార్మికతనూ, తాత్వికతనూ శోధించే వ్యక్తుల జీవిత చిత్రణ ఈ నవల.

బిభూతిభూషణుడి జీవన దృక్పథానికి అచ్చమైన ప్రతిబింబమే - అపూ. కష్టాలూ కన్నీళ్లూ ముసురుకుంటున్న చీకట్ల నడుమ నుండి ఒక చిరు దీపాన్ని చేతబట్టుకుని జీవిత సాఫల్యానికై నిరంతరాన్వేషణ సాగించడమే బిభూతి భూషణుడి తాత్వికత. అతడి రచనలన్నిటికీ అంతిమ సారాంశం ఇదే.

తాను కోల్పోయిన జీవితానందాన్ని కేవలం జ్ఞాపకాల వడపోతలకు కుదించకుండా కలకత్తా నగర కాలుష్యం నుండి నిశ్చిందిపురానికి, ఇచ్ఛామతీ నదీ తీరానికి తన కొడుకు కాజల్‌తో కలిసి పయనమవుతాడు అపూ. ప్రకృతిలోని నిరంతరత్వాన్నీ, జీవన కాంక్షనూ మానవ జీవితంలోనికి అనువదించుకునే అద్భుతమైన కళను కొత్తతరానికి అందించే ప్రక్రియను అపూ ఇలా ప్రారంభించాడు. అక్కడితో నవల పూర్తవుతుంది...
పాఠకుల ఆలోచనల వికాసం ప్రారంభమవుతుంది!

అన్ని మానవీయ విలువలనూ చిదిమివేసే కటిక పేదరికంలో, నిరాశలో సైతం అపూ తాను నిటారుగా నిలబడుతూ తన సాన్నిహిత్యంలోకి వచ్చిన వ్యక్తులకు భౌతికంగానో, ఆత్మికంగానో ఆసరాగా నిలిచేందుకు తపిస్తాడు. కాస్తంత వెసులుబాటు దొరికితే అడవితోనూ, ఆకాశంతోనూ మౌనంగా, ధ్యానంగా సంభాషిస్తాడు. దాదాపు ఎనభయ్యేళ్ల కిందటే ... పర్యావరణ విధ్వంసాన్ని చూసి బిభూతిభూషణుడు పడిన ఆందోళననూ, విడిపోతున్న మానవ హృదయాలను కలపటానికి ఆయన పడిన తపననూ ఈ రచన అపురూపంగా నమోదు చేసింది.

అన్ని మానవీయ స్పందనలూ ఎండిపోతున్న ఈవేళ ఈ అపరాజితుడితో సంభాషించడం ఒక అద్భుతమైన అవకాశం.
ఈ పుస్తకాన్ని సరళమైన తెలుగులోకి అనువదించిన కాత్యాయని తెలుగు పాఠకులకు సుపరిచితురాలు. పలు నవలలు, సాహిత్య పుస్తకాలు తెలుగులోకి అనువదించారు. ''చూపు'' పత్రికను నిర్వహించారు.

అపరాజితుడు
రచన: బిభూతిభూషణ్‌ బందోపాధ్యాయ
తెలుగు అనువాదం: కాత్యాయని
పేజీలు : 197, వెల : రూ. 100/-


ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849


హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పుస్తకాలను ఇప్పుడు మీరు " ఫ్లిప్ కార్ట్ " ద్వారా ఆర్డర్ చేసి నేరుగా ఇంటికే తెప్పించుకోవచ్చు. ఎలాంటి అదనపు రవాణా చార్జీలు లేకుండా!
వివరాలకు ... ఇక్కడ ... క్లిక్ చేయండి !

 


No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌