Thursday, July 26, 2012

అపరాజితుడితో ఓ ఆలింగనం ...

జీవించడమన్నది ఒక కళ. 
జీవన వ్యాపారంలో విజయం సాధించాలంటే ఈ కళను ఎరిగి ఉండడం అత్యవసరం’...  
బిభూతిభూషణ్ బందోపాధ్యాయ నవల అపరాజితుడు’ (బెంగాలీ మూలంఅపరాజితోకు అనువాదం కాత్యాయని) చివరి పేజీలలో కనిపించే పంక్తులివి. 

పథేర్ పాంచాలికి కొనసాగింపుగా వచ్చిన ఈ నవల జీవితంలోని మార్మికత, వైవిధ్యాలను ఆవిష్కరిస్తుంది. 

పట్టాల మీద పరుగెత్తే రైలును చూడ్డానికి రెల్లు పొదల మధ్య, వెలుగునీడల నడుమ తన అక్క దుర్గతో కలిసి అపూ (అపూర్వారాయ్) పరుగులు తీసే సన్నివేశం పథేర్ పాంచాలినవలలో చదివినా గానీ, అదే నవలను సినిమాగా మలిచిన సత్యజిత్‌రే సినిమాలో చూసినా గానీ మరపునకు రాదు. అపూ బాల్యం, తరువాత అతడు ఎదుర్కొన్న వాస్తవిక అనుభవం అనే రెండు పట్టాల మీద అపూ జీవనయానం సాగిపోతుంది ఈ నవలలో.

చిన్నతనంలో అక్కనీ, నిరుద్యోగంతో పోరాడుతూ కలకత్తా పురవీధులను కొలుస్తున్నపుడు తల్లి సర్వజయనీ కోల్పోతాడు. తను ప్రేమించిన వారు, తనని ప్రాణంలో ప్రాణంగా ప్రేమించిన వారు ఎక్కువ మంది అపూ కళ్ల ముందే చనిపోతారు. కాజల్(కొడుకు)ను కని చనిపోయిన తన భార్య అపర్ణ కూడా అందులో ఒకరు. ఆమె ఎంత అనూహ్యంగా తన జీవితంలో అడుగు పెట్టిందో అంతే అనూహ్యంగా నిష్ర్కమిస్తుంది. మనం ఎక్కడ చదువుకున్నా, పొట్ట చేత పట్టుకు ని ఎక్కడికి వెళ్లినా చివరికి తల్లి లాంటి సొంత పల్లె పట్టుకు చేరుకుంటే కలిగే సాంత్వన ఎలా ఉంటుందో రచయిత మన అనుభవానికి తెస్తాడు. ఇలాంటి జీవన సత్యాలు ఎన్నో ఇందులో!

జీవించే కళకు మనిషి దూరం కావడం మొదలైన దశలో వచ్చిన నవల ఇది. ఆ కళ గురించి రచయిత పడ్డ ఆరాటం గొప్పది. ఎంత దారిద్య్రంలో ఉన్నా, ఆ కళను ఉపాసించడానికి మనిషి తన వంతు కర్తవ్యం నిర్వహించాలన్నదీ, అందుకు పోరాడాలన్నదీ రచయిత ఉద్దేశంలా కనిపిస్తుంది. అందుకు దారిద్య్రం అడ్డం కాకపోవచ్చు. ఇందుకు ఆయన చూపించిన మార్గం, బహుశా చరిత్రలో నిరూపితమైన మార్గం-పఠనం. 

ఇక్కడ జ్ఞాన సముపార్జనకు, ఎదుగుదలకు అడ్డంగా నిలిచిన పాత విలువలను నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టడం కూడా తప్పుకాదన్నది రచయిత ఉద్దేశం. అపూర్వారాయ్‌కి చిన్నతనం నుంచి పుస్తకాలతో ఒక అనుబంధం కల్పించారు రచయిత. 
రవీంద్రనాథ్ టాగూర్, విక్టర్ హ్యూగో వంటి రచయితల పేర్లు అతడికి చిన్నతనంలోనే తెలుసు. జీవితం అనుభవాలతో నిండుతున్న కొద్దీ అతనిలో పెరుగుతున్న భావుకత తెచ్చుకున్న పరిణామం, పరిపూర్ణమవుతున్న భావాలనూ, స్థిరచిత్తాన్నీ రచయిత ఈ పాత్రను తీర్చి దిద్దే క్రమంలో అద్దిన తీరు సంభ్రమం కలిగిస్తుంది. మొత్తంగా ఒక తృష్ణతో జీవించే లక్షణాన్ని ఈ పాత్రలో పొందుపరిచారు బందోపాధ్యాయ. అదే అతనిని అలుపెరుగని పాంథుడిగా మార్చి, ఎక్కడెక్కడికో తిప్పుతుంది. రచయితగానూ తీర్చిదిద్దుతుంది.

దాదాపు ఆరు దశాబ్దాల క్రితం రూపొందిన అపూ పాత్ర ద్వారా నగరాల కాలుష్యం పట్ల ఏహ్యభావాన్ని వ్యక్తీకరించడం అద్భుతమే. 

 పస్తులున్న రోజులు, అవమానాలు పడ్డ ఘడియల నుంచి తను బయటపడి జీవితాన్ని కొనసాగిం చడానికి కారణం తన పల్లె పసితనంలో నోట్లో చిలకరిం చిన అమృతబిందువులేఅని మనసారా భావిస్తాడు అపూ. ఆ వారసత్వం కొనసాగాలనుకుంటాడు. తన పల్లెలో కొడుకు కాజల్‌ను వదిలిపెట్టి అపూ ఫిజీలో ఉపా ధ్యాయ ఉద్యోగానికి వెళ్లడం అందుకే. 
అంటే ఈ నవలలో ఒక్కొక్కతరం గుండా ప్రవహిస్తూ వచ్చిన అజరామర మైన జీవన మార్మికతను రచయిత అక్షరబద్ధం చేశారు.

అపరాజితుడు
బిభూతిభూషణ్ బందోపాధ్యాయ
హైదరాబాద్ బుక్ ట్రస్ట్  
పే.197, వెల రూ.100/-

సాక్షి దినపత్రిక (౨౩ ౭ ౨౦౧౨) సౌజన్యం తో ...

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌