Saturday, July 14, 2012

అంబేడ్కర్‌ చేయిపట్టుకుని ప్రకృతి సహజమైన గోండుల చిత్రకళా ప్రపంచంలో విహరిద్దాం రండి !


భీమాయణం ఒక సాదా సీదా గ్రాఫిక్‌ పుస్తకం కాదు.
కంప్యూటర్‌ మాయాజాలంతోనో, మూసపోసినట్టుండే ఆధునిక చిత్రలేఖనంతోనో రూపొందించింది అసలే కాదు. 
ప్రతి పేజీ ఆదివాసీ గోండు 'డిగ్న'లతో,  ప్రకృతిని ప్రతీకాత్మకంగా ప్రతిబింబించే బొమ్మలతో అ లంకరించబడ్డ ఒక అపూర్వ కళాఖండం.
పర్యావరణంతో గాఢంగా పెనవేసుకుపోయిన గోండు చిత్రకళతో ఒక పుస్తకం వెలువడటం మన దేశంలో ఇదే ప్రథమం.
ఇందులోని చిత్రాలను వేసింది పార్థాన్‌ గోండు చిత్రకారులైన దుర్గాబాయ్‌ వ్యాం, సుభాష్‌ వ్యాం దంపతులు.
ప్రస్తుతం భోపాల్‌లో నివసిస్తున్న వీరికి కూడా ఇదే తొలి పూర్తి స్థాయి గ్రాఫిక్‌ పుస్తకం.

దుర్గాబాయి వ్యాం ఆరేళ్ల వయసు నుంచే 'డిగ్న'లు వేస్తున్నారు.
పండగలప్పుడు, పెళ్ళిళ్లప్పుడు రకరకాల రంగురంగుల మట్టిని ఉపయోగించి ఆదివాసీలు తమ ఇంటి గోడలపై వేసుకునే బొమ్మలనూ, డిజైన్లనే 'డిగ్న'లు అంటారు.
దుర్గాబాయి చాలా పిల్లల పుస్తకాలకు ముఖచిత్రాలు వేశారు.
ది' నైట్‌ లైట్‌ ఆఫ్‌ ట్రీస్‌ ' అనే పుస్తకానికి 2008లో 'బలోజ్ఞ రాగిజ్ఞ ప్రైజ్‌' అందుకున్నారు.
గోండు దేవుళ్ల దగ్గర నుంచి భోపాల్‌ గ్యాస్‌ విపత్తు వరకూ రకరకాల ఇతివృత్తాల మీద బొమ్మలు వేశారు.
ఈ పుస్తకానికి పనిచేస్తున్నప్పుడు ఒకసారి ఆమె రచయిత ఆనంద్‌తో యదాలాపంగా 'ఇదేదో పెద్ద రామాయణంలా వుందే' అన్నారు.
ఆమె మాటలే ఈ పుస్తకానికి 'భీమయణం' అని పేరుపెట్టడానికి స్ఫూర్తినిచ్చాయి.


సుభాష్‌ వ్యాం కూడా పదేళ్ల వయసునుంచే మట్టి బొమ్మలు తయారుచేయడం మొదలుపెట్టారు.
చెక్కలతో శిల్పాలు చెక్కడంలో ఎంతో ప్రావీణ్యం సంపాదించారు.
అయితే వాటిని కొనేవారు లేకపోవడంతో దానిని వదిలేసి
బట్టల మీదా కాగితాల మీదా బొమ్మలు వేయడం ప్రారంభించారు.
ఈ దంపతులిద్దరూ పెద్దగా చదువుకోకపోయినా తమ చిన్న ఇంట్లోనే
ఎంతో మంది గోండు చిత్రకారులను విజువల్‌ ఆర్టిస్టులుగా తీర్చిదిద్దుతూ ఆదివాసీ చిత్రకళకు తమవంతు సేవ చేస్తున్నారు.

పార్థాన్‌ గోండుల చిత్రకళ పర్యావరణంతో ఎంత గాఢంగా పెనవేసుకుందంటే ... పట్టణ జీవితం గురించిన సందర్భాల్లో కూడా సువిశాల దృశ్యాలూ, వాటిలో జంతువులూ, పక్షులూ, చెట్ల వంటివి ఎంతో సహజంగా వచ్చి చేరతాయి.
రైలు - పాము అవుతుంది...
దర్పం ఉట్టి పడే కోట - సింహం అవుతుంది...
దప్పిక గొన్న బాల అంబేడ్కర్‌ - చేపలా మారిపోతాడు...
సొంతగా నుయ్యి తవ్వుకుంటున్నందుకు ఓ దళితుడు హత్యకు గురైన సంఘటనను వివరించేటప్పుడు - మట్టి తవ్వే యంత్రమే కన్నీళ్లు రాలుస్తుంది...
బరోడాలో తలదాచుకునే చోటు దొరక్క కామతి పార్కులో కూర్చుని, తన దుస్థితి గురించి ఆలోచిస్తున్న అంబేడ్కర్‌ - ఏకంగా తనే పార్కుగా మారిపోతాడు....
అంబేడ్కర్‌ దేశదేశాలు తిరిగొచ్చినా చివరికి స్వదేశంలో ఎక్కడివాడక్కడే ఉన్నాడని చెప్పేందుకు ప్రతీకాత్మకంగా 'గానుగెద్దు' బొమ్మను వేశారు.

ఇలా చూసిన ప్రతిసారీ ఈ పుస్తకంలోని ప్రతి పేజీలోనూ మీకు కొత్త కొత్త అంశాలూ, కొత్త కొత్త అర్థాలూ, సరికొత్త ఆనందాలూ దొరుకుతుంటాయి;
అవి చూడటమెలగో కూడా నేర్పుతుంటాయి.
బొమ్మకూ బొమ్మకూ మధ్య వుండే ఖాళీని కూడా వీరు ఎంతో సృజనాత్మకంగా ఉపయోగించుకున్నారు.
ఆధునిక చిత్రకళలో మున్నెన్నడూ చూడని అద్భుత ప్రయోగమిది.


అగ్రవర్ణంలో పుట్టిన గాంధీకి దక్షిణాఫ్రికా వెళ్లాక గానీ 'జాతి వివక్ష' ఎలా వుంటుందో తెలిసిరాలేదు.
అంటరానికులంలో పుట్టిన అంబేడ్కర్‌కు విదేశాలకు వెళ్లాక గానీ 'సామాజిక సమానత్వం' ఎలా వుంటుందో అనుభవంలోకిరాలేదు.
జాతి వివక్షపై పోరాడి విజయం సాధించిన గాంధీకి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది.
విదేశాల నుంచి తిరిగి వచ్చాక అంబేడ్కర్‌కు అడుగడుగునా అంటరానితనం ఎప్పటిలాగే అడ్డంకులు సృష్టించింది.
అస్పృశ్యుడైనందువల్లనే అంబేడ్కర్‌ చరిత్ర తగిన స్థానం కల్పించలేదు.
ఆ లోపాన్ని పట్టి చూపేందుకు, అంబేడ్కర్‌ కథను సార్వజనీనం చేసి, ప్రపంచానికి తెలియజెప్పేందుకు చేసిన చిన్న ప్రయత్నమే ఈ 'భీమాయణం'.

ఇప్పటికే ఈ పుస్తకం ఇంగ్లీషు నుంచి హిందీ, మరాఠీ, తమిళం, మలయాళం, కన్నడ, ఫ్రెంచి, స్పానిష్‌, కొరియన్‌ భాషల్లోకి అనువాదమయింది. ఇంకా అనేక భాషల్లో అనువాదమవుతోంది.

ఈ పుస్తకంపై కొన్ని సమీక్షలు:

సంప్రదాయిక కళాకారుల కళామాధ్యమాన్ని ఎంత వినూత్నంగా మలుస్తారో, దానిని ఎలా పునరుత్తేజపరుస్తారో కళ్లకు కడుతుందీ భీమాయణం. న్యాయం కోసం అంబేడ్కర్‌ చేసిన అభ్యర్థనను మనోజ్ఞంగా, మనసుకు హత్తుకునే డాక్యుమెంటరీ లాగా మరోసారి ఇందులో ఆస్వాదించవచ్చు.
- పాల్‌ గ్రావెట్‌,
 టైమ్స్‌ లిటరరీ సప్లిమెంట్‌


భారతీయ సమాజంలో, హిందూ కుల వ్యవస్థలో వున్న ఏహ్యమైన, అత్యంత కిరాతకమైన లక్షణాలను భీమాయణం అద్భుతంగా, సులభశైలిలో, అక్కడక్కడా వినోదాన్ని మేళవించి చిత్రించింది. సాధారణమైన బొమ్మలు, సూటిగా వుండే సందేవాలు అసంకల్పితంగానే మీ చేత కంటతడి పెట్టిస్తాయి. మీకు కోపం తెప్పిస్తాయి. సంతోషపరుస్తాయి. ఆహ్లాదం కలిగిస్తాయి.. ఇందులోని పేజీలన్నీ పక్షులూ, జంతువులూ, పాములూ, చేపలతో నిండి వున్నాయి. కచ్చితంగా చెప్పాలంటే కథ ఒక పేజీ నుంచి మరో పేజీకి ఒక నీటి ప్రవాహంలా సాగిపోతుంది.
-క్రేర్‌ డోయెల్‌,
సోషలిస్ట్‌ వరల్డ్‌
(కమిటీ ఫర్‌ వర్కర్స్‌ ఇంటర్నేషనల్‌ మంత్లీ)


కుల వివక్షపై వచ్చిన అద్భుత సచిత్ర పుస్తకం. ఇందులోని బొమ్మలూ, పేజీల లేఅవుట్లూ విస్మయానికి గురిచేస్తాయి. పరిపూర్ణంగా అర్థం చేసుకునేందుకు... చూసిన చిత్రాన్నే మళ్లీ మళ్లీ చూసేలా చేస్తాయి.
- జై అర్జున్‌ సింగ్‌,
సండే గార్డియన్‌


అప్పుడే అందిన కవర్‌లోంచి భీమాయణం పుస్తకాన్ని బయటకు తీయగానే దాని రూపం నన్ను మంత్రముగ్ధుణ్ని చేసింది. మూడేళ్లయినా నిండని మా పాపను కూడా ఈ పుస్తకం ఎంతగానో ఆకర్షించింది. స్వతంత్ర భారతదేశపు అత్యంత విషాదకరమైన అంశం గురించి పిల్లల్నీ ఆలోచింపజేయడంలో, ప్రశ్నించేలా, ప్రతిస్పందించేలా చేయడంలో భీమాయణం విజయవంతమయిందంటే అందుకు కారణం అంబేడ్కర్‌ కథతోపాటు అంతే ప్రాధాన్యతతో చరిత్ర అట్టడుగు పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చిత్రించడమే. మనసును పట్టి కుదిపే ఒక అసాధారణమైన నాయకుడి ఈ ఆత్మకథను మన దేశంలోని పిల్లలూ పెద్దలూ ప్రతి ఒక్కరూ చదవాలి. దీనిని మన పాఠశాలల్లో తప్పనిసరిగా పాఠ్యాంశంగా చేర్చాలి.
- సౌమ్య శివకుమార్‌,
ది హిందూ


చిత్రకారులు దుర్గాబాయి వ్యాం, సుభాష్‌ వ్యాం పాశ్చాత్య  శైలినీ, జపాన్‌ తరహా 'మాంగా' కామిక్‌ పుస్తకాల సూత్రాలనన్నింటినీ ధైర్యంగా ధిక్కరించి తమదైన పార్థాన్‌ గోండ్‌ వారసత్వ సంప్రదాయ శైలిని అద్భుతంగా చిత్రించారు.
ఓ 'అస్పృశ్యుడు' గాంధీని సైద్ధాంతికంగా, సమర్థంగా ఎదుర్కొన్నవాడు, భారతదేశపు అతిగొప్ప, ధీరోదాత్తమైన నేతల్లో ఒకరైన అంబేడ్కర్‌ జీవిత చరిత్రను గ్రాఫిక్‌ శైలిలో పూర్తి విభిన్నంగా తీర్చిదిద్దేందుకు వ్యాంల గోండు కళ చక్కగా అక్కరకొచ్చింది. అడుగడుగునా ప్రతీకలు, కళా విన్యాసాలతో 'భీమాయణం' సంప్రదాయ శైలీ నియమాలన్నింటినీ సవాల్‌ చేస్తూ అసలు అంబేడ్కర్‌ ఎవరో, కుల వ్యవస్థ గురించి ఆయన వ్యక్తం చేసిన విప్లవాత్మక భావాలకు నేటికీ ఎందుకంత ప్రాధాన్యం ఉందో బలంగా తెలియజెపుతోంది.
- జో శాక్కో
('పాలస్తీనా' పుస్తక రచయిత)

భారతదేశపు అతి ముఖ్య మేధావుల్లో ఒకరైన అంబేడ్కర్‌ జీవిత కథ... దశాబ్దాలుగా పనిగట్టుకునే మరుగుపరచబడుతోంది.
దాన్నిప్పుడీ  'భీమాయణం' ఎంతో అసాధారణమైన అందంతో మన ముందుకు తెస్తోంది. దీన్ని మరచిపోవడం అసాధ్యం.
అరుంధతీ రాయ్‌
(గాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ థింగ్స్‌' రచయిత్రి)


భీమాయణం
అంటరానితనం అనుభవాలు
భీమ్‌రావ్‌ రామ్‌జీ అంబేడ్కర్‌ నిజ జీవిత సంఘటనలు

కథనం: శ్రీవిద్య నటరాజన్‌, ఎస్‌. ఆనంద్‌
చిత్రలేఖనం: దుర్గాబాయి వ్యాం, సుభాష్‌ వ్యాం

ఆంగ్ల మూలం: Bhimayana: Experiences of Untouchablity by Navayana Publishing in 2011.
తెలుగు అనువాదం: డి. వసంత


1/4 డెమీ సైజులో పంచవన్నెల చిత్రాలతో 107 పేజీలు, వెల: కేవలం రూ.200/- మాత్రమే.

ప్రచురణకర్తలు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
నవయాన్‌








No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌