Wednesday, September 30, 2015

బాలగోపాల్‌ సైన్స్ వ్యాసాలు


బాలగోపాల్‌
 సైన్స్ వ్యాసాలు

'వాడు లెక్కల మనిషిరా.
లెక్క ప్రకారమే నడుచుకుంటాడు' అని ఒకసారి కాళోజీ అన్నారు బాలగోపాల్‌ గురించి.

లెక్కల్లో బాలగోపాల్‌ చేసిన పి.హెచ్‌.డి. గుర్తుండడం వల్లే ఆయన బహుశా అలా అని ఉంటారు.

అయితే ఎన్నో విషయాల మీద వందలాది వ్యాసాలు రాసిన బాలగోపాల్‌ ఎందుచేతో తను చదువుకున్న గణితం మీద (ఇంగ్లీషులో అకడమిక్‌ వ్యాసాలు ఎన్నో రాసినప్పటికీ) మాత్రం తెలుగులో దాదాపుగా ఏమీ రాయలేదు. ఒకే ఒక చిన్న వ్యాసం, అదీ పుస్తక సమీక్షగా మాత్రమే రాశారు.

అలాగే  సైన్స్  గురించి రాసింది కూడా తక్కువే. మూడే వ్యాసాలు. అందులో ఒకటి ఉపన్యాసం, ఒకటి సమీక్ష, ఒకటి కొ.కు.  సైన్స్  వ్యాసాల పుస్తకానికి రాసిన ముందుమాట. అన్నీ కలిపి 30 పేజీలకు మించని నాలుగే వ్యాసాలైనా వాటిలోనే బాలగోపాల్‌ అనేక చర్చించదగ్గ ఆలోచనాత్మక విషయాలను చెప్పారు.
ముఖ్యంగా -
మన దేశంలో వైజ్ఞానిక శాస్త్రం పురోగమించకపోవడానికి వర్ణ వ్యవస్థ ఎలా ఆటంకమైందో పలు ఉదాహరణలతో వివరించారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే - 'మన దేశ 'ఆధునిక' వైజ్ఞానిక సంప్రదాయం మధ్యయుగాల బ్రాహ్మణ సంప్రదాయానికి కొనసాగింపు మాత్రమే' నన్నారు. 'సైంటిస్టులలో అధిక శాతం కులంరీత్యానూ, ఆలోచనల్లోనూ బ్రాహ్మణులు కాగా, కులంరీత్యా బ్రాహ్మణులు కానివారు కూడా ఆలోచనలలో బ్రాహ్మణులే' నన్నారు. 'విజ్ఞానానికి భౌతిక పునాది వుందనీ, ఆ విజ్ఞానాన్ని మానవులు సామాజిక ఆచరణలో భాగంగా సంపాదించుకున్నారనీ బ్రాహ్మణ సంప్రదాయం ఒప్పుకోదు' అన్నారు.

 సైన్స్ ను కూడా ఒక భావజాలంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని చెపుతూ  'దీని ప్రభావం తమను తాము సామ్రాజ్యవాద వ్యతిరేక అభ్యుదయవాదులుగా భావించుకునే వారి మీద కూడా బలంగా ఉంద'ని ఎత్తి చూపారు. ' సైన్స్ ను ఇటు వంటి వ్యక్తులు కూడా సామాజిక ఆచరణకూ, వర్గ ప్రయోజనాలకూ అతీతమైన పరమ సత్యంగా - తెలిసో తెలియకో - భావించబట్టే అణు విద్యుత్‌ కేంద్రాలు మానవ మనుగడకు ప్రమాదం అని తెలిసినా వ్యతిరేకించడానికి భయపడతార'ని అన్నారు. ' సైన్స్  అనే దాని గర్భంలో వున్న నిజమైన  సైన్స్ ను వెతికి పట్టుకోవడానికి... బ్రాహ్మణ భావజాలంతోనూ తలపడాలి, సామ్రాజ్యవాదపు 'సైన్స్‌' అనే భావజాలం తోనూ తలపడాలి' అని సూచించారు.



బాలగోపాల్‌
సైన్స్ వ్యాసాలు

ధర : రూ. 25/- 
తొలి ముద్రణ:సెప్టెంబర్‌ 2015

ప్రతులకు, వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006.

ఫోన్‌ : 23521849
Email ID: hyderabadbooktrust@gmail.com

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌