తన జీవితంలో ప్రతి సంఘటనను గుర్తుచేస్తూ రాసిన ''నిర్జన వారధి'' పుస్తకానికి ఎంతో ఆదరణ లభించిదనీ, ఇప్పటికే రెండు సార్లు ముద్రితమై మూడో ముద్రణ త్వరలో విడుదల కాబోతున్నదనీ పీపుల్స్‌వార్ అగ్రనేత కొండపల్లి సీతారామయ్య సతీమణి కొండపల్లి కోటేశ్వరమ్మ చెప్పారు.
విశాఖ నగరానికి చెందిన 'రైటర్స్ అకాడమీ', 'మహిళా చేతన' సంయుక్తంగా ఆదివారం పౌర గ్రంథాలయంలో ''నిర్జన వారధి'' పుస్తక పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా కోటేశ్వరమ్మకు ఆత్మీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
నిర్జన వారధిపై ఆమె మాట్లాడుతూ, దీనిని ఆంగ్లంలోకి అనువదించడానికి కొంతమంది ముందుకొస్తున్నారని తెలిపారు. జీవితంలో అన్నీ పోగొట్టుకుని ఒంటరిగా ఉన్న సమయంలో ఆప్తమిత్రులు మహీధర రామ్మోహనరావు, పరకాల ప్రభాకర్, మానికొండ తదితరులు ఆత్మకథ రాయడానికి ప్రోత్సహించారని గుర్తుచేశారు.
కవియిత్రి విమల మాట్లాడుతూ అరుణ పతాకంపై కోటేశ్వరమ్మకు అచంచలమైన విశ్వాసం ఉందని చెప్పడానికి అనేక సంఘటనలు కళ్లకు కట్టినట్టు రాశారని కొనియాడారు. రచయిత్రి మల్లీశ్వరి మాట్లాడుతూ, నిర్జనవారధి పుస్తకం కోటేశ్వరమ్మ ఆత్మకథ కాదనీ, ఒక చారిత్రక గ్రంథమనీ పేర్కొన్నారు. 'మిత్రసాహితి' వర్మ మాట్లాడుతూ సాధారణంగా వచ్చిన ఆత్మకథలకు భిన్నంగా కోటేశ్వరమ్మ రాసిన 'నిర్జనవారధి' ఉందని అభిప్రాయపడ్డారు.
(ఆంధ్రజ్యోతి, 19-11-2012 సౌజన్యంతో)
No comments:
Post a Comment