నా మహాభారత రచన ( మంత్ర కవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే - హెచ్ బి టి ప్రచురణ) గురించి ఫేస్ బుక్ లైవ్ లో నేను చేసిన ప్రసంగం సారాంశం:
- కల్లూరి భాస్కరం
భారతంపైన నేను వెలువరించిన పుస్తకంపై, విశాఖపట్నంలోని సాహిత్య సురభి నిర్వాహకుల ఆహ్వానంపైన ఆగస్టు29, శనివారంనాడు ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడాను.
అధ్యయనం గురించి పుస్తకంలో కానీ, మరెక్కడ కానీ పొందుపరచని విషయాలను మొదటిసారి అందులోస్పృశించాను. ఆసక్తి ఉన్నప్పటికీ గంటంబావు సేపు సాగిన ఆ ప్రసంగం వినే అవకాశం దొరకనివారి కోసం, ప్రసంగక్రమంలోఎక్కడైనా స్పష్టత లోపిస్తే రాతలో స్పష్టత తేవడం కోసం ప్రసంగ అంశాలను క్లుప్తంగా ఇక్కడ పొందుపరుస్తున్నాను.
1. మహాభారత స్వభావం గురించీ, తన కవిత్వస్వభావం గురించీ నన్నయ చెప్పిన రెండు పద్యాలు సాంప్రదాయికంగావస్తున్న పాఠ్య సంప్రదాయాన్ని స్థూలంగా సూచిస్తాయి.
వి:
1. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రమనియు...2, సారమతిం కవీంద్రులు...!
మొదటి పద్యం ప్రకారం మహాభారతాన్ని ధర్మతత్వం, వేదాంతం, నీతి, కావ్యం, లాక్షణికం, ఇతిహాసం, పురాణం- అనేకోణాలనుంచి చూడవచ్చు.
ఇతిహాసం అనడం ద్వారా మహాభారతాన్ని చరిత్రగా కూడా చూసే వెసులుబాటు కలిగింది కానీ, ఇప్పుడు చరిత్ర అనేమాటకు, ఇతిహాసం అనే ఆ మాట ముమ్మూర్తులా సరిపోయేది కాదు.
‘సారమతిం’ అనే రెండో పద్యంలో...కవీంద్రులు తన ప్రసన్నకథా కలితార్థయుక్తిని లోతుగా చూసి మెచ్చుకుంటారనీ, ఇతరులు తన అక్షర రమ్యతను ఆదరిస్తారని నన్నయ చెప్పుకుంటూ, నానా రుచిరార్థసూక్తినిధి నైన తాను జగత్తుకుహితం కలగడం కోసం తెలుగులో మహాభారత సంహితా రచనకు పూనుకున్నానని చెబుతాడు.
2. ఈ పాఠ్య సంప్రదాయం ప్రకారం ఏ రచననైనా ‘మూసిన పుస్తకం’గా చూడవలసి ఉంటుంది. దాని మీద ఎలాంటిపరిశీలన జరిగినా, విమర్శ జరిగినా దాని ఆద్యంతాల హద్దుల్లోనే...అంటే, ఇతివృత్తనిర్వహణ, రసం, అలంకారం, శైలి, శిల్పం వగైరా రచనాసామగ్రి హద్దుల్లోనే చూడవలసి ఉంటుంది.
ఆవిధంగా ఒక రచన వెలువడగానే దానికి తనదైన ఒక స్వతంత్ర అస్తిత్వం వచ్చేస్తుంది. మొదట్లో రచనలన్నీ ఇతిహాస, పురాణ సంబంధమైనవి కనుక ఇతరేతర విమర్శల జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడడం కోసమే ఇలాంటి పాఠ్యసంప్రదాయం రూపొంది ఉండవచ్చు.
3. అయితే దీనికి అసలు మినహాయింపులు లేవని కాదు. శ్రీకృష్ణ భారతం పేరుతో మహాభారతాన్ని పద్యరూపంలోరచించిన శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు తన వజ్రాయుధం పత్రికలో భీష్ముడిపైనా, చివరికి వ్యాసుడిపైనా, రాముడిపైనాకూడా ఎలా ప్రతికూల విమర్శలు చేశారో మహాభారతచరిత్రము రాసిన పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రిగారు ఎత్తిచూపారు.
ఆరోజుల్లోనే కోటమర్తి చినరఘుపతిరావుగారు సుయోధనపక్షం వహిస్తూ ‘సుయొధనవిజయము’ అనే రచన చేశారు. వఝల చినసీతారామస్వామిశాస్త్రిగారు ‘కర్ణచరిత్రము’ రాశారు.
ఆ తర్వాత ఇలాంటి ప్రతికూల రచనలు వచ్చినప్పటికీ పండితవర్గం వాటిని ఆమోదించలేదు. వారినుంచిఅలాంటివాటిపై అప్రకటితనిషేధం అమలు జరుగుతూ వచ్చింది. ఇప్పటికీ అదే జరుగుతోంది. ఈ పరిణామాన్ని నాపుస్తకంలో మరింత వివరంగా చర్చించాను. నేను పరిశీలించిన ఒక మహాభారత ప్రతిలో సందేహాలకు, వివరణకు చోటుఉన్న చోట కూడా అందుకు పూనుకోకుండా పండితులు కేవలం అలంకారం వంటి కావ్యసామగ్రి ప్రస్తావనకు ఎలాపరిమితమయ్యారో నా పుస్తకంలో రాశాను.
4. నా ప్రతిపాదన ఏమిటంటే, ఏ రచన అయినా శూన్యంలో పుట్టదు, శూన్యంలో వ్రేలాడదు. దానికి గతంతో ఒక లింకుఉంటుంది. భవిష్యత్తుతో ఇంకొక లింకు ఉంటుంది. ఆవిధంగా అది కాలంలో నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. (1999లోనేను రాసిన ‘రచననీ, కాలాన్నీ వేరు చేయగలమా?’ అనే వ్యాసంలో దాదాపు ఇదే అంశాన్ని చర్చించాను. ‘కాలికస్పృహ, మరికొన్ని సాహిత్యవ్యాసాలు’ అనే నా వ్యాససంపుటి (2006)లో ఆ వ్యాసం ఉంది)
అలాగే మహాభారతానికి కూడా ఒక గతమూ, ఒక భవిష్యత్తూ ఉన్నాయి. అది గతాన్ని మోసుకొస్తూనే భవిష్యత్తులోకిప్రవహించింది. చారిత్రకంగా చెబితే, మహాభారతానికి సమీపగతం ఋగ్వేదకాలం.
ఇందులో మహాభారతంలోని కొన్ని కథల తాలూకు బీజాలు ఉన్నాయి. వాటిలో ప్రసిద్ధమైనది గరుత్మంతునిఅమృతాపహరణం. అలాగే ఋగ్వేదంలో నిషాదులనబడే ఆదివాసుల ప్రస్తావన కూడా చాలా చోట్ల వస్తుంది. మహాభారతంలో, అమృతం తేవడానికి బయలుదేరిన గరుత్మంతుడు అందుకు అవసరమైన బలం కోసం తను ఏంతినాలని తల్లి వినతను అడిగినప్పుడు జనానికి ఇబ్బంది కలిగిస్తున్న నిషాదగణాలను తినేయమంటుంది. ఇలాంటిఆదివాసీ, ఆదివాసేతర సంబంధాలను, ఘర్షణలను నా పుస్తకంలో పలుచోట్ల చర్చించాను.
రామాయణమూలాలు కూడా ఋగ్వేదంలో కనిపిస్తాయి. ఇంద్రుడు ఋగ్వేద రాముడైతే, రాముడు రామాయణఇంద్రుడు. ఇద్దరూ చేసిన ప్రధాన కార్యాలలో ఒకటి రాక్షస సంహారం, యజ్ఞరక్షణ.
5. మహాభారతానికి భవిష్యత్తుతో కూడా ఒక లింకు ఉందని చెప్పాను. ఆ లింకు ఏ రూపంలో ఉందో, మనం ఇప్పటికీమహాభారత సమాజంలోనే ఎలా ఉన్నామో నా పుస్తకంలో విస్తృతంగా చర్చించాను. ఇలా మహాభారతానికి గతంతోనూ, భవిష్యత్తుతోనూ ఉన్న లింకులను పోల్చుకునే ప్రయత్నంలో మూసిన పుస్తకంగా ఉన్న ఆ రచనను తెరచిన పుస్తకంచేశాను. అంటే, మహాభారతానికి సంప్రదాయవిమర్శ కల్పించిన హద్దులను దాటి వెళ్ళాను. అలా వెళ్ళిన కొద్దీమహాభారతం హద్దులు విస్తరిస్తూ పోయాయి. దాంతో మహాభారతరంగస్థలి మరింత విశాలం అయింది.
6. మహాభారతం ఒక భిన్నదశకు చెందిన రచన, కనీసం ఆ దశకు దగ్గరగా ఉన్న రచన. దేశాల పేరుతో, రాజ్యాల పేరుతో, సంస్కృతుల పేరుతో, మతాల పేరుతో నిర్దిష్టమైన సరిహద్దులు లేని దశ అది. మనుషుల మధ్య, సంస్కృతుల మధ్య, సాహిత్యాల మధ్య, పురాణ కథల మధ్య, నమ్మకాల మధ్య స్వేచ్ఛగా ఆదానప్రదానాలు జరిగాయి. స్వ, పర భేదాలులేకుండా అందరూ అందరి దేవుళ్ళకూ మొక్కుకున్నారు. పర్షియన్ చక్రవర్తి డరియస్ గ్రీస్ మీదికి యుద్ధానికి వెడుతూట్రాయ్ లో ఒకరోజు ఆగి ట్రోజన్ దేవతకు వెయ్యి వృషభాలను బలి ఇచ్చినట్టు హెరాడటస్ రాస్తాడు(వెయ్యి అనడంలో కొంతఅతిశయోక్తి ఉండవచ్చు). జూలియస్ సీజర్ తన బద్ధ శత్రువైన పాంపేను వెంటాడుతూ ట్రాయ్ మీదుగా వెళ్లినప్పుడుఅక్కడి ప్రేతాత్మాల గురించిన కథలు విని భయంతో వణికిపోయి స్థానిక దేవతలకు మొక్కుకుంటాడు.
ఇలాంటివి మూఢనమ్మకాలుగా ఇప్పుడు కనిపించవచ్చు, నిజమే. కానీ తన, పర అనే సరిహద్దులు ఎరుగని నమ్మకాలుఅవి. పాస్ పోర్టులు, వీసాల అవసరం లేకుండా మనుషులు ఒక చోటినుంచి ఇంకొక చోటికి స్వేచ్ఛగా ప్రవహించేవారు. భౌగోళికమైన గుర్తింపుల తేడాల కన్నా; గణాలు, తెగల వంటి గుర్తింపుల తేడాలు మాత్రమే ఉండేవి. ఆ మేరకు స్వ, పరభేదం ఉన్నా స్థానిక వనరులపై ఆధిపత్యం కోసమే ఘర్షణలు జరిగేవి. మనిషికి సంచారం అనేది రెండో ప్రకృతిగా ఉన్న దశఅది. జలసేచనపై ఆధారపడిన వ్యవసాయం పుంజుకున్న తర్వాతే మనిషి స్థిరజీవనానికి అలవాటు పడ్డాడు. సంచార, స్థిరజీవనుల మధ్య ఘర్షణలు జరిగినా క్రమంగా ఒకరిపై ఒకరు ఆధారపడవలసిరావడంతో వారి మధ్య సయోధ్య, ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఏర్పడ్డాయి. భూమితో బతుకు బందీ కాని చేతివృత్తుల వారూ, భూమిలేని ఇతరులూ, బ్రాహ్మణులూ నేటికీ ప్రధానంగా సంచారజీవులుగానే ఉన్నారు.
ఇలాంటి సరిహద్దులు ఎరుగని గతం మహాభారతంలోకి ఎలా ప్రవహించిందో యయాతి-దేవయాని-శర్మిష్ఠల త్రికోణ కథద్వారా, నల దమయంతుల కథ ద్వారా; భారతీయ, భారతీయేతర పురాణ, ఇతిహాస కథలలోని సామ్యాల ద్వారా, ఆచారాలు, ఆనవాయితీల మధ్య పోలికల ద్వారా నా పుస్తకంలో చర్చించాను. ఇవే కాకుండా ఒకనాటి గణవ్యవస్థ, మాతృస్వామ్య, పితృస్వామ్య వ్యవస్థల గురించి; సరిహద్దులు ఎరుగని దశలో అవి దాదాపు ప్రపంచవ్యాప్తం అవడంగురించి నా పుస్తకంలో విస్తారంగా చర్చించాను. సంప్రదాయం విధించిన హద్దులను దాటి వెళ్ళడం వల్లనే, అంటే, మూసిన పుస్తకాన్ని తెరచిన పుస్తకం చేయడం వల్లనే ఇది సాధ్యమైంది. అంతేకాకుండా, ఇందువల్ల మహాభారతాన్నికనీసం మరో అయిదారు కోణాల నుంచి పరిశీలించే వెసులుబాటు కలిగింది. మరికొన్ని కోణాలు రాబోయే నా పుస్తకంరెండవ సంపుటంలో భాగం అవుతాయి.
7. ఇంకోవైపు మహాభారతానికి భవిష్యత్తుతో ఎలాంటి లింకు ఉందో అనేక కథల ద్వారా, ఉదంతాల ద్వారా నా పుస్తకంలోచర్చించాను. (క్లుప్తంగా చెప్పాలనుకున్నది కాస్తా ఇప్పటికే పెద్దదైంది కనుక ఆ వివరాలలోకి వెళ్ళడం లేదు)
8. చివరిగా....మహాభారతం(రామాయణం మొదలైనవి కూడా) విశ్వ సారస్వతంలో భాగం, ప్రపంచవారసత్వ సంపద, యూనివర్సల్ అప్పీల్ ఉన్న రచన. దానిని ఏదో ఒక దేశానికో, సంస్కృతికో, జాతీయతకో మాత్రమే చెందినదిగా భావించడం పొరపాటు.
.......................................................................................
Link:
https://lm.facebook.com/l.php?u=https%3A%2F%2Fus02web.zoom.us%2Fj%2F9280909705%3Fpwd%3DNXZiN1NKUDZZVkU0OExzOGxuYjhadz09%26fbclid%3DIwAR3nYVlFfb-lqflnX9EkjKM-Ls2WN30k_XzOJl8nrk0JMqp_fnbXbJjKVHo&h=AT09DKyLHbTvelLfvtZX1Su05Y57dVSB8qRqS8khds3U1lYQJ2dWWNfATL6c71h0rsDR3q99PtEo1wlerzvPdoYLAnuuybhVICjBEQImlMGPx80P3oiz9rIeGPVHg50AL4tYoisM2x0KjiOmL-pjsg
“Nice info!”
ReplyDeleteAchyutha Packers and Movers
Hanamkonda Packers and Movers
Warangal Packers and Movers
Karimnagar Packers and Movers
Jangaon Packers and Movers
Jayashankar Bhupalpally Packers and Movers
House Shifting Services in Hanamkonda
Hanamkonda Transport Services
GRT - One of the best 5 star luxury business hotels in Chennai T Nagar located near US Consulate Chennai. Book Online & get Free Wi-Fi and Breakfast. Book Now!
ReplyDeletechild educational trust
ReplyDelete