తథాగతుని అడుగుజాడలలో ....
పుస్తకం పేరు తథాగతుని అడుగుజాడలు. దాదాపు రెండువందల పుటలు గల ఈ పుస్తకాన్ని రాయడంలో
రచయితలు చెప్పుకున్న ఉద్దేశ్యం పూర్తిగా నెరవేరింది.
ప్రాచీనాంధ్రలో బౌద్ధం మీద ఆసక్తిగలవారికి ఈ రచన ఉత్తేజకరమైన జిజ్ఞాసను కలిగిస్తుంది. పురావస్తు విషయాల
గురించి రాసిన వ్యాసాలు ఎక్కువ భాగం ఎంతోకొంత పరిజ్ఞానం ఉన్నవారికి తప్ప ఇతరులకు ఆసక్తికరంగా ఉండవు.
ఇంగ్లీషులో ఈమని రాణీశర్మ చేసిన రచనకు కథా రచయిత ఉణుదుర్తి సుధాకర్ తెలుగు అనుసరణ ఇది. సుధాకర్
మూలంలోని సారాన్ని ఆకళింపు చేసుకొని ఇష్టంగా తెలుగులో పునర్లిఖించడం వల్ల స్వీయ రచనలా సాఫీగా,
పఠనీయంగా నడిచింది.
చరిత్రను కేవలం గతానికి మాత్రమే పరిమితం చెయ్యకుండా వర్తమానంతో సంధించగలిగారీ రచయితలు. ఒక్కోచోట
సందర్భానుసారంగా కాల్పనికతకు, ఊహాశక్తికి చోటును కల్పించారు. అంతేకాకుండా అక్కడక్కడ ఉత్తరాంధ్ర సాహితీ
పరిమళాన్ని కూడా అద్దారు. పుస్తకం చదివిన పాఠకులకు సంతృప్తితో బాటు రచయితలు పడ్డ బెంగకూడా
అనిపిస్తుంది. పర్యాటకం, అభివృద్ధి పేరుతో పురావస్తు అవశేషాల విధ్వంసం జరుగుతోందని ఈ పుస్తక రచయితలు
మథనపడతారు.
విశాఖ నగరం సమీపంలో సముద్రతీరాన ఉన్న తొట్లకొండ, బావికొండల మీద బయటపడ్డ బౌధ్ధారామాల గురించి
వివరంగా సృజనాత్మకంగా రచించిన రచయిత్రి రాణీశర్మ చరిత్ర విద్యార్థిని. ఆమె అనేకసార్లు ఈ ఆరామాలను, ఇంకా
అనేక బౌద్ధ క్షేత్రాలనూ సందర్శించిన ఉత్తేజంతో–ఉత్తరాంధ్ర అంతటా విస్తరించిన బౌద్ధ అవశేషాలనూ, స్థూలంగా ఆ
ధర్మం గురించీ వివరిస్తూ–ఆమె చేసిన ప్రయాణాలలో ఎదురుపడ్డ స్థానిక సంస్కృతిని అత్యంత ఆసక్తికరంగా
దృశ్యమానం చేశారు. కేవలం మూడు, నాలుగు ఆరామాల పురావస్తు అంశాల వివరణకే పరిమితం కాకుండా స్థానిక,
నైసర్గిక సాంస్కృతికను కూడా చిత్రించడం ఈ రచన ప్రత్యేకత. ఎనభైలలో ఒక నావికాధికారి తొట్లకొండ బౌద్ధారామాన్ని గమనించడంతో విశాఖ నగర సంస్కృతి గొప్ప ప్రాచీనతను సంతరించుకుంది. నగరవాసులు దాని పరిరక్షణను
మాత్రం తథాగతుడికే విడిచిపెట్టేరు.
మొత్తం ఆరు అధ్యాయాలలో ఉత్తరాంధ్రలోని బౌద్ధావశేషాలను స్పృశిస్తూ, బౌద్ధ ధర్మ మౌలిక స్వభావాన్ని
పరామర్శిస్తూ, బౌద్ధసంఘ వ్యవస్థీకరణనూ, ఆరామాల నిర్మాణ విశేషాలనూ వివరించారు రచయితలు. శారదా
వంశధార నదీలోయ ప్రాంతం గిరిజనుల గడ్డ. శతాబ్దాలపాటు, చారిత్రక యుగంనుంచీ ఒక ప్రత్యేకమైన వ్యావసాయక, గిరిజన సంస్కృతి వేరూని ఉన్న ప్రాంతం. తీరాంధ్రం సముద్రానికీ, తూర్పు కనుమలకీ మధ్య విస్తరించిన సన్నటి
మైదానం. కళింగాంధ్ర మరికొంచెం ఇరుకైనది. అక్కడ మహా సామ్రాజ్యాలు విస్తరించలేదు; అక్కడ పెద్ద నగరాలు
లేవు. గొప్ప నదులూ లేవు.
వర్షాధారిత పంటలు, ఎంతో కొంత వాణిజ్యం–వీటితో కొనసాగుతూ ఇటీవలి వరకూ తన ప్రాచీన సాంస్కృతిక
స్వభావాన్ని విడిచిపెట్టని ప్రాంతం ఇది. గాఢమైన స్థానిక విశ్వాసాలు, ఆచారాలు, కర్మకాండ, బృహత్ శిలాయుగపు
కొనసాగింపు–ఈ ప్రాంతపు విశిష్టతలు. జీవావరణం నిర్దేశించిన జీవన విధానం, అది పెంపొందించిన స్థానీయ
సంస్కృతి–వీటినే స్థానీయ సాంస్కృతిక, పురావస్తు అధ్యయనాలంటున్నాం. అయితే ఈ ప్రాచీన స్థానీయ
కళావిశ్వాసాలకి బౌద్ధ, హిందూ ధర్మాలతో ఏర్పడ్డ బాంధవ్యం గురించి తెలుగులో అధ్యయనాలు రాలేదు. దీన్ని
సూచనప్రాయంగా ఉదహరిస్తూ ప్రస్తావించడం ఈ పుస్తకం సంతరించుకున్న అదనపు విలువ. స్థానీయ పురావస్తు
అధ్యయనాలను అరవై దశకంలో దక్కన్ కళాశాలలో ఆచార్య సంకాలియా ప్రోత్సహించేవారు.
రచయితలు బృహత్ శిలాయుగపు ప్రభావం గురించి రాస్తూ, ఆరామాల్లో ఉండే బౌద్ధ భిక్షువుల్ని గ్రామీణులు పండగల సందర్భంలో దర్శించి ఆశీస్సులు పొంది వెళ్లేవారని, అది ఒక ప్రాచీనమైన ఆచారమనీ తెలియజేస్తున్నారు. నిజానికి కళకి సంబంధించినంతవరకూ ముచలింద నాగు మంచి ఉదాహరణ. పడగవిప్పిన ఈ సర్పం, బౌద్ధంలో తాత్వికతకు ప్రతీక. అందుకే బౌద్ధ స్థూపాలంకరణలో ఇది ప్రముఖంగా కనిపిస్తుంది. నాగపూజ అత్యంత ప్రాచీనమైనది. జేజల్ని పూజించే ఆచారం కూడా అంతే. ఆరాధనా పద్ధతులు, గురువులు, గ్రామదేవతలు మొదలైన అనేక స్థానిక సంప్రదాయాలు యథాతథంగానో, రూపాంతరం చెందీ లేదా ప్రతీకాత్మకంగానో హిందూ, బౌద్ధ మతాలలో కొనసాగడం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే వ్యవసాయ విస్తరణ, రాజ్య విస్తరణ–ఇవి కూడా ఆ రెండు ధర్మాలనూ గాఢంగా ప్రభావితం చేశాయి.
ప్రాచీనాంధ్ర అంతటా బౌద్ధం వ్యాపించింది. నదీ ప్రవాహంలో గింజలూ, మొక్కలూ తీరంలో వేళ్లూని మహావృక్షాలుగా
అవతరించినట్లుగా నదీతీర ప్రాంతాల్లో బౌద్ధం పాదుకుంది. విశాఖ నగరం, సుప్రసిద్ధ బౌద్ధ ఉపాసిక విశాఖ పేరుమీద
ఏర్పడింది. ఉత్తరాంధ్రలో పురావస్తు త్రవ్వకాలు జరిపితే అనేక స్థూపావశేషాలు వెలుగులోకి వస్తాయి. ఇప్పటికే
బయటపడ్డ శాసనాలు, భిక్షాపాత్రలు, ఇతర వస్తువుల గురించి ప్రస్తావిస్తూ ఒక భిక్షాపాత్ర మీద కోటయ్య అన్న పేరు
చెక్కి ఉండడాన్ని ఉదహరించి పాఠకుల్ని ఆలోచనాసక్తుల్ని చేస్తారు రచయితలు. ప్రాచీన గ్రీసు, రోమన్, పర్షియా
దేశాలలో కూడా బౌద్ధ భిక్షువులు సంచరించారు. రోమన్ చక్రవర్తి అగస్టస్ సీజర్‌ని కలుసుకున్న బృందంలో ఒక బౌద్ధ భిక్షువు కూడా ఉన్నాడంటే ఆశ్చర్యం కలుగుతుంది. బిలావర్-బుద్ధస అనే పేరుతో అరబ్బీ భాషలో బుద్ధ చరితను
రాసుకున్నారు. గ్రీసులో బార్లాం-జోసఫట్ అన్న పేరుతో బుద్ధుని గాథ ప్రసిద్ధికెక్కింది. ఈ వివరాలను రచయితలు
మన ముందుంచుతారు.
బుద్ధుడికి పూర్వమే విరాగులైన అనేకమంది చింతనాశీలురు సంచార జీవనం ఆచరించారు. బౌద్ధ భిక్షువులు కూడా
సంచార జీవులే. దాన్ని శ్రమణ సంప్రదాయం అంటారు. ప్రాచీన కాలంలో కూడా తాత్త్విక చింతనలో నిమగ్నులైన
సత్యాన్వేషులు జనావాసాలకు దూరంగా, అడవుల్లో నివసిస్తూ ఉండేవారు. బౌద్ధ భిక్షువులు శిరోముండనం చేసుకొని, కాషాయ వస్త్రాలు ధరించి, జనావాసాలకు దగ్గరలోనే ఉంటూ, భిక్షాటన చేస్తూ నిరాడంబర ధార్మిక జీవనం సాగించారు.
ఆరామాలు వర్షాకాలంలో నివసించడం కోసం నిర్మించిన వసతులు. ఈ శిరోముండనం, కాషాయ వస్త్రధారణ,
చాతుర్మాస్య ఆచారాలను హిందూ సన్యాసులు అలవరచుకున్నారు. మఠాల వ్యవస్థ కూడా బౌద్ధ సంఘారామాల
స్ఫూర్తి మూలంగా ఏర్పడినదే.
గ్రామాల పేర్లు స్థానీయ సంస్కృతికి తలుపులు తెరిచే తాళంచెవుల వంటివి. అవి కాలక్రమేణా రూపాంతరం చెందుతూ ఉంటాయి. బౌద్ధావశేషాలను ప్రస్తావిస్తూ రచయితలు గ్రామనామాలను కూడా పరిశీలించారు. ఉత్తరాంధ్రలోని చిన్నచిన్న నదుల తీరాల వెంట వెలసిన బౌద్ధారామాలను అక్కడి సన్నకారు రైతులు భక్తి శ్రద్ధలతో ఎలా ఆదరించారో వివరించారు. కొత్తగా కాకపోయినా పట్టణం, నగరం, బొజ్జన్న కొండ, బుద్దాం, బుద్ధవరపు, వంటి పేర్లను పరిశీలించి ప్రాచీన నౌకా వాణిజ్యానికీ బౌద్ధధర్మ వ్యాప్తికీ ఉండిన సంబంధాన్ని మరోసారి గుర్తు చేశారు. వాణిజ్య నౌకలలోనే భిక్షువులు కూడా దేశాంతర ప్రయాణాలు చేసి ఉండవచ్చు.
తొట్లకొండ మరీ చిన్నది కాదు. తీరాంధ్రలో నిర్మించిన ముఖ్యమైన ఆరామాల్లో అది ఒకటి. అయితే దీని ప్రాచీన
నామం తెలియదు. భిక్షువులు నీటిని నిల్వ చేసుకోవడం కోసం రాతిలోనే అనేక దొరువుల్ని తవ్వుకున్నారు. అంటే
రాతి తొట్లవంటివన్నమాట. చీవరాలకు రంగు అద్దుకోవడానికి కూడా ఈ తొట్లను వినియోగించినట్లు తెలుస్తోంది.
రంగు అద్దడం గురించి రచయితలు మంచి పరిశీలన చేశారు. ఇప్పటికీ అక్కడ ఉన్న కొన్ని పొదల ఆకుల నుంచి
బట్టలకు రంగువేసుకోవడానికి ఉపయోగపడే ద్రవం లభిస్తుందని అంటూ, బహుశా ఆ మొక్కలు, పొదలు ప్రాచీన
సంతతికి చెందినవి కావచ్చునని ఊహించారు. తొట్లకొండ స్థూపంపై అద్దిన తెల్ల సున్నం మూలంగా అది పగటిపూట
నున్నగా, మెరుస్తూ ఉండేదనీ, రాత్రిపూట దానిపైన అలంకరించిన దీపాలతో అదొక లైట్ హవుసు మాదిరిగా
నావికులకు ఉపయోగపడేదనీ రచయితలు అంటారు. దేశంలోని అనేక ఇతర బౌద్ధ ఆరామాల గురించీ, వాటి నిర్మాణ విశేషాల గురించీ రచయితలు ప్రస్తావించారు.
ఒకప్పుడు అమరావతీస్థూపం కూడా నావికులకు దారి చూపేది. దాన్ని ‘దీపాల దిన్నె’ అనేవారు. తెలుగు
రాష్ట్రాలలో వర్ధిల్లిన బౌద్ధం విలక్షణమైనది. ఇక్కడి స్థూపనిర్మాణం కూడా ప్రత్యేకమైనదే. బుద్ధుని జీవితకాలంలోనే
ఇప్పటి బోధన్ ప్రాంతానికి చెందిన బావరి అనే పండితుడు తన శిష్యులను బుద్ధ దర్శనార్థం ఉత్తరదేశానికి
పంపించాడు. బావరి అమ్మవారిని ధ్యానించేవాడని తెలుస్తోంది. తీరాంధ్రదేశంలో గుంటుపల్లి బౌద్ధ క్షేత్రం, అమరావతి
తరువాత చెప్పుకోతగ్గది. దానిపై తగినంత పరిశోధన జరగలేదు. అక్కడ ‘దఖిని’ పేరుతో ఒక బౌద్ధశాఖ
ప్రవర్తిల్లింది. ఆంధ్ర లేక అంధక భిక్షువుల్ని ‘మహాసాంఘికులు’ అనీ ‘చైత్యకులు’ అనీ వ్యవహరించేవారు.
బౌద్ధం అనేక శాఖలుగా విస్తరించింది. భిక్షువులు ధరించిన కంబళుల రంగునుబట్టి కూడా శాఖల పేర్లుండేవి.
త్రిరత్నాలలో బుద్ధుడు, ధర్మంతో బాటుగా గౌరవింపబడే మూడవ అంశం సంఘం. సంఘంలేని బౌద్ధం అనూహ్యం.
సంఘనిర్మాణమే బౌద్ధాన్ని వ్యవస్థీకృతం చేసింది. సంఘనియమాలు నిర్దుష్టంగా ఉండడంతో బాటు అవి మౌలికంగా
ప్రజాస్వామిక అనుభవంలోంచి ఏర్పడ్డవి కావడానికి కారణం బౌద్ధులు ఆనాటి గణతంత్ర రాజ్యాల పౌరులు కావడమే.
బౌద్ధ సంఘం ‘పబ్బజ’, ‘ఉపసంపద’ శిక్షణలకు కేంద్ర స్థానం అయింది. సంఘం ఏర్పడ్డ నాటినుండే అనేక
చిక్కుముడులను విప్పుకోవాల్సి వచ్చింది. ఉచిత భోజన వసతి సదుపాయాల కోసం కొంతమంది యువ భిక్షువులు సంఘంలో చేరిన సందర్భాలున్నాయి. అలాగే ఉచిత వైద్య సదుపాయం కోసమని సంఘంలో చేరే వాళ్లుండేవారు. కొన్నిసార్లు క్రమశిక్షణ సమస్యలు ఏర్పడేవి. ఈ సమస్యలకు పరిష్కారంగా కఠినమైన నియమ నిబంధనావళి రూపు దిద్దుకుంది.
విహారాలను, పరిసరాలనూ ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి? గురుశిష్యుల నడుమ సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా
ఉండాలి? భిక్షువులెవరైనా అనారోగ్యానికి గురైతే వాళ్లని ఎలా కనిపెట్టి చూసుకోవాలి? ఇటువంటి అనేక ప్రశ్నలకు
సమాధానాలు కాలక్రమేణా నియమావళిలో చోటుచేసుకున్నాయి. ఈ క్రమాన్ని రచయితలు పేర్కొన్నారు. ఆరామాల నిర్వహరణ కూడా సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో పద్ధతి ప్రకారం సాగిందని రచయితలు తెలియజేస్తున్నారు.
బౌద్ధ సంఘంలో మహిళలకు స్థానం కల్పించబడిన తీరు, ఒక ఆసక్తికరమైన వివాదంతో ముడిపడి ఉంది. స్త్రీలు
భక్తులుగా, ఉపాసికలుగా ఉండడాన్ని తథాగతుడు ఆమోదించాడు గానీ పూర్తి స్థాయి సన్యాసినులుగా సంఘంలో
చేరడాన్ని అతడు తొలుత ఇష్టపడలేదు. సాక్షాత్తూ ఆనందుడు వేడుకున్నా ఒప్పుకోని బుద్ధుడు విశాఖ, అమ్రపాలి
వంటి మహిళల శ్రద్ధాభక్తుల్ని గమనించాక స్త్రీలకు ప్రవేశం కల్పించాడని తోస్తుంది. నియమాలు, కట్టుబాట్లను నిష్ఠగా
ఆచరించినంత కాలం సంఘం వృద్ధి చెందింది. ఆ తరువాతి దశలో క్షీణత మొదలైంది.
బౌద్ధ సాహిత్యంలో అనాథపిండిక శ్రేష్ఠి ప్రసిద్ధుడు. జేతవన విహారాన్ని బుద్ధుడికి దానంగా ఇచ్చినవాడు. భిక్షువులకు అసలు ఆరామాలు అవసరం అని భావించినవాడు బింబిసారుడంటున్నారు. బుద్ధుడనగానే జ్ఞాపకం వచ్చేది వేణువన విహారం అనే పెద్ద వెదురుతోపు. దాన్ని బింబిసారుడు బుద్ధుడికి దానం చేశాడు. భిక్షువుల వస్త్రధారణ ప్రత్యేకతను కలిగి ఉండాలని యోచించి కాషాయ రంగు బట్టలను ప్రవేశపెట్టింది కూడా బింబిసారుడే అంటారు రచయితలు.
గుహాలయాల్లో పడుకోవడానికి చిన్న రాతి అరుగు, వస్తువులు పెట్టుకోవడానికి ఒక అర మాత్రమే ఉండేవి. వాటితో
పోలిస్తే ఇటుకలతో నిర్మించిన ఆరామాలు విశాలంగా, సౌకర్యవంతంగా ఉండేవి. చైత్యగుహాలయాలు నిరాడంబరంగా,
గుర్రపు నాడా ఆకారంలో లేదా గజపృష్టాకారంలో ఉండేవి. ఇదే పద్ధతి తొలి హిందూ గుహాలయాల్లో కూడా
కనిపిస్తుంది. అవి సామాన్యుల ఇళ్ల నిర్మాణాన్ని పోలి ఉండేవి. చెక్క, వెదురు, గడ్డి, తాటాకుల వాడకపు ఛాయలు
వాటి రూపకల్పనలో కనిపిస్తాయి. అజంతా గుహాలయాల ముఖద్వారంపై కనిపించే చైత్యవాతాయనం
కనుబొమలనుపోలి ఉండే సుకుమారమైన వంపులతో కూడిన అత్యంత సుందరమైన కళాకృతి. ఈ వాతాయన
రూపకల్పన, పెద్ద తాటాకు పైకప్పులలో పొగ పోయేందుకు ఏర్పాటు చేసుకున్న కిటికీ స్ఫూర్తిగా ఏర్పడింది. అట్లాగే
బార్హుత్ స్థూపం చుట్టూ నిర్మించిన కంచె వెదురు బొంగులతో ఇళ్ళు, పశుశాలల చుట్టూ నేటికీ కనిపించే కంచెల
నమూనాను ఆధారంగా చేసుకున్నట్టిది. వెదురు బొంగుల కంచెల నిర్మాణంలో అవసరార్థం చెక్క శీలలను వాడతారు.
రాతిగోడల నిర్మాణంలో అవి అనవసరం. అయినప్పటికీ శిల్పులు అలంకారప్రాయంగా వాటిని కూడా చెక్కేవారు. తొలి హిందూ ఆలయాల్లో బొద్ధ చైత్యాల ప్రదక్షిణాపథం, అధిష్ఠానంలో కంచె నమూనా కనిపిస్తాయి. ఆరామనిర్మాణ
వివరాలను రచయితలు స్థూలంగానైనా ఈ రచనలో చర్చించారు.
మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపుర నవ బ్రహ్మాలయాల్లో రచయితలు పేర్కొన్న ఈ దారుశిల్ప నిర్మాణశైలి
స్పష్టంగా కనిపిస్తుంది. ఆగమ శాస్త్రాలు క్రీ.శ. ఎనిమిదవ శతాబ్దం తరువాత వచ్చినవని అనుకుంటున్నాను. మొదట కళ, ఆ తరువాత శాస్త్రం కదా! కళకి స్ఫూర్తి జీవితం. ఆనాటి శిల్పుల దృష్టిలోకి వచ్చిన జంతువులనేకం
గుహాలయాల అలంకరణలో చోటుచేసుకున్నాయి. మహాబలిపురంలో అర్జునుడి తపస్సు శిల్పచిత్రంలో ఒంటికాలి
మీద నిల్చొని ధ్యానం చేస్తూన్న సాధువుని కొంటెగా అనుకరించే పిల్లిని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి.
ఈ పుస్తక రచయితలు కథన శైలిని అనుసరించడం వల్ల, బౌద్ధ సాహిత్యం ఆధారంగా లభించిన బుద్ధుడి
సంభాషణలను యథాతథంగా పేర్కొనే ప్రయత్నం చెయ్యడం వల్ల ఈ రచనను ఒకటికి రెండుసార్లు చదవాలనిపిస్తుంది.
తమ కథన క్రమంలో పాఠకుల జిజ్ఞాసను, ఆసక్తిని పెంపొందించే అనేక సంఘటనలను వారు విస్మరించలేదు.
పాఠకులు తమ కథనంతో, బౌధ్ధ చరిత్రతో మమేకంకాగల సన్నివేశాలను వారు సృష్టించారు. ఉదాహరణకి భిక్షాపాత్ర
పైన కనిపించిన కోటయ్య పేరు ఆధారంగా మనం కూడా ఆయన్ను కలుసుకుంటాం.
భిక్షువుల దైనందిన జీవనం ఎలా ఉండేది? అనే ప్రశ్నకు ఈ పుస్తకంలో సమాధానాలు లభిస్తాయి. నీడ గడియారాన్ని (సన్ డయల్) వినియోగించేవారు. ఉదయం పూట వ్యాయామం చేసేవారు. ఆ తరువాత గంజి త్రాగేవారు. ఉదయాన్నే యవాగువు (జావ) అనే పానీయాన్ని త్రాగేవారని జాతక కథలలో తరచుగా కనిపిస్తుంది. మధ్యాహ్నం కాగానే భిక్షాటనకు వెళ్లేవారు. ఇళ్ల ముందు నిశ్శబ్దంగా నిలుచోవడమే తప్ప నోరు విప్పి భిక్షకై అడిగే సంప్రదాయం వారిలో లేదు. భిక్షువులెవరూ రెండోపూట భోజనం చేసేవారు కాదు. భిక్షను దాచుకోవడం తప్పుగా భావించేవారు.
(ఈ నియమాన్ని తరువాతి కాలంలో అంత శ్రద్ధగా పాటించినట్లు తోచదు.) రోజంతా ధ్యానంలో, అధ్యయనంలో,
చర్చలలో గడిచిపోయేది. సాయంత్రం పూట పాచికలు, పులీ-మేక, కుస్తీ, కర్రసాము, బంతి ఆట, గోళీలు వంటి
ఆటలతో కాలక్షేపం జరిగేది. గుహాలయాల్లో, వనవిహారాలలో తలుపులకు తాళాలు వేసుకొనే అవసరం ఉండేది కాదు.
ఇటుకలతో ఆరామాలను నిర్మించుకోవడం మొదలయ్యాకనే తాళాలు అవసరం అయ్యాయి. అంటే భిక్షువులు
వస్తువుల్ని దాచుకోవడం మొదలైందనమాట. ఆరామాలలో వంటగదులు, భోజనశాలలు, స్నానాలగదులు,
మరుగుదొడ్లు ఉండేవి. స్త్రీ, పురుషులకు విడివిడిగా ఏర్పాట్లు ఉండేవి. గురువులకీ, పెద్దలకీ సౌకర్యంగా ఉండేటట్లు
ఏర్పాట్లు చేసేవారు.
ఆరామాల్లో ధాన్యం, దినుసులు దాచుకోవడానికి కొట్టుగదులుండేవి. వాటి సముదాయాన్ని కప్పీయకుటి అనేవారు. దాని బాధ్యతను కప్పీయకారుడుగా నియమింపబడ్డ భిక్షుపెద్ద నిర్వహించేవాడు. ఉపాసకులు, సంపన్నులు, రైతులు ఆరామాలకు వస్తురూపేణా దానధర్మాలు చేసేవారు. శ్రామికులు శ్రమదానం చేసేవారు. ఆరామాలలో శాకాహార భోజనంతో బాటుగా మాంసాహారం కూడా సర్వసాధారణం. మాంసాహారాన్ని బుద్ధుడు ఆమోదించడమే కాకుండా స్వయంగా తీసుకొనేవాడు. కొన్ని బౌద్ధారామాలు ప్రపంచ ప్రసిద్ధ అధ్యయనకేంద్రాలుగా వినుతికెక్కాయి. తక్షశిల, నలంద అటువంటివి. ధార్మికవిద్యతో బాటుగా గణితం, యోగ, వ్యాకరణం, ఛందస్సు వంటి శాస్త్రాలను కూడా కులప్రసక్తి లేకుండా బోధించారు. ఈ విశేషాలను రచయితలు ఆసక్తికరంగా పేర్కొన్నారు.
బౌద్ధ కళాసృష్టిలో అజంతా గుహల చిత్రకళ అత్యద్భుతమైనది. గుహల గోడల్ని నున్నగా తయారుచేసుకొని వాటిపై
చిత్ర రచనకుగాను బెందడి (అడుసు) పూత పూసేవారు. తడి ఆరకముందే దానిపై వర్ణచిత్రాలను వేసేవారు. అలా
వేయడంలో ఒక పెద్ద ఇబ్బంది ఉంది. ఒకసారి గీతగీస్తే దాన్ని సరిదిద్దే అవకాశంగానీ చెరిపే వెసులుబాటుగానీ
ఉండవు. ఇప్పటికీ కొత్త రంగుల్లా మెరుస్తూన్న వేలాది చిత్రాల్ని చూసినప్పుడు సంభ్రమాశ్చర్యాలతో బాటుగా ఆ
కళాకారుల పట్ల గొప్ప గౌరవం, వారి అంకితభావం పట్ల ఆర్ద్రత మనలో కలుగుతాయి. వెస్సంతర జాతక కథకు
కల్పించిన వర్ణచిత్ర రూపంలో (అజంతా, 17వ గుహ) ఒక కొమ్మమీద ప్రాకుతూన్న నల్ల చీమలబారుని చిత్రించిన
రీతి నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది. అలాగే మొట్టమొదటి గుహలోని అవలోకితేశ్వరుని అరమోడ్పు కనులను
చూస్తూ గంటసేపు అక్కడే నిల్చిపోయాను. ఇటువంటి అలౌకిక కళాప్రపంచాన్ని ఆవిష్కరించిన సందర్భం గురించి
బౌద్ధ సాహిత్యంలో నాకు తెలిసి ఎట్టి వివరాలూ లేవు. బౌద్ధకళా సంప్రదాయాలను గురించి కూడా ఈ పుస్తకంలో
ప్రస్తావించి ఉంటే బాగుండేది.
ఉత్తరాంధ్రలో బౌద్ధక్షేత్రాలు వెలుగులోకి రావడం వెనుక స్వచ్ఛందంగా, అసాధారణమైన శ్రద్ధతో పరిశ్రమించిన
వ్యక్తులెందరో ఉన్నారు. వారిలో కొందరినైనా స్మరించుకోవడం, ఈ పుస్తక రచయితలు చేసిన మరో మంచి పని.
సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలనే ధ్యేయంతో తమ కొద్దిపాటి వనరుల్ని ఖర్చు చేసి, ఒక బృహత్కార్యానికి
తలపెట్టిన వ్యక్తులు వీరు. వారెవరికీ చరిత్ర, పురావస్తు శాస్త్రాలలో డిగ్రీలు లేవు. సంబంధిత డిగ్రీలు, ఉద్యోగాలు,
పదవులు కలిగి ఉన్న వ్యక్తులలో లోపించిన శ్రద్ధ, జిజ్ఞాస వీరిలో ఉండడం మన అదృష్టం. రెవెన్యూ ఆఫీసరుగా
పనిచేసిన కీ.శే. రామయ్యగారు ముఖ్యులు. ఆయన స్వయంకృషితో పాలీ భాషను నేర్చుకొని, అరుదైన గ్రంథాలను
సేకరించి వాటిని చదవమని ప్రోత్సహిస్తూ ఇతరులకు అందజేసేవారు. అలాగే రాబర్ట్ ష్నిక్, కడియాల
వెంకటేశ్వరరావు, మిరపల నారాయణరావు, మహమ్మద్ సిలార్, నాయని ఆదిత్య మాధవ్, ఇంకా
ఇతరులు–వీరందరి సహకారంతో రచయిత్రి రాణీశర్మ ఒక బృందంగా ఏర్పడి కృషి చేశారు. ఒక వైపున ఇటువంటి
ఔత్సాహికులు, మరోవైపున పురావస్తు శాఖవారు, ఎంతో శ్రమించి వెలికితీసిన చారిత్రక, సాంస్కృతిక సంపద
అభివృద్ధి పేరుతో కొంత, ప్రజల అనాసక్తి మూలంగా మరికొంత ధ్వంసం అయిపోతున్నది. సందర్శకులు,
ఔత్సాహికులతో బాటుగా మన ప్రజానీకంలో వారసత్వ సంపదను కాపాడుకోవాలనే చైతన్యం, దీక్ష సర్వత్రా
కలగాలనేదే ఈ రచయితల ధ్యేయం. ఈ వ్యాసం మొదట్లో చెప్పినట్లు ఆ మేరకు రచయితలు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారనే చెప్పుకోవాలి.
మహాపరినిర్వాణం నాటికి శాస్త వయస్సు ఎనభై ఏళ్లు. అవిశ్రాంతంగా ఏభై ఏళ్ల పాటు ధర్మ ప్రచారం చేసి
అలసిపోయాడాయన. ఒక వైశాఖ మాసంలో శిష్యులతో బాటు కుశినగరం (నేటి బీహార్ లోని కుశినారా) మీదుగా
ప్రయాణిస్తున్నాడు. చుండుడు అనే ఉపాసకుడి ఇంట్లో లేత పంది మాంసం తిని అనారోగ్యానికి గురి అయ్యాడు.
శిష్యులు అతన్ని డోలీ మీద పడుకోపెట్టి నానా కష్టాలూ పడుతూ కుశినగరం తీసుకొచ్చారు. ప్రధాన శిష్యుడైన
ఆనందుడు రెండు సాల వృక్షాల నడుమ దుప్పటి పరచగా, బుద్ధుడు ఉత్తరదిశగా తలపెట్టుకొని, కుడివైపు
ఒత్తిగిలి–తన ఆఖరి ప్రవచనాన్ని ప్రకటించి–నిష్క్రమించాడు. సమస్త మానవాళి నిరంతరంగా అనుభవిస్తూన్న
అస్తిత్వ వేదనను రెండక్షరాలలో కుదించి, నిర్వాణ మార్గం చూపించిన ఉదయభానుడు లోకానికి కాంతిని ప్రసాదించి
తాను మరో సౌరకుటుంబానికి శలవు తీసుకున్నాడు. ఈ భూమండలంపై మానవజాతి ఉన్నంతకాలం, బుద్ధుడి
గాథనీ, అతడు బోధించిన ధర్మాన్నీ తల్చుకుంటూనే ఉంటాం–ఏదో ఒక రీతిలో.
- తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి
( ఈమాట, ఏప్రిల్ 2020 సౌజన్యంతో )
[తథాగతుని అడుగుజాడలు,
రచయితలు రాణీశర్మ ఈమని, ఉణుదుర్తి సుధాకర్.
హైదరాబాద్ బుక్ ట్రస్ట్, 196 పేజీలు. వెల రూ. 180/-]
ఈమాట :
https://eemaata.com/em/issues/202004/22350.html
No comments:
Post a Comment