Sunday, July 21, 2013

‘కథల కన్నా జీవితాలు అద్బుతంగా ఉంటాయా?’ - గోగు శ్యామల


మా నాయన బాలయ్య

పుస్తక సమీక్ష : నమస్తే తెలంగాణ (బతుకమ్మ) సౌజన్యంతో 

దక్కన్ పీఠభూముల్లోని పస్క బయిల్ల నుండి, చీకటి సొరంగాల నుండి బొగ్గును బర్తి చేసుకున్న ఓ గూడ్సు బండి నెలలు నిండిన గర్భవతోలే భారంగా కదులుతున్నట్లు సాగుతుందీ రచన.

‘కథల కన్నా జీవితాలు అద్బుతంగా ఉంటాయా?’ అన్న ప్రశ్న ఎవరైనా అడిగితే.. ‘మా నాయన బాలయ్య’ పుస్తకాన్ని చదివిన వారెవరయినా ‘ఔను’ అనే సమాధానం చెప్పవచ్చు. దళితుల జీవితాల్లోని వైవిధ్యాలను వైరుధ్యాలను ఈ పుస్తక రచయిత డా॥ వై.బి సత్యనారాయణ నిశితంగా వివరిస్తాడు.
డా॥ వై.బి తన తండ్రి చరివూతను వివిధ కోణాల్లో వివరించిన రచననే ‘మా నాయన బాలయ్య’. ఇది సజీవ చరిత్ర కాబట్టే సుడిగుండాలను సుడి చుట్టి తన కడుపులో దాచుకున్న జీవనదిలా సజీవంగా సాగుతుందీ కథ. కనుకనే ఒకసారి ఎవరైన దీన్ని చదవడం మొదలు వెట్టింవూడంటే పూర్తిగా ఒడ్సెంత వరకు పుస్తకాన్ని కింద వెట్టరు .

తెలంగాణలోని వెలి వాడల్లోని దళితుల జీవితాల్లో తంతెలు, తంతెలుగా పేరుకుపోయిన అంటరానితనం, వెట్టి దోపిడి, ఈసడింపులు, చీత్కారాల నడుమ పెనుగులాడిన బత్కులు. కొన్నింటిలో ఓడిపోయినా.. తమ గమ్యం ‘ఎటువైపు?’ అనుకుంటూ భవిష్యత్తును నిర్మించుకుంటున్న చరిత్ర. దళితులు ఇటువంటి తరతరాల చరిత్ర నుండి వర్తమానంలోకి అడుగులేస్త్తున్న అరుదైన పుస్తకమిది.

విశాల దక్కన్ ప్రాంతాన్ని పాలించిన 5వ నిజాం, ‘మీర్ తహ్నియత్ ఆలీఖాన్ అఫ్జుల్ ఉద్‌దౌలా’ కాలంలోనే మాదిగ ఎలుకటి నర్సయ్య చెప్పులు కుట్టిస్తడు. ఈయన పనితనానికి ఎంతగానో మెచ్చిన ఆ రాజు 50 ఎకరాల భూమిని నర్సయ్యకు ఇనాం ఇస్తడు. దీంతో నర్సయ్య కుటుంబం దశ తిరగడం నుండి ‘మా నాయన బాలయ్య’ కథా రచన షురువైతది. ఇది నర్సయ్య జీవితంతో మొదలై రాజులకైనా సామాన్యులకైనా చెప్పులు కుట్ట్టే పనితనం నుండి ఎలుకటి వంశంలో మూడవ తరం నాటికి విశ్వవిద్యాలయంలో అన్ని కులాలకూ ఏ అడ్డూ లేకుండా విద్యను బోధించ గలిగే విధంగా, ప్రొఫెసర్లుగా ఎంతో కష్టపడి ఎదగడాన్ని కూడా ఈ పుస్తకం చూపిస్తుంది. ఈ స్థాయిని అందుకొన్న తన కొడుకులను చూసి మురిసిండు నర్సయ్య కొడుకైన బాలయ్య. ఈ బాలయ్య కొడుకే మన రచయిత డా॥ వై.బి. సత్యనారాయణ. ఆయన తన తండ్రి కాలం చేయడం వరకు ఈ పుస్తకాన్ని రాసిండు.

ఈ పై మూడు తరాల కాలంలోని దళిత సమాజంలో, దళితేతర సమాజాలలో వచ్చిన మార్పులు, ఇప్పుడు ఇంకా రావాల్సిన మార్పులనూ, ఈ మార్పుకు అవసరమైన చైతన్యాన్ని అడ్డుకుంటున్న బ్రాహ్మణీయ భావజాలాన్నీ ఎంతో ఆసక్తికరంగా, జ్ఞానాత్మకంగా పొందుపరచడంలో రచయిత సఫలమయిండని చెప్పాలి. కళారూపాలకు దళితులకు అవినాభావ సంబంధం ఉన్నట్లే సాహిత్యానికి దళితుల చరివూతకు బలమైన సంబంధం ఉన్నదని ఈ రచనలోని ఇతివృత్తం నిరూపించింది. తోలు నైపుణ్యాన్ని చెప్పు కుట్టడం వరకే పరిమితం చేసి చూడడం అనే భావదారిద్య్రం ఇప్పటివరకు నడుస్తనే ఉన్నది. అయితే మాదిగలకి, చెప్పులకూ, తోలుకూ, భూమికీ, రాజుకు అవినాభావ సంబంధాన్ని రచయిత తన సొంత కుటుంబ అనుభవాన్నుంచి బాగా చెప్పిండు. ఇదే నైపుణ్యపు అవినాభావ సంబంధం ఆధునిక రంగమైన రైల్వే నిర్మాణంతో సహితం పెనవేసుకోవడం ఇందులో చూస్తాం. ఇది రచనలో కొత్తకోణం. ఇది సామాజిక చరిత్ర కోణమే.

సుదీర్గమైన చరివూతను అక్షరీకరించిన ఈ పుస్తకం ప్రత్యేకంగా దళిత కుటుంబ జీవితపు చీకటి వెలుగులను పట్టి చూపిస్తుంది. ఇవి చూసినప్పుడు చిన్న చిన్న అవకాశాలే. ఇందులో పెద్ద పెద్ద ఆధారాలుగా మాదిగ బాలయ్య కుటుంబం మల్చుకోవడాన్ని వివరించిన తీరు అద్భుతం. తమ చుట్టూ ముసురుకున్న ఎడతెరపి లేని సుడిగాలులు, సెడుగంత వానలు నడుమ సాలెగూడు లాంటి మాదిగ కుటుంబం ఎట్ల తట్టుకుని నిలబడుతుందనే ప్రశ్నకు జవాబు కూడా ఈ పుస్తకంలో దొరకడం చూస్తాం. ఎంత భీకరమైన చావులనైనా, మారణహోమాలనైనా, పేదరికాన్నైనా భరిస్తూ వస్తూన్నారు. కాని అంటరాని తనాన్ని భరించడం దళితులకు అలవి కాని కష్టమైతున్నది. తరాలుగా అస్పృశ్యతను తట్టుకొని ఎదుగు బొదుగు లేని కుటుంబాన్ని బాలయ్య నర్సమ్మ దంపతులు అటొకరు ఇటొకరు ఎంత అప్రమత్తంగా నిలబెట్టారో కూడా ఇందులో కనిపిస్తుంది. అస్పృశ్య మంటల్లొనుండి, హైందవ విషవాయువుల్లో నుండి బాలయ్య కుటుంబం కొంతవరకు బయట పడిందనే చెప్పాలి. చదువు, ఆత్మగౌరవం, పట్టుదలలే బయట పడడానికి ఉన్న మార్గాలని వాటంగా చూపడం ఇప్పటి అవసరం.

-గోగు శ్యామల,
9866978450

మా నాయన బాలయ్య

- వై.బి.సత్యనారాయణ
ఆంగ్లమూలం :  My Father Balaiah, Harper Collins, New Delhi, 2011
తెలుగు అనువాదం: పి.సత్యవతి
184 పేజీలు, వెల: రూ. 100/-
ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ 500006
ఫోన్‌ నెం. 040 2352 1849
.

Courtesy : Namasthe Telangana (Bathukamma- Sunday Magazine) 21-07-2013

http://epaper.namasthetelangaana.com/Details.aspx?id=39623&boxid=96603304

www.namasthetelangaana.com

1 comment:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌