Friday, July 19, 2013

హైదరాబాద్ రాజ్యంపై సైనిక చర్య జరిగిన తరువాత మొదటిసారిగా ఒక ముస్లిం తనకు అన్యాయం జరిగిందని గొంతు చించుకొని చెప్పుకున్న గాథే ఈ పుస్తకం !



ముస్లిం కోణంలో '1948' 

- భంగ్యా భూక్యా

July 19, 2013 
Andhra Jyothy

హైదర్ చాలా చిత్తశుద్ధితో 1948 జనవరిలో హైందవ జాతీయవాదులు, రజాకార్ల పరస్పర దాడులను అరికట్టే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం చేసినందుకు సైనిక చర్య అనంతరం హైదర్‌ను ప్రభుత్వ సర్వీస్ నుంచి తొలగించి, అరెస్ట్ చేసి, ఆయన పనిచేసిన ఉస్మానాబాద్ జిల్లాలోనే మూడేళ్ల పాటు జైల్లో నిర్బంధించారు. ఆయనపై ఏడు కేసులు నమోదు చేశారు. హైదర్ పాకిస్థాన్‌కో, విదేశాలకో పారిపోకుండా ధైర్యంగా న్యాయపోరాటం చేసి తనపై మోపిన ఆరోపణల్ని నివృత్తి చేశారు. మొహమ్మద్ హైదర్ రచించిన 'అక్టోబర్ కూ' అనే పుస్తకాన్ని గత ఏడాది చివరలో ఢిల్లీ వెళ్లుతూ హైదరాబాద్ విమానాశ్రయంలో కొని ఆత్రుతగా రెండు రోజుల్లో తిరిగి హైదరాబాద్ వచ్చే లోపే చదివేశాను.

అప్పుడే ఈ పుస్తకాన్ని తెలుగు ప్రజలకు పరిచయం చేస్తే బాగుంటుందనిపించింది. గత ఏప్రిల్‌లో ఈ పుస్తకాన్ని గీతా రామస్వామి '1948: హైదరాబాద్ పతనం' గా తెలుగులో తీసుకురావడం చూసి చాలా సంతోషించాను. ఈ పుస్తకావిష్కరణ హైదరాబాద్ బుక్ ట్రస్ట్, అన్వేషి సంస్థల ఆధ్వర్యంలో 'ఆంధ్ర సారస్వత పరిషత్' హాలులో భారీ ఎత్తున జరిగింది. చరిత్ర అభిమానిగా , పరిశీలకుకుడిగా నేను కూడా ఆ సభకు వెళ్ళాను. పుస్తకావిష్కరణ సమయంలో ఇద్దరు ముస్లిం యువకులు చెరో ప్లకార్డు పట్టుకొని వేదిక ముందుకు వచ్చారు. ఒక ప్లకార్డులో 'గీతా రామస్వామి, ఉయ్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ యు', అనీ, మరో ప్లకార్డులో 'గీతా రామస్వామి, శాల్యూట్ యు' అనీ రాసి ఉంది.


అది చూసి హైరదాబాద్ చరిత్ర అంతా ఒక్కసారిగా కళ్ల ముందు తిరిగింది. ఆ అక్షరాల్లో ముస్లింల నిస్సహాయ దీనస్థితి కనిపించింది. 1948 సెప్టెంబర్ 17 సంఘటన తరువాత మొదటిసారిగా ఒక ముస్లిం తనకు అన్యాయం జరిగిందని గొంతు చించుకొని చెప్పుకున్న గాథే ఈ పుస్తకం. భారత సైన్యం దాడి అనంతరం జరిగిన మారణహోమం, తదనంతరం ఆంధ్ర పాలకులు సృష్టించిన మత ఘర్షణలు హైదరాబాద్ ముస్లింలను ఒక భయానక స్థితికి నెట్టేశాయి. గొంతు విప్పితే నిరంతర నిర్బంధాలు, చిత్రహింసలు. దాంతో ఏ ముస్లిం కూడా గొంతు విప్పి మాట్లాడే ధైర్యం చేయలేదు. హైదర్ పుస్తకం ఈ పరిస్థితిని ఛేదించిందనే చెప్పాలి.

ఈ పుస్తకం హైదర్ ఆత్మకథ అయినప్పటికీ హైదరాబాద్ రాజ్యం చివరి రోజుల గురించి అనేక ఆసక్తికరమైన విషయాల్ని తెలియజేసింది. ఆనాటి హైదరాబాద్ రాజ్యంలో హైదర్ ఒక ఉన్నత పదవిలో ఉన్న అధికారి. 1937లో చిన్న వయస్సులోనే, ఉన్నత స్థాయి సివిల్ సర్వీస్‌కు ఎంపికైన ప్రతిభావంతుడు. ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో ఉన్న ఉదారవాద అధికారుల్లో హైదర్ ఒకరు. ఈ తరహా అధికారులు ప్రజల బాధలను చూసి చలించిపోవటం, ప్రజల సమస్యలను అర్థం చేసుకొని తక్షణమే పరిష్కరించటం చేస్తుండేవారు. బ్రిటిష్ పాలకులు భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటించిన అనంతరం హైదరాబాద్ పరిస్థితి విచిత్రంగా మారింది. స్వతంత్రంగా ఉన్న హైదరాబాద్‌ను తనలో కలుపుకోవటానికి భారత్ ముమ్మర ప్రయత్నాలు చేయసాగింది.


ఇందులో భాగంగా హైదరాబాద్ సంస్థానంలో కాంగ్రెస్ ముసుగులో ఉన్న హైందవ జాతీయవాదులు, ఇండియా-మహారాష్ట్రలోని హైందవ జాతీయవాదులతో కలిసి హైదరాబాద్ మీద దాడులు చేయటం మొదలుపెట్టారు. ఆ దాడులు 1947 నవంబర్‌లో యథాతథ ఒడంబడిక (1947 నవంబర్) నాటి నుంచి సైనిక చర్య అనంతరం కూడా కొనసాగాయి. ఖాసిం రజ్వీ ఆధ్వర్యంలోని రజాకార్లు ప్రతి దాడులు చేయడం మొదలుపెట్టారు. దీంతో సరిహద్దు జిల్లాల్లో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఈ దాడులను చూసి చలించిపోయిన హైదర్ తనను దాడులకు గురవుతున్న జిల్లాకు కలెక్టర్‌గా నియమించమని అప్పటి రెవెన్యూ మంత్రి దగ్గరికి వెళ్ళి కోరాడు. 1948 జనవరిలో హైదర్ చాలా చిత్తశుద్ధితో హైందవ జాతీయవాదులు, రజాకార్ల పరస్పర దాడులను అరికట్టే ప్రయత్నం చేశారు.

ఈ ప్రయత్నం చేసినందుకు సైనిక చర్య అనంతరం హైదర్‌ను ప్రభుత్వ సర్వీస్ నుంచి తొలగించి, అరెస్ట్ చేసి ఆయన పనిచేసిన ఉస్మానాబాద్ జిల్లాలోనే మూడేళ్లపాటు జైల్లో నిర్బంధించారు. ఆయనపై ఏడు కేసులు నమోదు చేశారు. వీటిలో రెండు బందిపోటు కేసులు, ఐదు హత్యకేసులు. హైదర్ ఈ కేసులతో భయపడి పాకిస్థాన్‌కో, విదేశాలకో పారిపోకుండా ధైర్యంగా న్యాయపోరాటం చేసి తనపై మోపిన ఆరోపణల్ని నివృత్తి చేశారు. గోల్కొండ పక్కనే నివాసముంటూ 1973లో చనిపోయారు. హైదర్ ఈ పుస్తకంలో సెప్టెంబర్ 17 సంఘటనకు ఒక కొత్త కోణాన్ని మన ముందు ఉంచారు. ఇప్పటి వరకు ఈ సంఘటన కాంగ్రెస్ జాతీయవాదులకు, హిందూ జాతీయవాదులకు, కమ్యూనిస్టులకు ఒక విజయోత్సాహం. కాంగ్రెస్ వాదులకు ఈ సంఘటనతో ఇండియా ఏకీకరణ పూర్తయింది. హిందూ జాతీయవాదులకు ఈ సంఘటన ముస్లిం పాలకులపై హిందువులు సాధించిన విజయం. కమ్యూనిస్టులకు ఈ సంఘటన రాచరిక వ్యవస్థపై ప్రజలు సాధించిన విజయం.

కానీ, హైదర్ చెప్పినట్లు ఈ సంఘటన లక్షలాది మంది ముస్లింలకు ఒక విషాద ఘటన. కొన్ని లక్షల కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయి. లక్షలాదిమంది నిరంతర నిర్బంధానికి, ఊచకోతకు గురయ్యారు. హైదర్ జీవితమే దీనికి ఒక పెద్ద ఉదాహరణ. ఒక ఉన్నత స్థాయి సివిల్ సర్వెంట్ ఇంతటి నిర్బంధానికి గురైతే సామాన్య ముస్లింల పరిస్థితి ఏ విధంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. తోటి ముస్లింలు కూడా హైదర్‌కు సాక్షులుగా ముందుకు రాలేదు . చివరకు నిజాం కూడా హైదర్‌ను అపరాధిగానే ముద్ర వేశాడంటే ముస్లింలలో ఎంత అభద్రతా భావం ఉందో అర్థమవుతుంది.  

ఈ పుస్తకం చాల బలంగా మన ముందు ఉంచిన మరో విషయం ఏమంటే, ఇంతవరకు మన చరిత్ర పుస్తకాలు మనకు రజాకార్లు, భారత సైన్యం చేసిన దుర్మార్గాలనే చెప్పాయి కానీ హిందూ మతోన్మాదులు దాదాపు ఒక సంవత్సరం పొడవునా జరిపిన మారణకాండ , దోపిడీలను గురించి ఎక్కడా చెప్పలేదు. మరో విషయం ఏమంటే, హైదరాబాద్ పతనానికి భారత సైన్యంతోపాటు హిందూ జాతీయవాదులు కూడా సమాన పాత్ర నిర్వహించారన్న విషయం ఈ పుస్తకం ద్వారానే తెలిసింది. హైదరాబాద్‌ను స్వతంత్రదేశంగా నిలబెట్టాలన్న రజాకార్ల ప్రయత్నం, స్వయం ప్రతిపత్తితో కూడిన హైదరాబాద్‌ను ఇండియాలో చూడాలన్న నిజాం రాజు ప్రయత్నాన్ని ఈ పుస్తకం చాలా విపులంగా వివరించింది. 

 కాశిం రజ్వీ మతోన్మాది అయినప్పటికీ ఒక మంచి మాట అన్నాడు. అదేమంటే 'ఇండియా ఒక భౌగోళిక భావన, హైదరాబాద్ ఒక రాజకీయ వాస్తవం'. ఈ మాట నేటికీ అక్షరాలా సత్యం. ఇండియా అనేక జాతుల సమ్మేళనమే కానీ ఏ నాటికీ ఒక జాతి కాలేదు.


మొత్తంగా ఈ పుస్తకం ముస్లిం సోదరులకు అయిన గాయాల్ని కళ్ళకు కట్టిననట్టుగా వివరిస్తుంది. ఆ గాయం రాచపుండులా ముస్లింలనే కాదు, ప్రజలందర్నీ నేటికీ వేధిస్తూనే ఉంది. భారత్, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య, సెక్యులర్ దేశమని గొప్పలు చెప్పుకుంటున్న మన ప్రభుత్వం హైదరాబాద్‌లో సైన్య ం సృష్టించిన మారణ హోమం మీద సుందర్‌లాల్ కమిటీ రిపోర్టును బహిర్గతం చేయకపోవటం విచారకరం. జరిగిన ఈ ఘోరానికి భారత ప్రభుత్వం ముస్లిం సోదరులకు బహిరంగ క్షమాపణ చెప్పకుండా వారి హృదయాలను గెలుచుకోలేదు. ఈ దేశంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛగా తల ఎత్తుకుని బతికే హక్కును కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే ఉంది.


- భంగ్యా భూక్యా
ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ







 

4 comments:

  1. How funny, the article above mentions that Md. Hyder fought and won acquittal on all cases against him. The high court judgement reports the facts to be completely diff. Please see http://www.indiankanoon.org/doc/285496/

    In a nutshell they are:
    1. he was convicted of many charges by spl tribunal
    2. Highcourt acquitted that on all counts for the TECHNICAL REASON THAT CONSTITUTING SPL. TRIBUNAL was unconstitutional ( NOT ON THE MERITS OF THE CASE)
    3. Govt appealed same to supreme court and THIS IS WHERE THE REAL FUN is. Govt withdrew all cases. Md. Hyder really fought(sic) with AP state govt not the courts.

    ReplyDelete
    Replies
    1. Md. Hyder fought relentlessly inside and outside the court that the charges made against him were false. Whether he lost or won the case in the court is not important here but his self conviction that he was not guilty in discharging his duties as Collector of Osmanabad district is important. There are many such cases in India in which people lost the cases in court although what they believed was right, for example Narmada Andholan case. People might have lost the case but everybody knows that it is injustice. so one should take the fighting spirit of people against injustice into consideration but not the end judgement.

      Delete
    2. i wonder who defines what EVERYBODY is? To my knowledge, it is the popularly elected government and it's associated functions such as judiciary who only can represent the citizens.

      Unfortunately I find Government also a culprit in this case. They should have let justice prevail thru the courts rather than pardoning him off by withdrawing the cases in the name of public interest.

      Delete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌