Monday, March 11, 2013

దళిత చరిత్రకు దర్పణం




దళిత చరిత్రకు దర్పణం
కోస్తా ఆంధ్రలో అంబేద్కర్ ఆలోచనలతో ప్రభావితమై ఎదిగిన దళిత ఉద్యమ చరిత్రే బొజ్జా తారకం గారి నవల 'పంచతంత్రం'. విద్యా ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకుంటున్న తొలితరం దళితులు, అప్పుడప్పుడే వారి అనుభవంలోకి వస్తున్న 'స్వాతంత్య్రం', మొదటి తరం దళిత నాయకత్వం ఎదిగిన తీరు వంటి అంశాలను ఈ నవల కళ్ళకు కట్టినట్టు చిత్రించింది. కేవలం పరిశోధన ద్వారా రాయగలిగే నవల కాదిది. గొప్ప జీవితానుభవం ఉన్నవాళ్ళు మాత్రమే రాయగలరు.

తారకంగారి తండ్రి బొజ్జా అప్పలస్వామిగారు మొదటితరం అంబేద్కరిస్టు. ఆయన జీవితం, పోరాటమే 'పంచతంత్రం' నవలకు నేపథ్యం. తారకంగారు కూడా సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఉన్న వ్యక్తి. మూడు తరాల పోరాటాలకు ప్రతినిధి. 1947 తర్వాత ఎగసిన అంబేద్కర్ ఉద్యమాలతోనే ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1970లలో ఉవ్వెత్తున లేచిన రైతాంగ ఉద్యమాలు, పౌరహక్కుల ఉద్యమాలు ఆయనను రాటుదేలిన పోరాట యోధుణ్ణి చేశాయి. 1985లో జరిగిన కారంచేడు మారణకాండ ఆయన్ని పూర్తిస్థాయి దళిత నాయకుణ్ణి చేసింది. ఏడుపదుల వయస్సులో లక్ష్మింపేట ఉద్యమాన్ని కూడా ఆయనే ముందుండి నడుపుతున్నారు. ఈ నేపథ్యం, రాజకీయ ప్రభావాలు, చారిత్రక ఘట్టాలన్నీ 'పంచతంత్రం' నవలను అర్థం చేసుకోవడానికి చాలా అవసరం.

తెలుగు దళిత సాహిత్యంలో 'పంచతంత్రం' ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందుతుంది. తొలి దశ దళిత ఉద్యమ చరిత్ర కథాంశంగా నవలలు ఇంతవరకూ రాలేదు. గాంధేయవాదాన్ని వదిలించుకుంటూ వామపక్ష ఉద్యమాలకు వెలుపల స్వతంత్రంగా ఎదిగిన దళిత ఉద్యమాల చరిత్ర మీద రాసిన నవలలేమీ లేవు. చిలుకూరి దేవపుత్ర గారి 'పంచమం' నవల కారంచేడు తర్వాతి పోరాటాలను చర్చిస్తే, కల్యాణరావుగారి 'అంటరాని వసంతం' నవల దళితుల సాంస్కృతిక వారసత్వం, క్రైస్తవంలోకి మారడం, పీడనకు దోపిడీకి వ్యతిరేకంగా వారు చేసిన భూపోరాటాలు, చివరగా నక్సలైటు ఉద్యమంలో భాగం కావడాన్ని చిత్రీకరించింది. వేముల ఎల్లయ్య 'కక్క' నవల తెలంగాణ మాదిగ జీవితం, భాష, సంస్కృతిని వివరిస్తుంది. వీటన్నిటికీ భిన్నంగా 'పంచతంత్రం' ఆంధ్రలో అంబేద్కర్ ఆలోచనా విధానంతో ప్రభావితమైన దళిత ఉద్యమ క్రమాన్ని చూపిస్తుంది.

మాలపల్లెకు, జమీందారీ కుటుంబానికి మధ్య ఘర్షణ ప్రధాన ఇతివృత్తంగా సాగే ఈ నవలలో ముఖ్యపాత్రలు మూడు. కాపు కులస్తుడైన జమీందారు విశ్వనాథం, మాల యువకుడు విద్యార్థి నాయకుడు అయిన సూరన్న, మిలట్రీలో పనిచేసి వచ్చిన మరో మాల కులస్తుడు సుబ్బారావు. సూరన్న బాల్యం నుంచి అనేక అవమానాలకు, వివక్షకు గురవుతూ చివరికి తన కృషితో, చైతన్యంతో విద్యార్థి నాయకుడుగా ఎదిగిన తీరును చాలా బాగా చిత్రించారు.

సుబ్బారావు మాలపల్లెకు నైతిక ధైర్యాన్నిస్తూ, సూరన్నను కాపాడుకుంటూ దళిత ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తాడు. పాలేర్లుగా, వెట్టిచాకిరీ చేసే కూలీలుగా, అంటరానివారిగా అవమానాలకు, అణచివేతకు గురవుతూ బతుకుతున్న దళితులు విద్యావకాశాల వల్ల, ఉద్యమ చైతన్యం వల్ల, 'స్వాతంత్య్రం' తెచ్చిన వెసులుబాటు వల్ల విద్యావంతులుగా, నాయకులుగా రూపొందడం, జమీందార్ల అక్రమ ఆక్రమణ నుండి భూముల్ని తిరిగి తీసుకోవడం, జమీందారు ఆస్తులకు అండగా ఉన్న రెవిన్యూ పోలీసు వ్యవస్థను వ్యతిరేకించడం వంటి ఘటనలన్నిటినీ అత్యంత వాస్తవికంగా మన కళ్ళ ముందు నిలిపారు రచయిత. తారకంగారి కథన శైలి, కవిత్వం తొణికిసలాడే భాష ఈ నవలను మరింత పఠన యోగ్యం చేశాయి.
- కె. సత్యనారాయణ
(ఆదివారం ఆంద్ర జ్యోతి 10 మార్చ్ 2013 సౌజన్యం తో )


పంచతంత్రం ,
బొజ్జా తారకం
పేజీలు : 290,
వెల : రూ. 100
ప్రతులకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్

.

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌