ఇవీ...నేను అనుకున్నవి
నేను ఒక గొప్ప వ్యక్తినీ, రచయిత్రినీ కాకపోయినప్పటికీ 'నీ జీవితం ఓ కావ్యం లాంటిది. అది పదిమందికీ తెలియడం అవసరం' అని చెపుతుండేవాళ్ళు కొంతమంది పెద్దలూ, మిత్రులూ. 'సామాన్యుని సాహసమెట్టిదో...' చరిత్రలో నమోదు కావాలని మహీధర రామమోహనరావు, చేకూరి రామారావు, స్మైల్ వంటివాళ్ళు, పరకాల పట్టాభి రామారావు, మానికొండ సూర్యావతి వంటి మిత్రులు నన్ను ఆత్మకథ రాయమని ప్రోత్సహిస్తుండే వాళ్ళు.
జ్ఞాపకాలను తట్టి లేపితే కన్నీటి ఊట ఉబికి వచ్చే జీవితం నాది. తడిసిన ఆ అక్షరాలను అర్థవంతంగా కాగితం మీద పెట్టడం నా వల్ల అవుతుందా అనుకున్నాను. అందుకే ఇన్నేళ్ళుగా ఆ ప్రయత్నం చేయలేదు.
నా మనవరాళ్ళు అనురాధ, సుధ, నన్ను అమ్మమ్మా అని పిలిచే మరో మనవరాలు వసంత (వేమన వసంతలక్ష్మి) 'నీ ఒంట్లో శక్తి తగ్గకముందే నీ జీవితాన్ని కథగా రాయి. ముందు తరాలకు తెలియకుండా దాన్ని మాసిపోనివ్వొద్ద'ని మరీ మరీ చెప్పారు.
అయినా నా శక్తీ, నా కంటిచూపూ అందుకు సహకరిస్తాయా అని సందేహించాను.
నీ మిత్రులు ఎందుకు రాయమన్నారో ఆలోచిస్తేనూ, విూరు ఆనాడు ఎందుకు ఉద్యమించారో గుర్తుచేసుకుంటేనూ నీ కన్నీరే కథగా ప్రవహిస్తుంది ప్రారంభించమన్నారు వాళ్ళు.
అచ్చు ప్రతిని సిద్ధం చేయడంలో అనురాధ, అనురాధ మిత్రులు వాసుగారు, వసంత ఎంతో సహకరించారు. సుందరయ్యగారు, రాజేశ్వరరావు గారిలాంటి వ్యక్తులు నా జీవితంతో ఎంతగానో ముడిపడిపోయిన వ్యక్తులు కాబట్టి సహచర కామ్రేడ్స్ మీద రాసిన సంస్మరణ వ్యాసాలను కూడా ఇందులో అనుబంధంగా చేర్చాను. ప్రత్యేకించి అనురాధ అచ్చు ప్రతిని సిద్ధం చేయడంలో చాలా శ్రమ తీసుకుంది.
స్త్రీ జనాభ్యుదయంపై ప్రేమాభిమానాలున్న ఓల్గాగారు అడగ్గానే ముందుమాట రాయడానికి ఒప్పుకున్నారు. నా కథను పాఠకులు లోతుగా ఆలోచించేటట్లుగా చారిత్రక ఉద్యమాల అవగాహనతో విశ్లేషించారు.
ఈ పుస్తక ప్రయత్నం గురించి తెలిసి దాన్ని అచ్చువేయడానికి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ముందుకొచ్చారు. 'సంస్కరణోద్యమం, జాతీయోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం, నక్సల్బరీ ఉద్యమం మొత్తం నాలుగు ఉద్యమాలతో సంబంధం ఉన్న జీవితం మీది. కనుక దేన్నీ వదిలిపెట్టకుండా రాయమని' కొన్ని సూచనలిచ్చారు బుక్ ట్రస్ట్
గీత గారు. ఆ ప్రకారం మరికొన్ని అనుభవాలు గుర్తు తెచ్చుకుని రాశాను. మరికొన్నిటిని విమలగార్ని విశాఖపట్నం పంపి రికార్డు చేయించి ఇందులో చేర్చారు.
ఇందరి సహకారంతో నా జీవిత కథ ఇవ్వాళ నా 92వ యేట పుస్తక రూపంలో రానుంది. వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు.
నా జీవిత కథ చదివిన పాఠకులు ఇది సంఘ శ్రేయస్సు కొరకు రాయబడిందను కుంటే సంతోషిస్తాను. నా కథ మనిషిలో మంచిని ఏ కొంచెమైనా పెంచుతుందను కుంటే నా శ్రమ ఫలించిందనుకుంటాను. ఇన్నేళ్ళ నా బ్రతుకు వృథా కాలేదని తెలిసి తృప్తిపడతాను.
- కొండపల్లి కోటేశ్వరమ్మ
15.8.2012
(నిర్జన వారధి పుస్తకంలోనుండి )
నిర్జన వారధి
కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ
పేజీలు 184 వెల: రూ. 100 /-
ప్రతులకు:
హైదరాబాద్ బుక్‌ట్రస్ట్,
ఫ్లాట్ నెం. 85, బాలాజీనగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్-6.
Now NIRJANA VAARADHI is available to the international Telugu reader;
Here is the link to the book:
http://kinige.com/kbook.php? id=1196&name=Nirjana+Vaaradhi
Now NIRJANA VAARADHI is available to the international Telugu reader;
Here is the link to the book:
http://kinige.com/kbook.php?
Thank you for the book! Its awe-inspiring! I already plan to gift the book to a few people I know!
ReplyDelete