Tuesday, August 28, 2012

అపూ విజయం...




తెలుగు సాహిత్యంలో అనువాద రచనలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటూ వచ్చింది. అందునా బెంగాలీ నుండి అనువదించబడిన కథలకు, నవలలకు మరింత విశిష్టత ఉంది. 


ఠాగూర్ (1861-1941), శరత్ (1876-1938)ల రచనల అనువాదాలను క్షుణ్ణంగా చదివి జీర్ణించుకున్న ఒక తరం తెలుగు వాళ్ళున్నారు. శరత్ తెలుగువాడే కాదని తరువాతెప్పుడో తెలుసుకుని నిర్ఘాంతపోయిన వాళ్ళున్నారు. 

ఒకప్పుడు తెలుగువారి సాహిత్యంపైనే కాకుండా సినిమాపైన కూడా బెంగాలీ రచనల ప్రభావం ఉండేది. అయితే ఆ బంధం అక్కడితో తెగిపోయినట్లుంది. అందుకే శరత్ తర్వాత తరానికి చెందిన బిభూతిభూషణ్ బందోపాధ్యాయ (1894-1950) మొదలుకొని సమకాలీన బెంగాలీ సాహిత్యం వరకు తెలుగు అనువాదాలు రావాల్సిన మేరకు రాలేదు. ఈ లోటుని పూరించేందుకు కాత్యాయని గారి ఈ అనువాదం ఎంతగానో దోహదం చేస్తుంది.

బిభూతి భూషణ్ రచించిన 'పథేర్ పాంచాలి', 'అపరాజిత' అనే రెండు నవలల్ని మూడు సినిమాలుగా మలిచిన సత్యజిత్ రే, అంతర్జాతీయ సినిమా రంగంలోనే కాక అటు ప్రపంచ సాహిత్యంలోనూ వాటికి మహోన్నత స్థానాన్ని సుస్థిరం చేశాడు. 


నిజానికి ఈ రెండు నవలలూ బిభూతిభూషణ్ తన స్వీయానుభవాల ఆధారంగా రచించినవే. గొప్ప రచనలన్నిటిలోనూ గోచరించే ఆత్మకథా వస్తు విశేషం వీటిల్లోనూ దాగి ఉంది. అందుకే అవి ఎంతో నిజాయితీతో కూడిన నమ్మశక్యమైన మానవీయ గాథలుగా చదువరుల హృదయాలకు హత్తుకుపోయాయి.

ఎన్నో తరాలబాటు స్వయంపోషకంగా ఉండిన గ్రామీణ వ్యవస్థ శిథిలం కావడం, వ్యవసాయ ఆదాయం ఇగిరిపోవడం, నడ్డివిరిచే రుణభారం, పట్టణాలకు వలసపోవడంలోని విషాదం, 
వలస వెళ్ళిన చోట ఇమడలేకపోవడం, గతించిన రోజుల్ని తలచుకుంటూనే కొత్త పరిసరాల్లో కొత్త స్నేహాల్ని సంబంధాల్ని సృష్టించుకోవడం, నగర జీవనానికి అవసరమైన నైపుణ్యాలను, మానసిక స్థితినీ ఏర్పరచుకునే ప్రయత్నాలూ ఇవన్నీ ఈ నవలలో కనిపిస్తాయి. 

ఈ మేరకు నవలలో పేర్కొన్న సంఘటనలు- కాస్త అటుఇటుగా మొత్తం భారతదేశంలో (మరికొన్ని దేశాల్లోనూ ఎక్కడైనా జరిగి ఉండవచ్చు. సర్వజయ, దుర్గ, హరిహరుడు, అపూ, ఇంకా ఇతర పాత్రలు సమకాలీన రూపాల్లో మనకు సులభంగానే తారసపడతారు. రథచక్రపుటిరుసులలో పడి నలిగి లక్షలాదిమంది నశించిపోగా అపూ లాంటి అపరాజితులు అక్కడక్కడా నిలదొక్కుకున్నారు.

అపూ లేదా బిభూతి భూషణ్ రచయిత గనక ఈ క్రమాన్ని నమోదు చెయ్యగలిగాడు. ఇక్కడికి వచ్చేసరికి పాత్రకీ, దాని సృష్టికర్తకూ మధ్య ఉన్న హద్దులు చెరిగిపోతాయి. నిజజీవితంలో కూడా బిభూతి భూషణ్ తన చిన్ననాటి ప్రదేశానికే వెళ్ళి స్థిరపడ్డాడు. అయితే ఈ విధమైన తిరుగు ప్రయాణం అందరికీ ఇవాళ సాధ్యం అవుతుందా?...

కాత్యాయని గారి అనువాదం ఈ నవలకు, అందులోని భావుకతకు, ఆర్ద్రతకు, మార్మికతకు, ప్రకృతి వర్ణనలకు పూర్తి న్యాయం చేకూర్చే విధంగా ఉంది. నిజానికి మూల రచన చదువుతున్నామనే భావనే కలిగిస్తూ అత్యంత సాఫీగా సాగిపోయింది. 

హైదరాబాద్ బుక్ ట్రస్టు వారు తమ ప్రమాణాలకు అనుగుణంగా చక్కగా ముద్రించారు. 
ఎంతో ఆలస్యంగా తెలుగు పాఠకులకు అందిన అపురూపమైన కానుక ఈ పుస్తకం.
- ఉణుదుర్తి సుధాకర్
(ఆంధ్ర జ్యోతి ఆదివారం 26 8 2012 సౌజన్యం తో )

అపరాజితుడు,
బిభూతి భూషణ్ బందోపాధ్యాయ
పేజీలు : 200, వెల : రూ. 100

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌