''దేవుడున్నాడా? చూపించు'' అనే నాస్తిక, హేతువాదులు గానీ, ''అడుగో గోడలో ఉన్నాడు. ఇడుగో స్తంభంలో ఉన్నాడు'' అనే ఆస్తిక, భక్తిపారాయణులుగానీ ప్రధానంగా నిరూపణవాదాన్నే ఆశ్రయిస్తూ ఉంటారు.
ఆటవిక దశ దాటని ఈశ్వరారాధకులు భగవత్ దర్శనం చేయించలేనట్టే, ప్రాథమిక భౌతికవాద దృష్టిని మాత్రమే కలిగిన నిరీశ్వరవాదులు తమ వాదనకు అనువుగా ప్రకృతి లీలలను ప్రదర్శించలేరు.
ఈ విషయంలో ఇరుపక్షాలూ మూర్ఖులేననేది కొడవిటిగంటి రోహిణీ ప్రసాద్ పరిశీలన.
భౌతిక సూత్రాలను అనుసరించి సాగే ప్రకృతి ... మానవాళికి నిదర్శనాలను చూపించాల్సిన అవసరమే లేదని, మన మంచితనం, అవగాహన, చైతన్య స్థాయిలతో దానికి పనిలేదనేది ఆయన వాదన.
భౌతిక యుద్ధంలో ప్రత్యర్థి బలంపై దెబ్బకొట్టాలనే మార్క్సిస్టు సాహిత్యకారుడు కొ.కు. సూత్రీకరణకు కొనసాగింపుగా అన్నట్టు సంక్లిష్టమైన మానవ మెదడులో దేవుడు రూపుదిద్దుకున్న క్రమాన్ని ఆయన కుమారుడు రోహిణీప్రసాద్ సానుభూతితో పరిశీలించి చేసిన విలువైన విశ్లేషణలతో ''మనుషులు చేసిన దేవుళ్లు'' వ్యాసాలు రూపుదిద్దుకున్నాయి.
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన ఈ పుస్తకంలోని 44 వ్యాసాల్లో ప్రధానంగా వైజ్ఞానిక దృష్టి కనిపిస్తుంది.
మతాన్ని సమాజ పరిణామక్రమం నుంచే గాక జీవ పరిణామక్రమం నుంచి పరిశీలించడం, చరిత్ర నుంచే కాక నాడీ వ్యవస్థ, మెదడు స్పందనల నుంచి దైవ మూలాలను వెలికి తీసేందుకు ప్రయత్నించడం వంటి పోకడల వల్ల ''తెలుగులో మరెవ్వరూ చేయని ప్రయత్నం చేశా''ననే వ్యాసకర్త మాటలకు పుష్టి చేకూరుతోంది.
అయితే మార్క్సిజానికి బయట కూడా మత విశ్లేషణ చేయొచ్చుననే ప్రతిపాదనతో బయలుదేరిన రోహిణీ ప్రసాద్, చాలా వ్యాసాల్లో శద్ధ భౌతికవాదిగా తేలిపోయారు. వైజ్ఞానిక కృషికి తాత్విక దృష్టిని జోడించలేకపోవడం వల్ల ఆయన కంటికి 'మతం' మసగ్గానే కనిపించిందని చెప్పక తప్పదు.
- వి. అరవింద్
( ఆదివారం ఆంధ్రజ్యోతి 26 ఫిబ్రవరి 2012 సౌజన్యంతో)
మనుషులు చేసిన దేవుళ్లు (వ్యాసాలు)
కొడవటిగంటి రోహిణీ ప్రసాద్
పేజీలు196,
వెల: రూ.100/-
తన యింటి కప్పు చిల్లు లోంచి కనుపించేదే ఆకాశం అని వాదించటం అనే తెలివి తక్కువతనం ఉభయపక్షాలలోనూ కానవస్తుంది.
ReplyDeleteఉభయవాదాలలోను సమప్రజ్ఞ మరియు సమదృష్టి రెండు కలిగి ఉండటం సామాన్య విషయం గాదు.
కాబట్టి అటూ ఇటూ కూడా కేవల ప్రజ్ఞావాదాలు తప్ప మరి సత్యదర్శనం చేయించగల సత్తా సాధారణంగా కానరాదు.