ఏడు తరాలు
పుస్తకాలు కేవలం
విజ్ఞానాన్నీ, వినోదాన్నీ
పంచి ఊరుకోవు. అవి మనల్ని ప్రభావితం చేస్తాయి కూడా. అలా నన్ను ప్రభావితం చేసిన
ఒకానొక పుస్తకం 'ఏడు తరాలు.' ఎలెక్స్ హెలీ ఆంగ్ల నవల 'రూట్స్' కి సహవాసి చేసిన సరళమైన తెలుగు అనువాదం.
విజేతలే చరిత్రలు రాశారు, రాస్తారు.
ఇది సామాన్యంగా జరిగే విషయం. ఎందుకంటే పరాజయాలు చెప్పుకోగలిగే విషయాలుగా అటు
పరాజితులకీ, ఇటు సమాజానికే
కూడా అనిపించవు కాబట్టి. కానీ, ఈ ఆనవాయితీని బద్దలు కొట్టిన వాడు హెలీ.
'ఏడు తరాలు' బానిసల కథ. కేవలం తమ అమాయకత్వం కారణంగా,
చీకటి ఖండం ఆఫ్రికా నుంచి అమెరికాకి
బానిసలుగా తీసుకురాబడ్డ దురదృష్టవంతుల కథ. పచ్చటి ఆఫ్రికా
పల్లెల్లో, తమవైన సంస్కృతీ సంప్రదాయాల మధ్యన, ఆటపాటలతో జీవితం గడుపుతున్న ఆఫ్రికా వాసులని,
వలవేసి పట్టుకుని, బంధించి, రోజుల తరబడి గాలైనా సోకని ఓడలలో తమ దేశానికి రవాణా చేసి, నడిబజార్లో వాళ్ళని వేలం వేసిన అమెరికన్ల కథ.
క్రీస్తుశకం 1750
లో పడమటి ఆఫ్రికా లో గాంబియా
సమీపంలోని జపూరు అనే పల్లెటూళ్ళో ఉమరో-బింటా దంపతులకి నేరేడు పండులా
నిగనిగలాడే 'కుంటా' అనే కొడుకు పుట్టడం కథా ప్రారంభం. ఆఫ్రికా పల్లెల
సౌందర్యాన్నీ, సమస్యలనీ,
ప్రకృతి వైపరీత్యాలనీ పరిచయం
చేస్తూనే, అక్కడి జీవన
విధానాన్నీ కళ్ళ ముందుంచుతారు రచయిత. ముఖ్యంగా పిల్లల పెంపకం, పనిపాటలతో పాటు రాయడం, చదవడం నేర్పించడం, మగ పిల్లలని ప్రత్యేకమైన 'పురుష' శిక్షణ కోసం పంపించడం ఇవన్నీ పాఠకులని ఆశ్చర్య
పరుస్తాయి.
కుంటా తమ పల్లె
దగ్గరలో ఉన్న అడవిలో పురుష శిక్షణ పూర్తి చేసుకుని యువకుడి గ్రామానికి
తిరిగి వచ్చాక, అతనికి వేరే
ఇల్లు కట్టించి అక్కడికి పంపేస్తారు తల్లిదండ్రులు. అడవుల్లో తిరిగేటప్పుడు 'తెల్లోడి' బారిన పడకుండా ఎలా తప్పించుకోవాలో కొడుక్కి వివరంగా చెబుతాడు
ఉమరో. తడిసిన కోడి మాంసం వాసన వచ్చిందంటే దగ్గరలో తెల్లోడు ఉన్నట్టేననీ, వాడి అడుగులు బరువుగా పడతాయనీ, ఆకుల్ని తుంపుతూ పోతాడనీ.. ఇలా ఎన్నో
ఆనుపానులు విశదంగా చెబుతాడు.
మంచెమీద కూర్చుని
రాత్రంతా పొలం కావలి కాస్తూ, యవ్వన
సహజమైన కోర్కెలతో భావి సంసారజీవితాన్ని గురించి మేల్కొనే కలలు కంటూ నిద్రకు
దూరమైన కుంటా, మర్నాడు ఉదయాన్నే
తమ్ముడికి మృదంగం చేసి ఇవ్వడం కోసం నాణ్యమైన దుంగ కోసం అడవికి వెళ్లి
ఏమరుపాటున తెల్లోడికి చిక్కుతాడు. అక్కడినుంచి అతని కష్టాలు ప్రారంభం.
దెబ్బలతో స్పృహ తప్పించి తీసుకెళ్ళిన తెల్లోళ్ళు, కుంటాని ఒక ఓడలో గొలుసుతో బంధిస్తారు. ఆ ఓడ నిండా
వందలాది ఆఫ్రికావాసులే.
దుర్భరమైన ప్రయాణం తర్వాత
తీరం చేరుతుంది ఓడ. వేలంలో కుంటాని కొనుక్కున్న యజమాని అతనికి 'టోబీ' అని పేరు పెట్టి తనతో తీసుకెళ్ళి పోతాడు. చేతులుమారిన కుంటా వర్జీనియాలో 'నిగ్గరు' (బానిస) గా స్థిరపడతాడు. పారిపోడానికి ఎన్నో ప్రయత్నాలు
చేస్తాడు. అవన్నీ విఫలమవుతాయి. తన ప్రయత్నానికి శిక్షగా కాలు కోల్పోతాడు.
నలభయ్యేళ్ళ వయసులో తోటి నిగ్గరు బెల్ ని పెళ్లి చేసుకుని 'కిజ్జీ' కి తండ్రవుతాడు. కూతురికి జ్ఞానం రాగానే, దగ్గర కూర్చోబెట్టుకుని జపూరు గురించీ,
తన బాల్యాన్ని గురించీ, తను బానిసగా వచ్చిన వైనాన్ని గురించీ వివరంగా
చెప్పడంతో పాటు తన భాషనీ నేర్పుతాడు.
ఈ కథ పరంపరాగతంగా
ప్రతీ తరమూ తన తర్వాతి తరానికి చెప్పడం ద్వారా, ఎనిమిదో తరం వాడైన ఎలెక్స్ హెలీకి చేరడం, అతడు చాలా పరిశోధన చేసి 688 పేజీల ఆంగ్ల నవలగా తీసుకురావడం తర్వాతి కథ. ఈ ఆంగ్ల
నవల సారాన్ని క్లుప్తంగా, సరళంగా తెనిగీకరించారు 'సహవాసి' గా పేరొందిన జంపాల ఉమామహేశ్వర రావు. (నాకు కొద్దిపాటి
పరిచయం ఉంది అని చెప్పుకోడానికి గర్వ పడే వ్యక్తుల్లో ఒకరీయన). తనకి మరికొంచం
వివరంగా రాయాలని ఉన్నా, ప్రకాశకుల
కోరిక మేరకే బాగా క్లుప్తీకరించాల్సి వచ్చిందని ఆదివారం ఆంధ్రజ్యోతి 'ఫెయిల్యూర్ స్టోరీ' కి ఇచ్చిన ఇంటర్యూ (బహుశా ఆయన చివరి ఇంటర్యూ) లో చెప్పారు.
జపూరు నాగరికత,
తరాల పాటు కొనసాగిన అంచె డప్పుల
వ్యవస్థ మొదలుకొని, విముక్తి కోసం కుంటా పడే
తపన, తన సంస్కృతీ
సంప్రదాయాలని నిలబెట్టుకోవడం కోసం పడే తాపత్రయం వెంటాడతాయి. అంతేనా? నిగ్గర్ల కష్టాలు, యజమానుల కారణంగా వాళ్ళు పడే హింస,
ఒకరితో ఒకరు కనీసం మాట్లాడుకోలేని
అసహాయత, యజమానుల మెప్పు కోసం చేసే వృధా
ప్రయత్నాలు ఇవన్నీ కలుక్కుమనిపిస్తాయి. ఒక్క క్షణం ఏమరుపాటు కారణంగా తమ
జీవితాలనే మూల్యంగా చెల్లించిన వాళ్ళు వాళ్ళంతా. అంతే కాదు, ప్రపంచానికి నాగరికత నేర్పానని
నిస్సిగ్గుగా చెప్పుకునే దేశం చేసిన అనాగరిక పనికి ప్రత్యక్ష సాక్ష్యాలు కూడా.
తరచి చదవగలిగితే
ఎన్నో జీవిత సత్యాలని విప్పి చెబుతుందీ నవల. ఒక్కో పాత్రనుంచీ నేర్చుకోగలిగింది
ఎంతైనా ఉంది. సహవాసి రాసిన ఎన్నో చిన్న వాక్యాలు పదే పదే వెంటాడతాయి.
ఆలోచనల్లో పడేస్తాయి. ప్రతి ఒక్కరూ చదవాల్సిన, చదివించాల్సిన ఈ నవలని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది.
(ఈ సమీక్షను మా బ్లాగులో పొందుపరచుకునేందుకు అనుమతించిన మురళి గారికి ధన్యవాదాలు. వీక్షకుల స్పందనలకోసం నెమలి కన్ను బ్లాగును సందర్శించండి.: )
http://nemalikannu.blogspot.com/2011/07/blog-post_11.html
This one book - profoundly increased my surface area of thought process.
ReplyDeleteThis one book - made me a fan of Saha vasi.
This one book - had great impact on my life. I read it at the age of 14 an never forgot the essence!
VERY USEFUL. I LIKE ,NONE OTHER HBT
ReplyDeletehttp://ramamohanchinta.blogspot.com/