Wednesday, October 28, 2009

జమీల్య నవలపై అంతర్వాహిని బ్లాగులో నరేష్ నందం గారి సమీక్ష





హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన "జమీల్య" నవల ను నరేష్ నందం గారు తన బ్లాగు "అంతర్వాహిని" లో చాలా అద్భుతంగా సమీక్షించారు. ( http://janaj4u.blogspot.com/2009/10/blog-post.html ). వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా బ్లాగు వీక్షకుల సమాచారం కోసం దానిని తిరిగి ఇక్కడ యధాతధంగా పొందుపరుస్తున్నాము.

"జమీల్య"

“ప్రపంచంలోనే బహు సుందరమైన ప్రేమకథ”గా విమర్శకుల మన్ననలు పొందిన కథ ఇది.

“సామాజికంగా సరికొత్త విలువలు, వ్యవస్ధలు పాదుకొల్పుకుంటున్న సంధి దశలో కిర్గిస్తాన్ ఎదుర్కొన్న జాతీయ, సాంఘిక, సైద్ధాంతిక సంఘర్షణలకు అద్దం పడుతుందీ” రచన.

కిర్గిస్తాన్ రచయిత “చింగీజ్ ఐత్‌మాతోవ్”కు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన నవల జమీల్యా.
ఈ పుస్తకాన్ని నవల అనే కంటే కూడా పెద్ద కథ అంటే సరిపోతుందేమో!

కిర్గిజ్, రష్యన్ భాషలలో వెలువడిన ఈ కథ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషలలోకి అనువదింపబడింది. భారత దేశంలో రష్యన్ రచయితల ప్రాభవం, ప్రభావం పెరుగుతున్న 1950లలో ఈ పుస్తకాన్ని తెలుగులోకి ఉప్పల లక్ష్మణ రావు గారు అనువదించారు.

ప్రధాన పాత్రలు, పరిస్ధితులు:
ఈ కథ కిర్గిస్తాన్‌లోని కుర్కురోవ్ అనే గ్రామం నేపధ్యంగా సాగుతుంది.
జర్మనీతో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున ప్రతి యువకుడు పాల్గొనాల్సిన పరిస్ధితి. గ్రామాల్లో వృద్ధులు, పిల్లలు, వికలాంగులు తప్ప మగదిక్కు ఉండని వాతావరణం. “పండే ప్రతి గింజ యుద్ధభూమికే” అన్న నినాదంతో యుద్ధంలో పాల్గొంటున్న సైనికుల అవసరాలకోసం, ఇంకా చెప్పాలంటే ప్రతి స్త్రీ తన భర్త, కొడుకుల కోసం పొలంలో శ్రమించాల్సిన అవసరం అప్పటిది.
యుద్ధభూమి నుండి ఏదైనా ఉత్తరం గాని, ఎవరైనా సైనికుడు గానీ వస్తే తమ వారి గురించీ, యుద్ధ వాతావరణం గురించి అడిగి తెలుసుకునే దాకా అందరిలోనూ ఉత్కంఠ నెలకొంటుంది.

ఈ పరిస్ధితులలో ఆ కుర్కురోవ్ గ్రామంలో ఉన్న మన కథకుడు సయ్యద్ తన ఆలోచనలనూ, అనుభవాలనూ పాఠకులతో పంచుకుంటాడు.

సయ్యద్: తన చుట్టూ తన ప్రమేయం లేకుండా జరుగుతున్న సంఘటనలను మౌనంగా చూడటం తప్ప సమర్దించటం లేదా వ్యతిరేకించటం చేయలేని పరిస్ధితి అతనిది. కథాసమయం నాటికి అతని వయసు పదిహేను లేదా పదహారేళ్లు. ఇద్దరు అన్నలు యుద్ధంలో చనిపోతారు. అమ్మ, నాన్న, పిన్ని, ఒక చెల్లెలు, మారుటి అన్న, వదిన.. ఇతని కుటుంబం. చిత్ర కళ అంటే ఆశక్తి.

సాదిక్: సయ్యద్‌కు మారుటి అన్న. సరిగా చెప్పాలంటే.. సాదిక్ నాన్న చనిపోయాక కట్టుబాటు ప్రకారం, అతని అమ్మను సయ్యద్ నాన్న పెళ్లి చేసుకుంటాడు. జర్మనీతో జరుగుతున్న యుద్ధంలో పాల్గొనేందుకు మిగిలిన యువకులతో పాటు తప్పనిసరి పరిస్ధితులలో యుద్ధానికి వెళతాడు. అప్పటికే పెల్లైన ఇతను భార్య అంటే వస్తువుగా, మగాడి ఆస్తిలో భాగంగా చూసే అప్పటి సమజానికి అసలైన ప్రతినిధి.

జమీల్యా: సయ్యద్ భార్య. ఒక గుర్రపు వ్యాపారి కుమార్తె. కొత్త కోడలిగా వచ్చిన ఆమెకు ఆదరించే ఇద్దరు అత్తలు దొరుకుతారు. పెళ్లి ఐన వెంటనే భర్త యుద్ధానికి వెళతాడు. అత్త మామలకు తోడుగా వ్యవసాయ పనులు చేస్తుంది. తన “చిట్టి మరిది”తో ఆటలు ఆడుతుంది. ఊళ్లో ఎవరైనా తమలపాకుతో ఒకటిస్తే, ఈమె తలుపు చెక్కతో రెండిస్తుంది.

ధనియార్: మాజీ సైనికుడు. చిన్ననాడే కుర్కురోవ్ గ్రామం వదిలిపోయినా, యుద్ధంలో గాయపడిన తర్వాత తిరిగి స్వగ్రామం చేరుకుంటాడు. ఆ ఊళ్లో పొలం పుట్ర ఏమీ లేని కారణం చేత గ్రామ సమిష్టి వ్యవసాయ క్షేత్రంలో అతనికి కూలీగా పని ఇస్తారు పెద్దలు. ఒకరి జోలికి పోకపోవటం, ఎవరితోనూ స్నేహంగా ఉండకపోవటం వలన ఇతనంటే ఆ ఊరి పిల్లలకు లోకువ, పెద్దలకు అనాసక్తి.

కథలోకి వెళ్తే..:

సయ్యద్ ఒక సామాన్య యువ రైతు తన బాల్యం, కుటుంబం, అందులో అనుకోకుండా వచ్చి పడిన కొన్ని పరిస్ధితులను విశ్లేషించుకుంటూ తన మనసులోని మాటలను కథ రూపంలో మనకు చెప్తాడు. ఒక చిత్రాన్ని గురించి వివరిస్తూ కథలోకి దారి తీస్తాడు.

అతని స్వంత అన్నలు ఇద్దరు, మారుటి అన్న సాదిక్ యుద్ధానికి వెళతారు. వడ్రంగి ఐన తండ్రి, కుటుంబ పెత్తనం అంతా ఇతని తల్లికే వదిలేస్తాడు. అతని పిన్ని, సాదిక్ భార్య- జమీల్యా పక్కనే ఉన్న “చిన్న ఇంట్లో” ఉంటారు. జమీల్యా అంటే అతనికి ఎంతో అభిమానం. గోధుమ పంటను రైల్వే స్టేషనుకు గుర్రపు బండ్లపై తీసుకువెళ్లేందుకు జమీల్యా అవసరం పడుతుంది. “ఆడకూతురుని నేను పంపను” అని సయ్యద్ అమ్మ ఆ గ్రామ సమిష్టి వ్యవసాయ క్షేత్ర అధికారితో గొడవ పడుతుంది. చివరకు సయ్యద్ తోడుగా ఉంటాడనీ, ఇంకా కావాలంటే ధనియార్ కూడా వస్తాడనీ చెప్పటంతో ఒప్పుకుంటుంది.

తర్వాతి రోజు ఉదయం నుంచి వీరు ముగ్గురు గోధుమలు తీసుకెళతారు. స్వతహాగా వాగుడుకాయలైన జమీల్యా, సయ్యద్‌లు దారంతా ధనియార్‌ను వెక్కిరిస్తారు. అతనిపై జోకులేస్తారు. ఉదయం వెళ్లిన వారు తిరిగి రాత్రికి గానీ ఊరు చేరలేరు కాబట్టి వచ్చేటప్పుడు అంత దూరం వెన్నెల కాంతిలో ప్రయాణాన్నీ, “సైపు” మైదానాలలో గుర్రపు బండ్ల పోటీగా మార్చుకుంటారు. తిరుగు ప్రయాణంలో జమీల్యా పాడే పాటలు ఆ వెన్నెల రాత్రులని మరింత అందంగా చేస్తాయి. ఆ పాటలు ధనియార్‌ను ఆకర్షిస్తాయి. అతను జమిల్యాను చుస్తూ ఉండిపోతాడు. ధనియార్‌ను విసిగించేందుకూ, అతనికి కోపం తెప్పించేందుకూ ప్రయత్నాలు చేస్తారు ఆ వదినా మరుదులు.

అప్పటికీ వారు సఫలం కాక అతని బండిలో ఎక్కువ బరువు ఉన్న బస్తాలను వేస్తారు. గోధుమ బస్తాలను షెడ్డులో పెట్టే క్రమంలో ఆ అధిక బరువు బస్తాతో ధనియార్ పడిన శ్రమ అతనంటే ఒక రకమైన భయాన్ని కలిగిస్తుంది. అప్పుడు అతను చూసిన చూపు జమీల్యాలో అపరాధ భావనను కలిగిస్తుంది.

తర్వాత కొన్ని అల్లరి లేని ప్రయాణాల తర్వాత జమీల్యానే ధైర్యం చేసి ధనియార్‌ను పాడమంటుంది. అతని పాట జమీల్యాను కరిగించి వేస్తుంది. జమీల్యా మనసు పొరల లోలోపలి భావాలకు అర్ధం తెలుస్తున్నట్లవుతుంది. ఇన్నాళ్లూ తను ఎదురు చూసిన వస్తువేదో తనను పిలుస్తున్నట్లనిపిస్తుంది. ఆ గాన ప్రవాహం, ఉధృతి సయ్యద్‌ను అతనికి అభిమానిగా మారుస్తుంది. మళ్లీ రోజులు మామూలు కంటే సంతోషంగా మారతాయి. ప్రయాణంలో పాటల తోడుతో అలసట తెలియదు.

ఒకరోజు రైల్వే స్టేషను దగ్గర కలిసిన సైనికుడు జమీల్యా భర్త సాదిక్ రాసిన ఉత్తరాన్ని అందిస్తాడు. అది చూసిన ధనియార్ ఒక్కడే వెళ్లిపోతాడు. సాదిక్, గాయాలు తగ్గిపోయేకా, ఒక నెలలో తిరిగి వస్తానని రాస్తాడు. సయ్యద్‌ను కూడా వెళ్లిపొమ్మంటుంది జమీల్యా. అలా మొదటిసారిగా ముగ్గురూ ఒంటరిగా తిరుగు ప్రయాణమౌతారు.

ఆ రాత్రి పొలం చేరుకున్న తర్వాత ధనియార్ దగ్గరకు వెళతాడు సయ్యద్. అతనిని పలకరించలేక కొంచెం దూరంగా గడ్డిలో పడుకుంటాడు. తర్వాత వచ్చిన జమీల్యా ధనియార్ దగ్గరకు రావటం చూస్తాడు. వాళ్లిద్దరి కళ్లలో బాధ గమనిస్తాడు. జమీల్యా ధనియార్‌తో మాట్లాడుతుంది. అతను కొంచెం సంతోషంగా చూడటం గమనిస్తాడు సయ్యద్. “జమీల్యా మాటలు అతన్ని ఎందుకు ఊరడించాయో కదా? అనుకున్నాను. ఒక వ్యక్తి భారంగా నిట్టుర్చుతూ: “నాకు భరించడం సులభమనుకుంటున్నావా?” అని అంటే, ఆ మాటల్లో ఊరడింపుకి ఏముందంటా?” అని ఆలోచిస్తాడు.

తర్వాతి నుంచీ మామూలే. ధనియార్ పాటలు ఆమెను ఎక్కడికో తీసుకు పోతాయి. అతని బండి పక్కగా నడుస్తూ, పాటలో లీనమై పోయి ఆమె అతని పక్కన కూచుంటుంది. అతని భుజాలపై తల ఆనించి పరవశం చెందుతుంది. ఆ సన్నివేశాన్ని సయ్యద్ చుస్తూండిపోతాడు. తేరుకున్న జమీల్యా బండిదిగి ఇద్దరినీ కసురుకుంటుంది.

తర్వాతి రోజు ఒక కాగితాన్ని, బొగ్గు ముక్కను సంపాదించిన సయ్యద్ బండిపై జమీల్యా, ధనియార్‌లు కూర్చుని ఉండటాన్ని చిత్రిస్తాడు. తమను తాము మైమరచిన ప్రేమికులలా అనిపిస్తారు వాళ్లిద్దరూ అతనికి. ధనియార్‌ను చూస్తే అతనికి ఈర్ష్య కలుగుతుంది. ఆ చిత్రాన్ని జమీల్యా తీసేసుకుంటుంది. చిన్నప్పుడు బడిలో వదిలేసిన చిత్రకళను తనకు ఇష్టమైన వారి చిత్రాలతో తిరిగి ప్రారంభించటంతో సంతోషిస్తాడు.

ఒక రాత్రి పొలం పక్కన ఏటి ఒడ్డుకు వెళ్లిన అతనకి దూరంగా రెండు ఆకారాలు కనిపిస్తాయి. అవి రెండూ జమీల్యా, ధనియార్ అని గుర్తించటానికి అతనికి ఎక్కువసేపు పట్టదు. ఏటి అవతలి గట్టుపై దూరంగా వెళ్తున్న వారిద్దరినీ చూసి, తేరుకుని వెంట పరిగెత్తుతాడు. కాలికి ఎదురు రాళ్లదెబ్బలతో వెళ్లినా చీకటిలో కలిసిపోయిన వారిద్దరూ కనిపించరు. ఉదయం ఇంటికి వచ్చాక తెలుస్తుంది, అనుకున్నదే అయిందని. లోపల సంతోషపడినా ఏమీ తెలియనట్లే ప్రవర్తిస్తాడు. ఊరంతా ఒక కుటుంబ మర్యాద పోగొట్టిన జమీల్యా గురించే కథలు కథలుగా చెప్పుకుంటారు.

యుద్ధం నుంచి వచ్చిన సాదిక్ జమీల్యాను చంపేస్తానంటాడు. ఎక్కడున్నారో తెలియక ఊరుకుంటాడు. ఒకరోజు ఆవేశంతో వచ్చిన సాదిక్, “ఇ చిత్రం నువ్వు గీసినదేనా? వీడెవడు?” అని అడుగుతాడు. “ధనియార్” అని చెప్తాడు సయ్యద్. చెంప పగలకొట్టి ఆ చిత్రాన్ని చింపేస్తాడు సాదిక్. “నీకు తెలుసా?” అని అడిగిన తల్లికి “అవున”ని సమాధానమిస్తాడు.

తనకు చిత్రకళను నేర్చుకోవాలని ఉందని, వెళ్లేందుకు తల్లిని అనుమతి కోరతాడు సయ్యద్. చిత్రకళ డిప్లొమాకోసం మళ్లీ అదే చిత్రాన్ని చిత్రికరిస్తాడు. ఆ చిత్రాన్ని చూసిన ప్రతిసారీ గుర్తు వచ్చే గ్రామాన్ని, జమీల్యాను తలచుకుని తిరిగి ఇంటికి వెళ్లాలనుకోవటంతో కథ ముగుస్తుంది.

,,,,,,,,,,,,,,,,,,,,,

రచయిత గురించి:


కిర్గిజ్ జాతిపితగా పిలవబడుతున్న ఐత్‌మాతోవ్ 12-12-1928న అప్పటి సోవియట్ రష్యా యూనియన్‌లో భాగమైన కిర్గిస్తాన్‌లో జన్మించారు.
గిరిజన సంచార కుటుంబంలో జన్మించిన కారణంగా ఆయన ఎక్కువ ప్రదేశాలను, అక్కడి ప్రజలనూ, కట్టుబాట్లనూ గమనించటానికీ, అర్థం చేసుకోవటానికీ ఆయనకు అవకాశం దక్కింది. చిన్నప్పటినుంచి తను గమనించిన విషయాలనే ఆయన తన రచనల్లో వ్యక్తీకరించారు.
“రచయిత తన అంతరాత్మను ఆవిష్కరించటం కంటే కూడా తన సమాజం అంతరాత్మగా ధ్వనించటమే ముఖ్యం” అన్న మాక్సిం గోర్కీ మాటలు తననెంతో ప్రభావితం చేశాయంటారు రచయిత.
1990లలో రష్యా నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించిన కిర్గిస్తాన్‌కు అంతర్జాతీయ సమాజంలో ఒక గుర్తింపు, గౌరవం దక్కేందుకు చింగీజ్ ఐత్‌మాతోవ్ ఎంతో కృషి చేశారు.
ఎన్నో దేశాలకు కిర్గిస్తాన్ రాయబారిగా కూడా పని చేసిన చింగిజ్ ఐత్మాతోవ్ 10-06-2008న జర్మనీలో చనిపోయారు.
నా అభిప్రాయం:
ఈకథ (రెండవ ప్రపంచ యుద్ధం) సమయానికి, సోవియట్ యూనియన్ అంతర్భాగమైన రష్యాలొ స్త్రీ స్వాతంత్ర్యానికి అనుకూలంగా జరిగిన అనేక సంఘటనలు అప్పటి సమాజంలో స్త్రీకి కొంత ధైర్యాన్ని, సమాజ కట్టుబాట్లను ఎదిరించే తెగువను ఇచ్చాయి. అటువంటి పరిస్దితులలో జమీల్యా తనని మనిషి మాత్రంగా నైనా చూడని భర్త సాదిక్ నుంచి విడిపోయి తనకు నచ్చిన ధనియార్‌తో వెల్లేందుకూ, తద్వారా సమజాన్ని ఎదిరించేందుకు సాహసం చేసింది.
ఈకథ చదివిన తర్వాత స్త్రీ అంటే వస్తువే అనే భావం కేవలం భారతదేశంలోని ప్రజలది మాత్రమే కాదనీ, అప్పటి ప్రపంచ వ్యాప్తంగా సంప్రదాయాలను పాటించే ఆనాటి ప్రజలందరిదీ అని తెలుస్తుంది. భర్త చనిపోయిన స్త్రీ, ఆ కుటుంబంలో భర్త సోదరున్ని/అదే వంశస్ధున్ని వివాహమాడాలన్న నిబందన కూడా కనిపిస్తుంది.
అలాగే, ఈకథ యుద్ధం ఎటువంటి పరిస్ధితులను సృష్టిస్తుందో తెలియజేస్తుంది. వ్యవసాయం చేసేందుకు మగవారు లేని సమయంలో స్త్రీ, తన చిన్న పిల్లలతో పడే కష్టాలు, భర్త దగ్గర లేని స్త్రీ ఎదుర్కునే వేధింపులు కనిపిస్తాయి.
మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న “సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు”, “అందరూ కలిసి పని చేయటం” అప్పటికే ఉన్నాయనీ, సరైన వ్యవస్ధ ఉంటేకానీ అవి విజయవంతమవవనీ గమనించవచ్చు.

,,,,,,,,,,,,,,

జమీల్యా
చింగీజ్‌ ఐత్‌మాతొవ్‌
అనువాదం: ఉప్పల లక్ష్మణరావు
96 పేజీలు, వెల: రూ.40


,,,,,,,,,,,,,,

ప్రతులకు, వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067

ఫోన్‌: 040 2352 1849

ఇమెయిల్‌: hyderabadbooktrust@gmail.com

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

Saturday, October 24, 2009

మునెమ్మ ... ఓ ఫండ మెంటల్ కథ ! పసుపులేటి పూర్ణచంద్రరావు విశ్లేషణ



కేశవరెడ్డి సంచలనాత్మక నవల "మునెమ్మ" పై ది సండే ఇండియన్ నవంబర్ 2009 సంచికలో(42వ పేజీ) పసుపులేటి పూర్ణచంద్రరావు సమగ్ర సమీక్షను చదివేందుకు ఇక్కడ నొక్కండి.

Monday, October 19, 2009

నా కథ మన కథ ...(మై స్టోరీ ... అవర్‌ స్టోరీ ఆఫ్‌ రీ బిల్డింగ్‌ బ్రోకెన్‌ లైవ్స్‌) -ఫ్లెవియా



నా (మన) కథ

పెళ్లైన నాటి నుంచి పదిహేనేళ్ల పాటు భర్త చేతిలో దెబ్బలు తింటూ, ఇంటి నుంచి గెంటివేతకు గురవుతూ ఆమె గడిపిన జీవితం పగవాళ్లకు కూడా వద్దనిపిస్తుంది.
పిల్లల కోసం ప్రశాంతంగా, హింసకు దూరంగా బతికే మార్గాన్వేషణలో వున్న ఆ సాధారణ గృహిణికి ముంబాయిలో స్త్రీవాద ఉద్యమం
కొద్దిపాటి ఊతమయ్యింది.

న్యాయం కోసం ఒకపక్క భర్తతో పోరాడుతూనే మరోపక్క తన కాళ్ల మీద తాను నిలబడి, పిల్లల్ని ప్రయోజకుల్ని చేసి విజేతగా ఎదిగారు ఫ్లెవియా.
ఆమె తన జీవిత కథను ''మై స్టోరీ ... అవర్‌ స్టోరీ ఆఫ్‌ రీ బిల్డింగ్‌ బ్రోకెన్‌ లైవ్స్‌'' పేరుతో ఇరవై ఐదేళ్ల క్రితమే రాశారు. ఆ పుస్తకం తెలుగు అనువాదమే ''నా (మన) కథ''. అందులోంచి కొన్ని అంశాలు:

ఇది కథ కాదు

జీవిత చరిత్రలు విజయం చవిచూసినవారే రాసుకుంటారు. ఓడిపోయినవారు కాదు. సిగ్గుతో, అవమానంతో గడిపిన క్షణాలను ఎవరూ
మళ్లీ మళ్లీ గుర్తుచేసుకోవాలనుకోరు. జాలి కోసమో... వ్యక్తి గతంగా నాకేదైనా లాభం ఉంటుందనో కాదు... దెబ్బలు తినే అసహాయ మహిళ పరిస్థితులు ఎలా వుంటాయో చెప్పడానికి మాత్రమే ఇది రాశాను. ఇది కథ కాదు... నా జీవితంలోని వాస్తవం!
ఆయన దృష్టిలో పెళ్లామంటే కాళ్లు తుడుచుకునే పట్టా.
హనీమూన్‌ నుంచి చేతులపై కమిలిన మచ్చలతో పుట్టింటికి తిరిగి వచ్చాను. ఏమైందని అమ్మ అడిగింది. ఏవో చిలిపి పనులు... అతని సమాధానం. అమ్మకు అర్థమైనట్లే వుంది.

- చాలాసార్లు అతను నా ఒళ్లంతా కుళ్లబొడిచిన తర్వాత మంచి చీర కట్టుకుని, నగలు పెట్టుకుని, మేకప్‌ వేసుకుని పార్టీలకు వెళ్లాను. ఆ చీర కట్టుకో... చేతుల మీద దెబ్బలు కనిపించకుండా కప్పుకో ... అంటూ సలహా ఇచ్చేవాడు.

- ఆ రోజు పనంతా ముగించుకుని మంచం మీద కూర్చుని అమ్మ రాసిన ఉత్తరం చదువుకుంటున్నాను. అతను వచ్చాడు. మసిగుడ్డ మురికిగా వుంది ఉతకమన్నాడు. తర్వాత ఉతుకుతానన్నాను. నేను చెప్పినట్లు వినాలి. విధేయత ఏమిటో నీకిప్పుడే నేర్పిస్తాను అన్నాడు. మరుక్షణం నా తల వెళ్లి గోడకు కొట్టుకుంది. నన్ను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి బాత్‌రూమ్‌లో పడేసి మసిగుడ్డ నా మొహాన కొట్టి గొళ్ళెం పెట్టాడు.
మూడు గంటల తర్వాత తలుపు తెరిచాడు. 'నా శరీరాన్ని విరగ్గొట్టగలవు కానీ నా మనసును నువ్వేం చేయలేవు' అన్నాను. కానీ అది అబద్ధం.
వాస్తవానికి శరీరమే త్వరగా కోలుకుంటుంది. హింసకి, రక్తపాతానికి చిహ్నంగా మచ్చలే మిగులుతాయి. కానీ మనస్సుకైన గాయాలు
మానడానికి చాలా సమయం పడుతుంది. పైగా అవి గుర్తుకొచ్చిన ప్రతిసారీ మళ్లీ రక్తం కారుతుంది.

కుప్పకూలిన ఆత్మవిశ్వాసం

నా జీవితంలో అత్యంత దారుణమైన దశ అది. నా వ్యక్తిత్వానికి జరగాల్సిన నష్టం పరిపూర్ణంగా జరిగింది. నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. హింసను ఆపడానికి ఏమైనా సరే... చేయాలి. నాలుగేళ్ల లోపు వయసులో ముగ్గురు పిల్లలు... ఉబ్బసం...నాకు చావాలనిపించింది.
కానీ ఈ కర్కశ హృదయుడి దయాదాక్షిణ్యాల మీద పిల్లల నొదిలేసి చచ్చే హక్కు మాత్రం నాకెక్కడిది?

* నేను అందరి సలహాలు విన్నాను. పాటించాను. హింస సందర్భాలు తగ్గాయేమో కానీ స్థాయి తగ్గలేదు. ఒకటి మరిచేలోపే మరొకటి తప్పకుండా జరిగేది.
* ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చు. భయం వెన్నంటే ఉండేది. కడుపులో పేగుని ముడివేసిన భావన నాలో భాగమైపోయింది. అది ఎంతలా అ లవాటై పోయిందంటే ఆ ఇల్లు వదిలాక హాయిగా ఉండడం కూడా చాలా కష్టపడి నేర్చుకోవాల్సి వచ్చింది.

* నాపైన అతని అధికారం కేవలం భౌతికమైనదే కాదు.... నా ఆత్మగౌరవం మంటకలిసింది... ఆత్మవిశ్వాసం అడ్రస్‌ లేకుండాపోయింది...

నాకంటూ మిగిలింది పిల్లలే!

ఎదురీదాను... ఒడ్డుకు చేరాను


ఆనాటి ఆ స్థితి నుంచి బయటపడి ఈరోజు మహిళల హక్కుల న్యాయవాదిగా నేను ప్రాక్టీసు చేస్తుంటే ఎన్నో వైరుధ్యాలు. నేనెంత
కాదనుకున్నా...ఏదో సాధించిన భావం. నేను గ్రాడ్యుయేట్‌ని కానందున లెక్చర్‌ హాల్‌ వదిలి వెళ్లిపొమ్మన్న సంస్థ ... నన్ను తల్లిగా అయోగ్యురాలన్న న్యాయమూర్తి ... మద్దతిచ్చినా నిలబెట్టుకోకుండా భర్త దగ్గరికి వెళ్లానని బాధపడిన స్నేహితులు... నా విడాకుల హక్కును తిరస్కరించిన చర్చి ... వ్యవస్థ ... నేను పరిస్థితుల్ని పూర్తిగా తలకిందులు చేయలేదు కానీ రెండో ఒడ్డుకి చేరుకోగలిగాను.
నలబైయేళ్ల వయసులో కొత్త గుర్తింపు ఏ మహిళకైనా అసాధరణంగానే వుంటుంది.

* దెబ్బలు తినడం అనే మన అనుభవాల్లో వ్యక్తిగతం అనేదేమీ లేదన్నది వాస్తవం. కానీ మన నోళ్లు నొక్కిపెట్టి ఉన్నాయి. కాబట్టి ఆ అనుభవం విశ్వవ్యాప్తమని తెలుసుకోలేకపోయాం.
నోరు విప్పడానికి చేసిన ఒక ప్రయత్నమే ఈ పుస్తకం.
ఇది సఫమైందని చెప్పగలను.
ఎందుకంటే ముంబాయిలోని ఒక అభ్యుదయ చిత్ర దర్శకుని భార్య, గుజరాత్‌లో స్కూలు టీచరు, బోస్టన్‌ శరణార్థుల శిబిరంలోని మహిళ, భారత్‌ పర్యటిస్తున్న జర్మన్‌ విద్యార్థి... అందరూ ఈ పుస్తకంలో తమ అనుభవాలను చూసుకున్నారు.

* నా జీవితానుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కుటుంబ హింసను బహిరంగంగా ఖండిచడాన్ని అంతా మెచ్చుకున్నారు. నా స్నేహితురాలు మధుశ్రీదత్తా, మరికొంతమంది న్యాయవాద వృత్తి నిపుణులతో కలిసి 1990లో ''మజ్లిస్‌'' అనే సంస్థను ప్రారంభించాను. ఇందులో యువ, ఔత్సాహిక న్యాయవాదులున్నారు.

* మేం సాధించింది ఒక్క మాటలో చెప్పాలంటే ... 'బాధిత మహిళ ... ఆమె బిడ్డలు' ... అన్న ముద్ర పోగొట్టుకున్నాం. విచ్ఛిన్నమైన కుటుంబాల్లో ఒంటరి తల్లిదండ్రుల దగ్గర పెరిగిన పిల్లలు చెడి పోతారన్న అపోహను పటాపంచలు చేశాం....
(ఈనాడు వసుంధర నుంచి)


నా (మన) కథ
రచన: ఫ్లెవియా ఆగ్నెస్‌

ఆంగ్లమూలం : మై స్టోరీ ... అవర్‌ స్టోరీ ఆఫ్‌ రీబిల్డింగ్‌ బ్రోకెన్‌ లైవ్స్‌, మజ్లిస్‌, ముంబాయి, ౨౦౦౪
తెలుగు అనువాదం : భూజాత

ప్రథమ ముద్రణ : 2004
67 పేజీలు, వెల రూ.20


ప్రతులకు వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడి మల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500 067
ఫోన్‌ నెం.040-2352 1849


ఇ మెయిల్‌:
hyderabadbooktrust@gmail.com


........................................................

Sunday, October 11, 2009

పౌరహక్కులకు మరో పేరు బాలగోపాల్‌ - హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ నివాళి



1970,80 దశాబ్దాలలో అనేక కీలక ఉద్యమాలు మన దేశాన్నే కాక ప్రపంచాన్నే ఒక కుదుపు కుదిపాయి. ఐరోపాలో విద్యార్థుల తిరుగుబాటు, వియత్నాం యుద్ధవ్యతిరేక పోరాటం, అమెరికాలో బ్లాక్‌ పాంథర్‌ ఉద్యమం, భారతదేశంలో నక్సల్‌బరీ ఉద్యమం మొదలైనవాటి నేపథ్యంలో ఎందరో కొత్త తరం ప్రజానాయకులు ఆవిర్భవించారు. అట్లాంటి వారిలో బాలగోపాల్‌ ప్రముఖులు. ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా, ఎన్ని దాడులు జరిగినా లెక్కచేయకుండా ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల ఉద్యమానికి పథనిర్దేశనం చేసిన సాహసి ఆయన.

గణితశాస్త్ర ప్రొఫెసర్‌గా, రచయితగా, వక్తగా, వకీలుగా బహుముఖ ప్రతిభావంతుడైన బాలగోపాల్‌ తన జీవితాన్ని పూర్తిగా తాడిత పీడిత ప్రజల సంక్షేమానికి అంకితం చేశారు. రాజ్య హింస, పౌరహక్కుల ఉల్లంఘన ఎక్కడ ఏ మారుమూల, ఏ అటవీ ప్రాంతంలో జరిగినా ఆయన వెంటనే అక్కడ ప్రత్యక్షమై ఆపన్నులకు అండగా నిలిచేవారు. అందుకోసం కాకతీయ యునివర్సిటీలో తన అధ్యాపక వృత్తిని సైతం తృణప్రాయంగా త్యజించారు.

రాజ్య హింసతో పాటు విప్లవం పేరుతో జరిగే అనుచిత హింసను కూడా ప్రశ్నిస్తూ ఆయన పౌరహక్కుల సంఘం నుంచి విడిపోయి మానవ హక్కుల సంఘాన్ని స్థాపించి తన పరిథిని ఇంకా విస్తరించుకున్నారు. అయితే మానవ హక్కుల కోసం ఆయన చేసిన కృషి తెలిసినట్టు న్యాయవాదిగా ఆయన ప్రజలకు అందించిన సేవగురించి చాలామందికి తెలియదు.

తను ప్రథానంగా గణితశాస్త్రజ్ఞుడు అయినప్పటికీ పతితులకు, బాధాసర్ప దష్టులకు మరింతగా సేవలు అందించాలనే లక్ష్యంతో ఎంతో దీక్షగా న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేశారు. పేదల పక్షాన నిలిచి లాయర్‌గా హైకోర్టులో ఎన్నో కేసులు వాదించారు. ఆదివాసీలు, బీడీ కార్మికులు, ఉపాథి కోల్పోయినవాళ్లు, గృహహింసకు, రాజ్యహింసకు గురైన వాళ్లు ఇలా ఎందరెందరి తరపున్నో ఆయన పైసా ఫీజు తీసుకోకుండా అత్యంత ప్రతిభావంతంగా వాదించి న్యాయం జరిపించారు. ఆంధ్ర ప్రదేశ్‌లో దత్తత పేరిట జరగుతున్న పసిపిల్లల విక్రయాలకు శాశ్వతంగా తెరదించేట్టు చేయడంలో బాలగోపాల్‌ నిర్వహించిన పాత్ర అపూర్వమైనది. ఆయన మరణం వల్ల మానవ హక్కుల ఉద్యమానికి జరిగిన నష్టాన్ని పూడ్చవచ్చునేమో కానీ హైకోర్టు న్యాయవాదనకు జరిగిన లోటును పూడ్చడం అసాధ్యం అనిపిస్తుంది.

బాలగోపాల్‌ మానవహక్కుల నేతగా, న్యాయవాదిగానే కాక రచయితగా కూడా ఎంతో సుప్రసిద్ధులు. తెలుగు, ఇంగ్లీషు రెండు భాషల్లోనూ ఆయన ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు రాశారు. ప్రత్యేకించి ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీలో రాసిన వ్యాసాలు, నక్సలైట్‌ ఉద్యమం మీద రాసిన పుస్తకాలు ఎంతో సంచలనం సృష్టించాయి. హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించిన ఆయన రచన ''కల్లోల లోయ'' (కాశ్మీర్‌ సమస్య), ''ప్రాచీన భారతదేశ చరిత్ర'' (డి.డి.కొశాంబి పరిచయం అనువాదం) ఎంతో ప్రాచుర్యం పొందాయి.

స్వార్థం, డబ్బు సంపాదన, సుఖలాలసత్వం, వినిమయతత్వం, వ్యక్తిగత వాంఛలు, వ్యామోహాలు విపరీతంగా పెరిగిపోయిన నేటి కాలంలో నిస్వార్థానికి, నిర్భీతికి, నిరాడంబరతకు, పరోపకారానికి ప్రతీకగానిలిచే బాలగోపాల్‌ జీవన శైలి నిజంగా ఒక అద్భుతం. ఆయన స్మృతి, స్ఫూర్తి ఎన్నటికీ చెరిగిపోవు.

Sunday, October 4, 2009

ఈ తరం కోసం మరోసారి ....






ఆంధ్రజ్యోతి ఆదివారం 4 అక్టోబర్‌ 2009 : కొత్త పుస్తకాలు :

కళ్లకు కనికట్టుచేసి మనిషిని కుర్చీలో కట్టిపడేసే విభిన్న ప్రసార మాధ్యమాల మధ్య మంచి సాహిత్యం పుట్టడమే గగనమైన ఈ రోజుల్లో ... కొన్ని పుస్తకాలు పునర్మద్రణలు పొందడం హర్షణీయం అభినందనీయం కూడా.

ఈ మధ్య కాలంలో అ లా మళ్లీ అచ్చయి వచ్చిన వాటిల్లో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి , డా. కేశవరెడ్డి, చిలుకూరి దేవపుత్రల పుస్తకాలున్నాయి.

ఆంగ్ల పదాలు అసలే లేని శ్రీపాద అచ్చమైన తేట తెనుగు కథల రుచిని నాలుగు తరాలుగా పాఠకులు అనుభవిస్తూనే ఉన్నారు. కొంతకాలం క్రితం పుల్లంపేట జరీచీర నిలువు చెంబు పేర్లతో వచ్చిన కథా సంపుటాల్లో 49 కథల్ని అందించిన ప్రగతి పబ్లిషర్స్‌ ఈ సారి కలుపు మొక్కలు, మార్గదర్శి, అందమైన చంద్ర ముఖచిత్రాలతో అరచేతుల్లో ఎంచక్కా అమరే సైజుతో పుస్తకం ప్రయాణాల్లో చదువుకోడానికి సౌకర్యంగా ఉంది. మల్లాది రామకృష్ణ శాస్త్రి రాసిన ఒకే ముందుమాటను మూడు సంపుటాల్లోనూ వాడటం మాత్రం బాగాలేదు.

దళితుల సమస్యల్ని కథా వస్తువులుగా తీసుకుని రాయలసీమ గ్రామీణ జీవిత సంఘర్షణను అక్షరబద్ధం చేస్తున్న రచయిత డా. కేశవరెడ్డి,. గతంలో వచ్చిన అతడు అడవిని జయించాడు, చివరి గుడిసె, మూగవాని పిల్లన గ్రోవి నవలల్ని ఇప్పుడు హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారు పునర్ముద్రించారు.

ఒకప్పుడు 14 భారతీయ భాషల్లోకి అనువదించబడిన ''అతడు అడవిని జయించాడు'' నవల రేడియో నాటకంగా కూడా పేరుగాంచి, జాతీయ అవార్డు పొందిన సంగతి ఈ తరం వారికి తెలియదు.

1998లో అటావారి బహుమతి పొంది అప్పుడే పుస్తకంగా వెలుగు చూసిన చిలుకూరి దేవపుత్ర ''పంచమం'' నవలని ఇప్పుడు హైదరాబద్‌ బుక్‌ ట్రస్ట్‌ మళ్లీ తీసుకొచ్చింది. అంటరానితనం, అణగారిన తనం భూమికలుగా దళిత జీవన చిత్రాన్ని సృజనాత్మకంగా విరచించిన రచన ఇది. సమాజంలోని కుల, వర్గ వాస్తవికతల విశ్వరూపాన్ని చూపుతూ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన తొలి నవలగా పంచమానికి పేరుంది.

- గొరుసు

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథలు :
1. మార్గదర్శి (పేజీలు:288, వెల రూ.120),
2. వడ్లగింజలు (పేజీలు:272, వెల రూ.120),
3. కలుపు మొక్కలు (పేజీలు:309, వెల రూ.120)
ప్రతులకు:
విశాలాంధ్ర అన్ని బ్రాంచీలు.


డా. కేశవరెడ్డి నవలలు :
1. అతడు అడవిని జయించాడు (పేజీలు: 96, వెల: రూ.40)
2. చివరి గుడిసె (పేజీలు: 158, వెల: రూ.80)
3. మూగవాని పిల్లనగ్రోవి (పేజీలు: 132, వెల: రూ.60)

చిలుకూరి దేవపుత్ర నవల :
పంచమం (పేజీలు: 275, వెల: రూ.100)


ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడి మల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500067
ఫోన్‌ నెం. 040 2352 1849

................................(ఆదివారం ఆంధ్ర జ్యోతి సౌజన్యం తో )

.............................

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌