Saturday, March 3, 2012

మా యాత్ర - దేవులపల్లి కృష్ణమూర్తి ... నగ్నముని ముందుమాటతో ...



యాత్ర అనగానే సుదూర గతంలో, మనదేశంలో ఎన్నో ప్రదేశాలు పర్యటించి, నాటి సాంఘిక సాంస్కృతిక రాజకీయార్థిక సంగతులతో అమూల్యమైన విశేషాలెన్నో మనకందించిన విదేశీయులు మొదలు, మనవాడు ఏనుగుల వీరాస్వామయ్య కాశీ యాత్ర వరకూ ఎన్నో మనసులో మెదలుతాయి.
...
దేవులపల్లి కృష్ణమూర్తి 'మా యాత్ర' వీటికి భిన్నమైనది. విశేషమైనది, గుర్తింపదగినది.
...
దేవులపల్లి వారి యాత్ర పుస్తక రూపంలో వున్నా, మనల్ని తనలోకి తీసుకుంటుంది. తద్వారా మనం కూడా సహయాత్రీకులమవుతాం.
అదెట్లనగా-
నకిరేకల్‌ నుంచి ఒక మినీ టూరిస్టు బస్సు ఉత్తర భారతదేశ యాత్రకై ఒక ఉదయాన బయల్దేరింది. ఇందులో ఇరవై నలుగురు యాత్రీకులున్నారు. ఇరవై రోజుల్లో ముప్ఫయి ప్రదేశాలు దర్శించడం వుద్దేశం. ...
ఆ మినీ బస్సులో దేవులపల్లి వారి పక్కన ఒక వూహాజనిత సీటు వుంటుంది. దానిమీద యీ పుస్తకాన్ని చదువుతున్న పాఠకుడు కూర్చుని వుంటాడు. ఆమె అయితే ఆమె వుంటుంది. కృష్ణమూర్తిగారే అతన్ని/ఆమెను లోపలికి తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టాడు.
...
పాఠకుడు దారిపొడుగునా పరిసరాలను గమనిస్తూ పరవశించడమే గాక, ఆయా దర్శనీయ స్థలాల సౌందర్యం చారిత్రక ప్రాముఖ్యం శిల్పవైభవం, కృష్ణమూర్తిగారి మాటల్లో వినడమేగాక, యితర యాత్రీకులు చెబుతున్న తమ బతుకుల్లోని సాధక బాధకాలు, అ ల్లకల్లోలాలు దృశ్యమానంగా వింటూ వుంటాడు.
ఇలా ఒకవైపు ఆయా స్థలాల అద్భుత రమణీయం, రెండూ సమాంతరంగా కొనసాగిపోతూ వుంటాయి.
దేవులపల్లి వారు ''ఊరు వాడ బతుకు''లో పూర్తిగా జానపద జనపథకుడిగా కనిపిస్తాడు. యాత్రలో ఆధునిక కవితాంచలాలు అందుకున్న కవననవ్య తాత్వికుడిగా అగుపిస్తాడు.
(ముందుమాట 'నక్రేకల్‌ నజరానా' నుంచి)

మా యాత్ర
దేవులపల్లి కృష్ణమూర్తి

ముఖచిత్రం: ఎడ్గర్‌ దేగా, వాసు
లోపలి బొమ్మలు: శీలా వీర్రాజు

112 పేజీలు, వెల రూ. 60/-

ప్రతులకు, వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌-500 067

ఫోన్‌: 040-2352 1849

ఇమెయిల్‌ : hyderabadbooktrust@gmail.com



దేవులపల్లి కృష్ణమూర్తి

1998 లో మండల రెవెన్యూ అధికారిగా రిటైర్డ్ అయినారు.
వీరి మొదటి రచన " ఊరు వాడ బతుకు " హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ద్వారా ప్రచురించబడింది.
రాబోవు రచనలు : 1 . కథల గూడు 2 . బయటి గుడిసెలు 3 . భూభ్రమణం .

వీరి చిరునామా:

దేవులపల్లి కృష్ణమూర్తి
17 /98 , శ్రీశ్రీ మార్గం,
నకిరేకల్ - 508211
నల్గొండ జిల్లా.

.

Sunday, February 26, 2012

కొ.కు. సూత్రీకరణకు కొనసాగింపు ...

''దేవుడున్నాడా? చూపించు'' అనే నాస్తిక, హేతువాదులు గానీ, ''అడుగో గోడలో ఉన్నాడు. ఇడుగో స్తంభంలో ఉన్నాడు'' అనే ఆస్తిక, భక్తిపారాయణులుగానీ ప్రధానంగా నిరూపణవాదాన్నే ఆశ్రయిస్తూ ఉంటారు.

ఆటవిక దశ దాటని ఈశ్వరారాధకులు భగవత్‌ దర్శనం చేయించలేనట్టే, ప్రాథమిక భౌతికవాద దృష్టిని మాత్రమే కలిగిన నిరీశ్వరవాదులు తమ వాదనకు అనువుగా ప్రకృతి లీలలను ప్రదర్శించలేరు.

ఈ విషయంలో ఇరుపక్షాలూ మూర్ఖులేననేది కొడవిటిగంటి రోహిణీ ప్రసాద్‌ పరిశీలన.
భౌతిక సూత్రాలను అనుసరించి సాగే ప్రకృతి ... మానవాళికి నిదర్శనాలను చూపించాల్సిన అవసరమే లేదని, మన మంచితనం, అవగాహన, చైతన్య స్థాయిలతో దానికి పనిలేదనేది ఆయన వాదన.

భౌతిక యుద్ధంలో ప్రత్యర్థి బలంపై దెబ్బకొట్టాలనే మార్క్సిస్టు సాహిత్యకారుడు కొ.కు. సూత్రీకరణకు కొనసాగింపుగా అన్నట్టు సంక్లిష్టమైన మానవ మెదడులో దేవుడు రూపుదిద్దుకున్న క్రమాన్ని ఆయన కుమారుడు రోహిణీప్రసాద్‌ సానుభూతితో పరిశీలించి చేసిన విలువైన విశ్లేషణలతో ''మనుషులు చేసిన దేవుళ్లు'' వ్యాసాలు రూపుదిద్దుకున్నాయి.

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించిన ఈ పుస్తకంలోని 44 వ్యాసాల్లో ప్రధానంగా వైజ్ఞానిక దృష్టి కనిపిస్తుంది.

మతాన్ని సమాజ పరిణామక్రమం నుంచే గాక జీవ పరిణామక్రమం నుంచి పరిశీలించడం, చరిత్ర నుంచే కాక నాడీ వ్యవస్థ, మెదడు స్పందనల నుంచి దైవ మూలాలను వెలికి తీసేందుకు ప్రయత్నించడం వంటి పోకడల వల్ల ''తెలుగులో మరెవ్వరూ చేయని ప్రయత్నం చేశా''ననే వ్యాసకర్త మాటలకు పుష్టి చేకూరుతోంది.

అయితే మార్క్సిజానికి బయట కూడా మత విశ్లేషణ చేయొచ్చుననే ప్రతిపాదనతో బయలుదేరిన రోహిణీ ప్రసాద్‌, చాలా వ్యాసాల్లో శద్ధ భౌతికవాదిగా తేలిపోయారు. వైజ్ఞానిక కృషికి తాత్విక దృష్టిని జోడించలేకపోవడం వల్ల ఆయన కంటికి 'మతం' మసగ్గానే కనిపించిందని చెప్పక తప్పదు.

- వి. అరవింద్‌
( ఆదివారం ఆంధ్రజ్యోతి 26 ఫిబ్రవరి 2012 సౌజన్యంతో)

మనుషులు చేసిన దేవుళ్లు (వ్యాసాలు)

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్‌

పేజీలు196,

వెల: రూ.100/-

Monday, February 13, 2012

వేదాల్లో ఏమున్నది?


వేదాల్లో ఏమున్నది?

''దాచిపెట్టిన జ్ఞానం నిరుపయోగం కావటమే గాక ప్రజలను పీడించటానికి సాధనమవుతుంది'' అని తెలిసిన వాళ్లు చెబుతారు.
వేదాల విషయంలో ఇదే జరిగినట్లు కనబడుతుంది.
వేదాలను బ్రాహ్మలు గుత్తకు తీసుకొని,
వేదాధ్యయనానికి నిషేధాజ్ఞలు కల్పించి,
అందులో ఏమున్నదీ ఎవరికీ తెలియకుండా చేశారు.

ఈ పరిస్థితిని ఆధారం చేసుకొని కొందరు ముందుకు పోవటమంటే
భయమూ, అసహ్యమూ గల వాళ్లు,
వేదాల్లో లేనిది లేదని ప్రజలను నమ్మించ జూశారు.
...
వేదాల్లో ఏమున్నది అన్న విషయం గురించి
మనకు తెలియజెప్పిన వాళ్లు చాలా వరకు పాశ్చాత్యులు.
వాళ్లు సంస్కృతం చదువుకొని,
వేదాలు పఠించి,
అందులో ఏమున్నదీ మనకు తెలియబరచవలసిన దుస్థితి కలిగింది.
...
ఋగ్వేద రచన క్రీస్తు పూర్వం 1500-1400 ప్రాంతంలో
జరిగిందన్న అంచనాను పురాతత్వ శాస్త్రం బలపరుస్తున్నది.
ఋగ్వేదంలో 10,500 పైచిలుకు ఋక్కులున్నాయి.
కొన్ని ఋక్కులను కలిపి ఒక సూక్తం అన్నారు.
శౌనకుడు ఋగ్వేదాన్ని 10 మండలాలుగా విభజించాడు.

ఋక్కులలో (సూక్తాలలో) కొన్ని స్తోత్రాలు,
కొన్ని ప్రార్థనలు, కొన్ని మంత్రాలు, కొన్ని ఉత్తపాటలు:
'ఒకప్పుడు వాస్తవమూ, విశ్వసనీయమూ, అద్భుతమూ అయినవి,
కానీ తరచూ చపలంగానూ, పామరంగానూ, దురవగాహంగానూ కూడా వుంటాయి''
అన్నాడు మాక్స్‌ ముల్లర్‌.
...
ఋగ్వేదంలోని భాష ఆడంబరంగానూ, పాండిత్య ప్రకర్షతో కూడినదిగానూ ఉండి, తరచుగా చాలా క్లిష్టంగా కూడా ఉంటుంది.
ఋగ్వేద ఋషులు సుమారు 2000 మంది ఉండేవారట.
వారు ఎంతో శ్రద్ధగా ఋగ్వేద రచన చేశారు.
వారు తాము ఆర్యులమని, కొత్త ప్రదేశాలను జయించామనీ చెప్పుకున్నారు.
...
వేదాలు నాలుగంటారు గానీ కొందరు మూడు వేదాలనే గుర్తిస్తారు.
నన్నయ భట్టు భారతం ప్రారంభిస్తూ ''వేదత్రయ మూర్తయః త్రిపురుషాః'' అన్నాడు.
ఋగ్వేదం పోతే మిగిలిన వేదాలు సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం.
కానీ వీటికి కూడా మూలం ఋగ్వేదంలాగనే కనిపిస్తుంది.
...
వేదాల గురించీ, ఆకాలపు మనుషులను గురించీ, తెలుసుకోవడం మనకీనాడు ఎంతైనా అవసరం. ఎందుకంటే అప్పటికీ ఇప్పటికీ జీవితంలోనూ, సమాజ స్వరూపంలోనూ ఊహించరాని మార్పులెన్నో వచ్చినా, మన సంస్కృతి అంతా ఆ వేదాల మీదనే ఆధారపడి పెరిగింది.
ఈ 20 (21)వ శతాబ్దంలో ఈ సంస్కృతిలో మౌలికమైన మార్పులు రాకపోతే మనం ప్రపంచ సంస్కృతికి వెనుకబడి ఉండటం తప్పని సరి అవుతుంది.
అందుచేత తెలిసిన వాళ్లు వేదాలను గురించి వేదకాలపు జీవితం గురించి సాధ్యమైనన్ని వాస్తవ విషయాలు ప్రజలకు తెలియజెప్పాలి.
ఈ సందర్భంలో తప్పుడు భావాలు ప్రచారంలో వుండటం అంత మంచిది కాదు.
...

వేదాల్లో ఏమున్నది ?
- కొడవటిగంటి కుటుంబరావు
పునర్ముద్రణ
పేజీలు 24, వెల: రూ.10
(అవును పది రూపాయలే)

Friday, February 3, 2012

జార్జి రెడ్డి (1947 -1972 ) జ్ఞాపకాలు ...



జార్జిరెడ్డి ...
నాలుగు దశాబ్దాలు గడచినా
అతని జ్ఞాపకాలు ఇంకా పచ్చిగానేవున్నాయి
విద్యార్థి ఉద్యమానికి
వామపక్ష చైతన్యానికి
అతని పేరు ఒక నిరంతర స్ఫూర్తి
ఆ జ్ఞాపకాలను,
ఆ ఉద్యమ స్ఫూర్తిని
అక్షరబద్ధం చేయాలని ఆలస్యంగానైనా
అతని బంధు మిత్రులు సంకల్పించారు.
ఆ పుస్తక ప్రచురణ బాధ్యతను
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ స్వీకరించింది
మీరు కూడా
అతనితో మీకున్న అనుభవాలను,
అతని గురించి మీరు విన్న విశేషాలను తెలిపిి
ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.





Visit the blog on George ReddyL

http://georgereddyamarrahe.blogspot.in/2012_02_01_archive.html




.

Monday, January 30, 2012

విస్తృత చర్చకు విశేష ప్రతిపాదనలు - 'రూపంసారం: సాహిత్యంపై బాలగోపాల్‌ ' -2 ... కె.కె.రంగనాథాచార్యులు ...

సాహిత్యం బాలగోపాల్‌ ప్రధాన కార్యక్షేత్రం కాదు.
కానీ సాహిత్యానికి సంబంధించిన అవగాహన, నిబద్ధత ఆయనకున్నాయి.
హక్కుల ఉద్యమాల కార్యాచరణ క్రమంలోనే సాహిత్యాన్ని మానవ అస్తిత్వంలో ముఖ్య”మైన భాగంగా గుర్తించి ఉంటాడు.
రాష్ట్రంలో రోజురోజుకూ నిర్బంధం తీవ్రమవుతున్న దశలో ప్రజాతంత్ర ఉద్యమాలకే తాను ఎక్కువగా సమయం కేటాయించవలసి వచ్చిందని, అందువల్ల సాహిత్యాన్ని తన రంగంగా ఎంచుకోలేకపోయానని చెప్పుకున్నాడు.
అయినా అవకాశం, అవసరం వచ్చినప్పుడల్లా సాహిత్య సమస్యలకు స్పందిస్తూనే వచ్చాడు.

చదవండి:
''రూపం - సారం: సాహిత్యంపై బాలగోపాల్‌'' పుస్తకంపై
కె.కె.రంగనాథాచార్యులు సమీక్ష రెండో భాగం :
ఆంధ్ర జ్యోతి 'వివిధ' సాహిత్య వేదిక తేది: 30 జనవరి 2012.




.

Monday, January 23, 2012

తాత్త్విక ప్రయాణంలో సాహిత్య చర్చ - కె.కె.రంగనాథాచార్యులు ...



తాత్త్విక ప్రయాణంలో సాహిత్య చర్చ - కె.కె.రంగనాథాచార్యులు ...

పోరాటాలు మద్దతు కోసం ఎదురు చూస్తున్నట్టుగానే
నడుస్తున్న చరిత్ర కథకుల కోసం ఎదురుచూస్తున్నది.
కథకులకు కొదవలేదు.
కానీ జీవితాన్ని, జీవిత సంఘర్షణలను బహుముఖంగా అర్థం చేసుకొనే సంస్కృతి లోపించిందని ఆవేదన.
అందువల్లనే నడుస్తున్న చరిత్ర, అందులో భాగమైన కథలన్నీ అ లిఖితంగానే ఉండపోయాయనే బాధ.
పోరాటమే కాదు జీవితంలోని అనేక కోణాలు సాహిత్య వస్తువు కావాలని
బాలగోపాల్‌ ఆకాంక్షించాడు....

రూపం-సారం: సాహిత్యంపై బాలగోపాల్‌
పుస్తకంపై
కె.కె.రంగనాథాచార్యులుగారి సమీక్ష
మొదటి భాగం ఇక్కడ చదవండి:

ఆంధ్రజ్యోతి సాహిత్య వేదిక వివిధ సోమవారం 23 జనవరి 2012

రూపం-సారం: సాహిత్యంపై బాలగోపాల్‌
పేజీలు : 360
ధర : రూ. 150
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురణ



.

Friday, January 6, 2012

మా నాన్న బాలయ్య ... My Father Balaiah By Dr.Y.B.Satyanarayana ...

అంటరాని తనం ఎలా వుంటుంది?
చాలా చేదుగా వుంటుంది.
అనుభవిస్తే కాని అర్ధం కాదు.

ఇప్పుడు అంటరానితనం చాలా వరకు తగ్గినా ఒకప్పుడు అది సమాజం లోతుల దాకా పాతుకుపోయిన దురాచారం.
అలాంటి దురాచారాన్ని అధిగమించి పైకి వచ్చిన విద్యాధికులలో వై.బి. సత్యనారాయణ ఒకరు.

అమెరికాలో ఉన్న తన మనవరాలు లాంటి వాళ్లకు ఈ చెడు నిజాలు తెలియాలనే ఉద్దేశం తో ఆయన రాసిన పుస్తకమే "మై ఫాదర్ బాలయ్య "
దానిలోని ఆసక్తి కరమైన భాగాలు మీకోసం :

ఇక్కడ క్లిక్ చేయండి : ఆంద్ర జ్యోతి 5 -1 -2012 నవ్య పేజీ






.

Friday, December 30, 2011

My Father Baliah ... The extraordinary story of a Dalit family ... By Dr.Y. B. Satyanarayana ...



The extraordinary story of a Dalit family in southern India

Poised to inherit a huge tract of land gifted by the Nizam to his father, twenty-one-year-old Narsiah loses it to a feudal lord. This triggers his migration from Vangapally, his ancestral village in the Karimnagar District of Telangana – the single most important event that would free his family and future generations from caste oppression.

Years later, it saves his son Baliah from the fate reserved for most Dalits: a life of humiliation and bonded labour.

A book written with the desire to make known the inhumanity of untouchability and the acquiescence and internalization of this condition by the Dalits themselves, Y.B. Satyanarayana chronicles the relentless struggle of three generations of his family in this biography of his father.

A narrative that derives its strength from the simplicitywith which it is told, My Father Baliah is a story of great hardship and greater resilience.

My Father Baliah
By: Y. B. Satyanarayana
ISBN: 9789350290750
Cover Price: Rs. 299.00
Format: Demy Paper Back
Extent: 224 pages
On Sale: December 2011


HarperCollins India Original

Copies are also available at Hyderabad Book Trust

Please click here for a report on the book release function:
" The Hindu News "

Please click here for a review on this book:
" Mallepalli Laxmaiah, Hans India "


..

Monday, December 19, 2011

హెచ్‌బీటీ ఘంటారావం - సాక్షి సాహిత్యం పేజీ


...
మేధస్సుకు పదును పెడుతూనే, విలువలకూ కళాదృష్టికీ ఆలవాలంగా ఉన్న పుస్తకాలను కొన్ని దశాబ్దాలుగా తెలుగు పాఠకుల ముందుకు తెస్తున్న హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ (హెచ్‌.బి.టి.) 2011 సంవత్సరంలో కూడా పుస్తకాల ఎంపికలో తనదైన శైలిని చూపింది.

ఈ సంవత్సరం అ లెగ్జాండర్‌ డ్యూమా విఖ్యాత నవల 'కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో' ను 'అజేయుడు' పేరుతో, విక్టర్‌ హ్యూగో నవల 'హంచ్‌బ్యాక్‌ ఆఫ్‌ నాట్ర్‌డేమ్‌' ను 'ఘంటారావం' పేరుతోనూ తెలుగులోకి తీసుకొచ్చారు. సూరంపూడి సీతారాం అనితర సాధ్యమనిపించే రీతిలో చేసిన అనువాదాలివి.

ఝల్‌కారీ బాయి కథకు అనువాదాన్ని కూడా ఈ సంవత్సరమే విడుదల చేశారు.

హెచ్‌బీటీ ప్రచురణల్లో ప్రత్యేకంగా చెప్పుకోవలసినవి డాక్టర్‌ కేశవరెడ్డి నవలలు.
ఆయన రాసిన 'స్మశానం దున్నేరు', 'ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌', 'సిటీ బ్యూటిఫుల్‌', 'రాముడుండాడు-రాజ్యముండాది' నవలలను మళ్లీ వెలువరించింది హెచ్‌బీటీ.

వచ్చే సవత్సరం-
'ఇస్మత్‌ చుగ్తాయ్‌ కథలు',
రడ్యార్డ్‌ కిప్లింగ్‌ 'జంగిల్‌ బుక్‌',
విభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ 'అపరాజితో',
దేవులపల్లి కృష్ణమూర్తి 'యాత్ర' నవలను
వెలువరించే ఆలోచనలో ఈ సంస్థ ఉంది.

- సాక్షి - సాహిత్యం 19 డిసెంబర్‌ 2011 సౌజన్యంతో

Sunday, December 18, 2011

రూపం - సారం ... బాలగోపాల్‌ పుస్తకంపై 'నమస్తే తెలంగాణా' పత్రిక సమీక్ష


బాలగోపాల్‌ను ప్రధానంగా రాజకీయ వ్యాఖ్యాతగా భావించేవాళ్లు ఆయన ఆలోచనల తాత్విక మూలాలు, ఆయన సాహిత్య పరిశీలనలో ఉన్నాయని గుర్తించడానికి ఈ పుస్తకం దోహదపడుతుందంటూ ప్రచురణ కర్తలు పేర్కొన్నారు.

మనిషి జీవితంపై, సమాజ జీవితంపై ప్రతి మలుపులోనూ వెలుగులు ప్రసరించి అన్ని పార్శ్వాలనూ మనకు చూపించగల శక్తి సాహిత్యానికి మాత్రమే ఉందని నమ్మిన వ్యక్తి బాలగోపాల్‌.

అటువంటి వ్యక్తి ఎంతో నిజాయితీగా వేర్వేరు సందర్భాల్లో రాసిన సమీక్షలు, వ్యాసాలు, ఇచ్చిన ఇంటర్వ్యూలు, ప్రసంగాలు, అట్లే రాసిన ముందుమాటలను ఈ పుస్తకంలో సంకలనం చేశారు. అంతేకాదు తన రూపం సారం పుస్తకానికి చేరా, కె.వి.ఆర్‌., త్రిపురనేని మధుసూధనరావులు రాసిన ముందుమాటల్ని, అదేవిధంగా బాలగోపాల్‌ రాసిన ఆంగ్ల వ్యాసాల్ని కూడా ఈ పుస్తకంలో అనుబంధాలుగా చేర్చారు.

కె. శ్రీనివాస్‌ ఈ పుస్తకానికి ముందుమాట రాస్తూ కె. బాలగోపాల్‌ విమర్శకుడిగా, సిద్ధాంతకర్తగా లభించడం తెలుగు సాహిత్యానికి చరిత్ర కల్పించిన ఒక అపురూపమైన అవకాశం అన్నాడు. అయితే, విప్లవ శిబిరమే కాదు, ఆ స్రవంతికి సమాంతరంగా వర్థిల్లిన గుర్తింపు ఉద్యమాలు సైతం బాలగోపాల్‌ నుంచి మద్దతు స్వీకరించి నంతగా , ఆయన ఆలోచనలను తీసుకోలేదు. ఫలితంగా ఆయన సాహిత్య వ్యక్తిత్వం ఒక తరం వారికి పెద్దగా పరిచయమే కాలేదు. ఆయన రచనలన్నింటినీ ఒక క్రమంగా అధ్యయనం చేసి, అర్థం చేసుకోవడానికి ఆయన నిష్క్రమణతో అవకాశం కలగడమే విషాదం అన్నారు . అది పూర్తిగా నిజం.

ఈ పుస్తకం సాహిత్యాన్ని బాలగోపాల్‌ తన కార్యరంగంగా ఎంచుకోదని, సాధికారంగా వ్యాఖ్యానించడానికి తగినంతగా తెలుగు సాహిత్యాన్ని చదవలేదని, తాను రాసిన వ్యాసాలు సమగ్రం కావని బాలగోపాలే అనేక సందర్భాల్లో అన్నప్పటికీ సాహిత్యానికి ఆయన వ్యక్తిగత, ప్రజా జీవితంలో ప్రత్యేక స్థానం ఉన్నది. తాత్విక విశ్వాసంగా తాను అప్పటిదాకా భావిస్తూ వచ్చిన మార్క్సిజం పట్ల వున్న అసంతృప్తిని వ్యక్తం చేసిన సందర్భమూ, తాను మొదలుపెట్టిని తాత్విక అన్వేషణ ఒక కొలిక్కి వచ్చిందని, తనకు సంతృప్పినిచ్చే ప్రాపంచిక దృక్పథం లభించిందని ప్రకటించిన సందర్భమూ సాహిత్య అవగాహన, వివేచన, మీమాంస అన్నీ కూడా ఈ వ్యాసాలనుంచి అందిపుచ్చుకోవడం ప్రజా జీవితంలో ఉన్న పాఠకులందరికీ అత్యంత అవసరం, అవశ్యం.

యండమూరి తులసీదళం నుంచి అలెక్స్‌ హేలీ రూట్స్‌ నవల దాకా మాభూమి నుంచి శంకరాభరణం దాకా, ఇంకా చెప్పాలంటే అటెన్‌బరో గాంధీ దాకా బాలగోపాల్‌ నిశిత పరిశీలనతో చేసిన సమీక్షలు, వ్యాసాలూ ప్రతీ అంశాన్ని సీరియస్‌గా లోతుగా తరచి చూడాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తాయి. సామాన్య పాఠకులనూ లోతైన అధ్యయనానికి ప్రేరేపిస్తాయి.

- ( నమస్తే తెలంగాణా ఆదివారం బతుకమ్మ 11 డిసెంబర్ 2011 సౌజన్యంతో )

రూపం-సారం
సాహిత్యం పై బాలగోపాల్‌
339 పేజీలు, వెల: రూ.150

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌-500 067
ఫోన్‌: 040-2352 1849

ఇమెయిల్‌ : hyderabadbooktrust@gmail.com

.

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌