Saturday, September 7, 2013

అరుదైన కమ్యూనిస్టు



అరుదైన కమ్యూనిస్టు 

మీరు చెప్పేదానిని జాగ్రత్తగా వినే కమ్యూనిస్టు రాజకీయ వేత్త ఎవరైనా మీకు తెలుసా? 
ఒక రిక్షావాలాకు అవసరమైన శస్త్ర చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేసి, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యేంతవరకు రోజంతా అతని వద్దనే ఉండే కమ్యూనిస్టు రాజకీయవేత్త ఎవరైనా తెలుసా?  
ఒక భారతీయ పౌరునికి అర్హమైన గౌరవం ఇస్తూ రోగికి చికిత్స చేయని పక్షంలో ఏ డాక్టర్‌తోనైనా పోట్లాడేందుకు సిద్ధపడే కమ్యూనిస్టు రాజకీయవేత్త ఎవరైనా మీకు తెలుసా?
మహిళలను ఎప్పుడూ ఏ విధంగానూ అగౌరవపరచరని మీరు పరిపూర్ణ విశ్వాసంతో చెప్పగల కమ్యూనిస్టు రాజకీయ వేత్త ఎవరైనా మీకు తెలుసా?  
సదా జనసమ్మర్ధంతో, వాహనాల రాకపోకల రద్దీతో ఉండే లక్డీకపూల్ వద్ద రోడ్డు నడిమి భాగంలో నిర్లక్ష్యంగా విసరివేసిన అరటి తొక్కపై కాలు వేసి ఎవరూ జారిపడకుండా ఉండేందుకై దాన్ని ఎత్తుకు వచ్చి రోడ్డు పక్కన ఉన్న చెత్త కుండీలో పడవేసే మనిషి ఎవరైనా మీకు తెలుసా?  
అటువంటి ఉదాత్త వ్యక్తి ఒకరు నాకు తెలుసు. 
ఆయన గురువారం అర్థరాత్రి కీర్తిశేషులయ్యారు.

ఆ సజ్జనుడే, సి.కె. అని అందరూ గౌరవంగా పిలిచే సి.కె. నారాయణ రెడ్డి. 
కొన్ని వర్గాలలో చిత్తూరు జిల్లాకు చెందిన కమ్యూనిస్టు రాజకీయవేత్తగా సుప్రసిద్ధుడు; ఇతర వర్గాలలో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ (హెచ్.బి.టి.) సంస్థాపకుడుగా సుపరిచితుడు. పాఠశాల, కళాశాల విద్యాభ్యాసకాలంలో తనకున్న ప్రతిదీ పేదలకు ఇచ్చివేసిన మంచివాడుగా ఆయన పేరుకెక్కారు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతూ పేద విద్యార్థుల కోసం ఒక హాస్టల్‌ను ఆయన ప్రారంభించారు. అప్పటికి ఆయనకు నిండా ఇరవై ఏళ్ళు కూడా ఉండవు. 

క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడానికై చదువుకు స్వస్తి చెప్పారు. జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలోని సోషలిస్టు పార్టీలో కొంతకాలం పనిచేశారు. 1953లో కమ్యూనిస్టు ఉద్యమంలో చేరారు. 1962లో పీలేరు శాసనసభ నియోజక వర్గం నుంచి పోటీచేసి గెలిచారు. అయితే భారత్-చైనాల మధ్య యుద్ధం రావడంతో ఆయనకు కారాగారవాసం ప్రాప్తించింది. 1967లో చారుమజుందార్ గ్రూపులో చేరారు. 1970లో ప్రభు త్వం ఆయన్ని అరెస్ట్ చేసింది. అత్యయిక పరిస్థితి సందర్భంగా 1975లో మళ్లీ జైల్లో నిర్బంధించింది. 1977లో విడుదలైన అనంతరం ప్రగతిశీల సాహిత్యం ప్రచురణకు సి.కె. అంకితమయ్యారు. రిచర్డ్ అలెన్, టెడ్ గోర్డన్‌ల 'ది స్కాల్‌పెల్, ది స్వోర్డ్', విలియం హింటన్ 'ఫాన్‌షెన్', మేరీ టైలర్ 'మై ఇయర్స్ ఇన్ ఏన్ ఇండియన్ ప్రిజన్', ఎడ్గార్‌స్నో రాసిన 'రెడ్ స్టార్ ఓవర్ చైనా' మొదలైన పుస్తకాలను ఆయన తెలుగులో ప్రచురించారు.

నేను ఒక నిర్దిష్ట తిరుగుబాటు దశలో ఉన్న కాలంలో సి.కె.తో నాకు తొలుత పరిచయమైంది. అప్పుడు నా వయస్సు ఇరవై ఐదేళ్ళు. ఒక నక్సలైట్ గ్రూపులో పనిచేసి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుల ధోరణికి విసిగిపోయి బయటికి వచ్చాను. తమ మాటే నెగ్గాలనే మొండి పట్టుదల వారిది. ఇతరులు చెప్పేదానిని వినిపించుకొనేవారు కాదు. మహిళలను అణచివేసే వారు. ఇతరులూ మానవులేనని గుర్తించేవారు కాదు. 

సి.కె. నా భర్తకు పినతండ్రి. నక్సలైటు పార్టీలోని వ్యవహారాలతోనే కాకుండా కుటుంబ బాంధవ్యాలతో కూడా నేను అలసిపోయాను. ఈ బాంధవ్యాలు యువతులకు కొన్ని హద్దులు, తరచు హింసాత్మకంగా కూడా విధించేవి. పుట్టింటి బంధనాల నుంచి తప్పించుకున్న నేను వివాహం ద్వారా మరో కుటుంబానికి సన్నిహితమవ్వడమనేది నేను కోరుకునే చివరి విషయం.

సి.కె.తో పరిచయమైన ఏడు సంవత్సరాల వరకు, ఆయనతో నా బాంధవ్యాన్ని నేను అంగీకరించలేదు. దీనికి ఆయనేమీ బాధపడలేదు. 1980లో సి.కె. నేతృత్వంలో ఒక చిన్న బృందం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. హెచ్.బి.టి. ప్రచురించిన తొలి పుస్తకాలతో సి.కె., నేను కలసి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పట్టణానికీ, ప్రతి పెద్ద గ్రామానికీ వెళ్ళాం. కొద్ది నెలల కాలంలోనే ఆయన పట్ల నాకు ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. 

ఆయన చాలా అరుదుగా మాట్లాడేవారు. సదా ఇతరులు చెప్పేదానిని వినేవారు. ఆయన తరానికి చెందిన ఏ కమ్యూనిస్టులోనైనా ఇదొక గొప్ప గుణం. తనను తాను మరచిపోయి పనిచేసేవారు. ఇతరులను స్వార్థానికి ఉపయోగించుకొనే గుణం ఆయనలో ఏమాత్రం లేదు. చాలా సున్నితంగా, మృదువుగా వ్యవహరించే వారు. తన ప్రతిపాదనలను నిష్పాక్షికంగా చర్చించేవారు.

ముఖ్యంగా మహిళలు, పేదవారిపట్ల ఒక పరిపూర్ణ పెద్ద మనిషి తరహాలో వ్యవహరించేవారు. నాకుతెలిసిన కమ్యూనిస్టులలో ఇది పూర్తిగా కనరాని విషయం. సంపన్నులతో సాపేక్షంగా కఠిన వైఖరితో వ్యవహరించడంలో ఆయన ఆనందాన్ని పొందేవారు. నిధుల సమీకరణకు మేము ఎవరి గృహానికైనా వెళ్ళినప్పుడు ఆ గృహస్థుడు తాను కొత్తగా ఇల్లు కట్టుకున్నాననో లేదా కుమార్తె వివాహం చేశాననే సాకుతో విరాళం ఇవ్వలేనని చెప్పినప్పుడు సి.కె. ఊరుకునే వారు కాదు. అందుకే మీ దగ్గరికొచ్చామని స్పష్టం చేసేవారు. మీరు ఫలానా వ్యవహారానికి ఫలానా మొత్తంలో ఖర్చుపెట్ట గలరని విన్నాము. అందుకే మిమ్ములను అడగదలచుకున్నదానికి రెట్టింపు ఇవ్వాలని అడుగుతున్నామని సి.కె. అనేవారు.

ఆయనలోని మానవతా దృక్పథం నన్ను విశేషంగా ఆకట్టుకొంది.

ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలు, గ్రామాల్లో ప్రయాణిస్తుండగా కూడా ఎక్కడైనా రోడ్లపై అరటి తొక్కలు కనిపడితే వాటిని తీసివేసేవారు. నిత్యం ఆస్పత్రులను సం దర్శించి రోగుల బాగోగులను చూస్తుండేవారు. పేదలు, అవసరంలో ఉన్నవారి గురించి ప్రత్యేకంగా పట్టించుకొనేవారు. నాకు తెలిసిన కమ్యూనిస్టులో కెల్లా సి.కె. చాలా చాలా భిన్నమైన, విలక్షణమైన వ్యక్తి. జంట నగరాల్లో కుక్కల సంతతి ఎక్కువై కుక్కకాటుకు బాధితులైన పేదల సంక్షేమాన్ని పట్టించుకొనేవారు. పేద గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్న ఫ్లోరోసిస్ సమస్య, పారిశ్రామిక కాలుష్య సమస్యల పరిష్కారానికి ఆయన ఇతోధిక కృషి చేశారు. దళిత బాలబాలికలకు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించడానికి ఆయన శ్రద్ధ చూపారు. శాసనసభ్యులకు, మాజీ శాసనసభ్యలకు ప్రభుత్వం అనేక సౌకర్యాలను కల్పించినప్పుడు స్వయంగా మాజీ ఎమ్మెల్యే అయివుండీ ఆ నిర్ణయాన్ని సి.కె. వ్యతిరేకించారు.

ఎస్.ఆర్. శంకరన్ తాను ఇద్దరు వ్యక్తులకు భయడతానని, వారిలో ఒకరు సి.కె. అని చెబుతుండేవారు. ఎందుకంటే సి.కె. ఏదైనా ఒక సమస్య విషయమై శ్రద్ధ చూపితే అది పరిష్కారమయ్యేంతవరకు తదేక దీక్షతో కృషి చేసేవారని శంకరన్ అనేవారు. హెచ్.బి.టి.కి సి.కె. సంస్థాపకుడు, హృదయం, ఆత్మ. ఆయన నాకు మార్గదర్శకుడు. నేను అన్ని కుటుంబ బాంధవ్యాలకు దూరమయినాను కదా. ఆయన చాలా ఉదారుడు. ఆయన నాకు తండ్రి, తల్లి, స్నేహితుడు. 1994లో ఆస్పత్రిలో ఉండవలసి వచ్చినప్పుడు సి.కె. రోజూ వచ్చి నన్ను పరామర్శిస్తుండేవారు. నేను త్వరగా కోలుకోవడానికి ఆయన సహాయపడ్డారు.

కాలంతో పాటు నడిచిన వ్యక్తి సి.కె.. గతకాలం గురించి ఆయన ఎన్నడూ ఏదో కోల్పోయామన్న భావనతో ఆలోచించేవారు కాదు. ప్రజల్లో నిత్యం వస్తున్న మార్పులను గమనించే వారు. గతంలో కంటే ఇప్పుడు ప్రజల్లో చాలా మార్పులు వచ్చాయని, స్వతంత్ర వైఖరితో మాట్లాడడానికి సాహసిస్తున్నారని ఆయన గుర్తించారు. కనుకనే తన వయస్సులో ఉన్న ఇతరుల కంటే వర్తమాన రాజకీయాలు, ఉద్యమాల ప్రాధాన్యాన్ని ఆయన గుర్తించేవారు. వాటిని ప్రశంసించేవారు. ఇప్పుడు 'మంచి మనిషి'గా, 'స్వార్థరహితుడు'గా ఉండడం ఆనవాయితీగా లేదు. విస్తృతస్థాయిలో సంబంధాలు కలిగివుండడానికి, టెలివిజన్‌లో కనిపించడానికి, ఇతరులు తన గురించి తరచూ రాసేందుకే అందరూ శ్రద్ధ చూపుతున్నారు. సి.కె. నిజంగా మంచి మనిషి, నిస్వార్థపరుడు, మహోన్నతుడు. ఆయన నుంచి చాలా మంది స్ఫూర్తి పొందారు. మన జీవితాలలో ఆయన సజీవుడుగా ఉంటారు.

- గీతా రామస్వామి
(ఆంద్ర జ్యోతి 7 సెప్టెంబర్ 2013 సౌజన్యంతో )

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఈరోజు కొన్ని పత్రిక లలో వచ్చిన వార్తల కత్తిరింపులు :


The Hindu 7 9 2013 

‘Piler Gandhi’ dead

Challa Krishna Narayan Reddy, veteran Communist leader and freedom fighter, popularly known as CK and ‘Piler Gandhi’, for his spartan lifestyle, passed away here on Thursday night. He was 88 and survived by wife Jayaprada and two daughters. In accordance with his wish, his body was donated to Gandhi Medical College.

Born on August 1, 1925, at Challavaripalle near Piler of Chittoor district, he discontinued his BA and joined Quit India Movement. Under the influence of Mahatma Gandhi, he spun the charkha and used to wear pure khadi. He joined Communist movement in 1953.
CK was elected to the AP Assembly on Communist Party ticket in 1962. He was arrested again during the Emergency. On release from prison in 1977, he began Janata Prachuranalu and Anupama Prachuranalu and published transformative literature. He founded the Hyderabad Book Trust in 1980 along with social activist, Gita Ramaswamy.
— Special Correspondent
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
  The Hans India 7 9 2013

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
Eenadu 7 9 2013
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
 




Friday, September 6, 2013

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు సి. కె. నారాయణ రెడ్డి అస్తమయం


హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు
సి. కె. నారాయణ రెడ్డి అస్తమయం

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు, మాజీ శాసన సభ్యులు, పీలేరు గాంధిగా సుప్రసిద్ధులు అయిన  సి.కె.నారాయణ రెడ్డి గారు నిన్న అర్థ రాత్రి (5 సెప్టెంబర్‌ 2013న) హైదరాబాద్‌లో చనిపోయారని తెలియజేయడానికి చింతిస్తున్నాము. ఆయన వయసు 88 సంవత్సరాలు.

సికె గా వ్యవహరించబడే ఆయన పూర్తి పేరు చల్లా కృష్ణ నారాయణ రెడ్డి. చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలోని
చల్లావారిపల్లిలో 1 ఆగస్ట్‌ 1925న జన్మించారు. మదనపల్లిలో బీసెంట్‌ థియొసాఫికల్‌ స్కూల్‌/కాలేజీలో బిఎ వరకు చదువుకున్నారు. కాలేజీలో మంచి హాకీ క్రీడాకారుడిగా రాణిస్తూనే సామాజిక సమస్యల పట్ల స్పందించేవారు. బిఎ రెండో సంవత్సరంలో వుండగానే పేద విద్యార్థుల కోసం ఆయన ఒక వసతి గృహాన్ని నిర్వహించారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొనేందుకు ఫైనల్‌ ఇయర్‌లో కాలేజీ నుంచి బయటికి వచ్చారు. గాంధీ ప్రభావంతో ఎప్పుడూ ఖద్దరు వస్త్రాలనే ధరించేవారు. తరచూ చరఖా తిప్పేవారు.

 సోషలిస్టు పార్టీలో క్రియాశీల సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 1953లో కమ్యూనిస్టు ఉద్యమంలో చేరారు. పేదల వేతనాలకోసం, భూమి కోసం భుక్తికోసం పార్టీ నిర్వహించిన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. కరవు రోజుల్లో గంజి కేంద్రాలను నిర్వహించారు.  దళిత పిల్లల చదువు కోసం విశేషంగా కషి చేశారు. యెర్రవారిపాలెం, నేలబైలు, పీలేరు, మదనపల్లిలో బడుగు వర్గాలకోసం సికె స్వయంగా పలు వసతి గృహాలను నిర్వహించారు. బాకారావు పేట, వాయలపాడు వసతి గృహాలకు సహాయ సహకారాలు అందించారు. అందులో వుంటూ చదువుకున్న మునివెంకటప్ప, అబ్బన్న ఐఎఎస్‌ అధికారులు అయ్యారు. యువత కోసం రొంపిచెర్లలో ఒక గ్రంథాలయాన్ని నెలకొల్పారు.

 సికె గారు 1962లో కమ్యూనిస్టు పార్టీ తరఫున పోటీ చేసి శాసన సభకు ఎన్నికయ్యారు. అయితే ఆ వెంటనే భారత చైనా యుద్ధం కారణంగా అరెస్టయి జైలుకు వెళ్లారు. 1967 లో చారుమంజుందార్‌ గ్రూపులో చేరారు. 1970లో ప్రభుత్వం వీరిని అరెస్టు చేసింది. అత్యయిక పరిస్థితి సందర్భంగా 1975లో మళ్లీ జైల్లో నిర్భంధించింది. రెండేళ్ల తరువాత ఎమర్జెన్సీ ఎత్తివేయడంతో 1977లో విడుదలయ్యారు. ఆ తరువాత కొన్నాళ్లకు జనతా ప్రచురణలు, అనుపమ ప్రచురణలు నెలకొల్పి - ''ది స్కాల్‌పెల్‌, ది స్వోర్డ్‌'' - రిచర్డ్‌ అ లెన్‌  , టెడ్‌ గోర్డన్‌ (రక్తాశృవులు) ; ''ఫాన్‌షెన్‌'' - విలియమ్‌ హింటన్‌ (విముక్తి) ; ''మై ఇయర్స్‌ ఇన్‌ ఏన్‌ ఇండియన్‌ ప్రిజన్‌''- మేరీ టైలర్‌ (భారత దేశం లో నా జైలు జీవితం) ;'' రెడ్‌ స్టార్‌ ఓవర్‌ చైనా''- ఎడ్గార్‌ స్నో (చైనా పై అరుణ తార) తదితర పుస్తకాలను తెలుగులో ప్రచురించారు.

1980లో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ను నెలకొల్పి అప్పటినుంచి 1990ల చివర తన ఆరోగ్యం క్షీణించేవరకూ నిర్విరామంగా కృషి చేస్తూ అనేక మంచి పుస్తకాలను తెలుగులో వెలువరించారు. సైద్ధాంతిక ప్రచారాన్ని పెద్దఎత్తున నిర్వహించేందుకు, ప్రజల మనసుల్ని గెలిచేందుకు చిన్న పుస్తకాలు విశేషంగా తోడ్పడతాయని భావించేవారు.

జంటనగరాల్లో కుక్కల సంతతి ఎక్కువై  కుక్క కాటు సంఘటనలు విపరీతంగా పెరిగినప్పుడు ఆ సమస్యపై అక్కినేని అమల వంటి శక్తివంతులైన జంతువుల హక్కుల గురించి పోరడే వాళ్లని ఎదిరిస్తూ ఉద్యమం నిర్వహించారు. ఫ్లోరోసిస్‌ సమస్యపై పోరాటాలు చేశారు.  ప్రభుత్వం శాసన సభ్యులకు, మాజీ శాసన సభ్యులకు అనేక సౌకర్యాలను
కల్పించినప్పుడు స్వయంగా మాజీ శాసన సభ్యులయివుండి కూడా ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా గళమెత్తారు.

1972లో ఉస్మానియా యూనివర్సిటీ లో హత్యకు గురైన కామ్రేడ్ జార్జి రెడ్డి స్వయానా వీరి అన్న కుమారుడు.

సికె గారికి భార్య జయప్రద, ఇద్దరు కూతుళ్లు డా. అరుణ, సి. శైలజ  వున్నారు.


.

Saturday, August 24, 2013

భారత దేశపు తొలి దళిత కార్డియాలజిస్ట్ అనుభవాలు: నా పొగరు మిమ్మల్ని గాయపరిచిందా? అయితే సంతోషం : డా. గోపీనాథ్




భారత దేశపు తొలి దళిత కార్డియాలజిస్ట్ అనుభవాలు: "నా పొగరు మిమ్మల్ని గాయపరచిందా అయితే సంతొషం" : డా. గోపీనాథ్ పుస్తకానికి అల్లం రాజయ్య రాసిన ముందుమాట :

ముళ్లదారి
                డాక్టర్‌ గోపీనాథ్‌ తన పుస్తకానికి ముందుమాట రాయమనగా నేను ఆశ్చర్య పోయాను. అంత అనుభవం, లోతైన బహుముఖ అధ్యయనం నాకు లేదు. వేల సంవత్సరాలుగా ఎదురెదురుగా నిలబడి యుద్ధం చేస్తున్న, సర్వసంపదల సృష్టికర్తలైన ప్రజారాశుల్లో... ఆ సంపదను చేజిక్కించుకుని వారి మీద అధికారం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలక పక్షాల లోతుపాతులు ` కార్యకర్తగా, నాయకుడిగా ఆయన మమేకత్వం ` విశ్లేషణ నాలాంటివాడికి అందనిది.
                అంటరాని కులంలో పుట్టి, కులాల ముళ్ల కంచెలు దాటి, లేమిని ఎదిరించి, మారుమూల పల్లె ఎల్లలు దాటి ` ఏకలవ్యుడిలా అనేక విద్యలు అభ్యసించినవారు ఆయన. అడుగడుగునా, దారి పొడుగునా రాజీలేని పోరాటంలో ` ఒంటరిగా అనుభవించిన వొత్తిడి అనుభవిస్తున్న తీవ్రత మాటలకందనిది.
                గజిబిజిగా అస్తుబిస్తుగా, వెనుకా ముందులుగా ` కాలువలుగా, వాగుల్లాగా ప్రవహించిన వాక్యాల లోతుల్లో తడి ` నా కళ్లల్లోకి ప్రవహించి.......
                ఈ పుస్తకం చదవడానికి చాలా రోజులు పట్టింది. ఇది రొమాంటిక్‌ ఫిక్షన్‌ కాదు. కథ కాదు ` కవిత్వం కాదు ` భయంకరమైన కఠోరవాస్తవం. రాసిన వాక్యాల వెంట, రాయని మరెన్నో తెలిసిన ఘటనలు చుట్టుముట్టేవి. గోపి పల్లె బతుకు. మోకాలుమంటి దిగబడే దారులు, అడపాదడపా స్కూలుకు వచ్చే పంతుళ్ళు, ఊరి కొట్లాటలు, పసి మనుసుల్లో ఎగిసిన, కలతపెట్టిన ఘటనలు....  పశువులు, పంటలు, ఎండా, వానా, చలి, చేపలు, కన్నీళ్లు, కష్టాలు ప్రతిదీ ` గుండె గొంతుకలోన గుబగుబలాడినయ్‌.
                పల్లె ` అందునా భారతీయపల్లె ` నిరంతర యుద్ధ క్షేత్రం కదా! పల్లెలోని మనుషులు భూమి చుట్టు అల్లుకొని, కులాలుగా, వర్గాలుగా స్త్రీ పురుషులుగా, అనేక రకాలుగా విడిపోయి, ఒకరితోనొకరు తలపడుతూ, కలబడుతూ, హింసించుకుంటూ, నిత్యం గాయపడి నొప్పులతో బతుకుతారు కదా! దుర్భర దారిద్య్రం, అంతులేని వేదన ` ఊపిరాడని పల్లెటూల్ల పిల్లగాండ్లు ` అలాంటి ఒంటరితనాల్లోంచి  ` సంక్లిష్ట భారతీయ పల్లె బతుకు నుంచి బయటపడటానికి పడిన పాట్లు ఈ పుస్తకం...
                భూమి కోసం, తాము సృష్టించిన సంపద కోసం ప్రజలు పోరాడుతున్న వేల సంవత్సరాల యుద్ధభూమి పల్లె ` అయినా మాయోపాయాలతో సంపద పంచబడని, దోపిడి చెక్కుచెదరని, స్థితిలో....... సుదీర్ఘ యుద్ధాల్లో కూడా ` తమ సృజనాత్మకతను, జ్ఞానాన్ని, అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ కొనసాగుతున్న ` తలవంచని కింది కులాల వీరయోధుల కుటుంబంలో నుండి సాగిన జీవనయానం ` ఆయన యుద్ధ బీభత్స అనుభవాలు నన్ను కకావికలు చేశాయి. ఆయనలాగే నాకు ఆ పల్లె కలలు,
నెత్తుర్లు చిమ్మంగా కొట్టుకున్న కలలు...... సుదీర్ఘ యుద్ధాల పీడకలలు, పెనుగులాడినకొద్దీ మునుపటికన్నా లోతుగా దినదినం యుద్ధరంగంలోకి నెట్టబడుతున్న పల్లెలు `. అడవులు` ఎక్కడేమిటి అన్ని రకాల సంపద, వనరులు, సుడిగాలిలా ` ఎలుగడిలా పరివ్యాప్తమౌతున్న యుద్ధరంగంలో నిలబడి చావోరేవో తేల్చుకోవాల్సిన సందర్భంలో ఈ పుస్తకం....
                రెండు ప్రపంచ యుద్ధాలలో నలిగిన బ్రిటన్‌ అనేక రకాల లోపలి`బయటి కారణాల రీత్యా భారతదేశంలో అధికార మార్పిడి నిర్వహించింది. ఫలితంగా అగ్రకుల భూస్వామ్య, దళారులకు అధికార మార్పిడి ద్వారా రాజ్యాధికారం చిక్కింది. అప్పటికి రష్యాలో ప్రజలు శ్రామికవర్గ పార్టీ నాయకత్వంలో పోరాడి విజయం సాధించారు. సోషలిస్టు మాయోపాయాల నెహ్రూ మార్కు సోషలిజం ` గాంధీ హరిజనోద్ధరణ ` వీటన్నటికి భిన్నంగా అంబేడ్కర్‌ రాజ్యాంగంలో పొందుపర్చిన కింది కులాల అభివృద్ధికి సంబంధించిన అంశాలు ` ఏ రకంగానైతేనేమి ` అనివార్యంగా అగ్రకుల, రాజుల, భూస్వాముల కబంధ హస్తాల్లో వేల సంవత్సరాలుగా చీకటి కొట్టాలుగా మగ్గుతున్న గ్రామాల్లోకి చిరుదీపంలాగా చదువు రంగ ప్రవేశం చేసింది. సర్వసంపదలు సృష్టించి ఆగర్భ దరిద్రంతో ఉత్త చేతులతో మిగిలిన కింది కులాల వారికి, తమ చుట్టూ నివసించే మనుషుల్లోకి కిటికీ తెరిచినట్టయింది. పల్లెల నుండి పట్నాలకు దారులు తెరుచుకుని పల్లె జనంలో చలనం మొదలైంది. అలాంటి బడుల్లో కూడా మొదట పల్లెల్లో బడి సౌకర్యాన్ని అందిపుచ్చుకుని ఎదిగినవాళ్లు ఎక్కువగా అగ్రకులాలవాళ్లే. అదివరకే గ్రామంలో  అంతోయింతో సంపద కలిగినోళ్లే. ఇప్పటికి కూడా కింది కులాల నుండి మరీ ముఖ్యంగా అంటరాని కులాల నుండి అనేక గండాలు దాటుకుని పెద్ద చదువులు చదువుకుని నిలదొక్కుకునేది ఒక్క శాతం మాత్రమే ` నూటికొక్కరు.
                గ్రామాల్లోని మిగతా 70 శాతం ప్రజలు నిత్య దరిద్రంతో ` ఉన్నవి పోగొట్టుకుని ` అప్పటి నుండి ఇప్పటి దాకా యుద్ధరంగంలో హింసల కొలిమిలోనే బతుకుతున్నారు. అయితే ఏదో కారణం చేత చంపబడడం ` లేకపోతే చిన్న వయసులోనే చనిపోవడం నిత్యకృత్యం.  ఇలాంటి చిక్కుదారులగుండా కోస్తాంధ్ర, తెలంగాణా సరిహద్దుపల్లె ‘అయ్యోరిగూడెం’ నుండి మొదలైన గోపి నడక మామునూరు హైస్కూలు చదువు ` విజయవాడ లయోలా కాలేజీలో ఇంటర్‌, ఉస్మానియాలో మెడిసన్‌, కేరళలోని త్రివేండ్రంలోని శ్రీ చిత్ర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ Ê టెక్నాలజీలో డిఎం కార్డియాలజీదాకా సాగింది. ఒక పల్లెటూరి దళిత పిల్లవాడి కత్తుల వంతెన మీద ప్రయాణం. చావుకు మిల్లీమీటరు దూరంలో ఎన్నిసార్లో చుట్టుముట్టబడి ` తన సహచరులెందరో కూలిపోయినట్టు కూలిపోవాల్సిన వాడే. బహుశా నిత్యం జ్వలిస్తూ ఈ విధంగా మన ముందు నిలబడ్డ గోపీది సాహసయానమేకాక ఒక అపురూప ఘటనే.....
                గోపి పల్లె నుండి బయటపడిన కాలం ` అన్ని రకాలుగా ప్రజాస్వామ్యం మాయ బట్టబయలైన సమయం. నెహ్రూ ప్రవచించిన సంక్షేమం `గాంధీ హరిజనోద్ధరణ కానరాలేదు. పేదలు మరింత పేదవాళ్లయ్యారు. అంబేడ్కర్‌ ప్రవచించిన రాజ్యాగంలోని సామాన్యుల హక్కులు కాలరాచివేశారు.... తెలంగాణాలో 1969 వరకు దళిత కులాల పేద పిల్లలు గోపిలాగే అనేక ప్రశ్నలు లేవనెత్తారు. జీవితమొక అగ్నిగుండమని గుర్తించారు. ప్రపంచవ్యాపితంగానే ఇది ఒక కోపోద్రిక్త కాలం. దేశవ్యాప్తంగా రెక్కవిప్పుతున్న రెవల్యూషన్‌ నక్సల్బరీ కొత్తదారిలో యాంగ్రీ యంగ్‌మెన్‌ సమస్తాన్ని ప్రశ్నించడమే కాదు, దాన్ని మార్చాలని బయలుదేరిన యువకులు... 1969లో మొదలైన తెలంగాణా విద్యార్థుల ప్రత్యేక తెలంగాణా పోరాటం ` 1972 వరకు 370 మంది విద్యార్థుల హత్యతో............. మరోమారు తెలంగాణా రక్తసిక్తమైంది. అప్పటికే తెలంగాణా సాయుధపోరాటం చెల్లాచెదురైన అనుభవం తెలంగాణా ప్రజలకున్నది. ఎప్పటిలాగే ప్రజలు తమ బిడ్డలను పోగొట్టుకుంటే ` మోసగాళ్లు అధికారాన్ని, ఆస్తుల్ని పంచుకున్నారు. కాని మానని గాయం మాటేమిటి? అది లోలోపల సలిపింది. రగిలింది. 1974 వరకు తెలంగాణాలో అన్ని యూనివర్సిటీల్లోని ఆ మాటకొస్తే రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోని ` విప్లవ విద్యార్థులు స్పష్టమైన ప్రణాళికతో ఏకమయ్యారు. రాడికల్‌ విద్యార్థి సంఘంగా ఏర్పడి ‘రోడ్‌ టు రెవల్యూషన్‌’ రచించుకున్నారు. ఉస్మానియాలో జార్జిరెడ్డిని మతవాదులు చంపేశారు. అగ్గిరాజుకుంది. అత్యవసర ప్రకటన తర్వాత దేశమే పెద్ద జైలు అయ్యింది. నిర్బంధంలో జైళ్లు కొత్త రకం పాఠశాలలయ్యాయి. చరిత్రను, రాజకీయాలను, తత్వశాస్త్రాన్ని, ఉత్పత్తి, పంపకం, పెట్టుబడి భూమిక గురించి, భూమి గురించి తెలుసుకున్నారు.
                ఎమర్జెన్సీ ఎత్తివేత తరువాత రాడికల్‌ విద్యార్థులు ‘రోడ్‌ టూ రెవల్యూషన్‌’లో భాగంగా తెలంగాణాలో పెద్ద ఎత్తున ఉద్యమాల్లో లీనమయ్యారు. ఈ రోడ్డు మీదికొచ్చి కలిసిన గోపి 1978 ఫిబ్రవరిలో రాడికల్‌ విద్యార్థి సంఘానికి  రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. చెరుకూరి రాజకుమార్‌ (ఆజాద్‌) ఈ సంఘానికి అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు.
                ప్రపంచంలోనే మొదటిసారిగా ` విద్యార్థులు గ్రామాలకు తరిలారు. అదివరదాకా స్కూళ్లు, కాలేజీల్లో కల్లబొల్లి చదువుల స్థానే ` వాళ్ల గ్రామాలను, ప్రజల జీవితాన్ని మార్క్సిజం వెలుగులో అధ్యయనం చేశారు. ప్రజల దగ్గరికి విద్యార్థులు వెళ్లడమనే ప్రక్రియ ఉత్తర, దక్షిణ తెలంగాణాల్లోనే కాదు` కోస్తాలో, రాయలసీమలో ఒక ఉప్పెనలాగా సాగింది.
గ్రామాలల్లోని ప్రజల స్థితిగతుల గురించి, భూ వివరాలు, కులాలు, సామాజిక సంబంధాలు, పంటలు, నీటి వసతులు, కూలిరేట్లు, రవాణా సౌకర్యాలు ` వైరుధ్యాలు తదితర అనేక విషయాల గురించి కొన్ని లక్షల పేజీల సమాచారం సేకరించారు. ఇట్లా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించుకుని ` విద్యార్థులు ఈ పరిస్థితులు మార్చే        క్రమంలో ` మొదట కూలిరేట్ల పెంపు, పాలేర్ల జీతాల పెంపు, బంజరు, షికం తదితర ప్రభుత్వ భూముల ఆక్రమణ, పంచాయతి పద్ధతులను అగ్ర కులాల నుండి కింది కులాలకు మార్పు ` అంటరాని తనానికి వ్యతిరేకంగా అనేక పోరాట రూపాలు తీసుకున్నారు.
మొదట కూలిరేట్ల పెంపు, పాలేర్ల జీతాల పెంపు, బంజరు, షికం తదితర ప్రభుత్వ భూముల ఆక్రమణ, పంచాయతి పద్ధతులను అగ్ర కులాల నుండి కింది కులాలకు మార్పు ` అంటరాని తనానికి వ్యతిరేకంగా అనేక పోరాట రూపాలు తీసుకున్నారు.
                గ్రామాల్లో రైతు కూలీ సంఘం ఏర్పాటు చేయడానికి రాడికల్‌ విద్యార్థులు కృషి చేశారు. ఆటపాట నేర్చుకున్నారు. నిజమైన ప్రజాకళాకారులై వందల సాంస్కృతిక ప్రదర్శనలు గ్రామాల్లో, చిన్నచిన్న పట్నాల్లో ` బీదలపాట్లు, భూమి బాగోతంలాంటి వీధి నాటకాలను జననాట్యమండలితో కలిసి ప్రదర్శించారు. లోకల్‌ విషయం, స్థానిక భాషలో నిజమైన మనుషుల ఆహార్యంతో ప్రజల్లో కొత్త ఆలోచనలకు, ఐక్యతకు ఆచరణకు ఇవి కారణమయ్యాయి. విద్యార్థుల ఇలాంటి సాహసోపేత ఆచరణకు సంబంధించి ఇంతవరకు ఎక్కడా వివరంగా రికార్డు కాలేదు.
                భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా పోరాటాలకు తెరదీసిన ఒక గొప్ప మలుపుకు కారణమైన విద్యార్థులకు గోపి నాయకుడు. కరీంనగర్‌, ఆదిలాబాదు జిల్లాల్లో రైతుకూలి సంఘాల నిర్మాణం జరిగి, కృార భూస్వాములతో తలపడ్డాయి. గ్రామంలోని అమానవీయ పద్ధతులైన, వెట్టి, కులవివక్షత, అంటరానితనం, అక్రమ గ్రామపంచాయతి పద్ధతి, కూలి రేట్ల పెంపకం, బంజరు, షికం భూముల ఆక్రమణదాకా అనేక విషయాల్లో పోరాటాలు ఉవ్వెత్తున లేచాయి. ఈ ఘర్షణలు ముదిరి నిర్బంధం, పోలీసుల రంగ ప్రవేశం, అరెస్టులు, కోర్టు కేసులతో పల్లెలు అట్టుడికాయి... దొరలను ప్రజలు సాంఘికంగా బహిష్కరించారు. దొరలు గడీలు వొదిలి పట్నాలకు పారిపోయారు. దొరలు అనేకరకాలుగా ఆక్రమించిన భూములను ప్రజలు దున్నుకున్నారు. జగిత్యాల జైత్రయాత్రతో ప్రారంభమైన ఈ పోరాటాలు దావానలంలా అన్ని జిల్లాలకు వ్యాపించాయి. ఫలితంగా కల్లోలిత ప్రాంతాల చట్టం వచ్చింది. విద్యార్థులు అనేకమంది అజ్ఞాత జీవితంలోకి వెళ్లి పూర్తి కాలపు విప్లవకారులుగా మారడం, పోరాటాలు పల్లెల నుండి సింగరేణి గనుల్లోకి, సాయుధ దళాల నిర్మాణంతో అడివిలోని ఆదివాసుల్లోకి విస్తరించాయి. ఒక్క తెలంగాణాలో మాత్రమే కాదు. కోస్తా, రాయలసీమ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు విస్తరించి వేలాది విద్యార్థులు పాల్గొన్న ఒక గొప్ప ఉద్యమంలోని అనేక ఆటుపోట్లు, అరెస్టులు, ఎన్‌కౌంటర్లు, ఈ సరికొత్త ఆరాట పోరాటాల మదింపు, కొనసాగింపు చేసి ముందుకు నడిపించిన నాయకత్వంలో గోపిది ప్రధాన భూమిక. గోపీ తన పుస్తకంలో తను ఎంచుకున్న మార్గంలో రాశారు. కాని ` కీలకమైన ఘట్టాలను, మలుపులను, విభిన్న ధోరణులు ` వాటిని సమన్వయపరిచిన తీరు ` ముఖ్యంగా ఆ వొత్తిడిని, వేడిని, స్పర్శను అనుభవించాడు గనుక అలాంటి అపురూపమైన విషయాలు గోపియే రికార్డు చేయవల్సి ఉన్నది. ఉద్యమాలు అభివృద్ధి చెందే క్రమంలో జరిగిన టూలైన్‌ స్ట్రగుల్‌ గురించి, గ్రామీణ సంబంధాలలో కులం పాత్ర గురించి ` అంతవరదాకా రాజ్యమేలిన రొమాంటిక్‌ భావవాద అంచనాల నుండి, వాగాడంబరం నుండి, ఉద్యమాలను భూమార్గం పట్టించిన అతి కొద్ది మందిలో గోపి ఒకరు. 1982లో మద్రాసులో ‘నేషనాలిటీ క్వశ్చన్‌ ఇన్‌ ఇండియా’ మీద అఖిల భారత విద్యార్థి సెమినార్‌ ఏర్పాటు మొదలు విద్యార్థి ఉద్యమం అఖిల భారత స్థాయిలో ఏర్పాటుదాకా రాజ్‌కుమార్‌, గోపిలాంటివాళ్లు పూనుకుని చేసినవి. గోపి 1978 నుండి 1982 దాకా అనేక మహత్తర పోరాటాలు చేసిన రాడికల్‌ విద్యార్థి సంఘానికి నాయకుడుగా ఉన్నాడు.
                ఆ ఉప్పెన ప్రవాహంలోంచి గోపి డాక్టర్‌గా తను ప్రజలతో మమేకం కావాలనుకుని బయటపడి అనేక అడ్డంకులు ఎదుర్కొని ఒంటరి పోరాటంతో దక్షిణ భారతదేశంలో పేరెన్నికగన్న దళిత కార్డియాలజిస్టుగా ఎదిగారు.... అయినా మళ్లీ అనేక పోరాటాలు ` కులాలతో, వర్గాలతో ` కుట్రలు, కుతంత్రాలతో నిండి ఉన్న అంతరాల సమాజంలో అదే అశాంతి. అదే కత్తి అంచు మీద ప్రయాణం.......
                రాజ్యాంగం ప్రవచించిన హక్కులను, ఎన్నికల రాజకీయాలను, భారత దేశంలోని కింది కులాలవాళ్లు చైతన్యవంతంగా ఉపయోగించుకుంటే దళితులు రాజ్యాధికారం చేపట్టగలరనే ఆలోచనలతో దివంగత కాన్షీరాం బహుజన సమాజ్‌పార్టీ (బీఎస్పీ)తో కలిసి గోపి ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీల నాయకునిగా పనిచేశారు.
                పాలకవర్గాలల్లోని అంతర్గత వైరుధ్యాల మూలంగా అప్పుడప్పుడు అలాంటి అద్భుతాలు దళిత కులాలకు  రాజ్యాధికారం రాజ్యాంగం మేరకైనా జరుగుతాయామోకానీ అవి తాత్కాలికమే. సర్వసంపదలు చేజిక్కించుకున్న  దోపిడీ అగ్రవర్గాలు అధికారం పేద ప్రజలకు అంత సుళువుగా ఇవ్వరని గోపికి తెలియంది కాదు. అయినా అధికార రాజకీయాలను అధ్యయనం చేశాడు. బిఎస్పీ ఉత్తర్‌ప్రదేశ్‌కే పరిమితమవడం మూలంగా ` అప్పుడప్పుడే సాంప్రదాయక కాంగ్రెస్‌ రాజకీయాల స్థానే రంగంలోకి వచ్చిన తెలంగాణా రాష్ట్ర సమితిలాంటి పార్టీలలో క్రియాశీలంగా పాల్గొన్నారు. అన్ని పార్టీలలో నాయకత్వ స్థానంలో ఉండి ఆయా పార్టీలలో కొనసాగే ఎత్తులు, పై ఎత్తులు, కుట్రలు కుతంత్రాలు, డబ్బు, ద్వంద్వ ప్రమాణాలతో ఇమడలేక ` సరిపడక ` జ్యోతిరావుఫూలే, అంబేడ్కర్‌ అధ్యయన వేదిక, హాస్పిటల్‌ నిర్వహణలో ` తను నమ్మిన విలువల కోసం ఎంచుకున్న మార్గంలో సాగిపోతున్నారు.
                తన తరం మనుషులందరిలాగే ` ఒకసారి ప్రజల పక్షం అనే ముళ్లదారిలోకి ప్రవేశించినవారు ` సామాజిక శాస్త్రాలైన మార్క్సిజాన్ని, అంబేడ్కర్‌ను, ఫూలేను తెలుసుకున్నవారు ` ఎక్కడున్నా మండుతూనే ఉంటారు. అసమ విషమ తలకిందుల ప్రపంచంతో నిరంతరం తలపడుతూనే ఉంటారు. తనకు తన చుట్టూ ఉన్న ప్రపంచంతో అంతర్‌ బహిర్‌ యుద్ధమే ఈ పుస్తకం.
                అయితే ఈ పుస్తకం మర్యాదస్తుల పుస్తకం ఎంత మాత్రం కాదు. తనకు ఊహ తెలిసినప్పటి నుండి ` నిరంతరం అవమానపరిచే ` గాయపరిచే ` హత్య చేసే ప్రపంచంలో ఒక దళితుడి తీవ్రమైన తిరుగుబాటు గొంతు. ఇది కల్పిత సాహిత్యం కాదు. కటిక వాస్తవం. సాంప్రదాయిక పద్ధతికన్నా భిన్నంగా ` మన సాహిత్య వాతావరణానికి అలవాటు లేని పద్ధతిలో ` ఇలాంటి పుస్తకం రాయడం ` ప్రచురించడం ఒక సాహసమే ` ఆక్టోపస్‌లాగా, మృత్యువులా విస్తరిస్తున్న ప్రపంచీకరణ నేపథ్యంలో ` ప్రపంచ ప్రజలందరు
తమ బలం, బలహీనతలను అంచనా వేసుకోవడానికి ` ముఖ్యంగా ప్రజా ఉద్యమాలు ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయాలి. ప్రజా పోరాటాల్లో సమస్త కులాలు, సమస్త శక్తులు భుజం భుజం కలిపి పోరాడడానికి ఈ పుస్తకం తోడ్పడుతుంది......
                ఈ పుస్తకంలో ఎక్కువగా ఫోకస్‌ చేసిన విషయం ` ‘కులం పాత్ర’. రాష్ట్రవ్యాప్తంగా కులాల పొందిక ` ఘర్షణలు, కులాల ఆర్థిక పరిస్థితులు, కుల రాజకీయాలు ఒకే తీరుగా లేవు. ఈ నలుబై సంవత్సరాల ప్రజా పోరాటాలు అన్ని రంగాలల్లో వేగవంతమైన మార్పులు తెచ్చిన విధంగానే కులాల విషయంలో అనేక మార్పులు తెచ్చాయి. గోపి జీవితమే ఇందుకుదాహరణ. రాజ్యాంగంలో అంబేడ్కర్‌ పొందుపర్చిన హక్కుల గురించిన బహుజన కుల సంఘాలన్నీ సంఘటితపడి పోరాడుతున్నాయి. అధికారంలో తమ వాటా గురించి డిమాండు చేస్తున్నాయి. అధికారంతోపాటు ఉత్పత్తి వనరులైన భూమి, పరిశ్రమల్లో కూడా తమ హక్కు కోసం ` అంతిమంగా పీడిత శ్రామిక కులాల రాజ్యాధికారం కోసం, విముక్తి కోసం తమ పోరాటాలకు పదును పెట్టవలసి ఉన్నది. ఇలాంటి ఆవశ్యకత గురించి గోపి చర్చించారు. కింది కులాలతో పై కులాలు చేరడం అతి తక్కువేగాని ` అమానుషమైన, హేయమైన అంటరానితనం చాలా వరకు తగ్గింది. కరీంనగర్‌, ఆదిలాబాదు జిల్లాల్లో రైతుకూలి సంఘాల ఆవిర్భావం ` అందులో కింది కులాలైన మాదిగ, మాలలు సమీకరించబడడం జరిగింది. గ్రామాల్లో భూస్వాముల అన్ని రకాల దోపిడీ, పెత్తనాలను ఎదిరించడంతోపాటు కుల వివక్షను ఎదిరించడం కూడా ఒక పోరాట రూపమైంది. అనేక గ్రామాలల్లో బతుకమ్మ, పెళ్లిళ్ళలాంటి సామూహిక సాంస్కృతిక కార్యక్రమాల్లో అన్ని కులాలవాళ్లు కలిసిపోయి బంతి భోజనాలు చేశారు. నిజానికి మన రాష్ట్రంలో గత నలుబై సంవత్సరాలుగా జరుగుతున్న ప్రజా పోరాటాలు ` అవి అంటరాని కులాలల్లో తెచ్చిన మార్పుల గురించి అధ్యయనం చేయాల్సిన విషయం.
                భారతదేశంలో సుదీర్ఘకాలం కొనసాగిన ఫ్యూడల్‌ ఉత్పత్తి విధానంతోపాటు సర్వసంపదలు ఉన్నత కులాలు చేజిక్కించుకోవడం ` సర్వసంపదల సృష్టికర్తలైన కింది కులాలు, శక్తివంతులై ఉండికూడా అల్ప సంఖ్యాకులైన పై కులాలతో చేసిన పోరాటాల చరిత్ర ` భూమి కోసం, భుక్తికోసం సుదీర్ఘంగా, సంక్లిష్టంగా ఇప్పటిదాకా కొనసాగుతున్న పోరాటాలను `  గోపి కలగన్న విధంగా ` ఇలాంటి పోరాటాలు వేగవంతమై విజయం సాధించడానికి ` కులం అడ్డంకిగా ఉన్నది. కింది కులాల చైతన్యవంతమైన తిరుగుబాట్లు ` నేర్చుకున్న గుణపాఠాలు, ఇవ్వాళ ప్రజా పోరాటాల్లో కింది కులాల పాత్ర గురించి సరైన విశ్లేషణ జరుగాల్సి ఉన్నది. అయితే ప్రజా ఉద్యమాలు పాత సాంప్రదాయిక బ్రాహ్మణ భావజాలంతో తలపడి, పోరాడి దాని నుండి బయటపడి, నిలదొక్కుకొని ముందుకు సాగుతున్నాయనేది కూడా ఒక వాస్తవం.
                గోపిలాంటి కొద్దిమంది ‘వర్గపోరాటాల చరిత్ర ` కులం నిర్వహించిన భూమిక, విధ్వంసక పాత్ర, గురించి పట్టుదలతో అధ్యయనం చేస్తున్నారు. అలాంటి కృషిలో భాగంగానే ఈ పుస్తకం వెలువడుతున్నది.
                మర్యాదస్థుల, పైకులాల రచనాపద్ధతి కాదిది. మట్టిలోంచి లేచిన రాయిలాంటిది. నామట్టుకు నేను ` మర్యాదపూర్వకమైన, తానొవ్వక, నొప్పించక, తప్పించుక తిరిగే రచనలు, సాహిత్యం విరివిగా చదివిన, వాస్తవికతను చర్చించడం,  స్వీకరించడం తక్కువైన సాహిత్య వాతావరణంలో గోపి అస్తుబిస్తు వాక్యాలకు, కటువైన వెంటాడే కంఠస్వరానికి బిత్తరపోయాను, కకావికలయ్యాను. యుద్ధరంగ స్థలం ` మారుమూల ప్రాంతాల్లోకి ` అదృశ్య, అంతుతెలియని అరణ్యాల్లోకి ` భూమి పొరల్లోకి విస్తరిస్తున్నది..... కన్నీళ్లంత స్వచ్ఛంగా, నిలువెల్లా వణికిపోయే ` ఉన్నకాడ ఉండనీయని, దుర్మార్గపు తరతరాల భూస్వామ్యపు మర్యాదస్థుల సాహిత్య విధ్వంసంలోంచి ` నేలల్లోంచి ఈ దుమ్ము ఎగిసి కమ్ముకోవాల్సిందే. నిజానికి కాల్పనిక కథలు, నవలలు, కవిత్వమంత సుందరమైంది కాదీ రచన.
                నాకు ఊహ తెలిసినప్పటి నుండి మాదిగ, మాలలతో కలసి బతుకుతున్నా ` వాళ్ల సౌందర్యవంతమైన ఆచరణ నుండి బతకడం నేర్చుకున్నా ` అలాంటి లేమిలో ` మారుమూల పల్లెటూర్లో బతికినా ` కుల వివక్షతను బతుకు పొడుగంతా అన్ని చోట్ల ఏదో రూపంలో ఎదుర్కుంటున్నా కూడా ` అంటరానితనం జ్వర తీవ్రత నాకు తాకలేదు. అయితే అన్నీ చేసి, సంపద, జ్ఞానం ప్రపంచానికిచ్చి అవమానాలు పొందితే ఎట్లా
ఉంటుందో అనుభవంలోకి రావడం ` దాని కోసం పెనుగులాడటం  ద్వారా ఇక్కడ నిలబడి ` ఈ పుస్తకాన్ని ఇందులోని జ్వరతీవ్రతను ముట్టుకోవడం ద్వారా ` ఈ నాలుగు మాటలు రాయ ప్రయత్నించాను.
                ఈ పుస్తకం నా అంచనా ప్రకారంగా రెండు రకాలుగా ప్రతి స్పందనలు చెలరేగడానికి కారణం కాగలదనిపిస్తున్నది. దొంగకు తేలుకుట్టినట్లు ఈ పుస్తకాన్ని పట్టించుకోకపోడం. రెండోది వాయిలెంటు రియాక్షన్‌. ఇంతదూరం నడిచి కూడా ` గోపి కత్తి అంచు మీదనే ఉన్నాడనిపిస్తుంది. ఇందులోని కొన్ని మాటలు మార్చవచ్చు. తొలగించవచ్చు ` తద్వారా గోపికి మంచి పేరు రావచ్చు ` మేధావిగా గుర్తింపు పొందవచ్చు ` శత్రువులు తగ్గిపోవచ్చు... అయితే ఇది దృక్పథానికి సంబంధించిన సమస్య. ఇది లొంగిపోవడానికి, పోరాడటానికి  సంబంధించిన సమస్య. లొంగిపోవడం ` పోరాడటం అనేవి మనిషి పుట్టుకతోనే దోపిడి సమాజాల్లో వెంటాడేవి. పోరాడటం గోపి నడక, ఆచరణ, నైజం....  అయినా పోరాటం మనిషి తనంతట తాను ఎంచుకునేది కాదు. అది అనివార్యంగా రుద్దబడేది. అత్యంత విషాదం ప్రపంచంలో ఇదే. ఈ కాలంలో ప్రపంచంలో ఏ మనిషి యుద్ధం బయట ఉండగలడు? అనూహ్య ప్రదేశమైన అబూజమహడ్‌ ` ఇప్పటికీ కులం, మతం, స్వంత ఆస్తి తెలియని ఆదివాసుల మీద ప్రజాస్వామిక గణతంత్ర ప్రభుత్వ సైన్యం ఆధునిక ఆయుధాలతో మానవరహిత యుద్ధ విమానాలతో దిగుతోంది. మూలవాసుల ఆస్తుల్ని, దేశాల సరిహద్దుల్ని చెరిపేసి కొల్లగొట్టబడే ` ప్రపంచీకరణ అనే సామ్రాజ్యవాద గొప్ప దోపిడి సన్నివేశంలో ` ప్రతిదీ ఒక పేలే తుపాకే ` అది కొండ
చిలువలా నోరు తెరుచుకున్న రోడ్డు కావచ్చు. కుప్పతెప్పలుగా విస్తరించే నెట్‌వర్కులు, మీడియా మాయాజాలం కావచ్చు. అది స్వైన్‌ ఫ్లూ కావచ్చు ` ఎయిడ్స్‌ కావచ్చు ` కార్చిచ్చులా గుప్పుమనే మరేదైనా కావచ్చును.......
                భారతదేశంలో ఆడ మగ, ముసలి ముతక, పిల్లా పీచు, అన్ని కులాలు దళారులుగా లొంగిపోవడానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ` వేలసంస్థలు ` నెట్‌వర్కులు ` టీవీలు ` ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అట్లా లొంగిపోకుండా, దళారులుగా రూపాంతరం చెందకుండా మిగిలిన వారిపై దాడి కోసం భారత దేశం మనం చెల్లించే పన్నులతో ప్రపంచంలోని ఆయుధాలన్నీ కొనుగోలు చేసి అమెరికావారి పర్యవేక్షణలో పెద్ద యుద్ధ రంగం సిద్ధం చేస్తోంది.
                అదిగో అలాంటి సన్నివేశంలో, సందర్భంలో పోరాడే ప్రజల పక్షాన నిలబడి ` లోపలి, బయటి వైరుధ్యాలను మనతో పంచుకుంటున్నాడు..... అలాంటి జ్వరతీవ్రతగల గోపిని ఆలింగనం చేసుకుంటూ......


అల్లం రాజయ్య
మంచిర్యాల , 10 – 04 - 2012  

భారత దేశపు తొలి దళిత కార్డియాలజిస్ట్ అనుభవాలు:

నా పొగరు మిమ్మల్ని గాయపరచిందా అయితే సంతొషం 

- డా. గోపీనాథ్ 

        వెల : రూ. 100

మొదటి ముద్రణ : సెప్టెంబర్‌ 2013

ప్రతులకు, వివరాలకు :  
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ ` 500 006.
ఫోన్‌ : 23521849

Sunday, July 21, 2013

‘కథల కన్నా జీవితాలు అద్బుతంగా ఉంటాయా?’ - గోగు శ్యామల


మా నాయన బాలయ్య

పుస్తక సమీక్ష : నమస్తే తెలంగాణ (బతుకమ్మ) సౌజన్యంతో 

దక్కన్ పీఠభూముల్లోని పస్క బయిల్ల నుండి, చీకటి సొరంగాల నుండి బొగ్గును బర్తి చేసుకున్న ఓ గూడ్సు బండి నెలలు నిండిన గర్భవతోలే భారంగా కదులుతున్నట్లు సాగుతుందీ రచన.

‘కథల కన్నా జీవితాలు అద్బుతంగా ఉంటాయా?’ అన్న ప్రశ్న ఎవరైనా అడిగితే.. ‘మా నాయన బాలయ్య’ పుస్తకాన్ని చదివిన వారెవరయినా ‘ఔను’ అనే సమాధానం చెప్పవచ్చు. దళితుల జీవితాల్లోని వైవిధ్యాలను వైరుధ్యాలను ఈ పుస్తక రచయిత డా॥ వై.బి సత్యనారాయణ నిశితంగా వివరిస్తాడు.
డా॥ వై.బి తన తండ్రి చరివూతను వివిధ కోణాల్లో వివరించిన రచననే ‘మా నాయన బాలయ్య’. ఇది సజీవ చరిత్ర కాబట్టే సుడిగుండాలను సుడి చుట్టి తన కడుపులో దాచుకున్న జీవనదిలా సజీవంగా సాగుతుందీ కథ. కనుకనే ఒకసారి ఎవరైన దీన్ని చదవడం మొదలు వెట్టింవూడంటే పూర్తిగా ఒడ్సెంత వరకు పుస్తకాన్ని కింద వెట్టరు .

తెలంగాణలోని వెలి వాడల్లోని దళితుల జీవితాల్లో తంతెలు, తంతెలుగా పేరుకుపోయిన అంటరానితనం, వెట్టి దోపిడి, ఈసడింపులు, చీత్కారాల నడుమ పెనుగులాడిన బత్కులు. కొన్నింటిలో ఓడిపోయినా.. తమ గమ్యం ‘ఎటువైపు?’ అనుకుంటూ భవిష్యత్తును నిర్మించుకుంటున్న చరిత్ర. దళితులు ఇటువంటి తరతరాల చరిత్ర నుండి వర్తమానంలోకి అడుగులేస్త్తున్న అరుదైన పుస్తకమిది.

విశాల దక్కన్ ప్రాంతాన్ని పాలించిన 5వ నిజాం, ‘మీర్ తహ్నియత్ ఆలీఖాన్ అఫ్జుల్ ఉద్‌దౌలా’ కాలంలోనే మాదిగ ఎలుకటి నర్సయ్య చెప్పులు కుట్టిస్తడు. ఈయన పనితనానికి ఎంతగానో మెచ్చిన ఆ రాజు 50 ఎకరాల భూమిని నర్సయ్యకు ఇనాం ఇస్తడు. దీంతో నర్సయ్య కుటుంబం దశ తిరగడం నుండి ‘మా నాయన బాలయ్య’ కథా రచన షురువైతది. ఇది నర్సయ్య జీవితంతో మొదలై రాజులకైనా సామాన్యులకైనా చెప్పులు కుట్ట్టే పనితనం నుండి ఎలుకటి వంశంలో మూడవ తరం నాటికి విశ్వవిద్యాలయంలో అన్ని కులాలకూ ఏ అడ్డూ లేకుండా విద్యను బోధించ గలిగే విధంగా, ప్రొఫెసర్లుగా ఎంతో కష్టపడి ఎదగడాన్ని కూడా ఈ పుస్తకం చూపిస్తుంది. ఈ స్థాయిని అందుకొన్న తన కొడుకులను చూసి మురిసిండు నర్సయ్య కొడుకైన బాలయ్య. ఈ బాలయ్య కొడుకే మన రచయిత డా॥ వై.బి. సత్యనారాయణ. ఆయన తన తండ్రి కాలం చేయడం వరకు ఈ పుస్తకాన్ని రాసిండు.

ఈ పై మూడు తరాల కాలంలోని దళిత సమాజంలో, దళితేతర సమాజాలలో వచ్చిన మార్పులు, ఇప్పుడు ఇంకా రావాల్సిన మార్పులనూ, ఈ మార్పుకు అవసరమైన చైతన్యాన్ని అడ్డుకుంటున్న బ్రాహ్మణీయ భావజాలాన్నీ ఎంతో ఆసక్తికరంగా, జ్ఞానాత్మకంగా పొందుపరచడంలో రచయిత సఫలమయిండని చెప్పాలి. కళారూపాలకు దళితులకు అవినాభావ సంబంధం ఉన్నట్లే సాహిత్యానికి దళితుల చరివూతకు బలమైన సంబంధం ఉన్నదని ఈ రచనలోని ఇతివృత్తం నిరూపించింది. తోలు నైపుణ్యాన్ని చెప్పు కుట్టడం వరకే పరిమితం చేసి చూడడం అనే భావదారిద్య్రం ఇప్పటివరకు నడుస్తనే ఉన్నది. అయితే మాదిగలకి, చెప్పులకూ, తోలుకూ, భూమికీ, రాజుకు అవినాభావ సంబంధాన్ని రచయిత తన సొంత కుటుంబ అనుభవాన్నుంచి బాగా చెప్పిండు. ఇదే నైపుణ్యపు అవినాభావ సంబంధం ఆధునిక రంగమైన రైల్వే నిర్మాణంతో సహితం పెనవేసుకోవడం ఇందులో చూస్తాం. ఇది రచనలో కొత్తకోణం. ఇది సామాజిక చరిత్ర కోణమే.

సుదీర్గమైన చరివూతను అక్షరీకరించిన ఈ పుస్తకం ప్రత్యేకంగా దళిత కుటుంబ జీవితపు చీకటి వెలుగులను పట్టి చూపిస్తుంది. ఇవి చూసినప్పుడు చిన్న చిన్న అవకాశాలే. ఇందులో పెద్ద పెద్ద ఆధారాలుగా మాదిగ బాలయ్య కుటుంబం మల్చుకోవడాన్ని వివరించిన తీరు అద్భుతం. తమ చుట్టూ ముసురుకున్న ఎడతెరపి లేని సుడిగాలులు, సెడుగంత వానలు నడుమ సాలెగూడు లాంటి మాదిగ కుటుంబం ఎట్ల తట్టుకుని నిలబడుతుందనే ప్రశ్నకు జవాబు కూడా ఈ పుస్తకంలో దొరకడం చూస్తాం. ఎంత భీకరమైన చావులనైనా, మారణహోమాలనైనా, పేదరికాన్నైనా భరిస్తూ వస్తూన్నారు. కాని అంటరాని తనాన్ని భరించడం దళితులకు అలవి కాని కష్టమైతున్నది. తరాలుగా అస్పృశ్యతను తట్టుకొని ఎదుగు బొదుగు లేని కుటుంబాన్ని బాలయ్య నర్సమ్మ దంపతులు అటొకరు ఇటొకరు ఎంత అప్రమత్తంగా నిలబెట్టారో కూడా ఇందులో కనిపిస్తుంది. అస్పృశ్య మంటల్లొనుండి, హైందవ విషవాయువుల్లో నుండి బాలయ్య కుటుంబం కొంతవరకు బయట పడిందనే చెప్పాలి. చదువు, ఆత్మగౌరవం, పట్టుదలలే బయట పడడానికి ఉన్న మార్గాలని వాటంగా చూపడం ఇప్పటి అవసరం.

-గోగు శ్యామల,
9866978450

మా నాయన బాలయ్య

- వై.బి.సత్యనారాయణ
ఆంగ్లమూలం :  My Father Balaiah, Harper Collins, New Delhi, 2011
తెలుగు అనువాదం: పి.సత్యవతి
184 పేజీలు, వెల: రూ. 100/-
ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ 500006
ఫోన్‌ నెం. 040 2352 1849
.

Courtesy : Namasthe Telangana (Bathukamma- Sunday Magazine) 21-07-2013

http://epaper.namasthetelangaana.com/Details.aspx?id=39623&boxid=96603304

www.namasthetelangaana.com

Friday, July 19, 2013

హైదరాబాద్ రాజ్యంపై సైనిక చర్య జరిగిన తరువాత మొదటిసారిగా ఒక ముస్లిం తనకు అన్యాయం జరిగిందని గొంతు చించుకొని చెప్పుకున్న గాథే ఈ పుస్తకం !



ముస్లిం కోణంలో '1948' 

- భంగ్యా భూక్యా

July 19, 2013 
Andhra Jyothy

హైదర్ చాలా చిత్తశుద్ధితో 1948 జనవరిలో హైందవ జాతీయవాదులు, రజాకార్ల పరస్పర దాడులను అరికట్టే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం చేసినందుకు సైనిక చర్య అనంతరం హైదర్‌ను ప్రభుత్వ సర్వీస్ నుంచి తొలగించి, అరెస్ట్ చేసి, ఆయన పనిచేసిన ఉస్మానాబాద్ జిల్లాలోనే మూడేళ్ల పాటు జైల్లో నిర్బంధించారు. ఆయనపై ఏడు కేసులు నమోదు చేశారు. హైదర్ పాకిస్థాన్‌కో, విదేశాలకో పారిపోకుండా ధైర్యంగా న్యాయపోరాటం చేసి తనపై మోపిన ఆరోపణల్ని నివృత్తి చేశారు. మొహమ్మద్ హైదర్ రచించిన 'అక్టోబర్ కూ' అనే పుస్తకాన్ని గత ఏడాది చివరలో ఢిల్లీ వెళ్లుతూ హైదరాబాద్ విమానాశ్రయంలో కొని ఆత్రుతగా రెండు రోజుల్లో తిరిగి హైదరాబాద్ వచ్చే లోపే చదివేశాను.

అప్పుడే ఈ పుస్తకాన్ని తెలుగు ప్రజలకు పరిచయం చేస్తే బాగుంటుందనిపించింది. గత ఏప్రిల్‌లో ఈ పుస్తకాన్ని గీతా రామస్వామి '1948: హైదరాబాద్ పతనం' గా తెలుగులో తీసుకురావడం చూసి చాలా సంతోషించాను. ఈ పుస్తకావిష్కరణ హైదరాబాద్ బుక్ ట్రస్ట్, అన్వేషి సంస్థల ఆధ్వర్యంలో 'ఆంధ్ర సారస్వత పరిషత్' హాలులో భారీ ఎత్తున జరిగింది. చరిత్ర అభిమానిగా , పరిశీలకుకుడిగా నేను కూడా ఆ సభకు వెళ్ళాను. పుస్తకావిష్కరణ సమయంలో ఇద్దరు ముస్లిం యువకులు చెరో ప్లకార్డు పట్టుకొని వేదిక ముందుకు వచ్చారు. ఒక ప్లకార్డులో 'గీతా రామస్వామి, ఉయ్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ యు', అనీ, మరో ప్లకార్డులో 'గీతా రామస్వామి, శాల్యూట్ యు' అనీ రాసి ఉంది.


అది చూసి హైరదాబాద్ చరిత్ర అంతా ఒక్కసారిగా కళ్ల ముందు తిరిగింది. ఆ అక్షరాల్లో ముస్లింల నిస్సహాయ దీనస్థితి కనిపించింది. 1948 సెప్టెంబర్ 17 సంఘటన తరువాత మొదటిసారిగా ఒక ముస్లిం తనకు అన్యాయం జరిగిందని గొంతు చించుకొని చెప్పుకున్న గాథే ఈ పుస్తకం. భారత సైన్యం దాడి అనంతరం జరిగిన మారణహోమం, తదనంతరం ఆంధ్ర పాలకులు సృష్టించిన మత ఘర్షణలు హైదరాబాద్ ముస్లింలను ఒక భయానక స్థితికి నెట్టేశాయి. గొంతు విప్పితే నిరంతర నిర్బంధాలు, చిత్రహింసలు. దాంతో ఏ ముస్లిం కూడా గొంతు విప్పి మాట్లాడే ధైర్యం చేయలేదు. హైదర్ పుస్తకం ఈ పరిస్థితిని ఛేదించిందనే చెప్పాలి.

ఈ పుస్తకం హైదర్ ఆత్మకథ అయినప్పటికీ హైదరాబాద్ రాజ్యం చివరి రోజుల గురించి అనేక ఆసక్తికరమైన విషయాల్ని తెలియజేసింది. ఆనాటి హైదరాబాద్ రాజ్యంలో హైదర్ ఒక ఉన్నత పదవిలో ఉన్న అధికారి. 1937లో చిన్న వయస్సులోనే, ఉన్నత స్థాయి సివిల్ సర్వీస్‌కు ఎంపికైన ప్రతిభావంతుడు. ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో ఉన్న ఉదారవాద అధికారుల్లో హైదర్ ఒకరు. ఈ తరహా అధికారులు ప్రజల బాధలను చూసి చలించిపోవటం, ప్రజల సమస్యలను అర్థం చేసుకొని తక్షణమే పరిష్కరించటం చేస్తుండేవారు. బ్రిటిష్ పాలకులు భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటించిన అనంతరం హైదరాబాద్ పరిస్థితి విచిత్రంగా మారింది. స్వతంత్రంగా ఉన్న హైదరాబాద్‌ను తనలో కలుపుకోవటానికి భారత్ ముమ్మర ప్రయత్నాలు చేయసాగింది.


ఇందులో భాగంగా హైదరాబాద్ సంస్థానంలో కాంగ్రెస్ ముసుగులో ఉన్న హైందవ జాతీయవాదులు, ఇండియా-మహారాష్ట్రలోని హైందవ జాతీయవాదులతో కలిసి హైదరాబాద్ మీద దాడులు చేయటం మొదలుపెట్టారు. ఆ దాడులు 1947 నవంబర్‌లో యథాతథ ఒడంబడిక (1947 నవంబర్) నాటి నుంచి సైనిక చర్య అనంతరం కూడా కొనసాగాయి. ఖాసిం రజ్వీ ఆధ్వర్యంలోని రజాకార్లు ప్రతి దాడులు చేయడం మొదలుపెట్టారు. దీంతో సరిహద్దు జిల్లాల్లో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఈ దాడులను చూసి చలించిపోయిన హైదర్ తనను దాడులకు గురవుతున్న జిల్లాకు కలెక్టర్‌గా నియమించమని అప్పటి రెవెన్యూ మంత్రి దగ్గరికి వెళ్ళి కోరాడు. 1948 జనవరిలో హైదర్ చాలా చిత్తశుద్ధితో హైందవ జాతీయవాదులు, రజాకార్ల పరస్పర దాడులను అరికట్టే ప్రయత్నం చేశారు.

ఈ ప్రయత్నం చేసినందుకు సైనిక చర్య అనంతరం హైదర్‌ను ప్రభుత్వ సర్వీస్ నుంచి తొలగించి, అరెస్ట్ చేసి ఆయన పనిచేసిన ఉస్మానాబాద్ జిల్లాలోనే మూడేళ్లపాటు జైల్లో నిర్బంధించారు. ఆయనపై ఏడు కేసులు నమోదు చేశారు. వీటిలో రెండు బందిపోటు కేసులు, ఐదు హత్యకేసులు. హైదర్ ఈ కేసులతో భయపడి పాకిస్థాన్‌కో, విదేశాలకో పారిపోకుండా ధైర్యంగా న్యాయపోరాటం చేసి తనపై మోపిన ఆరోపణల్ని నివృత్తి చేశారు. గోల్కొండ పక్కనే నివాసముంటూ 1973లో చనిపోయారు. హైదర్ ఈ పుస్తకంలో సెప్టెంబర్ 17 సంఘటనకు ఒక కొత్త కోణాన్ని మన ముందు ఉంచారు. ఇప్పటి వరకు ఈ సంఘటన కాంగ్రెస్ జాతీయవాదులకు, హిందూ జాతీయవాదులకు, కమ్యూనిస్టులకు ఒక విజయోత్సాహం. కాంగ్రెస్ వాదులకు ఈ సంఘటనతో ఇండియా ఏకీకరణ పూర్తయింది. హిందూ జాతీయవాదులకు ఈ సంఘటన ముస్లిం పాలకులపై హిందువులు సాధించిన విజయం. కమ్యూనిస్టులకు ఈ సంఘటన రాచరిక వ్యవస్థపై ప్రజలు సాధించిన విజయం.

కానీ, హైదర్ చెప్పినట్లు ఈ సంఘటన లక్షలాది మంది ముస్లింలకు ఒక విషాద ఘటన. కొన్ని లక్షల కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయి. లక్షలాదిమంది నిరంతర నిర్బంధానికి, ఊచకోతకు గురయ్యారు. హైదర్ జీవితమే దీనికి ఒక పెద్ద ఉదాహరణ. ఒక ఉన్నత స్థాయి సివిల్ సర్వెంట్ ఇంతటి నిర్బంధానికి గురైతే సామాన్య ముస్లింల పరిస్థితి ఏ విధంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. తోటి ముస్లింలు కూడా హైదర్‌కు సాక్షులుగా ముందుకు రాలేదు . చివరకు నిజాం కూడా హైదర్‌ను అపరాధిగానే ముద్ర వేశాడంటే ముస్లింలలో ఎంత అభద్రతా భావం ఉందో అర్థమవుతుంది.  

ఈ పుస్తకం చాల బలంగా మన ముందు ఉంచిన మరో విషయం ఏమంటే, ఇంతవరకు మన చరిత్ర పుస్తకాలు మనకు రజాకార్లు, భారత సైన్యం చేసిన దుర్మార్గాలనే చెప్పాయి కానీ హిందూ మతోన్మాదులు దాదాపు ఒక సంవత్సరం పొడవునా జరిపిన మారణకాండ , దోపిడీలను గురించి ఎక్కడా చెప్పలేదు. మరో విషయం ఏమంటే, హైదరాబాద్ పతనానికి భారత సైన్యంతోపాటు హిందూ జాతీయవాదులు కూడా సమాన పాత్ర నిర్వహించారన్న విషయం ఈ పుస్తకం ద్వారానే తెలిసింది. హైదరాబాద్‌ను స్వతంత్రదేశంగా నిలబెట్టాలన్న రజాకార్ల ప్రయత్నం, స్వయం ప్రతిపత్తితో కూడిన హైదరాబాద్‌ను ఇండియాలో చూడాలన్న నిజాం రాజు ప్రయత్నాన్ని ఈ పుస్తకం చాలా విపులంగా వివరించింది. 

 కాశిం రజ్వీ మతోన్మాది అయినప్పటికీ ఒక మంచి మాట అన్నాడు. అదేమంటే 'ఇండియా ఒక భౌగోళిక భావన, హైదరాబాద్ ఒక రాజకీయ వాస్తవం'. ఈ మాట నేటికీ అక్షరాలా సత్యం. ఇండియా అనేక జాతుల సమ్మేళనమే కానీ ఏ నాటికీ ఒక జాతి కాలేదు.


మొత్తంగా ఈ పుస్తకం ముస్లిం సోదరులకు అయిన గాయాల్ని కళ్ళకు కట్టిననట్టుగా వివరిస్తుంది. ఆ గాయం రాచపుండులా ముస్లింలనే కాదు, ప్రజలందర్నీ నేటికీ వేధిస్తూనే ఉంది. భారత్, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య, సెక్యులర్ దేశమని గొప్పలు చెప్పుకుంటున్న మన ప్రభుత్వం హైదరాబాద్‌లో సైన్య ం సృష్టించిన మారణ హోమం మీద సుందర్‌లాల్ కమిటీ రిపోర్టును బహిర్గతం చేయకపోవటం విచారకరం. జరిగిన ఈ ఘోరానికి భారత ప్రభుత్వం ముస్లిం సోదరులకు బహిరంగ క్షమాపణ చెప్పకుండా వారి హృదయాలను గెలుచుకోలేదు. ఈ దేశంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛగా తల ఎత్తుకుని బతికే హక్కును కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే ఉంది.


- భంగ్యా భూక్యా
ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ







 

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌