Sunday, June 21, 2020

కుటుంబచరిత్రతో మొదలుపెట్టి సామాజిక చరిత్రను చెప్పిన పుస్తకం కవి యాకూబ్ ఫేస్ బుక్ సమీక్ష


'మా నాయన బాలయ్య' పుస్తకం పేరు. రచయిత వై.బి. సత్యనారాయణ.
ఈ పుస్తకం ' My Father Balaiah', Harper Collins, New Delhi, 2011 పుస్తకానికి తెలుగు అనువాదం.
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ముద్రించింది. ప్రథమముద్రణ జూన్ 2013.
అనువాదం: పి. సత్యవతి గారు.

ఎస్. ఆర్. శంకరన్ గారు పుస్తకానికి ముందు అభినందనలో అన్నట్లు ''.. మూడు తరాల జీవితకాలంలో సమాజంలో వచ్చిన మార్పుల్నీ, ఇంకా రాకుండా ఉండిపోయిన మార్పులనుకూడా ఈ పుస్తకం మన కళ్ళముందు ఉంచుతుంది.
ఇది కేవలం ఒక కుటుంబచరిత్రే కాదు. వివిధ ప్రాంతాలలో, వివిధ నేపథ్యాలలో, విభిన్న పరిస్థితులలో కొన్నిదశాబ్దాలపాటు మాదిగ కులస్థుల అనుభవాలను కూడా వర్ణించిన సామాజిక చరిత్ర ఇది''.

"తెలంగాణ గ్రామీణ జీవితాల్లో పొరలు పొరలుగా ఎదురయ్యే పేదరికం, సామాజిక వెలి, అంటరానితనం, శ్రమదోపిడీ,
కష్టాల కడగండ్ల వంటి వాటన్నింటిపై ఓ దళిత కుటుంబం సాగించిన యుద్ధాన్ని కళ్ళకు కట్టే రచన ఇది.
వాళ్లీ క్రమంలో చేసిన ప్రయత్నాలనూ, అనుభవించిన వేదననూ నిజాయితీగా ఆవిష్కరించింది" అని శాంతాసిన్హా గారి మాట.

విద్యకోసం, ఆత్మగౌరవం కోసం, స్వేచ్ఛకోసం జరిపే పోరాటంలో విజయం ఎంత ప్రధానమో బలంగా నొక్కిచెప్పే రచన.
స్వాతంత్య్రానికి ముందూ, తరువాత ఈ దేశంలో ఒక దళితుని మనుగడ ఎట్లా వుందో చాలా శక్తివంతంగా పదునుగా చెప్పిన పుస్తకం.

ఈ పుస్తకం వై. బి. సత్యనారాయణ గారి తాతగారి జీవితంతో మొదలవుతుంది.
ఆయనకు తన పిల్లలు చదువుకోవాలనే ఆకాంక్ష, తన పిల్లలు చదువుకుని వృద్ధిలోకి రావాలనే పట్టుదల.
ఆ లక్ష్యాన్ని ఆ తరవాతి తరం చేరుకుంది. బాలయ్య లక్ష్యం తన పిల్లలు చదువుకుని వృద్ధిలోకి రావాలనే లక్ష్యాన్ని ఆయన పిల్లలు బాలరాజు, అబ్బసాయిలు తమ లక్ష్యంగా చేసుకున్న వైనం. బాలయ్య
స్థిరంగానూ, ఆయనకు కుడిఎడమలుగా బాలరాజు, అబ్బసాయిలు నిలబడకపోతే బాలయ్య లక్ష్యం ఈ స్థాయిలో సాకారం అయ్యేదికాదేమో. తండ్రి లక్ష్యాన్ని తమ లక్ష్యంగా చేసుకున్నవాళ్ళు ఇద్దరూ అపూర్వంగా
అనిపించారు. అబ్బసాయిలు అయితే తండ్రి లక్ష్యానికి బాసటగా నిలుస్తూనే తానొక లక్ష్యాన్ని పెట్టుకోవటం, పనిచేస్తూనే చదువుకోవటం, కాలేజీకి వెళ్ళటం కోసం నైట్ డ్యూటీలు చెయ్యటం, లక్ష్యాన్ని
సాధించటంకోసం అవిశ్రాంతంగా పనిచేయడం అద్భుతమే అనిపిస్తుంది.

ఆ ఇంటిలో అతను మొదటి ప్రొఫెసర్.
బాలరాజుది అయితే చాలా చిన్న ఉద్యోగం.
ఇంటి ఆర్థికపరిస్థితులతో చిన్నప్పటినుంచి చదవటం కుదరక తల్లితోపాటు పొలంపనులు కూడా చేసి సంపాదించిన జీవితం అతనిది.
తమ్ముళ్ళందరి చదువులు పూర్తయి, ముగ్గురు తమ్ముళ్ళు - నర్సింగ రావు, అంజయ్య, సత్యనారాయణ లెక్చరర్లుగా ఉద్యోగాల్లో కుదురుకునే దాకా వాళ్ళిద్దరూ ఆ లక్ష్యాన్ని అంటిపెట్టుకునే ఉన్నారు. తమ్ముళ్ళు ఫెయిల్ అయినపుడుకూడా వాళ్ళని నిరుత్సాహపరచకుండా ప్రోత్సహించి, మళ్ళీ పరీక్షలు రాయించి పైచదువులు చదివించారు. తరవాత అబ్బ సాయిలు తన లక్ష్యంవైపు ముందుకు సాగారు.

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ 'నా మాట ', రచయిత రాసిన ' భూమిక', అట్టవెనుక పొందుపరచిన అభిప్రాయాలు ఈ పుస్తకం విలువేమిటో చెబుతాయి.

ఇలా చాలారకాలుగా తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది.
తెలంగాణా గ్రామీణ జీవితాల్లో పొరలుపొరలుగా ఎదురయ్యే పేదరికం. సామాజిక వెలి, అంటరానితనం, శ్రమదోపిడి,
కష్టాల కడగండ్ల వంటి వాటన్నిటిపై ఓ దళిత కుటుంబం సాగించిన యుద్ధాన్ని కళ్ళకు కట్టే రచన ఇది.

ఈ పుస్తకం చదివితే అపుడే బ్రిటిష్ ప్రభుత్వంకాలంలో వచ్చిన రైల్వేలు, ఓడరేవులు అవి సామాన్యుల్లో తెచ్చిన మార్పులు తెలుస్తాయి.
రైల్వేఉద్యోగాలు అట్టడుగువాళ్లకు ఎలా అండగా నిలబడ్డాయో ఈ తెలుస్తుంది. కుటుంబచరిత్రతో మొదలుపెట్టి సామాజిక చరిత్రను చెప్పిన పుస్తకం.
( కవి యాకూబ్ ఫేస్ బుక్ సౌజన్యంతో )

మా నాయన బాలయ్య
- వై.బి.సత్యనారాయణ
ఆంగ్లమూలం :  My Father Balaiah, Harper Collins, New Delhi, 2011

తెలుగు అనువాదం: పి.సత్యవతి

184 పేజీలు, వెల: రూ. 200/-

ప్రతులకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ 500006
ఫోన్‌ నెం. 040 2352 1849

Wednesday, June 3, 2020

"ఈ పుస్తకంలో ప్రతీ పేజీ ఆసక్తికరంగా చదివిస్తుంది, ఆలోచనలను రేకేత్తిస్తుంది." -కె.యస్.


"ఈ పుస్తకంలో ప్రతీ పేజీ ఆసక్తికరంగా చదివిస్తుంది, 
ఆలోచనలను రేకేత్తిస్తుంది."
-కె.యస్.
(64 kalalu.com సౌజన్యంతో)

స్వాతంత్య్రోద్యమం యువతను ఉర్రూతూగిస్తున్న కాలానికి చెందిన మల్లు స్వరాజ్యం గొప్ప సాహస యోధురాలు.
ఒక లెజెండ్‌, ఒక హీరో.
ఆ కాంలో గుర్రం మీద ప్రయాణం చేసే ఆమెను చూసి జనం అభిమానంతో ఝాన్సీ రాణి అని పిలుచుకునేవారు.


స్వరాజ్యం ఒక సంపన్న భూస్వామ్య కుటుంబంలో జన్మించారు.
పరదాల చాటున పెరిగారు.
పరదాల చాటున్నే చదువు సంధ్యలు నేర్చుకున్నారు.

మొదట స్వాతంత్య్రోద్యమంలోనూ ఆ తరువాత తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలోనూ చాలా చురుకుగా పాల్గొన్నారు.
నిర్మొహమాటానికి, ధైర్యానికి పెట్టింది పేరు.
ఆమె అంటే సహచరుకే కాదు, నాయకులకు కూడా అభిమానమూ – భయమూ రెండూ వుండేవి.
చక్కని వాక్చాతుర్యంతో, హాస్య సంభాషణతో ఆకట్టుకుంటూ తన తరానికే కాదు, తర్వాతి తరానికి కూడా గొప్ప స్ఫూర్తిప్రదాతగా నిలిచారామె.

అరమరికలు లేకుండా అందరితో కసిపోయే మనస్తత్వం వల ఇతర నాయకుకంటే ఆమె ఎంతో భిన్నంగా కనిపించేవారు.
అటు స్వాతంత్య్రోద్యమంలో, ఇటు సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొంటూ ఆమె తన అనుభవాను వివరిస్తుంటే వినడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని, ఉత్తేజాన్ని కలిగిస్తుంది.
ఆమె మాటతీరు, వ్యవహార శైలి మూస పద్ధతికి భిన్నంగా, చాలా విక్షణంగా వుంటాయి.
ఇలాంటి వ్యక్తి శతాబ్దానికి ఏ ఒక్కరో వుంటారు. మల్లు స్వరాజ్యం రెండు శతాబ్దాలను ప్రభావితం చేసిన మహా యోధురాలు.

మల్లు స్వరాజ్యం గారి జీవితమంటే 20వ శతాబ్దపు తెలంగాణా సామాజిక రాజకీయ చరిత్ర.
అణచివేతను సహించలేని ప్రజ సామూహిక తిరుగుబాటు చరిత్ర.
పీడితుల పట్ల సహానుభూతితో పిడికిలి బిగించి పోరాడిన ఒక తరం చరిత్ర.
వ్యక్తి శక్తిగా మారే క్రమాన్ని చూపే చరిత్ర.
రాజకీయాలోకి మహిళలు రావటమంటే మల్లు స్వరాజ్యం గారిలా రావాలి.
అధికారం, పెత్తనం, అనేకానేక స్వీయ ప్రయోజనాను ఆశించి రాజకీయాలోకి వచ్చిన నాయకురాళ్లకు పూర్తిగా భిన్నం ఆమె రాజకీయ జీవితం.
మన జీవితాలకు సంబంధించిన నిర్ణయాధికారాన్ని మన చేతుల్లోకి తీసుకోవటమెలాగో నేర్పే గొప్ప పాఠం ఆమె తొలినాళ్ల జీవితం.

మల్లు స్వరాజ్యం తన పదకొండేళ్ల వయసులో ప్రజా జీవితంలో అడుగుపెట్టారు.
ఆనాడు తనలో ఏ నిప్పు రవ్వ రాజుకుందో ఇవాళ 86 ఏళ్ల వయసులో కూడా ఇంకా ఆ జ్వాల అలాగే ఎగిసిపడుతూ వుంది.
ఈ రోజు కూడా ఆమె ఎంతో స్పష్టతతో, ఆలోచనాత్మకంగా మాట్లాడుతూ, పోరాడుతూ ఎందరో మహిళకు స్ఫూర్తినిస్తున్నారు.
కార్యాచరణకు పూనుకునేలా ప్రేరణను అందిస్తున్నారు.

‘‘నా గొంతే నాకు నా తుపాకి, తూటా’’ అంటారామె.
జీవితంలో ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఏనాడూ వెనుకంజ వేయని ధీరత్వం ఆమెది.
ఆమె జీవితం ఒక మార్క్సిస్టు వీరోచిత పోరాట గాథ.
ఎందరికో స్పూర్తిదాయక మైన తన జీవన పోరాటాన్ని ‘నా గొంతే తూపాకి తూట ‘ పేరుతో అత్మకథ గా రాసారు.
ఈ పుస్తకంలో ప్రతీ పేజీ ఆశక్తికరంగా చదివిస్తుంది, ఆలోచనలను రేకేత్తిస్తుంది.

-కె.యస్.
https://64kalalu.com/mallu-swaraajyam-autobiography/

నా గొంతే తూపాకి తూటా 
: మల్లు స్వరాజ్యం ఆత్మకథ
136 పేజీలు, వెల: రూ.120/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ – 500006
ఫోన్‌: 040 23521849

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌