Monday, October 14, 2019

"తథా గతుని అడుగుజాడలు" పుస్తక రచయిత్రి, ప్రముఖ చరిత్రకారిణి రాణీ శర్మ తో సాక్షి ఇంటర్వ్యూ



"తథా గతుని అడుగుజాడలు" పుస్తక రచయిత్రి, ప్రముఖ చరిత్రకారిణి రాణీ శర్మ తో
సాక్షి ఇంటర్వ్యూ
ఈ దిగువ లింక్ పై క్లిక్ చేయండి :

"జాడల్ని చేరిపెసుకుంటున్నాం"  సాక్షి ఫ్యామిలీ పేజ్ 14-10-2019

-------------------------------------------------------------------------
..................................................................రాణి శర్మ ఈమని

‘బుద్ధుని బోధనలు ఆద్యంతరహితమైనవి; కానీ బుద్ధుడు వాటిని శాశ్వత సత్యాలుగా ప్రకటించుకోలేదు. మారుతున్న కాలంతో బాటుగా మారే సామర్థ్యం బౌద్ధ ధర్మానికి ఉంది. ఇది మనకు ఇంకే మతంలోనూ కనబడదు. బౌద్ధాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అది పూర్తిగా హేతుబద్ధతపై ఆధారపడి ఉన్నదని మనకు అర్థం అవుతుంది.’ అంటాడు డా. బి.ఆర్. అంబేద్కర్.

ఆధునిక భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్, బౌద్ధాన్ని స్వీకరించడం కూడా యాదృచ్చికంగా జరిగిన వ్యక్తిగత నిర్ణయంగా కాకుండా ఆనాటి సామాజిక స్థితిగతులకు పర్యవసానంగా గుర్తించాలి. ఆ పరిస్థితులు ఎంతవరకూ మారాయనేది కూడా ఒక కీలకమైన చర్చనీయాంశమే. 

ఏది ఏమైనప్పటికీ, బౌద్ధానికి ఆదరణ, ధర్మం పట్ల ఆసక్తి – మన దేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా – నానాటికీ పెరుగుతూనే వస్తున్నవి. ఇందుకు ప్రధాన కారణం – అంబేద్కర్ చెప్పినట్లు – బౌద్ధ ధర్మంలోని నిత్యనూతనత్వం, పరిస్థితులకు అనుగుణంగా మారగల లక్షణం, తద్వారా కొనసాగే కాలాతీత సమకాలీనత.

యావత్ ప్రపంచాన్నీ ప్రభావితం చేసిన భారతీయ ఆధ్యాత్మికతలో బౌద్ధం ఒక ప్రధానమైన పార్శ్వం. భారతదేశాన్ని పాలించిన రాజులు, ప్రాచీన రోమ్ సామ్రాజ్యానికి తొమ్మిది రాయబార బృందాలను పంపిన ఆధారాలున్నాయి. వాటిల్లో ఒకటి పోరస్ (ఇతడెవరై ఉంటాడనేది రూఢి చేసుకోవాల్సి ఉంది) 
అనే రాజు పంపినది. 

రోమన్ చక్రవర్తి అగస్టస్ సీజర్ (క్రీ.పూ.27-క్రీ.శ.14) ని కలుసుకోవడానికి వెళ్లిన ఈ బృందంలో ఒక శ్రమణుడు (బౌద్ధ భిక్షువు) కూడా ఉన్నాడట. ఆ భిక్షువు ఏథెన్స్ లో బౌద్ధంపట్ల తనకున్న నిబద్ధతను ప్రకటిస్తూ ఆత్మాహుతి చేసుకొని మరణించాడనీ, అతని సమాధిపై ‘భారతదేశం నుండి వచ్చిన శ్రమణుడు’ అని వ్రాసి ఉంటుందనీ గ్రీకు చరిత్రకారుడు ప్లూటార్క్ (క్రీ.శ. 46-120) తన 
రచనలలో పేర్కొన్నాడు. అశోకుడు సిరియా, ఈజిప్టు, గ్రీసు దేశాలకు పంపిన రాయబార బృందాలు క్రైస్తవ ఆలోచనలను ప్రభావితం చేసి ఉంటాయని విల్ డ్యురాంట్ 1930లో చేసిన తన రచనలలో ప్రతిపాదించాడు.

బౌద్ధం, బుద్ధుని జీవితగాథ, క్రీ.శ. ఐదు, ఆరు శతాబ్దాలనాటికి సిల్క్ రూటు వంటి వ్యాపార మార్గాల ద్వారా ఆఫ్ఘనిస్తాన్, బాట్రియా, సూగ్డియానా, పర్షియా దేశాలకు కూడా విస్తరించాయి. ఒక భారతదేశపు రాకుమారుడు, సుఖమయ జీవనాన్నీ, ఐశ్వర్యాన్నీ, రాజ్యాధికారాన్నీ త్రోసిపుచ్చి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకున్న వైనం – ఆ దేశాల ప్రజలని ఎంత ప్రభావితం చేసిందంటే, ఆ 
గాథని పర్షియా దేశభాష అయిన పెహలవీలో క్రీ.శ. ఐదు ఆరువందల సంవత్సరాలలోనే వ్రాసుకున్నారు. అదే గాథని ‘భారతదేశపు గొప్ప ముని కథ’గా బాగ్దాద్ ని ఏలిన అబ్బాసిదుల రాజ్యంలో, ‘బిలావర్-బుద్ధస’ అన్న పేరుతో, మార్పులు, కూర్పులు చేసి అరబ్బు భాషలో తిరిగి వ్రాసుకున్నారు. 

ఈ క్రమంలో బుద్ధ చరిత పలుదేశాల సంస్కృతులలోకి చొచ్చుకుపోయింది. బుద్ధ చరిత, బుద్ధుని ఉపదేశం ఏదో ఒక రూపంలో యూరేసియా లోని ప్రతీ ఒక్క దేశంలోనూ, అన్ని వాంగ్మయాలలోనూ చోటు చేసుకుంది. ఈ గాథ ప్రాచీనకాలంలోనే సుమారు నూరు భాషలలోకి తర్జుమా అయిందని 
చరిత్రకారులు చెబుతున్నారు.  

గ్రీకు భాషలో ‘బార్లాం-జోసఫట్’ అన్న పేరుతో ప్రచురించబడిన బుద్ధుని గాథ ఎంత ప్రజాదరణ పొందిందంటే, ఐదవ  పోప్ సిక్స్టస్ బార్లాం, జోసఫట్ అనే వ్యక్తులు సెయింట్ లని ప్రకటించాడు. ఇది మధ్యయుగంలో అత్యంత జనాదరణ పొందిన గాథలలో ఒకటిగా ప్రాచుర్యం పొందింది. దీన్ని నాటక 
రూపంలో కూడా ప్రదర్శించేవారు. ఈ గాథలన్నిటికీ మూలం, సంస్కృతం, లేదా ప్రాకృతం నుండి గ్రహించిన గౌతమ బుద్ధుని కథే అని సుమారు వందేళ్ల క్రితం మాత్రమే పరిశోధకులు నిర్ధారించారు.

(తథాగతుని అడుగుజాడలు పుస్తకం నుంచి )


తథాగతుని అడుగుజాడలు
రచన: రాణీ శర్మ ఈమని,
ఉణుదుర్తి సుధాకర్

196 పేజీలు, వెల: రూ.200/-
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com 

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌