Wednesday, October 8, 2014

ఇండియాలో దాగిన హిందూస్థాన్‌ - The Indian Ideology - పెరీ ఆండర్‌సన్‌

ఇండియాలో దాగిన  హిందూస్థాన్‌
The Indian Ideology - పెరీ ఆండర్‌సన్‌


పెరీ ఆండర్‌సన్‌ వ్యాసపరంపర 2012లో 'లండన్‌ రివ్యూ ఆఫ్‌ బుక్స్‌'లో వెలువడుతున్నప్పుడే అవి భారత వామపక్ష
మేధావులకు అసహనాన్నీ, ఆగ్రహాన్నీ కలిగించాయి. అదేసంవత్సరం 'ది ఇండియన్‌ ఐడియాలజీ' పేరిట అవి పుస్తక
రూపంలో ప్రచురించబడినప్పుడు వాళ్లు దానిపై స్పందించడానికి నిరాకరించారు. చాలా తక్కువ సమీక్షలు వెలువడ్డాయి.

ఆండర్‌సన్‌ తర్కంపై భారతీయ విద్యావేత్తలకు ఎంత తీవ్రమైన అసంతృప్తి వుందో ఇది స్పష్టం చేస్తోంది. భారత
మేధావులను అంతగా ఇబ్బందికి గురిచేసిన అంశాలు ఈ పుస్తకంలో ఏమున్నాయి? స్వయంగా ఆండర్‌సనే చెప్పినట్టు ''సమకాలీన భారత దేశ సాంప్రదాయిక ఆలోచనలను ఎదిరించే ఐదు రకాల ప్రధాన వాదనలను ఈ పుస్తకం ముందుకు తెచ్చింది.''

మొదటిది, ఆరువేల సంవత్సరాలనుంచీ భారతఉపఖండం ఒకే దేశంగా సమైక్యంగా వుందనడం ఒక
అభూత కల్పన అంటుంది.
రెండోది, గాంధీ భారత జాతీయోద్యమంలో మతాన్ని ప్రవేశపెట్టడంతో చివరికి అది ఒక విపత్తుగా మారిందని చెబుతుంది.
మూడోది, దేశ విభజనకు మూలకారణం బ్రిటిష్‌ ప్రభుత్వం కాదు, కాంగ్రెసే అసలు దోషి అని నిరూపిస్తుంది. నాలుగోది, భారత గణతంత్రాన్ని నెహ్రూ అభిమానులు అంగీకరించిన దానికంటే  ఎక్కువగా ఆయన వారసత్వం నష్టపరిచిందని వివరిస్తుంది.
చివరగా, భారత ప్రజాస్వామ్యం కుల అసమానతతో విభేదించదనీ, పైగా దానితో పెనవేసుకుపోయిందనీ వాదిస్తుంది.

ఈ పుస్తకంలో భారతీయ మేధావులకు కోపకారణమైన అంశాలు మరెన్నో వున్నాయి. కశ్మీర్‌ను భారత
సైన్యం ఆక్రమించుకుని చట్ట వ్యతిరేక హత్యలకూ, చిత్ర హింసలకూ, నిర్బంధాలకూ పాల్పడుతుంటే భారత మేధావులు ఏమాత్రం స్పందించకుండా మౌనవ్రతం పాటించడాన్ని ఆండర్‌సన్‌ ఇందులో నిలదీశారు.

భారత మేధావులు ఆరాధించే జాతీయ నేతలను కాదని సుభాస్‌ చంద్రబోస్‌నూ, బి.ఆర్‌.అంబేడ్కర్‌నూ ఆకాశానికి ఎత్తారు. ''ఉమ్మడి లౌకిక పోరాటంలో హిందువులనూ, ముస్లింలనూ, శిక్కులనూ ఏకతాటిపైకి తెచ్చిన ఏకైక కాంగ్రెస్‌ పార్టీ నేత సుభాస్‌ చంద్రబోస్‌ ఒక్కరే. ఆయన ధైర్యసాహసాలు, మేధోసంపత్తి ఆయనను కాంగ్రెస్‌ పార్టీలో అత్యంత లోకప్రియ నాయకుడిగా చేశాయి.''
 ''నిర్భీతి, క్రియాశీలత, అందర్నీ నియంత్రించే నేర్పు, అపార మేధో సంపత్తి వున్న సుభాస్‌ చంద్రబోస్‌
కాంగ్రెస్‌ పార్టీలో గొప్ప ప్రజాభిమానం వున్న నేతగా కొద్దికాలంలోనే ఎదిగి కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షుడయ్యారు. ఆ మరుసటి సంవత్సరం పార్టీ అధ్యక్ష పదవికి కాంగ్రెస్‌ పార్టీ చరిత్రలో ప్రప్రథమంగా జరిగిన పోటీ ఎన్నికలలో గాంధీ ప్రతిపాదించిన వ్యక్తిని ఓడించి సుభాస్‌ చంద్రబోస్‌ విజయం సాధించారు. అది గాంధీకి ఊహించని ఎదురుదెబ్బ. ప్రజాస్వామ్య బద్ధంగానైనా సరే తన అభిమతానికి వ్యతిరేకంగా జరిగే దేనినీ ఆయన తట్టుకోలేరు. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. పార్టీలో అంతర్గత కుట్ర ద్వారా సుభాస్‌ చంద్రబోస్‌ని అధ్యక్షపదవినుంచి తొలగించి కాంగ్రెస్‌ పార్టీని వదిలి వెళ్లిపోయేలా చేశారు గాంధీ.''

ఆండర్‌సన్‌ ''ఇండియాలో దాగి వున్నది హిందుస్థానే'' అని నిర్ద్వంద్వంగా అంటారు.
''ఎక్కడైతే హిందూమతానికి పరిమితులుంటాయో అక్కడ 'సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం' (ఎఎఫ్‌ఎస్‌పిఎ) రంగప్రవేశం చేస్తుంది.
భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూడు ప్రముఖ తిరుగుబాట్లు - కశ్మీర్‌, నాగాలాండ్‌ మిజోరామ్‌, పంజాబ్‌లలో - అంటే ముస్లిం, క్రైస్తవ, శిక్కు జనాభా ఎక్కువ వున్న ప్రాంతాల్లోనే చోటుచేసుకున్నాయి. ఆ హిందూయేతర
ప్రాంతాలలోని ప్రజల భావోద్వేగాలను టాంకులు, తుపాకులు, లాఠీలు, మారణకాండ, హంతక ముఠాలు ఎదుర్కొన్నాయి.

ఇవాళ (2013) ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఉద్ఘాటించినట్టు సరిగ్గా అదేపద్ధతులలో 'భారత ప్రజాస్వామ్యానికి
భయంకరమైన ముప్పు' ముంచుకొస్తోంది. అది జార్ఖండ్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ వరకూ విస్తరించిన నక్సలైట్‌ కారిడార్‌.
ఆర్యులకంటే ముందునుంచీ వుంటున్న ఆదివాసీ ప్రజానీకాన్నీ, వారి అటవీ సంస్కృతినీ వారి మాతృభూమి నుంచి
నిర్దాక్షిణ్యంగా తరిమికొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనన్య వాజ్‌పాయి సూత్రాన్ని తిరగరాయడం సబబుగా
వుంటుంది. ప్రచ్ఛన్న దేశం లేదా సమాజం (షాడో నేషన్‌) అంటే ప్రజాస్వామ్యాన్ని తిరస్కరించిన ప్రాంతం అని కాదు
ప్రజాసామ్యాన్ని ఆచరిస్తున్న ప్రాంతమనే చెప్పుకోవాలి.
ఇండియాలో హిందుస్థాన్‌ అనే అర్థం దాగివుంది. రాజ్యం రూపురేఖలనీ, స్వేచ్ఛకూ అణచివేతకూ మధ్యనున్న సరిహద్దులనీ, దేన్ని అనుమతించాలి దేన్ని నిషేధించాలి వంటి అంశాలనన్నింటినీ  చాపకింద నీరులాగా అదే నిర్దేశిస్తోంది.''

భారతదేశం గురించి ఈ దశాబ్దిలో వెలువడిన అత్యంత ముఖ్యమైన పుస్తకాలలో ఇది ఒకటి అని మేము
భావిస్తున్నాం. ఇందులో లేవనెత్తిన అంశాలపై మౌనం వహించడం అనేది సరైన స్పందన అనిపించుకోదు. ఇవే అంశాలపై భారత అల్పసంఖ్యాక వర్గాలు - దళితులు, ముస్లింలు, తదితరులు ఎంతోకాలంగా ప్రశ్నలు సంధిస్తున్నారు, సమరం సాగిస్తున్నారు. వాటిని విస్తృతంగా, బహిరంగంగా చర్చించాల్సిన అవసరం ఎంతైనా వుంది.

- Hyderabad Book Trust


ఇండియాలో దాగిన హిందుస్థాన్

ఆంగ్ల మూలం :  The Indian Ideology, Perry Anderson, Three Essays Collective, Gurgaon (Haryana), October 2012, ©  Perry Anderson     
        
తెలుగు అనువాదం  :  ప్రభాకర్ మందార

175 పేజీలు ; ధర : రూ.150/-

ప్రతులకు, వివరాలకు: 
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,  ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్‌,  గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006 

ఫోన్‌ : 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌